ఓ గెలుపు జ్ఞాపకం – గంగాడి సుధీర్‌

ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ సమస్య పరిష్కారం అవకపోతుందా అనే చిన్న ఆశ మాత్రం మనసును వదలడం లేదు. ఎంత ఆలోచించినా చేసేదేమీ లేదు కనుక ఒంటరిగానే క్యాంటీన్‌ ఆవల చెట్టుకిందనున్న బండరాయిపై కూర్చున్నాను. అసలు

సమస్యేమిటంటే… ఆ రోజే కాలేజీ ఎగ్జామ్‌ ఫీజు కట్టడానికి చివరి రోజు. నాన్న పంపిస్తానన్న డబ్బులు అందకపోవటం వల్ల ఫీజు ఎలా కట్టాలన్న ఆలోచనే వేధిస్తోంది. అంతకు ముందు పనిచేసిన వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగి చూశాను. అయినా లాభం లేదు. తెలిసిన వాళ్ళను అడగడానికి మొహమాటం అడ్డొచ్చి అడగలేకపోయాను. కానీ ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనివ్వరు. డిగ్రీ ఒక సంవత్సరం నష్టమవుతుంది. మళ్ళీ సెకండియర్లోనే
ఉండాల్సి వస్తుంది. ఆలోచనలు ఇలా ఒకదాని వెనుక ఒకటి సుడులు తిరుగుతున్నాయి. నేను కన్న కలలు, ఆశయాలు తనమీద అమ్మా నాన్నలు పెట్టుకున్న ఆశలు ఒకటేమిటి ఒక్కొక్కటిగా మసక మసకగా అన్నీ మస్తిష్కంలో సుడులు రేపుతున్నాయి.
ఎంత చిన్నదీ సమస్య. ఎదుటి వారికి చెప్తే నవ్వొచ్చు, కానీ నా మటుకది పెద్ద సమస్యే. ‘‘ఏరా సుధాకర్‌ అలా పరధ్యానంగా ఉన్నావేంట్రా! ఏదైనా ప్రాబ్లమా’’ అంటూ క్యాంటీన్‌లోకి వెళ్తున్న రంజిత్‌ నన్ను చూసి అడిగాడు. ఏం చెప్పను. వాడికి నిర్వికారమైన నవ్వునొకదానిని మాత్రం విసిరాను. ఏమనుకున్నాడో ఏమో… మారు మాట్లాడకుండా క్యాంటీన్‌లోకి వెళ్ళాడు రంజిత్‌. వాడి వెనకాలే వచ్చాడు రాజు. గత సంవత్సర కాలంగా రాజు నా రూమ్మేట్‌. మా పక్క ఊరే అతనిది. వాళ్ళ నాన్న రమ్మని లెటర్‌ రాస్తే ఇంటికెళ్ళాడు కానీ ఎప్పుడొచ్చాడో కాలేజీకి. నన్ను చూస్తూనే ‘‘ఏరా! ఈ రోజు కాలేజ్‌ బాయ్‌ కాట్‌ అంట కదా. రూమ్‌కీ రాలేదు’’ అన్నాడు. వాడ్ని చూడగానే ఏదో ఆశ చటుక్కున అడిగేశాను ‘‘ఏరా డబ్బులున్నాయా’’ అని. ఏమనుకుంటాడో అన్న ఆలోచనే రాదు. ఎందుకంటే చిన్నప్పటినుంచి అరమరికలు లేని స్నేహం మాది.
వెంటనే ‘‘ఎందుకురా’’ అని అడిగాడు.
‘‘ఈ రోజు పరీక్ష ఫీజు కట్టడానికి చివరి రోజు’’ అని చెప్పేశాను.
‘‘అదేంటి వారం రోజులయిందిగా పరీక్ష ఫీజు కట్టడానికి డేటిచ్చి, ఇంకా కట్టలేదా’’ అన్నాడు వాడు.
ఏమని చెప్పాలి? నాన్న డబ్బులు పంపలేదని చెప్పాలా, అయినా వాడికి అన్నీ తెలిసుంటాయి కదా అనుకొని ‘డబ్బుల్లేవు’ అని మాత్రం అనేశాను. ‘సరే ఎంత’ అని అడిగాడు వాడు. ‘300 లు’ అని ముక్తసరిగా చెప్పాను. ‘సరే నాకు మళ్ళీ 4, 5 రోజుల్లో ఇవ్వు’ అని డబ్బులు తీసిచ్చాడు. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కల్గింది, కానీ దాని వెనుకే ఏదో నిరాశ… బహుశా అది నా మీద నాకే జాలి కావచ్చు. నిరాసక్తత నా చేతకాని తనానికి పేదరికం అని పేరు పెట్టినందుకు కావచ్చు, లేకపోతే పరిస్థితులకు లొంగక తప్పదనే నిజం తెలిసినందుకు కావచ్చు. దేనికైతేనేం ఈ ఆలోచన ఇప్పటిదా… ఎప్పటిదో… ఇప్పుడు తేలేది కూడా కాదు అనుకుంటూ ఆలోచనని కట్టేసి లేచాం ఇద్దరం. ఎగ్జామ్‌ ఫీ అప్లికేషన్‌ను ఫోటోలతో సహా నింపి పెట్టాను. డైరెక్టుగా ఎగ్జామ్‌ ఫీ డైరెక్టర్‌ దగ్గర క్యూలో నిలబడ్డాను. రాజు గోడపై కూర్చున్నాడు. పాపం నాలాగా చదువు బండిని లాగిస్తున్న ఎంతోమంది కూడా ఈ రోజే ఫీజు కడుతుండడంతో లైను పెద్దగానే ఉంది. ఎలాగోలా మధ్యాహ్నం రెండున్నర లోపు ఫీజు కట్టేసి బయటపడ్డాం. రోడ్డెమ్మట నడుస్తూ ఇంటి దగ్గర పరిస్థితుల గురించి ఒక్కొక్కటి అడుగుతున్నాను రాజును. ఏం చెప్తాడు ముందు తెలిసినవేగా… ఏ దేశ చరిత్ర చూసినా అన్న శ్రీ శ్రీ కవిత గుర్తొచ్చింది. మధ్య తరగతి వాడి ప్రతి నిమిషానికి అన్వయించుకోవచ్చు దాన్ని. రూం దగ్గరికొస్తుందనగా రాజుతో చెప్పా చెల్లాయికి పెళ్ళి కుదిరిందని, కానీ కట్నం కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారని. మంచి సంబంధం… మళ్ళీ ఆలోచనలో పడ్డా. ఎంత అప్పయినా ఈ సంబంధం కుదుర్చుకోవాల్సిందే. అప్పు ఉన్నదేగా… రేపైనా చెల్లెలు సుఖంగా ఉంటుందిగా అన్న ఆశ. దానికి మరికొంత చేరుద్దాంతో తెగించమంటోంది. కానీ ఈ కరువు పరిస్థితుల్లో అప్పు పుట్టడం కష్టమే అయినా తప్పదు కదా బ్రతుకు బండిని ఒడ్డుకి… ఈదడానికి భారమైనా మౌనంగానే మోయాలి, లేదంటే మధ్య తరగతి చిత్రం అసంపూర్ణంగానే ఆగిపోతుంది.
