అస్పృశ్యత, కుల నిర్మూలనను రూపుమాపడానికి అంబేడ్కర్‌ చేసిన కృషిని వివరించిన డాక్యుమెంటరీ చిత్రం -శివలక్ష్మి

‘‘డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌: ది అన్‌టోల్డ్‌ ట్రూత్‌’’ అనే అంబేద్కర్‌ జీవిత చిత్రాన్ని 2000 సంవత్సరంలో అద్భుతమైన డాక్యుమెంటరీగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో చిత్రీకరించారు ఈ చిత్ర దర్శకులు జబ్బార్‌ పటేల్‌. దీన్ని తిర్లోక్‌ మెహతా నిర్మించారు.

కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనలపై అంబేద్కర్‌ తీవ్రమైన కాంక్షతో అహర్నిశలూ శ్రమించారు. అంబేద్కర్‌ అనుభవించిన దారుణమైన అవమానాలు నేటికీ దళితులు ఎదుర్కోవలసి రావడమే కాక పరిస్థితులు నానాటికీ ఇంకా దిగజారుతున్నాయి. అంబేద్కర్‌ వేలాది పేజీలలో రచించిన విస్తృతమైన గొప్ప రచనలన్నింటిలోకి నిజానికి ‘‘కుల నిర్మూలన The Instillation caste’’ అతని సర్వోత్కృష్టమైన రచనగా ప్రఖ్యాతి గాంచింది. ఈ ప్రణాళిక కోసం అంబేద్కర్‌ చేసిన కృషి ప్రపంచంలో ఒకప్పుడు ప్రకటించబడిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టోకి సమానమైన ప్రాధాన్యత సంతరించుకుంది. కులవివక్ష పట్ల తీవ్రంగా స్పందిస్తూ, కుల నిర్మూలనే ధ్యేయంగా, అదే ధ్యాసతో, అవే ఆలోచనలతో నిరంతరం రగిలిపోతుండేవారు. డాక్యుమెంటరీ మొదటి భాగంలో ఎక్కువగా ఈ సంఘర్షణ ప్రతిబింబించే విధంగా ఉన్నందువల్ల నేను నా సమీక్షకు చిత్రంలోని మొదటి భాగాన్ని మాత్రమే ఎంచుకున్నాను.
చిత్ర ప్రారంభమే చాలా హృదయ విదారకంగా అస్పృశ్యుడనబడే వ్యక్తి ఒక దోసిలిపట్టి నీళ్ళు తాగుతుండడం, ఆ ఇంటి యజమాని ఇంతెత్తు నుంచి ఆయన దోసిలిలో నీళ్ళు పోయడం కనిపిస్తుంది. నేపథ్యంలోంచి ‘‘శూద్రులనగా ఎవరు? వారెందువల్ల అంటరాని వారయ్యారు?’’ అనే ప్రశ్నలు వినిపించి మనం చిన్నప్పటి నుంచి వింటున్న తలనుంచి పుట్టినవాళ్ళ నుంచి పాదముల వరకు పుట్టిన వాళ్ళ గురించి వివరణ వినిపిస్తుంది. నిమ్న కులస్థులు చనిపోయిన జంతువుల కళేబరాలు మోస్తూ, కుళ్ళిపోయిన మాంసాహారాన్ని తింటూ వీథుల్లో సంచరించే స్వేచ్ఛ కూడా లేకుండా మిగిలిపోయారు. రోమన్‌ సామ్రాజ్యంలోని బానిసత్వం కంటే అతి దారుణమైన వెట్టి చాకిరీలో మగ్గిపోయేవారు. అమెరికన్‌ నీగ్రోల కంటే, జర్మన్‌ యూదుల కంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎంతకాలం? ఇంకా ఎంతకాలం?’’ అంటూ వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈ నేపథ్య వ్యాఖ్యానంతో పాటు ఆయా దృశ్యాలు చాలా దయనీయంగా ప్రేక్షకులకు కనిపిస్తాయి. ఆ వెంటనే ‘గౌతం మోహన్‌’ అనే అంటరాని వ్యక్తిని, ఆలయం బయట తలదాచుకున్నాడనే నెపంతో అతని నీడ దేవుని మీద పడిరదని అగ్రవర్ణాల వారు నానా రకాల తిట్లతో నిందిస్తూ విపరీతంగా కొట్టి, కొట్టి అతన్ని చంపేస్తారు. ప్రతీకారం తీర్చుకుంటామని నినదిస్తూ చైతన్యవంతులైన దళితులు మండుతున్న కాగడాలతో ఊరేగింపుగా రావడం కనిపిస్తుంది.
సీన్‌ కట్‌ చేస్తే అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో లజపతి రాయ్‌, ఆ తర్వాత ప్రొఫెసర్‌ సెలిగ్మాన్‌లు అంబేద్కర్‌ను హోమ్‌ రూల్‌ ఉద్యమంలో చేరమని అడుగుతారు. ‘‘క్షమించాలి. నేను రాలేను. బరోడా సంస్థానం వారి స్కాలర్‌ షిప్‌ మీద నేనిక్కడున్నాను. చదువు తప్ప వేరే విషయాలేమీ పట్టించుకోనని మహారాజు గారికి మాటిచ్చాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం’’ అని సమాధానమిచ్చి తన పనిమీద లైబ్రరీకి వెళ్ళిపోతారు అంబేద్కర్‌.
సీన్‌ మారి ఒక హోటల్‌ వంటగదిలో ‘స్టీవ్‌’ అనే నల్లజాతి యువకుడితో కలిసి అంబేద్కర్‌ పాత్రలు కడుగుతున్న దృశ్యాన్ని చూస్తారు ప్రేక్షకులు. ‘రాత్రంతా నువ్వు చెప్పిన విషయం గురించే ఆలోచించాను. భారతీయులు మిమ్మల్ని కనీసం ముట్టుకోనివ్వరా’ అని స్టీవ్‌ ఆశ్చర్యంగా అంబేద్కర్‌ని అడుగుతాడు. అవునని చెప్తూ, అంతేకాదు మీకు కనీసం 14వ సవరణ ఉంది, స్వేచ్ఛ ఉంది అని అంబేద్కర్‌ అంటే, మాకు స్వేచ్ఛ లేదు. వాస్తవానికి నలుపు నలుపే, తెలుపు తెలుపే. రెండూ ఎన్నటికీ ఒకటి కాలేవు అంటాడు స్టీవ్‌.
