శారద మద్రాసు వెళ్ళిపోతోందని తెలిసి విశాలాక్షి, అన్నపూర్ణ బాగా బెంగ పెట్టుకున్నారు. తన చదువు కూడా ఆగిపోతుందేమోనన్నది అన్నపూర్ణ. విశాలాక్షి మాత్రం చదువు ఆపనని కచ్చితంగా చెప్పింది. ఊళ్ళో చదువు పూర్తయ్యాక మద్రాసు వచ్చి చదువుతానంది.
శారదకు స్నేహితులను వదిలి వెళ్ళాలనే బాధ ఓ పక్క ఉన్నా మద్రాసు వెళ్ళబోతున్నందుకు సంతోషంగా కూడా
ఉంది. మద్రాసు గురించి తండ్రి ఎన్నో సంగతులు చెప్తుంటే నోరు తెరుచుకుని వినేది. ఇప్పుడు ఆ ఊళ్ళో ఉండబోతోంది. చాలా మంచి బడిలో చదువుతుంది. కానీ తన పక్కన అన్నపూర్ణ, విశాలాక్షి ఉండరు. మద్రాసు గురించి సూర్యానికి రోజూ ఎన్నో ఆశలు కల్పిస్తూ ఉంది. సముద్రం, పెద్ద బడి, బోలెడు కార్లు, రైళ్ళు… ‘‘కానీ అన్నపూర్ణ అక్క ఉండదుగా’’ అని సూర్యం అమాయకంగా అడిగితే మాత్రం శారదకు హడావుడిగా, కంగారుగా ఉంది. పరీక్షలు పూర్తయ్యాక తీసుకెళ్తానని చెప్పి రామారావు ముందే మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ సంసారానికి చేయవలసిన ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. నాన్న, నాన్నమ్మలిద్దరూ లేకోవడంతో శారదకు స్నేహితులతోడిదే లోకమయింది.
విశాలాక్షి తల్లి కోటేశ్వరికి శారద మద్రాసు వెళ్తోందని తెలిసిన రోజున రంగయ్యగారిని అడిగింది, ‘‘మనమ్మాయిని కూడా మద్రాసు తీసుకెళ్దామా’’ అని. రంగమ్మ ఒప్పుకోలేదు.
‘‘మద్రాసులో మనం ఉండడం కష్టం. రామారావు తీరు వేరు. ఆయన సంఘంలో చాలా పలుకుబడి ఉన్నవారు. పైగా వాళ్ళు బ్రాహ్మణులు. విశాలాక్షి సంగతి వేరు. నేనున్నానుగా. గుంటూరులో కూడా చాలా మంచి బడి ఉంది. కళాశాల కూడా ఉంది. గుంటూరులో చదువు చెప్పించాక మద్రాసు సంగతి చూద్దాం’’ అన్నాడు.
శారద ఒక సెలవురోజున స్నేహితురాళ్ళిద్దరి ఇళ్ళూ చూడాలనుకుంది. నాన్నమ్మ ఉంటే అది కుదిరే పని కాదు. ముఖ్యంగా విశాలాక్షి ఇంటికి అసలు వెళ్ళనివ్వదు. ఇప్పుడు శారదకు అవకాశం వచ్చింది. శారద తన ఇంటికి వచ్చినందుకు విశాలాక్షి పొంగిపోయింది. స్నేహితులు తన ఇంటికి రారని విశాలాక్షికి చాలా దిగులు. ఆ దిగులు ఆ వేళతో తీరిపోయింది. ఇద్దరు స్నేహితులూ కరువుదీరా కబుర్లు చెప్పుకున్నారు. వాటిల్లో సగం పైగా అన్నపూర్ణ గురించే. అన్నపూర్ణకు పెళ్ళి చేస్తారు, ఎట్లా ఆపగలం అనేదే వాళ్ళ దిగులు. లోలోపల ధనలక్ష్మి గుర్తొస్తోంది కానీ ఆ పేరు పైకి చెప్పుకునే ధైర్యం చేయడం లేదు. శారద ఆ రోజు అక్కడే భోజనం చేసింది. అవతల వీథిలో ఉండే బ్రాహ్మణుల ఇంట వంట చేయించింది కోటేశ్వరి. చూస్తూ చూస్తూ తన చేతుల మీదుగా బ్రాహ్మణ ఆచారాన్ని కాదనడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. సాయంత్రం శారద, విశాలాక్షి కలిసి త్యాగరాజస్వామి కీర్తన ‘‘జగదానంద కారక’’ పాడితే కోటేశ్వరి వాళ్ళకు ఆ కీర్తన మరింత బాగా పాడే మెలకువలు నేర్పింది. విశాలాక్షికి కోటేశ్వరి ఐదో ఏట నుంచే సంగీతం నేర్పించింది. నృత్యం తనే స్వయంగా నేర్పింది. శారదకు నరసమ్మగారు తనకొచ్చిన స్వరాలు కాసిని నేర్పింది. విశాలాక్షి పాడుతుంటే శారద ఇట్టే పట్టేసి తనంతట తనే ఎక్కువ నేర్చుకుంది. అన్నపూర్ణకు అసలు సంగీత జ్ఞానమే ఉండేది కాదు. వీళ్ళిద్దరూ పాడుతుంటే, విశాలాక్షి నాట్యం చేస్తుంటే నోరు తెరుచుకు చూసేది. మర్నాడు అన్నపూర్ణ ఇంటికి వెళ్దాం, రమ్మని అడిగింది శారద. విశాలాక్షికి కూడా వెళ్ళాలనే ఉంది కానీ కోటేశ్వరి ఒప్పుకోలేదు. వాళ్ళింట కూతురికి ఎలాంటి మర్యాదలు జరుగుతాయేమోనని ఆమెకు సందేహం. రంగయ్య, అన్నపూర్ణ తండ్రి రాగయ్య దగ్గరి బంధువులే. రంగయ్య కోటేశ్వరితో కలిసి జీవించటం ఆమెకు రంగయ్యగారి మనిషనే గుర్తింపునివ్వటం వాళ్ళవాళ్ళెవరికీ ఇష్టంలేదు. అందువల్ల కూతురిని వాళ్ళు అవమానిస్తారేమోననే భయంతో విశాలాక్షి ఎంత బతిమాలినా అన్నపూర్ణ వాళ్ళింటికి పంపడానికి కోటేశ్వరి ఒప్పుకోలేదు. చీకటి పడుతుండగా శారదను తీసుకెళ్ళడానికి పాలేరు వచ్చాడు. అన్నపూర్ణను పెళ్ళి చేసుకోవద్దని తన మాటగా చెప్పమంది విశాలాక్షి.
