ఇవ్వాళ భారతి గురించి తెలుగు సాహిత్య ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గనాల మీద పల్లెపడుచులు బరువులెత్తుకుని అడుగులేసినట్టుగా ఎడారి బతుకుల్ని భుజాన వేసుకుని అత్యంత సహజంగా కథల బంగారు లోకంలోకి నడిచి వచ్చిందామె. బతుకు అందరికీ ఈతే కానీ కొందరికి అది ఎదురీత అవుతుంది. అట్లా బతుక్కి ఎదురీదాల్సి వచ్చిన మనుషుల గురించి చెప్పిన కథలివి…
మాదిగ వాడల్లో పైకి కనిపించని జీవిత కోణాలెన్నో భారతి కథా వస్తువులు. తన ఊరి ఆడోళ్ళ బతుకుల్ని, జీవన వ్యథల్ని నమోదు చేయాలన్న తాపత్రయం తప్ప కథలు రాసి కిరీటాలు పెట్టుకోవాలన్న ఆలోచన ఆమెకు లేదు. అసలు కథా రూపానికి సంబంధించిన నిర్మాణ సూత్రాలు, వస్తువుకు సంబంధించిన వివిధ పార్శ్వాల పటనాలూ ఆమె ఎరుగదు. తనకు తెలిసిన జీవితమేదో అత్యంత సాధారణంగా చెప్పుకుంటూ వెళ్ళి అంతిమంగా పాఠకుడిని మెరుగుపరిచే ఒక ములుకోలని సూటిగా విసురుతుంది. లోతైన అవగాహనతో, తాత్వికమైన పరిశీలనతో ఆమె జీవితాన్ని చదివిన తీరు మనని అబ్బుర పరుస్తుంది.
ఈ కథల్లోదంతా మా పల్లె ఆడోళ్ళ బతుకులు అని ఆమె అన్నప్పటికీ తమకున్న కొద్ది నేలలో పంటపెట్టి ఆ వాడ రైతులు పడ్డ కన్నగచాట్లూ, నగరాల నుండి, పట్టణాల నుండి గ్రామాల్లోకి తీసుకొచ్చిన పెను మార్పులూ కూడా ఈ కథల్లో మనకి తారసపడతాయి.
బియ్యం ఎక్కడినుండి వస్తున్నాయంటే కాన్వెంట్ పిల్లకాయలు డబ్బాలోనుండి వస్తాయని చెప్పినట్లుగా దానికంటే మనమూ ఏమంత మెరుగ్గా లేమని అర్థమవుతుంది. ‘‘ఈటి నోటి ముసర పెరికిందెవరు’’ కథ చదువుతుంటే, తళతళా మెరిసిపోయే మన స్టీలు డబ్బాల్లోకి పాలిష్ చేసి మిస మిసలాడుతున్న వరి బియ్యం రావడానికి వెనుక రైతు కష్టం తాలూకు మరో కొత్త కోణం అర్థమవుతుంది.
ఇంతదాకా మనం ఎరువులు, మందులూ, సాగునీటి కొరతా, ఆత్మహత్యల అంచులూ అన్నీ చాలావరకూ విన్నాం, చదువుకున్నాం. అయితే ఎలుకలు ఎలా గదులు గదులుగా బొరియలు తవ్వి అందులో సంవత్సరానికి సరిపడా వరి కంకుల్ని దాచి ఉంచుకుంటాయో, చిత్రంగా సంవత్సరమంతా పాడవకుండా అవి ఎట్లా నిల్వ ఉంటాయో.. ఇదలా ఉంటే మరొక పక్క పందులు… పగలంతా కోతుల్ని తరిమి, తరిమి అలసిపోయి అట్ట కన్ను మూద్దామంటే రాత్రి నడిరaాము కాడ వచ్చి పంటను చిత్తుచిత్తుగా తొక్కేసి పోయే పందులు… సున్నితంగా, సుకుమారంగా ఉండే గువ్వలు కూడా గుంపులు, గుంపులుగా వచ్చి వాటి పని అవి చేసుకుపోతాయి. రైతుకి నష్టమే అయినా ఆ గువ్వలకి తిండి కావాలి కదా అన్న రచయిత టోన్ విస్మయపరుస్తుంది.