కొలంబియా విశ్వవిద్యాలయంలో తన పరిశోధనా గ్రంధాన్ని సమర్పించే ముందు ప్రొఫెసర్‌ అలెగ్జాండర్‌ గోల్డెన్‌ వైజర్‌ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంబేద్కర్‌ ఇండియాలో వర్ణవ్యవస్థ గురించి ‘‘ఒక సగటు భారతీయుడు, అంతెందుకు ఒక సగటు అమెరికన్‌ కూడా భారతదేశ గ్రామీణ వ్యవస్థ గురించి ప్రస్తావించనప్పుడు మహదానంద పడతారు. భారతీయ గ్రామంలో అందరూ ఒకటి కాదు. అది అగ్రవర్ణాల వారు, అంటరానివారు అని రెండు భాగాలుగా విభజించబడిరది. అగ్రకులాల వారు పాలకులవుతారు. అంటరానివారు, వారికి సేవలు చేసే బానిసలుగా మిగిలిపోతారు. ఈ తేడా పుట్టుకతోనే సంక్రమిస్తుంది. తప్పించుకునే వీలేలేదు’’ అని మాట్లాడతారు. ‘‘హిందువులు కాని వారిలో కూడా ఈ ప్రసక్తి ఉందా?’’ అనడుగుతారు అమెరికన్లు. ‘‘ఉంది. ఇతరులపై కూడా ఆ ప్రభావాన్ని చూపించారు. యావద్భారత దేశంలో కుల వ్యవస్థ జీర్ణించుకుపోయింది’’ అని అక్కడున్న ఆచార్యులు, విద్యార్థులందరికీ వివరిస్తారు. మీదే కులం అని వారు ప్రశ్నిస్తే అణగారిన ‘మహర్‌ కులం’ అని హుందాగా, ఆత్మవిశ్వాసంతో బదులిస్తారు అంబేద్కర్‌.
తర్వాత రెండు సీన్లలో రెండు ఎం.ఎ.లు, డాక్టరేట్‌ డిగ్రీలను కేవలం మూడు సంవత్సరాల్లో పూర్తిచేసిన అంబేద్కర్‌ను ప్రశంసిస్తూ అతని స్నేహితులు సంబరం చేసుకుంటారు. తర్వాత స్టీవ్‌తో చర్చికి వెళ్తారు అంబేద్కర్‌. చర్చి ఫాదర్‌ అక్కడున్న నల్లజాతి ప్రజలందరితో ‘‘స్టీవ్‌ చెప్పిన సమాచారం ప్రకారం భారతదేశంలో అతని కులానికి చెందిన అంటరాని జాతివారు కూడా మనలాగే దుర్భర బానిసత్వంతో మగ్గుతున్నారు. వారు అణచివేయబడి జంతువుల కంటే హీనాతిహీనంగా, నీచమైన పరిస్థితుల్లో బతుకుతూ నీచమైన పరిస్థితుల్లో మరణిస్తున్నారు. ఇది వారసత్వంగా వస్తున్న చెరగని మచ్చ’’ అని ప్రసంగిస్తారు.
తర్వాత దృశ్యం మారి అమెరికా నుంచి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదవడం కోసం బ్రిటన్‌ బయల్దేరతారు అంబేద్కర్‌.
లండన్‌లో చదువు ఇంకా 10 నెలలుండగా, బరోడా సంస్థానం నుంచి అంబేద్కర్‌కు ఇస్తున్న ఉపకార వేతనం రద్దయిందనీ, వెంటనే వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానం కోసం 10 సంవత్సరాల పాటు పనిచేయాలనీ దివాన్‌ నుంచి కబురొస్తుంది. దీక్షగా పనిచేస్తున్న పరిశోధనను మధ్యలో ఆపేసి వెంటనే బయల్దేరి 1917లో స్వదేశానికొచ్చేస్తారు. బరోడాలో ఉద్యోగంలో చేరాక ఇల్లు చూసుకుని కుటుంబాన్ని తీసుకెళ్ళాలనుకుంటారు. ఇంటి కోసం వెతికే క్రమంలో ఎన్నో భరించలేని కష్టాలు పడతారు. మహర్‌ కులం అని చెప్పగానే ఎవరూ ఇల్లు అద్దెకివ్వరు. ఫైల్‌ అడిగితే కార్యాలయంలో సేవకుడు దూరం నుంచి పడేస్తాడు. మంచినీళ్ళడిగితే నీళ్ళున్నప్పటికీ లేవని చెప్తాడు. చివరికి పర్షియన్‌నని అబద్ధమాడి ఎలుకలు తిరిగే ఒక చిన్న మురికి గది సంపాదిస్తే, అది తెలిసి అక్కడి పెద్ద మనుషులనబడే అగ్రవర్ణాల వాళ్ళు బరోడా సంస్థానంలో అధికారి అని తెలిసి కూడా మూకుమ్మడిగా వచ్చి నానా రకాల తిట్లతో బయటికి గెంటేస్తారు. గత్యంతరం లేక బరోడా మహారాజుని కలుస్తారు. మహారాజుగారు ఎదురొచ్చి సగౌరవంగా ఆహ్వానించి, ‘నీ రచన చదివాను, అద్భుతంగా ఉంది. నిన్ను చూసి గర్వపడుతున్నానంటారు’ గానీ నాకో ఇల్లు కావాలని అంబేద్కర్‌ అడగ్గానే ‘అసలే నీకుద్యోగమిచ్చి నేనో విప్లవం సృష్టించాను. కేవలం ఈ కుల వ్యవస్థను ఒక్కరోజులో రూపుమాపాలనుకోవడం అవివేకం. అందుకు సమయం కావాలి, ఓర్పు వహించాలి’ అంటారు. విదేశాల్లో ప్రతి అవమానపడిన సందర్భాన్నీ ఎంతో ధైర్యసాహసాలతో, ఆత్మగౌరవంతో గెలిచిన అంబేద్కర్‌, ఈ దృశ్యంలో తన దుఃఖాన్ని పంచుకోవడానికి ఎవరూ లేక ఏకాంతంగా, నిస్సహాయంగా, బేలగా పైకే దుఃఖించడం ప్రేక్షకులకు కనిపిస్తుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటికి తిరిగొచ్చి బొంబాయి సైడెన్హాం కాలేజీలో చేరతారు.
