‘‘చలం’’ ఈ పేరులో ఇప్పటికి కూడా ఒక శక్తి ఉంది. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవారు, అవగాహన ఉన్నవారు రెండు వర్గాలుగా చీలిపోతారు. చలం ప్రస్తావన వస్తే, చలాన్ని విపరీతంగా ప్రేమించి పూజించే ఒక వర్గం, చలాన్ని అదే స్థాయిలో ద్వేషించే మరో వర్గం.
ఇక కొందరు వారి ప్రయోజనాలను బట్టి ఏదో ఒక వర్గంలో కొంత కాలం చేరిపోతూ ఉంటారు. కానీ మధ్యస్థంగా ఉండి చలాన్ని ఒక సామాజిక ప్రయోగాలు చేసిన ఒక దార్శనికుడిగా నిష్పక్షపాత దృష్టితో చూసేవాళ్ళు చాలా అరుదు. చలం స్వతహాగా ఒక గొప్ప ప్రేమికుడు. ప్రేమికుడిగా మాత్రమే చూస్తే అతనిలో దైవత్వం కనిపిస్తుంది. కానీ జీవితం అక్కడితో ఆగదు. అక్కడి నుంచి బంధాల వైపు ప్రయాణించవలసిన అవసరం తప్పదు సమాజానికి. ఆ క్రమంలో చూసినప్పుడు అతని ప్రయోగాలలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. దీన్ని ప్రస్తావించడం వలన చలంపై గౌరవం లేదని అర్థం కాదు. సమాజంలో మార్పు ఆశించి, సదుద్దేశంతో, ఆశయంతో ముందుకు దూసుకుపోయే వ్యక్తిలోని మానవ ప్రేమ, నిస్వార్థత, మంచితనం, ఇవన్నీ ఒప్పుకొని తీరవలసినవే. చలంలో ఈ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ రోజు నుండి నేటిదాకా సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, చలం మార్గాన్ని విశ్లేషిస్తూ వెళితే, చలం జీవించిన విధానంపై కొన్ని అనుమానాలు కలుగుతాయి. ఆశ్చర్యంగా చలం ప్రేమ, చలం ద్వేషం తప్ప చలం చేసిన ప్రయోగాలను పరిశీలించే బాలెన్స్‌డ్ పాఠకులు మన తెలుగులో చాలా తక్కువ. ఉన్నా వారు తమ అభిప్రాయాలు బైటికి చెప్పరు. ఎక్కడా కమిట్ కారు. ఏదో ఒక వర్గానికి శత్రువు అవ్వవలసి వస్తుందని భయం వారికి.
చలాన్ని అర్థం చేసుకోవడానికి వారి రచనలతో పాటు వారిపై వచ్చిన పుస్తకాలు, సద్విమర్శలు, దుర్విమర్శలు, నాకు దొరికిన మేర చదివాను. కాని చలం నాకు వారి ఆత్మకథలో బాగా అర్థమయ్యారు. ఒక వంద సంవత్సరాల క్రితం సమాజంలో స్త్రీ పరిస్థితి ఏంటీ, వారు వివాహం అనే సిస్టంలో ఎలా నలిగిపోతున్నారు, మనుష్యులుగా కాక మరలుగా ఎలా మిగిలిపోతున్నారో చలం ప్రతి అక్షరంలో చెబుతూ పోయారు. వివాహాన్ని ద్వేషించారు. తన పిల్లలు వివాహాలు చేసుకోకపోవడమే మంచిదని నమ్మారు. సంఘ సంస్కర్త పక్కింట్లో
ఉండాలి కాని తన ఇంట పుట్టకూడదు అని ఆలోచించే సగటు మనుష్యుల మధ్య తాను నమ్మిన సిద్ధాంతాలను, తన జీవితంపై, తన పిల్లలపై ప్రయోగించుకున్నారు. ఇక్కడ చాలావరకు గాంధీ, బర్ట్రేండ్ రసల్ లాంటి వ్యక్తుల జీవన పంధా కనిపిస్తుంది. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉన్న పెద్ద తెగులేంటంటే ప్రతిదాన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే చూస్తాం. మధ్యలో గ్రే షేడ్స్ మనం అంగీకరించం. ఎంత పెద్ద మేధావయినా, ఎంత గొప్ప ఐడియాలజీ అయినా చాలాసార్లు ఫెయిలై తరువాత తరం లోపాలను దిద్దుకుంటూ వెళ్తేనే ఒక రూపంలోకి వస్తుంది. కానీ ఆ నిజం మనం సాహిత్యంలో ఒప్పుకోం. చలం కరెక్టు అన్నవారికి వారి ప్రతి వాక్యం వేదమవుతుంది. అతన్ని విమర్శించే వారికి వారి ప్రతి మాట బూతే అవుతుంది.
