భూమిక సంస్థ ఆధ్వర్యంలో 5`08`2021న రాష్ట్రస్థాయి ఫోరం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ‘‘స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా’’ పనిచేస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వరంగల్ నుండి సర్వోదయ యూత్
ఆర్గనైజేషన్, హైదరాబాద్ నుంచి అమూమత్ సొసైటీ, ఆమన్ వేదిక, రూమ్ టు రీడ్, సయోధ్య, గ్రామ్య, హైదరాబాద్ బాలల హక్కుల సంక్షేమ సంఘం, ఎం.వి.ఫౌండేషన్, స్టూడెంట్ సైంటిఫిక్ ఫెడరేషన్ సభ్యులు, అప్‌సా, మానవహక్కుల ఫోరం సభ్యులు, ఐకెపి గ్రామ సంఘ సభ్యులు, న్యాయవాదులు, ప్రముఖ సామాజిక మరియు సాంస్కృతిక సేవా కార్యకర్తలు, రాజకీయాల్లో క్రియశీలకంగా ఉన్న మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముందుగా భూమిక డైరెక్టర్ సత్యవతి వివిధ సంస్థల నుండి వచ్చిన సభ్యులందరికీ స్వాగతం చెప్పారు. 1995లో భూమిక పత్రికతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగిన భూమిక సంస్థ ప్రయాణాన్ని ఆమె అందరితో పంచుకున్నారు.
స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను సేకరించి ప్రచురించడం, భారతీయ, ప్రపంచ సాహిత్యంలో ఉన్న స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయడం, స్త్రీల సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషించడం. స్త్రీల ఆరోగ్యం, కుటుంబ హింస, ఇంటి చాకిరీ గురించి ప్రచురించడం, చర్చించడంతో పాటు పిల్లల సాహిత్యాన్ని ప్రోత్సహించడం, ప్రచురించడంతో పాటు 2006లో భూమిక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామని ఆమె చెప్పారు. అక్కడినుండి ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేయడం ప్రారంభించామన్నారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్లలో సపోర్టు సెంటర్లు పెట్టడం, పోలీసులకు జెండర్ అంశాలపై శిక్షణలివ్వడం, మహిళా కారాగారంలో మహిళా ఖైదీల కోసం పనిచేయడం, అలాగే వారి పిల్లల సంక్షేమం కోసం కూడా పనిచేశామని ఆమె చెప్పారు. 2015లో భూమిక హెల్ప్‌లైన్ నంబరు తొమ్మిదో తరగతి సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్‌లో ప్రభుత్వం ముద్రించటం వలన విద్యార్థుల నుండి బాల్య వివాహాలకు సంబంధించి కాల్స్ రావడం, వాటిపై స్పందించి పనిచేయడం జరిగుతోంది. అంతేకాక మహబూబ్‌నగర్ జిల్లాలో మద్దూరు, దామరగిద్ద మండలాల్లో బాల్యవివాహాల నిరోధానికై పనిచేయడం మొదలుపెట్టామని చెప్పారు.
హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా బాధిత మహిళలకు ఫోన్‌లో కౌన్సిలింగ్ మరియు సహాయ సంస్థలపై సమాచారం అందించడం, వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.
హింసలేని సమాజం స్త్రీల హక్కు అనే నినాదంతో వారికి హింసలేని జీవితాలను ప్రోత్సహించడమే భూమిక ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జిల్లా స్థాయిలో అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది.
2014 నుంచి షి టీమ్స్ ద్వారా పట్టుబడిన నిందితులకు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఒకసారి కౌన్సిలింగ్ తీసుకొన్న తర్వాత వాళ్ళెవరూ మళ్ళీ నేరం చేయలేదని తెలిపారు.
లింగ సమానత్వం మరియు హింసపై పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలతో సన్నిహితంగా పనిచేస్తూ పోలీసులు, న్యాయమూర్తులు, మీడియా నిపుణులకు జెండర్ సున్నితత్వంపై శిక్షణ ఇస్తోందని, అలాగే హైదరాబాద్‌లోని పది బస్తీలలో యువతీ, యువకులు, మహిళలతో వర్క్‌షాప్‌లు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్‌లు నిర్వహించడం, మైక్రోసాఫ్ట్ సహాయంతో పట్టణ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణను అందించడం, బస్తీలలోని చదువుకునే విద్యార్థుల కోసం సంచార గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా సమస్యలపై పని చేయడానికి మొత్తం వ్యవస్థను చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు.