సైడెన్హాం కాలేజీలోని అగ్రవర్ణ విద్యార్థులు ఒక అంటరాని మహర్‌ కులస్థుడు ఇంగ్లీష్‌లో మనకి పాఠాలు చెప్పడమేంటి? అని వాళ్ళలో వాళ్ళు హేళనగా మాట్లాడుకుంటారు. అంబేద్కర్‌ తన అర్హతలన్నీ వివరించి ‘‘మీకు బోధించే శక్తి సామర్థ్యాలు నాకు లేవని మీలో ఎవరైనా అనుకుంటే, వాళ్ళు వెంటనే క్లాస్‌లోంచి వెళ్ళిపోవచ్చు’’ అని సాధికార దర్పంతో జవాబు చెప్పి వాళ్ళ నోళ్ళు మూయిస్తారు. నీళ్ళు తాగుతుంటే త్రివేది అనే ఒక అధ్యాపకుడు అడ్డగించి, మీ నీటిని మీ ఇంటినుంచే తెచ్చుకోవాలంటాడు. దానికి అంబేద్కర్‌ చాలా నింపాదిగా చక్కగా నీళ్ళు వంపుకుని తాగి, ‘‘రేపటినుంచి మీరందరూ మీ ఇళ్ళనుంచే నీళ్ళు తెచ్చుకోండి. ఒకవేళ ఈ నీరు అపవిత్రమైతే పవిత్రం చేసుకునే మంత్రాలు మీకు తెలుసు గదా, లేకపోతే నేను చెప్తానని’’ ఆ మంత్రాన్ని రెండుసార్లు శ్రావ్యంగా చదివి వినిపిస్తారు. ఇక్కడినుంచి ఆత్మవిశ్వాసంతో అంబేద్కర్‌ ప్రతి సందర్భంలోనూ ధీటైన జవాబులివ్వడం చూస్తారు ప్రేక్షకులు.
అంబేద్కర్‌ ‘‘మూక్‌ నాయక్‌’’ (నోరు లేని వారికి నాయకుడు) అనే పక్ష పత్రిక ద్వారా తన జాతి జనులను చైతన్యపరచాలనుకుంటారు. అసమానతలకు పుట్టిల్లు భారతదేశం. హిందూ సమాజం ఎన్నో అంతస్థులు కలిగి ఉన్న గోపురం లాంటిది. దీనికి ప్రవేశ ద్వారమూ లేదు. మెట్లూ లేవు. ఎవరైనా సరే వారు జన్మించిన అంతస్థులోనే అంతమవ్వాలంటారు అంబేద్కర్‌. ‘‘హోమ్‌ రూల్‌ బ్రాహ్మణులకు వలెనే మహర్లకు కూడా జన్మహక్కు కావాలి. ఇది అవలంబించినంత వరకూ హెమ్‌ రూల్‌ భారతావనికి ఓ ఎండమావే అవుతుంది. అణగదొక్కబడిన వారికి ప్రాథమిక హక్కులు కల్పిస్తే గానీ స్వరాజ్యం మనకు నిజమైన స్వరాజ్యం కాదు. అది ఓ కొత్తతరహా బానిసత్వమవుతుంది`ఒక మహర్‌’’ అని రాసిన ఆకాశరామన్న
ఉత్తరంలో నిజాన్ని ఎంత నిర్భయంగా రాశారు అంటూ సాహు మహారాజ్‌ మెచ్చుకుని, అది రాసింది అంబేద్కర్‌ అని తెలుసుకుని అతని అభిప్రాయాన్ని పూర్తిగా సమర్థిస్తారు. దళితులున్న ఒక బహిరంగ సభలో పాల్గొని ‘‘ప్రియ మిత్రులారా ఈ సభ అంబేద్కర్‌లో ఒక రక్షకుడ్ని కనుగొన్నదనే నమ్మకాన్ని నాకు కలిగించింది. అతను మీ సంకెళ్ళను తెంచగలడని ఘంటాపధంగా చెప్పగలను. అంతేకాదు, నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను. ఏదో ఒక రోజున అంబేద్కర్‌ ఇండియాలో ఒక మహోన్నత నాయకుడిగా ప్రకాశించడం తథ్యం’’ అంటూ ఉపన్యసిస్తారు సాహు మహారాజ్‌. ‘మూక్‌ నాయక్‌’ కోసం, లండన్‌ చదువు కోసం కూడా ఆర్థిక సహాయం చేస్తానంటారు మహారాజ్‌. వారికి కృతజ్ఞతలు తెలుపుకుని బరోడా సంస్థానం వారి పిలుపుతో మధ్యలోనే వదిలేసి వచ్చిన చదువుని కొనసాగించడానికి మళ్ళీ లండన్‌కి బయల్దేరతారు అంబేద్కర్‌.
లైబ్రరీలలో బండెడు పుస్తకాలు ముందేసుకుని, కడుపు ఆకలితో మండిపోతున్నా తొమ్మిదిలోపు దీపాలన్నీ తీసెయ్యాలని ఇంటావిడ హుకుం జారీ చేసినా, సరిగా తిండి పెట్టకపోయినా, ఖాళీ కడుపుతోనే ఏకదీక్షతో అధ్యయనం సాగిస్తారు. అంబేద్కర్‌ పరిశోధనని పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్‌ ‘మీ తీర్మానాల పట్ల మాకు ఎలాంటి విభేదాలూ లేవు. ఆర్థిక శాస్త్రంలో పరిశోధనా వ్యాసమే గాని సామ్రాజ్య వాదం మీద విరుచుకు పడడం కాదుగా. మీరు మీ ఆవేశాన్నీ, భాషనీ మార్చుకోవాలి’ అని ఆదేశిస్తాడు. ‘నా భాష వాళ్ళను బాధించింది. నేను ఉన్నది ఉన్నట్టుగా రాశాను. దాన్ని సృష్టించింది వాళ్ళే. నేను కాదు’ అని బాధపడుతూ రూపాయి సమస్య మీద తన సిద్ధాంత వ్యాసాన్ని మళ్ళీ తిరగరాసి పట్టభద్రునిగా 1923లో తిరిగి స్వదేశానికొస్తారు.
