గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…)
ముగ్గురూ ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే రెండు గంటల కాలం తెలియకుండా గడిచిపోయింది. ముగ్గురి మధ్యా స్నేహం కుదిరింది.

శారద మనసు ఎప్పుడెప్పుడు మూర్తిని చూద్దామా అని తహతహలాడుతోంది. ఆమె రాగానే ఆమె వచ్చినట్లు మూర్తికి కబురు పంపింది. రెండు రోజులు గడిచినా మూర్తి రాలేదని దిగాలు పడిరది. మళ్ళీ ఒక మనిషి కోసం ఇంత బలహీనమవుతున్నానేమిటని తనను తాను హెచ్చరించుకుంది.
మూడో రోజు మూర్తి వచ్చాడు.
‘‘మూడు రోజులకు తీరిందా’’ అంది నిష్టూరంగా.
‘‘పదిహేను రోజులు ఒక్కడినే ఒదిలి వెళ్తే నేనేమయ్యానో నీకు తెలియాలిగా’’.
‘‘బాగా తెలిసింది’’ నవ్వేసింది శారద.
గలగలా కాకినాడ కబుర్లన్నీ చెప్పేసింది. గోరాగారి గురించీ, వాళ్ళింటి గురించీ చెప్తూ, ‘‘ఆయన వృక్షశాస్త్రంలో భలే పరిశోధన చేస్తున్నారు తెలుసా? ఒక వింత సంగతి చెప్తా విను. బొప్పాయి చెట్లలో ఆడచెట్లూ, మగచెట్లూ ఉంటాయి. తెలుసుగా?’’
‘‘బొప్పాయి చెట్లలో ఏంటి? సృష్టిలో ప్రతి ప్రాణిలో ఉంటాయి ఆడ, మగ. లేకపోతే సృష్టి సాగేగెట్లా.’’
‘‘అబ్బా… నీకు లా తెలుసుగానీ వృక్షశాస్త్రం తెలియదు. బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లకి ఆడ, మగ పూలు వస్తాయి. మగపూలు రాలి ఆడపూలు కాయలవుతాయి. కొన్ని చెట్లు మగ చెట్లుగానే ఉంటాయి. మగపూలే పూస్తాయి. అవి రాలిపోతాయి. కాయలు కాయవు. కొన్ని ఆడచెట్లుగా ఉంటాయి. ఆ చెట్టు పూలన్నీ కాయలు కాస్తాయి. గోరాగారు మగచెట్టుని కూడా ఆడచెట్టుగా మార్చాలని పరిశోధన చేస్తున్నారు.’’ మూర్తి తలపట్టుకుని ‘‘మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చనంతవరకూ ఎవరేం చేసుకున్నా నాకభ్యంతరం లేదు’’ అన్నాడు.
‘‘ఆడవాళ్ళను మగవాళ్ళుగా మారిస్తే’’
‘‘అది నువ్వు చెప్పాలి. నాకు నేను మగవాడిగా ఉంటే చాలు. మారాలని లేదు.’’
‘‘నాకేమనిపిస్తుందో చెప్పనా?’’ ముద్దుగా అడిగింది శారద.
‘‘చెప్పు’’ అన్నాడు ఆమెను రెప్పవాల్చకుండా చూస్తూ.
‘‘బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లలాగా ప్రతి మనిషిలో ఆడ, మగ ఇద్దరూ ఉండాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అని వేరుగా ఉండనవసరం లేదు. రెండు లక్షణాలూ ఉన్న మనుషులుండాలి. అప్పుడు ఈ తేడాలుండవు. ఎన్నో సమస్యలు పోతాయి.’’
‘‘కొత్త సమస్యలు చాలా వస్తాయి’’ శారద నెత్తిమీద మొట్టికాయ వేశాడు.
‘‘ఏమొస్తాయి’’ అమాయకంగా అడిగింది శారద.
‘‘సెక్సు… సెక్సు ఎట్లా?’’
‘‘ఏముంది? సింపుల్‌. ఉదాహరణకు నీలో ఆడలక్షణాలు ఉద్రేకించినప్పుడు మగలక్షణాలు ఉద్రేకించిన మనిషి వైపు ఆకర్షింపబడతావు. సెక్సు సాధ్యమవుతుంది. నీలో అపుడు అండం విడుదలయితే అవతలి నుంచి వీర్యకణాలు చేరతాయి. రెండూ కలిసి ఎవరి శరీరంలో స్థిరపడితే వారి గర్భంలో బిడ్డ పుడుతుంది’’. ‘‘శారదా… ప్లీజ్‌… ఆపు. నువ్వు డాక్టర్‌వి. నిజమే గాని నువ్వు చెప్పేది వింటే నాకు కడుపులో వికారంగా ఉంది. ఇంక ఆపు. లేకపోతే నన్ను వెళ్ళిపొమ్మని సూటిగా చెప్పెయ్‌’’.
