అలనాటి రచయిత్రి కోమలాదేవితో కాసేపు -వి. శాంతిప్రబోధ

ప్రేమ కథలు, నవలలు రాజ్యమేలుతున్న కాలంలో అందుకు భిన్నంగా రచనలు చేసిన రచయిత్రి గుర్తున్నారా…! ఆవిడ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆవిడేనండి అలనాటి రచయిత్రి కోమలాదేవి.

సాహిత్యం గురించి అంతగా పరిచయం లేని రోజుల్లో యద్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కోడూరి కౌసల్యాదేవి వంటి వారి నవలలతో పాటు కోమలాదేవి నవలల్నీ చదివాను. అప్పుడు నేను చదివిన నవలల రచయిత్రుల్లో ఒకరైన కోమలాదేవి గారిని కలవడం, దాదాపు గంటన్నర సేపు ఆవిడతో గడపడం మంచి జ్ఞాపకం.
కొత్తగూడెం బాలోత్సవ్‌ చిల్డ్రన్స్‌ కల్చరల్‌ సొసైటీ నిర్వహించిన కథ, కవిత కార్యశాలలో కథకి మెంటార్‌గా జనవరి 25న వెళ్ళాను. అప్పుడు సీనియర్‌ రచయిత్రి కోమలాదేవి గారు పాల్వంచ సమీపంలో ఉన్నారని శిరంశెట్టి కాంతారావు గారు చెప్పారు. ఆవిడని కలుసుకోవాలని ఉత్సాహపడ్డాం. జనవరి 26న మునిమాపువేళ నాతోపాటు అనిల్‌ డ్యానీ, ఇందూ రమణ, మండవ సుబ్బారావు గార్లను కోమలాదేవి గారి ముందుంచారు శిరంశెట్టి కాంతారావు గారు. మా ప్రయాణానికి ఏర్పాటు చేసి సహకరించారు వాసిరెడ్డి రమేష్‌ బాబు గారు.
అలా వెళ్ళి కోమలాదేవి గారితో మేము గడిపిన సమయాన్ని మీ ముందు ఉంచాలనిపించింది. మీరూ కాసేపు ఆ ముచ్చట్లలోకి ప్రయాణించి ఆనందిస్తారని ఈ ప్రయత్నం.
దాదాపు ముప్ఫై ఏళ్ళుగా సాహిత్య రంగానికి దూరంగా ఉన్న కోమలాదేవి గారిని మేం కలుసుకోవడం మాకెంత సంతోషంగా ఉందో ఆవిడకీ అంతే ఆనందం. ఆ వయసులోనూ ఆవిడ ఉత్సాహంగా చాలా విషయాలను మాతో పంచుకున్నారు.
నవలా సాహిత్యం రచయిత్రుల నుండి రచయితల చేతుల్లోకి మారుతున్న సమయం అది. నవలా సాహిత్యంలో అనేక కొత్త పోకడలు మొదలయ్యాయి. దట్టించిన మాల్‌ మసాలాలు వచ్చి చేరాయి. క్షుద్రపూజలు, మంత్ర తంత్రాలు భాగమయ్యాయి. ఆ క్రమంలో పబ్లిషర్స్‌ అటువంటి రచనలు చేయమని కోరడం మొదలైంది. పబ్లిషర్స్‌ కోరిన విధంగా రచనలు చేయడం ఇష్టం లేని రచయిత్రులు కలం కదపడం ఆపేశారు. రాస్తున్న పద్ధతిలోంచి పక్కకి వచ్చి, సడలింపులు చేసుకొని మారిన ట్రెండుకు అనుగుణంగా మసాలా దట్టించి రాయడానికి మనసొప్పని కోమలాదేవి కలం ఆగిపోయింది.
1958 నుంచి రాయడం మొదలుపెట్టిన కోమలాదేవి 1990 నాటికి పూర్తిగా రాయడం మానేశారు. ఈ మధ్య కాలంలో 22 నవలలు, 72 కథలు అచ్చయ్యాయి. అవి కాక దాదాపు పదిహేను కథలు, నవల అందుబాటులో లేనివి ఆవిడ కలం నుండి వెలువడ్డాయి. ఆంధ్రపత్రిక, జ్యోతి, ఆంధ్రప్రభల్లో నవలలు ధారావాహికలుగా వచ్చేయి. యువలో కథలు ఎక్కువ వచ్చేవి. భారతిలో వ్యాసాలు వచ్చేవి.