ఒకరోజు ఇంటి బయటికొచ్చి చూస్తే ఒక సాంస్కృతిక కార్యక్రమం చూస్తూ జనం పెద్ద సమూహంగా కనిపిస్తారు. చిన్నతనం నుంచి తన జాతివారితో కలిసి, సంగీత కచేరీలలో కూడా పాల్గొనేవారు అంబేద్కర్‌. ఒక సందర్భంలో డోలు వాయించడం కూడా చూస్తారు ప్రేక్షకులు. తన జాతి జనుల నుద్దేశించి ఆవేశంతో, ‘మీరెందుకు మేల్కోరు? మీ జాలిగొలిపే మొహాల్ని చూసినా, మీ దీనమైన గొంతులు విన్నా నా గుండె పగిలిపోతుంది. తరతరాలుగా హిందూ అగ్రవర్ణాల వారు మన నెత్తిన కూర్చుని స్వారీ చేస్తున్నారు. వారు మన హక్కుల్ని కాలరాసి, మనల్ని అణగదొక్కి హీనంగా చూస్తున్నారు. ఎందుకు మీరు మీ బాధల్నీ, పేదరికాల్నీ, బానిసత్వాన్నీ, ప్రాపంచిక కష్టాల్నీ, మీ దైన్యమైన, నీచమైన, అసహ్యకరమైన జీవితాల్తో మరింత హీనపరుచుకుంటున్నారు? ఇంతకంటే ఈ లోకం నుంచి నిష్క్రమించడమే మేలు. ప్రతి ఒక్కరూ మీ హక్కులేమిటో తెలుసుకోవాలి. చీకటైన జీవితాల్లో వెలుగు నిండాలి. మేల్కోండి. వాస్తవానికి ఈ దేశంలో హెచ్చు తగ్గులు లేకుండా, అందరితో సమానంగా కూడూ, గుడ్డా, నీడా పొందడం అందరి జన్మ హక్కు. గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని అనుకుంటే స్వయం సహాయమే అన్నిటికంటే ఉత్తమోత్తమమైన మార్గం. మనం మన కష్టనష్టాలను, సమస్యలను ప్రభుత్వానికి తెలియ చెయడం కోసం ఒక కేంద్ర సంస్థను నెలకొల్పుదాం. ఆ సంస్థను ‘బహిష్కృత్‌ హితకారిణి సభ’ గా పిల్చుకుందాం’’ అంటూ జనంలో చైతన్యాన్ని రగిలించేలా శక్తివంతంగా ప్రసంగిస్తారు అంబేద్కర్‌. ‘మేల్కోండి’ అనే పదాన్ని చాలాసార్లు అజమాయిషీగా గర్జించి పలుకుతారు.
బొంబాయి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యునిగా నియమితులైన తర్వాత మూతబడిన మూక్‌ నాయక్‌కి బదులుగా ‘బహిష్కృత్‌ భారత్‌’ అనే కొత్త పక్ష పత్రికను ప్రారంభిస్తారు. ప్రజలందరికీ చెందిన చెరువు నీటిని కూడా తాగనివ్వకుండా అగ్రవర్ణాల వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలని పిలుపునిస్తారు. నిమ్న జాతుల వారందరూ సంఘటితమై మహాడ్‌ సత్యాగ్రహాన్ని బలపరచమని విజ్ఞప్తి చేస్తారు. అన్ని ప్రజోపయోగ నీటి వసతులను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలనే విషయం బొంబాయి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లోని బోలే రిజల్యూషన్‌ తీర్మానించింది. ‘‘కొంకణ్‌లోని ఏదో ఒక ప్రాంతం నుంచి మనం మన ఉద్యమాన్ని ప్రారంభించాలి. మనం మన మహాడ్‌ ఉద్యమాన్ని అంటరానివారి ప్రవేశంతో మొదలుపెడదాం. ఇది సామాజిక విప్లవానికి నాంది కావాలి’’ అంటూ సహస్ర బుద్ధే, చిత్రే, మొదలైన తన అనుయాయులకి ‘ఈ వార్త ప్రతి గ్రామానికి చేరాలి, వేల సంఖ్యలో జనం హాజరు కావాలి’ అని ఆదేశాలిస్తారు.
తర్వాత దృశ్యంలో జన ప్రవాహాలు వేలాదిగా తరలి వస్తున్న దృశ్యం ప్రేక్షకులకు గొప్ప ఉత్తేజం కలిగిస్తుంది. అంబేద్కర్‌ ఆ జన సమూహాన్ని సంభోదిస్తూ, ‘‘సోదర, సోదరీమణులారా! ఈ సమావేశానికి అధ్యక్షత వహించమని నన్ను కోరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనం నిరంతరం అన్యాయానికి బలవుతూ ఉన్నందుకు నాకు చాలా విచారంగా ఉంది. హిందూ అగ్రవర్ణాల వారు మనల్ని నరకంలో బతకమని శాసిస్తూ, మనకు అంటగట్టిన దుర్భర జీవన విధానాన్ని నేటితో విసర్జించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే చదువుకోండి. తిరగబడండి. సంఘటితమవ్వండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. పరిశుభ్రత నేర్చుకోండి. కుళ్ళిపోయిన మాంసాహారాన్ని, ఎంగిలి మెతుకుల్ని తినబోమని శపధం చేయండి. మీ పిల్లల్ని చదివించండి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని వాళ్ళ మనసుల్లో బీజాలు నాటండి. మన పోరాటం సంపద కోసం, పదవుల కోసం కాదు. ఈ పోరాటం స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం. న్యాయం మనవైపు ఉంది. ఈ పోరాటంలో మనకు విజయం తథ్యం’’ అని ప్రసంగిస్తారు. సభలోని ప్రజలందరూ తమ పూర్తి అంగీకారాన్ని చప్పట్ల హోరుతో తెలియపరుస్తారు. ఆయన వల్ల ప్రభావితులైన అట్టడుగు జనం క్రమక్రమంగా తమ అలవాట్లను మార్చుకున్నారనీ, పరిశుభ్రతను నేర్చుకున్నారనీ ఆయన స్నేహితుల్లో ఒకరు రాశారు.
