స్నేహలత హత్య నుండి మనం ఏం నేర్చుకుందాం? -మానవ హక్కుల వేదిక

ప్రజలారా!

23-12-2020న ధర్మవరం దగ్గర స్నేహలత ప్రేమోన్మాది చేతిలో పాశవికంగా హత్య చేయబడింది. వెంటనే టీవీలలోనూ, వార్తా పత్రికలలోనూ ఈ వార్తను ప్రముఖంగా చూపారు. సామాజిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు పరామర్శ పేరుతో బారులు కట్టి వారి వారి పార్టీల అజెండా ప్రకారం ప్రకటనలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సంఘాలు, రాజకీయ సంస్థలు, వ్యక్తులు ఈ రకంగా స్పందించడమన్నది ఆరోగ్యకర పరిణామం. దీన్ని మనమందరం ఆహ్వానించాల్సిందే. ఈ సంఘటన పట్ల ప్రభుత్వం కూడా స్పందించి చాలా తక్కువ సమయంలోనే బాధిత కుటుంబానికి పరిహారం అందించింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే ఇటువంటి సంఘటనల్లో ప్రభుత్వాలు పరిహారాలు ప్రకటించినంత సులభంగా ప్రభుత్వం నుంచి బాధితులు పొందగలగడం సులభమైన విషయం కాదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారంతా రెండు డిమాండ్లు చేశారు. ఒకటి బాధిత కుటుంబానికి న్యాయం చేయడం, రెండవది హంతకులకు తీవ్రమైన శిక్ష వేయాలని. ఈ రెండు డిమాండ్లలో ప్రభుత్వం మొదటి డిమాండును అమలు పరిచింది. రెండవ డిమాండుకు సంబంధించి ముద్దాయిని రిమాండును అమలు పర్చింది. శిక్ష సంగతి కోర్టులు నిర్ణయిస్తాయి. ఈ చర్య రెండవ డిమాండ్‌కు పూర్తి జవాబు కాదు. వ్యక్తులే కాకుండా సామాజిక బాధ్యత కలిగినవారు, రాజకీయ నాయకులు కూడా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనగా, మరికొంతమంది, నిందితులకు అంగచ్ఛేదనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రియాంకరెడ్డి విషయంలో అమలు పర్చింది. దానివల్ల నిందితులు గుణపాఠం నేర్చుకోలేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కళ్యాణదుర్గంలో వహీదా హత్య కూడా ఈ కోవకు చెందినదే. వీరు కోరుతున్న ఎన్‌కౌంటర్లు కూడా ఇటువంటి దుర్మార్గాలను ఆపలేనప్పుడు సమాజం బాధ్యత ఏమిటి?

ఏమిటీ ఎన్‌కౌంటర్‌?

మన దేశంలో విశాలమైన రాజ్యాలు ఏర్పడినప్పటి నుండి నేరాల విచారణ, శిక్షలు అమలులో ఉన్నాయి. బ్రిటీషు వారి హయాంలో రూపుదిద్దుకున్న శిక్షాస్మృతులు ఈనాటికీ అమల్లో ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము. రాజ్యాంగం ప్రకారం ప్రతి విభాగానికి బాధ్యతలు, పరిమితులతో పాటు ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా చట్టాలను రూపొందించారు. నేర నియంత్రణ, ప్రజా రక్షణలో భాగంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తే, కోర్టులు నేర స్వభావాన్ని బట్టి శిక్ష విధిస్తాయి. అంటే నేర విచారణను కోర్టులు చేయవు, పోలీసులు చేస్తారు. పోలీసులు కోర్టు శిక్షలను అమలు చేస్తారు. కానీ శిక్షలు విధించరు. కానీ పోలీసులు రాజ్యాంగ పరిధులను అతిక్రమించి కోర్టు విధించాల్సిన శిక్షలను తామే అమలు పరుస్తున్నారు. ఈ అతిక్రమణకు పెట్టిన ముద్దుపేరే ఎన్‌కౌంటర్‌. ఇక ఈ ఎన్‌కౌంటర్లకు ఏ వర్గానికి చెందిన వారు బలవుతున్నారనేది వేరొక విషయం. ప్రియాంక రెడ్డి హంతకులకు ఎన్‌కౌంటర్లు లాంటివి, ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ నిందితులకు అమలు పర్చడం సాధ్యం కాలేదు. ఇక్కడ నిందితుల సామాజిక నేపథ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నది అక్షర సత్యం. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం సామాన్య ప్రజానీకానికే ఎక్కువ ఉంటుందన్న వాస్తవాన్ని మనం మరువరాదు. ఎన్‌కౌంటర్ల డిమాండ్‌ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలను మనం ప్రోత్సహించినవారమౌతాం.