శారద గలగలా నవ్వి, ‘‘నీతో తప్ప ఇలాంటి విచిత్రపు ఆలోచనలు ఇంకెవరితోనూ చెప్పలేను. అదేంటో… సరేగానీ నువ్వూ దీని గురించి ఆలోచించవా.’’ ‘‘చచ్చినా ఆలోచించను. మగాడు మగాడిలా, ఆడది ఆడదిలా ఉండాలి. వాళ్ళు ప్రేమించుకోవాలి. పెళ్ళాడాలి. ఇప్పటిలా పిల్లల్ని కనాలి. అదే సృష్టిధర్మం. నాకదే ఇష్టం’’.
‘‘సృష్టి ధర్మాలను కమ్యూనిజం మార్చదా? మార్పు ఇష్టం లేకపోతే కమ్యూనిస్టువి కాలేవు’’.
‘‘కమ్యూనిస్టులు కోరేది ఇలాంటి మార్పులు కాదు. ప్లీజ్‌ ఆ గోరాగారికో నమస్కారం. నీకో నమస్కారం. ఇంకేదన్నా చెప్పు. దుర్గాబాయి గురించి ఇంకా చెప్పు.’’
‘‘ఆమె చాలా నలిగింది, శారీరకంగా, మానసికంగా. చదువుకుంటోంది. కోలుకుంటుందిలే.’’
‘‘ఆమె జైల్లో గడిపిన దుర్భర జీవితాన్ని ప్రజల్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ తన ప్రతిష్ట పెంచుకుంటోంది’’.
‘‘పెంచుకోనీ. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టతో పాటు అందులో సోషలిస్టుల ప్రతిష్టా పెరుగుతుంది.’’
‘‘దుర్గాబాయి సోషలిస్టు కాదుగా’’
‘‘ఏమో, కావచ్చు. మన ఆశయాలు ఆమెకు నచ్చుతాయి.’’
‘‘ఆమె ఎన్నటికీ కమ్యూనిస్టు కాదు.’’
‘‘కాకపోవచ్చు. కమ్యూనిస్టు కాకుండా మంచి మనుషులు ఉండకూడదా?’’
‘‘ఉండొచ్చు గానీ… వాళ్ళ మంచితనం ఎవరికీ ఉపయోగపడదు.’’
‘‘ఇపుడు గాంధీ మొదలైన వాళ్ళ మంచితనం వల్ల ఏ ఉపయోగం లేదా?’’
‘‘ఉంది. కొంతవరకే.’’
‘‘ఆ… కొంత, కొంత, కొంత కలిసి సంపూర్ణమవుతుంది. కొంత లేకుండా సంపూర్ణం లేదు. కాబట్టి కొంత కూడా పూర్ణమే. అందుకే మనవాళ్ళు పూర్ణమిదం పూర్ణమదం అన్నారు.’’
‘‘బాబోయ్‌… ఇవాళ నువ్వన్నీ తాత్విక చర్చలు చేస్తున్నావు. నేను వెళ్ళొస్తా.’’
మూర్తిని ఆపింది శారద. రాత్రి పొద్దుబోయే దాకా చర్చలతో గడిపి భారంగా విడిపోయారిద్దరూ.
చూస్తూ చూస్తూ ఉండగానే శారద ఇంగ్లండ్‌ ప్రయాణం దగ్గర పడిరది. విశాలకు ఎం.ఎ.లో సీటు దొరికింది. విశాల ఇక ఆ ఇంట్లో ఉండదల్చుకోలేదు. హాస్టల్‌ వసతులు సరిగా లేవు. ఐనా ఇంటినుంచి బైట పడిరది. ఇంట్లో నుంచి విశాల వెళ్తున్న రోజు కోటేశ్వరి ఏడుపుకు అంతులేదు. విశాల తల్లిని ఓదార్చే ప్రయత్నం కొంతసేపు చేసి లాభం లేదని తనకవసరమైన సామాను తీసుకుని వెళ్ళిపోయింది. పధ్నాలుగేళ్ళ రాజ్యం కోటేశ్వరిని ఓదార్చి అన్నం తినిపించి పడుకోబెట్టింది. ‘‘ఇకనుంచి ఇదే నా కూతురు. అది నా కడుపున పుట్టింది గానీ మనసున పుట్టలేదు’’ అనుకుని రాజ్యాన్ని దగ్గరకు తీసింది కోటేశ్వరి.
రెండేళ్ళు శారదను చూడలేననుకుంటే మూర్తికి ఊపిరాడనట్లుగా ఉంది. శారదకు ప్రయాణపు హడావుడి ఎంతున్నా మనసులో ఓ మూల శూన్యంగా అనిపిస్తోంది. అమ్మ, సూర్యం, మూర్తి…వీళ్ళందరినీ ఒదిలి ఉండటం తననుకున్నంత తేలిక కాదని తెలుస్తూనే ఉంది.