ఉద్యమకారుల్లోని ఒక వక్త, ‘‘మహాడ్‌కి చెందిన అస్పృశ్యులు మంచినీటి కోసం కట కటలాడుతున్నారు. ఈ సమస్యను తీర్చడానికి బోలే తీర్మానాన్ననుసరించి మహాడ్‌ మున్సిపాలిటీ, కుల ప్రసక్తి లేకుండా, ప్రజలంతా చావ్‌దార్‌ సరస్సులోని నీటిని వాడుకోవడానికి అనుమతించింది. అయినా ఇంతవరకూ మహాడ్‌లోని అంటరానివారు ఈ తీర్మానాన్ని పాటించలేదు. ఎందుకంటే వాళ్ళకు భయం. నేను మనవి చేసుకునేదేమిటంటే అందరూ ఈ విషయంలో చొరవ చూపాలి. కనుక ఇప్పుడు మనందరం చావ్‌దార్‌ సరస్సుకు వెళ్ళి, మన న్యాయమైన హక్కుతో ఆ నీటిని తాగుదాం’’ అని అంటారు. ‘పదండి చావ్‌దార్‌ సరస్సుకు’ అనే నినాదంతో ఊరేగింపుగా బయల్దేరి మహోత్సాహంతో వేల సంఖ్యలో ఉన్న జనం సరస్సులోంచి నీటిని తాగే దృశ్యాన్ని ప్రేక్షకులు పులకించిపోతూ చూస్తారు.
ఆ వెనువెంటనే ‘అందరూ వినండి, అంటరానివారు చావ్‌దార్‌ సరస్సు నీళ్ళను అపవిత్రం చేశారు. వాళ్ళు భీమేశ్వరాలయంలోకి కూడా ప్రవేశిస్తారు’ అనే ఒక చాటింపుతో అగ్రవర్ణాల వాళ్ళు గుంపులు గుంపులుగా ఆయుధాలతో, కర్రలతో దొరికిన వారిని దొరికినట్లుగా చావబాదుతూ భయానకంగా దాడి చేస్తారు. ఒక మహా విషాదం చోటు చేసుకోవడం
చూస్తారు ప్రేక్షకులు!
‘ఘోరం, అవమానం, ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలరు?’ అని అంబేద్కర్‌ బాధపడతారు. పోలీసు అధికారి వచ్చి ‘డాక్టర్‌ అంబేద్కర్‌, మీ వాళ్ళని కాస్త అదుపులో ఉంచండి’ అంటాడు. అంబేద్కర్‌, ‘మా సమావేశం ముగిసింది. నేటి నుంచి న్యాయబద్ధంగా ఈ చెరువులోని నీటిని అందరూ ఉపయోగించుకుంటారు’ అని అంటారు. ఎస్పీ వచ్చి కలెక్టర్‌ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్తాడు. అంబేద్కర్‌ 1927, డిసెంబర్‌ 25, 26 తేదీల్లో తలపెట్టిన సత్యాగ్రహం గురించి ప్రజలతో మాట్లాడుతూ ‘‘సోదరులారా! మీరు మహాడ్‌లో క్రమశిక్షణ తప్పకుండా పాటించాలి. క్రమశిక్షణ లేని సత్యాగ్రహం నీరుగారిపోతుంది’’ అని సహచరుడు చిత్రేకి ఆ బాధ్యతను అప్పగించి, సహస్ర బుద్ధిని తీసుకుని కలెక్టర్‌ను కలవడానికి వెళ్తారు.
కలెక్టర్‌, అంబేద్కర్‌తో ‘మీరిక్కడ సమస్యను అర్థం చేసుకోవాలి. అగ్రవర్ణాల వారు సరస్సు తమ స్వంత ఆస్తి అని వాదిస్తూ కోర్టుకెళ్ళారు. సివిల్‌ కోర్టు, వారికి స్టే కూడా మంజూరు చేసింది’ అంటాడు. ‘మిస్టర్‌ హుడ్‌, ఇది పూర్తిగా అబద్ధపు వాదన అని నాకంటే మీకే బాగా తెలుసు’ అని అంబేద్కర్‌ అంటారు. దానికి కలెక్టర్‌ ‘వారి వాదన న్యాయబద్ధమైందో కాదో నిర్ణయించవలసింది కోర్టు కదా?’ అంటాడు. అంబేద్కర్‌ ‘‘మా ఈ సత్యాగ్రహపు ముఖ్యోద్దేశం ఆ చెరువులో నీళ్ళు తాగడమే’’ అంటారు. ‘మీరు మొండికేస్తే చట్ట ధిక్కరణ నేరం కింద నేను మిమ్మల్ని అరెస్టు చేయాల్సుంటుంది. మీరు మీ 10,000 మంది సహచరులను జైలుకి పంపించాలనుకుంటున్నారా? అందువల్ల మీకు కలిగే ప్రయోజనమేంటి? నేను మీ ఉద్యమానికి వ్యతిరేకిని కానని మీకు తెలుసు’ అని కలెక్టర్‌ అంటే, ‘‘కృతజ్ఞులం సార్‌! మా వాళ్ళక్కడ మా కోసం ఎదురుచూస్తూ ఉంటారు’’ అని చెప్పి అక్కడి నుంచి ప్రజలవైపుకి కదులుతారు అంబేద్కర్‌, సహస్ర బుద్ధి.
1927, డిసెంబర్‌ 25 నాడు, అంబేద్కర్‌ అశేష ప్రజావాహినిని ఉద్దేశించి ‘‘ఈ సమావేశం భారతదేశంలో సమానత్వ యుగానికి నాందీ ప్రస్తావనగా ఏర్పాటు చేయబడిరది. ఇది భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ జరగనిది. ఈ సమావేశాన్ని 1789లో జరిగిన ఫ్రెంచ్‌ విప్లవానికి దారితీసిన సమావేశంతో పోల్చవచ్చు. ఈ సమావేశం మన దేశంలో సామాజిక విప్లవానికి ఆరంభం. ఈ సమావేశపు ప్రధానమైన లక్ష్యం అస్పృశ్యతను రూపుమాపడమే కాదు, మహా వృక్షంలా పాతుకుపోయిన ఈ కుల వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించి వేయడమే! ఈ చెరువులో నీరు తాగినంత మాత్రాన మనకేం అమరత్వం రాదు. కానీ ఈ చర్య మనం కూడా మనుషులమేనని ఈ లోకానికి నిరూపిస్తుంది. పుట్టుక మన చేతుల్లో లేదనే విషయాన్ని మనం యావద్భారత దేశానికి చాటి చెప్పాలి. మన భారతీయ సమాజాన్ని కులరహిత, వర్గ రహిత సమాజంగా పునర్నిర్మించాలి. మనుషులంతా సమానులై పుట్టాలి, సమానులై మరణించాలి అనే సిద్ధాంతాన్ని మనందరం పాటించాలి. సమాజంలో అందరికీ సమాన హోదా ఉండాలి. అంతేకాదు, అసమానతల చుట్టూ అల్లుకుపోయిన హైందవ సిద్ధాంతాన్ని మనం మట్టుపెట్టాలి. సోదర, సోదరీ మణులారా, మతానికీ, బానిసత్వానికీ పొత్తు కుదరదు’’ అని ఉద్వేగంగా ప్రసంగిస్తారు.
