”యత్ర నార్యస్తు పూజ్యంతే
రమతే తత్ర దేవతా,
యత్రైతాస్తు న పూజ్యంతే
సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మనుస్మృతి చెప్పింది అంటారు.
అంటే ”ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో, అక్కడ దేవతలు పూజలందు కొంటారు. ఎక్కడ స్త్రీలకు గౌరవం లేదో అక్కడ ఎంత గొప్ప సత్కా ర్యాలు చేసినా ఫలితం లేదు” అని అర్థం అట.
మరి…
”కన్యాశుల్కాలూ,
వరకట్నాలూ,
బాల్యవివాహాలూ,
సతీసహగమనాలూ
జౌహార్‌లూ
దేవదాసీతనాలూ
ఆడ శిశు హత్యలూ”
ఇవే కదా తరతరాలుగా మనం చూసి వచ్చిన గౌరవ మర్యాదలు. ఇలాంటి శ్లోకాలలోనే కదా మన ఆనందాన్ని వెతుక్కుని మురిసిపోయింది. ఇంకా ఇలాంటి వాటిని చూసి మురిసిపోవాల్సిందేనా? అలా ఎందుకు మురిసిపోవాలి? మనకు ఏమి కావాలో చెప్పాల్సింది మనమే కదా… వేరెవరో మన తరపున మాట్లాడాలా? ఎవరి వకాల్తానో మనకెందుకు. మనమేం కావాలో మనం చెప్పలేమా. మనకి కావాల్సిన గౌరవం ఏమిటో మనకి కదా అర్థమయ్యేది. మనకేది గౌరవమో ఎవరో చెప్పేది ఏమిటి? అవన్నీ మనకై మనం చెప్పాలి అంటే మనతో పాటు ఉండాల్సింది ధైర్యం ఒక్కటే కాదు… విద్య కూడా… విద్యతోనే మన వాదనా పటిమ పెరుగుతుంది.
యుగాలుగా మన మహిళలు వెనకబడింది శారీరక దుర్భలత్వంతో కాదు. ధైర్యం లేక కాదు. విద్య లేకపోవడం వల్ల. సమాజం మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థకి మారిన పరిణామక్రమంలో మహిళల పాత్రను ఇంటికి మాత్రమే పరిమితం చేయాలనుకున్న ఆలోచన తో రకరకాల శాస్త్రాల పేరుతో, ధర్మాల పేరుతో, స్మృతుల పేరుతో మహిళల మీద కనిపించడ కుండా వేసిన బంధాలలో ఆడవారికి విద్యవైపు మళ్ళకుండా చూడటమూ ఒకటి.
దాని ఫలితం…
ఇదిగో ఇప్పటి ఈ సమాజం…
అప్పుడేసిన బంధాలని ఎలా తెంచుకోవాలా అని ఇప్పటికీ గింజుకులాడిపోతున్న మనం.
ఇప్పుడు మన దేశంలో మహిళల అక్షరాస్యతా రేటు (70.3) క్రమంగా పెరుగు తున్న సంగతి నిజమే కానీ, ఇప్పటికీ పురుషుల అక్షరాస్యత రేటు (84.7%) కంటే మాత్రం చాలా తక్కువగానే ఉంది. దేశ అక్షరాస్యతలో చివరి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే (66.4%). తెలం గాణ కాస్త మెరుగు (72.8%). ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల అక్షరాస్యత 73.4% అయితే మహిళల్లో అది కేవలం 59.5% మాత్రమే. అంటే ఇప్పటికీ 40%కు పైగా మహిళలకు విద్య దూరంగానే ఉంది. ఇదంతా మనకి ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ ఇదే నిజం.
కారణం ఏమిటంటే అబ్బాయిలతో పోలిస్తే చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే ప్రాథమిక విద్య కోసం బడులలో చేరుతున్నారు. వారిలో చాలామంది ప్రాథమిక విద్య కూడా పూర్తిచేయకుండానే చదువు మానేస్తున్నారు. మన దేశంలో కేరళ, మిజోరాం లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే మహిళా అక్షరాస్యతా పరంగా ఒక స్థాయికి చేరుకు న్నాయి. పట్టణాలలో, నగరాలలో కాస్త పర్లేదు కానీ నేటికీ గ్రామీణ ప్రాంతాల బాలికల్లో అక్షరాస్యతా శాతం తక్కువగానే ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం తల్లిదండ్రులూ నిరక్షరాస్యులు అవడమే.
గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సంబంధ మైన పనుల్లో మహిళల భాగస్వామ్యమే ఎక్కువ. ఇల్లు గడవడం కోసం ఒక వయసుకు వచ్చిన ఆడపిల్లలను తమతో పాటు కూలీకి తీసుకుని వెళ్ళడమో లేదా ఇంటిపనులు అప్పచెప్పి ఇంట్లో కూర్చోబెట్టడమో జరుగు తుంది. దాంతో ఆడపిల్లలకు చదువు అంటే ఇష్టమున్నా తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది దూరమవుతూ ఉంటుంది.
ఈ పరిస్థితులు పూర్తిగా మారి స్త్రీలు విద్యావంతులవ్వాలి. పాఠశాల విద్యలూ, ఇంటర్‌తో ఆపేసే విద్యలూ కాదు, ఉన్నత విద్యల్లోకి వెళ్ళాలి. ఎవరిమీదో నమ్మకంతోనే తమ జీవితాలకు భరోసా వెదుక్కోవాల్సిన అవసరం లేకుండా తమ చదువే తమకి బతుకుమీద భరోసానిస్తుందన్న నమ్మకం పెట్టుకుంటే చాలు.
మహిళల్లో విద్యని పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఒప్పుకోవచ్చు గానీ, రకరకాల కారణాల దృష్ట్యా చదువుకి దూరంగా ఉన్న ఆడపిల్లలు మళ్ళీ విద్యవైపు ఆసక్తి చూపడానికి సరిపడా వనరులను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.
మహిళలకు రిజర్వ్ చేయబడిన పాలక సంఘాలలో అనేకచోట్ల వారి భర్తల పెత్తనమే కొనసాగటమన్నది, మహిళలు తమని తాము తక్కువగా అంచనా వేసుకోవడమే కారణం. అలా తమకు తాము తక్కువగా అనిపించడంలో ప్రధాన పాత్ర పోషించేది అవిద్య లేదా పాఠశాల స్థాయిల్లోనే చదువుని వదిలేయడం.
ఇంటి పని, పిల్లల పెంపకం మగవాళ్ళకి రావని, ఆ పనులు ఆడవాళ్ళు మాత్రమే మెరుగ్గా చేయగలరనే సాకుతో ఆడవాళ్ళని ఇంటికి మాత్రమే పరిమితం చేస్తూ వచ్చిన వాళ్ళకి, ఒక స్త్రీ విద్యావంతురాలైతే తన కుటుంబం మొత్తాన్నీ విద్యావంతులుగా తయారు చేయగలడు అన్న సంగతి మాత్రం గ్రహింపుకు రాదు.
విద్యావంతులైన మహిళలు పెరిగేకొద్దీ ఎప్పటినుండో పేరుకుపోయిన అవకాశాలు పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలకు తన ఆరోగ్యం మీద, పుట్టబోయే శిశువు యొక్క ఆరోగ్యం మీద అవగాహన పెరగడం వళ్ళ ఆరోగ్యవంతమైన శిశువులు పుట్టడమూ, తద్వారా శిశు మరణాల రేటు తగ్గిపోవడానికి అవకాశం పెరుగుతుంది. వాక్సినేషన్ లాంటి ప్రక్రియల అవసరాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం వల్ల సమాజానికి ఆరోగ్యవంతమైన భావితరాన్ని కానుకగా ఇచ్చే అవకాశం ఉంటుంది.
తమ ఆర్థిక అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుందన్న బాధ మనసుని తొలుస్తున్నప్పుడు, తనకొక ఆసరా అవసరమై, మరొకళ్ళకి తాను భారంగా ఉండాల్సి వస్తుందే అని చింత పడుతున్నప్పుడు, తనదైన ఆలోచన ను తాను స్వేచ్ఛగా ఆలోచించుకునే అవకాశం ఉంటే బాగుండునని అనిపించినప్పుడు ఇదిగో మీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే ఒకే ఒక్క నేస్తం ”విద్య”.
కేవలం ప్రాథమిక విద్య కాదు…
ఉన్నత విద్య…