ఇక్కడ రెండు ఫోటోలు జత పరుస్తున్నాను చూడండి. ఇవి రెండూ మా ఊరికి సంబంధించిన గూగుల్ మ్యాప్ చిత్రాలు. ఒకటి ప్రస్తుతం మా ఊరి సామాజిక, నైసర్గిక స్వరూపాన్ని చూపిస్తే మరొకటి ఊరి చుట్టుపక్కల భూములను చూపిస్తుంది.
ఊరి ఫోటోలో 1980లకు ముందు ఉన్న ఊరి స్వరూపాన్ని హైలైట్ చేసాను. శూద్రులూ, దళితులూ ఒక ఫర్లాంగు దూరంలో విడివిడిగా నివసించేవారు. దళితులున్న ఊరికి ప్రత్యేకమైన పేరేదీ లేదు. చుట్టుపక్కల వారు మాదిగ పల్లె అని పిలిస్తే, దూరాన ఉన్నవారు అగ్గురారం (అగ్రహారం) మాదిగపల్లె అని పిలిచేవారు. శూద్రులుండే ఊరిపేరు అధికారికంగా ‘కల్పనాయుని చెరువు’’, కానీ ఆ పక్కనే పాతూరుగా పిలవబడే ప్రాంతంలో ఒకప్పుడు బ్రాహ్మణులు నివసించడంతో దాన్ని అగ్రహారం అనేవారు. అదే పేరుతో ప్రస్తుతం ఉన్న ఊరినీ స్థానికంగా పిలుస్తారు.
ఈ పాతూరు అనబడే స్థలం ఒకప్పుడు బ్రాహ్మణులు నివసించి వదిలేసిన స్థలం గనుకనో, పాడుబడిన చోట మళ్ళీ ఇళ్ళు కట్టగూడదనే వాస్తు నియమాల వల్లనో అందులో 1980ల వరకూ ఎవరూ ఇల్లు కట్టుకోలేదు. అందులో కొంత భాగంలో వామిదొడ్ల కోసం నాలుగైదు సెంట్ల భూమిలో వరిగడ్డి వాములు, శనక్కాయ వాములూ వేసుకునేవారు. అలా కొంత భూమి పోయినా ఇంకా ముప్పాతిక వంతు భూమి ఎవరి ఆక్రమణలో లేకుండా ఉండేది. ఎవరన్నా తల్చుకుంటే అందులో ఇల్లు కట్టుకోవడానికి ఎవరికీ అభ్యంతరముండేది కాదు. అలా 90ల్లో మరో ఊరునుండీ వచ్చిన కుటుంబం ఇల్లు కట్టుకుని నివసిస్తోంది కూడా.
అప్పట్లో శూద్రుల ఊర్లో మూడిళ్ళకు తప్ప అందరికీ పూరిళ్ళే ఉండేవి. 1980ల చివర్లో తెలుగుదేశం ప్రభుత్వం పూరిల్లు ఉన్న అందరికీ ఇంటికొకరికి చొప్పున పక్కా ఇల్లు మంజూరు చేసింది. అప్పుడు ఆ పక్కా ఇళ్ళకు స్థలం ఎక్కడ ఇవ్వాలి అనుకున్నప్పుడు సహజంగానే అధికారులకు ఖాళీగా ఉన్న పాతూరు స్థలం కనబడిరది. కానీ ఎవరూ ఆ పాడుబడ్డ ఊరి స్థానంలో ఇళ్ళు కట్టుకోవడానికి సుముఖంగా లేరు. అప్పుడు ఈ శూద్రులు, దళితుల పల్లెలను వేరు చేస్తూ రాచమ్మ చేనును కొని ప్లాట్లు చేసి పంచి ఇచ్చింది ప్రభుత్వం. అప్పుడు కూడా దళితుల పల్లెను ఆనుకొని దళితులకూ, శూద్రుల పల్లెను ఆనుకొని శూద్రులకూ ఉండేలా రెండిరటికీ మధ్య రోడ్డు ఉండేలా విభజించి కేటాయించింది. దాంతో ఊరు పెద్దదయింది.
