‘‘మాస్టారు మనల్ని వొదిలెళ్ళిపోయార్రా…’’ అప్పల్నాయుడు ఫోన్ చేసినప్పుడు మాకైతే ఆశ్చర్యం కలగలేదు. రోజూనో… రోజు విడిచి రోజో మాస్టారి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం మేమిద్దరం. 97 ఏళ్ళ పసివాణ్ణి చాలా బాగా చూసుకున్నారు కోడలు ఇందిర, కొడుకులు సుబ్బారావు, ప్రసాదు. మాస్టారు అదృష్టవంతులు, విసుక్కోకుండా పితృసేవ చేసే
కొడుకులున్నందుకు. కొడుకులు ధన్యులు, గొప్ప వ్యక్తికి పుత్రులుగా జన్మ లభించినందుకు. ఇక మాస్టారు జీవించిన కాలంలో మనమూ జీవించి ఉన్నాం కదా అన్న తలపే గొప్పది కదా. మరి వారి అభిమానాన్ని పొంది, వారితో కొన్నేళ్ళుగా నిరంతరం సంభాషిస్తూ… సందేహాలు నివృత్తి చేసుకుంటూ… వారితో సాహిత్య ప్రయాణాలు సాగిస్తూ… అప్పుడప్పుడూ వారింట్లో వారితో కలిసి భోజనాలు చేస్తూ పొందిన గొప్ప అనుభూతిని పొందిన నేనెంత గర్వపడాలి! మాస్టారికి అతి చేరువగా వెళ్ళిన అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? మాస్టార్ని చూడాలనిపించి శ్రీకాకుళం వెళ్తే ‘‘మిమ్మల్ని గుర్తుపడతారో లేదో చూడండి’’ అనేవారు వారి పెద్ద కొడుకు సుబ్బారావు గారు. మాస్టారికి నమస్కారం చెయ్యగానే నా చెయ్యందుకుని గంటేడా… అని మెరిసే కళ్ళతో పలకరించడం, ప్రేమగా మాట్లాడడం… మాస్టారికి మా పట్ల గల అభిమానానికి పొంగిపోయేవాళ్ళం. శ్రీకాకుళమంటే మా కారా మాస్టారే. ఇప్పుడు మాస్టారు లేని శ్రీకాకుళం మాకొక శూన్యమే. కథానిలయం ఉండొచ్చు, పక్కనే అప్పల్నాయుడు, దా.రా. కూడా ఉండొచ్చు. వాళ్ళకోసం నేను ఇక ముందూ వెళ్ళొచ్చు, కానీ కారా మాస్టారు లేని శ్రీకాకుళాన్ని ఊహించలేకపోతున్నాను.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే…
మొదటిసారి మాస్టార్ని చూసింది విశాఖపట్నంలో. అప్పుడాయన కారా మాస్టారని తెలీదు. అది 1989 జులై అని గుర్తు. పార్వతీపురం ఐటిడిఎ వారు గిరిజన విద్య నేపథ్యంలో నిర్మించిన ‘‘నానూ సదువుకుంతాను’’ పూర్తి నిడివి వీడియో ఫిల్మ్ క్యాసెట్ ఆవిష్కరణ కోసం అప్పటి గిరిజన సంక్షేమాధికారి వాడ్రేవు చిన వీరభద్రుడు గారు తనతో నన్నా సభకు తీసుకెళ్ళారు. ఆ సినిమాకి నా చేత ఒక పాట రాయించారు దర్శకుడు బి.హెచ్.రామ్మూర్తి గారు. సినిమా టైటిల్స్‌లో నా పేరు చూసి కారా మాస్టారు ‘‘ఈ పేరు గల మనిషి కోసమే వెతుకున్నాను. మీకు తెలుసా?’’ అని పక్కనే ఉన్న భూషణం గారిని అడిగారు. ‘‘మీ వెనకే ఉన్నాడు’’ అని నన్ను చూపించారు వీరభద్రుడు గారు. మాస్టారు నా చెయ్యి పట్టుకుని హాలు గేటు దగ్గరికి లాక్కెళ్ళారు. తెల్లని పంచె, లాల్చీలో మాస్టారు నా కళ్ళకి ఎవరో పెద్ద మాస్టార్లాగే కనిపించారు. అలా గేటు దగ్గరికి లాక్కెళ్ళి వేసిన మొదటి ప్రశ్నః ‘‘మీరు మీసాలు తీసేస్తారా…’’ అని. ఎందుకలా అడుగుతున్నారో, ఏం చెప్పాలో తెలియక తత్తర పడుతుంటే మరో ప్రశ్న వేశారు. ‘‘తొలి కథ ఎవర్రాశారు? ఎక్కడ?’’ అని. తెల్లమొహం వేసుకుని చూడడమే నా పనైంది. నాకేమీ తెలియదని గ్రహించారు. మాస్టారు కదా… దిద్దుబాటు కథ, గురజాడ, విజయనగరం ప్రత్యేకతను చెప్పి ‘‘ఇంత విశిష్టత కలిగిన జిల్లా రచయితగా కథ గురించి ఆలోచించాలి కదా… ఇతర ప్రాంత రచయితలతో పోటీ పడాలి గదా…’’ అన్నారు. విషయం బోధపడిరది గానీ అడుగుతున్నదెవరో… అడగొచ్చో… లేదో భయసందేహాలు. మాస్టారే ‘‘నన్ను కాళీపట్నం రామారావు అంటారు’’ అని నవ్వుతూ అన్నారు. అప్పటికి నాకా పేరుతో పరిచయం లేకపోవడం, వారి కథలతో పరిచయం లేకపోవడం నా అజ్ఞానానికి నిదర్శనం. ఆ సందెవేళ పల్చని వెన్నెల్లో, తెల్లని దుస్తుల్లో మాస్టారి తెల్లని నవ్వు నాకిప్పటికీ గుర్తే. ఆ క్షణాలే నా జీవితాన్ని మలుపు తిప్పినవిగా భావిస్తాను. మాస్టారు భుజం తట్టి, భయం పోగొట్టి ‘‘నీ కథ ‘విముక్తి’ ఆంధ్రజ్యోతిలో చదివాను. బాగుంది. ఇంకేమైనా రాశావా?’’ అనడిగారు. కథాంజలిలో రెండు కథలు మాత్రమే వచ్చాయని సిగ్గుపడుతూ చెప్పాను. ‘‘బాగా రాస్తున్నావు. రేపొకసారి ఇంటికి రాగలవా?’’ అని అడ్రస్ చెప్పారు. అలా పరిచయమై మాస్టారి కుటుంబ సభ్యుడినన్నంతలా దగ్గర కాగలగడం నా భాగ్యమే!
మాస్టారు ఎంత గొప్ప కథకులో నేనిప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు కథకొక ఇల్లు కట్టి, దిద్దుబాటు కథ నుంచి నేటిదాకా వచ్చిన కథల్ని ఒక దగ్గరకు చేర్చి, తనకు సాహిత్యం ద్వారా, సాహిత్య పురస్కారాల ద్వారా లభించిన సొమ్ముతో ‘కథానిలయం’ నిర్మాణం గావించి, కథా రచయితలకు, కథాభిమానులకు, పరిశోధకులకు మహోపకారం చేసిన మహానుభావుడాయన. కథ కంచికి… అన్న నానుడిని ‘కథ శ్రీకాకుళానికి’ అని అనుకునేలా చేసిన కథాదీపధారి. మాస్టారు రచయితగా ఎంత ఉన్నతులో వ్యక్తిత్వం కూడా అంత గొప్పది. అందుకే రావిశాస్త్రి గారన్నారు, ‘‘దేవుడికి అందరూ నమస్కారం చేస్తారు. దేవుడు మాస్టారికి ఎదురైతే దేవుడే మాస్టారికి నమస్కరిస్తాడు’’ అని. అంత ఉన్నత వ్యక్తిత్వం గలవారు గనకనే కథానిలయం తలపు మాత్రమే రెండంతస్తుల భవనమై వేలాది పుస్తకాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. కథానిలయం ప్రారంభోత్సవ సభలో ముఖ అతిధి గూటాల కృష్ణమూర్తి గారు (అప్పుడు లండన్ నుంచి వచ్చారని గుర్తు) ‘‘ప్రపంచంలో నాకు తెలిసిన కథకు రిఫరెన్స్ లైబ్రరీ ఎక్కడా లేదు. ఆ ఘనత మాస్టారి వల్ల శ్రీకాకుళానికి దక్కింది’’ అన్నారు. ఆ కథానిలయం ప్రారంభోత్సవ సభలోనే నా తొలి కథా సంకలనం ‘ఏటిపాట’ ఆవిష్కరణ జరగడం నాకు లభించిన భాగ్యాల్లో ఒకటి.
