చెంగలువలు విరిసే నీటి మడుగుల కావల, పడుచుపిల్ల పరికిణీలా వెదురు పొదలున్నాయి. వాటిని దాటుకొని పోతే, ఆడపిల్ల వంకీల జుట్టులా చిన్న గుట్టలున్నాయి. వాటిని ఎక్కి దిగితే నుదుటిమీద బొట్టులా ఒద్దికైన పల్లెటూరుంది. అది సంజమ్మ ఊరు.
సంజమ్మకు పెళ్ళి వయసొచ్చింది. సంగటీ సారకా జేసి ఇంట్లో అందరికీ పెట్టేది. అందరూ అంటే ఎందరో లేరు ఇంట్లో. వాళ్ళ అమ్మా, నాయిన అంతే. వాళ్ళ నాయిన వడ్రంగి పనిజేస్తాడు. వాళ్ళమ్మ పొలాల్లోకి కూలి పనికి పోతుంది. ఈ పిల్లంటే వాళ్ళకి భలే గోము.
వాళ్ళ నాయన పగలంతా సంజమ్మతో మాట కలుపుతూ ఇంటిముందే చెక్క పని చేసుకుంటూ ఉంటాడు. కాసేపు ఆ పిల్ల కనబడకపోతే ఆయనకు తోచదు. కానీ, సందకాడే తప్ప తాగి పిల్లకి, తల్లికి తిట్ల పురాణం వినిపిస్తాడు. తెల్లారి లేచి ఏమీ జరగనట్టు ఆ పిల్లతోనే లోకం. పిల్ల మౌనంగా ఉంటే చిన్నబోతాడు. కారణం తెలుసు గానీ బతుకున మార్చుకోలేని బలహీనతది. మనిషిని నిలువెల్లా నీరుగార్చే వ్యసనమది.
ఒక శుభ ఘడియన వాళ్ళ మేనమామ చంద్రునితో, సంజమ్మకు పెళ్ళి జరుగుతుంది బంతిపూల తోటకు తుమ్మెదలొచ్చినట్లు. వెదురు పొదల మాటున పగలే కలువల్ని పూయించాడు చంద్రుడు. సంధ్యవేళ సరాగాల్ని, మబ్బుతెరల్లో మత్తును, వేకువ వెన్నెల్లో వసంత పరిమళాన్ని సంజమ్మకు చూపించాడు చంద్రుడు.
వాళ్ళ పర్ణశాలకు ముద్దులొలికే పాపడు కూడా వచ్చాడు. తాతయ్య వాడికోసం చెక్క ఊయల చెక్కి తాగి తాగి శాశ్వతంగా నిష్క్రమిస్తాడు. నిలువెత్తు మనిషి, శారీరకంగా దృఢంగా ఉన్న మనిషిని మద్యం మింగేసిందని తల్లీ, బిడ్డా ఏడ్చారు. తాతయ్య పేరే పిల్లాడికి పెట్టారు సూర్యుడని. పిల్లాడి ముద్దూ ముచ్చట మధ్యలోనే ఆపేసి అమ్మమ్మ కూడా లోకం నుంచీ వైదొలుగుతుంది.
చంద్రుడు చెక్క పనిలో నిమగ్నమయ్యాడు. నైపుణ్యం సంతరించుకుంటాడు. బావిలో కప్పలా గుట్టల కింద మారుమూల పల్లెలో బతకలేక పట్టణానికి మకాం మార్చి పర్ణశాలను శాశ్వతంగా వదిలేస్తారు.
హరితవనాన్ని వదిలేసిన ఎడారి కోయిల్లాగా సంజమ్మ జీవితంలో మధుమాసపు ఊసు కరువైంది. కొత్త మనుషులు, మనస్తత్వాలూ, పరిసరాలు ఇవేమీ ఆమెకు నచ్చలేదు. ఏటిలోని చేప ఒడ్డున పడి గిలగిలా తన్నుకున్నట్లయింది. పిల్లాడు సూరితో కాలం నెట్టుతోంది.
చేతినిండా పని, డబ్బులూ, కొత్త స్నేహాలు, కొంగ్రొత్త అలవాట్లతో చంద్రుని లోకం మరో లోకమైంది. ఇల్లు పట్టకుండా తిరుగుడైంది. ముగ్గులేని ముంగిలిలా సంజమ్మ జీవితం బోసిపోయింది.
పొద్దున మాయమైన చంద్రుడు ఏ అపరాత్రో మత్తులో జోగుతూ ఇంటికొస్తాడు. సంజమ్మ ధ్యాసే లేదాయనకు. పిల్లాడంటే పట్టదు. వాడికి తండ్రి ప్రేమ కరువైంది. ఎప్పుడూ తాగుడూ వాగుడే. తాగేకి మాత్రం నాల్గు రాళ్ళు సంపాదిస్తాడు. అవి చేతిలో పడగానే కడుపులోకి ద్రావకం పోసుకొని లోకాన్ని మరిచిపోతాడు.
ఇంట్లో కూడూ గుడ్డక్కూడా నాల్గు రాళ్ళు విదిలించేది మర్చిపోయినాడు. ఇక పని చెయ్యలేని బలహీనుడయ్యాడు. ఏ రోడ్డు మీదో తూలి పడిపోతే రాత్రికి సంజమ్మ ఇంటికి మోసుకొస్తుంది.
సంజమ్మ బతుకు బండలైంది. ఇక పిల్లాణ్ణి పస్తులు పెట్టలేక, చుట్టుపక్కల ఇళ్ళల్లో పాచిపనికి పోయి బతుకుతోంది. తాగేకి డబ్బులిమ్మని సంజమ్మని చితక బాదేవాడు. శారీరకంగా, మానసికంగా ఎంతో కృశించింది. ఆమెకి ఊరెళ్ళి పోదామనిపించేది గానీ, పిల్లాడి చదువు కోసం ఆ ఆలోచన విరమించింది.