రూంలోకి వచ్చాం వాడు మామూలైపోయాడు. పొద్దున్న ఎప్పుడు తిన్నాడో కడుపులో కలకలం రేగుతోందేమో అన్నం వండడానికి సిద్ధమౌతున్నాడు, కానీ నన్ను మాత్రం ఎడతెగని ఆలోచనలు వదలడం లేదు. ఒకప్పుడు మామూలుగానే, అంటే మధ్యతరగతి కంటే కొంచెం ఎత్తులో ఉన్నవాళ్ళమేనట, కానీ తాతలు తవ్విన బావులు లేవు, ఇత్తడితో చేసిన మోటలు లేవు. కాలం కక్ష కట్టిందేమో, సాగు నీరేమో కానీ తాగునీరే లేదు. పంచెకట్టే రోజులు పోయి పాత లుంగీలతో కాలం ఎల్లదీస్తుర్రు. పటేల్లని పిలిపించుకున్నోల్లే పాలేర్లవటానికి మనసొప్పటంలేదు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుంది ఈ పల్లెటూర్ల బ్రతుకు. అధికారం పోయినా, ఆ దర్పం పోయినా, పెద్దరికంను చంపబుద్దైతలేదు. పండిరది, పండనిది, తిన్నది, తిననిది పైనోనికెరుక కాని బిడ్ల పెళ్ళిళ్ళు మాత్రం ఘనంగా చెయ్యాలె, లేదంటే లోకులు కాకులిచ్చి పొడిసినట్టు పొడిచేసిపోతారు. ఐనా బరిద్దామన్నా తక్కువ కట్నాలకు లగ్గం చేసుకొనేటోల్లెవ్వరు.
తినడానికి తిండి లేకున్నా కట్నం తక్కువ తీసుకుంటే ఊరోళ్ళందరికి చిన్న చూపే. అందుకే అన్నిటి రేట్లు పెరిగినట్టు వరుళ్ళ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అందుకే కృతనిశ్చయానికొచ్చి తిండి లేకున్నా ఎలాగోలా బ్రతుకుదాం కానీ కట్నం మాత్రం తీసుకోవద్దు, వాళ్ళు కూడా మాలాటి బక్కొళ్ళే కదా అని. ఇంతలో ‘‘ఒరే సుధాకర్‌… ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావ్‌, అయినా ఈ మధ్య నీలో ఏదో తేడా కన్పిస్తోంది. ఇంటికెళ్ళక ముందు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏమైందిరా… కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా, ఏంటి?’’ అన్నాడు వాడు. నవ్వొచ్చింది. పీకల్లోతు బాధల్లో ఇరుక్కొని గత జ్ఞాపకాలు ముళ్ళో…పూలో… అర్థం కాక నేనుంటే ప్రేమేంట్రా… అసలు అమ్మాయిలతో పరిచయాలే పెద్దగా లేవు అనుకొంటూ ‘‘ఏం లేదురా’’ అని కూరగాయలు కోయడానికి లేచాను. కాలేజీ నడుస్తుంది, జీవితం కూడా ప్రయాణిస్తుంది. ఎక్కడ ఎదుగు బొదుగులున్నాయో తెలియకుండా ఇన్ని రోజుల్లో నాలో నిశ్శబ్ద తుఫానులెన్నో రేగాయి. ప్రశాంత తీరాలు ముంగిట వాలాయి అన్ని ఆర్థిక సమస్యలపైనే, ఎందుకింత ఆలోచన. ఇంకా జీవిత భారం నాపై పడనేలేదు. ఇప్పుడే ఇన్ని ఆలోచనలా…?
ఆ రోజు కాలేజికెళ్తుంటే ప్రాక్టీస్‌ టైమ్‌ టేబుల్‌ వేశారని శీను వచ్చి చెప్పాడు. వెళ్ళి నోటీసు బోర్డు దగ్గర నిలబడి ప్రాక్టీస్‌ టైమ్స్‌ నోట్‌ చేసుకుంటున్నాను. ఎప్పుడొచ్చిందో పక్కనే నిల్చుని రాసుకుంటూ ‘‘కెమిస్ట్రీ టైం సరిగ్గా కనబడడం లేదు, ఎప్పుడో చెప్పవా’’ అని అడిగింది అనుపమ. ఆమె నా క్లాస్‌మేట్‌. నాకు తెలిసిన ఒకరిద్దరు అమ్మాయిల్లో మాట్లాడగలిగే చనువున్నావిడ ఈమె ఒక్కతే. ‘‘మంగళ, గురు, శని వారాల్లో సాయంత్రం 4:30కి’’ అని చెప్పాను. థాంక్స్‌ చెప్తూ ‘‘ఈ రోజు నుంచి నాలుగు రోజులు క్లాస్‌కి రావట్లేదు. నోట్స్‌ జాగ్రత్తగా రాయవా నాకు అవసరం ఉంటాయని’’ చెప్పి ఇంకొక మాటకు తావియ్యకుండా వెళ్ళిపోయింది.
వెళ్ళి క్లాసులో కూర్చున్నాను. ఒకదాని వెనుకొకటి మూడు క్లాసులు పోయాయి. తర్వాత కాలేజి అయిపోయింది. ఇంతవరకు నాకు తెలిసి అన్ని క్లాసులు జరిగిన రోజు కాలేజి చరిత్రలోనే లేదనుకుంటా. ఎందుకంటే గవర్నమెంట్‌ కాలేజి కదా, చెప్పినా చెప్పకున్నా అడిగే నాథుడే ఉండడు. రూంకెళ్ళాను. మళ్ళీ ఏముంది, చదవడం, వండుకోవడం, ఆరున్నరకి ట్యూషన్‌ చెప్పడం, అక్కడ్నుంచి వచ్చి పడుకోవడం… రోజూ ఉండేవేగా. కానీ ఎందుకో ఈ రోజు ట్యూషన్‌కి వెళ్ళాలనిపించట్లేదు, కానీ తప్పదుగా డబ్బులిచ్చే వాళ్ళు కదా కారణాలు చెప్పాల్సి ఉంటుంది. పిల్లలు ఇద్దరే కానీ 20 మందికి చెప్పాల్సినంత చెప్పాలి, ఐనా రోజూ సాయంత్రం ఇదో వ్యసనమైపోయింది. ఒంటరిని కాకుండా వాళ్ళతో పాఠాల్ని పంచుకుంటున్నాను, ఆ రోజుల్లో జీవిత పాఠాలు నేర్పలేను కదా.
