అమ్మ ఆంతర్యం -డా॥ లక్ష్మీ రాఘవ

‘‘మొండిగా వాదిస్తున్నావు అమ్మా’’ కోపంగా అన్నాడు పార్వతమ్మతో పెద్దకొడుకు రామారావు.
‘‘అమ్మ మొండితనం ఇప్పటిది కాదు. నాన్న ఎలా వేగాడో అనిపిస్తుంది…’’ అమ్మ మీద కోపం ఇంకొంచెం ముందుకు పోయింది రెండో కొడుకు సూర్యం మాటల్లో.

వారివైపు చూస్తూ పార్వతమ్మ ‘‘అవునురా… నాన్న నాతో ఎలా వేగాడో అని మీకు సమాధానం చెప్పాలి నేను. నేను పట్టుదల గలదాన్ని కనుకనే మీరు ఈ రోజు ఇంత ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ ఇల్లు నిలిచింది’’ కోపంగా అంది.
‘‘మీ పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి అనేకదా… నీవు అడ్డు చెప్పేది. రేపు నీవు పోయాక మా చేతికి రాకపోతుందా??’’
‘‘ఇది మీ తాత సంపాదన కాదు మీకు వారసత్వంగా రావడానికి. నాకు మా పుట్టింటివాళ్ళు పసుపు కుంకుమ కింద ఇచ్చినది. నా స్వంత ఆస్తి. నేను కావాలంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు…’’ తీవ్రంగా జవాబు వచ్చేసరికి కాస్త మెత్తబడ్డారు కొడుకులిద్దరూ. ఎక్కువ వాదిస్తే అసలుకే మోసం వచ్చి ఎవరికైనా రాసేస్తుందేమో అనిపించింది. మారు మాట్లాడకుండా బయటకు నడిచారు.
ఇద్దరికీ కసిగా, కోపంగా ఉంది. కానీ ఏదోలా ఈ ఇల్లు అమ్మేయాలి. ఆమెకు సానుకూలంగా వ్యవహరించకపోతే ఇంకా మొండికేస్తుందేమో. నెమ్మదిగా నచ్చచెబితే దారికొస్తుందేమో.
ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న టీ కొట్టులో టీ తాగి అమ్మకు ఎలా చెప్పాలో మాట్లాడుకున్నారు.
ఒకసారి గతం గుర్తుకు తెచ్చుకుంటే చిన్నప్పటినుండీ ఇంట్లో ఏ నిర్ణయాలన్నా అమ్మే తీసుకునేది. తమ చదువుల విషయంలో అమ్మ ఇంజనీరింగ్‌లోనే చేర్పించాలని ఎంతగా వాదించింది నాన్నతో. ‘‘మీ చెల్లెళ్ళ పెళ్ళికని మీ ఆస్తి అంతా అమ్ముకున్నాము. నా కొడుకులకు అన్యాయం చెయ్యడం కుదరదు. మా పుట్టింటివాళ్ళ సాయం తీసుకుంటా. ఎలాగూ అన్నయ్య నాకు ఆస్తి ఇస్తానని అన్నాడు. ఉపయోగించుకుందాం.’’ ‘‘నీవు ఒక్కతే ఆడబిడ్డ అని వాళ్ళు సాయం చేసినా… నాకు సిగ్గుగా ఉంటుంది. మా నాన్న మిగిల్చిన ఆస్తి అంతా చెల్లెళ్ళను సెటిల్‌ చెయ్యడానికే సరిపోయింది. నా జీతంతో వీలైనంతవరకూ పిల్లలను డిగ్రీలో చేరుద్దాము. ఏదో ఉద్యోగం దొరక్కపోదు. ఇంజనీరింగ్‌ అంటే మాటలు కాదు… చాలా ఖర్చవుతుంది.’’