అందరికంటే సుబ్బమ్మ సంతోషంగా ఉంది. కూతురిని ఇంగ్లండ్‌ పంపించాలని రామారావు కన్న కలలు ఆమెకు పూర్తిగా తెలుసు. ఆ కలల్లో ఆమెకూ భాగముంది. భారం ఆమె మీద వేసి తన కల నెరవేరుతుందనే పూర్తి నమ్మకంతో ఆయన వెళ్ళిపోయాడు. ఆ నమ్మకాన్ని వమ్ముకానీయకుండా ఇన్నాళ్ళూ సుబ్బమ్మ కూతురి బాధ్యత తీసుకుంది. శారద ఇంగ్లండ్‌ వెళ్ళి ఆ డిగ్రీ తీసుకువచ్చేస్తే భర్తకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న ధీమాతో బతకొచ్చునని ఆమె ఆశ. శారద పెళ్ళి గురించి ఆలోచించే పని సుబ్బమ్మ ఏనాడూ తన నెత్తిన పెట్టుకోలేదు. శారద మేనమామలు శారద మెడిసిన్‌లో చేరగానే సంబంధాలు చూడబోయారు. శారద తన వివాహం తానే చేసుకుంటానని, ఎవరి జోక్యాన్నీ సహించనని గట్టిగా చెప్పింది. సుబ్బమ్మ ఆనాటి నుంచీ శారద పెళ్ళి గురించి నిశ్చింతగా ఉంది. కూతురి మీద ఆమెకు కేవలం ప్రేమ మాత్రమే కాదు, గౌరవం, నమ్మకం కూడా ఉన్నాయి. కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా మంచిదని అనుకుంటుంది. ‘‘అమ్మా. అందరూ నన్ను ఆధునిక స్త్రీ అంటారు. నువ్వ ఆధునిక అమ్మవమ్మా’’ అనేది శారదాంబ. ‘‘అదంతా నాకేమీ తెలియదు. శారదకు తల్లిని అంతే’’ అనేది సుబ్బమ్మ.
శారద ప్రయాణం దగ్గర పడుతుండగా బంధువులందరూ వచ్చి శారదను అభినందించి వెళ్ళారు. మరో నాలుగు రోజుల్లో ప్రయాణమనగా పార్టీ సమావేశం కూడా జరిగింది. శారద ఇంగ్లండ్‌లో పార్టీ వారిని కలుసుకుని చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నారు. సమావేశం పూర్తయ్యాక శారదను ఇంటిదాకా దింపే బాధ్యతను మూర్తి తీసుకున్నాడు.
‘‘ఒక రోజంతా మనం కలిసి గడపాలి శారదా. రేపు నాతో రాగలవా?’’ మూర్తి సాహసం చేస్తున్నాననుకున్నాడు.
‘‘రాగలను’’ అంది శారద స్థిరంగా.
‘‘ఎక్కడికని అడగవేం?’’
‘‘నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి’’ మూర్తి భుజం మీద స్నేహంగా చేయి వేసింది శారద.
‘‘రేపు ఉదయం పదిగంటలకు వస్తాను. సిద్ధంగా ఉండు. మళ్ళీ ఎల్లుండి పది గంటలకు మీ ఇంట్లో ఉంటావు’’.
‘‘అలాగే’’ మధురంగా నవ్వింది శారద.
రెండేళ్ళ ఎడబాటు ఒక రోజంతా కలిసి ఉండటంతో తీర్చుకోవాలని చూడటం గురించి వాళ్ళిద్దరికీ సందేహం లేదు.
మర్నాడు శారదను తీసుకుని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు మూర్తి. ఆ స్నేహితుడు కుటుంబంతో సహా స్వగ్రామం వెళ్ళాడు.
అంత ఏకాంతంలో వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవాలని అనిపించలేదు. ఒకరి ఎదుట ఒకరు మౌనంగా కూర్చున్నారు. కొన్ని గంటలు అలా గడిచాక మూర్తి అడిగాడు.
‘‘ఏం చేద్దాం శారదా?’’
‘‘ఏ విషయం’’ తెలిసీ అడిగింది.
‘‘మన ప్రేమ గురించి’’
‘‘చెయ్యటానికేముంది? ప్రేమ ఉంది కదా… దాన్ని కాపాడుకుందాం.’’
‘‘పెళ్ళి…’’
‘‘ఎలా కుదురుతుంది మూర్తీ. నేను చాలా ఆలోచించాను. నీకు పెళ్ళయింది కాబట్టి నిన్ను ప్రేమించకూడదని అనుకోవటం, ప్రేమించకుండా ఉండటం నా వల్ల కాలేదు. అసలు ఆ ఊహే నాకు రాలేదు. స్నేహితుల్లా ఉందాం. పెళ్ళి చేసుకోవాలని ఏముంది? ఈ మూడు నాలుగేళ్ళ నుంచీ ఉన్నట్టే ఇకముందూ ఉందాం.’’
‘‘నువ్వు పెళ్ళి చేసుకోవా?’’
‘‘చేసుకోమంటావా?’’
‘‘నేను పెళ్ళాడి సంసార జీవితం గడుపుతూ నిన్ను ఒద్దని ఎలా అంటాను?’’
