ఇగో -తిరునగరి దేవకీదేవి

సాయంకాలం నాలుగు కావస్తోంది. సెలవులకు తెర పడిరది. పిల్లలకు మళ్ళీ ఉద్యోగ పర్వం… తిరుగుముఖం కాక తప్పలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ బిందుకు అలసట తెలిసి రాలేదు. నెల రోజుల తర్వాత మధ్యాహ్నం నడుం వాల్చే అవకాశం దొరికింది. సాయంత్రం

ఐదవుతున్నా మెలకువ రాలేదు. పేపర్‌ను ఎ టు జెడ్‌ తిరగేసిన నీరజ్‌ మెల్లిగా బెడ్రూం వైపు తొంగి చూశాడు. బిందు లేచిన జాడ కనబడలేదు. తేనీటి కోసం ఆయన ఆత్మారాముడు అఘోరించడంతో నెమ్మదిగా బెడ్రూం వైపు కదిలి ‘బిందూ చాయ్‌ చేసుకుందామా?’ అంటూ ఓ బాణం విసిరాడు. ఇక లేవక తప్పదురా భగవంతుడా అనుకుంటూ ఒళ్ళు విరుస్తూ లేచిన బిందు ‘‘ఆ బహువచనమెందుకో? మీరే చెయ్యకూడదూ?’’ అంది నవ్వుతూ. అది టీ కావాలి అని నీరజ్‌ అడిగే స్టైలని బిందుకు తెలుసు. పతిదేవుడి ఆత్మారాముణ్ణి శాంతిపచేయక తప్పదనుకుని బద్దకానికి వీడ్కోలు చెప్తూ మంచాన్ని వీడి వంటింటి వైపు నడిచింది. పది నిమిషాల్లో టీ కప్పులతో నీరజ్‌ ముందు ప్రత్యక్షమైంది. టీ కప్పు చూడడంతో నీరజ్‌ మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోవడమే కాదు బిందుకు ఆ కప్పును ఇచ్చే అవకాశం ఇవ్వకుండా గబుక్కున దాన్ని స్వాధీనపరచుకున్నాడు. టీ అంటే ఆయనకున్న టెంప్టేషన్‌ అది మరి. తనూ చాయ్‌ తాగుతూ సోఫాలో కూర్చుండిపోయింది బిందు. నీరజ్‌ చేతిలో రిమోట్‌ అదే పనిగా ఛానళ్ళను మారుస్తోంది.
‘నీరజ్‌! ఆగండి. ఛానల్‌ మార్చొద్దు’ అన్న బిందు మాటకు నీరజ్‌ చేతిలో రిమోట్‌ టక్కున ఆగిపోయింది. 10 టివిలో గృహ హింసపై చర్చా కార్యక్రమం కనబడిరది. ఇద్దరూ ఆ కార్యక్రమంలో లీనమైపోయారు ఆ అరగంట టైం తెలియనంతగా.
‘‘కాలానుగుణంగా పరిస్థితుల్లో ఎన్నో మార్పులు. ఐనా మగవాడి బుద్ధి మారను గాక మారదు కదా!’’ అంది బిందు అక్కసుగా.
‘‘కాదని ఎవరన్నారు తల్లీ! ఐనా అందర్నీ ఒకే గాటన కడ్తే ఎట్లా?’’ అన్నాడు నీరజ్‌ నవ్వుతూ.
‘‘మిమ్మల్ని అనలేదు మహాప్రభో! సమాజంలో జరుగుతున్నదాన్ని చెప్తున్నా’’ అని బిందు అంటుండగా కాలింగ్‌ బెల్‌ మోత వాళ్ళ వాదనకు బ్రేక్‌ వేసింది. తలుపు తెరిచిన బిందుకు బాల్య స్నేహితురాలు వసంత దర్శనమిచ్చింది. చాలా రోజులకు వచ్చిన స్నేహితురాలిని చూసిన బిందు తెగ సంతోషపడుతూ గట్టిగా వాటేసుకుంది. ‘‘ఏమండీ వసంతగారూ! మీ స్నేహాన్ని పంచుకోవడానికి, మాట్లాడడానికి మేమూ ఉన్నామండోయ్‌’’ అన్న నీరజ్‌ మాటలకు వాళ్ళిద్దరూ ఈ లోకంలోకొచ్చారు.
