ప్రళయం తర్వాత ప్రశాంతత -పరిమళ కె

‘‘ఒసేయ్‌ పనికిమాలిన దానా! మన ఇంటా వంటా లేవు ఇలాంటి బుద్ధులు నీకు ఎక్కడినుంచి వచ్చాయే? ఇదంతా నా ఖర్మ. నువ్విలా చేస్తావని తెలిస్తే ఎప్పుడో నీ గొంతు నులిమి చంపేసేదాన్ని. ఇంకోసారి ఆ మాట ఎత్తావంటే చంపేస్తా’’ అని అరుస్తోంది సావిత్రమ్మ.

‘‘అమ్మా! అంత తప్పు నేనేం చేయలేదమ్మా. నేను సాగర్‌ని ప్రేమించాను అంతే. అది తప్పెలా అవుతుంది?’’ అంటూ ఎదురు అడిగింది సుధ. ‘‘అయినా వాడు నీ స్కూల్‌ కాదు, కాలేజ్‌ కాదు. మరి ఎలా కలిశారు మీరిద్దరూ. ఇదంతా ఎప్పుడు జరిగిందే?’’ అడిగింది సావిత్రమ్మ కొంత కుతూహలంతో.
‘‘మా ఇద్దరిదీ ఒకే కాలేజి కాకపోయినా ఒకే ఊర్లో ఉండే కాలేజి కదమ్మా. రోజూ నేను బస్సులో వెళ్ళేదాన్ని కదా. అతనూ అదే బస్సులో వచ్చేవాడు. అలా పరిచయమైంది మా ఇద్దరికీ. తను మా కాలేజిలోనే చదివాడట అమ్మా. టీచర్స్‌ అందరూ తనని బ్రైట్‌ స్టూడెంట్‌ అని మెచ్చుకుంటారు. అంతేకాక అతను చాలా మంచివాడని కూడా చెప్పారమ్మా మా కాలేజీలో అందరూ’’.
‘‘ఓహో అయితే కాలేజీలో వాళ్ళు చెప్పారని అతని మీద మనసు పారేసుకున్నావా? హవ్వ, వాడెవరో, ఏమిటో తెలుసుకోకుండా అలా ప్రేమించేయటమేనా?’’ ‘‘ఎవరో, ఏంటో తెలియకపోతే అది తప్పెలా అవుతుందమ్మా?’’ ‘‘తప్పేనే! ఊరు కాని ఊరు, కులం కాని కులంవాడిని ప్రేమిస్తే అది తప్పే అవుతుంది. వాళ్ళు ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చారు పిల్లల చదువుల కోసమని’’. ‘‘ప్రేమకి కులంతో, మతంతో సంబంధం లేదమ్మా’’ అంటూ మళ్ళీ తనే…
‘‘ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. మీ పెంపకంలో పెరిగిన నేను తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావా అమ్మా! సాగర్‌ చాలా మంచివాడు. చెడు అలవాట్లేమీ లేవు. తను కూడా నన్ను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా’’ అంది. ‘‘అతను మంచివాడే కావచ్చు, కానీ కులం తక్కువవాడు. మనకి సరిపోడు. అయినా నీ అందానికి, చదువుకి, నువ్వు చేసే ఉద్యోగానికి అంతకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. వాడికన్నా గొప్పవాడే వస్తాడు నీ కోసం’’.
‘‘సాగర్‌ నా అందం చూసి ప్రేమించలేదమ్మా’’ అంటూ ఒక్క క్షణం ఆగి ‘‘ఏమన్నావు! నా అందానికి, ఉద్యోగానికి అంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? అంటే ఆ వచ్చినవాళ్ళు కూడా నా అందం, నా ఉద్యోగం చూసే కదా వచ్చేది. అయినా అమ్మా! నేను ఉద్యోగం సంపాదించిందే సాగర్‌ కోసం, తనని పెళ్ళి చేసుకోవడం కోసం’’ అంది.
