ఎప్పటినుంచో చూస్తున్నా ఆమె కళ్ళని
ఉజ్వలంగా అవి వెలుగుతున్న రోజులనుంచీ.
ఒకప్పుడు
ఉత్సాహపు వాకిళ్ళు ఆ కళ్ళు
మెరిసే కళ్ళకు పదును చెక్కుతూ ఆమె.
ఆ కళ్ళని ప్రతిఫలిస్తూ నేను.
ఆ తరవాత చాలాసార్లు
నాలో క్షణకాలం తనని తాను చూసుకుంటూ
అప్పుడప్పుడూ చిర్నవ్వుతూ
ఎన్నోసార్లు అభావంగా ఆమె కళ్ళు.
సంచలిస్తున్న వెలుగునీడల ఛాయలలో
ఆ కళ్ళను ప్రతిఫలిస్తూ నేను.
అటు తరవాతా ఆ కళ్ళే
రగిలే గుండెను తమలో దాచేసి
నిర్వేదించి, నిస్తేజించి, నిర్లిప్తించి,
తనదికానిచోట ఎక్కడో చిక్కడిపోయినట్టు
ప్రతి ఉదయం నాక్కనబడేవి.
వాటినే ప్రతిఫలిస్తూ నేను.
కొన్నాళ్ళుగా
నిర్దయగా, తీక్షణంగా ఆ కళ్ళు
నాలోతుల్లో ఏదో వెతుక్కుంటూ,
ప్రశ్నించుకుంటూ, తర్కించుకుంటూ,
సమాధానాలు వెతుక్కుంటూ
సంఘర్షిస్తున్న ఆ క్షణాన…
తాను అమాయకంగా నిర్మించుకున్న
మాయా శృంఖలాలు
ఫెటీల్మని చిట్లిపోయినప్పుడు
ఆమె నాలోకి తరచి చూస్తూ
గతాన్నంతా నాలో ముంచేసి
తనలోంచి తుడిపేసి
ఫీనిక్సై పునరుద్భవించింది!
అప్పుడా కళ్ళనుంచి
కొన్ని వేల సీతాకోకచిలుకలు
వర్ణరంజితమైన రెక్కలను విప్పుకొని
విశ్వమంతా విస్తరిస్తూ, విహరిస్తూ,
కొత్త లోకాలకు తెరలు తీస్తూ
నాలోకి ప్రవహించాయి!
ఇప్పుడు, ప్రతిక్షణం నాలో
తేజోవంతమైన ప్రతిఫలనాలు…
చైతన్యంతో భాసిల్లే ఆ కళ్ళు
నాకందిన ప్రతిఫలాలు!