సమాజంలో మార్పు సహజం. వందేళ్ళ నాటి సమాజం ఇప్పుడు లేదు. అలాగే వందేళ్ళ నాటి ఆలోచనా ధోరణులు, చట్టాలు ఇప్పుడు లేవు. చలం చేసిన ప్రయోగాలలో కొన్ని గొప్పగా ఉపయోగపడినవి ఉన్నాయి, కొన్ని సమస్యలను పెంచినవీ ఉన్నాయి. నిరంతరం ఆలోచనతో సత్యాన్వేషణతో ఉన్న వ్యక్తులు తాము నమ్మిన సిద్ధాంతాలను కార్యాచరణలో పెడుతూ వెళ్తారు. దాని పర్యవసానాలు వారు అనుభవించి మళ్ళీ తమ దారిని మరల్చుకున్న సందర్భాలు అందరి జీవితాలలో కనిపిస్తాయి. కానీ మనం వారి ఆలోచనలలో ఆ రిఫార్మ్‌ని గమనించం, అదే గుడ్డి అభిమానం లేదా అసూయ తప్ప రేషనలైజ్ థింకింగ్‌తో ఇలాంటి సోషల్ ఎక్స్‌పరిమెంట్లను విశ్లేషించం. చలం విషయంలో కూడా అదే జరుగుతున్నదని వారి ఆత్మకథను మరోసారి చదివితే అర్థమయింది.
చలం తన రచనల గురించి ఈ ఆత్మకథలో ఇలా రాసుకున్నారు ‘‘రచయితని కావాలనేది నా ఆశల్లోనూ, ఆశయాల్లోనూ ఒకటి కాదు. దానివల్ల నాకేం తృప్తిలేదు. ఇది నా జీవితానికి ఒక byproduct మాత్రమే’’ ‘‘ఎంతసేపటికీ నా దృష్టి ఆ కాలంలో నన్ను సంతృప్తి పరచగల స్త్రీ కోసమే. లీలగారితో స్నేహం చల్లబడ్డ తరువాత నాకు తెలిసింది. నా ఆదర్శ స్త్రీ నాకు ప్రత్యక్షం కాకపోవడానికి కారణం నా అనర్హతేనని. నాలో ఉన్నటువంటి inteiornself ని నాశనం చేసుకోవాలి. I must rise superior to women. బైట ఎంత వెతికినా అది ఉత్త అవివేకమని, ఎన్నటికైనా నా అదృష్టం ఫలించి ఈశ్వరుడి దయ కలిగి నన్న పూర్తిగా మన్నించి, నన్ను ఒళ్ళోకి తీసుకున్నదాకా నాకు తృప్తి, సంతోషం, ఈ లోకంలోగాని ఆ లోకంలోగాని ఉండవని, ఈ భూమిలో దొరికేవాటిని కోరి, సాధించి తెచ్చుకుని తృప్తిపడే అదృష్టవంతుల్లో నేను ఒకణ్ణి కానని’’ ఇలా తన జీవితంలోని ప్రయోగాలకు తానే ఒక conclusion ఇచ్చారు చలం. తన జీవితంలో తాను ఎంచుకున్న దారిలో తనకు లభించని తృప్తి, మనశ్శాంతి గురించి ఇంత నిజాయితీతో చలం చెప్పుకున్నది ఎంత మంది గుర్తించగలిగారు?