మరోవంక వ్యాపార పంటలు మన జీవితాల్లోకి తోసుకొచ్చి ఎట్లా మనని పరాయీకరణకు గురిచేశాయో కూడా చెప్తుంది రచయిత్రి. నూతన ఆర్థిక విధానాల ప్రభావం ఎక్కువగా ఎట్లా వ్యవసాయం మీద పడిరది… పంట పెట్టడం తప్ప మరో పని తెలీని రైతు మళ్ళీ మళ్ళీ అప్పులు చేసి నేలమీద పెట్టి జూదమాడిన సంగతి కూడా మనందరికీ ఎరుకే. చీనీ కాయలకి ధర పలకలేదని ఏళ్ళ తరబడి బిడ్డల్లా సాకిన చీనీ చెట్లను తెల్లారేసరికి తెగ నరికేసిన రైతు నారప్ప గురించీ, అడుసు తొక్కి అతడాడిన జూదం గురించీ చాలా ఏళ్ళ క్రితమే సింగమనేని గారు చెప్పారు. ఇప్పుడు టమాటా పంట పేరుతో జరిగే జూదం, తమకు తెలియని కాలీఫ్లవర్ పంటేసి మొత్తం పొగొట్టుకుని, దాని మూలంగా కాపురాల్లో ఏర్పడిన రంపులు… ఇవన్నీ కూడా భారతి లోతైన పరిశీలనా ఫలితాలు.
ఇవన్నీ కూడా ఆమె స్త్రీల దృష్టి కోణం నుంచి చెప్తుంది. అంటే స్త్రీలంతా కలిసి గడ్డి కోయడానికి పోయినప్పుడో, అంతా కలిసి ఒక చోట విత్తనాల చనిక్కాయలు ఒలుస్తున్నప్పుడో, నార్లు నాటేప్పుడో, గుంపుగా కూర్చుని కబుర్లాడుకుంటున్నప్పుడో మామూలు మాటల్లో నుండే రైతు కష్టాన్ని, ప్రభుత్వ విధానాలని, కార్పొరేట్ల నుండి ఇవ్వాళ కమ్మేసిన కరోనా దాకా కూడా చర్చకు పెడుతుంది రచయిత్రి. ఒక్క ఎకరా పొలంలోనే ఎన్నెన్నో సాలు గింజలు వేసి పైసా ఖర్చు లేకుండానే పండిరచుకుని ఇంటికి తెచ్చుకునే కాలం నుండీ, ప్రభుత్వాలిచ్చే సచ్చు పుచ్చు గింజలను నాటి అవి మొలవక కరెంటు కోసం, నీళ్ళకోసం ‘‘సుక్కల పూటలు’’ పంచుకుని పండీ పండని పంటను కల్లం కాడే అప్పులకిచ్చే పరిస్థితి దాకా ఎన్నెన్నో విషయాలను చర్చకు తెస్తుంది భారతి. ఈ ప్రభుత్వ పథకాలు గతంలో ఒక మహారాజు
ఉప్పమ్ముకునే వానికి ఏనుగుని దానమిచ్చిన చందాన ఉన్నాయంటూ పైకి తెలియకుండా సన్న సన్నగా ఎద్దేవా చేస్తుంది.
అట్లనే ఏటి నిండా నీళ్ళుండి ఒకే రేవులో మనుషులూ, పశువులూ నీళ్ళు తాగిన రోజులనుండీ, ఏట్లోని ఇసికంతా ఎత్తేసి భూమ్మీద గువ్వ తాగను కూడా నీళ్ళు లేకుండా పోయి మనుషులూ డబ్బు ఇచ్చి నీళ్ళు కొనుక్కుని తాగుతూ, వాకిటి ముందుకు మనిషొస్తే చెంబు నీళ్ళు ఇవ్వడానికి వెనకాడడం దాకా… మనుషులు, పల్లెలు, ఎట్లా స్వయం పోషకాలుగా ఉన్న స్థితి నుండి పరాయీకరణ చెంది పోయారో మొత్తం ఆర్థిక విధానాల సరళీకరణ ప్రభావాన్నంతా చాలా చిన్న చిన్న పదాలతో అత్యంత సాధారణంగానే ముందు పెడతాయామె కథలు… ఈ కథల్లోని స్థల కాలాల నిర్దష్టత కూడా ఎంతైనా అభినందనీయం.
‘‘సంగటి పొద్దుకు అమ్మ కూలికి పోతే నేను ఆవును తోలుకు పోతి’’
వర్ణనలంటూ ప్రత్యేకంగా ఉండవు…
‘‘పూతకమాన్లు పూసి ఎర్రమన్నులో దోర్లాడిన ఏనుగుల మాదిరి నిలుసుకొనుండాయి.’’
ముసలి లచ్చుమవ్వని గురించి చెప్తూ ‘‘అడుసు మడికి గెనాలు వేసినట్టు ముడతలు పడిన ముఖం అవ్వది’’ అంటుంది. ఈ ఉపమానాలు నిజానికి భారతి మాత్రమే పట్టుకు రాగలిగిన
ఉపమానాలు… హఠాత్తుగా మెలకువొచ్చింది అనడానికి ఆమె ఏమంటుందో వినండి.