పోస్టుమేన్‌ వచ్చి లెటరిచ్చి వెళ్ళాడు నాకు. ఇంటి దగ్గర నుండి నాన్న రాశాడు, ఇంటి దగ్గర క్షేమమని రాశాడు. ఏం క్షేమం మొత్తం ఊరంతా క్షామం పరచుకుంటే ఏదో రాసే అలవాటు కదా అలాగే రాశాడు. మాఘమాసానికి రమ్మని చెప్పి, అమ్మ, చెల్లాయి చూడాలనుకుంటున్నారట, చెల్లాయి ఒకటో గోల చేస్తోందని రాశాడు. చెల్లాయిది గోల చేసే వయస్సు కాదు, నాకంటే మూడేళ్ళు చిన్నది. కానీ నాకది ఎప్పటికీ చిన్నదే. ఒరే అన్నయ్యా ఏనుగును ఎప్పుడు తెస్తావ్‌, చందమామ దగ్గరికి తీసుకెళ్తావా లేదా అని గోరుముద్దలు తినే పసిపాపే. ఎదురెదురుగా ఉన్నంతసేపు తిట్టుకోవడం, కొట్టుకోవడం, దూరమైనాక బాధపడడం. ఇది మానవ నైజం కావచ్చు. పుట్టుకతో వచ్చిన ధర్మం అది.
ఒక్కసారిగా తెరలు తెరలుగా జ్ఞాపకాల మంచు తెరలు పరచిన దుప్పటి కింద వెచ్చని వేకువ రaామును గుర్తు చేస్తున్నట్లు అలుముకుంటున్నాయి జ్ఞాపకాలు. మా ఊరు అవునూరని చిన్న గ్రామం. నడుమనే గుడి, దానికావల కోనేరు, ఇంకొంచెం దూరమెళ్తే చెరువు కట్ట, దాన్ని ఆనుకునే రాములవారి గుట్ట. గుట్టపైన కూర్చుంటే ఒకవైపు పచ్చని పంట పొలాలు, ఇంకోవైపు తామర మొగ్గలతో నిండిన వంతెన. కట్టమీద కూర్చొని గాలాలు వేసి పట్టిన చేపలను కాల్చుకుని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న
ఉప్పు, కారంను జేబులోంచి నంజుకుని, ఎవరైనా చూస్తారేమోనని భయం భయంగా తింటుంటే ఉండే మజానే వేరు. అయితే చెరువు దగ్గరకు వెళ్ళొద్దని నాన్న గట్టిగా వార్నింగ్‌ ఇవ్వడంతో ఎవరైనా చూసి నాన్నకు చెప్తారనే భయం కూడా చిన్నది కాదు. ఓసారి చూడనే చూసిండు, చూసిన వాడు ఊరుకోవచ్చుగా, తిన్నగా వెళ్ళి మా నాన్నకు చెప్పాడు. వాడెవ్వడో కాదు మా పాలేరే. చాలా మంచోడే, నాన్నంటే గౌరవం వానికి. అందుకే చెప్పాడు. కానీ ఆ రోజు సంగ్రామం నుంచి అమ్మా, చెల్లి ఇద్దరూ నన్ను కాపాడారు.
ఒక రోజేంటి, ప్రతి రోజు అందమైనదే. నరిగాని హోటల్‌, రామయ్య సార్‌ దుకాణం, రాములోరి గుడి, ఒక్కొక్కటి ఒక అద్భుతమైన ప్రదేశం… ఇలా చెప్పుకుపోతే ఒకటేంటి అన్నీ ఆనంద తీరాలే… ఒంటరి తనంలో తోడుండే నేస్తాలే, ఏకాంతంలో స్ఫూర్తినింపే అనురాగాలే ఈ జ్ఞాపకాలు. ఏం! కాదంటారా? మా ఊరి చెరువు కట్టపై కూర్చుని రాసిన కవిత్వాలెన్నో… అందులో కొన్ని పేపర్లలో అడపాదడపా కనిపించాయి కూడా. ‘‘ఒరేయ్‌’’ అని రాజు పిలిచిన పిలుపుతో ఈ లోకంలోకొచ్చాను. లెటర్‌ వాడి చేతుల్లోకి వెళ్ళింది. అంతా చదివినట్లున్నాడు వెధవ. ‘‘నాన్న రమ్మన్నాడు కదరా వెళ్ళవా’’ అన్నాడు. ‘‘ఇంకా మాఘమాసానికి పది రోజులుందిగా వెళ్దాంలే’’ అంటూ లేచి ముఖం కడుక్కుని ట్యూషన్‌కి వెళ్దామని బయలుదేరాను. మాఘమాసానికి ఇంటికి వెళ్ళి, ఇంటినుంచి తిరిగి వచ్చాను. అయినా అవే జ్ఞాపకాలు. అమ్మ, చెల్లి, నాన్న, ముఖ్యంగా ఫ్రెండ్స్‌ మాఘమాసం నాడు జాతరయిపోయాక బలవంతంగా అందరూ కలిసి తాగించిన బీరు, ఒక్కొక్కళ్ళూ వాళ్ళ జీవిత కథలు చెప్పినట్టుగా చెప్పారు.
గిరిగాడైతే చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వాడికి మా ఊళ్ళో కౌసల్య అంటే చాలా ఇష్టం. కానీ ఉగాది లగ్గాళ్ళల్ల ఆమె పెళ్ళి నిశ్చయమైంది. అందుకే వాడికి బాధ. ఏం చేస్తాం, మరీ సినిమాలలో హీరోలం కాదు కదా, ఎదురించి లేచిపోవడానికి. గొర్లను కాస్తూ తియ్యని కళగా నెమరేయాలి కానీ పచ్చిక ఉందని అడవిలో ఉండలేం కదా… చేసేది కూడా అంతే.
మళ్ళీ జ్ఞాపకాలే ముసురుకుంటున్నాయి. వాటిలోంచి బయటపడడం కష్టమే. ఏకాంతంలోకి వస్తున్నాయో, లేక ఒంటరితనాన్ని చూపిస్తున్నాయో నాకైతే అర్థమవ్వడం లేదు. కాలేజీకి వెళ్దామని రాజుగాడు అనడంతో పుస్తకాలు పట్టుకుని బయల్దేరాం. ప్రాక్టికల్స్‌ అయిపోయాయి, ఎగ్జామ్స్‌ డేట్స్‌ కూడా చెప్పేశారు.
