అమ్మతో పుట్టని బిడ్డ -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… అమ్మా…’’ సన్నని గొంతు మెత్తగా… మృదువుగా వినిపించింది.
ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఆమె. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. మరి ఎవరి పిలుపు? తననే పిలిచినట్టు ఉందని ఆశ్చర్యపోయింది ఆమె.

‘‘అమ్మా… నేనమ్మా…!’’
‘‘ఎవరూ…?’’ ఆ మిట్ట మధ్యాహ్నం వేళ లోతైన చిన్ని కళ్ళు చికిలించి చుట్టూ చూస్తూ ఆమె.
‘‘నేనమ్మా… నా ప్రమేయం లేకుండా నీ కడుపులో గూడు కట్టుకున్న ప్రాణిని. నీలో ఊపిరి తీసుకుంటున్న నీ బిడ్డను’’.
‘‘ఏంటీ…?’’ అదిరిపడిరది ఆమె. అప్రయత్నంగా ఆమె చేతులు కొద్దిగా ఎత్తుగా పెరిగిన పొట్టపైకి వచ్చాయి.
‘‘అవునమ్మా. నువ్వు పిలవకుండా, నీకిష్టం లేకుండా నీలోకి చొరబడిన నీ బిడ్డనమ్మా నేను. నీ గర్భగుడిలో తిష్ట వేసి నీ రక్తాన్ని జుర్రుకుంటున్న బిడ్డనమ్మా’’.
వెంట వెంట రెండుసార్లు జారిపోయిన గర్భం వల్ల నీరసంతో అలసిన ఆమె యవ్వనం మసిబారి పోయింది. ఎండిపోయి, పొడిబారిన ఆమె చర్మంపై సన్నని వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ దిగులు కళ్ళల్లో ఆశ్చర్యం నిండిరది.
ఆమె వయసుకి మోయలేని బరువు ఎత్తితే ఏం జరుగుతుందో అదే జరిగింది. ఇక ముందు అలా కాకూడదంటే చాలా జాగ్రత్తగా ఉండమని డాక్టర్‌ చెప్పింది. ఆ కారణం వల్లనో లేదా శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోవడం వల్లనో లేదా తొమ్మిది నెలల బిడ్డను మోసి కని పెంచే శక్తి సామర్ధ్యాలు తనకు లేకనో కానీ ఇప్పుడప్పుడే మళ్ళీ కడుపు రాకూడదని కోరుకుంది ఆమె. సలిపే గాయాల బాధ మోయలేననుకుంది. అయినా కాలిపోతున్న బాల్యానికి మళ్ళీ గర్భం వచ్చేసింది. మనసులోని తలపులు మనసులోనే చిదిమేసింది. నిస్పహాయంగా ఆ గర్భాన్ని మోస్తున్నది ఆమె.
ఆలోచిస్తున్న ఆమె మనసు తెలిసినట్లు ‘‘అమ్మా… నీకు తెలియకుండా నీలోకి వచ్చి తిష్ట వేశానని నాపై కోపంగా ఉందా? ప్చ్‌! నేను మాత్రం ఏం చేయగలను? అయినా, తప్పు నాది కాదమ్మా. నీలోకి చొరబడి బీజం వేసిన వారిది. దానికి అనుమతించిన నీది. అవసరమైనన జాగ్రత్తలు పాటించని నీది.
నాకు తెలుసు. నీ మనసు, శరీరం నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా లేవని, అలాగని వదిలించుకోలేని పిరికితనం నీదని. పెద్ద సాహసం చేస్తున్నావు. చెప్పాపెట్టకుండా వచ్చిన అతిథి లాంటి నన్ను ఉంచుకుని మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధపడ్డావు కదమ్మా…? నీకు నువ్వు నచ్చచెప్పుకుంటూ సన్నద్ధం చేసుకుంటున్నావు ఎందుకమ్మా? పురిటి నొప్పులతో నువ్వు చేయబోయే భీకర యుద్ధం ఎవరి కోసం అమ్మా?’’ లోగొంతుకతో సూటిగా ప్రశ్నించిన బిడ్డకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయంలో ఆమె.