మరయితే దీనికి పరిష్కారమేమిటి?

ఈ ప్రశ్న వెంటనే వస్తుంది. ”కంటికి కన్ను, పంటికి పన్ను” అన్న నానుడి చాలా సులభంగా ప్రస్తావిస్తారు. రాజ్యాంగంలో దీనికి చోటు లేకపోయినా, అనేక కారణాలతో, అనేక సందర్భాలలో సామాజికంగా పెత్తనం చెలాయించేవారు బలహీన వర్గాలపై అనధికారికంగా అమలు పరుస్తూనే ఉన్నారు. బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నత వర్గాలకు చెందిన వారిని ప్రేమించడమో, పెళ్ళి చేసుకోవడమో జరిగినప్పుడు మధ్య యుగాలకు చెందిన ఈ శిక్షాస్మృతిని పరువు హత్యల పేరిట అమలు పరుస్తూనే ఉన్నారు. ఎన్‌కౌంటర్ల తరువాత కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు తగ్గడం లేదు. అలాగే పరువు హత్యల పేరున కిరాతకంగా చంపిన తర్వాత కూడా ప్రేమలు, పెళ్ళిళ్ళు ఆగడం లేదు. కౌమార దశలో ఉన్న బాలబాలికలకు ఆకర్షణ అనేది ప్రకృతి సిద్దమైనది. ఈ పరస్పర ఆకర్షణలను ఆరోగ్యకరమైన పద్ధతిలో ఉంచుకోవడమన్నది వారి చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులోని మంచి చెడులు, అవగాహన, చైతన్యం కలిగించడానికి తల్లిదండ్రులు, సమాజం బాధ్యత తీసుకోవాలి. కేవలం చట్టాల ద్వారానే వీటిని నియంత్రించడం సాధ్యం కాదు. నేరాలన్నింటికంటే లైంగిక నేరాలు భిన్నమయినవి. మిగతా నేరాలన్నీ కూడా ఆలోచనల ద్వారా వస్తే, లైంగిక నేరాలు సహజత్వాల ద్వారా పుట్టుకొచ్చినవి. అందుకే మిగతా ఏ నేరాన్నయినా కఠిన శిక్షల ద్వారా నియంత్రించవచ్చు. కానీ లైంగిక నేరాలు సామాజిక చైతన్యాన్ని బట్టి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి.

యవతకు మొదటి పాఠశాల కుటుంబం:

మొదటి పాఠశాల కుటుంబం మాత్రమే కాదు, మొదటగా నేరమయ ఆలోచనలు పుట్టుకొచ్చేది కూడా కుటుంబం నుంచే. ఆర్థిక నేపథ్యాలు, సామాజిక నేపథ్యాలతో సంబంధం లేకుండా కుటుంబ పెద్దల ప్రవర్తనలు, అలవాట్లు, వాతావరణం పిల్లల మీద, మొదటగా వారి ప్రవర్తనా అలవాట్ల మీద ప్రభావాన్ని చూపుతాయి. తండ్రి తాగుబోతుగా మారి సంసారాన్ని హింసాపూరితరగా మారిస్తే, లేదా మహిళల పట్ల అనుసరించే తీరు పిల్లల మీద ప్రబావం చూపుతాయి. తల్లిదండ్రులు తమ జీవితాలను హింసామయంగానో, అవాంఛనీయంగానో మార్చుకుంటే పిల్లలమీద దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. పిల్లలకు పుడుతూనే వచ్చే సహజాతాలలో పరిశీలనా శక్తి ఒకటి. వారు మొదటగా గుర్తించేది తల్లిని, తర్వాత తండ్రిని. ఇది ప్రకృతిపరంగా పిల్లల బాగుతోపాటు, తద్వారా సమాజ బాగును కూడా కోరుకునేవారు తమ కుటుంబంలో మానసిక స్వేచ్ఛా వాతావరణం కల్పించాలి. కేవలం ఆడపిల్లల జీవితాలను, అలవాట్లను నియంత్రించడంలో లాభం లేదు. మగపిల్లలను కూడా ఆలోచనాపరంగా, విలువల పరంగా నియంత్రించినప్పుడు నేర ప్రవృత్తి తగ్గుతుంది.

