మహిళల ఆరోగ్యం – జోత్స్న ఆవుల

గత సంవత్సరం డిసెంబరు నెలలో విడుదలైన 5వ జాతీయ కుటుంబ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5) మొదటి దశ ఫలితాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం మంది మహిళలు తమ కోసం తాము ఉపయోగించుకునే చరవాణిలను కలిగి ఉన్నారు.

నాల్గవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ శాతం 47.4 ఉండగా, 84.4 శాతం మందికి సొంతంగా నిర్వహించుకునే బ్యాంకు అకౌంటు
ఉంది. 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ శాతం 59.5 మాత్రమే. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 48.9 శాతం మంది మహిళలు చరవాణిలను కలిగి ఉన్నారు. గత సర్వేలో ఈ శాతం 36.2గా ఉంది. బ్యాంకు అకౌంటు కలిగి ఉన్న మహిళల శాతం 5వ సర్వేలో 81.8 కాగా, 4వ సర్వేలో 66.3గా ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే, తెలంగాణాలో 15`49 సంవత్సరాల వయసున్న మహిళల్లో 57.6 శాతం మంది రక్తహీనత కలిగి ఉన్నారు. 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ శాతం 56.5గా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో రక్తహీనత కలిగిన మహిళల సంఖ్య పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది. 4వ సర్వేలో 60 శాతం మంది మహిళల్లో రక్తహీనత ఉండగా, 5వ సర్వేలో 58.8 మంది మహిళల్లో రక్తహీనత ఉంది. ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే మొదటి రెండు అంశాలలో కనబడుతున్న అభివృద్ధి మహిళల ఆరోగ్య విషయంలో ఎందుకు లేదనే సందేహం వస్తుంది. ఒక్క మహిళల విషయంలోనే కాక దేశంలోని అయిదేళ్ళ లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలు పెరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5) ధృవీకరించింది. మాతా, శిశు అభివృద్ధి కోసం ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నా ఫలితాలు మాత్రం ఆశించినట్లుగా ఎందుకు ఉండడం లేదు. మహిళల ఆరోగ్యాన్ని వివిధ కోణాలలో ఆలోచించి సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఈ పరిస్థితి సూచిస్తోంది.
మహిళల ఆరోగ్య సంరక్షణ అంటే గర్భం, ప్రసవ సమయాల్లో అవసరమైన మాతృత్వ సేవలుగా మాత్రమే అర్థం చేసుకోవడం జరుగుతోంది. ఈ ఆరోగ్య సేవలు ముఖ్యమే అయినప్పటికీ అవి తల్లులుగా మహిళల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతున్నాయి. ఒక మహిళ ఆరోగ్య సంరక్షణ అంటే భార్యగా, తల్లిగా ఆమె వహించే పాత్రలలోనే కాక ఆమెకు జీవితంలోని అన్ని దశలలోనూ సహాయపడాలి. అయితే, ఒక మహిళ ఆరోగ్యాన్ని ఆమె శరీర నిర్మాణమే కాకుండా ఆమె జీవిస్తున్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. పురుషుల ఆరోగ్యంపై కూడా ఈ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ, కుటుంబంలో, సమాజంలో ఉన్న స్త్రీల స్థితి, పరిస్థితుల వల్ల మహిళల ఆరోగ్యాన్ని ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంటే కుటుంబం, సమాజంలో స్త్రీలకు ఆపాదించబడిన స్థాయి, హోదా, పాత్రలు ఆమె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయనేది అందరూ గుర్తించాలి. స్త్రీలకు ఆపాదించబడిన స్థాయి, హోదా, మూసపాత్రల వలన వీరు అనేక విషయాలలో అసమానతలకు, వివక్షకు గురవుతున్నారు. వీటిలో ఆరోగ్యం ఒకటి. స్త్రీల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే దాని ప్రభావం వారిపైనే కాకుండా పిల్లల ఆరోగ్యంపై కూడా ఉంటుందనేది నిర్వివాదాంశం.