ఆ రోజుల్లోనే సరోగసీపై ఆవిడ నవల, కథ రాశారని తెలిసి ఆశ్చర్యపోయాం.
కోమలాదేవి గారి భర్త సైంటిస్ట్‌. ఆయన కృత్రిమ గర్భధారణ ద్వారా పందిపిల్లను పుట్టించారు. ఆ ప్రయోగం విజయవంతమైనప్పుడు ఆయన ఆ విషయాన్ని కోమలాదేవి గారితో పంచుకున్నారు. ఆ సంఘటన తర్వాత వచ్చిన ఆలోచన సరోగసీ గురించి రాయడానికి కారణమైందని అంటారు కోమలాదేవి. మనుషుల్లో కృత్రిమ గర్భధారణ జరిగితే వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనే ఆలోచన ఆ నవలను సృష్టించింది. కృత్రిమ గర్భధారణ పొందిన స్త్రీ, ఆ స్త్రీ ద్వారా బిడ్డను పొందాలనుకుంటున్న మహిళల మనోభావ చిత్రణ చేసిన నవల అది. ఆరాధన నవల ఆంధ్రజ్యోతిలోనూ, బంగారు పంజరం ఆంధ్రపత్రికలోనూ సీరియల్స్‌గా వచ్చాయి. బంగారు పంజరం సినిమా మీ కథేనా అని అడిగినప్పుడు, ఆ పేరుతో వచ్చిందట, కానీ కథ నాదో కాదో తెలియదు, నన్నెవరూ సంప్రదించలేదు, ఆ సినిమాను నేను చూడలేదు అన్నారామె. కోమలాదేవి నవలలను సినిమాలు తీస్తామని ఆ రోజుల్లో అడిగేవారు. రెండు వేలు, మూడు వేలు ఇస్తామని బేరసారాలు చేశారు కానీ ఆవిడ ఒప్పుకోలేదు. హక్కులు తీసేసుకుని తన రచనను వాళ్ళ ఇష్టప్రకారంగా మార్చేసుకుంటారని సినిమాలకు ఇవ్వలేదు.
ఆవిడ రాసిన కథలు ఎక్కువగా యువలో వచ్చేవి. హాస్యకథలను ఎమెస్కో వాళ్ళు ప్రచురించారు. అమెరికాలో
ఉన్నప్పుడు రాసిన కథలు తానా మ్యాగజైన్‌లో వచ్చేవి. జగజీవన్‌ పబ్లికేషన్స్‌, నంద్యాల, జ్యోతి పబ్లికేషన్స్‌, ఏలూరు రోడ్‌, విజయవాడ, శేషాచలం పబ్లికేషన్స్‌, ఎమెస్కో, ఎపిబిడి మొదలైన పబ్లిషర్స్‌ ఆవిడ పుస్తకాలను ప్రచురించారు.
అప్పట్లో పబ్లిషర్స్‌కి, రచయితలకి ఒక విధమైన సాన్నిహిత్యం ఉండేది. తెలిసిన వాళ్ళకే మా రచనలు పంపేవాళ్ళం. నాకు నార్త్‌ నుండి రావడానికి జిటి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్కటే ఉండేది. విజయవాడ పబ్లిషర్స్‌కి సెంటర్‌. నార్త్‌ నుండి వచ్చేటపుడు విజయవాడలో దిగేదాన్ని. అక్కడ మా అక్కయ్య ఉండేది. అప్పుడు పబ్లిషర్స్‌ని కలిసి మాట్లాడేదాన్నని ఆనాటి విషయాలను పంచుకున్నారు.
ఆవిడకి బాగా పేరు తెచ్చిన నవల బంగారు పంజరం. అయితే ఆవిడకి వ్యక్తిగతంగా తృప్తినిచ్చిన నవల ఆరాధన. ‘కాలువపడిరది’ కథను పాఠ్యపుస్తకంలో సిలబస్‌గా ఆంధ్ర రాష్ట్రంలో చేరుస్తున్నారు. తుంగభద్ర వచ్చినప్పుడు రాసిన కథ.
