‘తెలుగు సినిమా’ చెంప ఛెళ్ళుమనిపించిన ‘‘పలాస’’ – చైతన్య పింగళి

ఒక బాలా, ఒక పా.రంజిత్‌, ఒక వెట్రిమారన్‌ స్థానిక కథలకి ఇచ్చిన ప్రాధాన్యత కరుణ కుమార్‌ ఒక సినిమాతో తెలుగులోకి తీసుకురాగలిగారంటే చాలా గొప్ప విషయం.
జీవితంలో కష్టాలను ‘సినిమా కష్టాలతో’ పోల్చుతారు. సినిమా తీయడానికి కూడా అంతకు మించిన కష్టాలు ఉంటాయి.

అది పలాస సినిమా చిత్రీకరణ జరుగుతున్న రోజుల్లో వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా వినేవాణ్ణి. ఇక చేసేదేముంది సినిమాని చుట్టేస్తారనుకున్నా..! కరుణ కుమార్‌తో పరిచయం
ఉండడం వల్ల తప్పక మొదటి షోకి వెళ్ళాను. షాక్‌ తిన్నాను. పలాస సినిమా నేను ఊహించినట్టు లేదు. తెరమీద సినిమా ముందుకు సాగిపోతుంటే నమ్మలేకపోయాను. అబ్బా ఎంత బాగా తీశాడ్రా! ఇలాంటి సినిమాలు కదా తెలుగులో రావాల్సిందనుకున్నాను. పొరుగు భాషల్లో వస్తున్న సినిమాలు తెలుగులో రావని నిరాశ ఉండేది. ఈ సినిమాతో నిరాశ కాస్త ఆశావాదంగా మారింది. అలాగని ఇదేదో ఆర్టు సినిమా కాదండోయ్‌! హార్టు సినిమా!! గుండె ఉన్న ప్రతివాళ్ళకు కళ్ళు తడవాల్సిందే! సమాజంలో ఉన్న అణచివేత చుట్టూ అల్లిన బడుగు బలహీన వర్గాల బతుకు చిత్రణ ఈ సినిమా కథ!
అసలు ఈ సినిమాని ఎందుకు తక్కువ అంచనా వేశానంటే ఈ సినిమాకి మొదట నిర్మాణ బాధ్యతలు చేపట్టిన వారు తీసిన ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా నిర్మాణ విలువలు చూసి ఒక ప్రేక్షకుడిగా తల తిరిగింది. అందువల్ల తప్పుగా ఊహించాను. సినిమాకి ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలు దాటి బతికి బట్టకట్టిన సినిమా పలాస. ఇది కేవలం దర్శకుడి కళాకసిత్వంతో, రాజీపడని వ్యక్తిత్వంతో బయటపడ్డ సినిమా. వాళ్ళు పడిన కష్టానికైనా మనం సినిమా చూడాలి. ఒక్కసారి చూశాక, పదిమందికీ చెప్పకుండా, దగ్గరుండి మరీ సినిమా చూపించకుండా ఉండలేము.
కరుణ కుమార్‌తో తొలి పరిచయం మర్చిపోలేనిది. మొదటిసారి రామానాయుడు స్టూడియోలో వెంకట్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘సలోన్‌’ (కొత్త కథలు వేట) లో మొదటిసారి కలిశాము. ఆ రోజు అందరూ ఇంగ్లీషులో మాట్లాడుతుంటే కరుణ మాత్రం ‘‘నేను తెలుగు సినిమా తీయడానికి వచ్చాను. నేను తెలుగులోనే మాట్లాడతాను’’ అని ఆయన చెప్పదలచుకున్నది తెలుగులోనే చెప్పారు. ఆ ఖచ్చితత్వం చూసి కొందరు నొచ్చుకున్నారు కూడా! అది కదా ఒక దర్శకుడవ్వాలంటే ఉండాల్సిన స్పష్టత! తెలుగు దర్శకులు వచ్చిన మూలాలు మర్చిపోతారు కాబట్టే ఇలాంటి కథలు చాలా చాలా అరుదైపోయాయి. అనుకరణ మీద ఉన్న దృష్టి తాము పుట్టి, పెరిగిన పరిసరాల మీద లేదు. కొందరు దర్శకులు వాటిని చూపించినా బాగా పాలిష్‌ చేసి, మట్టే కనబడకుండా మేకప్‌ చేస్తారు. వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. పైగా అదొక పీడకలలా భావిస్తారు. కానీ కరుణ కుమార్‌ అలా కాదు కాబట్టే ‘పలాస’లాంటి ఒరిజినల్‌ దేశీ జానపద కళాకారుల కథ రాయగలిగారు. ఇలాంటి రచయితలు, దర్శకులు రావడం వల్ల తెలుగు సినిమా ఇంకొంత కాలం సజీవంగా బతికే ఉంటుంది. భావి దర్శకులకు సినిమా ఆరోగ్యంగా మిగిలే ఉంటుంది. అప్పుడే కదా, సినిమా చేత ఎన్ని ప్రయోగాత్మకమైన వ్యాయామాలైనా చేయించగలుగుతారు.