కుల నిర్మూలనవాది అయిన ఒక బ్రాహ్మణుడు లేచి, ‘‘ప్రియమైన సోదర, సోదరీ మణులారా! నేను పుట్టుకతో బ్రాహ్మణుడనైనప్పటికీ మనుధర్మ శాస్త్రంలోని సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తాను. అది అసమానత్వానికీ, క్రూరత్వానికీ, అన్యాయానికీ ఒక ప్రతీకయే గాని ఒక మతానికి కాదు. తరతరాలుగా అట్టడుగు వర్గాల భరించలేనన్ని కష్టాలకు కారణమైన మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టాలని నేను ప్రతిపాదిస్తున్నాను’’ అనగానే చప్పట్ల హోరుతో తమ అంగీకారాన్ని తెలియజేస్తారు సభికులు. నీచమైన మనుస్మృతిలోని శ్లోకాలను ఒక్కొక్కటీ చదువుతూ, మనుస్మృతిని సభికులందరి ముందూ దహనం చేస్తారు.
సైమన్‌ కమీషన్‌నీ, మహమ్మదాలీ జిన్నానీ కాంగ్రెస్‌ బహిష్కరిస్తుంది. కాంగ్రెస్‌కి కోపంగా ఉన్నప్పటికీ నిమ్న జాతులవారి తరపున సైమన్‌ కమీషన్‌కి అంబేద్కర్‌ హాజరై, వారికి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కావాలని కోరతారు. అందుకు కారణమడిగితే, ‘‘న్యాయ వ్యవస్థ ఇంతవరకూ మాకు చేదు అనుభవాలనే మిగిల్చింది. అనేక విషయాల్లో అణగదొక్కబడిన వర్గాల వారి ప్రయోజనాలను ఈ చట్టం దెబ్బతీస్తోంది’’ అంటారు. ఈ విషయంలో అగ్రవర్ణాల వారి తోడ్పాటు మీకుంటుందా? అని ప్రశ్నిస్తారు సైమన్‌ కమీషన్‌ సభ్యులు. ‘‘సవర్ణులందరూ తమ అపరిశుభ్రమైన పనులు చేయడానికి అణగదొక్కబడిన కులాల వారిపైనే ఆధారపడి ఉన్నారు. ఆ పనులు చేయడం నిరాకరించి అట్టడుగు కులాల వారు తమ సామాజిక హోదాను పెంచుకోవాలనుకుంటే అగ్రవర్ణాలు శత్రువులవుతారు’’ అంటారు అంబేద్కర్‌. భారత రాజ్యాంగంలో అణగదొక్కబడిన వర్గాల వారి సమస్యలకు మీరేవిధమైన పరిష్కారాలు సూచిస్తున్నారు? అని సైమన్‌ కమీషన్‌ అడిగితే వారిని అంబేద్కర్‌ రెండు విషయాలు డిమాండ్‌ చేస్తారు. ఒకటి: అణగదొక్కబడిన కులాలను హిందూ సమాజం నుంచి వేరుచేసి ప్రత్యేకమైన మైనారిటీ వర్గంగా గుర్తించాలి. రెండు: అణగదొక్కబడిన కులాలవారి భద్రతకు బ్రిటిష్‌ ఇండియాలో ఉన్న ఇతర మైనారిటీల కంటే అధిక రాజకీయ భద్రత కలిగించాలి. ఇదెందుకు కోరుతున్నామంటే ‘విద్యాపరంగా వెనుకబడి, ఆర్థికపరంగా వెనుకబడి పేదరికంతో, దాస్యంతో, రాజకీయ అణచివేతతో మరే ఇతర వర్గాల వారూ పడని పాట్లకు వీరు గురవుతున్నారు. కనుక మేం కోరేది వయోజన ఓటు హక్కుతో పాటు, సీట్ల రిజర్వేషన్‌ కూడా కల్పించాలి’’, వయోజన ఓటుహక్కు ఇవ్వకపోతే? అని సైమన్‌ కమీషన్‌ సభ్యులు ప్రశ్నిస్తే ‘‘ఇవ్వకపోతే ప్రత్యేక నియోజక వర్గాలడుగుతాం. అణగదొక్కబడిన కులాలవారు ప్రవేశించడానికి ప్రభుత్వ రంగంలోనూ, విద్యా రంగంలోనూ అవకాశాలు కల్పించమంటాం’’ అంటారు అంబేద్కర్‌. ఆయనతో పాటు మిస్టర్‌ సోలంకి అభిప్రాయం కూడా అదేనని తెలుసుకుంటారు సైమన్‌ కమీషన్‌ సభ్యులు. మీ ప్రతిపాదన ప్రకారం మీరిచ్చిన సూచనలను భారత రాజ్యాంగంలో పొందుపరిచామనే అనుకోండి. అది శాశ్వత వర్గపోరాటానికి దారి తియ్యదా? అని మళ్ళీ ప్రశ్నిస్తారు ఆ సభ్యులు. ‘‘కావచ్చు, అది అగ్రవర్ణాల వారి అభిప్రాయం మీద ఆధారపడి ఉంది సర్‌ జాన్‌. నేను కోరుతున్నదీ, ఆశిస్తున్నదీ భారతదేశంలో సమానత్వం. ఎలాంటి పోరాటాలూ లేని భారతదేశం ఒక నాటికి ఆవిర్భవిస్తుంది. కానీ అది అగ్రవర్ణాల వారు నిమ్న వర్గాలను చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది’’ అంటారు అంబేద్కర్‌. అణచివేయబడిన కులాల వారి నుంచి బార్‌ కౌన్సిల్‌లో ఎంతమంది సభ్యులున్నారు అని ప్రశ్నిస్తారు కమీషన్‌ సభ్యులు. నేనొక్కడ్నే అని అంబేద్కర్‌ సమాధానమిస్తారు. ఇక్కడ ఈ సమావేశం ముగుస్తుంది. ఇంతటితో అంబేద్కర్‌ జీవిత చరిత్ర మొదటి భాగం డాక్యుమెంటరీ సమాప్తమవుతుంది.