కొద్ది క్షణాల తర్వాత, జవసత్వాలు కూడదీసుకుని ‘‘నిజమే కన్నా! మొదట నాకు భయమేసింది, రేపు అబద్ధంగా మారిపోతుందేమోనని, నీ తోబుట్టువులు వెళ్ళినట్టు నువ్వు నా నుంచి విడిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతావని. అయినా ధైర్యం తెచ్చుకుంటూ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డా. కారణం…’’
చెప్పబోతున్న అమ్మ మాటలకు అడ్డు తగులుతూ ‘‘నాకు తెలుసమ్మా. మీ మాటలు నా చెవిన పడుతూనే ఉన్నాయి. పండ్లు, కాయలు ఇవ్వని మోడువారిన చెట్టు అని నాన్న అన్నాడని కదూ…’’
‘‘ఏమి చెప్పనురా చిన్నా… నా కథ, నా వ్యథ. ఏడో తరగతి అయింది. ఎనిమిదవ తరగతికి పొరుగూరుకి వెళ్ళి చదువుకుంటానని మారాం చేసినా మీ అమ్మమ్మ, తాతయ్యలు వినలేదు, కాలం బాగోలేదు అన్నారు. ఆడపిల్ల గుండెల మీద కుంపటి, కుటుంబ పరువు మర్యాదలు కాపాడుకోవాలంటే పెళ్ళి చేసి పంపాలన్నారు. కని పెంచిన నాపై వాళ్ళకి నమ్మకం లేదు. కానీ, ముక్కు మొహం తెలియని వారిని నమ్మి నేను పోవాలి. అనుకున్నట్లే చేశారు. పెళ్ళి చేసి చేతులు దులుపుకున్నారు. చావైనా, బతుకైనా నేను ‘ఆడ’పిల్ల కానీ ‘‘ఈడ’’ పిల్ల కాదట. అత్తవారి ఇల్లే నా ఇల్లు అట. కావచ్చు అనుకున్నాను.
పిల్లలు కని ఇవ్వలేదు. ఇంటి వారసుడిని చేతిలో పెట్టలేదు కదా. ఇంట్లో వాళ్ళకు నేను అక్కరకు రాని వస్తువును. ఆ విషయం నాకు బాగా బోధపడిరది ఈ రెండేళ్ళలో.
నా కడుపున కాసిన కాయలు నిలువలేదు. మరో పెళ్ళి చేయడానికి మీ నాన్నమ్మ సిద్ధమైంది. నాకంటే రెండిరతలు పెద్దవాడైన మీ నాన్నకు పిల్లలు కావాలి. ఇలా తన మగతనం నిరూపించుకోవాలని కోరిక. ఈ పరిస్థితిలో నన్ను కాదంటే నేనేమైపోను? నా గతి ఏమిటి? అందుకే నన్ను నేను అనునయించుకుంటూ నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను’’ దీర్ఘంగా నిట్టూర్చి కడుపుపై చేయివేసి నిమురుతూ ‘‘ఉన్నమాట అన్నానని ఏమనుకోకురా చిన్నా. ఇన్నాళ్ళూ, నా స్థానం నేను పదిలపరుచుకోవడం తప్ప నీ గురించి ఊహలు, కలలు నాలో లేవు. ఇప్పుడు, ఈ క్షణాల్లోనే నీ గొంతు, నీ మాటలు విన్న తర్వాత నాలోని నీ పట్ల మమకారం మొలకెత్తింది. నా మనసులోని కన్నీళ్ళు, భయాలు, శంకలు, సంతోషాలు పంచుకునే తోడు నువ్వే అని ఆశ పుట్టింది’’ అన్నదామె. కళ్ళు మూసుకుని పొట్ట నిమురుకుంటూ లోపలి బిడ్డను సున్నితంగా స్పర్శిస్తూ కొద్ది క్షణాలు మౌనంగా ఉందామె.
ఆ తర్వాత, ‘‘ఈ ఉదయం డాక్టర్‌ మాటలకు నెత్తిమీద బాంబు పడినట్టు భయపడ్డానురా బంగారం. ఇప్పుడు నా బుజ్జి కన్న నాతో మాట్లాడుతూ ఉంటే ఆ భయాలన్నీ ఆకాశంలోని మేఘాల్లా ఎటో ఎగిరిపోయాయి. ఇప్పుడు, నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది రా కన్నా…’’
తల్లి గర్భంలో ఉన్న బిడ్డ మాట్లాడడం ఎవరైనా విన్నారా… కన్నారా? తల్లి పేగు తెంచుకుని బయటపడ్డాక ఏడాదికి కానీ మాటలు రావు. కానీ తన బిడ్డ, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టకుండా లోపలి నుంచి అమ్మా…అని పిలవడం ఎంత విచిత్రం! అబ్బురంగా తోచింది ఆ తల్లికి.