‘‘లోకం ఈ ప్రకారం ఏర్పడ్డది. సంఘం ఈ పద్ధతుల మీద నడుస్తుంది. ఆ పద్ధతులలో, ఆ ప్లాన్తో పోరాడి ఏం ప్రయోజనం లేదు, వాటితో అడ్జస్ట్ కావాలి. కానీ నేను కాలేను. ‘‘నేనొక Aristricrat ని. నేను చూసే ప్రజలందరికంటే నేను ఏ విధంగానో అధికుణ్ణి. నాలోగాని ఇతరులలో గాని ఏ తక్కువతనం నేను భరించలేను’’ అని తన గురించి తను చెప్పుకున్నారు. అందుకే తన స్థాయి సోల్‌మేట్ కోసం నిరంతరం వెతుక్కునేవారు. తనను తాను ఇంత నిజాయితీగా విశ్లేషించుకోవడానికి మనిషిలో చాలా నిజాయితీ కావాలి. ఆ నిజాయితీ చలంలో వారి రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన చర్చించిన సమస్యలన్నీ సమాజంలో ఉన్నాయని అంగీకరిస్తాం. అసలు సమస్య ఉందని అంగీకరించడమే ఒక పెద్ద ఎడ్యుకేషన్. చలం రచనలు దానికి ఉపయోగపడతాయి. అందుకే చలాన్ని ద్వేషించే వారి సంఖ్య ఎక్కువ. చలం ఆ ఎడ్యుకేషన్‌ని తన పాఠకులకు చాలా స్పష్టంగా, సూటిగా పాఠాలు బోధిస్తూ ఇస్తాడు. తాము సమాజ నియంత్రణలో పితృస్వామ్య ఖైదులో ఉన్నామని స్త్రీలకు తెలియబరిచాడు. అందుకే స్త్రీ స్వేచ్ఛకు తెలుగింట నాంది వాక్యం పలకగలిగాడు.
స్త్రీని చలం ప్రేమించిన విధం ఎలాంటిదంటే… ‘‘నా ప్రియురాళ్ళు వచ్చి నాతో ఐక్యం అయిపోవాలి. వాళ్ళు నాతో ఉండిపోవాలి. అంతేగాని పురుషుడు స్త్రీని కోరినట్లు ఒక గంటో, అరగంటో కోరడం నాకు తెలియదు. అటువంటివి నాకు గిట్టవు. నాకేదన్నా సంతోషం వస్తే నా లోపల్నుంచి రావలసిందే కాని బైటనుంచి వచ్చే సంతోషం చాలా తక్కువ. ఇది చలం తన గురించి తాను చెప్పుకున్న మాట. అందుకే నిరంతర అన్వేషణే తన మార్గం చేసుకోగలిగారు. కానీ ఈ ప్రవృత్తి లేని వ్యక్తులు స్త్రీలు కాని, పురుషులు కాని చలం నడిచిన దారిలో నడవగలరా… చలానికే దొరకని మానసిక ఆనందం ఆ మార్గాన్ని ఆశ్రయించిన వ్యక్తులందరికీ దొరుకుతుందా.
అసలు స్త్రీ పురుష సంబంధాలలో కూడా ప్రతి మనిషి మానసిక అవసరాలు ఒకే స్థాయిలో ఉండవు. అందరిలో అదే స్థాయి భావుకత ఉండదు. అంత మాత్రాన వాళ్ళు మంచి భాగస్వాములుగా కారనేదేం లేదు. తనకు కావలసిన జీవితాన్ని అందుకోగలిగే స్వేచ్ఛ స్త్రీకి ఖచ్చితంగా ఉండాలి. అది ఆమె హక్కు. ఆ హక్కు కోసం ఆమె పోరాడాలి. ఆ పోరాటం ఆమె జీవితాన్ని కొంత మెరుగుపరచాలి లేదా ఒక ప్రయోజనం ఉన్న పోరాటం అవ్వాలి. నచ్చిన భాగస్వామితో జీవించడం ఆమె హక్కు. ఇష్టంలేని వివాహాన్ని వదలే వెసులుబాటు ఆమెకు ఉండి తీరాలి. ఇవన్నీ చలం చెప్పిన స్త్రీ స్వేచ్ఛ కిందకే వస్తాయి. జీవితాన్ని materialistic గా కాక individualisticగా జీవించే వెసులుబాటు స్త్రీకి, పురుషుడికి. ఇద్దరికీ
ఉండాలి. Man woman relationship ఒక proper union అవ్వాలి. ఇదీ చలం చూపించిన మార్గం.