అనుపమకు కెమిస్ట్రీలో కొన్ని అర్థమవ్వలేదని అందుకే రికార్డ్స్‌ రాయలేదని చెప్పింది. రికార్డ్స్‌ రాయకపోతే ఎగ్జామ్స్‌ రాయనివ్వరు. అందుకే నేను వెళ్ళగానే నా కోసం చూస్తోందేమో, నా దగ్గరికొచ్చింది. ‘ఏంటి?’ అని అడిగాను. అలాగే నడుచుకుంటూ వెళ్ళి చెట్టు కింద నిలబడ్డాము. ‘‘రికార్డ్స్‌ రాయాలి, రోజూ సాయంత్రం మా ఇంటికి రావా’’ అని అడిగింది. ‘‘సరే, ట్యూషన్‌ అయిపోయాక వస్తాను’’ అని చెప్పాను. తర్వాత వెళ్ళి క్లాసులో కూర్చున్నాము.
మర్నాడు నుంచి రెండు రోజులుగా వాళ్ళింటికి వెళ్తున్నాను. వాళ్ళ అమ్మ, నాన్న బాగా పరిచయమయ్యారు. కానీ అనుపమ పక్కనుంటే ఏదో ఫీలింగ్‌ కలుగుతుంది, భయమేస్తుంది ఇది ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని. ఇంతవరకు బయట స్త్రీలతో అంత చనువుగా ఉండకపోవడం వల్ల కలిగిన ఫీలింగ్‌ కావచ్చు, అలాగే అనిపించినా ఈ రోజు మాత్రం వెళ్ళాలంటే భయంగానే ఉంది. కానీ వెళ్ళకుంటే ఏమన్నా అనుకుంటుందేమో అనిపించి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.
రోజులాగే వాళ్ళింటికి వెళ్ళాను కానీ, ఇదివరకటిలా ఉండలేకపోయాను. ఆమె మాత్రం మామూలుగానే ఉంటుంది. అప్పుడే తలార స్నానం చేసిందేమో, చల్లని పిల్లగాలికి వెంట్రుకలు ముందుకు జారి నా మోముపై నాట్యం చేస్తుంటే నా మనసు ఆనందంగా విచ్చుకుంటున్న మయూరమే అయింది. ఆ స్పర్శ రోజూ ఉండేదే అయినా ఈ రోజెందుకో కొత్తగా అనిపిస్తోంది. ఎంతగా తప్పుకుందామన్నా నా మనసు నా మాట వినడం లేదు.
ఇదేంటి 19 ఏళ్ళలో నాకు తెలియని మనిషి నాలో దాగున్నాడా ఇన్ని రోజులు. ఏమయినా వశం తప్పనీయకుండా ఉండాలని వేరే బుక్‌ తీస్తున్న నెపంతో దూరంగా జరిగాను. తనకి అర్థమై ఉంటుందని అనుకున్నాను, కానీ ఆమె గమనించలేదు. కాసేపటికే ‘‘ఏంటి అలా ఉన్నావు, జ్వరం వచ్చిందా…’’ అంటూ ఆప్యాయంగా మెడకింద చెయ్యిపెట్టి చూసింది. ‘‘అరె కాలుతుందేంటి’’ అంటూ లోపలికి వెళ్ళి పాలు, పండ్లు తెచ్చింది. అదేంటి, నాకు జ్వరమేంటి, ఏమో నిజంగానే వచ్చిందేమో. అలాగే నాలుగు రోజులు గడిచాయి. మరో పది రోజుల తర్వాత తను కూడా అదోలాగా మాట్లాడుతోంది.
నాకు మాత్రం ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ట్యూషన్‌కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు, సరిగ్గా తినడం లేదు. కాలేజికి మాత్రం రోజూ అరగంట ముందుగానే వెళ్తున్నాను. రాజు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు కానీ, వాడికి నేనంతకు ముందు పడే బాధకన్నా ఇప్పుడున్న సంతోషానికి సంబరపడుతున్నాడు కావచ్చు. ఒకరోజు మాటల్లో పడి మొత్తం చెప్పేశాను. దానికి వాడు మెల్లిగా వచ్చి పక్కన కూర్చొని, ‘‘దీనికి బాధపడతావేంట్రా. నువ్వు అనుపమని ప్రేమిస్తున్నావు. దానికి భయమెందుకు, ధైర్యంగా చెప్పేసెయ్‌’’ అన్నాడు. ‘‘మన పరిస్థితి తెలుసు కదరా… ప్రేమలు మనకు సరిపడేవి కాదురా. ఒకప్పుడు ప్రేమలో పడ్డవాళ్ళని చూసి పిచ్చివాళ్ళనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నిజం తెలుస్తోంది వాళ్ళ ప్రపంచంలో వాళ్ళెంత రారాజులో. ప్రేమను గెల్చుకున్నవాడు నిజంగా రాజేరా, కానీ, మనం రాజులం కాలేం కదా. రాజీ పడడం తప్ప, జీవితం మనకు నేర్పేదేముండదు. అయినా ఈ ఊరి కొనగుట్టకి, మా ఊరిలోని రాములోరి గుట్టకి ఎంత అనుబంధం ఉందిరా కానీ, ఏనాడైనా కలవడానికి చూశాయా. లేదు, ఎందుకంటే వాటి దూరం వాటికెరుకే గనుక, నేను కూడా అంతే. తను ఒక అందమైన అమ్మాయి. తనతో గడిపిన ప్రతి క్షణం ఈ రోజుకు ఒక అందమైన అనుబంధం, రేపటికి ఒక తీయని జ్ఞాపకం అంతే’’ అని చెప్పి అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాను.
ఈ మధ్య కవితలు రాయడం మరీ ఎక్కువైంది. అంతేకాక కథలు కూడా రాస్తున్నాను. ప్రేమ ఇచ్చే స్ఫూర్తి ఏంటో ఇప్పుడిప్పుడే అనుభవానికి వస్తోంది. ఎగ్జామ్స్‌ దగ్గర పడుతున్నాయి. మిగతా స్నేహితులందరికన్నా అనుపమనే ఎక్కువగా కలుస్తున్నాను. ఫ్రెండ్సంతా చెవులు కొరుక్కొంటున్నట్లు తెలుస్తోంది. అనుకోని ఎవరేమనుకుంటే మాకేంటి, మేమేం తప్పు చేయనప్పుడు భయపడడం దేనికి. ఎగ్జామ్స్‌మ్స్‌కి కలిసే చదువుతున్నాం, కానీ ఇంతకుముందున్న భయం తగ్గింది. చనువు బాగా పెరిగింది. కొట్టుకుంటున్నాం కూడా. వాళ్ళమ్మ, నాన్న వచ్చినప్పుడు బుద్ధిగా గప్‌చుప్‌గా చదువుకుంటున్నాం.
