మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలు ` పిల్లల దృష్టి కోణంలో ప్రపంచాన్ని చూడగలగటం.
చిన్నపిల్లల ప్రపంచం చాలా పెద్దది. వాళ్ళ ఆలోచనలకు హద్దులు, ఊహలకి పొలిమేరలు ఉండవు. ఫౌంటెన్ లాగా చిమ్మే
ఉత్సాహం, కెరటాల్లా పొంగే కుతూహలం పిల్లల సొంతం. అందుకే పిల్లల సృజనాత్మక దాహం తీర్చడానికి మామూలు కథలు సరిపోవు. మామూలు సినిమాలు వాళ్ళని ఆకట్టుకోలేవు. పిల్లల మానసిక ఆవరణలో స్వేచ్ఛగా తిరగగలిగే పెద్దవాళ్ళు మాత్రమే వాళ్ళకి కావలసిన కథలు చెప్పగలరు. వాళ్ళకి నచ్చే సినిమాలు తీయగలరు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనసెరిగి తీసిన కొన్ని మంచి సినిమాల గురించి ‘పిల్లల సినిమా కథలు’ అనే పేరుతో అనిల్ బత్తుల ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం గురించిన కొన్ని ప్రశ్నలకి అనిల్ చెప్పిన జవాబులు ఇవి :
ప్రపంచ బాలల సినిమాల మొత్తంలో నుంచి ఇరవjైు్యదు సినిమాలని గొప్పవని ఎంచడం అంటే సాహసమే. ఈ సంఖ్య ముందే అనుకున్నదా? ఎంపికకి ఆధారం ఏంటి?
అసలు ఈ పుస్తకం రాయడానికి దారితీసిన పరిస్థితులను క్లుప్తంగా చెప్తాను. పోయిన సంవత్సరం జులైలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, నా సొంత ఊరికి చేరాను. ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ, నచ్చిన పిల్లల పుస్తకాలు రాసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, పక్షుల శబ్దాలు వింటూ, మా అమ్మతో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాను. ఆ సమయంలో ఒక పిల్లల యానిమేషన్ సినిమాకు మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ మాటలు రాసే క్రమంలో ప్రపంచంలోని ఉత్తమ పిల్లల సినిమాలు చూడటం ప్రారంభించాను. అంతకు ముందు కొన్ని ఇరానియన్ సినిమాలు, పిల్లలవి చూసున్నాను. ఒక స్నేహితుడి సలహా మేరకు ‘ద కార్ట్’ అనే ఇరానియన్ పిల్లల సినిమా అతి కష్టంమీద సంపాదించి చూశాను. అది హృదయాన్ని తాకింది. ఈ సినిమా గురించి ప్రజలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో, ఆ సినిమా కథా పరిచయాన్ని నా ఫేస్‌బుక్ వాల్ మీద రాశాను. రాయకుండా ఉండలేకపోయాను, అంత కదిలించింది ఆ చిత్రం. ఇలా మొదలయ్యింది నా పిల్లల సినిమా ప్రయాణం. ఏ సినిమాలు చూడాలి అనేది పెద్ద ప్రశ్న. బాలల చిత్రాలను వెతకడం, ఎంపిక చేసుకోవడం చాలా కష్టమైన పని. మిత్రులు సినిమా పేర్లు సూచించి సలహాలు ఇచ్చారు. ఊహ తెలిసిన వయసు నుండి పన్నెండేళ్ళ పిల్లల వరకు చూడదగ్గ మనసును తాకే పిల్లల చిత్రాల సమాచారంతో (కథా పరిచయాలతో) ఏదైనా పుస్తకం ఉందా అని వెతికాను. ప్రపంచంలోని ఏ భాషలోనూ అటువంటి పుస్తకం లేదని నా పరిశోధనలో తేలింది. మనమే ఎందుకు రాయకూడదు? అనిపించి ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళాను. అలా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఎంపికకి ఆధారం ఒకటే ‘మనసుని తాకాలి’. సినిమా చూశాక కూడా దాని ప్రభావం కొంత కాలం లేదా జీవితాంతం వెంటాడాలి. అటువంటి చిత్రాలనే ఎంచుకున్నాను.
వీటిలో ఎనిమిది ఇరానియన్ సినిమాలే ఉన్నాయి. ఎందుకని?