ప్రేమగా మరోసారి నిమురుకుంటూ వెచ్చని స్పర్శను బిడ్డకు అందించింది ఆ తల్లి. ప్రేమపూర్వక స్పర్శతో పులకించింది ఆ బిడ్డ.
‘‘నువ్వు నా చిట్టితల్లివో, చిట్టితండ్రివో తెలియదు. ఎవరి పోలికలతో ఉంటావో? నాలాగా తెలుపో, మీ నాన్నలాగా నలుపో… నాలాగే సన్నగా, చిన్నగా ఉంటావో మీ నాన్నలాగా బొద్దుగా, పొడవుగా ఉంటావో… నీ ముక్కు, మొహం, కాళ్ళు, చేతులు, నీ శరీరం ఎలా ఉంటాయో తెలియదురా కన్నా…! అయినా, నువ్వు నాకు ప్రియమైన బంధంగా మారావు. నన్ను అమ్మను చేశావు. అమ్మా అని పిలిచావు. నీ పిలుపుతో నా హృదయం పులకరించి పోయింది. నీ రాక కోసం నేనిప్పుడు మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నాను. ఆహ్వానిస్తున్నానురా బంగారం.
ఈ క్షణం నిన్ను చూడాలనే కోరిక పురుడు పోసుకుంది. వెన్నముద్ద లాంటి నిన్ను నా గుండెలకు హత్తుకోవాలని, పువ్వులా మెత్తగా ఉండే నీ బుగ్గలపై ముద్దులు కురిపించాలని ఆత్రంగా ఉంది. నిన్ను నా అరచేతుల్లోకి తీసుకుని, నా ఒడిలో వేసుకుని లాలిస్తూ, జోల పాడాలి అంటే మనం ఇంకా రెండు నెలలు ఆగక తప్పదు. అయినా రెండు నెలలంటే ఎంత చటుక్కున అయిపోతాయి’’ పేగుబంధం మమకారపు మైకంలో అంది అమ్మ.
ఆమె లోపల కదలికలు స్పష్టంగా పైకి తెలుస్తున్నాయి. ‘‘ఏంట్రా కన్నా, ఈ మధ్య నువ్వు బాగా కదులుతున్నావు. కాళ్ళతో తంతున్నావు. అటువంటప్పుడు పిల్లిమొగ్గలు వేస్తున్నావో, కాళ్ళు చేతులు ఆడిస్తున్నావో, చిన్నగా ఒళ్ళు విరుచుకుని ఆవులిస్తున్నావో అనుకుంటూ ఉంటాను. ఒక్కోసారి అదేపనిగా కదులుతావు. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందో తెలియదు, లేకపోతే ఆడుకుంటున్నావో అర్థం కాక తికమక పడుతున్నాను’’ కొత్త శక్తి నిండిన అమ్మ ముచ్చట్లు బిడ్డకు ఆనందం కలిగించాయి.
‘‘నిజమా అమ్మా, నా మీద నీకు నిజ్జంగా కోపం రావడం లేదా? నీ జవసత్వాలు నేను లాక్కుంటున్నా. నన్ను నేను నిర్మించుకుంటున్నా. నువ్వేమే రోజు రోజుకీ బలహీనంగా తయారవుతున్నావు’’ తన సందేహం నివృత్తి చేసుకునే పుట్టని బిడ్డ.
‘‘లేదురా చిన్నా. తల్లికి బిడ్డపై కోపం ఉంటుందా? ఊహు, అసలే ఉండదు’’ పెద్దరికం నింపుకుని మురిపెంగా అంది అమె.
‘‘అమ్మా, ఈ విషయం నీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నా తల్లికి కాక ఇక ఎవరికి చెప్పగలను. నా సమస్య తీర్చుకోగలను? చెప్పు.’’
