దిశ మారిన మానవ దేహాలతో
దేశం ఇప్పుడు చిక్కబడుతోంది
శవాల దాహం తీరని కరోనాలా!
మత ఉన్మాదం శవాలను కూడా
వదలడంలేదు కరచుకున్న జలగల్లా
మనిషిని కులం పట్టి పీడిస్తోంది
భయమనే భయానక వైరస్సులా!
కుప్పలు తెప్పలుగా కొట్టుకొస్తున్న శవాలతో
యమున కళేబరాల దిబ్బయింది
ఇప్పుడు శ్మశానవాకిళ్ళన్నీ
ఉప్పెనతో ముంచిన సముద్రంలా
ఎగిసిపడుతున్నాయి
కార్పొరేట్ ఆసుపత్రులన్నీ
పెద్దోళ్ళ మధుమేహ హృదయాల్లా
ఉత్సాహ రేసులో ఉరకలేస్తున్నాయి
ప్రభుత్వ దవాఖానాలన్నీ
పేదోడి ఆఖరి శ్వాసను ఆస్వాదిస్తూ
పంచనామాలు చేస్తున్నాయి
కాపలాదారుడు శవాల కాళ్ళుపట్టి వరుసలో రమ్మని మరీ మరీ…
బతిమిలాడుకుంటున్నాడు
కాల్చడానికి కట్టెలు దొరకక
కన్నబిడ్డల కన్నీళ్ళ ఆర్తనాదాలన్నీ
కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాయి తల్లిదండ్రుల రణఘోర ధ్వనులు
వినబడకుండా పిల్లలందరూ
సెల్ఫ్ క్వారంటైన్ చేసుకున్నారు
తమవాళ్ళను పూడ్చి పెట్టడానికి ఆరడుగుల నేల దొరకడంలేదని
ప్రజలందరూ తమకు తామే
అధికారిక కర్ఫ్యూ విధించుకున్నారు సంబంధీకుల ప్రాణాలు పోయినా…
బంధువులందరూ భయంతో
తమ ఇళ్ళ తలుపులను గట్టిగా
మూసుకుంటున్నారు
కడచూపు దక్కని శవాలన్నీ
సామూహిక ఖననం కోసం విసిరివేయబడుతున్నాయి
తలంత బలగమున్నవాళ్ళు సైతం
ఊకుమ్మడిగా పైరవీలతో వచ్చి కాల్చివేయబడుతున్నారు
శవాలన్నీ ఇప్పుడు ఒకే… ఒక
గీతాన్ని ఆలపిస్తూ పొగచూరిన
ఆకాశంవైపు దూసుకెళ్తున్నాయి
భూమంతా ఇప్పుడు కరోనా శవాల
ఇంకిన గుంతయ్యింది..
చెక్కభజనలు చేసిన భక్తులిప్పుడు
పారవశ్యంతో నృత్యం చేస్తున్నారు
శవాల్లారా! వర్థిల్లండి! అంటూ…!
దేశ పెద్దలారా! జైహిందంటూ…!