కర్నూలుకు చెందిన ఓబులేష్‌ గారు కోమలాదేవిగారి రచనలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి త్వరలో అవి నేటి పాఠకులకు, పరిశోధకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కోమలాదేవి కర్నూలు జిల్లాలో పుట్టారు కాబట్టి కర్నూలు వారు ఆమెను ఆ జిల్లా రచయిత్రిగా చెబుతారు.
మద్రాసులో 1952`54లో తెలుగు, ఇంగ్లీషు, చరిత్ర అంశాలుగా బి.ఎ. చదివారు. బి.ఎ. చదివేటప్పుడు ఒక రచయిత నాన్‌ డిటెయిల్‌గా ఉంటే ఆ రచయిత ఇతర రచనలన్నీ చదవాలి. అలాగే తెలుగులో కూడా… ప్రాచీన సాహిత్యాన్ని, ఇంగ్లీషు సాహిత్యాన్ని బాగా చదివారు. అందువల్ల కోమలాదేవికి తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యాలలో మంచి ప్రవేశం ఉంది. కాలేజీలో రచయిత్రి కె.రామలక్ష్మి సీనియర్‌ అయితే అరవిందగా అందరికీ తెలిసిన మణి, సి.ఆనందారామం ఆవిడ క్లాస్‌మేట్స్‌. కోమలాదేవి రాయడం చూసి ఆవిడ స్నేహితులు ఆనందారామం, అరవింద రాయడం మొదలుపెట్టారు.
కర్నూలులో టీచర్‌గా రెండేళ్ళు పనిచేసిన సమయంలోనే రాయడం మొదలుపెట్టారు కోమలాదేవి. అయితే అవి అచ్చవలేదు. ఆవిడ మొదట్లో కథని నోట్‌బుక్‌లో రాసేవారు. పేపర్‌కి రెండువైపులా రాసేవారు. అన్నీ తిరిగివచ్చేవి. ఎందుకు తిరిగి వస్తున్నాయో తెలియలేదు. అప్పుడు పత్రిక వాళ్ళు కథను తిప్పి పంపుతూ చిన్న నోట్‌ పెట్టారు. ఆ తర్వాత దాని ప్రకారం తిరిగి వచ్చిన కథల్నే మళ్ళీ పంపించారు. అవి అచ్చయ్యాయి.
పెళ్ళయి బరేలీకి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉండేవారు కోమలాదేవి. పిల్లలు ఇంకా పుట్టలేదు. అప్పుడు రాయడం ఎక్కువైంది. ఆవిడ రచనల్లో సరదాగా టైం పాస్‌ కోసం రాసేవి తక్కువ. చదివిన తర్వాత ఆలోచింపచేసే విధంగా రాశారు. ఇలాంటివి కూడా ఈ కాలంలో జరుగుతున్నాయా అని అలోచింపచేసే రచనలు చేశారు. సమాజాన్ని చూసిన సంఘటనల్లోంచి రాసేవారు. మనిషి`పశువు ఉంటే దేనికి ఖర్చు చేయాలి అనే ఘర్షణ తీసుకొని రాశారు. తాగుడుని ఒక స్త్రీ ఎలా భరిస్తుంది అనేది ఆనాటి కాల పరిస్థితులను బట్టి రాశారు. అప్పటి గర్వంగా ఉన్న స్త్రీ, సమస్యలను స్త్రీ ఎదుర్కోవడం… రోజువారీగా ఉన్న ఆ కాల పరిస్థితుల్లో మహిళ ఎలా తన సమస్యలు పరిష్కరించుకుంది, పేద కుటుంబాలలోని ఘర్షణ.. ఎలా సరిపెట్టుకుంటూ ముందుకు సాగుతారు, కాలేజీ జీవితం… ఆవిడ రచనల్లో కనిపించేవి.
అప్పట్లో ఐదో క్లాసులో ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయేవి. అమ్మాయిలు పెళ్ళి చేసుకుని స్కూల్‌కి వచ్చే కాలం అది. ఆడపిల్లలు చాలా తక్కువగా చదువుకునే రోజుల్లో కోమలాదేవి బి.ఎ, బి.ఇడి. చదివారు. అందుక్కారణం తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు కావడం. దాంతో కోమలాదేవి చదువుకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆ రోజుల్లోనే ఆవిడ తల్లి డాక్టర్‌, తండ్రి టీచర్‌, పెద్దన్న డాక్టర్‌, చిన్నన్న ఇంజనీర్‌.