ఈ డాక్యుమెంటరీ ప్రత్యేకతలు:
ఇది భారతదేశంలో వచ్చిన డాక్యుమెంటరీలన్నిటిలోకి ఉత్తమమైనది. ఎందుకంటే ఇది వాస్తవ సంఘటనల యధా తథ దృశ్యకావ్యం. ఇది భారత సమాజ వాస్తవికతతో పెనవేసుకుని ఉన్న ఈ దేశంలోని మహోన్నత మేధావి అయిన ఒక గొప్ప వ్యక్తిని గురించి దర్శకులు జబ్బార్‌ పటేల్‌ ఉన్నతమైన విలువలతో, అత్యంత కళాత్మకంగా దృశ్యీకరించారు.
ఆధునిక డాక్యుమెంటరీల పితామహులు ‘జాన్‌ గ్రీర్‌ సన్‌’, ‘‘ముడి జీవితం నుండి తీసుకున్న గాధలు, దృశ్యాలు నటించిన కృత్రిమ సన్నివేశాల కన్నా ఎన్నో రెట్లు మెరుగు అని మేము నమ్ముతున్నాం. సహజ సుందరంగా ఎలాంటి బిగింపులు లేకుండా ప్రకటితమయ్యే భావ సంకేతానికి తెరమీద ఓ ప్రత్యేక విలువ ఉంది. టక్కుటమార విద్యలు మిళాయించి స్టూడియో కర్మాగారాల్లో తయారు చేసే యాంత్రిక ఉత్పాదనలు ఇవ్వలేని, వాటికి అతీతమైన ఆత్మీయ అనుభూతినీ, జ్ఞానాన్ని ఇవ్వగల శక్తి ఒక్క డాక్యుమెంటరీకే ఉంది’’ అని చెప్పినట్లే ఈ చిత్రం అంబేద్కర్‌ నిజ జీవిత సంఘటనలతో అద్భుతంగా దృశ్యీకరించబడిరది.
అమెరికాలో స్టీవ్‌, అంబేద్కర్‌లిద్దరూ రెస్టారెంట్‌ నుంచి పని ముగించుకుని బయటికొచ్చేసరికి ఒక తెల్లవాడు, ఒక నల్లజాతీయుడ్ని పట్టుకుని ‘‘నల్లజాతి వెధవా, మా తెల్లజాతి అమ్మాయిని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నల్లజాతి నక్క, అంటరాని కుక్క,.. బూడిదలో పొర్లే పందికి నీకూ తేడా లేదు కదరా’ నోటికొచ్చినట్లు తిడుతూ, విచక్షణారహితంగా రోడ్డుమీద పడేసి ఎడాపెడా చావబాదుతుంటాడు. ఇటీవల అమెరికా పోలీసులు జార్జ్‌ ఫ్లాయిడ్‌ని కిరాతకంగా చంపిన దృశ్యం ప్రేక్షకుల కళ్ళెదురుగా నిల్చి అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి ఏ మాత్రం మారకపోగా ఇంకా హీనంగా మారి దిగజారి పోయిందనిపించి నీరసపరుస్తుంది.
సినిమా చూసే ప్రేక్షకులకి తొలి ప్రతిస్పందన కలిగించడం చాలా ముఖ్యం. మొదటి సన్నివేశంలోనే ప్రేక్షకునికి కథావస్తువుకు సంబంధించి సూచీప్రాయమైన సంకేతం అందాలి. ఆ పనిని అద్భుతంగా చేశారు దర్శకులు అబ్బాస్‌ పటేల్‌. అంటరాని వారి దయనీయమైన స్థితిని ప్రేక్షకుల మదిలో ముద్రించడానికి వారిని మానసికంగా సంసిద్ధం చేయడానికి పెన్సిల్‌ స్కెచ్‌ల ద్వారా ప్రదర్శించాలనే జబ్బార్‌ పటేల్‌ ఊహాజనితమైన ఆలోచన ఈ చిత్రానికి ఉత్తమోత్తమమైన హైలైట్‌గా నిలిచింది.
బాల్యంలో తన తల్లితో చీరల దుకాణానికెళ్తే, అక్కడ డబ్బుని అంటుకోకుండా తీసుకోవడం, నేలమీద నీళ్ళు పోసి, చీరని మట్టిలో పొర్లించి దూరంగా విసిరేయడం బాల భీంరావ్‌ తో పాటు ప్రేక్షకులు కూడా చూస్తారు. అంబేద్కర్‌ కొంచెం పెద్దవాడయ్యాక ఒక దున్నపోతుకి క్షవరం చేస్తున్నతనితో, ‘‘నేను డబ్బిస్తాను, నాకు క్షవరం చెయ్యమం’’టాడు. ‘డబ్బిస్తే మాత్రం కులం పోగొట్టుకుని ఒక మహర్‌కి క్షవరం చేస్తానా’ అని అతను అహంకారంగా తిడతాడు. ‘మరి దున్నపోతుకు చేస్తున్నావుగా’ అని అంబేద్కర్‌ అడిగితే, ‘అవున్రా! నువ్వీ దున్నపోతుకంటే, గాడిదకంటే, కుక్కకంటే హీనమ’ని అంటాడు. ప్రేక్షకులకు ఈ సీన్‌ కన్నీళ్ళు తెప్పిస్తుంది.