మునుపున్న భయం చాలా వరకు తగ్గింది. పైగా తను చెప్పిన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తనకు క్యాంపస్‌లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలనేదే ఆశయం అట. ఒకటేమిటి తనకు నచ్చేవి, నచ్చనివి, నాలో తనకు నచ్చేవి, నచ్చనివి అన్నింటినీ చెప్పేస్తుంది, అరమరకలు లేకుండా. ఆ రోజే ఎగ్జామ్స్‌ మొదలయ్యాయి. మొదట ఇంగ్లీష్‌ పేపర్‌ రాశాను. ఎలాగైనా ఈ రోజు తనకు నా ప్రేమ విషయం చెప్పేద్దామనుకున్నాను. కానీ, ఒకవేళ తనకు నచ్చకపోతేనో, అపార్థం చేసుకుంటేనో… అందమైన స్నేహం పోతుంది, ఎగ్జామ్స్‌ కూడా సరిగ్గా రాయలేము. ముఖ్యంగా నేను మాత్రం అస్సలు తట్టుకోలేను. అందుకే చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఎగ్జామ్స్‌ అయిపోయాయి. అందరం బాగానే రాశాము. వేసవి సెలవులకు ఫ్రెండ్సంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు కూడా నిన్ననే వెళ్ళిపోయాడు. నేను ఇంటికెళ్తే తనని చూడలేనేమోనని వాయిదా వేసుకుంటూ వస్తున్నాను.
నిజంగా ఎంత మార్పు. అనుని ప్రేమించకముందు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా, ఎప్పుడు ఊరెళ్ళాలా, అమ్మని, చెల్లిని, మా ఊరి సెలయేటిని, రాముని గుట్టని, నరిగాన్ని ఎప్పుడు చూడాలా అంటూ తొందరపెట్టే మనసు ఇప్పుడేంటి ఇలా తయారైంది. తర్కించిన కొద్దీ వాళ్ళందరి ప్రేమను నేను పొందాను, ఇప్పుడు అనుపమ ప్రేమను పొందాలి కాబట్టి ఇలా ఉండాలని అనిపిస్తోంది అనిపించింది కూడా. కానీ ఇదోరకంగా నాకు నేను చెప్పుకునే ఓదార్పనిపించింది. ఏదైతేనేం సాయంత్రం అను వాళ్ళింటికెళ్ళాను, రేపు ఊరెళ్తున్నానని చెప్పాను. ఏం మాట్లాడలేదు. కాసేపు ఇద్దరం మౌనంగానే ఉన్నాం. నేను వెళ్తున్నానని చెప్పాను. లోపలికి రా అని పిలిచి మేడమీదికి తీసుకెళ్ళింది. చాలాసేపు వసంత సంధ్యను చూస్తూనే కూర్చున్నాం. ఎప్పుడూ గోదారిలా గలగలా మాట్లాడే తనేంటి గంభీర ముద్రను దాల్చింది. ఏదో అనుమానం, మనస్సు వశం తప్పుతున్నట్టు అనిపించింది. ప్రేమిస్తున్నానని చెప్పేద్దామనుకున్నాను కానీ ఆమె ముఖంలో ఏ భావం కనిపించడం లేదు. నిగ్రహించుకుని లేచి నిలబడ్డాను వెళ్తున్నానన్నట్లుగా. తను కూడా లేచింది. ఇద్దరం కలిసి కిందికి దిగాం. మళ్ళీ ఒకసారి చెప్పాను, రేపే ఇంటికి వెళ్తున్నానని. మౌనంగానే అంది సరేనంటూ.
రూంకెళ్ళి పడుకున్నానన్న మాటే కానీ నిద్రపట్టడం లేదు. ఏవో ఆలోచనలు, మళ్ళీ సంద్రంలోని సుడుల్లా పాత కాలంలోకి నెట్టేసినట్టు భయం వేసింది. ఆ భయంలోనే మగత నిద్రలోకి జారుకున్నాను. ఎప్పుడు తెల్లారిందో ఏమో కిటికీలోంచి వస్తున్న ఎండ తగిలి కళ్ళు విచ్చుకున్నాయి. లేచాను, స్నానం చేస్తున్నాను కానీ ఆ స్పృహే లేదు. తొమ్మిదింటికి బట్టలు సర్దుకుంటుండగా వచ్చింది అను. నిజంగా అద్భుతం! ఏంటీ తను ఇప్పుడు నా రూంకి రావడం. ఆశ్చర్యంలోంచి తేరుకుంటూనే లోపలికి రమ్మన్నాను. ‘రెడీ అయినట్టున్నావు కదా… వెళ్తూ మాట్లాడుకుందాం రా’ అంది. రూంకి తాళం వేసి బయటపడ్డాం. మళ్ళీ ఎప్పుడొస్తావ్‌ అంది అదో రకంగా. జూన్‌లో అన్నాను. అంతే మళ్ళీ మాటల్లేవ్‌. ఒకప్పుడు కొట్టింది, తిట్టింది, పర్సు దాచిపెట్టి ఏడిపించింది తనేనా? ఏంటీ మా ఇద్దరి మధ్య ఈ నైరాశ్యం… నా మట్టుకి ఏదేదో మాట్లాడాలనిపించింది, ఏదో చెప్తున్నాననిపించింది, కానీ ఏమీ లేదు. మళ్ళీ నిశ్శబ్దమే.
ఎప్పుడైనా ఇంటికెళ్తుంటే బస్సు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాడిని. పావుగంట ముందు వస్తే దాని సొమ్మేం పోయిందని తిట్టుకుంటూ ఎక్కేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం బస్సు రావాలనీ లేదు, వద్దనీ లేదు. ఏదో నాకే అర్థం కాని నా తత్వం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. బస్సు దగ్గరకు రాగానే చేతిలో గిఫ్ట్‌ ప్యాకెట్‌ పెట్టి ‘తొందరగా రావా’ అని చెప్పి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ వెళ్ళిపోయింది. అదేంటి కళ్ళల్లో నీళ్ళు అని ఆశ్చర్యపోయేలోగా బస్సు హారన్‌ వినిపించింది. బస్సు దగ్గరగా రానే వచ్చింది. తను చాలా దూరం వెళ్ళింది. అంత స్పీడేమిటో అనుకుని బస్సు ఎక్కాను. బస్సు కొంచెం లేటైతే ఆమె వెనుకే పరిగెత్తేవాడినేమో. అంత బాధ ధ్వనిస్తోంది హృదయంలో. బస్సు వేగం పుంజుకుంది, కానీ అంతకన్నా వేగంగా నా ఆలోచనలు పరిగెత్తుతున్నాయి.