‘‘ఏంటే, చాలా రోజులైంది నిన్ను చూసి. క్షేమమా? పిల్లలు, మీ ఆయనా బాగున్నారా? ఏంటి విశేషాలు?’’ అంటూ గుక్కతిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించింది బిందు.
‘‘ఎంత సంతోషమైతే మాత్రం ఆమె మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఏంటా ప్రశ్నలు’’ అంటూ బిందును సన్నగా మందలించి ‘‘వసంత గారూ! మీరు ముందు కూర్చోండి’’ అన్నాడు నీరజ్‌.
‘‘అది కాదండీ… ఎన్ని రోజులైందో దీన్ని చూసి’’ అంటూ బాటిల్‌ మూత తీసి మంచినీళ్ళిచ్చింది తాగడానికి. ఓ ఐదు నిమిషాల్లో ఇద్దరూ సోఫాలో సెటిలయ్యారు. అంతా నీరజ్‌, బిందులు మాట్లాడడం తప్ప వసంత నోటి నుండి ఒక్క మాట పెగల్లేదు. ఆమె మొహం పాలిపోయి ఉంది. ఎంతసేపటికీ మాట్లాడకపోవడంతో బిందు ఆమె వైఖరిని గమనిస్తూ ‘‘ఏంటే బానే ఉన్నావా? ఏంటి సంగతులు?’’ అని తర్కించి అడిగింది. ఐనా వసంత గొంతు పెగల్లేదు. ఆమెను కదిలించడమెట్లా అని ఆలోచిస్తున్న బిందును మళ్ళీ కాలింగ్‌ బెల్‌ డిస్టర్బ్‌ చేయడంతో ‘‘ఎవరై ఉంటారబ్బా’’ అని ఆలోచిస్తూ తలుపు తీసింది. ఉరుము లేని మెరుపులా మరో స్నేహితురాలు చైతన్య. ఇక బిందు సంతోషానికి అవధుల్లేవు. ముచ్చటగా ముగ్గురు స్నేహితులు కాసేపు పాత కబుర్లతో కాలక్షేపం చేశారు. ఐతే మాట్లాడిరది మాత్రం ఇద్దరే. వసంత మాత్రం ఊఁ ఆఁ లకు పరిమితమై పోయింది. చైతన్య, బిందులు ఆ విషయాన్ని గమనించకపోలేదు.
‘‘బిందూ మీ స్నేహితుల కడుపులను మాటలతోనే నింపుతావా? ఏదైనా పెట్టేదుందా?’’ అన్న నీరజ్‌తో ‘‘మేం స్నేహితులం మాట్లాడుకుంటున్నాం. ఆ పనేదో మీరు చెయ్యొచ్చు కదా!’’ అంది బిందు.
‘‘ఓకే బిందు మేడమ్‌. టీ పని మాత్రం మీరే చూసుకోండి. నేను టీ చేశానంటే మీ ఫ్రెండ్స్‌ టీని కాశీలో వదిలేసి వస్తారు’’ అంటూ డైనింగ్‌ రూం వైపుగా నడిచిన నీరజ్‌ సకినాలు, మురుకుల ప్లేటును తెచ్చి టీపాయ్‌ మీద ఉంచాడు ఆరగించండంటూ. వాటిని తింటూనే చైతన్య, బిందులు వసంతను ఆమె దిగులుకు కారణం చెప్పమని ఒత్తిడి చేశారు. వసంత చెప్పడం మొదలుపెట్టింది.