ఆ స్నేహితురాళ్ళిద్దరికీ శక్తి ఉంటే అన్నపూర్ణను ఆ ఇంట్లోంచి మాయం చేసి గుంటూరులో లక్ష్మీబాయమ్మ గారింట్లో ఉండేలా చేసేవారు. ‘‘ప్రతి ఊళ్ళో లక్ష్మీబాయమ్మ ఉంటే బాగుండేది’’ అంది విశాలాక్షి.
‘‘రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ వంటి వాళ్ళు చచ్చిపోకూడదు’’ అంది శారద.
శారద ఎప్పుడొస్తుందా అని అన్నపూర్ణ తెల్లవారిన దగ్గర్నుంచీ ఎదురు చూస్తోంది. పొద్దున చద్దన్నాలు తిని పెద్దవాళ్ళందరూ పొలం వెళ్ళారు. అన్నపూర్ణ తల్లి హనుమాయమ్మ ఇంటి పనిలో మునిగిపోయి ఉంది. వాళ్ళది పదిగొడ్ల పాడి. ఐదారు అడకల సేద్యం, ఇంటినిండా ధాన్యం, చిరు ధాన్యాల బస్తాలు. ఇల్లంతా శుభ్రంగా ఉంచుతుంది హనుమాయమ్మ. నల్లగా నున్నగా మెరిసే నాపరాళ్ళను తుడిపిస్తుంది. గోడల బారున ఐదడుగుల ఎత్తులో చెక్క కొట్టించారు. దానిమీద తళతళ మెరుస్తూ ఇత్తడి బిందెలు, రాగి కాగులు, ఇత్తడి, రాగి పాత్రలు పొందికగా సర్ది ఉంటాయి. విశాలమైన వరండాలో నాలుగు చెక్క కుర్చీలూ, రెండు మంచాలూ వేసి ఉన్నాయి. రెండు మంచాల మీదా ఉతికిన దుప్పట్లు ఎక్కడా ఇంత మడత లేకుండా నలగకుండా పరిచి ఉన్నాయి.
ఇంటిముందు విశాలమైన ఆవరణ ఉంది గానీ పూలమొక్కలేమీ లేవు. ఒక మూలగా సన్నజాజి పందిరి మాత్రం
ఉంది. పెంకుటిల్లే అయినా చాలా హుందా అయిన ఇల్లని తెలుస్తూనే ఉంది.
శారదకు చూసిన వెంటనే ఆ ఇల్లు చాలా నచ్చింది. శారద కోసం ఎదురుచూస్తూ కూర్చున్న అన్నపూర్ణ ‘అమ్మా శారదొచ్చిందే’ అంటూ ఒక్క కేకవేసి శారద దగ్గరకు పరిగెత్తింది.
స్నేహితులిద్దరూ మందారాల్లాంటి మొహాలతో నవ్వుకున్నారు. హనుమాయమ్మ రెండు గిన్నెల్లో జున్ను తెచ్చి పెట్టింది. ‘‘జున్నుకి అంటు లేదులే తినమ్మా’’ అంది. శారదకి జున్నంటే మహా ఇష్టం. గిన్నె చేతిలోకి తీసుకోవటమే ఆలస్యం, ఇద్దరూ క్షణంలో ఖాళీ చేసి మరీ కాస్త కావాలని అడిగారు.
విశాలాక్షి కబుర్లు కాసేపు చెప్పి శారద అడగలేక అడిగింది.
‘‘నీకు నిజంగా పెళ్ళనుకుంటున్నారా?’’
‘‘అనుకోవటమేంటి. మా నాన్న సంబంధాల కోసం పొరుగూర్లు కూడా వెళ్తున్నాడు’’ అన్నపూర్ణ అది పెద్ద విషయం కానట్లు చెప్పింది.