బస్సు కుదుపులకు ఈ లోకంలోకి వచ్చిన నాకు చేతిలో ప్యాకెట్‌ కనిపించింది. నెమ్మదిగా విప్పి చూశాను. ఒక వాచీ, ఒక పెన్ను. పేపరుపై నన్ను మరువవుగా అని రాసి ఉంది. నా నుంచి వెళ్ళకూడదనుకుందో ఏమో వాచీలా పట్టుకుంది మళ్ళీ. మధురమైన ఊహ! కవిత రాద్దామని పేపరును తీసి రాశా. అందమైన నా మనస్సులోని భావాలకి సిరాక్షరాలై తను బయటికొస్తోంది. ఇంటి దగ్గరున్నానన్న ధ్యాసే కానీ మనస్సు మాత్రం అను దగ్గరే ఉంది. రెండు, మూడు రోజులుగా అమ్మ, చెల్లి గమనిస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు గమనిస్తున్నారన్న ధ్యాసే లేదు. ఒక రోజు అమ్మ అననే అంది ఏమైంద్రా, ఒంట్లో బాగాలేదా అని. అదేం లేదమ్మా అని చెప్పాను. చెల్లి మెల్లిగా వచ్చి మెడకింద చెయ్యిపెట్టి చూసింది. అదే స్పర్శ, అదే ప్రేమ. ఎవరైతేనేం… చెల్లెలైతేనేం, ప్రేయసి అయితేనేం… ప్రేమ…అవును మరి ప్రేమ చాలా గొప్పది. మనల్ని బతికించేది అదే, శాసించేదీ అదే.
అమ్మ మళ్ళీ అంది ‘‘రేపటి నుంచి వరి కోత మొదలెడుతున్నాము. నువ్వు వస్తావా’’ అని. ఇదివరకటి రోజుల్లోనైతే తప్పకుండా రమ్మనేవారు, ఇప్పుడంత పని లేదు. ఏదో ఇద్దరు వంగి చేస్తే, రెండు రోజుల్లో ముగిసే పని. అయినా ఈ జ్ఞాపకాల నుంచి కొంచెంసేపైనా విశ్రాంతి దొరుకుతుందని, వస్తానని చెప్పేశాను. తెల్లారి నుంచి వరి కోత మొదలెట్టాం. ఎండలు బాగానే ఉన్నాయి. తొలి రోజు అవడం చేత కొంచెం ఒళ్ళు నొప్పులున్నాయి, తల కూడా నొప్పిగానే ఉంది. కానీ అమ్మ చేతి వంట తినడం చేత, అను జ్ఞాపకాలకు దూరంగా ఉండడం చేత కొంచెం ఉపశమనం అనిపించినా, ఆ ఆత్మీయ స్పర్శ గుండెను తాకుతూనే ఉంది.
తెల్లారి నుంచి ఐదురోజులుగా పని చేస్తూనే ఉన్నాం. కైకిళ్ళు దొరక్కపోవడం చేత పని కొంచెం ఆలస్యమైంది, కానీ మర్నాటి నుంచి బదల్లు పోవటం చేత ఇంకో 15 రోజులు పని చేస్తూనే ఉన్నాను. ఇప్పుడిప్పుడే జ్ఞాపకాల తెరల అలల తాకిడి తగ్గుతోంది, కానీ గుండె సంద్రం మాత్రం హోరెత్తుతూనే ఉంది. ప్రతి రోజు సాయంత్రాలు గద్దెమీద కూర్చుని చిన్నప్పటి సోపతులతో కబుర్లు చెప్తుంటే కాలం గడుస్తూనే ఉంది. క్రమ క్రమంగా జ్ఞాపకాలు పెరుగుతూనే ఉన్నాయి. పనిలేదు కదా, మళ్ళీ అలజడి. మధ్యలో ఒకసారి పోయొద్దామని అనుకున్నా కానీ పోలేకపోయాను. కాలేజి మళ్ళీ మొదలవడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకరోజు నాన్నొచ్చి అన్నాడు ‘చెల్లెలికి పెళ్ళి కుదిరింది కదా… డబ్బు ఇబ్బందవుతుందేమో, అందుకే నీకు కూడా పెళ్ళి చేద్దామనుకుంటున్నాను’ అని.
నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అదిరిపడి చూశాను ‘అదేంటి ఇప్పుడే పెళ్ళా’ అన్నాను ఆశ్చర్యంగా. ‘ఏం చేయమంటావ్‌, మీ మామయ్య ఇంకా ఆగలేనన్నాడు, ఈడొచ్చిన పిల్లను ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకోమంటావ్‌’ అని అంటున్నాడు. ‘ఇక్కడ చెల్లి పెళ్ళికి సాయం చేస్తానని అంటున్నాడు’ అని నసిగాడు నాన్న. ఏం చెప్పాలో అర్థం కాకపోయినా ఖచ్చితంగా చెప్పేశాను, ‘నా కాళ్ళమీద నేను నిలబడేదాకా పెళ్ళి చేసుకోను’ అని. ఇంతలోనే అమ్మొచ్చింది, ‘‘ఇప్పుడే ఎందుకీ గొడవ, ఇంకా సంబంధం కుదరనిదే’’ అంటూ నాన్నను తీసుకుని బయటికెళ్ళింది. నాకు మాత్రం చాలా ఆదుర్దాగా, భయంగా ఉంది. అదేమిటీ ఇప్పుడే పెళ్ళా! ఒకవైపు నాకే తిండి దొరక్క ఛస్తుంటే, ఇంకొకర్ని ఎలా భరించగలను. ఖచ్చితంగా చేసుకోకూడదని నిర్ణయానికొచ్చాను. మళ్ళీ అమ్మతో చెప్పాను ‘నేను పెళ్ళి ఇప్పుడే చేసుకోను, మామయ్య బిడ్డను అస్సలే చేసుకోను’. ఏమనుకుందో అమ్మ మౌనంగా ఉండిపోయింది.
ఇంకో ఐదు రోజుల్లో కాలేజీ మొదలవుతుందనగా ఇంట్లో చెప్పి బయలుదేరాను. బస్టాండ్‌ వరకు వచ్చిన నాన్న వారం రోజులుగా చెప్తుందే మళ్ళీ చెప్తున్నాడు. ఇంటి పరిస్థితి గురించి, చెల్లెలి పెళ్ళి గురించి… ఒక్కొక్కటిగా అన్నీ సమస్యలే. ఈ వారం రోజులుగా నాలో వ్యక్తిత్వానికి, పరిస్థితులకు మధ్య సంఘర్షణ. ఎంత బాధేస్తోందంటే… చచ్చిపోదామనిపిస్తోంది. కానీ తల వంచితే చచ్చిపోయినట్లే అనుకొని అవే ఆలోచనలతో బస్సెక్కాను. రూంలోకి వెళ్ళాను. చిందరవందరగా దుమ్ము పేరుకుపోయింది. తుడుద్దామనుకున్నాను కానీ ఓపిక లేదు, రాగానే వెళ్ళి అనుపమను కలుద్దామని అనుకున్నాను కానీ ఆసక్తి లేదు. అయినా ఆమెను చూస్తే మనస్సు స్థిమితంగా ఉంటుందా? అమ్మో అది మాత్రం నా వల్ల కాదు. పది రోజులు గడిచాయి. రాజుగాడు నిన్ననే వచ్చాడు.