‘‘అయ్యో… బిడ్డా…అప్పుడే నీకు సమస్యలేంటి?’’
‘‘నా కడుపు నిండడం లేదమ్మా. నా ఆకలి తీరడం లేదమ్మా. వీలయినంత వరకు నీ రక్తమాంసాల శక్తిని పీల్చేస్తూ ఉన్నాను. అయినా నేను సరిగ్గా ఎదగడం లేదు, బరువు పెరగడం లేదని డాక్టర్‌ నిన్ను చీవాట్లు పెట్టడం విన్నాను. నావల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు కదమ్మా…’’
‘‘అదేం లేదు బుజ్జీ. నేను నీ అమ్మను. నువ్వు నా బిడ్డవి’’ ఆ తల్లి కంఠంలో దిగులు. బిడ్డకు సరైన ఆహారం ఇవ్వలేకపోయిన దిగులు.
‘‘ప్చ్‌… నువ్వేం చేస్తావు. నీకు తిండి దొరికితే తినవా అమ్మా… నువ్వు ఎంత కష్టపడినప్పటికీ నీకు సరైన తిండి అందడం లేదని నాకు తెలుసు. పాపం నాయనమ్మ కూడా నీలో ఉన్న నా కోసం పండ్లు ఫలాలు, ఆకుకూరలు పెట్టాలని తాపత్రయపడుతోంది. కానీ కారం, చింత పులుసుతో సరిపెట్టవలసి వస్తోందని బాధపడుతోంది’’ తల్లిని ఓదారుస్తున్నట్లుగా.
‘‘అవునురా కన్నా… వానాకాలమైతే పని నుంచి వచ్చేటపుడు పొన్నగంటి కూర, గంగబాయిలాకు, తెల్లగరిజాకు, పిండి కూర ఏదోటి తెచ్చేది మీ నానమ్మ. ఇంటిమీద, పక్కనున్న పొరకలకో చిక్కుడుకాయలు, ఆనిగెపు కాయలు ఉండేవి. ఇప్పుడు లేవు. అంగన్వాడీలో గుడ్డు, పాలు, శనగలు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి సర్కారు నుంచి బిల్లు రాలేదని అంగన్వాడీ టీచరమ్మ చెప్పింది. అవి ఇచ్చినా నీ ఆకలి కొంతైనా తీరేది. ఈ పేదరాలిని క్షమించు చిన్నా’’ తప్పు చేసినట్లు ఆమె గొంతు గరగర.
‘‘అమ్మా… నువ్వేం తప్పు చేశావని నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావు. నిన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను. బాధ కలిగిస్తున్నాను కదమ్మా. నీ ప్రేమ నిండుగా నేను అందుకోగలనో లేదోనని దిగులుగా, భయంగా ఉందమ్మా’’.
‘‘అయ్యో అవేం మాటలు రా బుజ్జీ… ఇంకెప్పుడూ అలా అనకు’’ బిడ్డ మాటలకు అమ్మ హృదయం వేటగాడి వలలో చిక్కిన పక్షిలాగా విలవిల్లాడిరది.
ఆ వెంటనే ‘‘మీ నాన్నకి నీ రాక ఆనందమే. నువ్వు మగపిల్లవాడివైతే వంశోద్ధారకుడు పుట్టాడని ఇంటిల్లిపాదీ పండుగ చేసుకుంటారు. ఆడపిల్లవయితే తన మగతనం నిరూపితమైందని అనుకుంటాడు మీ నాన్న. నువ్వు ఎవరైనా నాకు మురిపెం రా చిన్నా’’ వాతావరణం తేలికపరుస్తూ అంది అమ్మ.
‘‘అమ్మా… మనిద్దరి స్నేహం, ముద్దు మురిపాలు ఎంతకాలమో నీకూ తెలియదు, నాకూ తెలియదు కదా!’’
‘‘అదేంటిరా కన్నా అట్లా మాట్లాడుతున్నావు’’ బెదురుచూపుల లేడిపిల్లలాగా అమ్మ.