‘‘లేదు మూర్తీ… నేను నీ జీవితంలోకి రాకముందే నీకు పెళ్ళయింది. దానికి నీ బాధ్యత లేదు. కానీ నా మనసు నిండా నిన్ను పెట్టుకుని ఇంకొకరిని పెళ్ళాడటం నా వల్ల కాదు. పెళ్ళంటే చిన్నతనంలో ఒకందుకు భయపడ్డాను, చదువు ఆగిపోతుందని. ఇప్పుడూ భయపడుతున్నాను, ప్రేమ లేని పెళ్ళి చేసుకోటానికి. ఇంకా ఆ విషయం మర్చిపోదాం. చెయ్యటానికి ఎన్నో పనులున్నాయి. ఇంతింత బాధ్యతలు నెత్తిన వేసుకుని, డాక్టర్‌ వృత్తిలో ఉండి పెళ్ళి చేసుకోవటం కంటే ఇలా ఉండిపోవటం మంచిదని నాకెప్పుడూ అనిపిస్తుంది’’ చాలా స్పష్టంగా, బలంగా చెప్పింది.
‘‘కానీ… కానీ… ఒంటరిగా…’’ మూర్తి గొంతులో ఏదో దీనత్వం.
‘‘నేను ఒంటరినా? కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిని. నేను ఒంటరినేమిటి? అంతర్జాతీయ వ్యక్తులం మనం.’’
‘‘ఏ అర్థంలోనూ నేను ఒంటరిని కాదు. నాకు నువ్వున్నావు. లేవా?’’ శారద అడిగిన తీరుకు మూర్తి గుండె గొంతులోకి వచ్చింది.
‘‘నా శారదా’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అలా చాలాసేపు ఉండిపోయారు.
‘‘ఇంతకు మించి దగ్గర కాలేం కదా’’ జీరబోయిన గొంతుతో అన్నాడు మూర్తి.
‘‘కాలేం అనే నిస్సహాయత ఎందుకు? కాకూడదు అనే నియమం ఎందుకు? ఇంతకుమించి దగ్గర కావాలనే మహోధృతమైన కోర్కె మనలో పుట్టుకొచ్చిన నాడు ఇద్దరం ఒకరిలో ఒకరం ఐక్యమవుతామేమో. ఇపుడు ఆ కోర్కెకు అంత బలం ఉన్నట్టు కనిపించటంలేదు. మన రక్తంలో ఉన్న సంప్రదాయాలో, నీతులో, కొత్తగా అలవరచుకుంటున్న భావాలో… ఏవో మనల్ని ఇంతకన్నా దగ్గర కానివ్వటం లేదు. ఆ అడ్డు మనం కావాలని ఏర్పరచుకున్నది కాదు. దానంతటది వచ్చింది. దానంతటది తొలగిపోవాలి. మన జీవితకాలంలో తొలిగిపోతుందో లేదో చూద్దాం.’’ ఇద్దరి మనసులూ భారమవుతూ, తేలిక పడుతూ గంటలు గడిచిపోతున్నాయి.
‘‘ఇంగ్లండ్‌లో మంచి మనిషి తటస్థపడి నీకు ప్రేమ కలిగితే నిరాకరించకు’’ ప్రాధేయపడినట్టు చెప్పాడు.
‘‘అలాగే’’ నవ్వింది శారద.
‘‘నవ్వటం కాదు. నిజంగా అలా చెయ్యాలి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.’’
‘‘నేనూ నిజంగానే అంటున్నాను. ప్రేమ ఎదురైతే నిరాకరించనివ్వదు. నీ ప్రేమ చూడు… నన్ను ఎలా నీ దగ్గరకు తెచ్చిందో’’.
‘‘నా ప్రేమలో విడ్డూరం లేదు శారదా. నాకూ…లోకానికీ కూడా! ఎంతోమంది పురుషులు పెళ్ళాడి, ఆ తర్వాత ప్రేమ దొరికి, ఆ ప్రేమనూ పొంది లోకంలో గౌరవంగా బతుకుతున్నారు. కానీ ఆడవాళ్ళలా కాదు. మన సంబంధాల్ని లోకం గౌరవించదు. నిన్ను చిన్నచూపు చూస్తుంది. అది నేను భరించలేను.’’ ‘‘లోకానికి విలువ ఇచ్చి కాదు మూర్తీ నేనిలా నీకు దూరంగా ఉంటున్నది. మగవాడు ఇద్దరిని ప్రేమించగలిగినపుడు, అది సహజమైనప్పుడు, విడ్డూరం కానప్పుడు స్త్రీ ఒకరికంటే ఎక్కువమందిని ప్రేమించగలదేమో… ప్రేమించగలుగుతుంది. మా విశాల తల్లి కోటేశ్వరి చూడు. ఆమె చాలామందితో జీవితం పంచుకుంది. ఇష్టంగానే పంచుకుంది. ఆ వృత్తిలో ఉన్న స్త్రీలు ఒకరికంటే ఎక్కువ మందిని ప్రేమిస్తున్నారు. మిగిలిన స్త్రీలు రకరకాల విధి నిషేధాలతో మనసు కట్టేసుకుంటున్నారేమో’’.
‘‘మన ప్రేమను అలా పోల్చకు శారదా’’
‘‘పోల్చటం కాదు. స్త్రీ పురుష స్వభావాల్లో తేడాలు రకరకాల కారణాల వల్ల వచ్చాయి తప్ప పుట్టుక వల్ల కాదనిపిసుతంది. ఇంతకూ నాకు ఇంకో ప్రేమ ఎదురైతే ముందు నీకు చెప్తాను. సరేనా?’’ పేలవంగా నవ్వాడు.