… … …
వారం రోజుల క్రితం మా చిన్న మామగారి మనవడి పెళ్ళి ప్రయాణం. ఎనిమిదింటికల్లా హడావుడిగా స్టేషన్‌లో అడుగుపెడుతున్నామో లేదో ‘‘వికారాబాద్‌ నుండి మైదరాబాద్‌ వెళ్ళవలసిన రైలు సుమారు ముప్ఫై నిమిషాలు ఆలస్యంగా రావచ్చును’’ అన్న అనౌన్స్‌మెంట్‌ విని హతాశులమయ్యాం. ఏం చేస్తాం? నా అడుగులు వెయిటింగ్‌ హాల్‌వైపు మా ఆయన అడుగులు బుక్‌ స్టాల్‌ వైపు కదిలాయి. సెల్‌ఫోన్‌ చేతిలో ఉండగా టైం పాస్‌కేం కొదవా? వాట్సాప్‌ చూస్తూ కూర్చున్నా. అరగంట టైం ఆరు నిమిషాల్లా గడిచిపోయాయి. ఠంచనుగా మళ్ళీ అనౌన్స్‌మెంట్‌, ట్రెయిన్‌ మూడవ ప్లాట్‌ఫాం మీదికి వస్తున్నట్లు. థర్డ్‌ ప్లాట్‌ఫాం అంటే ఫ్లై ఓవర్‌ ఎక్కాల్సిందే. నాకు గాభరా ఎక్కువైంది. వెయిటింగ్‌ హాల్‌ నుండి బయటకు నడిచి ఆయన కోసం అటూ ఇటూ చూశా. మనిషి జాడ కనపడలేదు. ట్రెయిన్‌ వచ్చేలోపు చేరుకోవాలి. కాళ్ళ నొప్పులు. స్పీడుగా నడవలేను. ఏం చెయ్యాలనే ఆలోచనలో పడ్డా. మొదట ఫ్లై ఓవర్‌ ఎక్కడానికి తటపటాయించా. రెండు నిమిషాల్లో చేరుకునే ఆయన కోసం నేను వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదని నా మనసు చెప్పింది. నేను ఫ్లై ఓవర్‌ వైపు కదిలా. ట్రెయిన్‌ రానే వచ్చింది. అది సూపర్‌ఫాస్ట్‌ ట్రెయిన్‌. రెండు నిమిషాలే ఆగుతుంది. మళ్ళీ నా కళ్ళు అతని కోసం వెతికినై. ఫ్లై ఓవర్‌ ఎక్కుతున్న మహానుభావుడు కనబడ్డాడు. గార్డు పచ్చజెండా ఊపుతున్నాడు. ఇక లాభం లేదనుకొని నాకెదురుగా ఉన్న బోగీలో ఎక్కాను ఆయన ఎక్కగలడన్న ధీమాతో. ట్రెయిన్‌ స్టార్ట్‌ అయింది. క్రమంగా స్పీడందుకుంది నా ఆలోచనలతో పాటుగా. ఆయన తత్వం తెలిసిన దాన్ని. అనుమానాల పుట్ట. తుఫాన్లు సృష్టించడంలో దిట్ట. అందుకే రాబోయే తుఫాన్‌ను ఊహిస్తూ భయం భయంగా ముళ్ళకంచె మీద కూర్చున్నంత అసౌకర్యంగా కూర్చున్నా. ప్రయాణికులందరూ బిలబిలమంటూ దిగుతుండడంతో ఈ లోకంలోకి వచ్చా. కిటికీలోంచి తొంగి చూద్దును కదా! నాంపల్లి స్టేషన్‌. దిగ్గున లేచి బ్యాగ్‌ తీసుకుని డోర్‌వైపు కదిలా. ఆశ్చర్యం. నా వెనకాల ఎక్స్‌ కొలీగ్‌ మాధవ్‌. బ్యాగ్‌ కొంచెం బరువుగా అనిపించి దాన్ని అక్కడే పెట్టి ముందు నేను దిగాను. ఆ బ్యాగ్‌ను అందిస్తూ ఓ పలకరింపు విసిరేసి తన మానాన తను వెళ్ళిపోయాడా మహానుభావుడు. నేను వెనక్కి తిరిగి చూద్దును కదా! ఉగ్రరూపంతో మా ఆయన.
