రోజూ మనం ఎన్ని రకాల జీవితాలను గడుపుతున్నామో మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తరంలో ప్రతి స్త్రీ ఒకేసారి నాలుగు జీవితాలు గడపాల్సి వస్తుంది. ఒకటి ఫ్యామిలీ లైఫ్, మరొకటి ప్రొఫెషనల్ లైఫ్, ఇంకొకటి సోషల్ లైఫ్, వేరొకటి సోషల్ మీడియా లైఫ్.
ఫ్యామిలీ లైఫ్: ఇంట్లో ఉన్న అందరి మధ్య ఒక థ్రెడ్‌లా ఉండి, ప్రతి ఒక్కరి అవసరాన్ని సమయానికి గుర్తించి ఆ అవసరం తీర్చాల్సిన బాధ్యత స్త్రీ మీదనే ఉంటుంది. మన కుటుంబాలలో ప్రతి మహిళా మూడు తరాల అంతరాల మధ్య సంఘర్షిస్తూ జీవితం కొనసాగిస్తుంది. పెద్ద తరం అయితే తన వెనకాల రెండు తరాలతోనూ, మధ్య తరం అయితే ముందు తరం, వెనక తరంతోనూ, యువతరం అయితే ముందున్న రెండు తరాలతోనూ అనునిత్యం సంఘర్షణ పడడం అందరికీ అనుభవమే. ఒక తరం నుండి ఇంకొక తరంలోకి వెళ్ళాకే అక్కడ ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి. అంతకు ముందు ఆ సమస్యల మీద అవగాహన లేదా అంటే అలాంటిదేమీ ఉండదు. అవగాహన వేరు, అనుభవం వేరు. అవగాహన ఉన్నప్పుడు ఆ సమస్యల యొక్క తీవ్రత అర్థం కాదు. అనుభవించినప్పుడే ఏ సమస్య యొక్క తీవ్రత అయినా అర్థమవుతుంది.
మరీ ముఖ్యంగా మధ్యతరంలో ఉన్న స్త్రీల మీద మానసికమైన ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ అవసరాలను సమయానికి తీరుస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి వారి ఆహార నియమాలను నియంత్రించాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకి అది మనస్తాపం కలిగిస్తుంది. మరో పక్క యువతరం వాళ్ళ యొక్క స్నేహాలనీ, వాళ్ళ ప్రవర్తన గాడి తప్పకుండా ఉండేలా నియంత్రణ బాధ్యత తనమీదే ఎక్కువ పడుతుంది. ఇక పెద్ద తరానికి, యువతరానికి మధ్య ఉన్న అంతరాల పట్ల కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మధ్యలో ఉన్న వాళ్ళమీదే పడుతుంది. ఇంట్లో
ఉన్న అందరి మధ్యన ఒక ఇరుసులా బాధ్యతలు మోస్తున్న పరిస్థితి ప్రతి ఫ్యామిలీలో ఉంది.
ప్రొఫెషనల్ లైఫ్: మన దేశంలో వృత్తిపరంగా మహిళా ఉద్యోగులతో పోలిస్తే పురుష ఉద్యోగులు ఎక్కువ సమానం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మహిళా ఉద్యోగులు ఎంత కష్టపడ్డా సెకండ్ క్లాస్ సిటిజన్స్‌లా మిగిలిపోతారే తప్ప గుర్తిం పుకి నోచుకునే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఒకరో, ఇద్దరో గుర్తించబడ్డా, ఆ గుర్తింపు వెనకాల ఎన్నో గాసిప్స్‌ని ప్రచారం చేసేస్తారు. ‘నాకెందుకు వచ్చిన గుర్తింపు ఇది’ అని వాళ్ళు బాధపడాల్సిందే.
ఇక ఉద్యోగం చేసే స్త్రీ అంటే అందరికీ అలుసే. ఆఫీసులలో లైంగిక వేధింపుల సంగతి సరేసరి. ఎన్నో చట్టాలున్నా, ఏదీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి అన్నది అందరికీ అనుభవమే. ఎందుకంటే ధైర్యంగా తనకి జరుగుతున్న వేధింపులు బయట పెడదామని చూస్తే సహోద్యోగులైన మహిళలే తోడు రాని పరిస్థితి. అంతవరకూ ఫర్వాలేదు. వెనకాల, వాళ్ళే గాసిప్స్‌ని ప్రచారం చేసేసి పురుషోద్యోగుల కీచకత్వాన్ని మరుగున పడేలా చేసేస్తూ ఉంటారు.