ఆనాటి కాలమాన పరిస్థితుల్ని, సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల్ని, దొర, బానిస అనే భేదాల్ని, ఆధిపత్య పోరాటాల్ని ఇలా… అనేక కోణాల్ని మన కళ్ళముందు ఆవిష్కరించిన సినిమా పలాస. తెలుగు సినీ పరిశ్రమలో ఇన్నాళ్ళకు ఒక నిఖార్సయిన మట్టి మనుషుల సినిమాగా చెప్పుకోవచ్చు. మట్టి మనుషుల కథ అంటే? కుల, మత, పేద, పెద్ద అన్న భేదంతో కాకుండా ఆ మట్టిలోనే కలిసిపోయేవాళ్ళని దాని అర్థం.
ఆనాడు ‘‘మాకొద్దీ తెల్ల దొరతనం’’ అని జాతీయోద్యమకాలంలో ‘గరిమెళ్ళ సత్యనారాయణ’ నినాదమిస్తే, ఆయన వెంట కులమతాల భేదం లేకుండా దళిత బహుజనులు ఒకటై పోరాడి తెల్లవారిని తరిమి, తరిమి వెళ్ళగొట్టారు. తరువాత రోజుల్లో ఆ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ఐక్యత, సమానత్వం ఏమైపో యాయో తెలియదు గానీ, మమ్మల్ని కులాలుగా, మతాలుగా విడగొట్టారు. అంటరానివాళ్ళమని ఊరి చివరకు తరిమేశారు. మా గోడు సాహిత్యంగా, పాఠ్యాంశాలుగా చదువుకున్నా మా మీద వివక్ష తగ్గలేదు. చివరికి మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మనిషితనాన్ని మరిచిపోయి ‘మనువు’తనాన్ని తలకెక్కించుకుని మమ్మల్ని తరతరాలుగా ముత్తాతలు వెలివేశారు, తాతలు వెలివేశారు, తండ్రులు వెలివేశారు. ఇప్పుడు ఎంతో చదువుకున్న వాళ్ళ కొడుకులు కూడా వెలివేస్తున్నారు. ఈ బాధలు తాళలేక ‘‘చక్కని కవితకు కులమే ఎక్కువ తక్కువలు నిర్ణయించినచో, నింకెక్కడి ధర్మము తల్లీ?’’ అని ‘గుర్రం జాషువా’ ప్రశ్నించినా, ‘‘మాకొద్దు ఈ నల్లదొరతనం’’ అని మరో దళిత కవి ‘కుసుమ ధర్మన్న’ నినదించినా, వాటిని చదువుకొని మమ్మల్ని అపహాస్యం చేశారు గానీ, మాపై దయ చూపలేదు. కొందరు దొడ్డ మనస్కులు మాపై సానుభూతితో ‘‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’’ అని గురజాడ జ్ఞానం కోల్పోయిన మనువులకు చురకలు పెట్టారు. ‘‘అంటరానివారు మా వెంటరానివారు’’ అని ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని ‘కృష్ణశాస్త్రి’ ఆనాడే తప్పుబట్టారు. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి / రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?/ ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్‌ / అది మోసిన బోయీ లెవ్వరు?’’ అని శ్రీశ్రీ ఆనాడే గమనించమనే ఆలోచననిచ్చాడు.