ముందే కోతి, ఆ పై కల్లు తాగింది అన్నట్లు ఆ సన్నివేశం నన్ను వేధించుకు తినడానికి కారణమైంది. ‘‘ఎవడు వాడు? నీ బాయ్‌ ఫ్రెండా? ఎప్పటినుంచి ఈ భాగోతం నడుస్తోంది?’’ అంటూ రకరకాల ప్రశ్నలతో నన్ను వేధించుకు తింటున్నాడు. ఆ వేధింపులు శృతి మించి రాగాన పడ్డాయి. అసలు బతుకు మీదే విరక్తి పుట్టింది’’ అంటూ చెప్పుకొచ్చింది వసంత. వింటున్న చైతన్య, బిందు, నీరజ్‌లు ఓ పెద్ద నిట్టూర్పు విడిచారు. ఒక్కసారిగా బిందు గతంలోకి వెళ్ళిపోయింది.
… … …
‘‘వలదన్న వినదే మనసు. అతని వెంటే పరుగులు. ఆ గాంభీర్యం, ఆ చిరునవ్వు, ఆ చలాకీతనం, సున్నిత హాస్యం, వాటిని స్వంతం చేసుకోవాలి. చేసుకొని తీరాలి. ఇంకెన్నాళ్ళో ఈ నిరీక్షణ. మా ప్రేమ విషయం మామయ్యకు చెప్పాలి. ఏంటో చెప్పాలనే ఆలోచన రాగానే గుండె దడదడ. చేతులు చల్లగా… చెప్పలేని ఉద్వేగం… ఒంట్లో వణుకు, భయం కూడా. నేనేం తప్పు చేయడం లేదే? ఎందుకీ సంచలనం. ప్రేమ పక్షులందరి పరిస్థితి ఇంతేనా? తండ్రిలేని నన్ను తండ్రికన్నా ఎక్కువ ప్రేమతో పెంచారు కదా! మామయ్య స్వంత అభిప్రాయాలకు, వ్యక్తిత్వానికి విలువనిస్తారు కూడా! మరి నేనెందుకింతగా భయపడటం.’’ రకరకాలుగా ఆలోచిస్తున్న బిందుకు ట్రెయిన్‌ ఆగిందన్న విషయమే తెలియలేదు. ‘‘ఒంటి గంటకల్లా సుదర్శన్‌ టాకీస్‌కు వచ్చెయ్‌. శుభలేఖ సినిమా చూద్దాం’’ అని చెప్పాడు నీరజ్‌. కానీ ట్రెయిన్‌లో పదకొండుకల్లా స్టేషన్‌లో దిగిన బిందుకు ఏం చేయాలో తోచలేదు. బస్టాండ్‌ వైపుగా నడుస్తూనే ఆ రెండు గంటల కాలాన్ని గడపడమెట్లా అన్న ఆలోచనలో పడిరది. హైదరాబాద్‌లో పెద్దగా ఏ ప్రాంతంతో పరిచయం లేదు. బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి. తలెత్తి చూసిన బిందుకు ఎదురుగా 136 నంబర్‌ బస్సు. దాన్ని చూడగానే తన బాల్య స్నేహితురాలు కీర్తి వాళ్ళింటికి వెళ్ళొచ్చనే ఆలోచన తళుక్కున మెరిసింది. 136 ఎక్కితే సుధ హోటల్‌ దగ్గర దిగి ఆ లేన్‌లో కరెక్ట్‌గా ఎడంవైపు పదో ఇల్లు కీర్తి వాళ్ళది. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళింటికి వెళ్ళిపోవచ్చు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ బస్సెక్కడమే కాదు ఓ అరగంటలో కీర్తి వాళ్ళిల్లు చేరుకుంది కూడా. గేట్‌ దగ్గరే ప్రత్యక్షమైంది కీర్తి వాళ్ళాయన్ని ఆఫీసుకి పంపిస్తూ. చాలా రోజులకు బిందును చూసిన కీర్తి ఆనందం పట్టలేకపోయింది. వాకిట్లోనే గట్టిగా వాటేసుకుంది. ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఓ నిమిషం పాటు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు. ‘‘అమ్మా పోతున్నా’’ అన్న పనిమనిషి పిలుపు వాళ్ళను విడదీసింది.