1850 నుండి వారి కుటుంబంలోకి విద్యావంతులు రావడంతో కుటుంబంలో ఆడపిల్ల చదువుకు చాలా ప్రాముఖ్యం ఉంది. సైంటిస్ట్‌ అయిన భర్త సహకారం అందించే వ్యక్తి కావడం, అతని వృత్తిరీత్యా దేశమంతా తిరగడం, భర్తతో పాటు కొంతకాలం కెనడాలోనూ, మరికొంత కాలం అమెరికాలోనూ ఉండడం ఆమె దృష్టిని విశాలం చేశాయి. అందుకే ఆమె రచనలు సమకాలీన రచనలకు భిన్నంగా కనిపిస్తాయి.
ఆనాటి సమకాలీన సమాజ ప్రభావం, జరుగుతున్న ఉద్యమాల ప్రభావం కోమలాదేవి పైన ఎక్కువే. చెన్నైలో దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వైధవ్యం పొందిన మహిళలను బెనారస్‌లో మెట్రిక్‌ రాయించడం, 20% మార్కులు వచ్చినా ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి వాళ్ళకు పిఠాపురం మహారాజా కాలేజీలో సీటు ఇవ్వడం, ఆ కాలంలో బాల విధవలపై, ఆమె చదువుపై వచ్చిన రచనలు చదవడం కోమలాదేవిని ఆకర్షించేవి. బి.ఎ. చదివే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కోమలాదేవి అరవైలలో విపరీతంగా సాహితీసృజన చేశారు. అయితే ఈనాటి సాహితీ ధోరణులు, అస్తిత్వ వాదాలు తెలియదు. ఆనాటి సమాజంలో ఆధునిక భావజాలంతో ఆమె రచనలు సాగేవి. వాస్తవ సంఘటనలే ఆమె రచనా వస్తువులు కాబట్టి విమర్శలూ లేవు. భాష, శైలి విషయంలో పురాణం గారు మాత్రం కొన్ని సూచనలు చేశారు.
కోమలాదేవికి మొదటినుంచీ తెలుగంటే అభిమానం. ఉత్తర భారతదేశం వెళ్ళాక తెలుగు మీద మరింత అభిమానం పెరిగింది. తెలుగు బుక్‌ క్లబ్‌ నడిపేవారు. 18 తెలుగు కుటుంబాలు ఉండేవి. అందరూ సైంటిస్టుల కుటుంబాల వారే. తెలుగు పుస్తకాలు భారతి, యువ, జ్యోతి పత్రికలను తెప్పించుకునేవాళ్ళు. అమెరికాలో ఉన్నప్పుడు ఆంధ్రభాషా పత్రిక ప్రింట్‌ చేసి ఆరునెలలకొకసారి అమెరికాకు పంపించేవారు. అక్కడ వారు డిస్ట్రిబ్యూట్‌ చేసేవారు. అలా తెలుగుపై ఆమెకు ఎంతో మమకారం ఉండేది.
తెలుగు రాష్ట్రాల ఆవల ఎక్కువ జీవితం గడిపిన కోమలాదేవి ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చారు. తెలుగు ప్రాంతానికి దగ్గరగా వచ్చాక సంకరమై, దిగజారిపోయిన భాషను వినలేక టీవీ చూడడం మానేశారు ఆవిడ. ఏదో ప్రత్యేక సందర్భాల్లో తప్ప టీవీ చూడడం లేదన్నారు.
గత నాలుగేళ్ళుగా ఆవిడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో కూతురు, అల్లుడు దగ్గర నివాసముంటున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన అల్లుడు, కూతురు సామాజిక సేవలో ఉన్నారు.
అలనాటి సంగతులెన్నో మదిలో మూటగట్టుకుని, ఆవిడ రచనల ప్రతులను చూసి, వారి ఆతిధ్యం స్వీకరించి మా మా ఇళ్ళకు బయలుదేరాల్సిన సమయం దగ్గర పడుతుండడంతో ధన్యవాదాలు చెప్పి వెనుదిరిగాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.