ఈనాటి పితృస్వామిక కుటుంబం, సమాజం మహిళలకు ఆపాదించిన స్థాయి, హోదా, మూస పాత్రలు వారి శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇంటిపని, వంటపని, పిల్లల పని కేవలం మహిళలకు సంబంధించిన అంశాలుగానే చూపబడుతున్నాయి. ‘‘కుటుంబంలో భర్త బూర్జువా, భార్య కార్మికురాలు’’గానే ఉందని ఏంగెల్స్‌ కుటుంబం`వ్యక్తిగత ఆస్తి రాజ్యాల పుట్టుకలో చెప్పాడు. ఇంటా బయటా పనులన్నింటినీ చక్కపెట్టుకోవడం స్త్రీలకు శక్తికి మించిన చాకిరీ అవుతోంది. దానికి తోడు పోషకాహార లోపం వారికి బాల్యం నుండి ప్రారంభమవుతుంది. బాలికలకు బాలుర కంటే తక్కువ ఆహారాన్ని ఇస్తారు. బాలికలకు యుక్తవయసు వచ్చేసరికి వారిపై పని భారం పెరిగి మంచి ఆహారం అవసరం కావడం వలన, వారిలో కుపోషణ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. బాలికలకు బహిష్టులు మొదలై ప్రతి నెలా రక్తస్రావమవుతున్నప్పుడు, గర్భవతులైనప్పుడు, పాపాయికి పాలిస్తున్నపుడు పోషకాహార లోపం మరింత తీవ్రమవుతోంది. మంచి ఆహారం లేకపోవడం వలన మహిళల ఆరోగ్యం దెబ్బతిని తీవ్రమైన అలసట, నీరసం, రక్తహీనతకు లోనవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంతానోత్పత్తిలో స్త్రీల ఇష్టాయిష్టాలకు కుటుంబంలో తావుండదు. స్త్రీలు ఎంతమంది పిల్లలను కనాలనేది కుటుంబ పెద్ద నిర్ణయిస్తాడు (రాజ్యం… అంటే ప్రభుత్వాలు కూడా నిర్ణయిస్తాయి). శక్తికి మించిన చాకిరీ, పోషకాహార లోపం, సంతానోత్పత్తి బాధ్యతలు మహిళల శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి వారిని అనారోగ్య కూపంలోకి నెట్టివేస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఒక స్త్రీ ఒక పురుషుడికంటే ఎక్కువ సులభంగా శారీరక అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి.
స్త్రీ, పురుషులిద్దరికీ మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఒకేలా ఉంటుంది. కానీ, తీవ్రమైన నిస్పృహ పురుషులకంటే స్త్రీలకే ఎక్కువగా కలుగుతుంది. దీనికి గల వివిధ కారణాలను చూసినట్లయితే, ఈ పితృస్వామ్య వ్యవస్థ స్రీలకు అంటగట్టిన స్థాయి, హోదా, పాత్రలు, బాధ్యతలు వారు మానసిక అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. కుటుంబంలో కూతురిగా, చెల్లిగా, భార్యగా, తల్లిగా స్త్రీలకు ఎన్ని మంచి విషయాలు లభిస్తాయో చెప్పలేం కానీ, వారిపై ఒత్తిడి మాత్రం తీవ్రంగానే
ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు, నమ్మకాలు మహిళలను క్షోభకు, బాధకు, అవమానానికి, మానసిక వేదనకు గురిచేసేలా ఉంటాయి. కుటుంబంలో ఒడిదుడుకులు, హింస, లైంగిక హింస, అభద్రతా భావనలు, పెరుగుతున్న పని ఒత్తిళ్ళు మహిళల్లో మానసిక ఆందోళనలను, నిస్పృహలను పెంచుతున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా స్త్రీలలో డిప్రెషన్‌ రావడానికి అవకాశముంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల్లో సగటున 10 శాతం మంది, ప్రసవం తర్వాత 13 శాతం మంది మహిళలు డిప్రెషన్‌కు గురవుతున్నారు. వర్ధమాన దేశాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. వర్థమాన దేశాలకు చెందిన 15 శాతం గర్భిణులు, ప్రసవం తర్వాత 19.8 శాతం మహిళలు డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు తేలింది. అయితే, మన దేశంలో మానసిక సమస్యలు ఉన్నవారు సమాజం చిన్నచూపు చూస్తుందనే భయంతో వైద్యసహాయం పొందడానికి వెనకడుగు వేస్తున్నారు. సైన్స్‌ జర్నల్‌ లాన్సెట్‌లో 2016లో ప్రచురితమైన ఒక నివేదిక, దేశంలో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి పది మందిలో కేవలం ఒక్కరే అలాంటి సేవలు పొందగలుగుతున్నారని చెప్పింది. మహిళల విషయంలో ఇది ఇంకా దారుణంగా ఉంది. ఏ రకమైన మానసిక సమస్యకి లోనైనా, పురుషునితో పోల్చితే మహిళ వైద్య సహాయం పొందడం అరుదుగా జరుగుతుంది. మన దేశంలో మహిళల మానసిక ఆరోగ్యంపై పరిశోధనలు చేసిన పరిశోధకురాలు రెనీ థామస్‌ ‘‘పేషెంట్‌ పురుషుడైతే అతని తల్లో, భార్యో, సోదరో అతన్ని చూసుకోవడానికి అందుబాటులో ఉంటారు. కానీ అదే మహిళ అయితే, వాళ్ళు ఇంటిపని చేయడానికి కూడా పనికిరారు కాబట్టి, వాళ్ళను కుటుంబం ఒక బరువుగా భావిస్తుంది’’ అని చెప్పారు.
