యోధ జె.ఈశ్వరీబాయి -డా॥ చల్లపల్లి స్వరూపరాణి

చట్టసభల్లోకి దళిత స్త్రీలు రావడమే అరుదు. రిజర్వ్‌డ్‌ సీట్లలో వచ్చిన దళిత స్త్రీలు అక్కడ ఉండే పెత్తందారీ కులాల సభ్యుల ముందు దాదాపు చేతులు కట్టుకుని ఉన్నట్టే కనిపిస్తారు. వారు నోరు తెరిచి తమ వర్గాల సమస్యల మీద మాట్లాడిన సందర్భాలను మన చెవులతో వినము.

ఒకవేళ మాట్లాడితే తమ ప్రత్యర్థి పార్టీలో నోరుగల ఆడవాళ్ళను కట్టడి చేయడానికి పార్టీలో పెత్తందారీ కులాల పురుషుల ఆజ్ఞ మేరకు వారు పలకమన్నవే చిలకలా పలుకుతారు. లేకపోతే పట్టుచీర నలిగిపోకుండా జాగ్రత్తగా కూర్చొని మొబైల్‌లో గేమ్స్‌ ఆడుకోవడం లాంటివి చేస్తారు చాలామంది దళిత నాయకురాళ్ళు. నిజానికి వాళ్ళను ‘నాయకు రాళ్ళు’ అనడం సరికాదు. అదోరకం సేవక వృత్తి. ఇక గ్రామాలలో దళిత మహిళా సర్పంచ్‌లది మరో దీనగాథ. పై కులాల మహిళా సర్పంచ్‌ల తరపున వాళ్ళ భర్తలు అధికారాన్ని చెలాయిస్తే దళిత స్త్రీల విషయంలో గ్రామాలలో పెత్తందారీ పురుషులు వీరి స్థానంలో అధికారాన్ని పొందుతూ ఆ స్త్రీలను రబ్బర్‌ స్టాంపులుగా ఉపయోగిస్తున్నారు. తమ పదవీ కాలంలో ఒక్కసారి కూడా కుర్చీలో కూర్చోని దళిత మహిళా సర్పంచ్‌లు ఇప్పుడు ఉన్నారంటే దళిత మహిళా సాధికారత అనేది ఎంత దూరంలో ఉందో అర్థమవుతుంది.
ఈశ్వరీబాయి 1918లో సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో దళిత, మాల కులంలో బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు పుట్టింది. ఆమె తండ్రి బలరామస్వామి రైల్వే గూడ్స్‌ మాస్టర్‌. ఆమెకు ఐదుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్న పెద్ద కుటుంబం. ఆమె తల్లి దండ్రులది ఆర్థికంగా కూడా బాగానే స్థిరపడిన కుటుంబం. ఆమెకి యుక్త వయస్సు వచ్చేనాటికి సికింద్రాబాద్‌ బస్తీలలో ‘హరిజన సోషల్‌ సర్వీస్‌ లీగ్‌’ అనే సంస్థ ద్వారా భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, జె.హెచ్‌.సుబ్బయ్య, బి.ఎస్‌.వెంకట రావుల నాయకత్వంలో ‘హరిజన సంస్కరణో ద్యమం’ సాగుతుండేది. తన చిన్నతనంలో జరిగిన ఊరేగింపులు, ప్రచార కార్యక్రమాలలో తనకేమీ తెలియకపోయినా పెద్దవాళ్ళతో పాటు ఈశ్వరీబాయి కూడా ‘జిందాబాద్‌’, ‘మురదాబాద్‌’ అంటూ నినాదాలు ఇస్తూ ఆ కార్యక్రమాలలో పాల్గొనేది. ఈశ్వరీబాయి తమ్ముడు కిషన్‌రావు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండడం ఆమెకి రాజకీయాల పట్ల కొంత అవగాహన కలిగింది. ఆ విధంగా క్రమంగా ఆమె మనసులో ప్రజా సమస్యల మీద పనిచెయ్యాలనే ఉద్యమ స్ఫూర్తి బలంగా నాటుకుంది.
ఈశ్వరీబాయికి పదమూడేళ్ళకే వివాహమైంది. ఒక పాప పుట్టిన కొద్దిరోజులకే భర్త చనిపోవడంతో చిన్నవయసులోనే పాపతో ఒంటరిగా మిగిలింది. అయినప్పటికీ ఆమె తన జీవితం అంతటితో ముగిసిపోయిందని అనుకోలేదు. చిన్నపాపతో సాధారణ ఒంటరి స్త్రీగా జీవితం ప్రారంభించిన ఈశ్వరీబాయి తన పాపని చదివించి డాక్టర్‌ని చేసి తనదంటూ ఒక మార్గాన్ని ఎంచుకుని తనకంటే అభాగ్యులైన వారికోసం జీవించడం ప్రారంభిం చింది. ఒక చిన్న పాఠశాల టీచర్‌గా పనిచేస్తూ బస్తీలలో వడ్డీ వ్యాపారుల నుంచి, తాగుబోతు భర్తల నుంచి వేధింపులకు గురయ్యే పేద స్త్రీలు తమ స్వంత కాళ్ళమీద బతకడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ వారికి కుట్లు, అల్లికలు నేర్పిస్తూ వారిని సంఘటిత పరిచింది. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం పోరాడడంతో పాటు బస్తీలలో పేదలపై పోలీస్‌స్టేషన్లలో తప్పుడు కేసులు బనాయించి వేధించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార వ్యవస్థలను నిలదీయడంలో ఈశ్వరీబాయి ముందుంటూ ఆమె జనంలో బతుకుతూ వారి సమస్యలలో మమేకమవుతూ క్రమంగా నాయకత్వ స్థానానికి వచ్చింది. ఈశ్వరీబాయి కొన్నాళ్ళు