సోషల్ లైఫ్: ఈ సోషల్ లైఫ్‌లోకి మన బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు… అందరూ వస్తారు. ఈ సోషల్ లైఫ్‌లో బంధువులతో సంబంధాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. కుటుంబపరంగా జరిగే ప్రతి కార్యక్రమంలో మన ప్రజెన్స్‌ని గమనిస్తూ ఉండి, ఎప్పుడైనా మనకి వీలుపడక అటెండ్ అవ్వకపోతే దాని యొక్క ప్రభావాన్ని బంధుత్వం లేదా చూపించి కినుక వహిస్తూ ఉంటారు. స్నేహితులకి నచ్చచెప్పగలిగి నంతగా బంధువులకి నచ్చచెప్పడం కష్టం.
ఇంకొకటి ఏమిటంటే ఒక స్త్రీ సోషల్ లైఫ్‌లో చాలావరకు తన స్థాయికి కాస్త అటూ ఇటూగా ఉండేవారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతో కంపారిజన్స్ మొదలవుతూ ఉంటాయి. ఎక్కువ తక్కువ భావనలు మొదలవుతాయి. పిల్లల చదువులు, తమ ఉద్యోగాలు, తాము కట్టుకున్న ఇళ్ళు, తమకున్న ఆస్తులు, తమ తమ స్నేహితులు, బంధువులు… ఇలా కంపారిజన్స్‌కి అంతు అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైతే పోల్చి చూసుకోవడం మొదలవుతుందో దాని ప్రభావం వారి సామాజిక సంబంధాల మీద పడుతుంది. మనశ్శాంతి కరువవుతుంది.
సోషల్ మీడియా లైఫ్: ప్రస్తుత తరం మహిళలకు సోషల్ మీడియా లైఫ్ అన్నది చాలా పెద్ద అవసరంగా మారిపోయింది. మనమెంత దూరంగా ఉందామని అనుకున్నా కుదరని పరిస్థితి వచ్చేసింది. ప్రొఫెషనల్ వర్క్‌ని డిస్కస్ చేయడం కోసమో, అలాట్ చెయ్యడం కోసమో సామాజిక మాధ్యమాలు అవసరంగా మారిపోయాయి. ఒకసారి సామాజిక మాధ్యమాల్లో ఉన్నాక మనకి సంబంధం లేని అనేక విషయాల్లోకి బలవంతంగా లాగబడతాం. మనమెంత పక్కకి తప్పించుకుందామని చూసినా వీలుపడని పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనకి ముఖతా పరిచయం లేని వారు కూడా స్నేహితులుగా, శత్రువులుగా మారుతూ
ఉంటారు. ఎవరికి ఎందుకు శత్రువులవు తామో, ఎందుకు స్నేహితులమవుతామో మనకసలు అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అంత తెలివి తక్కువతనం ఏమీ లేదు.
దీని అర్థమేమిటంటే ప్రతి స్త్రీ కూడా ఒక రోజులో నాలుగు రకాల జీవితాలను జీవిం చాల్సి ఉంటుంది. ఒకేరోజు ఒకే సమయం లో ఒక లైఫ్ నుండి ఇంకో లైఫ్‌కి షిఫ్టవడం ఎంత కష్టమో స్త్రీలుగా మనకు తప్ప మరొకరికి తెలియదు. ఇన్ని జీవితాలనీ మనం ఒకేసారి జీవించాల్సి వస్తుందన్న స్పృహ మనలో చాలా మందికి లేదు. ఒకవేళ విడమరచి చెప్పినా అర్థం చేసుకుంటారన్న నమ్మకమూ లేదు. ఒక జీవితంలో ఒకే సమయంలో ఇన్ని పార్శ్వాలలోకి వెళ్ళి ప్రతి చోటా సమర్థత నిరూపించుకోవాల్సి రావడమే తమకున్న అతి పెద్ద ఛాలెంజ్ అని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఇవన్నీ మన ప్రస్తుత జీవన విధానంలో కలగలసి పోయి ఉన్నాయి కాబట్టి, సమాజం మన ఆలోచనలను అలా ప్రభావం చేసింది కాబట్టి.