కేవలం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, భావోద్వేగపరంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. మన పితృస్వామ్య సమాజంలో, కుటుంబాల్లో భావోద్వేగాలను వ్యక్తపరచడంలో పురుషులకు ఉన్నంత స్వేచ్ఛ, వెసులుబాటు మహిళలకు లేదనే విషయం మనకు తెలిసిందే. కుటుంబ సభ్యుల భావోద్వేగాలను ఒక్క ‘ఏడుపు’ను తప్పితే, తన సంతోషం, బాధ, కోపం, భయం, చిరాకు, ఆందోళన, ఉత్సాహం, ఆత్మగౌరవం, విశ్వాసం, ప్రేమ, సృజనాత్మకత వంటి వాటిని వ్యక్తపరచగలిగే, మనసారా నవ్వగలిగే, మాట్లాడగలిగే స్నేహపూరిత వాతావరణం చాలా తక్కువగా కుటుంబాల్లో కనిపిస్తుంది. ఫలితంగా, మహిళల్లో గూడు కట్టుకుపోతున్న ఈ భావోద్వేగాలు వారు అనారోగ్యం బారిన పడడానికి దారితీస్తున్నాయి.
మహిళల శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మరొక కీలకమైన అంశం హింస. కానీ, హింసను సామాన్యంగా ఎవరూ ఆరోగ్య సమస్యగా చూడరు. హింస శారీరక గాయాలకు, మానసిక సమస్యలకు, వైకల్యాలకు, చివరకు మరణానికి కూడా దారితీస్తుంది. మహిళలు, బాలికలపై హింస జరగని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. గర్బంలో పిండం ఆడ అని తెలిసినప్పటి నుండీ మొదలయ్యే హింస, బాల్యం నుండి స్త్రీ మరణించేంత వరకు అన్ని దశలలో వివిధ రూపాలలో వెన్నంటే ఉంటుంది. ఈ హింస మహిళల ఆరోగ్య పరిస్థితిని ఇంకా దిగజారుస్తుంది. ఒక్కొక్కసారి ఈ హింసను భరించలేక మహిళలు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. గర్భంతో ఉన్నప్పుడు ఒక స్త్రీ హింసించబడిరదంటే దాని ప్రభావం ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపైన మాత్రమే కాకుండా ఆమెకు పుట్టబోయే పిల్లలపై కూడా ఉంటుంది. కుటుంబాలలో, సమాజంలో ఈ అవగాహన కొరవడడం వల్లనే మహిళలు, బాలికల ఆరోగ్యాభివృద్ధి ఒక ఎండమావిలా ఉంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ ఇంటా, బయటా మహిళలు, బాలికలపై హింస పెరుగుతూనే
ఉంది. వివిధ అధ్యయనాలు, సర్వేలు ఈ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం తెలంగాణాలో గృహ హింసకు గురైన మహిళల సంఖ్య పెరగగా, అది ఆంధ్రప్రదేశ్‌లో కొంత తగ్గింది. కర్నాటక రాష్ట్రంలో రెట్టింపయింది.