‘‘అంటే ఏమంటావు. ఇంత కష్టపడి నిన్ను చదివించింది, నీకు ఉద్యోగం రావడానికి మేము పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు కావల్సిందేనా? మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోవడానికేనా మిమ్మల్ని ఇంత పెద్ద చదువులు చదివించి, ఉద్యోగం చేయాలని కోరుకుంది. తినీ, తినక మీ కోసం కాదటే మేము అన్నీ దాచిపెట్టింది. ఇంతా చేస్తే, చివరికి నువ్వేం చేశావ్‌, నువ్వేం పెట్టావ్‌ అని మమ్మల్ని వెక్కిరించటానికా!’’ అంది సావిత్రమ్మ కటువుగా. ‘‘అలా అని నేనట్లేదమ్మా. పెళ్ళయ్యాక మిమ్మల్ని కూడా చూసుకోవడానికి సాగర్‌ ఒప్పుకున్నాడు. మీకు కావల్సిన సహాయం నేను తప్పకుండా చేస్తాను’’.
‘‘నీ బోడి సహాయం ఎవరికి కావాలే, మేము బ్రతికి ఉన్నంతవరకు నీ మీద ఆధారపడి ఉండే సమస్యే లేదు’’. ‘‘అమ్మా! ఒక్క మాట అడుగుతాను చెప్పు. అక్కని ఇలాగే మనవాళ్ళు, మంచివాళ్ళు, మంచి సంప్రదాయం అంటూ వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేశావు. అక్క కూడా నా గురించి ఆలోచించి, కట్నం లేకుండా చేసుకుంటా అన్నాడని, ఇంటికి వచ్చిన సంబంధం కాదనలేక ఆ పెళ్ళికి ఒప్పుకుంది. అంతేకానీ, ఆ పెళ్ళి తర్వాత ఒక్కరోజైనా అక్క సంతోషంగా ఉండటం చూశావా. ఎప్పుడూ మడి, దడి, ఆచారం అంటూ గుళ్ళకు తిప్పటం, ఇంట్లో దాంతో వెట్టిచాకిరీ చేయించటం తప్ప ఒక్క సరదా లేదు, షికారు లేదు. పెళ్ళైన రెండేళ్ళకే పిల్లలు పుట్టటం లేదని, దాంతో అన్ని నోములు, పూజలు చేయిస్తున్నారు వాళ్ళ అత్తామామలు. పెళ్ళయి కనీసం రెండు, మూడేళ్ళయినా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వరా అమ్మా! ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే అవ్వాలా అమ్మా? నన్ను కూడా అక్కలాగే బాధపడమంటావా? ’’ అని బాధగా అడిగింది సుధ.
సుధ తన అక్క గురించి చెప్పగానే సావిత్రమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. ఒక్క క్షణం నీరుగారిపోయింది. కాసేపట్లో తేరుకుని మళ్ళీ ఇలా అంది. ‘‘అక్కని ఇచ్చేటప్పుడు అది తెలిసినవాళ్ళు తెచ్చిన సంబంధమే కదా అని, ఈడు జోడు బాగా కుదిరిందని, పైగా మనవాళ్ళే అని ఆలోచించాను కానీ వాళ్ళు ఇలా చేస్తారని ఎవరికి తెలుసే. అందుకే నీ పెళ్ళి మాత్రం నాకు నచ్చిన వాడితో, నేను చూపించిన వాడితోనే జరుగుతుంది.’’