గమనించి చూస్తే ఈ నాలుగు రకాల లైఫ్‌లలో ఏ స్త్రీ అయినా ఒకదానిలోనో లేదా రెండిరటిలోనో సమర్ధురాలిగా పేరు తెచ్చుకుంటుంది తప్ప అన్నింటిలో కాదు. తన సమర్థత కనిపించని చోటే తనయొక్క మానసిక ఆందోళన మొదలవుతుంది. కానీ అదెందుకు మొదలయిందో అన్న సమాధానం మాత్రం తనకి దొరకదు.
ఈ నాలుగు లైఫ్స్ మగవాళ్ళకీ ఉంటాయి. కాకపోతే ఇద్దరి యొక్క సమస్యల తీవ్రత వేరు. అవి తమ తమ జీవితాల మీద చూపించే ప్రభావం వేరు. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్‌లో కానీ, సోషల్ లైఫ్‌లో కానీ సమస్యల తీవ్రతని ఆడవారి మీదకి నెట్టేసి తాము తప్పించుకుంటారు. వాటిని కేవలం ఆడవారి విషయాలుగా సమాజంలో ప్రచారం చేసేస్తారు. ఇక ఆ సమస్యలను తమ నెత్తిన వేసుకుని వాటి బరువును మొయ్యడం తప్ప వేరే దారి స్త్రీలకు ఉండదు.
ఈ తరం మహిళలలు ఈ నాలుగు రకాల లైఫ్స్‌లో దేన్నీ తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నాలుగు జీవితాలను సున్నితంగా బ్యాలెన్స్ చేసుకోవటంలోనే కాలమంతా గడిచిపోతుంది. దీని అర్థం ఏమిటంటే ఏ స్త్రీ కూడా జీవితాన్ని జీవించడం లేదు. జీవితంలో బ్యాలెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుంది.
కాకపోతే ఈ నాలుగు రకాల లైఫ్‌లను దాటి మనకి ఒక జీవితం ఉండాలి అన్న సంగతే మనం మరిచిపోతున్నాం. మనల్ని మనకి ఇచ్చే జీవితం కదా మనకి కావాల్సింది. ఆ నాలుగు జీవితాలు మనమీద పెడుతున్న స్ట్రెస్‌ని ఎప్పటికప్పుడు తగ్గించే అవకాశమే లేదా అంటే ఎందుకుండదు… ఉంటుంది…
మన మనసుకు సంతోషాన్ని ఇచ్చే జీవితం అది.
ఒక పువ్వు పూస్తుంటే మురిసిపోతూ వేడుకగా సంతోషపడే సందర్భం,
క పక్షి కూత విని గొంతు కలిపే సంబరం
సముద్రపు అలలలో కాళ్ళు కడుక్కుని మనసుని తడుపుకునే సమయం
చిన్నిపాప నవ్వులోకి తృళ్ళిపడి బాల్యాన్ని వెనక్కి లాక్కుతెచ్చుకునే పసితనం
పుస్తకాలలోకి ప్రయాణం చేసి ప్రపంచాన్ని చుట్టువచ్చిన ధీరత్వం.
… … …
ఇలా ఎన్నెన్ని ఉన్నాయో కదా మనం కన్న కలలు… ఎక్కడ ఆగిపోయాయి అవన్నీ… ఎక్కడ ఘనీభవించాయి?
ప్రతి ఇష్టాన్నీ బయటికి తెచ్చుకుందాం.
మన రోజువారీ జీవితాల మరుగున మాయమైపోతున్న మన ఇష్టాలన్నిటికీ రోజుకో గంటో… రెండు గంటలో సమయాన్ని ఇవ్వగలిగితే… మన జీవితంలో మనమూ ఉన్నామన్న చిన్న తృప్తి ఒక్కటి దొరకదూ…!
మన అసలైన లైఫ్ దొరికేది అక్కడ కదా మరి!