‘‘ఏంటే? చాలా రోజులకు దయ తలిచావు’’ లోపలికి దారితీస్తూ అంది కీర్తి.
‘‘నువ్వేమో సంసారంలో మునిగె. నేనేమో అకడమిక్‌ పనుల్లో తలమునకలైనా’’ అంది బిందు.
‘‘తప్పదు కదా! నానమ్మ పట్టుదల, బరువు దించుకోవాలన్న ఆలోచన. పెళ్ళి, పిల్లలు, సంసారం… జీవితానికి సరిపడా అనుభవాలు. అన్నీ ఇరవయ్యయిదేండ్లలో…’’ నిట్టూరుస్తూ అంది కీర్తి.
‘‘ఇంతకీ నువ్వెప్పుడు పప్పన్నం పెడుతున్నావ్‌?’’ అంది కీర్తి.
‘‘అమ్మా, నాన్న క్షేమమేనా? వాళ్ళను చూసి కూడా చాలారోజులైంది’’ అంది బిందు కీర్తి మాటను దాటవేస్తూ. కావాలనే తన ప్రశ్నకు సమాధానమివ్వలేదని, ఏదో దాస్తోందని కీర్తికి అర్థమైంది. ముఖకవళికల్లో మార్పునూ గమనించింది. టిఫిన్‌ చేస్తూ మాట్లాడొచ్చులే అనుకొని ‘‘ఆత్మారాముడు తొందర పెడుతున్నాడు రావే’’ అంటూ బిందును పిలిచి వంటింటివైపు అడుగులేసింది కీర్తి.
‘‘అదేంటి? నువ్వింకా టిఫిన్‌ చెయ్యలేదా?’’
‘‘పిల్లలను, ఆయన్ను పంపించేసరికి తల ప్రాణం తోకకొస్తుందనుకో. ఎక్కడి వాళ్ళక్కడ జారుకున్నాకే…’’
‘‘పద్దెనిమిదేళ్ళకే పెళ్ళి చేయడంతో ఆంటీ, అంకుల్‌ బరువు తీరింది, నీకు బరువు పెరిగింది. బరువు స్థానం మారిందంతే’’
‘‘నాకు బరువు పెంచాలని వాళ్ళ ఉద్దేశ్యం కాదనుకో. నా వెనుక ముగ్గురి చెల్లెళ్ళ పెళ్ళి చేయాల్సిన బాధ్యత. అత్తెసరు సంసారాలు. ఆలస్యం అమృతమనుకోలేదు, విషం కాకూడదనుకున్నారు’’ చెప్పింది భారంగా… ఐనా మంచి అవగాహనతో. ఓ పది నిమిషాల్లో రెండు ప్లేట్లలో దోసెలు వేసింది. బిందు అక్కడే గిన్నెలో ఉన్న కొబ్బరి చట్నీ వడ్డించింది ఇద్దరికీ. టిఫిన్‌ చేస్తూ కబుర్లలోకి దిగిపోయారిద్దరూ.
‘‘ఇంతకీ నీ మనసు దోచుకున్న నాయక శిఖామణి ఎవరే?’’ అన్న కీర్తి ప్రశ్నకు బిందు బిత్తరపోయింది.
‘‘చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేననుకున్నావా?’’
‘‘నువ్వు చెప్పలేకపోవడమేంటీ… ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టేదానివి’’.
‘‘సరేలే… అసలు విషయం చెప్పు’’
‘‘నా కొలీగ్‌… నీరజ్‌. మాథమెటిక్స్‌ లెక్చరర్‌.’’