ఈ పుస్తకంలో ఎక్కువగా ఎనిమిది ఇరానియన్ సినిమాలే ఉండడానికి కారణం ` వాళ్ళు పిల్లల ఉత్తమ సినిమాలు తీయటంలో అగ్రగణ్యులు. అక్కడ ఉన్న కఠిన సెన్సార్ నిబంధనల వల్ల వాళ్ళు పిల్లల చిత్రాల మీదే తమ సర్వశక్తులూ ఒడ్డారు. ప్రపంచంలోనే ఉత్తమ పిల్లల చిత్రాలు తీశారు, తీస్తున్నారు. ఇరాన్‌లో సినిమా తీయటానికి ముందు ఫిల్మ్ స్క్రిప్ట్‌ని సెన్సార్ వాళ్ళకు పంపి అనుమతి తెచ్చుకోవాలి. అనుమతి వచ్చాకే సినిమా తీయాలి. ఇలా బోలెడు కష్టమైన నిబంధనలు ఉంటాయి. ఇరాన్ పిల్లల సినిమాలు సూటిగా మనసుని తాకుతాయి. అందుకే అవి ఈ పుస్తకంలో ఎక్కువగా ఉన్నాయి.
మన దేశంలో పిల్లల సినిమాలు గతంలోను, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది?
మన దేశంలో పిల్లల సినిమాల్ని మెలో డ్రామా, పాటలు తినేస్తున్నాయి. అవి లేకుంటే గొప్ప సినిమాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం తక్కువగా వచ్చినా మన దేశం నుండి మంచి పిల్లల సినిమాలే వస్తున్నాయి.
ఈ మొత్తం లిస్ట్‌లో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ‘బాలరాజు కథ’. దీన్ని ఎంచుకోవడానికి కారణాలేంటి?
హృద్యమైన కథ, మహాబలిపురం నేపథ్యం ఈ సినిమాను ఎంచుకోవటానికి ప్రధాన కారణం.
సాంకేతికత, హృద్యమైన కథ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, పిల్లల గురించి పెద్దవాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, పెద్దవాళ్ళ ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేయడం… వీటిలో ఒక మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలేంటి? ఇవికాక ఇంకా ఏ లక్షణాలుంటే అది మంచి బాలల సినిమా అవుతుంది?
మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలు… పిల్లల దృష్టి కోణంలో ప్రపంచాన్ని చూడగలగటం. మనం రోజూ చూసే దృశ్యాలనే కథతో పాటు కవితాత్మకంగా చూపించగలగటం. ప్రేక్షకుల మనసుల్ని కదిలించగలగటం. కథే ప్రాణం. ఆ కథని ఎంత గొప్పగా చెప్పామనేది కూడా చాలా ముఖ్యం.
నువ్వు కనుక పిల్లల సినిమా తీస్తే అది ఎలా ఉంటుంది? ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి పెడతావు?
భలే ప్రశ్న అడిగావు. ప్రస్తుతం ఒక పిల్లల సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నా. వచ్చే సంవత్సరం పిల్లల సినిమాకి డైరెక్షన్ చేయాలనేది నా ఆశయం. పిల్లవాడు లేదా చిన్నారి పాప కనురెప్పల నుండి ప్రపంచాన్ని చూపెట్టడమే నా సినిమా లక్ష్యం.
నువ్వు తీసుకొచ్చిన ‘పిల్లల సినిమా కథలు’ పుస్తకం డిజైన్‌పరంగా బాగుంది. బుక్ డిజైనింగ్ విషయంలో నీకున్న ప్రత్యేకమైన ఆసక్తి గురించి కొంత చెప్పు.
