శివరాజు సుబ్బలక్ష్మిగారికి నివాళి
2018లో నేను మొదటిసారి శివరాజు సుబ్బలక్ష్మిగారిని చూసాను. అమృతలత ప్రతి సంవత్సరం అందించే అపురూప అవార్డ్స్ ఫంక్షన్‌కి సుబ్బలక్ష్మిగారి ఆత్మీయ అతిధిగా వచ్చారు. ఆ రోజు అవార్డ్స్ ఫంక్షన్ పూర్తవ్వగానే స్టేజి మీదకి వెళ్ళి తనని కలిసాను. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఎక్కువ సేపు మాట్లాడటానికి కుదరలేదు. నాకేమో సుబ్బలక్ష్మిగారితో మాట్లాడాలని ఉంది. కొంచెం సేపు ఆవిడతో గడపాలని ఉంది. మర్నాడు ఆవిడ బసచేసిన హోటల్‌కి వెళ్ళే వీలుందేమోనని అమృతని అడిగితే దిల్‌షుక్‌నగర్‌లో దిగారని చెప్పింది. వెంటనే సుబ్బలక్ష్మిగారితో
ఉన్నాయన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ”రేపు మీరున్న హోటల్‌కి వచ్చి కొంచెంసేపు మీతో మాట్లాడవచ్చా” అని అడిగితే తప్పకరామ్మా! ”రేపే మేము బెంగుళూరు వెళ్ళిపోతున్నాము. ఉదయం వస్తే కొంచెం సేపు మాట్లాడుకోవచ్చు.” అన్నారు. మర్నాడు ఉదయమే దిల్‌షుక్‌నగర్‌లో సుబ్బలక్ష్మిగారు బస చేసిన హోటల్‌కి నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే ఆవిడ స్నానం చేసి తయారుగా ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడారు. ఇద్దరు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసాం.
బుచ్చిబాబుగారి గురించి మాట్లాడారు. తన కథలు, పెయింటింగ్స్ గురించి చాలా చెప్పారు. ఆవిడతో ఇంకొంత సేపు మాట్లాడాలని
ఉన్నా వాళ్ళు బెంగుళూరుకు బయలుదేరాల్సిన సమయం మించిపోకూడదని శెలవు తీసుకుని వచ్చేసాను. సుబ్బలక్ష్మి గారితో గడిపిన ఆ కొంచెం సమయం చాలా విలువైనదిగా గుర్తుండిపోయింది. బుచ్చిబాబుగారు సహచరిగానే కాకుండా సుబ్బలక్ష్మిగారు స్వయంగా రచయిత్రిగా, ఆర్టిస్టుగా ప్రాచుర్యం పొందారు వారికి భూమిక నివాళి. ఇటీవల మరణించిన శివరాజు సుబ్బలక్ష్మి గారి రెండు కథల్ని ఆవిడకు మనఃపూర్వక నివాళి అర్పిస్తూ భూమిక పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం. – ఎడిటర్.