‘‘ఓ… ఆయన ప్రేమలో పడ్డావన్నమాట’’
‘‘అది ప్రేమో… ఇష్టమో… వ్యక్తిత్వం పట్ల ఉన్న గౌరవమో… నమ్మకమో… లేదా అన్నీ కలిసో ఇదమిద్దంగా చెప్పలేను…’’ అంది భార్గవి కొంత భావోద్వేగానికి లోనవుతూ.
‘‘ఐతే పరస్పర అంగీకారాలయ్యాయన్నమాట’’
‘‘మేమిద్దరమూ ఓ నిర్ణయానికి వచ్చాం. పెద్దవాళ్ళ అంగీకారం మిగిలే ఉంది. చెప్పడానికేదో జంకు. ఆ సందేహంలో కొట్టుమిట్టాడుతున్నా’’ అంది బిందు.
‘‘నీ పరిస్థితి నాకర్థమైంది. అది సహజం కూడా. మీ వాళ్ళంగీకరిస్తారనే నమ్మకం నాకుంది’’ ‘‘నేనూ అదే అనుకుంటున్నా. అంగీకరించక వాళ్ళు చేయగలిగిందేదీ లేదు. నాకంటూ ఓ సంబంధం చూసి కట్నకానుకలిచ్చి చేయగలిగిన స్థోమత వాళ్ళకు లేదు. ఉద్యోగం దొరికింది కదా నువ్విచ్చుకోలేవా? అంటే ఈ రెండేళ్ళు నేను స్థిరపడుతూనే వాళ్ళకు అండగా ఉంటున్నా. నీకు తెలియందేముంది. అమ్మా, నాన్నలకు నా సపోర్ట్‌ను అంగీకరించే వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలని నా ఉద్దేశ్యం’’ అంది బిందు.
‘‘మీ నాయకుడు ఒప్పుకుంటాడంటావా?’’
‘‘ఆడవాళ్ళకు ఆస్తి హక్కంటూ అడుగుతున్న అభ్యుదయ వాదులు బాధ్యతలను కూడా భరించాలి కదా! ఆయన సహృదయుడు. అన్నీ చర్చించుకునే పెళ్ళి నిర్ణయానికి వచ్చాం’’ అంది బిందు.
‘‘నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వో మోడల్‌ మహిళవు. చదువుకుంటూనే హోం ట్యూషన్స్‌ చెప్తూ నీ తల్లిదండ్రులకు అండగా ఉన్నావు. వాళ్ళకెప్పుడూ ధైర్యాన్నిచ్చావే తప్ప భారమనే ఆలోచన రానీయలేదు’’ అంది కీర్తి.
‘‘అందుకు మా కుటుంబ సభ్యులంతా మోరల్‌ సపోర్టుగా ఉండడం కూడా నా అదృష్టం. ఎటొచ్చీ ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. విషయం సున్నితమైంది కదా!’’ అంది బిందు.
‘‘ఆ విషయం నాకొదిలెయ్‌. నేను నెక్ట్స్‌ వీక్‌ ఊరికి పోతున్న. మీ వాళ్ళతో మాట్లాడుత’’ ధైర్యం చెప్పింది కీర్తి.
‘‘థాంక్యూ కీర్తి. ముందు నువ్వు ఇనీషియేట్‌ చెయ్యి. నేను తర్వాత మాట్లాడుత’’.
‘‘ఇంతకీ ఇవాళ నీ ప్రోగ్రాం ఏంటి? సుదర్శన్‌లో శుభలేఖ సినిమా నడుస్తోంది. పోదామా?’’ అడిగింది కీర్తి.
‘‘నేనూ, నీరజ్‌ ఆ సినిమా చూడాలనుకున్నం. థియేటర్‌ దగ్గర కలుద్దామన్నాడు.’’
‘‘దొంగ. చెప్పవేమే? మన మాటల్లో టైమే తెలియలేదు. అప్పుడే పన్నెండున్నరయింది. మా వెంకట్‌తో టికెట్స్‌ తెప్పిస్తాను. ఈ లోపు కొంచెం ఏదైనా తిను.’’