ఊహ తెలిసిన వయస్సు నుండి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే వినూత్న పుస్తకం. 130 జి.యస్.యం. ఆర్ట్ పేపర్‌పై ముద్రించిన ఈ పుస్తకం ఒక లిమిటెడ్ ఎడిషన్. రీప్రింట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కవర్ పేజీ బొమ్మ మోషే డయాన్ గీశాడు. ఈ పుస్తకాన్ని బంగారు బ్రహ్మం డిజైన్ చేశారు. ఆయన ఇచ్చిన లే అవుట్‌కి కొన్ని మార్పులు చేస్తూ నేను పేపర్ మీద లే అవుట్ గీశాను. దానికి అనుగుణంగా బంగారు బ్రహ్మం అద్భుతంగా డిజైన్ చేశారు. పర్‌స్పెక్టివ్ రామకృష్ణ గారు ప్రింటింగ్ పనులకు చాలా సాయం చేశారు. పుస్తకం బయటకు రావటానికి ఎంతో మంది మిత్రులు సాయం చేశారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు పుస్తకాల డిజైన్ అంటే చాలా పిచ్చి. బుక్ కవర్ పేజీలను ప్రత్యేకంగా స్టడీ చేస్తాను. బుక్ డిజైన్‌కు సంబంధించిన పుస్తకాలను జపాన్, జర్మనీ, రష్యాల నుండీ తెప్పించుకుని చదివేవాడిని. రెగ్యులర్‌గా ఉన్న ఫార్మాట్‌ను బద్దలు కొట్టడం నాకు అత్యంత ఇష్టం. ప్రపంచంలో వివిధ సైజుల్లో ఉన్న పిల్లల పుస్తకాలు తెప్పించుకునేవాడిని. ఆ లే అవుట్‌ని అర్థం చేసుకోవడానికే ఇదంతా చేసేవాడిని. సోవియట్ పుస్తకాల సేకరణ కూడా నాకు ఈ విషయంలో దోహదపడిరది. ఆ పుస్తకాలు బుక్ డిజైన్, లే అవుట్, ఇంకా ప్రింటింగ్‌లో ఉన్నత ప్రమాణాల్ని సృష్టించాయి. ఇవన్నీ నా ప్రస్తుత పుస్తకానికి ఇన్‌స్పిరేషన్. ఈ పిల్లల సినిమాలకు మూలమైన పుస్తకాలను చదివాను. ఆ పుస్తకాల ముఖచిత్రాలు ఇప్పటి నా పుస్తకానికి అదనపు ఆకర్షణ. సోవియట్ యూనియన్‌లో ముద్రింపబడిన ఇంగ్లీష్ పిల్లల పుస్తకాలు ఒక 500 దాకా సేకరించాను. అవి వివిధ సైజుల్లో, వివిధ లే అవుట్లలో రంగులలో ఆర్ట్ పేపర్‌పై ముద్రించిన పుస్తకాలు. మా ఇంట్లో ఒక పెద్ద బీరువా నిండా ఇవే ఉంటాయి. వాటిలో అద్భుతమైన బొమ్మలుంటాయి. ఈ పుస్తకాలు నాకు బుక్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ మీద అవగాహనను పెంచాయి.
ఈ పుస్తకం ముఖచిత్రం మొషే డయాన్ గీశారు కదా! అది ఆసక్తిదాయకంగా ఉంది. ఆ చిత్రం వెనకున్న కథ ఏంటి?
మోషే కవర్ బొమ్మ వెనక కధ ఇది. నేను, మోషే, మరో ఇద్దరు మిత్రులతో కలిసి మొన్న డిసెంబర్ చివరి రోజుల్లో హంపి వెళ్ళాం. ఒకరోజు ఉదయం మోషే, నేను యాంటిక్ షాప్‌లో మెటల్ బొమ్మలు చూస్తున్నాం. అప్పుడు నేను మాటల మధ్యలో ‘నా చిన్నప్పటి తొలి సినిమా గూడూరులోని ఎస్.ఆర్.ఎ. టాకీస్‌లో చూశానని, ఆ హాలుపైన పెద్ద చేప బొమ్మ, భూగోళం బొమ్మ ఉన్నాయ’ని చెప్పాను. అవి ఎందుకు అలా ఉన్నాయో నాకు ఇప్పటికీ సమాధానం దొరకలేదని చెప్పాను. అతికష్టం మీద ఫేస్‌బుక్ ద్వారా శ్రీనివాసులు అనే మిత్రుడు ‘90లలో కూలగొట్టిన ఆ సినిమా హాల్ ఫోటోలు పంపాడని చెప్పాను. మోషే నవ్వి ఇలా అన్నాడు ‘‘అనిల్, నువ్వు అట్లాస్‌లా ఆ ప్రశ్నను చిన్నతనం నుండీ ఇప్పటికీ మోస్తున్నావు. కానీ ఆ హాలుపై ఉన్న చేపకు సమాధానం తెలిసినా అది చెప్పదు, అది నిన్ను చూసి నవ్వుతుంది. ఆ చేపపై ఉన్నది భూగోళం లేదా ఒక కలల కాస్మిక్ ప్రపంచం కావొచ్చు. ఇది నేను బొమ్మ వేస్తా అనిల్’’ అన్నాడు. ఆ రోజు 31 డిసెంబర్ 2020. రఫ్ స్కెచ్ గీసి ఆ రాత్రి చూపించాడు. అది చూసి ప్రేమతో హగ్ చేసుకున్నా. ఫైనల్ స్కెచ్ 4 జనవరి 2021 రోజున గీసిచ్చాడు. ఆ బొమ్మ నా చిన్ననాటి తడి జ్ఞాపకం. కానీ దానికి ప్రాణం పోసిన బ్రహ్మ పేరు మోషే.
పి.ఎస్: ఆ బొమ్మని పటం కట్టించుకుని ఇంట్లో అపురూపంగా గోడకు తగిలించి నమస్కరించుకున్నాను. ధన్యవాదాలు మిత్రమా, నా బొమ్మల బ్రహ్మ!