ప్రస్తుత వివాహ వ్యవస్థలో లోపాలున్నాయి. స్త్రీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని హరించే విధానమే ఇది. కానీ దానికి ప్రత్యామ్నాయం చలం మార్గం కాదన్నది చలం జీవితం చెప్పిన కథే. ఆ జీవితాన్ని గడిపిన ఒయ్యి, రంగనాయకమ్మ గార్ల జీవితాలు ఏ దరి చేరాయి? ఒయ్యి చనిపోతుందని తెలిసినా, ఆమె గుండె దెబ్బతిన్నా గుడ్డిగా అప్పుడు లీలగారితో ఉంటున్నాను అని చలమే చెప్పుకున్నారు. తన జీవితాన్ని సంపూర్ణంగా కరిగించి ఇచ్చిన ఆమెకు లభించినది ఏంటీ? నేనిలాంటి దుర్బర వ్యామోహంలో పడ్డాను అని చలమే ఒయ్యి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పారు. ఆమె చనిపోతే తామందరూ చనిపోవాలని అనుకున్నారంటే ఆమె ఆ కుటుంబానికి ఎంత అండ? కాని ఆవిడకు లభించినది ఏంటీ? అలాగే రంగనాయకమ్మ గారు ఎంతగా చలంతో కలిసిపోవాలని ఆమె ప్రయత్నించి ఉంటారు. పిల్లలు ఆమె మాట వినక, తన అనుకున్నవారు లేక మతి చలించి ఆమె అన్నేళ్ళు జీవించారంటే ఆ జీవితంలోని విషాదానికి చలంగారిని కారణం అనలేకపోతే ఇక స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని స్త్రీలే గుర్తించనట్టు కదా. చలం గారి కన్నా రంగనాయకమ్మగారు వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా జీవించడానికి చేసిన పోరాటం మనసులను కరిగిస్తుంది కదా.
చలంగారి ఆత్మకథను నిశితంగా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే చలం స్త్రీ సంబంధాలలో అతనిలో కనిపించనిది కమిట్‌మెంట్. తనను ప్రేమించిన స్త్రీలు తనకు కావల్సినట్లుగా తమను తాము మలచుకునే స్త్రీలు, అన్‌కండిషనల్‌గా తనను ప్రేమించి తన కోసం ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న స్త్రీలు వీళ్ళతో జీవితం పంచుకున్నా ఏదో వెలితి వారిని ఆవహించే ఉంది. అది ఆధ్యాత్మికతలో తీరుతుందని చివర్లో వారు నిర్ణయించుకున్నారు. తన జీవితంలోని ప్రతి స్త్రీ పురుష సంబంధాలలో తనకు కావలసినదాన్ని అందుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ స్త్రీలు తన నుంచి ఏం కోరుకుంటున్నారన్న దానిపట్ల వారు పెద్దగా దృష్టి పెట్టలేదు. భార్య అయిన రంగనాయకమ్మను అప్పటి దాకా పెరిగిన వాతావరణం, ఆలోచనల నుండి uproot చేసి బ్రహ్మ సమాజ ఆదర్శాలకు అనుగుణంగా మరల్చుకున్నారు. అయితే, రత్నమ్మ అనే స్త్రీతో సంబంధం పెట్టుకున్న కారణంగా తానే ఆ తరవాత ఆ సమాజం నుండి బైటకు వచ్చారు. ఆయన కోసం అంతలా మారిన రంగనాయకమ్మ గారు అప్పుడు కూడా వారితోనే ఉన్నారు. వారి ఈ స్త్రీ ప్రేమను స్వీకరించారు. కానీ అది తప్పక స్వీకరించారా, లేక చలంపై ప్రేమతో స్వీకరించారా వారికే తెలియాలి. వారి మిత్రులను కుటుంబంలా చూసుకుంటూనే ఉన్నారు. ఆవిడకు లభించిన స్వేచ్ఛ, ఆవిడ చదువు, ఉద్యోగం, ఆవిడకు నచ్చని వారిని చలంగారు ఇంట్లో కలుసుకోకపోవడం. కానీ ఆమెకు సొంత పిల్లలపై ఎటువంటి పట్టు లేకుండా పోయింది. ఒక్కరు కూడా ఆమె కోరుకున్నట్లు మారే పరిస్థితులు లేవు. చలం పిల్లలకు పూర్తి స్వేచ్ఛ అంటూ వారి జీవితాలను వారికే వదిలేశారు. వారి జీవితాలలో రంగనాయకమ్మ గారి ప్రమేయం లేకుండా చూశారు. ఆమె చలం భార్యగా సమాజం చూపే కోపానికి బలయ్యారు, మానసిక స్ధైర్యం కోల్పోయారు. ఇంత చేసినా చలంగారి ఔదార్యం లభించింది కానీ ఆమె కోరుకున్న సాంగత్యం కాదు.