‘‘ఏంటే నాది కడుపా? చెరువా? టిఫిన్‌ చేసి గంట కూడా కాలేదు. మళ్ళీ తిండా? నేను బయలుదేరుతాను. టికెట్స్‌ నువ్వు తెప్పించొద్దు. నీరజ్‌ తీసుకుంటే డబ్బులు దండగౌతై’’ అని బిందు మొత్తుకున్నా వినకుండా అటు టికెట్ల కోసం పనబ్బాయి వెంకట్‌ను పంపించి, బిందుతో బలవంతంగా భోజనం చేయించి ఆటో మాట్లాడి పంపించింది. ఆటో దిగుతుండగా వెంకట్‌ ఎదురొచ్చి టికెట్స్‌ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి కూడా పది నిమిషాలైంది. నీరజ్‌ జాడ లేదు. మార్నింగ్‌ షో ఒదిలేశారు. జనం బిలబిలమంటూ థియేటర్‌ నుండి బయటికి వచ్చారు. ఆ రద్దీలో నీరజ్‌ వచ్చిందీ లేందీ తెలియడం లేదు. క్రమంగా రద్దీ తగ్గింది. కానీ నీరజ్‌ కనబడలేదు. మెట్లెక్కుతున్న ప్రతి మనిషినీ తదేకంగా చూడమని మనసు శాసిస్తోంది. ఒంటరిగా ఎదురు చూపుల ఆడది. వెధవలకో అవకాశం. ఆ ఏబ్రాసి మొహాల చూపులు బిందును ఇబ్బంది పెడుతున్నై. మాట్నీ బెల్‌ మోగింది. జనం మెల్లమెల్లగా థియేటర్‌లోకి జారుకుంటున్నారు. వెయిటింగ్‌ హాల్లో జనం పలుచబడ్డారు. బిందు ఇక అక్కడ ఉండలేక థియేటర్‌ ఎంట్రన్స్‌ డోర్‌ వైపుగా కదిలింది. గేట్‌ కీపర్‌ టికెట్‌ చించి సగం చేతిలో పెట్టాడు. లోపల అడుగు పెడుతూనే ఆ సగం టికెట్టు ఓ టార్చ్‌ మనిషి చేతిలోకి… టార్చ్‌ను కిందికీ మీదికీ వేస్తూ బిందుకు ముందుగా అతను. ఆ టార్చ్‌ ఓ లైను దగ్గర ఆగి సీటు చూపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ సీట్లో ఒదిగిపోయింది. న్యూస్‌ రీల్‌ ఐపోయింది. సినిమా కూడా మొదలైంది. నటీనటులు వస్తున్నారు, పోతున్నారు. కానీ తెరమీది బొమ్మలతో ఆమె చూపులకు సంబంధమే లేదు. తెరమీది ఆమె చూపులు శూన్య దృక్కులె. ఆ చూపులకు స్థిరత్వం లేదు. మాటిమాటికీ గేటువైపే చూస్తున్నై. నీరజ్‌నే వెతుకుతున్నై. అంతలో తెరమీద విరామం అక్షరాలు పలకరించినై. కనీసం క్యాంటీన్‌ దగ్గర తనను ప్రసన్నం చేస్తుండొచ్చన్న ఆలోచనతో లేచి అటుగా నడిచింది. తన ఆలోచనను నిజం చేస్తూ క్యాంటీన్‌ దగ్గర నీరజ్‌. ఇద్దరూ మౌనంగా ఒక చోటికి చేరుకున్నారు. ఎవరూ ఎవరినీ కారణాలడగలేదు. ఏ సంజాయిషీలు ఇచ్చుకోలేదు. అడిగితే కదా! చెప్పేది అని నీరజ్‌… ఆలస్యం చేసిన వాడే కదా! కారణం చెప్పాల్సింది అని బిందు మనసులోనే ఎవరికి వారు ప్రశ్నించుకున్నారు. మౌనంగా టీ తాగి వచ్చిన దారిన పోయి పాత సీట్లకు అతుక్కుపోయారు. తనతో రమ్మని పిలవలేదని బిందు… ప్రత్యేకంగా రమ్మని పిలవాలా అంటూ నీరజ్‌… ఇద్దరూ ఉడుక్కున్నారు. మొత్తానికి నాలుగు టికెట్లు కొని రెండు సీట్లకు మాత్రమే న్యాయం చేసి సినిమాను ఏ మాత్రం చూడని ఘనులు వాళ్ళు. శుభం అక్షరాలను చూసి మరోసారి గేటు దగ్గర మౌనంగానే కలుసుకుని కళ్ళతోనే రకరకాల ప్రశ్నలు వేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
… … …
‘‘ఏంటే బిందూ! పగటి కలలు కంటున్నావా? మాకిన్ని టీ నీళ్ళు పోసేదుందా లేదా?’’ అంటూ చైతన్య అడిగిన ప్రశ్నకు బిందు ఈ లోకంలోకి వచ్చింది. గబగబా వంటింట్లోకి దూరి ఓ పది నిమిషాల్లో టీ కప్పులతో ప్రత్యక్షమైంది.