రెండవ పాఠశాల సమాజం:

సామాజిక వ్యవస్థలను బట్టి ఆయా సమాజాలలో సంస్కృతి, నాగరికతలు ఏర్పడి ఉంటాయి. సామాజిక శాస్త్రవేత్తల నిర్థారణ ప్రకారం మనం పితృస్వామిక వ్యవస్థలో ఉన్నాం. సంపదలు, స్థిర, చరాస్థులతో పాటు సంస్కృతి, నాగరికతలు పురుషాధిక్యత మీద ఆధారపడి ఉంటాయి. సమాజంలో సగభాగమైన మహిళలు కూడా పురుషాధిక్యతలో బతకాలని నిర్దేశిస్తుంది. మానవ సంబంధాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీ, లైంగిక దోపిడీ దీనిలో అంతర్భాగంగా ఉంటాయి. సినిమాలు, సామాజిక మాథ్యమాలు, అంతర్జాల వనరులన్నీ కూడా ఆర్థిక దోపిడీ, లైంగిక దోపిడీ తప్పుకాదన్నట్లుగా ప్రేరేపిస్తాయి. సామాజిక మాథ్యమాల్లో నీవు అందంగా ఉన్నావు అనే మాట పరివర్తనం చెంది నీవు సెక్సీగా ఉన్నావు అన్న మాటగా రూపాంతరం చెందింది. అభివృద్ధి పేరిట వచ్చే ఈ మార్పులను నియంత్రించలేము కానీ వాటి ఉపయోగాల్ని, చెడుల్ని, మంచిని పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడాలి. విచ్చలవిడిగా లభిస్తున్న మాదకద్రవ్యాలు నాగరికతలో భాగంగా మారిపోవడం కూడా మనం చూస్తున్నాం.

సమాజపరంగా మనమేమి చేయగలం?

అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో పాటు, వాటి నివారణకు కూడా మనమందరం బాధ్యతలు పంచుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో తరచుగా సదస్సులు, గ్రూప్‌ సమావేశాలు నిర్వహిస్తూ సంస్కారం, నాగరికతలంటే ఏమిటో తెలియచేయాలి. దేశభక్తి అంటే మతాలనో, కులాలనో, వర్గాలనో జై కొట్టడం కాక, సామాజిక బాధ్యతతో ఉత్తమ పౌరులుగా తయారు కావాలని ఉద్భోదించాలి. జిల్లాలోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు మగపిల్లలతో పాటు ఆడపిల్లలను కూడా చదివిస్తున్నారు. ఆడపిల్లకు వేధింపులు కూడా ఉన్నాయి. మన పట్టణంలో అనేక కుల సంఘాలున్నాయి, మత సంఘాలున్నాయి, అలాగే సామాజిక సంఘాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క బాలికల వసతి గృహాన్ని లేదా పాఠశాల, కళాశాలల యొక్క బాధ్యత తీసుకొని ఆడపిల్లలకు బాసటగా నిలిస్తే, కొంతమేరకు మనం ఈ నేరాలను నియంత్రించవచ్చు. చట్టాలు తమ పని తాము చేసుకుపోతాయని అంటుంటారు. కానీ చట్టాలు తమకు తామే పనిచేయలేవు. వాటిని అమలు పరిచే యంత్రాంగంలో నిజాయితీ, విశ్వసనీయత ఉన్నప్పుడే చట్టాల వల్ల ఉపయోగం ఉంటుంది.

లైంగిక నేరరహిత సమాజంగా మార్చుకునే దిశగా ఆలోచిద్దాం. కార్యాచరణ కోసం ముందుకు వద్దాం

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.