ఇక వొయ్యి పరిస్థితీ అంతే. చలం సంతానాన్ని చూసుకోవడమే తన బాధ్యత అనుకున్నారు. కానీ ఆమె మృత్యువుతో పోరాడుతున్నప్పుడు ఆయన లీల గారి ప్రేమలో మునిగి తేలుతున్నారు. లీల గారు అన్నీ వదిలి వచ్చి చలాన్ని సంపూర్ణంగా పొందాలనుకున్నారు. వారిని తన ప్రేమతో బంధించాలనుకున్నారు, కాని చలం లీల గారి నుండి కూడా దూరమయ్యారు. ఈ స్వేచ్ఛా మార్గంలో వారికి స్త్రీ ద్వారా సంపూర్ణ ప్రేమ దొరికిందా అంటే లేదనే చెబుతారు ఆత్మకథలో.
‘పెద్దపులి నోటినుంచి తాను చంపి తినబోయే మేకని లాగేసి మనిషి బతకగలడు గాని రోజు తన్నులు తినే భార్యకి రక్షణనిచ్చావంటే సంఘం నుంచి నిన్ను తప్పించగలవారెవ్వరు? అంటూ సమాజం తనను ఎందుకు ద్వేషిస్తుందో చెప్పగలిగారు చలం. అలాగే తనను ప్రేమించే సమాజానికి మార్గం చూపే స్థాయికి ఇంకా తాను రాలేదనే చెప్పుకున్నారు.
బడులను నిర్మూలించాలని చెబుతూ అలా చేస్తే ఈ నాగరికతనే నిర్మూలం చేస్తున్నారని అర్థం కూడా అంటారు. చలం విద్యా విధానం చాలావరకు ఫిన్లాండ్‌లో ఆచరణలో ఉన్నట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజకీయ విధానం మారితే తప్ప విద్యా విధానం మారదు అని చలం ఆనాడే ఒప్పుకున్నారు. అయితే మార్పు సహజంగా రావాలి. మన సమాజంలోని వ్యవస్థ అంటకుండా మన ఇంట్లో పిల్లలను పెంచే ప్రయత్నం చేస్తే వీరు ఏ సమాజంలో బ్రతకాలి? ఎల్లప్పుడూ సమాజ బహిష్కృతులుగానే ఉండడానికి వాళ్ళు ఎంతవరకు సిద్ధమవగలరు? ఇవి ఆలోచించకుండా తాము నమ్మిన ఆదర్శ విద్యావిధానాన్ని తమ పిల్లలపై రుద్ది పెంచడం వలన వారి జీవితాలు ఏ దిశలో నడుస్తాయి? సమాజం సిద్ధంగా లేని విధానం వైపు ప్రయాణించాలంటే ఒక క్రమంలో మార్పు జరగాలి. అప్పటిదాకా ఆ వ్యవస్థలోనే ఉంటూ alternate system వచ్చేలా ఎక్కడ నుండి కృషి చేయాలో, ఆలోచించకుండా ఒకేసారి విపరీత విధానాన్ని ఇంట ప్రయోగించి, బైట ప్రపంచంతో అన్ని