‘‘మరి నీ చదువు’’
‘‘పెళ్ళయ్యాక ఇంకా చదువంటే కుదురుతుందా? అత్తగారు వాళ్ళు ఊరుకుంటారా?’’
‘‘నీకిష్టమేనా పెళ్ళి’’
‘‘ఏమో… కానీ మా వాళ్ళు నాకు ముసలి మొగుడిని మాత్రం తీసుకురారు. నేను ధనలక్ష్మిలా చచ్చిపోను. మా నాన్న చెప్పాడు మంచివాడిని, చదువుకున్న వాడినే అల్లుడిగా చూస్తున్నానని. మరింక నేను ఎందుకు ఒద్దనాలి? ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలిగా. అందుకే నాకు సంతోషంగానే ఉంది’’ నవ్వింది అన్నపూర్ణ.
పెళ్ళంటే సంతోషపడడానికేముందో శారదకు అర్థం కాలేదు. ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాల్సిందేనట. ఎందుకు చేసుకోవాలి అనుకుంది. బహుశ ఆ రోజుల్లో అలా అనుకున్న మొదటి ఆడపిల్ల శారదేనేమో.
‘‘నేను మద్రాసు వెళ్ళే లోపల చేసుకుంటావా? అలాగైతే నేనూ నీ పెళ్ళికి రావచ్చు.’’
‘‘సంబంధం కుదరాలిగా’’.
సంభాషణ ఎంతసేపూ అక్కడే తిరుగుతోంది. శారదకు ఎక్కువసేపు అక్కడ ఉండాలనిపించలేదు. వెళ్తానంటే అన్నపూర్ణ అప్పుడేనా అంటుంది.
‘‘మీ ఇల్లు చాలా బాగుంది’’ మెచ్చుకోలుగా అంది శారద.
‘‘మీ ఇల్లంత పెద్దది కాదు’’.
‘‘ఐనా మీ ఇల్లే బాగుంది. చాలా శుభ్రంగా మెరిసిపోతోంది. మీ ఇంట్లో ఎవరూ లేరేం?’’
‘‘మా నాన్న, అన్న, తమ్ముళ్ళు పొలం వెళ్ళారు. మా వదిన, పిన్ని లోపల పనులు చేస్తున్నారు.’’
‘‘మీ తమ్ముళ్ళు చదువుకోరా?’’
‘‘వాళ్ళని వచ్చే ఏడు బళ్ళో వేస్తారు. ఇంకా చిన్నపిల్లలేగా’’.
‘‘పొలంలో ఏం చేస్తారు?’’
‘‘చాలా పనులుంటాయి. నాకూ పొలం వెళ్ళటం ఇష్టం. నేనూ వెళ్తాను. ఏదో ఒకటి చేస్తుంటాను. ఏం లేకపోతే దోసకాయలు, వంకాయలూ తెంపుకుని వస్తాను. మొన్నటిదాకా ఎన్ని బంతిపూలున్నాయో మా చేలో. నాకు పాలు తియ్యడం కూడా వచ్చు. దూడలని విడిచి అవి పాలు తాగాక మళ్ళీ కట్టేస్తా. రా… మా దూడలను చూపిస్తా’’ అని ఇంటి వెనకాల దూరంగా ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకుపోయింది. శారద వాళ్ళింట్లో పశువుల కొట్టం ఉండదు. ఎక్కడో దూరంగా ఉంటుంది. పాలేర్లు రోజూ పాలు పితికి తెస్తారు. శారదకు పశువులతో అంత అనుబంధం లేదు. అన్నపూర్ణది వేరే లోకం అనుకుంది, దూడలని బుజ్జగిస్తూ ఆడుతున్న స్నేహితురాల్ని చూసి.
అన్నపూర్ణ తిరగలి విసిరి చూపింది. అన్నపూర్ణకు వచ్చిన పనులు చూసి శారద ఆశ్చర్యపోయింది. శారద ఇంట్లో వంట ఇంట్లో పొయ్యి దగ్గర తప్ప, మిగిలిన పనులన్నీ దాసీలు, పాలేర్లు చేస్తారు. పండగలప్పుడైతే వంట బ్రాహ్మణుడిని పిలిపిస్తారు. వెంటనే వెళ్ళిపోదామనుకున్న శారద సాయంత్రం దాకా ఉండిపోయింది. ఇంక బయల్దేరదామనుకుంటుండగా అన్నపూర్ణ తండ్రి ఇంకో పెద్దాయనతో కలిసి వచ్చాడు.
‘ఇదుగో, ఏమే. ఇట్టారా. మనమ్మాయికి సంబంధం కుదిరింది’ అంటూ కేకపెడుతూ వచ్చి మంచంమీద కూర్చున్నాడు. రెండో ఆయన కూడా ఈయన పక్కన ఆయాసపడుతూ కూర్చున్నాడు. చాలా దూరం నుండీ నడిచి వస్తున్నట్లున్నారు.
పొలం వెళ్ళిన తండ్రి సంబంధం ఎలా తెచ్చాడా అని ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ.