డిగ్రీని భార్య రమాదేవి చేతుల్లో పెడుతూ అదిచ్చేటప్పుడు లండన్‌లో తననెలా సంభోదించారో హృద్యంగా నటించి చూపిస్తారు. ఈ దృశ్యంలో ఆయనలోని హాస్య ప్రియత్వాన్ని తన్మయత్వంతో చూస్తారు ప్రేక్షకులు. కుమారుడు గంగాధర్‌ మరణవార్తను తెల్పుతూ భార్య నుంచి ఉత్తరం వస్తే ‘ప్రియమైన రామూ, మనబ్బాయి మరణవార్త నాకు దుఃఖం కలిగిస్తుంది. తల్లిగా నీ కడుపుకోతను ఎవరు తీర్చగలరు? మీరు ఇతరుల ఇళ్ళల్లో అంట్లు తోముకుంటూ, పిడకలు కొట్టుకుంటూ, కట్టె పుల్లలు ఏరుకుంటూ దుస్థితిననుభవిస్తుంటే నామీద నాకే అసహ్యమేస్తోంది. నా అవసరాల కోసం ఒక్కోసారి నా పుస్తకాలమ్ముకుంటున్నాను. అన్నీ భరించక తప్పదు’’ అంటూ చాలా దుఃఖంతో జవాబిస్తారు. అర్థాకలితో, చిన్న బ్రెడ్‌ ముక్కలతో ఆకలితో పడే ఇబ్బందులన్నీ ప్రేక్షకులకు తెలిసొస్తాయి. అంబేద్కర్‌ సామాజిక జీవితం కంటే వ్యక్తిగత జీవితాన్ని చాలా తక్కువగా చిత్రీకరించినప్పటికీ వాళ్ళిద్దరిదీ చాలా అన్యోన్య దాంపత్యమనీ, కష్టసుఖాల్ని కలిసి పంచుకుంటారనీ, నలుగురు బిడ్డలు చనిపోయిన దుఃఖాన్ని వారు భరించిన తీరు ద్వారా వ్యక్తమవుతుంది.
ఆంగ్లేయులు భారతీయులను వీథి కుక్కలతో పోలుస్తూ హీనంగా మాట్లాడినపుడు వాళ్ళచేత క్షమాపణ చెప్పించుకుని తన దేశభక్తిని నిరూపించుకుంటారు అంబేద్కర్‌. ‘‘నేను ప్రజల ఎదుట సమర్ధించుకోలేని ఏ పనీ ప్రజాజీవితంలో చెయ్యను.’’ అని తన రాజకీయ ఆశయాన్ని ప్రకటించుకున్నారు. ఈ సూత్రానికి ఆయన జీవితంతం కట్టుబడి ఉన్నారు అని కర్తార్‌ సింగ్‌ పొలోనియస్‌ అన్నారు.
ఇక నటీనటుల గురించి చెప్పాలంటే ‘మమ్ముట్టి’ అయితే అంబేద్కర్‌ ఉద్వేగాలనూ, సంయమనాన్నీ, అంతఃకరణనూ అభినయించడంలో అతనికతనే సాటిగా పాత్రలో జీవించారు. ఆయన అద్భుతమైన నటనా సామర్థ్యాలు అంబేద్కర్‌ను భౌతికంగా చూడని వారందరికీ తిరిగి జీవితంలోకి తీసుకువచ్చి కళ్ళముందు ప్రత్యక్షం చేస్తాయి. ఈ చిత్రంతో ఆయన ప్రపంచ మేటి నటుల కోవలో చేరిపోయారు. అంబేద్కర్‌ భార్య రమాబాయిగా, సోనాలీ కుల్‌కర్ణి కూడా అద్భుతంగా నటించారు.
స్త్క్రీన్‌ ప్లే రచయితలు దయా పవార్‌, అరుణ సాధు, సూని తారా పోరేవాలా ఎంతైనా ప్రశంసనీయులు. ఈ చిత్రంలోని అంబేద్కర్‌ సంభాషణలను ఆయన రాసిన రచనల నుండి తీసుకుని శక్తివంతంగా స్క్రిప్ట్‌ను రూపొందించారు. అందువల్ల మమ్ముట్టి మాట్లాడేటపుడు ఆయన స్వరంలో ప్రామాణికత ధ్వనిస్తుంది. ఈ ప్రసంగాలు ఒక తరం రాజకీయ ఆలోచనాపరుల్ని ఎంతగా ప్రభావితం చేశాయో అర్థమవుతుంది. నితిన్‌ చందక్రాంత్‌ దేశాయ్‌ కళా దర్శకత్వం కూడా బ్రహ్మాండంగా అమిరింది. కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ ద్వారా అంబేద్కర్‌ అభిరుచి ప్రేక్షకులకు చక్కగా తెలిసేలా రూపొందించారు. సంగీతాన్ని అందంగా, సందర్భానుసారంగా సమకూర్చారు.
కుల నిర్మూలన, అంటరానితనాన్ని నిర్మూలించడం మీద అంబేద్కర్‌ 85 సంవత్సరాల క్రితం వెలిబుచ్చిన అభిప్రాయాలు నేటికీ ప్రాసగికతను కలిగి ఉన్నాయి. అంబేద్కర్‌ బాల్య సంఘటనలూ, బరోడాలో జరిగిన అవమానం ఆయనని నిరంతరం బాధతో మెలితిప్పతూ జీవితాంతం ప్రభావితం చేశాయని ఆయనే స్వయంగా రాసుకున్నారొక చోట. ప్రేక్షకుల హృదయాలను ద్రవింపచేసే సంఘటనలెన్నో ఉన్నాయీ చిత్రంలో. ఈ దేశం పరిస్థితి ఒకప్పుడు, ఆ మాటకొస్తే ఇప్పుడైనా ఎంత నీచంగా
ఉందో, ఈ కులవ్యవస్థ తోటి మనుషుల పట్ల ఎంతెంత హీనంగా, నీచంగా ప్రవర్తించిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూసి తీరాలి!
అవార్డులు:
1999లో ‘‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌’’ ఉత్తమ చలనచిత్రంగా, మమ్ముట్టి ఉత్తమ నటుడిగా, ఉత్తమ కళా దర్శకత్వానికి నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ జాతీయ అవార్డులను అందుకున్నారు.
70వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సమర్పించిన స్వాతంత్య్ర దినోత్సవ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ఆగస్టు 15, 2016న అంబేద్కర్‌ స్మృతిలో ప్రదర్శించబడిరది.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.