పూర్వపు మహిళా సమత సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ఫెడరేషన్లతో కరీంనగర్ గ్రామీణ ప్రాంతాలో ్ల మహిళా సాధికారతపై పనిచేస్తోందన్నారు. కోవిడ్`19 మహమ్మారి లాక్డౌన్ సమయంలో భూమిక పనిచేస్తున్న బస్తీలు, గ్రామాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేసిందని చెప్పారు. కొవిడ్`19 మహమ్మారి సమయంలో 2020లో వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి మేడ్చల్ దగ్గర క్యాంపు నిర్వహించి ఉచిత రవాణా, ఆహార సౌకర్యాలు అందించిందని చెప్పారు.
ఎం.వి.ఎఫ్ సభ్యుడు బాల్యవివాహాల నిలుపుదల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, దామరగిద్ద మరియు మద్దూరు మండలాల్లో బాల్య వివాహాల నిలుపుదలకు అమలు చేస్తున్న వ్యూహాన్ని వివరించారు. ప్రభుత్వ సంస్థల సహకారం, బాలదండు అనే గ్రూపులు ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం కలిగిన సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.
మరికొన్ని ప్రశ్నలకు సమాధానంగా భూమిక అవలంబిస్తున్న విధానాలను చెప్పి ముగించారు.
తర్వాత సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ (ఎస్‌వైఓ) నుండి కవిరాజ్ మరియు ఇందిరలు తమ సంస్థ పని గురించి వివరించారు.
ఎస్‌వైఓ… ఆరోగ్యం, విద్య, జీవనోపాధి మరియు మహిళల సాధికారతపై పనిచేస్తూ పేదరిక నిర్మూలన కోసం మరియు సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంతో 1993 నుండి వరంగల్‌లోని గ్రామాల్లో పనిచేస్తున్నామని చెప్పారు.
ఎస్‌వైఓ 1993 నుండి గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గాను రెండు అవార్డులు మరియు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశంసలను అందుకుందని చెప్పారు.
ప్రత్యేకంగా లింగ సున్నితత్వంపై వరంగల్‌లో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నామని చెప్పారు.
సమావేశంలో పాల్గొన్నవారు స్త్రీలపై అమలవుతున్న హింస, యువతపై జరుగుతున్న హింస, వివిధ సామాజిక సమస్యలపై చర్చించారు. ఆ చర్చల ఫలితంగా ఇకముందు అన్ని సంస్థలు ఏకాభిప్రాయంతో వివిధ సామాజిక సమస్యల పై మైనర్ బాల బాలికలు ప్రేమ పేరుతో ఇల్లు విడిచి పారిపోవడం, బాల్య వివాహాలు, చదువుకున్న వారిలో పెరుగుతున్న మూఢ విశ్వాసాలు, మహిళా (మరియమ్మ) లాకప్‌డెత్, సంక్షేమ గృహాలలో వేధింపులకు గురవుతున్న విద్యార్థులు, మహిళలు, కులాంతర వివాహాల ప్రోత్సాహం, పోక్సో చట్టం అమలు తీరు, గర్భస్థ ఆడ శిశువు హత్యలపైÑ మద్యపాన, మత్తు పదార్థాల నిషేధంపైÑ అన్ని మతాల పెద్దలు పూజలు/ప్రార్ధనల పేరుతో మహిళలను లొంగదీసుకోవడం, వితంతు వివాహాల ప్రోత్సాహం లాంటి అంశృాల మీద లోతైన చర్చ జరిగింది.
పైన పేర్కొన్న సమస్యలన్నింటిపై ఉమ్మడి కార్యాచరణను రూపొందించి కలసికట్టుగా పనిచేయాలని తీర్మానించి, అందరి అభిప్రాయాలను తెలుసుకుని సమావేశాన్ని ముగించారు.