‘‘పొట్టను సుతారంగా నిమురుతూ నన్ను తాకడానికి నువ్వు ప్రయత్నించినపుడు నాలో ఉత్సాహం పుడుతుంది. ఈ చీకటి వీథుల్లో నుంచి వెలుతురు లోకంలోకి వచ్చి నీ ప్రపంచాన్ని చూడాలన్న కోరిక బలపడుతోంది. మట్టి వాసన పీల్చి చందమామ చల్లదనాన్ని, నక్షత్ర కాంతిని, సూర్యకిరణాల వెచ్చదనాన్ని ఆస్వాదించాలని, నీ ఒడిలో చేరి సందడి చేయాలన్న ఆశ మొదలవుతోంది. కానీ నాకు ఆ అర్హత ఉందో లేదో…’’ వణికే కంఠంతో.
‘‘మళ్ళీ మళ్ళీ అదే మాట అనకురా కన్నా.. పైన తథాస్తు దేవతలు ఉంటారట. మా అమ్మ చెప్పింది’’ అంది అమ్మ.
‘‘నాకు వినిపించిన మాటలు నాకు విలువైన అనుభవాలు ఇచ్చాయమ్మా. జీవితపు రూపాలను తెలుసుకోగలిగాను. ఈ రోజు హాస్పిటల్‌లో జరిగిన సంభాషణ అంతా విన్నాను. అవేకాదు నాన్నమ్మ రోజూ అనే మాటలు వింటూనే ఉన్నా. నాన్న ప్రవర్తన కొద్ది కొద్దిగా తెలుస్తూనే ఉందమ్మా. హాయిగా నీ బొజ్జలో ఉందామని ఎంత ప్రయత్నించినా ఉండలేకపోతున్నానమ్మా. నీ తాహతుకు మించి బరువైన కుండ నీ మీద పెట్టారు. నువ్వు అది మోయలేకపోవడం వల్ల భళ్ళున కిందపడి పగిలిపోయింది. ఇప్పుడు అట్లా పగిలిపోకుండా జాగ్రత్తపడమని హెచ్చరించింది డాక్టర్‌. మోయలేని భారం మోస్తున్నావు. నీవు మోయలేని భారం నీ నెత్తికి ఎత్తిన వాళ్ళది కదమ్మా తప్పు. వాళ్ళంతా నిన్ను నిందిస్తున్నారేంటమ్మా?
ఇవాళ డాక్టర్‌ మాట్లాడిన తర్వాత నాలో కలవరం, నా భవిష్యత్తు పట్ల ఆందోళన నన్ను వెంటాడుతున్నాయి. అంతేకాదు నా
ఉనికి నీ అస్తిత్వానికే ప్రశ్నగా మారుతున్న క్రమంలో మరింత ఇబ్బంది కలుగుతోందమ్మా. క్షమించమ్మా… నువ్వు ప్రశాంతంగా, విచారం లేకుండా ఉండాలట. అది తెలిసి కూడా నిన్ను బాధపెట్టినట్లున్నాను.
అమ్మా… నిన్నొకసారి చూడాలని ఉంది. నువ్వు ఎలా ఉంటావో తెలియదు. కానీ వాడిపోయిన బాల్యంలో ఎండిపోయిన పుల్లలా ఉంటావని, గిడసబారిన మొక్కలాగా ఉంటావనీ డాక్టర్‌ అంది. పెద్ద గాలి వీస్తే దూరంగా పోయి పడతావని, ఈ ఎముకల గూడుతో సుఖం లేకుండా పోయిందని కసురుకునే ఆకారాన్ని, పని కానిచ్చుకుని నాన్న విసురుగా పక్కకు నెట్టినపుడు స్వేచ్ఛ దొరికినట్లు మరో పక్కకి తిరిగి ఊపిరి పీల్చుకుంటున్న నీ రూపాన్ని ఊహించలేకపోతున్నాను. నీ పెదవులపైన నవ్వు ఉందో, నీ కళ్ళల్లో దుఃఖం గూడు కట్టుకుందో తెలియదు. కానీ నీ కలలను, ఆశలను, ఇష్టాలను, అలవాట్లని నాన్నకి చెప్పకుండా దాచేస్తున్నావు.
పెళ్ళయిన ఆడపిల్ల ఎలా ఉండాలో చెబుతూ గీసిన గీతలు నిన్ను భయపెడతాయి. ముడుచుకుపోతావు. నీ మనసును లోలోనే దాచేస్తావు. ఓర్పుతో పనులన్నీ చేస్తావు. నీ గురించి ఆలోచించవు. కుటుంబం కోసం అన్నీ చేస్తావు. నిన్ను నువ్వు ఎంతో కోల్పోతావు. నీకు నా అనేది ఉండదా అమ్మా?