‘‘నిన్ను పోగొట్టుకోవాలని లేదు శారదా.’’ ‘‘నేనెక్కడికీ పోను. నిన్ను ఒదిలి నేనూ ఉండలేను. రెండేళ్ళు ఎంతలో గడిచిపోతాయి? దిగులుపడకురా’’ బుజ్జగించింది.
పగలు రాత్రయింది. రాత్రి కరుగుతూ ఉంది. వాళ్ళ మాటల్లో రాజకీయాలు, సాహిత్యం, సంగీతం ఏవేవో మాటలు దొర్లుతూనే ఉన్నాయి. నవ్వులు రాలుతూనే ఉన్నాయి. కన్నీళ్ళు జారుతూనే
ఉన్నాయి. ‘‘అరే… మర్చిపోయాను’’ అంటూ పక్కనున్న సంచీలోంచి ఒక కెమెరా తీశాడు మూర్తి.
‘‘ఈ రోజు నీ ఫోటో ఒకటి తీసుకుని దాచుకోవాలనుకున్నాను’’
శారద నవ్వుతూ చూస్తోంది. మూర్తి ప్రత్యేకమైన దీపాలు వెలిగించి చైతన్యాన్ని, ప్రేమను, స్నేహాన్ని ఒలికిస్తున్న శారద ముఖాన్ని ఫోటోలో భద్రపరిచాడు. ‘‘రోజూ చూస్తావా ఆ ఫోటో’’
‘‘పూజ చేస్తా’’
‘‘కమ్యూనిస్టు పార్టీ నుంచి పంపించేస్తారేమో… పూజలు అవీ చేస్తే’’
‘‘పిచ్చిదానా… దేవుళ్ళని పూజ చేస్తే పంపించేస్తారేమో. మనుషుల్ని, గొప్ప మనుషుల్ని పూజిస్తే ఎందుకు బహిష్కరిస్తారు?’’
‘‘నేనేం గొప్ప మూర్తీ. నాలాంటి వాళ్ళు లోకం నిండా ఉన్నారు.’’
‘‘లేదు శారదా. నీలాంటి వాళ్ళు లేరు. పోనీ కోటికొకరు ఉంటారేమో. నువ్వు స్త్రీనే కాదు, మనిషివి. నీ తెలివి, చురుకు, మానవత్వం, స్నేహ గుణం, కమ్యూనిస్టు మేనిఫెస్టో చదివి అట్లా పులకరించి పోయిన మొదటి తెలుగు యువతివి నువ్వేనేమో. ప్రపంచాన్ని అంతా ఆలింగనం చేసుకోగల ఆధునిక యువతివి నువ్వేనేమో. పోనీ… నాకింకొకరు తెలియదు. సంగీతం, సాహిత్యం, విజ్ఞానం, సాహసం, త్యాగం… శారదా… నువ్వు అపురూపం.’’
శారద మూర్తి నోరు మూసి ‘‘నాకున్న అవకాశాలుంటే లక్షలమంది శారదలు తయారవుతారు. అతి చెయ్యకు’’ అంది చిరుకోపంతో.
‘‘నీకున్న అవకాశాలు లక్షలమందికి లేవు గానీ, కొందరికి ఉన్నాయి. వాళ్ళు హాయిగా భర్తల నీడన బతుకుతున్నారు. నువ్వు స్వేచ్ఛాగామివి. స్వేచ్ఛని ప్రేమించే, స్వేచ్ఛ కోసం తపన పడే నీ స్వభావమే నీ ప్రత్యేకత. దాన్ని దేశం కోసం, ప్రపంచం కోసం ఉపయోగించాలనే బాధ్యతే నీ ప్రత్యేకత’’.
‘‘ఇంక ఆపు. నీకు స్త్రీల గురించి తెలిసిందెంతా? స్వేచ్ఛ కోసం స్త్రీలు చేసే పోరాటాలు నువ్వు ఊహించలేవు. బహుశా ఎవరూ ఊహించలేరు, ఆఖరికి చలం గారు కూడా.’’
‘‘సరే నువ్వు ఏ ప్రత్యేకతా లేని మామూలు స్త్రీవి. ఐనా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. సరేనా’’ కోపంగా అన్నాడు మూర్తి. శారద గలగలా నవ్వింది. మాటలతో, నవ్వులతో కాలం ఆగదు. తెల్లవారింది. మూర్తి శారదను ఇంటివరకూ అనుసరించి వెళ్ళి వీడ్కోలు చెప్పాడు.