‘‘ఇంతకూ నువ్వు కన్న పగటి కలలేంటో?’’ టీ చప్పరిస్తూ అడిగిన చైతన్య ప్రశ్నకు బిందు యాభై ఏళ్ళ కింది గతం జ్ఞాపకాలను వాళ్ళ ముందు కుమ్మరించింది. అది వింటున్న వసంత బిత్తరపోయింది. ‘‘అంత జరిగినా బిందు, నీరజ్‌ ఒకరినొకరు అనుమానించలేదు. పెళ్ళి చేసుకుని హాయిగా కాపురం చేసుకోవడమే కాదు, పిల్లలను కని ప్రయోజకులను చేశారు. మరి మాదీ ప్రేమ పెళ్ళే కదా! ఎందుకిలా జరుగుతుంది?’’ ఆ మాటే పైకి అంది కూడా.
‘‘ప్రేమ పెళ్ళా? పెద్దలు కుదిర్చిన పెళ్ళా? అన్నది కాదు సమస్య. మనుషులను, ఐ మీన్‌ వాళ్ళ మనసులను అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. బిందు వాళ్ళ ప్లేస్‌లో ఏ జంట ఉన్నా అట్లా ప్రవర్తించరు. ఇగో కాస్త ఎక్కువ పాళ్ళలో ఉన్నా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న ఘనులు. వాళ్ళకు వాళ్ళే సాటి’’ అంది చైతన్య. ‘‘ఇంతకూ నీరజ్‌ గారూ! ఆలస్యమెందుకు ఐనట్టో’’ నవ్వుతూ నీరజ్‌కో ప్రశ్న విసిరింది చైతన్య. ‘‘నా అదృష్టం బాగోలేక ఏదో ఉద్యమ ర్యాలీ అడ్డొచ్చింది’’ అన్న నీరజ్‌ మాటకు అంతా నవ్వుకున్నారు.
‘‘ఇంతకూ వసంత సమస్యకు పరిష్కారమేంటీ?’’ అంది బిందు.
‘‘పరిష్కారం లేకేమి? పిల్లలు స్థిరపడి ఎవరి మానాన వాళ్ళు బతుకుతున్నారు. వీళ్ళిద్దరికీ పెన్షన్‌ వస్తోంది. కాస్త గట్టిగా మాట్లాడుతూ గృహ హింస కేసు పెడతానని బెదిరించడమే. ఈ ముసలితనానికి ఒంటరిగా బతుకలేక దారిన పడతాడు మానవుడు’’ అన్నాడు నీరజ్‌.
‘‘పైగా షుగర్‌. ఒంటిని చక్కెరతో నింపుకున్నవాడాయె’’ అంది బిందు.
‘‘ఐతే అదే మంచి పరిష్కారం’’ ముక్తకంఠంగా ముగ్గురూ నినదించారు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.