‘‘ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా అమ్మా! నేను సాగర్‌ని తప్ప ఇంకెవరినీ పెళ్ళి చేసుకోను. చావనైనా చస్తాను కానీ నువ్వు తెచ్చిన వాడిని చేసుకోను గాక చేసుకోను. నాకు సాగరే కావాలి’’. ‘‘నిన్ను ఇన్నేళ్ళు కని పెంచిన మాకన్నా వాడే ఎక్కువై పోయాడా నీకు? వాడు ఏ మందో, మాకో పెట్టి ఉంటాడు నీకు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు’’ ‘‘అమ్మా! తనను ఏమీ అనకు. తనకు అలాంటి అవసరమేమీ లేదు. నా ఇష్టపూర్వకంగానే తనను పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. నేను అతన్ని ప్రేమించాను. తను ముందే ఊహించాడు, మీరు ఒప్పుకోరని. అయినా నేను మిమ్మల్ని ఒప్పిస్తానని చెప్పాను తనకి.’’
‘‘ఓహో ఇదంతా నీ పనేనా అయితే, అంతేలే ‘మన బంగారం మంచిదైతే ఎవర్నీ ఏమీ అనుకోవాల్సిన అవసరం ఉండదు’ అన్నట్టు నా పెంపకం అలా ఏడ్చింది మరి. మా తలరాత అలా రాసిపెట్టి ఉందేమో. ఇదిగో చూడు, నేను మాత్రం మీ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోను. మేము కావాలో, అతను కావాలో తేల్చుకో. ఒకవేళ మేమే కావాలనుకుంటే అతన్ని మర్చిపోయి, మేము చూపించినతన్ని పెళ్ళి చేసుకో. కాదు వాడే కావాలి అంటావా, ఇదిగో ఈ విషం మా మొహాన కొట్టి నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు వాడితో అలా వెళ్ళగానే నేను, మీ నాన్న విషం తాగి చనిపోతాం. అప్పుడు నిన్ను అడిగేవాడు ఉండడు.’’
‘‘అంత బాధ మీకెందుకమ్మా, ఆ విషం ఏదో నేనే తీసుకుంటా, మీరు ప్రశాంతంగా ఉండండి’’ అంటూ విషం సీసా చేతిలోకి తీసుకుని గభాలున తాగేసింది సుధ. వెంటనే నురగలు కక్కుకుంటూ పడిపోయింది. సావిత్రమ్మకు కాలూ, చేయీ ఆడలేదు. సుధా, సుధా పలకవే అని ఏడుస్తూ ఎదురింటి గాయత్రిని తోడు రమ్మని వెంటనే సుధని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళింది.
హాస్పిటల్‌లో చేర్చించగానే తన భర్తకు ఫోన్‌ చేసి రమ్మంది. భర్త రాగానే జరిగిన విషయం చెప్పింది సావిత్రమ్మ. ‘‘ఆడపిల్లని సరిగ్గా పెంచటం రాక ఇప్పుడు ఎందుకే ఏడుస్తావు, అయ్యిందంతా అయిపోయాక’’ అని సావిత్రమ్మని తిట్టిపోశాడు ఆమె భర్త సుధాకర్‌.
‘‘ఇంకా నన్ను బాధపెట్టకండి. మన పరువు, మర్యాద కోసం ఆలోచించాను కానీ ఇదిలా చేస్తుందని అనుకోలేదండీ. మనిషికన్నా ఎక్కువా పరువు, మర్యాద? ఇకమీదట దాని మాటను కాదననండీ. దానిష్టం, అదెవర్ని చేసుకుంటానంటే వాళ్ళకే ఇచ్చి చేద్దాం. దాని సంతోషంకన్నా మనకి ఇంకేం కావాలండీ. అది సంతోషంగా ఉంటుంది అంతే. తనకి నచ్చినట్లు ఆ సాగర్‌తోనే దాని పెళ్ళి చేద్దాం. మీరూ ఒప్పుకోండి’’ అంది సావిత్రమ్మ. ఈలోగా డాక్టర్‌ వచ్చి, ంష్ట్రవ ఱం శీబ్‌ శీట సaఅస్త్రవతీ, మీరు తనని చూడవచ్చు అని చెప్పడంతో సావిత్రమ్మ, సుధాకర్‌ ఎంతో సంతోషించారు. కూతుర్ని చూసి బాధతో నిండిన కళ్ళతో దగ్గరకు తీసుకుని, చేతిలో చేయి వేసి ‘‘పిచ్చిదానా! అన్నంత పని చేశావు కదే. నేనేదో అన్నానే అనుకో వెంటనే అలా విషం తాగేయటమేనా? ఒకవేళ నీకేదైనా అయ్యుంటే, మా పరిస్థితి ఏంటే, ఎందుకలా చేశావు?’’ అని అడిగింది.