కాలేజీకి వెళ్తున్నాను కానీ అనుపమకు కనిపించట్లేదు. అసలు తను వస్తుందో లేదో కూడా తెలియదు. ఆ రోజు సాయంత్రం రాజుతో ఇంటి దగ్గర జరిగిన మొత్తం సంగతులన్నీ విడమరచి చెప్పాను. అంతా విన్నాక తిట్టాడు. ‘‘ఏంట్రా అలా ఆలోచిస్తావ్‌? డబ్బు ఇవ్వాళ కాకుంటే రేపు సంపాదిస్తావ్‌. కానీ ప్రేమను సంపాదించలేవురా. ధైర్యంగా వెళ్ళి అనుతో నీ ప్రేమ విషయం చెప్పెయ్‌’’ అన్నాడు.
వాడు చెప్పింది నిజమే, కానీ అంత ధైర్యమెక్కడిది నాకు. తెల్లారింది. స్నానం చేసి కాలేజీకి వెళ్దామని రెడీ అయ్యాను. ఇస్త్రీ బట్టలు తెస్తూ ఆయాసపడుతూ ఉరికొస్తున్నాడు రాజు. ఏంట్రా అన్నాను. ‘అనుపమ వస్తోందిరా’ అన్నాడు. ఒక్కసారిగా కట్టలు తెగిన సంతోషంతో ‘ఎక్కడ్రా’ అన్నాను. కానీ మరుక్షణమే నిరాసక్తత. దూరంగా జరిగాను. ‘ఏమైందిరా’ అన్నాడు మౌనంగా ఉండడం చూసి. ‘ఒరేయ్‌ నువ్వు ఇంకా ఇంటి జ్ఞాపకాలతోనే ఉన్నావు. ఏమైతే అదైంది, అనుపమతోనే నీ జీవితం. ఒకవేళ ఇప్పుడు నువ్వు చెప్పకున్నా నేను చెప్తాను’ అంటున్నాడు ఆవేశంగా. వాడ్ని పట్టుకున్నాను. ఇంతలో అనుపమ రానే వచ్చింది. తనని చూస్తూనే రాజు బయటికెళ్ళాడు. తను లోపలికొచ్చింది. అవే కళ్ళు… మళ్ళీ నీళ్ళు తిరుగుతున్నాయి. ఇద్దరి మధ్యా మౌనమే. రెండు నెలల ఎడబాటుని మరిచిపోయేలా ఒకరి కళ్ళు ఒకరిలోకి ఆర్ద్రంగా చూసుకుంటున్నాయి. హఠాత్తుగా ఏడుస్తూ గుండెలపై వాలిపోయింది. ఒక్కసారిగా గుండె రaల్లుమంది. ఏమైందీ అంటూ పైకి లేవబోయాను. కానీ ఉద్వేగం పెల్లుబుకుతోందేమో, అలానే ఉండిపోయింది. ఐదు నిమిషాల తర్వాత మెల్లిగా తన తలపైకెత్తి నుదుటిపై చుంబించాను. కానీ తర్వాత అనిపించింది, ఎందుకలా చేశానా అని. కానీ తను మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఒక్కటొక్కటిగా అన్నీ మాట్లాడుకున్నాం. మూడు గంటలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి. చివరికి అంది ‘‘ఇక్కడికొచ్చి పది రోజులైందటగా, నన్నెందుకు కలవలేదు’’. మళ్ళీ ఒక్కసారిగా పరిస్థితులు గుర్తొచ్చాయి. మౌనంగా అలానే కూర్చున్నాను. లేవబోయింది, కూర్చోమన్నాను. లేదు వెళ్ళాలంటూ లేచింది. నేనూ లేచాను. గుమ్మం దాకా వెళ్ళి వెనక్కు తిరిగి చూసింది. కళ్ళల్లో నీళ్ళు… అలాగే వెనక్కి వచ్చి అధరాన్ని చుంబించింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి షాక్‌ అయ్యాను, ఇంకా తేరుకోకముందే ‘‘ఐ లవ్‌ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ షాక్‌ అయ్యాను. రాజు లోపలికి వచ్చాడు. ‘‘ఏంట్రా, మరీ ఇంతసేపు బయట కూర్చోబెట్టారు. తనేంటి సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తోంది’’ అన్నాడు. తర్వాత నాలుగు నెలలుగా దూరంగానే ఉంటున్నాను. ఒకరోజు ఏడుస్తూ రాజుతో పాటు రూంకి వచ్చింది. తనేం తప్పు చేశానో చెప్పమంది. ఏం చెప్పాలి, తనేం తప్పు చేసింది, తప్పంతా నాదేగా. రాజు సీరియస్‌గా తిడుతూనే ఉన్నాడు. వాడికి విసుగనిపించిందేమో బయటికెళ్ళాడు. నా పరిస్థితి అంతా ఆమెకు చెప్పాను. చావనైనా ఛస్తాను కానీ నువ్వు లేనిదే బ్రతకలేనంది.
మొహం చూస్తుంటే అన్నంత పనీ చేసేలాగా ఉంది. రేపటిలోగా ఏదో ఒకటి తేల్చమని చెప్పి వెళ్ళిపోయింది. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. తనకంత ధైర్యం ఉండగా, నేనేంటి పిరికివాడిలా ఆలోచిస్తున్నాను, ఏది ఏమైనా సరే తనే నా జీవితం, ఇది కృత నిశ్చయం. లేదంటే ఆమె లేని నేను ఉంటానా? అది మాత్రం జరగని పని. అందుకే అయ్యేదేమైనా ఇద్దరికీ కలిసే జరుగుతుందని నిర్ణయానికొచ్చాను. ప్రతిరోజు ఉషోదయాలు, పచ్చిక బయళ్ళు, పారే సెలయేళ్ళు, చెరువు గట్లపై అను, నేను… ఊహకే అద్భుతం. ఆర్నెల్లు ఆరు నిమిషాలుగా గడిచాయి. ఈ కాలంలో కవితలెన్నో… కథలెన్నో… ఒకటేంటి చాలా… వీటన్నింటినీ తనే తీసుకుంటుంది.
ఒకరోజు ఇంటి దగ్గర నుండి లెటర్‌… అర్జంటుగా రమ్మని. వెళ్ళాను. చెల్లికి పెళ్ళి కుదిరింది, నాకు పెళ్ళి నిశ్చయం చేస్తారట. నేను వద్దన్నాను, అను గురించి చెప్పాను. నాన్న కోపానికి అవధుల్లేవు, అమ్మ ఏడుస్తోంది. చెల్లి దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను చేసింది తప్పా అని. ఏడుస్తోంది పిచ్చిది కష్టాలన్నీ కలిసొచ్చినట్లుగా… ఓదార్చాను. అంతా సవ్యంగా జరుగుతుందని నచ్చచెప్పాను. ఇంతలో మామయ్య వాళ్ళొచ్చారు. విషయం తెలిసినట్టుంది. చిరుబురులాడుతున్నారు. నిక్కచ్చిగా చెప్పాను నేను అనునే పెళ్ళి చేసుకుంటానని.