నీ శరీరం నీ సొంతం. నీ జీవితం నీది కదమ్మా…! నీకు పిల్లలు ఎప్పుడు కావాలో, నీ శరీరం ఎప్పుడు అందుకు సిద్ధంగా ఉందో అప్పుడు పిల్లల్ని కంటే ఎటువంటి బాధలు ఉండవు కదమ్మా… మీ అమ్మ, నాన్న నీకు ఇంత చిన్నప్పుడు ఎందుకు పెళ్ళి చేశారో తెలియదు. ఏ అప్పు తీర్చడానికో, కట్నం ఇచ్చుకోలేకో, కుటుంబ గౌరవం అమ్మాయి నడతపై ఆధారపడి ఉందనో, మరెందుకని నీ పెళ్ళి చేశారో తెలియదు. కానీ, నువ్వు శారీరక, మానసిక, లైంగిక హింసను అనుభవిస్తున్నావు. అది నీ తలరాత అని సరిపెట్టుకుంటున్నావు. నీకు నువ్వు తాళం వేసుకోవడం తెలియని ఇంత అమాయకురాలివైతే ఎలా అమ్మా….!
నీకు విశ్రాంతి లేదు. సరైన తిండి లేదు. పని ఎక్కువ. బాధ్యత ఎక్కువ. తిండి తక్కువ. ప్రేమ తక్కువ. ఆదరణ తక్కువ. నువ్వే పిల్లవు. మరింక నన్నేమి కాపాడుకోగలవు. నిచ్చెన మెట్లు ఎలా ఎక్కించగలవు? చెప్పమ్మా…
నీకు తెలుసో లేదో కానీ, నాన్న తన శరీరాన్ని నీ శరీరానికి తాకించినపుడు నేను గాలి బుడగలాగా పేలిపోతానేమోనని అనిపిస్తుంది. ముడుచుకుపోయి ఇరుకిరుకు మడతల్లో దాక్కుంటాను. ఇలా ఇంకెన్నాళ్ళు అనుకుంటాను. ముందు ముందు నీ స్వరం వింటూ… నా ఉనికిని నిలుపుకోవడం కోసం పోరాటం చేయగలనో లేదో?!
నిజమమ్మా…నేను ఎప్పుడైతే మీ మాటలు బాగా వినటం మొదలయిందో అప్పటి నుంచి నాలో ఉత్సాహం, ఆనందం క్రమంగా తగ్గిపోతున్నాయి. బయటి ప్రపంచం చూడాలన్న కుతూహలం నశించిపోతోంది. నా ఉనికి వల్ల నేను నీకు కలిగిస్తున్న ఇబ్బందులు అర్థమవుతున్నాయి.
బహుశా… నాలాగే నాకంటే ముందు నీలోకి వచ్చినవాళ్ళు అనువుగా లేని నీ కడుపులో ఉండలేక వెళ్ళిపోయారో లేక సరైన పోషణ దొరక్క రాలిపోయారో తెలియదు. వాళ్ళకంటే నేను గట్టి పిండాన్ని కావచ్చు. ఇంతవరకు మనగలిగాను. కానీ, ఏ క్షణాన్నైనా నేను రాలిపోయే అవకాశముందని కూడా తెలుసు. నా ఆగమనం నాకే కాదు, నీకు కూడా ప్రమాదమేనని నీవు పసిగట్టావో లేదో కానీ నాకు అర్థమైంది.’’
‘‘అయ్యో బిడ్డా… కంగారుపడకు. పెట్టిన గుడ్లన్నీ పిల్లలవుతాయా? ఇదీ అంతే. నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు. మాట్లాడుతున్నావు. నువ్వు లేకుండా ఒట్టి చేతులతో నేనెలా బ్రతకగలను చిన్నా. నువ్వు నా ఒడి నింపుతావు కన్నా. నిండు చందమామలాగా పుడతావు నాన్నా’’ అందామె కొత్త ఆశ నింపుకుని.