ఉపాధ్యాయురాలిగా పనిచేశాక అంబేద్కర్‌ స్ఫూర్తితో రాజకీయాలలోకి వచ్చి మొదట సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి కౌన్సిలర్‌గా ఎన్నికై, తర్వాత దళిత సమస్యల పరిష్కారానికి అనేక సంస్థలను స్థాపించింది. స్థానిక ఎన్నికల్లో పోటీచేసి అనేక పదవులను పొంది బస్తీల పేదరికం, ఆరోగ్యం, విద్య వంటి సమస్యల మీద పనిచేసి ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అంబేద్కర్‌ స్థాపించిన షెడ్యూల్‌ వాదానికి వన్నె తెచ్చిన జె.ఈశ్వరీబాయి ఉక్కు మహిళగా చాలా విశిష్టమైన స్వతంత్ర వ్యక్తిత్వంతో చరిత్రకెక్కింది. 1958లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరి దానికి జనరల్‌ సెక్రటరీగా, అధ్యక్షురాలిగా కూడా ఎన్నికై సమర్థవంతంగా పార్టీని నడిపించి ఎల్లారెడ్డిగూడ నుంచి 1967లో అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్న సమయంలోనే కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామంలో కోటేసు అనే దళిత యువకుడిని అక్కడి పెత్తందార్లు ఇత్తడి చెంబు దొంగతనం చేశాడనే నెపంతో సజీవ దహనం చేసిన సంఘటన జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటనను బి.బి.సి. కూడా ముఖ్య వార్తగా ప్రచురించింది. ఈశ్వరీబాయి కంచికచర్ల కోటేసు ఉదంతంపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ లేవనెత్తినపుడు ‘తిమ్మారెడ్డి’ అనే సభ్యుడు ఆ సంఘటనని తేలికగా తీసిపారేసి ‘ఇత్తడి చెంబు దొంగిలిస్తే మరి చంపరా?’ అని చులకనగా మాట్లాడాడు. ఈశ్వరీ బాయి ఆ సభ్యుడిపై ఆగ్రహంతో తన కాలి చెప్పు విసిరి ఆనాటి సభను ఉలికిపాటుకు గురి చేసింది. ఆమె ఈ సాహసం చేసి దళిత ఆత్మ గౌరవాన్ని 60వ దశకంలోనే ప్రపంచానికి చాటి నిజమైన అంబేద్కర్‌ వారసురాలనిపించుకుంది.
ఈశ్వరీబాయి చట్ట సభల్లో దళిత వాణిని బలంగా వినిపించడమే కాకుండా దళితుల పరంగా, దళిత పేద స్త్రీల పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణా రాజకీయా లలో క్రియాశీలంగా ఉంటూ మంత్రిగా పనిచేసిన జె.గీతారెడ్డి ఈశ్వరీబాయి కుమార్తె. ఆమె పేరున హైదరాబాద్‌ చిలకలగూడలో పేద దళిత బాలిక కోసం ‘గీతా విద్యాలయం’ అనే పేరుతో ఒక పాఠశాలను స్థాపించి బాలికలకు విద్యతో పాటు స్త్రీలకు టైలరింగ్‌, పెయింటింగ్‌, చేతి పనులు నేర్పించడానికి వర్క్‌షాపులను ఏర్పాటు చేసింది. ‘తెలంగాణా ప్రజా సమితి’, ‘సివిక్‌ రైట్స్‌ కమిటీ’ అనే సంస్థలను స్థాపించి దళితుల్లో వారి హక్కుల చైతన్యాన్ని పెంపొందించింది. ఆమె స్త్రీ శిశు సంక్షేమ సంఘానికి అధ్యక్షురాలిగా కూడా ఎంతో క్రియాశీలకంగా పనిచేసి పేద స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో సభ్యురాలిగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు ఎనిమిదవ తరగతి వరకు నిర్బంధ ఉచిత విద్య అందించడానికి ప్రభుత్వం చట్టం తెచ్చే విధంగా కృషి చేసింది. ఈశ్వరీబాయి 1969లో ప్రత్యేక తెలంగాణా కోసం జరిగిన ఉద్యమంలో పనిచేసి అరెస్టై జైలుకెళ్ళింది. ఆమె 1956లో అంబేద్కర్‌తో పాటు నాగపూర్‌లో బౌద్ధ ధర్మ దీక్ష తీసుకోవడం ఈశ్వరీబాయిని అన్ని విధాలుగా అంబేద్కర్‌ అనుయాయిని చేసిందన వచ్చు. సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో క్రియాశీల కంగా పనిచేసి ఈశ్వరీబాయి 1991, ఫిబ్రవరి 24వ తేదీన మరణించింది.
ఈశ్వరీబాయి స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు, తెగువ ఉన్న తొలితరం అంబేద్కర్‌ వాది. ఈనాటికీ కులతత్వం, పితృస్వామిక భావజాలం తాలూకు మొరటుదనం బాహాటంగానే ప్రదర్శించే చట్టసభల్లో ఒక దళిత స్త్రీ అంత ధైర్యంగా, స్వతంత్రంగా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యం కలిగించే అంశం. అంబేద్కర్‌ ఆలోచన లను పుణికి పుచ్చుకోవడం వలననే ఈశ్వరీబాయికి అది సాధ్యపడిరదని చెప్పొచ్చు. ఈశ్వరీబాయి దళిత స్త్రీ చైతన్య స్ఫూర్తి.

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.