కోపంతో గంతులేశాడు, చదువు నేర్పిన పొగరన్నాడు. అయినా భరించాను, కూతురు పెళ్ళి చేయలేకపోతున్నాననే బాధలో అలా అంటున్నాడని అనుకున్నాను. నాకంటే మంచి సంబంధం దొరుకుతుందని నచ్చచెప్పాను, వినలేదు. నాన్న దగ్గరికెళ్ళి చెప్పాను నేను పెళ్ళంటూ చేసుకుంటే అది అనుని మాత్రమేనని. కాలేజికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఇదివరకట్లా లేరు. అయినా అమ్మ దగ్గరికెళ్ళి నాన్నకి వినపడేట్లుగా ‘‘చెల్లెలికి ఆ సంబంధం కుదర్చమని, ఎండాకాలం లగ్గాల్లో పెళ్ళి ఏర్పాట్లు చేయమని’’ చెప్పి బస్సెక్కాను. కానీ మళ్ళీ ఆలోచనలు. చెప్పనైతే చెప్పాను కానీ యాభై వేలు ఎక్కడినుంచి తెస్తాను. అవే బాధలు. ఎగ్జామ్స్‌ మొదలయ్యాయి. అనుకి అన్ని విషయాలు చెప్పాను. తనే రోజూ దగ్గరుండి చదివిస్తోంది. వాళ్ళింట్లో కూడా మా విషయం చెప్పేసింది. ఛస్తానని బెదిరించడంతో వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకే అంత ధైర్యం. తనకి కూడా చదువు బుర్రకెక్కడంలేదు, ఒకటే ఆలోచన… మళ్ళీ డబ్బులు కావాలి. ప్రేమను పొందలేనని అనుకున్నా. కానీ దాన్ని సాధించాక మళ్ళీ ఇదొకటొచ్చి పడిరది. ఎన్ని సమస్యలో చిన్న జీవితానికి.
అయినా అను రోజూ ధైర్యం చెబుతూనే ఉంది. నువ్వు మీ చెల్లెలి పెళ్ళి చేస్తావ్‌ అని. అదే ధైర్యం నాకు, లేకపోతే ఈ వయస్సులోనే గుండెపోటు వచ్చేదేమో. ఎగ్జామ్స్‌ అయిపోయాయి. నాకు ఖచ్చితంగా తెలుసు, నేను తప్పుతానని. ఒక పేపరు అస్సలే రాయలేదుగా. ఇంటికెళ్ళబుద్ది కావట్లేదు. ఫ్రెండ్స్‌ అంతా ఇళ్ళకు వెళ్ళారు, వెళ్తూ వెళ్తూ పెళ్ళికి తప్పక పిలవాలని చెప్పారు. కాలేజీలో అటెండర్‌ దగ్గర నుంచి ప్రిన్సిపాల్‌ వరకు అందరికీ తెలుసు మా ప్రేమ కథ. ఏమౌతుందోనని అందరికీ ఆసక్తి.
వాళ్ళకేంటి మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువేంటో. చెల్లెలి పెళ్ళి ఇంకా పదిహేను రోజులే ఉంది. నాన్న లెటర్‌ రాశాడు ఇల్లు తాకట్టు పెట్టానని, తొందరగా రమ్మని. మడిచి జేబులో పెట్టుకున్నాను. ఓడిపోయినవాడ్ని అంతకుమించి ఏం చేయగలను. రేపే ఇంటికెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అనుపమకి నిన్ననే చెప్పాను తొందరగా రమ్మని. కానీ తనొచ్చేదాకా నేను నిద్ర లేవలేదు. అసలు నిద్రపట్టిందే నాలుగింటికి కదా. డోర్‌ పెద్ద శబ్దంతో మోగుతుంటే అసహనంగానే వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా అను… తెల్లని చీరలో మిలమిలా మెరుస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఏదో చెప్పాలనే ఆత్రుతలో ఉంది. లోపలికి వెళ్ళబోయాను. ఆపింది. ఏంటన్నట్లుగా చూశాను. నోరు తెరవమంది. ఎందుకో అర్థం కాలేదు. అయినా తెరిచాను. స్వీట్‌ పెట్టింది. అదేంటి పిచ్చిదానా, మొహం కడగకముందే స్వీట్‌ పెట్టావని విసుక్కున్నాను. న్యూస్‌పేపర్‌ తీసి చదవమంది. ‘ఏంటన్నాను’, ‘చదివితే తెలుస్తుందిగా’ అని చూపించింది.
చదువుతుండగానే ఆశ్చర్యపోయను. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. అసలు కలో, నిజమో అర్థం కావడంలేదు. నా కథకి ‘ఆటా’ వారి ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. అంటే లక్ష రూపాయల బహుమతి.
ఆనందంతో తనని గిరగిరా గాల్లో తిప్పాను. రెండ్రోజుల తర్వాత మంత్రి చేతుల మీదుగా చెక్కు తీసుకుని డ్రా చేసుకుని ఆనందం నిండిన కళ్ళతో మా ఊరి బస్సెక్కాను. అప్పుడడిగాను మెల్లగా ‘‘అవునూ! ఆటాకి నా కథను ఎవరు పంపారు?’’ అని.
ముసిముసిగా నవ్వుకుంది. ఇంటికెళ్ళా. అందరూ పేపర్లో చూసినట్లున్నారు, అభినందిస్తూనే ఉన్నారు. మామయ్యయితే మరీ బాధపడుతున్నాడు, నన్ను ఎగతాళి చేసినందుకు పశ్చాత్తాపం కావచ్చు.
మేళతాళాల మధ్య సంబరంగా చెల్లి పెళ్ళి అయిపోయింది. భోజనాల దగ్గర అమ్మని మెచ్చుకుంటున్నారంతా బంగారంలాంటి కోడలు దొరికిందని. అవును మరి బంగారం కన్నా విలువైనదే… ఎప్పుడొచ్చిందో వెనక నిల్చుంది.
తన చేతిని చేతిలోకి తీసుకున్నా. తినడానికి పిలిస్తే వెళ్ళాం. ఈసారి పరీక్షల్లో తప్పినా జీవితం పెట్టిన పరీక్షలో మాత్రం 100 శాతం మార్కులతో పాసైన సంతృప్తితో తృప్తిగా భోంచేశా… చాలా రోజుల తర్వాత కడుపు నిండా.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.