ఇంతలో ఆమె భర్త ‘‘ఒసేయ్‌ మొద్దూ! నీకోసమేనే ఇదంతా చేసింది. నిన్ను ఒప్పించటం కోసమే సుధ ఈ పని చేసింది. లేదంటే నువ్వు మామూలుగా ఒప్పుకునే ఘటానివా చెప్పు. ఎంతసేపూ నీ చాదస్తం నీదే కానీ, పిల్లల మనసును అర్థం చేసుకున్నావా? ఈ కాలంలో కూడా కులాలు, మతాలు ఎవరు పట్టించుకుంటారు చెప్పు?’’ అన్నాడు. అక్కడ జరుగుతున్నదేమీ అర్థం కాక సావిత్రి ‘‘ఏంటండీ మీరు మాట్లాడేది’’ అంది. ‘‘నాకు ఇదంతా ముందే తెలుసు సావిత్రీ. సుద నాతో ముందే చెప్పింది. సాగర్‌ గురించీ, వాళ్ళ ప్రేమ గురించీ. నేను ఒప్పుకున్న తర్వాతే అది సాగర్‌కి కూడా తన ప్రేమ విషయం చెప్పింది. వాళ్ళ పెళ్ళికి నేను ఎప్పుడో ఒప్పుకున్నాను. నీ మాట కోసమే అది ఇన్నాళ్ళూ ఎదురుచూసింది కూడా. నిన్ను ఒప్పించడానికే ఇదంతా ప్లాన్‌ చేసింది. నువ్వు కూడా ఒప్పుకున్నావు. కాకపోతే ఇంతవరకూ వచ్చింది.’’ ‘‘అవునా! మరి అంత రిస్క్‌ చేయాలా దానికోసం. ఒకవేళ ఏదైనా అయితే, మన పరిస్థితి ఏంటండీ…’’ అని బాధపడిరది సావిత్రి. ‘‘ఎందుకవుతుందే పిచ్చిమొహమా! అది నిజమైన విషం కాదు, మామూలు మందు అంతే.’’ ‘‘మరి డాక్టర్‌, హాస్పిటల్‌… ఇదంతా ఏమిటండీ’’ అనడిగింది ఆశ్చర్యపోతూ.
‘‘ఈ డాక్టర్‌ మనకు తెలిసినావిడే కదమ్మా! నేను మేనేజ్‌ చేశానులే’’ అంది సుధ. సుధ కోలుకోగానే సాగర్‌ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం నిర్ణయించారు. ప్రళయం తర్వాత వచ్చిన ప్రశాంతత అంటే ఇదేనేమో. ఇప్పుడు సావిత్రమ్మ మనసు ఎంతో తేలికగా ఉంది. తను ఇష్టపడిరది కదా అని సుధని వేరే కులం అబ్బాయికి ఇచ్చి ఎలా చేస్తున్నావని సావిత్రమ్మని ఎందరో ఎన్నో రకాలుగా అడిగారు. వాళ్ళందరికీ నవ్వుతూ ఒకటే సమాధానం చెప్పింది సావిత్రమ్మ ‘‘మనిషి ప్రాణంకన్నా ఈ కులాలు, మతాలు ఎక్కువ కాదు కదా! అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి.’’
సుధ పూర్తిగా కోలుకున్నాక, సుధ, సాగర్‌ల పెళ్ళి కన్నుల విందుగా జరిగింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.