హనుమాయమ్మ, భర్త కేకలకు సమాధానంగా తనే వచ్చి రెండో ఆయన్ను చూసి ముఖం ఇంత చేసుకుని, ‘‘నువ్వా భూషయ్యన్నయ్యా. బాగున్నావా? అమ్మెట్లా ఉంది? ఉండు నీళ్ళు తెస్తా’’ అంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కోటానికి ఒక చిన్న బిందెతో నీళ్ళూ, చెంబూ తెచ్చింది. తెల్లటి కండువా మంచం మీద పెట్టింది. ఇద్దరూ కాళ్ళూ, ముఖం కడుక్కునేసరికి పెద్ద కంచు గ్లాసుల్తో మంచు తెచ్చింది. ఇదంతా అయ్యేవరకూ అన్నపూర్ణ తండ్రి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు.
‘‘మీ అన్నయ్య స్నేహితుడి కొడుకంట. ఇంటరు చదువుతున్నాడు. ముగ్గురన్నదమ్ములు, ఇద్దరక్కచెల్లెళ్ళు. పెద్ద కుటుంబం. ఐతే ఏం? మేనత్త ఆస్తి కలిసొచ్చింది. దేనికీ లోటు లేదు. పిల్లాడు ఎర్రగా దొరబాబులా ఉంటాడంట. ప్లీడరీ చదువుతానంటున్నాడంట. మీ అన్న అన్నీ చెబుతాడులే’’ అంటూ భూషయ్యకేమీ మిగల్చకుండా అన్నీ తనే చెప్పుకుపోతున్నాడు.
ఆయన మాటలు అందరి కంటే శ్రద్ధగా అన్నపూర్ణ, శారదలే విన్నారు. అన్నపూర్ణ ముఖంలో సిగ్గు, సంతోషం చూసి శారదకూ ఏదో తెలియని సంతోషం కలిగింది. ఇక వాళ్ళ మాటలు ఇప్పట్లో అయ్యేలా లేవని శారద బయల్దేరింది. ‘‘ఎవరూ’’ అని రాగయ్య శారద గురించి అడగటమూ. ‘‘నా స్నేహితురాలు’’ అని అన్నపూర్ణ
‘‘రామారావు గారమ్మాయి. నరసమ్మగారి మనవరాల’’ని హనుమాయమ్మ చెప్పటమూ వీథిలో నడుస్తున్న శారదకు వినపడుతూనే ఉన్నాయి.
వీళ్ళింట్లో అందరూ అంత పెద్దగా ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ఎవరికీ చెవుడు లేదు అనుకుంది శారద.
అన్నపూర్ణ పెళ్ళి చూస్తుండగానే నిర్ణయమైపోయింది. పెళ్ళి కొడుకు రాలేదు గానీ వాళ్ళ బలగం చాలామందే వచ్చి అన్నపూర్ణను చూశారు. నాలుగెకరాల పొలం అన్నపూర్ణ పేరుమీదనే కొన్నానన్న రాగయ్య మాట అందరికీ నచ్చింది. లగ్నాలెప్పుడున్నాయంటే ఎప్పుడున్నాయన్నారు. పురోహితుడిని ఆఘమేఘాలమీద పిలిపించారు. పదిహేను రోజుల్లో పెళ్ళికి మంచి ముహూర్తం కుదుర్చుకుని, నాలుగు రోజుల్లో చినలగ్నాలనుకుని అందరూ హడావుడి పడటం మొదలుపెట్టారు. మగపెళ్ళి వాళ్ళు వెళ్ళాక హనుమాయమ్మ మొగుడ్ని పట్టుకుని సాధించింది.
‘‘ఐదు రోజుల పెళ్ళికి పదిహేను రోజుల వ్యవధిలో ముహూర్తం పెడితే పనులెట్లా అవుతాయి? అప్పడాలు, వడియాలు పెట్టడానికే సమయం చాలదు. అరిశెలు, లడ్లు ఎప్పుడు చెయ్యాలి? సున్ని ఉండలకి పిండి విసరాలా ఒద్దా? కారం పసుపు కొట్టించాలా?’’
హనుమాయమ్మ ఆరాటమంతా విన్నాక ‘‘అన్నీ అవే అవుతాయిలే’’ అని పై పంచ భుజం మీది నుంచి తీసి తలగుడ్డలా చుట్టుకుని బైటికి వెళ్ళిపోయాడు రాగయ్య.
హనుమాయమ్మ కూడా ఊళ్ళో చుట్టాలకి చెప్పటానికి వెళ్ళిపోయింది. నిజానికి హనుమాయమ్మది కేవలం ఆరాటం, ఆందోళనే. ఊళ్ళో బంధువులూ, ఇరుగుపొరుగులూ అందరూ తలా ఒక చెయ్యి కాదు రెండు చేతులూ వేస్తారు. ఎంతెంత వంటలైనా ఇట్టే చేసేస్తారు. హనుమాయమ్మకు ఇల్లు బాగుచేసి సున్నాలు కొట్టించటమొక్కటే పని. రాగయ్య తమ్ముడు పెళ్ళి పందిళ్ళు వేయించటంలో పేరెక్కినవాడు. ఆ పని అతనికి ఒదిలేశారు. ఇంటిల్లిపాదికీ, పెట్టుపోతలకు బట్టలు తియ్యాలి. అదొక్కటే పట్నం వెళ్ళి చేసుకురావల్సిన పని. ఆ పని రామారావు గారితో కలిసి తను పట్నం వెళ్ళి చేసుకొస్తానన్నాడు రాగయ్య.