రకాలుగా వారిని దూరం చేసి సంస్కర్త సాధించేదేంటి? ఆ సంఘర్షణ చలం గారి సంతానంలో కనపడదా? ఒక సౌరీస్ తప్ప ప్రతి ఒక్కరూ ఆ కన్ఫ్యూజన్‌కి బలయినవారే మరో సందర్భంలో తన కొడుకు వసంత్ స్థితి గురించి చెబుతూ ‘‘నాకో ప్రిన్సిపల్ ఉండి, నాకో గ్రౌండ్ ఉంటే వసంత్‌లో మార్పు కోసం కొంత ప్రయత్నించవచ్చు. నాకే గ్రౌండ్ లేదు. నేనే చీకట్లో వెతుకుతూ బతుకుతున్నాను. నేనెలా సహాయపడగలను’’ అనుకోవడం తండ్రిగా బాధ్యతారాహిత్యమే అనిపిస్తుంది. పైగా ఈ పాడు శుష్క జీవనులకంటే నాశనమైపోయినా, తన సొంతంగా తన చేతులలో తను నడుపుకున్నటువంటి జీవితం చాలా గొప్పది అని అనుకోవడం, అతని జీవితం మీద నాకే అధికారం అనుకోవడం తల్లి తండ్రులుగా ఇప్పుడు మనం చేయగల పనేనా… ప్రకృతిలో ప్రతి జీవి కూడా గుడ్డు నుంచి బైట పడిన పిల్ల తిండి సంపాదించుకోవడం నేర్చుకునే వరకు తానే గురువై నేర్పిస్తుంది. పక్షులు బిడ్డలను పట్టించుకోకుండా వాటిని ఇబ్బంది పెట్టి బలవంతంగా ఎగరడం నేర్పిస్తాయి. క్రూర జంతువుల నుండి రక్షిస్తాయి. పిల్లి తన నోట పిల్లలను కరుచుకుని ఏడు చోట్లు మారి బిడ్డలను కాపాడుకుంటుంది. అంతేకానీ వాటి మార్గం అవి వెతుక్కుంటాయి అంటే జాతే నాశనమవుతుంది కదా. మరి ఇంత విషపూరిత వ్యవస్థ మధ్య పిల్లలను తీసుకువచ్చిన మనిషి తన సంతానం నిలబడడడానికి, బ్రతకడానికి తనవంతు కృషి చేయాలి కదా. చలం దృష్టిలో పిల్లల భవిష్యత్తు గురించి అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చు గాని తన దారి తాను వెతుక్కున్నట్టే పిల్లలకూ వారి దారి వారు వెతుక్కునే అవకాశం కలిగేలా చూడాలి కదా, అంటే మనకు తప్పనిపించే వ్యవస్థను కూడా వారే ఎక్స్‌ప్లోర్ చేసుకోగలిగే అవకాశం వారికి మిగల్చాలి కదా… అది చలంగారు తన పిల్లల విషయంలో చేశారా. వారు అలవాటు పడ్డ వ్యవస్థ నుండి mainstream లోకి రాగలిగిన అవకాశాలు ఎన్ని?
