ఈ భూమికి నా పాదం తాకకముందే
ఈ లోకంలో కన్ను తెరవక ముందే
మట్టి గుండెల్ని చెమటతో మా అమ్మ తుడిచినపుడు
బరువులు ఎత్తినపుడు దించినపుడు
ఆయాసంలోంచి గాలిని పీల్చుకుంటూ
మట్టిని తలుచుకుంటూ ముద్దాడాలని ఉబలాటపడినోణ్ణి
సాలుసాలుకు పాలిచ్చి పెంచిన మా అమ్మ
పంట కోతలప్పుడు కారిన నెత్తురుని నొసట అద్దుకున్న నాన్న
మొలకల పాపలకు జోలపాటలు పాడేటప్పుడు
అమ్మ గాయాలని శ్రామిక గీతాలుగా పాడుకున్నోన్ని
నాకెవ్వరూ మట్టి గురించి పాఠాలు చెప్పాల్సిన పనిలేదు
నేను ఈ నేలీయున్ని, భారతీయున్ని, ద్రావిడున్ని
నా భూమి దక్కను పీఠభూమి
రాజ్యాంగ సూత్రాలు పాటిస్తూ పఠిస్తూ జీవిస్తున్నవాన్ని
రాజ్యాంగ శిల్పిని రోజూ చేతులెత్తి స్మరించుకునెటోన్ని
పల్లె పదాలలో నడకలో నడవడిలో తేలియాడినోన్ని
ఎవరి పాటల ప్రభోదం అక్కర్లేదు నాకు…
మొలక నుంచి మహావృక్షం దాకా బండల గుండెలు
పెకిలించుకొని నిటారుగా ఆకాశానికి ఎగబాకినోన్ని
ఎవరి ఒంటికొమ్మ నీడ అవసరం లేదు నాకు
నేను మృత్యువులో కూడా చావుని చదుపు చరిచే వాణ్ణి
ఎన్ని పనికి మాలిన అరుపులు నా చెవులపై వాలినా
ఒక్క చిటికెతో దులుపుకునేటోణ్ణి
అమ్మపాడిన జోలపాటలే నా మొదటిరాగాలు
మా ఊరి మాదిగ ఎంకన్న మామ
బాజాపాటలు పోచమ్మ మంగళారతులే నా నాదస్వరాలు
ఇక నాకెవ్వరి గతులు శృతులు గమకాలక్కర్లేదు
ఇల్లు ఇల్లంతా దుఃఖం లోయలో పెనుగులాడుతుంటే
ప్రపంచమంతా చివరి గడియల్ని తడుముకుంటుంటే
శవం ముందు కల్యాణరాగం తీయలేను
మృత్యువును సుందరీ అని సంభోదించలేను
మల్లెపూల మత్తులో యుగళ గీతాలొలికించలేను
ఎవడి భజన కోసమో తాళాల దరువు కోసమో
అరుగుమీద చేతులు ముడిచి చొంగకార్చలేను
వాళ్ళ కరుణా కటాక్ష వీక్షణాల కోసం కక్కుర్తి పడలేను
నేను ఒక్క నేనే కాదు నేను అనేకాలు
నేనే గ్రామపోషకున్ని… నాగలికి నడక నేర్పి
మెతుకుని అందించే వాన్ని…
నీ అందం ఆరోగ్యం కోసం బట్టల్ని మెరిపించే మడేలును
క్షవరం చేసి నిన్ను మనిషిగా మనిలే నాయి బ్రహ్మణున్ని
నీ మానాభిమానాలకు గాలిపొరల్ని చుట్టిన శాలిబ్రహ్మణున్ని
పుట్టుకనుంచి చావుదాకా అంగాంగం అందాలద్దిన విశ్శబ్రాహ్మణున్ని
చెరువు నడుము తెగకుండా కాపలాకాసిన మాల ఎల్లన్న కాకను…
నిన్ను కాల్చే కట్టెల కొరకు గొడ్డలి నేనే
నీ చివరి యాత్రలో ముందునడిచే కుండను నేనే
నీ అలసటని నిద్రలోకి పంపే కల్లు కుండను నేనే
నా చూపు ఒక కళాఖండం… నా వేళ్ళ విన్యాసం కళా బాండం
నా ఆలోచనలు అద్భుత ఆవిష్కరణ
నా నడక మహాసృజనాత్మక ప్రయాణం
నా శక్తిని ఎప్పుడూ ఆపలేదు నా విద్వత్తును ఎప్పుడూ అందుకోలేదు
నేను నిఖార్సయిన పురజనున్ని… సృష్టికి బహుజనున్ని…