ఆ రోజు రాత్రి పడుకునే వేళకు అన్ని పనులూ అయిపోయినట్టే అనిపించింది హనుమాయమ్మకు.
‘‘ఈ మాత్రం దానికి గంటసేపు నన్ను వేసుకు పడ్డావు’’ అన్నాడు రాగయ్య.
అన్నపూర్ణకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా పెళ్ళికొడుకు ముసలివాడు కాదు. తనకంటే ఏడేళ్ళే పెద్ద. చదువుకుంటున్నాడు, ఇంకా చదువుతాడు. పిల్లవాడు తల్లి పోలిక అన్నారు. అత్తమామలిద్దరూ చక్కగా ఉన్నారు. అత్త మరీ దబ్బపండు ఛాయ. తనకు మంచి మొగుడే వచ్చాడని మురిసిపోయింది అన్నపూర్ణ. మంచి మొగుడు రావాలని ఆ అమ్మాయి చాలామంది దేవుళ్ళకు మొక్కుకుంది. పెళ్ళవగానే భర్తతో కలిసి ఆ మొక్కులన్నీ తీర్చుకోవాలి, అదొక పెద్ద పనిలా దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది.
శారద, విశాలాక్షి కూడా అన్నపూర్ణ సంతోషంలో మనస్ఫూర్తిగా భాగం పంచుకున్నారు. చదువు మానేస్తుందేమో గాని సుఖంగా ఉంటుంది గదా అనుకున్నారు. అన్నపూర్ణకు కాబోయే భర్త పేరే వాళ్ళకు బొత్తిగా నచ్చలేదు. అబ్బయ్య చౌదరి. ‘‘అన్నపూర్ణ పేరు ఎంత బాగుంది. అబ్బయ్యేంటి అబ్బయ్య’’ అంది విశాలాక్షి.
‘‘ఊరుకో.. అన్నపూర్ణ బాధపడుతుంది’’ అంది శారద.
‘‘మా ఇద్దరి పేర్లలోనూ మొదటి అక్షరం ‘అ’. పేర్లు ఎంత బాగా కలిశాయో చూడండి’’ అంది పెద్ద విషయం కనిపెట్టినంత సంబరంగా అన్నపూర్ణ. పేరు అంత నాజూకుగా లేకపోయినా దీనికి సంతోషపడొచ్చుగా అని ఆ పిల్ల ఉద్దేశం.
చూస్తుండగానే అన్నపూర్ణ పెళ్ళి జరిగిపోయింది. ఐతే అన్నపూర్ణ వ్యక్తురాలయ్యేంతవరకూ బడికి పంపించవచ్చునన్నారు అత్తమామలు.
బియస్సీ చదవటానికి అబ్బయ్య మద్రాసు వెళ్తాడు. అతని చదువు పూర్తయ్యేదాకా అన్నపూర్ణ పుట్టింట్లో ఉండటానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పటికి ఆమెకు పద్దెనిమిదేళ్ళొస్తాయి. రామారావుగారు తనంత తాను కలుగజేసుకుని ఇరుపక్షాల వాళ్ళతో మాట్లాడి ఈ ఏర్పాటంతా చేశారు. అబ్బయ్య రామారావుగారి గురించి విని ఉన్నాడు. ఆయనను ప్రత్యక్షంగా చూడటం, ఆయన వ్యవహారశైలి గమనించడంతో ఆయనమీద గౌరవం పెరిగింది. ధనలక్ష్మి వ్యవహారం తన ప్రమేయం లేకుండా అట్లా విపరీతంగా జరిగినందుకు రామారావు మనసులో ఉన్న బాధ అన్నపూర్ణ విషయంలో కాస్త ఎక్కువ జోక్యం కలుగజేసుకునేలా చేసింది. రాగయ్య ఆశ్చర్యపడేంతగా ఆయన పెళ్ళిపెద్దల్లో ముఖ్యుడయ్యాడు. అన్నపూర్ణ చదువు ఆగనందుకు శారద, విశాలాక్షి ఎగిరి గంతులేశారు. మొత్తానికి స్నేహితురాలి పెళ్ళి చూసి శారద తల్లిదండ్రులతో కలిసి మద్రాసు వెళ్ళింది.
‘‘మన దేవతలు అన్ని అలంకారాలతో, పువ్వులతో సర్వాంగ సుందరంగా ఉంటారు. క్రీస్తు అలా కాదు. మానవుల కోసం తాను రక్తం కార్చినవాడు. బోధకుడు. ఆయన బోధనలు నచ్చనివారు ఎంతో హింసించారు. మానవుల కోసం హింస పడుతున్న ఆయన మూర్తిని ఆరాధిస్తారు వీళ్ళు. తోటి మనుషుల కోసం మనం ఎన్ని కష్టాలైనా పడాలని క్త్రీస్తు చెబుతాడు’’.
ఆయన ఎంత చెప్పినా సుబ్బమ్మకు అర్థం కాలేదు. శారద అర్థం చేసుకునే ప్రయత్నంలో అలసిపోయి నిద్రపోయింది.
మర్నాడు సులభమైన ఇంగ్లీషులో క్రీస్తు చరిత్ర ఉన్న పుస్తకాన్ని కొని తెచ్చాడు రామారావు.