శారద వెళ్ళిపోయింది.మూర్తికి అన్ని విధాలుగా కాలం స్తంభించినట్లయింది. పార్టీ పనులు సాగుతున్నాయి. జాతీయోద్యమంలో ఒక రకమైన స్తబ్దత. ఎన్నికల గురించిన చర్చలు. హడావుడి. ప్రపంచ పరిస్థితులే ఉద్రిక్తంగా ఉన్నాయి. జర్మనీలో హిట్లర్‌ చర్యలతో రెండవ ప్రపంచ యుద్ధం తప్పదని రాజనీతిజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యంలో ప్రజల జీవితాలు తలక్రిందులవుతున్నాయి. శారద ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్న ఇంగ్లండ్‌ గురించి మూర్తికి ఉత్తరాలు రాస్తోంది. శారద ఉత్సాహం ఆమె ఉత్తరాల్లో కనబడుతూనే ఉంది. చదువు, పార్టీ పనులు, చిన్న ఉద్యోగాలు, ఇంగ్లండ్‌ కార్మికులతో వారి జీవితాలతో పరిచయం చేసుకోవటం, యూనియన్‌ నాయకులను కలవటం… ఒక్క క్షణం తీరిక లేకుండా బతుకుతోంది శారద. రెండేళ్ళు గడచిపోయాయంటే నమ్మబుద్ధి కావటం లేదు. శారద వచ్చేస్తుందని సూర్యం మనసు గంతులేస్తోంది. సుబ్బమ్మ హడావుడికి అంతులేదు. విశాల ఎమ్మే పాసవగానే ఉద్యోగం దొరికింది. ముత్తులక్ష్మీరెడ్డి సహాయం చేసింది. దుర్గాబాయి మెట్రిక్‌ పాసై బెనారస్‌లో చదువుతానని వెళ్ళింది. శారద వచ్చిన రోజు బంధువులు, స్నేహితులతో ఇల్లు కళకళలాడిపోయింది. మూర్తికి పది నిమిషాలు శారదతో ఏకాంతంగా మాట్లాడటమే కుదరలేదు. శారదకు ప్రయాణిక బడలిక అని చెప్పే వ్యవధానం కూడా ఎవరూ ఇవ్వలేదు. దగ్గర బంధువులు సుబ్బమ్మ దగ్గర శారద పెళ్ళి ప్రస్తావన తెచ్చారు. ఆ కాలంలో అంత వయసున్న స్త్రీ పెళ్ళి కాకుండా ఉండటం సాధారణ విషయం కాదు.
‘ఇపుడు ఇంగ్లండ్‌ వెళ్ళొచ్చిన వాళ్ళను చూడాలి శారదకు. మాటలు కాదు’ అన్నారు కొందరు బంధువులు. ‘ఇప్పుడు పెళ్ళేమిటి? ఎవరు చేసుకుంటారు. ఇక్కడుండగానే చాలా వ్యవహారాలు నడిపిందట. ఇంగ్లండ్‌లో ఏం చేసిందో ఎవరికి తెలుసు’ అని మూతులు విరిచారు దూరపు బంధువులు.
ఇన్ని మాటల మధ్యలోంచి శారదకు బాబాయి వరసయ్యే ఒక కార్యదక్షుడు సంబంధం గురించి మాట్లాడాడు. ‘‘ఇంగ్లండ్‌ వెళ్ళొచ్చిన డాక్టరే ఉన్నాడు. నాకు తెలిసినవాళ్ళే. మన వాళ్ళే. మీరు సరేనంటే అబ్బాయిని తీసుకొస్తాను. ఇక్కడే ప్రాక్టీసు చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ప్రాక్టీసు చేస్తే ఇక చెప్పేదేముంది?’’ అన్న ఆయన మాటలతో అందరూ నిశ్శబ్దమయ్యారు.
సుబ్బమ్మకూ, దగ్గరి బంధువులకూ ఈ మాటలు తోసిపుచ్చేందుకేమీ కనిపించలేదు.
‘‘శారదాంబతో మాట్లాడి వారం రోజుల్లో కబురు చేస్తాను’’ అంది సుబ్బమ్మ.
రెండు మూడు రోజులలో ఇంట్లో హడావుడి తగ్గి తల్లీ కూతుళ్ళు కాస్త తెరిపిన పడ్డారు. సూర్యం, శారద రెండేళ్ళ కబుర్లూ అంతు లేకుండా చెప్పుకుంటున్నారు. అక్కను ఒక్క క్షణం వదలకుండా తిరుగుతూ సూర్యం మళ్ళీ మామూలయ్యాడు.
సుబ్బమ్మకు పది రోజులయినా శారదతో ఈ విషయం మాట్లాడే సమయం దొరకలేదు.
బంధువులంతా ఎటు వాళ్ళటు వెళ్ళాక ఒకరోజు రాత్రి శారద గదిలోకి వచ్చింది సుబ్బమ్మ. శారద చదువుకుంటూ ఉంది. ‘‘ఇంకా ఏం చదువమ్మా. పొద్దుబోయింది’’ అంటూ పక్కమీద కూచుంది.
‘‘నా సంగతి సరేగాని నువ్వెందుకింతసేపు మేలుకున్నావు. ఒంట్లో బాగుందా?’’ అంటూ తల్లి నుదుటి మీద చేయి వేసి చూసింది. ‘‘ఏం లేదు. ఏంటి చెప్పు’’ అంది.