ఇలా కవికులం ఒక్కటే ఐక్యత కోసం రాసిన రాతల్ని పట్టించుకున్న వాళ్ళు కరువై, ఆ అంటరానితనాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. మొన్న మొన్న జరిగిన ‘మారుతీరావ్‌’ ఉదాహరణ ఒక్కటి చాలు, అది ఇంకా చాపకింద నీరులా మన వెంటే వస్తుందనడానికి! ఆ కవి కులంలో పుట్టిన కరుణ కుమార్‌ ఇంకా ఆగని అంటరానితనంపై పలాస రూపంలో తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఇదేదో ఒక వర్గాన్ని కించపరచడానికో లేక మరో వర్గాన్ని కీర్తించడానికో తీసిన సినిమా కాదు. మన బలాల్ని, మన బలహీనతల్ని, మనం మరిచిపోయిన మానవతావాదాన్ని గుర్తుచేయడానికి తీసిన సినిమాగా మాత్రమే మనం భావించాలి. మనల్ని వేరు చేస్తున్న ఈ కులమత రక్కసిని బాధ్యతగా అందరం కలిసికట్టుగా తరిమికొట్టాలి.
ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి చెప్పాలంటే అందరూ చాలా సహజమైన నటనని పలాస సినిమాకి అందించారు. దర్శకుడు కూడా చాలా చక్కగా నటనని రాబట్టుకున్నాడు. రఘు కుంచె ఈ సినిమా ద్వారా రంగుల కుంచెగా మారారు. ఆ రంగుని మరిన్ని తెలుగు సినిమాలు అద్దుకోవాలి, హత్తుకోవాలని కోరుకుందాం.
కథానాయకుడు రక్షిత్‌, కథానాయిక తెలుగమ్మాయి నక్షత్ర, తిరువీర్‌ మిగతా సహాయక పాత్రలు సినిమాకి తమ నటన ద్వారా సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. సినీ సాంకేతిక నిపుణుల పనితనం, నేపథ్య సంగీతం, సాహిత్యం ప్రేక్షకుల్ని 1978లోకి తీసుకెళ్ళిపోయాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కరుణ కుమార్‌ కన్న కలని నిజం చేసిన నిర్మాణ విలువలు ఎక్కడా అదరక, బెదరక నిర్మించిన నిర్మాతలకీ, సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ గారికి కృతజ్ఞతాభివందనాలు.
ఒక బాలా, ఒక పా.రంజిత్‌, ఒక వెట్రిమారన్‌.. వీళ్ళు ముగ్గురూ ఇంతకాలం స్థానిక కథలకి ఇచ్చిన ప్రాధాన్యత కరుణ కుమార్‌ ఒక్క సినిమాతో తెలుగులోకి తీసుకురాగలిగారంటే చాలా గొప్ప విషయం. ఈ సినిమాలో శ్రీకాకుళం యాసలో సొగసుల్ని బాగా పట్టుకున్నారు. ‘‘వినాయకుడి తల తెగితే ఎక్కడినుంచో తల మళ్ళీ పెట్టారని చెబుతున్న పుస్తకాలే, ఏకలవ్యుడి వేలు తెగితే ఎందుకు అతికించలేదో అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేనంతకాలం మోహన్‌రావు లెందరో పుడుతూనే ఉంటారు’’ అన్న వాక్యాలు చరిత్రలో జరిగిన వాస్తవాల్ని, సంఘటనల్ని గుర్తుచేస్తూ ఆలోచనల్ని రేకెత్తించే విధంగా రాయడం వెనుక కరుణకుమార్‌ ప్రతిభాభ్యాసాలు తాలూకా విస్తృతి కనిపిస్తుంది.
‘‘కళ్ళంటూ ఉంటే చూసి, వాక్కుంటే వ్రాసి’’ అని శ్రీశ్రీ అన్న మాటకి పలాస సినిమా అద్దం పడుతుంది. పలాస సినిమా అంతా సమాజ పరిశీలన ఉంటేనే రాయగల కథని ఖచ్చితంగా చెప్పవచ్చు. మట్టి మనుషుల కథలు, ప్రాంతీయ కథలు కొత్త, కొత్త కోణాల్లో ఆవిష్కృతం కావాలని ఆశిస్తూ… ఆనుకరణ కథల నుండి తెలుగు సినిమా ‘‘శ్రమైక జీవన సౌందర్యమే’’ వైపునకు నడవాలని కోరుకుంటున్నాను….!

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.