శారదకు కొత్త మతం క్రమంగా పరిచయమైంది. పాఠశాలలో కూడా బైబిల్ బోధించడానికి ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించారు. ఆ పాఠశాలలో తెలుగు పిల్లలు తక్కువే. ఉన్నవారిలో ఇద్దరు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళు చాలా పేద పిల్లలు. శారదకు వెరోనిక, థెరిసా అనే ఆ ఇద్దరితో మొదటిరోజు నుంచీ స్నేహం కుదిరింది. వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చారు. హైస్కూలు చదువయ్యాక తాము సన్యాసం తీసుకుంటామని వాళ్ళు చెబితే శారదకు దిగులేసింది. ‘‘నేనూ పెళ్ళి చేసుకోను. కానీ జుట్టు తీయించుకుని, ఇట్లాంటి బట్టలు వేసుకోను. నాకు రంగురంగుల బట్టలంటే ఇష్టం’’ అంది శారద.
‘‘మాకూ ఇష్టమే. అయినా సరే అమ్మగార్లమవుతాం’’ అన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా తెలివైనవాళ్ళు. చాలా కష్టపడి చదివేవారు. వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కష్టమని శారద మొదటి నెలలోనే గ్రహించింది. కానీ శారదకు వాళ్ళు నేర్చుకోలేని అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఉందని వాళ్ళూ గ్రహించారు. శారద ఈత నేర్చుకుంటోంది. స్కూల్లో ఆడే ఆటలు కాక, టెన్నిస్, బాడ్మింటన్లు నేర్చుకుంటోంది. వారానికి మూడు రోజులు సాయంత్రాలు సంగీతం మాస్టారు ఇంటికొచ్చి నేర్పుతాడు. వీటన్నింటినీ సునాయాసంగా నేర్చుకునేందుకు అవసరమైన పౌష్టికాహారం శారదకు పుష్కలంగా అందుతోంది.
ఇంటి దగ్గర రామారావు కోసం ఎంతోమంది వస్తుంటారు. అందరూ పండితులు, పరిశోధకులు, దేశభక్తులు, శాస్త్రవేత్తలు. వాళ్ళు వచ్చినప్పుడు శారద మెల్లిగా పక్కన చేరేది. అందరూ ఆమెను ఆప్యాయంగా పలకరించేవారు. వారి మాటలు ఒక్క అక్షరం పొల్లుపోకుండా వినేది. అర్థమయినంత అయ్యేది, లేనిది లేదు. అన్నిటికంటే ఆనందం వీరేశలింగం పంతులుగారు రావటం. రాజమండ్రిలో వాళ్ళింటికి తను వెళ్ళటం, రాజ్యలక్ష్మమ్మ తనకు కథ చెప్పి, పాట పాడటం శారదకు బాగా గుర్తున్న మొదటి జ్ఞాపకం. రాజ్యలక్ష్మమ్మ పోయి ఏడేళ్ళయిపోయింది. పంతులుగారు శారీరకంగా, మానసికంగా కొంత బలహీనులయ్యారు. ఆత్మకథ రాస్తున్నారు. ఆయన మద్రాసు వస్తే రామారావుగారింట్లోనే బస చేస్తారు. ఆయనను కలవాలని మరెంతోమంది వస్తారు. ఆ ఇల్లు సరస్వతీ నిలయంలా ఉండేది. అక్కడ శారద ఏ పరదాలూ లేకుండా పెరుగుతోంది.
ఒకరోజు ఉదయం బడికి వెళ్ళిన శారదకు తరగతి గదిలో వెరోనికా కన్పించలేదు. థెరిసా చెప్పింది వాళ్ళ నాన్న వచ్చాడని వెరోనికాను బైటికి తీసుకువెళ్ళాడని. అలా బయటకు తీసుకెళ్ళడానికి సామాన్యంగా అనుమతి దొరకదు. వెరోనికా సాయంత్రం వరకూ రాదు. సాయంత్రం తను ఇంటికి వెళ్ళాక వస్తే తనిక ఆ రోజు వెరోనికాను చూడలేదు. శారదకి అదేం బాగోలేదు. వెరోనికాని బడిలో చూడకుండా ఉండటం చాలా కష్టంగా అనిపించింది. సాయంత్రం లోపల వెరోనికా రావాలి రావాలి అనుకుంటూ కూర్చుంది.
సాయంత్రం బడి వదలగానే ఆవరణలో వెరోనికా కోసం ఎదురు చూస్తూ నిల్చుంది. ఒక పది నిమిషాలలో వెరోనికా వాళ్ళ నాన్నతో కలిసి వచ్చింది. వెరోనికా తండ్రిని చూసి శారద ఎలాగో అయిపోయింది. ఆ అమ్మాయి తన ఊళ్ళో మాలపల్లె మనుషులను చూసింది. వెరోనికా తండ్రి అలాగే
ఉన్నాడు. ఊళ్ళో అలాంటి బీదవారిని చూస్తే రాని దుఃఖం అతను వెరోనికా తండ్రి అంటే ఎందుకు కలిగిందో శారదకు తెలియదు. కానీ కలిగింది. వెరోనికా దగ్గరకు వెళ్తే, ఆయన శారదకు దూరంగా జరిగాడు. మా స్నేహితురాలని శారద గురించి చెప్తుంటే ఆయన కళ్ళల్లో భయమే కనిపించింది. అంత పెద్ద మనిషి తనను చూసి భయపడుతుంటే తనలో ఏదో తప్పుందనిపించింది శారదకు. వెరోనికా తొందరలో ఉంది. రేపు వస్తానని చెప్పి హాస్టల్లోకి వెళ్ళిపోయింది. ఆయన అలాగే నించున్నాడు. శారద చొరవగా మీరు మా ఇంటికి రండి, హాస్టల్లో మిమ్మల్ని ఉండనివ్వరుగా అంది.