నా కథారచన ప్రయాణానికొక మార్గం చూపిన దీపధారి మాస్టారు. ఆయన నిరంతర పాఠకులు. కథ చదివి ఆ రచయితకు ఫోన్ చేసి, అభినందించి, సూచనలిచ్చి ప్రోత్సహించే గొప్ప మనసు మాస్టారిది. నిన్నమొన్నటిదాకా పత్రికల్లో వచ్చిన కథల్ని చదువుతూనే
ఉన్నారాయన. కథల్ని, కథకుల్ని వెదికి వెదికి పట్టుకుని ప్రోత్సహించడం మాస్టారికే చెల్లింది. ఎందరో మాస్టార్లు జీతాలకు పనిచేసేవారు. ఈ మాస్టారు మాత్రం నిస్వార్థంగా సమాజం కోసం పనిచేసే నిజమైన మాస్టారు. కవిత్వం, నవల, నాటకం మొదలైన ప్రక్రియలకంటే కథను మాత్రమే ఇష్టపడి, కథ కోసం కష్టపడి, కథకే జీవితాన్ని అంకితం చేసిన అరుదైన మనిషి. ఒక్క నిద్రలో తప్ప మెలకువలో ఆయన ఆలోచనలన్నీ కథలతోనే.
సాహిత్యాంశాలే కాదు, సాహిత్యేతర మానవ సంబంధాలకూ అంతే విలువనిస్తారాయన. ఎన్నెన్ని అనుభవాలో మాస్టారితో. నా పుస్తకాలన్నింటినీ (రెండు, మూడు తప్ప) మాస్టారే ఆవిష్కరించడం నా అదృష్టం. మరీ ముఖ్యంగా రాచకొండ రచనా పురస్కారం కోసం మాస్టారు నన్ను ఎంపిక చేసి తన చేతులతో ప్రదానం చేయడం మహా భాగ్యం. నాకు ఇద్దరు గురువులు. ఒకరు బతుకుదారి చూపించిన కీ.శే.సామవేదుల రామగోపాల శాస్త్రి గారు, మరొకరు కాళీపట్నం రామారావు మాస్టారు (కీ.శే. అని రాయడానికి చేతులు అలవాటు పడాలి). ఇటీవల వచ్చిన నా కొత్త కథాసంకలనం ‘‘గంటేడ గౌరునాయుడు కథలు’’ మాస్టారికే అంకితం ఇవ్వగలిగాను. మాస్టారి చేతుల్లో (గత సెప్టెంబరులో) ఆ పుస్తకం పెట్టి నమస్కరించినపుడు ఆయన కళ్ళల్లో ఎంత మెరుపో! గత నెలలో మాస్టార్ని కలిసినపుడు ‘‘గంటేడా… అమూలాగ్రం చదివాను నీ పుస్తకం. కొన్నిచోట్ల అండర్‌లైన్ చేశాను చూడు’’ అని ఎంత సంతోషంగా చెప్పారో. ఒళ్ళు గగుర్పొడిచింది. ఈ తొంభయ్యేడేళ్ళ వయసులో కథలు చదవడం… చదివానని చెప్పడం… అబ్బురమే! ‘‘మాస్టారూ, వందేళ్ళుంటారు’’ అనంటే ‘‘గంటేడా శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించీగల్ను. అప్పుడు తెలుస్తాది’’ అనేవారు నవ్వుతూ. వార్థక్యభారం మోయడం ఎంత కష్టమో అనిపించేదాయన మాటల్లో. మాస్టారిక లేకపోవచ్చు గానీ మాస్టారి బోధనలున్నాయి, రాతలున్నాయి. ఆయనెప్పుడూ చెప్పే ఒక మాటతో ముగించడం సమంజసమనిపిస్తుంది. ‘‘సమాజం నుంచి మనమెంతో తీసుకున్నాం. అందుకు ప్రతి సమాజానికీ మనమేమైనా ఇవ్వాలి. సమాజ రుణం తీర్చాలి, తల్లి రుణం, తండ్రి రుణం, గురు రుణం లాగే… అందుకు మనం చేయగలిగిందేదైతే అది. మనం చేయగలిగింది సాహిత్యం… అదే నిబద్ధతతో… ఇద్దాం.