‘‘ఇప్పుడు మా వాళ్ళ సహాయం తీసుకుంటే నామోషీ అనుకుంటే ఎలాగండీ. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాదా? రేప్పొద్దున్న పిల్లలకు మనం ఇచ్చేది చదువేనండీ. తరువాత వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. తాతల ఆస్తి ఎలాగూ
కరిగిపోయింది. ఈ విషయంలో మీరేమనుకున్నా సరే నేను అన్నయ్యను సాయం అడుగుతాను. మిమ్మల్ని తక్కువ చేసినట్టు కాదు. పిల్లల కోసం అంతే…’’ అలా అమ్మ తమ తరపున నాన్నతో వాదించేది ఎప్పుడూ. అమ్మ పట్టుదల వల్లే ఈ రోజు ఇంజనీర్లయి మంచి ఉద్యోగాలలో ఉన్నారు. అది మాత్రం నిజం.
అమ్మ పుట్టింటి వాళ్ళిచ్చిన చిన్న స్థలంలో చిన్నగా ఇల్లు కట్టుకున్నారు. దానిమీద అప్పు కూడా నాన్న ఉన్నప్పుడే పొదుపుగా సంసారం చేస్తూ తీర్చారు. ఇప్పుడు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. వారి సంసారం మొదలయ్యాక నాన్న చనిపోతే అమ్మను తమ దగ్గరికి తీసుకెళ్ళి కొద్దిరోజులు పెట్టుకున్నారు. కోడళ్ళను ఏనాడూ ఇబ్బంది పెట్టేది కాదు.
కానీ ఆమె ఎక్కువ రోజులు కొడుకుల దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. వెనక్కి వచ్చి ఒంటరిగానే ఉంటోంది.
ఇప్పుడు ఊర్లో అమ్మ ఉంటున్న ఇల్లు అమ్మేస్తే మంచి రేటు వచ్చేలా ఉందని తెలిసి వచ్చారు రామారావు, సూర్యం. అది చెప్పాక అమ్మ ఎందుకింత మొండికేస్తోందో తెలియటం లేదు. ఎంత పుట్టింటి ఆస్తి అయితే మాత్రం తన కొడుకులకి ఇవ్వడానికి కూడా ఎందుకు ఒప్పుకోవడం లేదు? దీని గురించిన మాటలతో, ఆలోచనలతో ఇల్లు చేరారు.
అమ్మ భోజనానికి వారికోసం ఎదురుచూస్తోంది. అందరూ నిశ్శబ్దంగానే భోంచేశారు. అమ్మ అన్నీ సర్దేసి వచ్చి ‘‘కాసేపు పడుకోండి’’ అంది. అదొక్కటే తక్కువ… అనలేదు ఇద్దరూ. వెళ్ళి నడుం వాల్చారు.
గదిలో పడుకున్న రామారావు ‘‘సూర్యం, అమ్మకు ఏదో కారణం ఉండే అలా మాట్లాడి ఉంటుంది. నేను నెమ్మదిగా అడుగుతాను. నీవేమీ మాట్లాడకు’’ అన్నాడు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గరగా చాప వేసుకుని కునుకు తీయాలని పడుకున్నా కొడుకులిద్దరూ మాట్లాడిన మాటలు పార్వతమ్మ మనసులో కలవరం రేపాయి. తను కూడా తొందరపడి మాట్లాడిరదేమో. సాయంత్రం అయినా సరిగ్గా చెప్పాలి అనుకున్నాక కాస్త కునుకు పట్టింది. అందరూ లేచాక కాఫీ తాగారు. హాలులో వారు కూర్చున్న చోటుకే కాఫీ తెచ్చుకుని కూర్చుంది పార్వతమ్మ.
‘‘అమ్మా… నీ మనసులో ఏముందో తెలియటం లేదు. ఎప్పటికైనా మేము ఇక్కడ సెటిల్‌ అయ్యేది లేదు. దీనికి మంచి బేరం వచ్చిందని నా ఫ్రెండ్‌ రమేష్‌ ఫోన్‌ చేశాడు కాబట్టే వచ్చాము. ఈ విషయంలో నీకు అంత పట్టుదల ఎందుకో తెలియటం లేదు. నీవేమనుకుంటున్నావో మాతో చెప్పొచ్చు కదా…’’ అన్నాడు రామారావు నెమ్మదిగా.