అయినా 90లు దాటి కొత్త శతాబ్దంలోకి అడుగు పెట్టేసరికి పెళ్ళయి వేరుపడిన కుటుంబాలతో ఊరు పెరుగుతూ వచ్చింది. ఒకరిద్దరు శూద్రులు పాతూరు అనే సెంటిమెంట్ వదిలేసి పాతూరులో కూడా ఇల్లు కట్టుకున్నారు. కానీ అక్కడ ఎవరికీ చెందని స్థలం లభ్యమవుతున్నా ఏ దళితుడూ అక్కడ ఇల్లు కట్టుకోలేదు. ఎవరికైనా కట్టుకోవాలని ఆలోచన వచ్చి ఉంటే శూద్రులు ఎలా స్పందించేవారో గానీ ఎవరికీ అసలా ఆలోచనే వచ్చినట్టు లేదు. ఆ పాతూరు స్థలంలోనే పక్కా పాఠశాల భవనం, అంగన్వాడీ భవనం, ఈ మధ్యనే కొత్తగా పంచాయితీ కార్యాలయ భవనమూ కట్టారు. ఏ ఒక్క భవనాన్నైనా దళితుల పల్లెకు ఆనుకుని కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికీ రాలేదు. ఆ పల్లెకూ, ఈ పల్లెకూ రాలేదు. వస్తే ఎలా ఉండేదో తెలియదు. రాన్రానూ భూమికి డిమాండు హెచ్చుతూ వచ్చింది. ఊరి చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ప్రతి అంగుళం భూమినీ శూద్రులు ఆక్రమించేసారు. దళితులు మాత్రం మొదట వాళ్ళు ఏ ఇళ్ళల్లో ఉన్నారో, ఆ తర్వాత ప్రభుత్వం 80ల్లో ఏ ఇళ్ళు ఇచ్చిందో వాటిని దాటి మరొక్క అంగుళం కూడా ఆక్రమించినట్టు నాకు తెలియదు. పైగా దళితుల పల్లెకు పడమరా, తూర్పునా బండలతో కూడినా ఖాళీ స్థలం ఉండేది. ఇప్పుడు ఊరంతా ఊపిరి సలపనీయకుండా అన్ని వైపుల నుండీ ముట్టడిరచినట్టు ఉంది.
ఆ ఖాళీ ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు కట్టుకోకుండా దళితులను ఆపిన శక్తి ఏది? పేదరికమా? కులమా? ప్రతి ప్రభుత్వ భవనమూ శూద్రుల వైపే అనాయాసంగా కట్టబడడానికి తోడ్పడిన శక్తి ఏది? కులమా? ధనమా?
ఇక రెండవ ఫోటో పరిశీలిద్దాం. ఇది మా గ్రామపు భూములు ప్రధానంగా ఉన్న ప్రాంతం. 1980ల వరకూ ఎరగొండ క్రింది ప్రాంతంలోనే ఏ వ్యవసాయమైనా నడిచేది. మ్యాప్‌లో పచ్చగా కనబడే ప్రాంతం వ్యవసాయ బావుల ఆధారంగా పండేది. ఎరుపుగా కనిపించేది కేవలం వర్షాధారితం. మేము వాటిని చేలు అంటాం. వర్షాకాలంలో కేవలం వేరుశెనగ వేసేవాళ్ళం. ఈ కొండకింది భూములన్నీ కూడా శూద్రుల చేతుల్లోనే ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. అప్పట్లో ఆ భూములేవీ శూద్రులు కొన్నవి కాదు. శూద్రులు వృత్తిగతంగా సాగు చేసుకుంటూ ఉండిన భూమిని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకే పట్టాలిచ్చారు. కొందరు అప్పులు తీర్చలేక వీటినే కోమట్లకు కుదువ పెట్టడం జరిగింది. ఈ శూద్రుల శ్రమను కోమట్లు పీల్చుకుంటే, ఈ శూద్రులు తమ కింద పనిచేసే దళితుల నుండీ పీల్చేవాళ్ళు.