మహిళల ఆరోగ్యం గురించి చర్చిస్తున్నప్పుడు దృష్టి సారించాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే కుటుంబ నియంత్రణ. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ భారాన్ని మహిళలే మోస్తున్నారనేది విస్పష్టం. మహిళలు ఉపయోగించే గర్భనిరోధక సాధనాలు వివిధ రకాలుగా తయారు చేయబడుతున్నాయి. కానీ, కండోమ్స్‌ తర్వాత పురుషుల కోసం ఎటువంటి గర్భనిరోధక సాధనాలు చేయబడలేదు. ఇక, మన దేశంలో జనాభాను నియంత్రించడానికి రూపొందుతున్న విధానాలు మహిళలనే లక్ష్యంగా పెట్టుకుని తయారు చేయబడుతున్నాయి. ఎంతమంది పిల్లలను కనాలనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. పిల్లల మధ్య ఎడం ఉండాలంటే ఆ పద్ధతులను మహిళలే పాటించాలి. ఇద్దరు పిల్లల తర్వాత ఆపరేషన్లు మహిళలే చేయించుకోవాలి. స్టెరిలైజేషన్‌ క్యాంపుల లక్ష్యాలను చేరుకునే క్రమం ఎలా సాగుతోందో, ఇది మహిళల హక్కులను ఎలా కాలరాస్తోందో అన్నదానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని మరణించిన మహిళలే సాక్ష్యాలు. 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న మహిళల శాతం తెలంగాణలో 61.9, ఆంధ్రప్రదేశ్‌లో 69.6 ఉండగా, వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న పురుషుల శాతం తెలంగాణలో 2.0, ఆంధ్రప్రదేశ్‌లో 0.4గా ఉంది. కుటుంబ నియంత్రణ భారాన్ని మహిళలపై ఎంత మోపుతున్నారో ఈ డేటా తెలియజేస్తోంది. విషాదకరమైన అంశమేంటంటే, సంతానాన్ని నిరోధించే బాధ్యతను మహిళలపై ఉంచారే కానీ, ఈ విషయాలలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, హక్కులు మాత్రం వారికి లేవు. ఈ క్రమంలో వారు అనారోగ్యం పాలవుతున్నారు, కొన్ని సందర్భాలలో మరణిస్తున్నారు కూడా. అయితే, కుటుంబ నియంత్రణ విషయంలోని ఈ అసమానత్వాన్ని సరిచేయడానికి, మహిళలపై ఉన్న భారాన్ని తగ్గించడానికి, స్కాట్లాండ్‌లోని దుండి యూనివర్శిటీ శాస్త్రవేత్త క్రిస్‌ బారాట్‌, వచ్చే రెండేళ్ళలో పురుషుల కోసం ప్రత్యేకంగా మాత్రలు తీసుకొస్తామని చెప్పారని కొద్దిరోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే అయినా, ఈ ప్రయత్నాలు మహిళలపై భారాన్ని ఎంతవరకు తగ్తిస్తాయో వేచిచూడాల్సిందే.
మహిళల ఆరోగ్యాన్ని కేవలం వారి వ్యక్తిగత ఆరోగ్య సమస్యగా చూడలేము. నిత్యం వివిధ అసమానతల మధ్యే గడచిపోతున్న మహిళల జీవితంలాగే వారి ఆరోగ్యం కూడా సంక్లిష్ట విషవలయంలో కొట్టుమిట్టాడుతోంది. మహిళల ఆరోగ్యాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ, పితృస్వామ్య, వ్యక్తిగత కోణాల నుండి చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి, మహిళల ఆరోగ్యం మెరుగుపడాలంటే వారి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం ఒక్కటే సరిపోదు. కుటుంబంలో, సమాజంలో వారి స్థితి, పరిస్థితి మారాలి. కుటుంబాల్లో జెండర్‌ మూసపాత్రలను మార్చి, సభ్యులందరూ పని పంచుకోవాలి. సమాజంలో ముఖ్యంగా కుటుంబాలలో ఉన్న అన్నిరకాల అసమానతలను రూపుమాపాలి, ఆప్పుడు కానీ మహిళల ఆరోగ్యం మెరుగుపడదు, మహిళల జీవితాలు, పిల్లల జీవితాలు వికసించవు.

Share
This entry was posted in ఆరోగ్యం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.