‘‘నీ పెళ్ళి విషయం తల్లీ. చదువు పూర్తయింది. ఇంక జరగవలసింది పెళ్ళే గదా. అది కూడా అయితే నా బాధ్యత తీరుతుంది. మీ రామనాధం బాబాయి చెప్పిన సంబంధం బాగానే ఉంది. ఆ అబ్బాయిని చూస్తావా?’’ శారదకు ఈ విషయం తేల్చెయ్యాలనిపించింది. తేల్చి చెప్పకపోతే తల్లి ఈ విషయం గురించి మధనపడుతూనే ఉంటుంది. అది అనవసరం. కష్టంగా ఉన్నా ఒకసారి సత్యం తెలిస్తే అదే క్రమంగా మనసులో స్థిరపడుతుంది. ఆ తరువాత అశాంతి, అలజడి తగ్గిపోతాయి.
‘‘అమ్మా. నేను చెప్పే విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. నా మీద నీకు నమ్మకం ఉంది కదా.’’ సుబ్బమ్మ నవ్వి ‘‘ఏం అడుగుతున్నావే… చెప్పు’’ అంది.
తను ఎవరినో ప్రేమించినట్టుగా శారద చెబుతుందని ఆమె ఊహించింది. అతను డాక్టర్‌ కాకపోయినా ఫర్వాలేదు. కులమేదైనా ఫర్వాలేదు. శారద ఇష్టపడే మనిషి అంతంత మాత్రంగా ఉండడు. ఒక్క క్షణంలో చాలామంది ఆమె మనసులోకి వచ్చారు. వారంతా తరచూ ఇంటికి వచ్చే యువకులు.
‘‘అమ్మా, నేనసలు పెళ్ళి చేసుకోను’’. శారద గొంతులో గంభీరత్వం వింటే సుబ్బమ్మకు సమస్య పెద్దదనిపించింది. ‘‘అలా ఎందుకు అంటావమ్మా. జీవితంలో అన్నీ చూడాలి. పెళ్ళి, పిల్లలు ఇదంతా లేకుండా ఎందుకు? ఒక్క చదువేనా పరమార్థం. పెళ్ళంటే ఎందుకిష్టంలేదు’’ శారద ఆమెకి డాక్టర్‌గా కాక చిన్నపిల్లలా కనిపించింది.
‘‘ఇష్టం లేకపోవటం కాదమ్మా. నేను పెళ్ళాడదల్చుకున్న మనిషికి ఇదివరకే పెళ్ళయిపోయింది.’’
సుబ్బమ్మ నిర్ఘాంతపోయింది. ఆమెకు వెంటనే మూర్తి గుర్తొచ్చాడు.
‘‘ఎవరూ? మూర్తా?’’
‘‘నీకూ తెలిసే ఉంటుంది. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ పెళ్ళి మాత్రం కుదరదు.’’
సుబ్బమ్మకు గుండె నీరయింది. ఎంతో తెలివైన శారద ఇంత పెద్ద చిక్కులో ఎలా పడిరది? దీనికి పరిష్కారం ఏమిటి?
‘‘జీవితమంతా పెళ్ళి లేకుండా గడుపుతావా? ఎంత కష్టం’’ దుఃఖం తన్నుకొచ్చింది.
‘‘కష్టమేం కాదమ్మా. ఒకళ్ళని ఇష్టపడుతూ ఇంకొకళ్ళని పెళ్ళాడటమే కష్టం.’’
‘‘మూర్తి ఏమంటాడు?’’
‘‘నేనేమంటే అదే అంటాడు. అంతకన్నా ఏమనగలడు’’ నిరుత్సాహంగా నవ్వింది.
సుబ్బమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇది తలకు మించిన సమస్య అనిపించింది. శారద తప్ప దీనినెవరూ పరిష్కరించ లేరనిపించింది.
‘‘అమ్మా! ఇక మాటిమాటికీ పెళ్ళి గురించి అడగొద్దు. నాకు నా పనులు ఊపిరాడకుండా ఉంటాయి. పెళ్ళి, పిల్లలు వీటన్నిటి గురించీ ఆలోచించే తీరిక లేనన్ని పనులు పెట్టుకుంటున్నాను. నేను సంతోషంగానే ఉంటానమ్మా. నా గురించి దిగులు పెట్టుకోకు.’’
సుబ్బమ్మ మెల్లిగా అక్కడినుంచి లేచి ఆమె గదిలోకి వెళ్ళింది.
కూతురు పెళ్ళి లేకుండా ఉంటుందంటే తల్లి మనసు ఒకంతట దాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
సుబ్బమ్మకు అత్త నరసమ్మ గుర్తొచ్చింది.
పదో ఏటనే శారదకు పెళ్ళి చేయమని పంతంపట్టి, ఆ పంతం నెగ్గదని తెలిసి ప్రాణానికి ప్రాణమైన కొడుకుని వదిలి కాశీకి వెళ్ళిన అత్తగారు గుర్తొచ్చింది.
ఆమెతో చెప్పుకుని భారం దించుకోవాలనిపించింది.
‘అత్తయ్యా, మన శారద పెళ్ళి చేసుకోదట. దానికి పెళ్ళి మీద కోర్కె లేక కాదు, దానికి కావలసినవాడిని పొందలేక!’’