తప్పతాగి తూలి ట్రక్కు కిందపడి చంద్రుడు కన్నుమూస్తాడు. సంజమ్మ హృదయం సంద్రమై ఘోషించింది. అచ్చం చందమామలాగుండే చంద్రున్ని, పట్టణం పొట్టన పెట్టుకుందని కుమిలి కుమిలి ఏడ్చింది.
తాగుడికి తన తండ్రి, భర్త ఇద్దరూ బలైనారు. ఆ మాటే అందరికీ చెప్పి చెప్పి ఏడ్చేది సంజమ్మ. ‘ఈ సారాయి మింద బండబడా’యని రోజుకో వెయ్యిసార్లు తిట్టుకునేది.
సూర్యుణ్ణి బళ్ళో చేర్పించింది. ఇళ్ళ పనులు చేసే చోట మంచిగా, మర్యాదగా నడుచుకొని, పిల్లాడికి వాళ్ళతోనే ట్యూషన్ చెప్పించి, చదువు పట్ల ఆసక్తి కల్గించింది. నోరు మంచిదైతే, ఊరు మంచిదైతాది. ఎవరేం పని చెప్పినా కాదూ గూడదని అనక అన్నీ చేసి మెప్పించేది. సంజమ్మంటే అందరికీ ఇష్టమే. ఎప్పుడు డబ్బవసరమైనా ఇచ్చేవాళ్ళున్నారు. ఎంతో నీతి నిజాయితీగా బతికేది. ఆమె ప్రాణం, లోకం, జీవితం, భవితం అన్నీ పిల్లాడే. మనోవ్యథతో, పనితో అకాల వృద్ధాప్యం వచ్చిందామెకు.
పిల్లాడు చదువులో అందె వేసిన చెయ్యి. ఖర్చులు గూడ ఎక్కువయ్యాయి. అందుకే ఇండ్ల పనేగాక, సంజమ్మకి కనిపించిన వ్యాపారాలన్నీ చేసి నాల్గురాల్లు వెనకేసుకునేది. ఒకసారి పండ్ల వ్యాపారం, ఒకనాడు కూరగాయల వ్యాపారం, ఒకనాడు కొబ్బరి చీపుర్ల వ్యాపారం చేసేది. అష్టకష్టాలు పడిరది. శరీరాన్ని ఎండా వానకు సానపెట్టింది. పని పని పని. కాళ్ళ నొప్పులు, కండ్లు కనపడవు. అదే పనిగా పనిచేసేది, పిల్లాడి కోసం.
సూర్యుడు చదువులో ఎంతో ప్రకాశించాడు. తల్లంటే ప్రేమ. ‘నాకు ఉద్యోగం వచ్చాక నువ్వు ఏ పనీ చేయక ఇంట్లోనే రెస్ట్ తీసుకో’ అని అనేవాడు. అందుకామె ఎంతో సంబరపడిపోయేది. ‘ఈ కష్టం నాకేం కష్టం నాయనా, తల్లికి పిల్ల భారమా’యని అనేది.
‘ఎదురు చూసిన పుష్కరాలెదురైనట్టు’ చదువు ముగిసి ఉద్యోగం వచ్చింది సూర్యునికి. పుత్రోత్సాహం మిన్నంటిందామెకు. పుత్రుడు గుణవంతుడు కదా!
అన్న మాట ప్రకారమే తల్లితో పని మాన్పించాడు. శారీరకంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంది. ఉద్యోగం అయ్యాక సాయం సంధ్యలో అమ్మతో కబుర్లు చెప్పేవాడు. తల్లిని తీసుకుని ఊరంతా తిప్పేవాడు. గుళ్ళు గోపురాలన్నీ చూపించాడు. జీవితం సఫలమైందని మురిసిపోయింది ముసలి ప్రాణం. కానీ, అది మూణ్ణాళ్ళ ముచ్చటే.
రాను రాను ఆలస్యంగా ఇల్లు చేరటం అలవాటైంది సూర్యునికి. ఒక్కోరోజు ఇంటికి రాడు. ఒకరోజు ఆలస్యంగా వచ్చిన కొడుకును మందలించాలని సంజమ్మ మేలుకొనే ఉండి, తలుపు తీసింది. గుప్పుమని బ్రాందీ కంపు… మిన్ను విరిగి మీద పడ్డట్టు, భూమి కంపించి అడ్డంగా చీలిపోయినట్టయ్యిందామకు. తన కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందని గుండె బాదుకుని కుప్పకూలిపోయింది.
ఇది మూడో తరం. ప్రతి తరంలోనూ మగాళ్ళు తాగి తాగి తల్లుల్ని, భార్యా బిడ్డల్ని అష్టకష్టాల పాల్జేసినారు. ఇలా ఎన్నో సూర్యుల్ని మబ్బులు మింగేశాయి. ఇంకా మింగేస్తూనే
ఉన్నాయి. ఎన్నాళ్ళిలా? దాని అంతం కోసం ఆలోచిద్దాం మనమందరం.
ప్రభుత్వాల్ని పరిపుష్టి చేసి ముందుకు నడిపే అక్షయ పాత్ర ఈ లిక్కర్ లోకం.
చేజేతులా చేతిలో కూటిని నేలపాలు చేసుకునే తెలివి తక్కువవి కాదు ఈ వ్యవస్థలు. ప్రజలెంత తాగితే అంత బలం ప్రభుత్వాలకు.