ఆయన మరింత భయంగా శారదను చూశాడు. శారదతో ఏం మాట్లాడకుండా వెనక్కు తిరిగి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ పాఠశాల ఆవరణలో శారదకు ఈ ప్రపంచంలో ఏదో పెద్ద తప్పుకి తను జవాబుదారీ అన్న భావన తెలిసీ తెలియకుండా కలిగి పెద్ద దుఃఖం వచ్చింది. అంత దుఃఖం ఎందుకొచ్చిందో కూడా ఆ అమ్మాయికి స్పష్టంగా తెలియదు.
అసలు తెలియకుండానూ లేదు. మాల మాదిగలను ఊళ్ళోకి, ఇళ్ళల్లోకి రానివ్వరు. ఆ సంగతి శారదకు కొంత తెలుసుగానీ ఊళ్ళో ఉన్నప్పుడు ఆ విషయమై ప్రశ్నలు రాలేదు. కానీ ఇక్కడ తను రోజూ కలిసి చదువుకునే, ఆడుకునే స్నేహితురాలి తండ్రి స్థితి అది అని కొట్టొచ్చినట్లు కనపడేసరికి శారద మనసు కుంగిపోయింది. తండ్రి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తండ్రి వచ్చి భోజనం చేశాక ఆయన దగ్గర చేరి లోపలి బాధను అణచుకుంటూ, ‘‘నాన్నా, మన ఊళ్ళో మాలవాళ్ళను మనం తాకం కదా. మన ఇంటిలోకి రానివ్వం కదా. ఎందుకు?’’ అని అడిగింది.
రామారావు రెండు నిమిషాలు మౌనంగా ఉండి ‘‘మన బుద్ధిహీనత వల్లనమ్మా. వాళ్ళ కులం తక్కువని, బ్రాహ్మణ, వైశ్య కులాలు ఎక్కువని ` మాల, మాదిగలు అంటరానివారిగా ఉండాలనీ పెట్టారు’’.
‘‘ఎవరు పెట్టారు నాన్నా?’’.
‘‘కొన్ని వందల సంవత్సరాల క్రితం నాడు బ్రాహ్మణులే పెట్టారమ్మా’’.
‘‘దానిని ఇప్పుడు మనం తీసెయ్యలేమా? వాళ్ళను మనం తాకితే, ఇంట్లోకి రానిస్తే…’’
‘‘తప్పకుండా అలా చెయ్యాలమ్మా. ఇప్పుడు అంటరానితనం కూడదని కొందరు చెప్తున్నారు. మీ బళ్ళో అదంతా లేదుగా.’’
‘‘వెరోనికా, థెరిసాలను ఒకసారి మన ఊరు తీసుకెళ్దాం నాన్నా. వాళ్ళు నాకు స్నేహితులు. వెరోనికా వాళ్ళ నాన్న ఇవాళ బడికి వచ్చారు. చాలా పేదవాళ్ళు. నన్ను చూసి దూరం జరిగారు. నాకు ఏడుపొచ్చింది’’. రామారావు శారదకు గురజాడ రాసిన ‘‘లవణరాజు కల’’ చదివి అర్థం చెప్పాడు. శారదకది చాలా నచ్చింది.
శారదకి కులాల గురించి చెప్పగలిగినంత చెబుతూ నిద్రపుచ్చాడాయన.
కొత్త వాతావరణంలో, కొత్త స్నేహితులతో కొన్నాళ్ళపాటు శారద మనసులో విశాలాక్షి, అన్నపూర్ణ కాస్త వెనక్కు వెళ్ళారు.
మళ్ళీ వేసవి శలవలు వచ్చేంత వరకూ కాలం ఎలా గడిచిందో శారదకు తెలియదు. వేసవి శలవలకు ఊరికి వెళ్దామని సుబ్బమ్మ గొడవ చేసింది. ఇల్లు, పొలం, పాలేర్ల చేతికి, కౌలుదార్ల చేతికి అప్పగించి మళ్ళీ అటు చూడకపోతే ఎలాగని పోరు పెట్టినంత పని చేసింది. నరసమ్మ కాశీ నుంచి రాసే ఉత్తరాలలో ఇల్లు, పొలం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా రాస్తుండేది.
చివరికి ఒక పది రోజులు ఊళ్ళో గడపడానికి రామారావు వీలు కల్పించుకున్నాడు.
‘‘నాన్నా అన్నపూర్ణ, విశాలాక్షి బాగా గుర్తొస్తున్నారు. తొందరగా వెళ్దాం నాన్నా’’ అని గంతులేసింది శారద.