‘‘నేను కూడా ఆ మాటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు మీ నాన్నతో పెళ్ళయినప్పుడు మీ తాతగారిది మంచి ఆస్తే. కానీ అక్కర్లేని ఆర్భాటానికి పోయి, ఎవరెవరినో ఆదుకుంటామనీ, ఇష్టం వచ్చిన రీతిగా ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. తండ్రికి ఎదురుచెప్పే ధైర్యం లేక మీ నాన్న తన ఉద్యోగరీత్యా ఊరికి దూరంగా వెళ్ళారు. మీ తాతగారు హఠాత్తుగా చనిపోవడంతో ఊరికి వచ్చిన మాకు ఆస్తి వివరాలు తెలిసి షాకయ్యాము. అప్పుడు రాము చిన్నవాడు, సూర్యం కడుపులో ఉన్నాడు. ఉద్యోగం సొంత ఊరికి దగ్గర్లో చూసుకున్నాము. ఇంట్లో ఇద్దరు పెళ్ళి కావాల్సిన చెల్లెళ్ళు ఉండడంతో గత్యంతరం లేక మిగిలిన ఆస్తి అమ్మి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నది ఒక్కటే… నా పిల్లలు బాగుండాలంటే నేనే కాస్త గట్టిగా నిలబడాలని. మా అత్తగారు పోతూ ఇచ్చిన బంగారంతో గుట్టుగా కాపురం చేసుకుంటూ మీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కంకణం కట్టుకున్నాను. నా పుట్టింటి వాళ్ళు కాస్త కలిగిన కుటుంబం కాబట్టి ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. మీ నాన్నకు మొహమాటం ఎక్కువ. అందుకే మీకు అన్నీ నేనే పెత్తనం చెలాయిస్తున్నట్టు అనిపించేది. అలా నేను అన్నీ నిర్వహించాను అనటం కంటే మీ నాన్న సహకరించారు నా మీద నమ్మకంతో.
నాన్న పోయాక మీరు నన్ను మీ ఇళ్ళకు తీసుకెళ్ళినా మీ వాతావరణంలో నేను పూర్తిగా ఇమడలేకపోయాను. కాలంతో పాటు మీరూ, మీ సంసారంలో నేను గమనించింది ఒక్కటే. బాగా సంపాదన ఉన్న మీరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. నేను కాదనను. పెద్దింటి ఆడపడుచునైనా అప్పటి పరిస్థితులకి తలవంచి చాలా కష్టాలు అనుభవించాను.
ఇప్పుడు మీరు ఈ ఇల్లు అమ్మే అవసరం లేదు. మీ పిల్లల విషయంలో ఇంకా అవసరాలు ఉన్నాయి, వస్తాయి కూడా. మీ పిల్లలకైనా పాత తరం ఆస్తి కొద్దిగానైనా ఉంచాలని, అది తప్పకుండా మంచి అవసరానికి పనికి వస్తుందని నేను నమ్ముతున్నాను. మీ జీవితాలు మీ జీతాలతో గడిచిపోతాయి. ఈ ఒక్క ఇల్లు ఉండనివ్వండి. మీకే ఉపయోగపడుతుంది. ఇందులో మిమ్మల్ని కానీ, కోడళ్ళను కానీ నేను ఏమీ అనను. మీ జీవితాలలో నేను భారం కాకూడదని నిర్ణయించుకున్నాను.
ఇంకో విషయం… మీ ఫ్రెండ్‌ రమేష్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి మీకు ఒక రేటు చెప్పాడు. ఈ స్థలం రేటు మరో ఐదేళ్ళలో విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి నేను ఈ ఇల్లు నా తదనంతరం మీకు చెందేలా రాసి పెడతాను. మీకు ఎంత కోపం వచ్చినా ఇప్పుడు ఈ ఇల్లు అమ్మనివ్వను. నా నిర్ణయం ఇదే. దీనివల్ల మీకే లాభం రామూ, సూర్యం. ఇదే మీకు చెప్పాలని అనుకుంటే మీరు ఆవేశంగా మాట్లాడారు కాబట్టే నేనూ జవాబు ఇవ్వాల్సి వచ్చింది. నేనేం చేసినా మీ బాగుకోసమే…’’ కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్న తల్లి పాదాలకు నమస్కరిస్తూ రామూ, సూర్యం ‘‘నీ ఇష్టప్రకారమే కానీ అమ్మా’’ అన్నారు ఒకేసారి.
అమ్మ ఏమి చేసినా పిల్లల క్షేమం కోసమే!!

`

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.