ఇక ఎరగొండ పై భాగం (చ2) చిట్టడవిలా ఉండే ప్రభుత్వ బంజరు భూమి. రాళ్ళూ రప్పలూ ఉన్నా వ్యవసాయానికి అనువైనదే. మా తాతల టైంలో ఈ ప్రాంతంలోనే ఇంటికీ, వ్యవసాయానికీ కావలసిన కలప పుష్కలంగా దొరికేదట. రాన్రానూ అడవి కుచించుకుని వెనక్కు వెనక్కు పోయింది. 80లు, 90ల వరకూ ఈ ప్రాంతంలో ఆవులూ, ఎనుములూ, గొర్రెలూ, మేకలూ మేతకు వెళ్ళేవి. ఇక్కడే అడపా దడపా నేనూ ఆవులు మేపాను. ఈ ప్రాంతంలోనే ప్రభుత్వం మా ఊరి దళితులకు పట్టాలు ఇవ్వబోతే మా ఆవులు ఎక్కడ మేయాలి అంటూ దాన్ని వ్యతిరేకిస్తూ పెద్దలు అర్జీ రాయమంటే నేనే రాసాను. అయినా ప్రభుత్వం కొందరు దళితులకు పట్టాలు ఇచ్చింది. కానీ వారి దగ్గర అక్కడ వ్యవసాయం చేయడానికి కావలసిన పెట్టుబడి, సమయమూ లేక అలా బీడుగా వదిలేశారు. కానీ ఇప్పుడు నేను వింటున్నదాన్ని బట్టి అక్కడ దళితులకిచ్చిన పట్టా భూమి మినహాయించి మిగిలిన భూమిని రాజకీయ పలుకుబడి ఉన్న రెడ్లూ, శూద్రులూ గుట్టుచప్పుడు కాకుండా తమ తమ పేర్లతో రాయించుకున్నారని. ఇది ఎంతవరకు నిజమో పెరుమాళ్ళకెరుక. పేదలకూ, దళితులకూ ఇచ్చే సంక్షేమ పథకాల గురించి గుండెలు బాదుకునేవాళ్ళు ఈ కులబలుపు దోపిడీని ప్రశ్నించరు.
భూముల చరిత్ర బాగానే ఉంది మరి కులం గురించి ఎందుకూ అని మీరడగవచ్చు. బ్రిటిష్
వాళ్ళు పట్టాలిచ్చేనాటికి భూమిని కేవలం శూద్రులే ఎందుకు సాగుచేసుకుంటూ ఉన్నారు? వాళ్ళు శూద్రులు గనుక. అదే దళితుడు ఆ పని చేయగలిగేవాడా? లేదు.
దళితుడికి తానూ వ్యవసాయం చేయగలను అనే ఊహే రాదు. వచ్చింది పో… తనకు చేదోడుగా తన స్వంత కుటుంబమే నిలవకపోవచ్చు. తోటి శూద్రులు కులభ్రష్టమైన పని చేస్తున్నాడని వెలి వేయనూ వచ్చు, చంపేయనూ వచ్చు. కాబట్టి నాటికి దళితుడికున్న ఒకే ఒక ఆప్షన్ శూద్ర రైతు దగ్గర పాలేరులా జీతం లేకుండా పనిచేయడం. పుట్టిన నాటి నుంచి చచ్చేదాకా పనిచేసిన దళితుడికి దక్కేది తాగడానికి గంజి, పెట్టుకోవడానికి గోచీ, ఉండడానికి గుడిసె. మరి ఈ దళితుడి శ్రమంతా ఎలా పోయింది? అతడు పండిరచిన పంటంతా ఎవరి పాలయింది? శూద్రుడికి, ఆ శూద్రుడి ద్వారా కోమటికి చేరింది. ఇలా ఊటబావిలోంచి నీరు తోడుకున్నట్లు కోమటి, శూద్రుడి నుండి, శూద్రుడు దళితుడి నుండి శ్రమ అప్పనంగా దోచుకోబడడానికి కులమే దోహదకారి. ఆ శ్రమ దోపిడీకి బీసీ రిజర్వేషన్లు కూడా తోడయి నాలాంటి శూద్రులు ఆ ఊబి నుండి బయటపడితే, శ్రమను దోచుకోవడానికి తమ కింద మరే వర్గమూ లేని దళితులు ఆ చివరి ఘట్టంలోనే మిగిలిపోయారు. వారి శ్రమ దోపిడీలోంచి ఎదిగి, మరింత శ్రమను దోచుకునే స్థానంలో నిలబడి అయ్యో వాళ్ళకు ప్రభుత్వం అన్నీ ఉచితంగా ఇస్తుంది అని ఏడవడం దొంగే దొంగ, దొంగ అని అరవడం లాంటిది.