నిజానికి సుబ్బమ్మ భరించలేనిది కూడా అదే. కూతురు ఏం కావాలన్నా సమకూర్చటమే ఆమెకు తెలుసు. ప్రతిదీ సాధిస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయే శారదే ఆమెకు తెలుసు. ఎక్కడా ఏ లోటూ ఎరుగని శారదే ఆమెకు తెలుసు. ఏ పనైనా సాధించనిదే నిద్రపోని శారదే తెలుసు.
ఆగిపోయిన శారద, కోరిక తీరదని చిన్నబోయిన శారద, ఓడిపోయిన శారద ఆమెకు తెలియదు.
‘‘పెళ్ళి ఇష్టం లేక కాదు. అది ఇష్టపడినవాడు దానికి దక్కడు’’ ఈ వాస్తవం సుబ్బమ్మకు మింగుడు పడటం లేదు.
భర్తలేని లోటు ఎన్నడూ లేనంతగా మీదకు విరుచుకుపడిరది.
ఎవరితో చెప్పుకోవాలి? కూతురు తనతో చెప్పుకుంది. తను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఆ రాత్రంతా సుబ్బమ్మకు కలత నిద్రయింది. ఏవో కలలు. కలలో అత్తగారు నరసమ్మ కనిపించింది.
ఆమె చిన్ని శారద తల నిమురుతూ, ‘‘పెళ్ళయితే ఏమైందే? నిన్నూ చేసుకుంటాడు. నువ్వంటే ఇష్టమున్న వాడు పెళ్ళెందుకు చేసుకోడు? చేసుకో. పెళ్ళి చేసుకో’’ అంటున్నది.
సుబ్బమ్మకు మెలకువ వచ్చింది. అత్తగారుంటే ఈ పెళ్ళి జరిపించేదేమో, ఆమెకు పెళ్ళయినవాడనే పట్టింపు ఉండేది కాదా?
ఈ ఆలోచనతో సుబ్బమ్మకు కూతురిమీద జాలి పొంగుకొచ్చింది.
‘‘పోనీ… రెండో పెళ్ళివాడని అంటారు. అంటే అంటారు. శారదను అంత దూరం ఇంత స్వేచ్ఛగా ఒదిలినందుకే ఎంతోమంది ఎన్నో అన్నారు. కానీ శారదను రోజూ చూస్తున్న తనకు ఎంత ఆనందంగా ఉంది? పిల్ల హాయిగా గలగలా నవ్వుతూ, ఎప్పుడూ పదిమందిలో మెప్పు పొందుతూ నాయకురాలిగా వెలిగిపోతుంటే గర్వంగా అనిపిస్తుందేగాని లోకుల మాటలు ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పుడు కూడా మూర్తీ, శారదా కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతుంటే, ఇష్టమైనవాడితో శారద సుఖపడితే ఎవరేమనుకుంటే ఏమిటి?
రెండు రోజులపాటు ఆమె మనసులో ఈ ఆలోచనలు కల్లోలం రేపాయి. ఎంత ఆలోచించినా శారద మూర్తిని పెళ్ళాడితే బాగుంటుందనిపించింది. ఒకరోజు కాదు పది రోజులు మధనపడి శారదతో ఆ మాటే చెప్పింది సుబ్బమ్మ.
తల్లి ఆ నిర్ణయానికి ఎలా వచ్చి ఉంటుందో ఒక్క క్షణంలో అర్థమైంది శారదకు. కూతురి సుఖం కోసం తనకు వ్యతిరేకమైన ఆలోచనని అనుకూలం చేసుకోటానికి తల్లి తనలో తను ఎంత సంఘర్షణ పడి ఉంటుందో అర్థమై శారద తల్లిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఉధృతం తగ్గాక ‘‘అమ్మా! దీని గురించి ఆలోచించటం మానెయ్యి. నా మీద నమ్మకం ఉంచు’’ అని అక్కడినుంచి వెళ్ళిపోయింది.
తల్లిని పట్టించుకోవద్దన్నది గానీ మద్రాసు పట్టణంలో తన స్నేహితులు, తోటి కామ్రేడ్స్‌ ఇదే ఆలోచిస్తున్నారని శారదకు క్రమంగా తెలిసి వచ్చింది.
సూర్యానికి ఈ విషయం చెప్పాల్సిన సమయం వచ్చిందనిపించింది. ఎవరి ద్వారానో తన గురించి వింటే సూర్యం బాధపడతాడు. ఒకరోజు రాత్రి సూర్యాన్ని దగ్గర కూచోబెట్టుకుని స్నేహితురాలిలా తన మనసు విప్పి చెప్పింది శారద. సూర్యం అంతా విని అక్కను ఓదార్చాడు. అక్క ఏ నిర్ణయం తీసుకున్నా తను అండగా ఉంటానని మాట ఇచ్చాడు. అక్కకు అండగా ఉండాలనే ఆలోచనతో సూర్యానికి చిన్నతనం నుంచీ ఉన్న నిరాశ ఎటో వెళ్ళిపోయింది. ఆ యువకుని జీవితానికి ఒక గమ్యం ఏర్పడినట్లయింది. అక్క అపురూపమైన మనిషి. ఆ మనిషికి తను అండ అనుకుంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.