సుబ్బమ్మ భయపడిపోయినంతగా ఇల్లు పాడయిపోలేదు. వీళ్ళొస్తున్నారని తెలిసి ఆ ఇంట్లో సగభాగంలో ఉంటున్న పురోహితుడి భార్య ఆ ఇల్లంతా దులిపించి, కడిగించింది. ఊళ్ళో బంధువులు రెండు రోజుల పాటు తమ ఇళ్ళల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ లోపల సుబ్బమ్మ వంట ఏర్పాట్లు చేసుకుంది. సూర్యం తన వయసు పిల్లల్ని పోగేసి తోటలో ఆటలతో ఆనందిస్తున్నాడు.
శారద ఊళ్ళోకి వచ్చిన రోజు సాయంత్రమే అన్నపూర్ణ శారద కోసం వచ్చింది. అన్నపూర్ణ కాస్త పొడుగైంది. ఒళ్ళొచ్చింది, రంగొచ్చింది. చాలా అందంగా ఉందనిపించింది. శారద ఆ మాట అంటే ‘‘ఉగాది పండుగకు మా ఆయన వచ్చాడు. ఆయనా నీలాగే అన్నాడు’’ అంది అన్నపూర్ణ సిగ్గుపడుతూ.
‘‘మీ ఆయనంటే నీకిష్టమేనా?’ శారద కుతూహలంగా అడిగింది.
‘‘చాలా ఇష్టం. ఆయనక్కూడా నేనంటే ప్రాణం. ఉత్తరాలు రాస్తారు. పుస్తకాలు పంపిస్తారు. ఇంగ్లీషు బాగా నేర్చుకోమంటారు. చదువు పూర్తయి ఉద్యోగం రాగానే నన్ను తన దగ్గరకు తీసుకెళ్తానన్నారు.’’
‘‘విశాలాక్షి వాళ్ళు గుంటూరు వెళ్ళారు’’ అని అన్నపూర్ణ చెప్పిన మాట విని నిరాశపడిరది శారద. అన్నపూర్ణ ఇంకా చాలా కబుర్లు చెప్పింది విశాలాక్షి గురించి.
రంగయ్య హఠాత్తుగా చనిపోయాడు. కోటేశ్వరి, విశాలాక్షి చాలా ఏడ్చారు. మొత్తానికి వాళ్ళ బంధువులొచ్చి ఏవేవో మాట్లాడి తల్లీ కూతుళ్ళను గుంటూరు తీసుకెళ్ళారు. విశాలాక్షి అక్కడే చదువుతుంది. చదువు మాత్రం మాననని విశాలాక్షి కచ్చితంగా చెప్పిందనేసరికి శారదకు సంతోషమనిపించింది.
శారద మద్రాసు కబుర్లన్నీ చెప్పింది. వెరోనిక, థెరిసాలను గురించి చెబితే అన్నపూర్ణ ఆశ్చర్యపోయింది.
‘‘ఈసారి శలవలకు వాళ్ళను ఇక్కడికి తీసుకొస్తాను మా ఇంటికి’’ అని శారద కచ్చితంగా చెప్తుంటే అన్నపూర్ణ నోరు తెరిచింది భయంతో.
‘‘ఊళ్ళో అదంతా కుదరదు’’ అంది.
‘‘ఎందుకు కుదరదు. నువ్వు కూడా మాలవాళ్ళను ఇంట్లోకి రానివ్వాలని మీ నాన్నతో చెప్పు’’.
‘‘మా నాన్న నన్ను చంపేస్తాడు’’.
‘‘మా నాన్న చెప్తే వింటాడేమో’’.
‘‘ఏమో. ముందు మా ఆయనతో చెప్తాలే. మా ఆయన ఇచ్చే పుస్తకాలలో ఇలాంటి మాట ఒకటి చదివాను. భయం వేసింది.’’
మర్నాడు శారద అన్నపూర్ణ ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాలు చూసింది. కొన్ని పుస్తకాలు శారద దగ్గరా ఉన్నాయి. అవి ముద్రించింది రామారావే.
‘‘మీ నాన్నగారంటే మా ఆయనకు చాలా గౌరవం. ఎప్పుడూ ఆయన గురించే చెప్తారు. మనిద్దరం స్నేహితులమని ఆయనకెంత సంతోషమో.’’ అన్నపూర్ణ మాటలకు శారద మనసు తేలికపడిరది. పెళ్ళి చేసుకుని కూడా సంతోషంగా ఉన్న అన్నపూర్ణను చూసి సంతోషపడిరది. ధనలక్ష్మి జ్ఞాపకం మెల్లిగా చెరిగిపోతోంది.
‘‘వచ్చే ఏడాది మా ఆయన మద్రాసులోనే చదువుతాడట.’’
‘‘నువ్వు మద్రాసు రా’’ ఉత్సాహంగా అంది శారద.
‘‘అమ్మో, నేనా! నన్ను పంపరు. అది జరిగే పని కాదు’’ అంది అన్నపూర్ణ. పదిరోజులూ అన్నపూర్ణ కలుస్తూనే ఉన్నా పదో నాటికి ఎప్పుడెప్పుడు మద్రాసు వెళ్దామా అని తహతహలాడిరది శారద.