ఇప్పటి పరిస్థితులలో చలం బిడ్డల శిక్షణ చూస్తే మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంటర్నెట్, పోర్న్, డ్రగ్స్. ఫ్రీ సెక్స్ ఇవన్నీ కలిగించే ప్రమాదాలు గుర్తుకువస్తున్నాయి. పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య కనిపిస్తూనే ఉంది. ఆ రోజులలో లభించని స్వేచ్ఛ ఇప్పుడు కొంతమందికి ఉంది. కాని అది వారికి మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుందా? వివాహం అనే వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలన్నా, సమాజంలోని స్త్రీ స్థానాన్ని నిజమైన స్వేచ్ఛతో నింపాలన్నా కావలిసింది స్త్రీలు తెగించి తమ జీవితంలో నిర్ణయాలు తాము తీసుకోవడం కాదు. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ పురుషుడిని వదిలి మరొకని వద్దకు చేరుతుంది కాని బేసికల్‌గా స్త్రీ పట్ల పురుషుని ఆలోచనలలో మార్పు రావట్లేదు కదా. బానిసలను తమ బానిసత్వం అసహజం అని దాన్ని గుర్తించి దాని నుండి విముక్తి కోరుకొమ్మని చెప్పడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర దేశంలో చలం ఆ కొరతను పూర్తిగా స్త్రీలను వ్యక్తిత్వాలున్న మనుషులుగా మారమని బలంగా చెప్పారు. అది స్త్రీ జాతి ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన విషయం. కానీ దానికి ప్రత్యామ్యాయ మార్గాలు వారు కొన్ని వెతికే ప్రయత్నం చేశారు కానీ అవి వారికే తృప్తి ఇవ్వలేదని వారి ఆత్మకథ వివరంగా చెబుతుంది. ఇది మనం గుర్తించవలసిన విషయం. సంఘంలో లోపాలను ఎత్తి చూపిన గొప్ప వ్యక్తి అతను. కానీ అతని ప్రయోగాలలో జీవన విధానంలో సహేతుకమైన మార్పు తెచ్చే conclusion కి వారే రాలేకపోయారు. చివరకు ‘‘రమణాశ్రమంలో మా మనసు పొంగు చల్లారిన కొద్దీ లోకవాంఛలు వాసనలు, దూరమైనకొద్దీ తెలియకుండానే నిర్మల శాశ్వత శాంతి క్రమంగా పాకుతోంది మాపై. దాన్ని భరించలేక లోకం దూరమైనకొద్దీ తన్నుకునీ, గుంజుకునీ ఈశ్వరుడి ఒడిలో పెనుగులాడుతూ ఉంటాం. ఇది రాయడంవల్ల నాకొచ్చేదేమీ లేదు, మీకొచ్చేదేమీ లేదు. అసలు రాకపోవడానికి, పోకపోవడానికి ఏం లేదు. ఇదే సత్యం, ఇదే మౌనం, ఇదే శాంతీ’’ అని రాసుకున్నారు.
విద్యావ్యవస్థలో రావలసిన మార్పులు, స్త్రీ పురుష సంబంధాలలో మారవలసిన equations గురించి వారు చెప్పిన వాటిని అందరం అంగీకరించాలి. చలం గారి జీవన విధానంలో వారు అనుభవించిన అశాంతి పరిగణనలోకి తీసుకుని అది అందరి మార్గం అని మాత్రం అనుకునే తప్పిదం చేయకూడదు. మనకు పైకి కనిపించే వారి personal failures కారణంగా వారు జీవితంలో ప్రస్తావించిన నిజాలు మాసిపోవు. అలాగే వారు గుర్తించిన నిజాలలో బలం ఉందన్న ఆధారంతో జీవితంలో వీరు ఎన్నుకున్న అన్వేషణ అందరి మార్గం కాజాలదు. ఒక వ్యవస్థ మరో వైపుకు ప్రయాణించే క్రమంలో చాలా మేధోమధనం జరిగి తీరుతుంది. అందులోని ప్రతి ఆలోచనను అన్ని రకాలుగా విశ్లేషించి తమ జీవితాలకు ఆపాదించుకుని మార్పులు చేర్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. చలంగారి జీవితం ఈ విశ్లేషణకు పూర్తి scope ఇచ్చే pure social experiment. తన జీవితాన్ని ఆ ఎక్స్‌పరిమెంట్‌కి గురి చేయగలిగిన గొప్ప వ్యక్తి ఆయన. అయితే వారికి మూఢ భక్తులుగానో అదే స్థాయిలో ద్వేషించే వారిగానో మిగలకుండా చలాన్ని, ఆయన జీవితాన్ని ఆయన చెప్పిన నిజాలను గుర్తించి, అందులోనుంచి అనువైన మార్గాన్ని ఎన్నుకుని జీవించవలసిన అవసరం ప్రసుత తరానికి ఉంది. ఈ నిజం వీరి ఆత్మకథ క్షుణ్ణంగా చదివితే అర్థమవుతుంది.