‘‘హ్హా… హ్హా… అమ్మా! నిండు చందమామలా ఉంటానని కలలు కంటున్నావా. పుట్టకముందే పుట్టెడు జబ్బులు నా వెంట మోసుకు వస్తానేమో లేదా అవి నాకోసం వేచి ఉంటాయేమో…?’’ ఆ మాటలు ఆమెలో పెద్ద కుదుపునిచ్చాయి.
‘‘అవేం మాటలురా చిన్నా…’’ లాలింపుగా ఆమె.
‘‘అమ్మా… నువ్వన్నట్లు అన్ని అడ్డంకులను దాటుకుని నీ నుండి విడివడి బయటికి వచ్చాననే అనుకుందాం. నేను ఆడపిల్లనైతే… పరిస్థితి పునరావృతం కాదంటావా?’’
‘‘ఏమోరా… అదంతా నాకు తెలియదు. నాకు నువ్వు కావాలి. నాతో ఉండాలి. ఉంటావు’’ చివుక్కుమన్న మనసును కప్పిపెట్టి నమ్మకమిస్తూ, భరోసా ఇస్తూ ఆ తల్లి.
‘‘సుడిగుండాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నీకు నా కలలకి, ఆశలకి నిచ్చెన వేయగల శక్తి ఉందని అనుకుంటున్నావా? నాకు అర్థం కావడం లేదమ్మా. లోపలి చీకటి పొరలు చీల్చుకుని బయటికి వస్తే అంతా వెలుగని అనుకున్నా ఒకప్పుడు. కానీ అది నిజం కాదని, ఆలోచిస్తుంటే అర్థమవుతోంది. నన్ను కాపు కాయాల్సిన వెలుగులో మాటువేసి కాటువేసే విషనాగులు ఎన్నో ఉన్నాయని తెలిశాక చీకటే బాగుంది.
విశాలమైన ఆకాశంలో జీవితంలో పడగ విప్పి నాట్యం చేస్తున్న దైవం మత్తును, మతం మాలిన్యాన్ని, కులం
కుళ్ళు, వర్ణ వివక్ష, జాతి భేదాన్ని నేను దాటగలనా? మూఢత్వం, ద్వందనీతి, కపటత్వం, లొసుగుల నడక`నడతల విషకోరలు నన్ను చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉంటే, బీటలు వారి పగుళ్ళు వచ్చి విరిగి ముక్కలవకుండా ఉండగలనా? క్రూరమృగాల కూతల మధ్య కీచురాళ్ళ మోతల మధ్య నెగ్గుకు రాగలనా? ముందున్న సుడిగుండాలు దాటి ముందుకు నడవగలనా? నా మనసు పొరల నుంచి అనేక ప్రశ్నలు, సందేహాలు నన్ను వెంటాడుతున్నాయి.
అమ్మా… నా అంతరాంతరాల్లో కలవరం నీకు సముద్ర ఘోష ఇస్తుందని తెలుసు. అయినా నాలోని సుడుల ముడులు నీ ముందు పరిచాను. నిన్ను అలజడికి, అశాంతికి గురి చేయాలని కాదమ్మా… నీ హృదయాన్ని ఛిన్నాభిన్నం చేయాలని కాదమ్మా…
ఇప్పుడు నా మనసు నీ ముందు విప్పకపోతే ఇక ఎప్పటికీ ఎవరి ముందూ విప్పలేనేమోనని భయం. అయినా నా హృదయాన్ని నీ ముందు కాక మరెవరి ముందు పెట్టగలను?! అలాగని నేను లొంగిపోవడం లేదు. పోరాడి గెలవడానికి నా ఓపికున్నంత మేర ప్రయత్నిస్తున్నాను. కానీ, ఊహలకు, వాస్తవానికి తేడా ఉంటుందని తెలుసు. అయినా ఓ ప్రశ్న తొలుస్తూనే ఉంది’’.
‘‘ఏంటది?’’ తడారిన గొంతుతో ఆమె.
‘‘చీకటి గుహల్లోంచి, చింతల గుడారాల్లోకి ఇంత కష్టపడి రావడం అవసరమా? మనిషితనం మరచిన లోకంపై భ్రమలు పెంచుకుంటున్నానా…?’’ దూసుకొచ్చింది ప్రశ్న.
ఉప్పెనలో చిక్కుకున్న ఆమె.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.