‘‘యాడనో పోతాన్న జీవుడు తిరుక్కుని గబుక్కున వచ్చి బొందిలో పడిపాయ’’
ఇది ఆమె తల్లి భాష
ఆమె బతుకులో భాగమైన భాష…
ఇక ఈ కథల నిండా పరుచుకుని సహజంగా ఇమిడిపోయిన ఎన్నో సామెతలు మనకు తెలీనివి, మనం ఎక్కడో మర్చిపోయినవి తారసపడి మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ప్రతి కథా చెప్పుకోదగ్గదే అయినా ఈ ఒక్క కథా చెప్పకపోతే ఈ ‘‘బతుకీవయసూ, వావీ లేకుండా అరవై ఏళ్ళ నాగవ్వ మీద వాడు చేసిన దుందుడుకు దాడి మూలంగా రక్తమండలమై పోయి నెలరోజుల పాటు జ్వరంతో తీసుకున్న నాగవ్వ మాటలు వింటే దుఃఖం ఆగదు మనకి.
‘‘జ్వరమొచ్చి అచ్రం అంతా కప్ప ఊదినట్టు ఊదిపోయింది… మూడు దినాలు ఏ నీళ్ళతో కవుకున్నా… ఆ నా బట్లకు ఇంట్లో ఉన్న పెళ్ళాల కన్న కూడా మనట్లా సాలని ఆడోళ్ళ పూకే రుసిగా
ఉండేది. వాడి చెరుకు తోటకి అగ్గి బెట్టా… ఆ తోటలోనే పాములూ పాడూ కరిసి సంపలేదే వాడ్ని…
భద్రం నాయినా యాడైనా అనేరు. ఈ బాధ కంటే ఆ బాధ భరించలేము… బగిసినం… నా మానం తీసి మోకాలికి కడతారు…’’ ఇది చదువుతూ నేను దుఃఖపడుతుంటే, ‘‘ఉండే దిగుళ్ళు సాలవ నీకు… ఆ కథలు చదివి కూడా యాడవాలా’’ అంది మా చెల్లి. ఈ ఆడోళ్ళ బతుకీత ముందు మన దిగుల్లేపాటివి అనుకుంటే మరింత దిగులు కమ్మేసింది.
‘‘మా ఇంటికొచ్చిన నల్లపెట్ట’’ అయితే ‘అతడు అడవిని జయించాడు’ నవలతో పోల్చదగిన కథ. పెట్ట, పుంజు వాటి సావాసం… పెట్ట గుడ్లకు రావటం, పొదుకు కొచ్చిన పెట్ట కింద గుడ్లు పెట్టి పొదగేయడం… గుడ్ల మీద పొదిగి, పొదిగి పెట్ట చివరికి చిటుకు, పొటుకు మంటూ గుడ్లను ఒలివిగా ఒలిచి బుజ్జి, బుజ్జి పిల్లల్ని బయటేయడం… ఆ పిల్లల్ని గద్దల నుండీ, కాకుల నుండీ, మనుషుల నుండీ కాపాడుకుంటూ వాటికి తిండి తినడం, మాన్లెక్కడం దాకా నేర్పించడం… ఓప్‌ా! నిజంగా చదివి తీరాల్సిన కథ. ప్రకృతి ఎంత రమణీయమో కదా! అందరమూ అందరికోసం బతికే కాలం నుండీ, మా కోసం మేమే అనే దినాల మీదుగా ఇప్పుడు నా కోసం నేనే అనే దుర్మార్గమైన కాలం దాకా ఎన్నో కనిపించని కష్టాలూ, నష్టాలూ… బయటకు చెప్పుకోలేని కృంగదీసిన వ్యథలూ, వెతలూ… మొత్తంగా ఆ గేపకాల గంటే ఈ కథలు అంటుంది భారతి. ఈ కథలకు ప్రముఖ చిత్రకారిణి కిరణ్ కుమారి వేసిన బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. భారతి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ, ప్రోత్సహించి ఆమె లోలోపలి సృజనాత్మక శక్తిని బయటికి తీసిన ఈ కిరణ్ కుమారి, కథలు రాసే ఒడుపుని అందించిన ఆరెం ఉమా, సంవెం రమేష్‌లకు తెలుగు కథా ప్రపంచం ఋణపడి ఉంటుంది.
దాదాపు సంవత్సరం ముందు ఒక శుభోదయాన సింగమనేని నారాయణ గారు ఫోన్ చేసి ‘‘ఎండవల్లి భారతి కథలు చదివావా అమ్మా?’’ అంటూ కొన్ని కథల్లోని కొంత, కొంత భాగం ఫోన్‌లోనే చదివి వినిపించారు. ‘‘వెంటనే ఆ కథలు చదివి నాలుగు వాక్యాలు రాయమ్మా’’ అని కూడా అన్నారు. వారు ఉన్నప్పుడు ఈ పని చేయలేకోయినందుకు చింతిస్తూ, భారతిని ప్రేమపూర్వకంగా అభినందిస్తూ, ఆమె జీవితంలోని మరిన్ని గేపకాల గంటు (ుతీవaంబతీవ) కోసం ఎదురు చూస్తున్నాను.