అది దామోదర్ వాలీ కార్పొరేషన్ వాళ్ళు కట్టించిన కాలనీ. అక్కడ ఒకవైపుగా పనివాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ నుండి ముందుకు సాగిన బాట ఇరుకుగా ఉంది. కానీ రెండువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో గొర్రెలు మేస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడా ఉన్న వెదురు చెట్లు గాలికి ఊగుతున్నాయి. రోడ్డుకి కుడివైపు
ఉన్న ఒక ఇంటిముందు విశాలమైన మర్రిచెట్టు ఉంది. దాని ఆకులు నేలంతా పరచుకున్నాయి. ఇంటి లోపలికి వెళ్ళడానికి వెదురు బొంగులతో తయారుచేసిన గేటుంది. గేటు లోపలున్న విశాలమైన ప్రాంగణంలో మొక్కలున్నాయి. ప్రాంగణానికి ఒక మూల బావి ఉంది. బావికి ఇరువైపులా రెండు కట్టడాలున్నాయి. వాటి తలుపులు ప్రాంగణం వైపు తెరిచి ఉన్నాయి. వాటికున్న వరండాలు కూడా పెద్దగా ఉన్నాయి. ఎడమవైపునున్న వరండా స్తంభానికి నీలిరంగు పూలతీగ అల్లుకునుంది. దానినుంచి వచ్చే సువాసన పరిశుభ్రమైన గాలిలో కలిసిపోతోంది.
ఆ పూలతీగ పక్కనున్న కుర్చీలో సుమారు డెబ్భై ఏడేళ్ళ వయసులో ఉన్న మహిళ కూర్చునుంది. శ్యామవర్ణంలోనున్న శరీరం నిగనిగలాడుతోంది. సన్నగా ఉన్న ఆమె తెల్లని చీర బెంగాలీ పద్ధతిలో కట్టుకుంది. జుట్టు చక్కగా దువ్వుకుని ముడి వేసుకుంది. మెడలో సన్నని గొలుసు, చెవులకు చిన్న పోగులు, చేతులకు వెడల్పాటి గాజులు వేసుకుంది. కళ్ళద్దాలు దాచలేని లోతైన కళ్ళు, ముఖంలో ప్రస్ఫుటించే విషాదచ్ఛాయలు ఆమె ఎన్నో అనుభవాలను, దుఃఖభరిత జీవితాన్ని చూసినట్లు చెబుతున్నాయి. ఆమె గురించి తెలుసుకోవాలని మీకనిపిస్తోందా? అయితే చెప్తాను వినండి.
… … …
ఆమె సంతాల్ యువతి బుధినీ మేరaన్. జార్ఖండ్ రాష్ట్ర తూర్పు సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి అతి దగ్గరలో ఉన్న సంతాల్ గ్రామం కర్చోనాలో జన్మించింది. ఆదరణీయులైన తల్లిదండ్రులతో, ప్రేమను పంచే తోబుట్టువులతో ఆమె రోజులు హాయిగా దొర్లుతున్నాయి. చుట్టూ పరచుకున్న అడవి, గలగలపారే నది, సాగు చేసుకుంటున్న పొలాలే ఆమె లోకం! వాటితో మమేకమైన సహవాసం ఆమె జీవితం! కట్టుబాట్లు, ఆచారాలు ఎక్కువగా పాటించే సంతాల్ సమాజంలో పుట్టినప్పటికీ వాటిని ధిక్కరించే స్వభావం ఆమెలో చోటుచేసుకుంది. సంతాల్ ఆడపిల్లలు చెయ్యకూడదని నిషేధింపబడిన పనులైన చెట్లెక్కడం, తిరియావో… అంటే పిల్లనగ్రోవి ఊదడం ఆమెకెంతో ఇష్టమైన పనులు. పట్టుబడితే గ్రామ పంచాయితీ శిక్ష వేస్తుందని తెలిసినా జంకేది కాదు. పిల్లనగ్రోవి ఊదుతూ గొర్రెల్ని మేపేది. ఆమె మురళీగానం వింటూ తలలు ఊపుతూ అవి గడ్డి మేస్తున్నట్లు అనిపించేది. ఒక్కోసారి చెట్టుపైన కూర్చుని కాళ్ళూపుతూ మురళి ఊదేది.
అంతేకాకుండా అడవిలోకి వెళ్ళి బాణాలతో లేళ్ళను వేటాడేది. నదిలో నెచ్చెలులతో కలిసి ఈత కొట్టేది. చేపలు పట్టేది. ఎర్రటి పాలష్ పువ్వులను తలలో పెట్టుకుని, సంతాల్ తెగలోని స్త్రీల సంప్రదాయబద్ధమైన వస్త్రధారణ పంచి, (నడుము చుట్టూ కట్టుకునే పొడుగాటి వస్త్రం) పర్‌హన్‌ను కట్టుకుని మిగతా ఆడపిల్లలతో కలిసి సంతాలీ నృత్యం చేసేది. ఒకరి నడుమొకరు పట్టుకొని, ఒక అడుగు ముందుకు, రెండడుగులు ప్రక్కకు వేస్తూ చేసే ఆ నాట్యం బుధినీకి ఎంతసేపైనా చేస్తూ
ఉండాలనిపించేది. ఇంట్లో పనులలో కూడా తల్లికి సాయం చేసేది. సాల్ చెట్టు ఆకులతో బుట్టలు, పాత్రలు, స్పూన్లు చేసేది. వెదురు ఆకులతో చాపలల్లేది. వడ్లు, రాగులు దంచేది. తోటలో కూరగాయలు పండిరచేది. పేడతో పిడకలు చేసేది. వంట చేసేది. చిన్న తమ్ముళ్ళను, చెల్లెళ్ళను ఎత్తుకు తిప్పేది. ఒక్కోసారి పొలం పనులలో తండ్రికి సాయం చేసేది.
అడవి పువ్వులాంటి స్వచ్ఛమైన ఆమె జీవితం పదమూడేళ్ళ వయసులో అనుకోని విధంగా మారిపోయింది. క్రమేణా పెద్దదవుతున్న సంసార భారాన్ని తగ్గించుకోడానికి, పేదరికం నుంచి బయటపడడానికి ఆమె తల్లిదండ్రులు ఆమెను దామోదర్ వాలీ కార్పొరేషన్‌లో పనికి కుదిర్చారు. స్వేచ్ఛా విహంగంలా సంచరించే ఆమె దైనందిన జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. డీవీసీ వాళ్ళు తమ ఆధ్వర్యంలో జార్ఖండ్‌లో కడుతున్న పంచెడ్ డ్యామ్ కోసం రాళ్ళు పగలగొట్టేందుకు, మట్టి తట్టలు మోసేందుకు ఆమెను పనిలోకి తీసుకున్నారు. రాళ్ళు కొట్టి కొట్టి ఆమె చేతులు పుళ్ళు పడేవి. ఒక్కోసారి రక్తం కారేవి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని పోయేది. ఆ పనులు చెయ్యడం బుధినీకి సుతరామూ ఇష్టం లేకపోయినా తప్పేది కాదు. నెమ్మది నెమ్మదిగా ఆమె ఆ జీవితానికి అలవాటు పడిపోయింది.
అక్కడ పనిచేస్తున్నప్పుడే పదిహేనేళ్ళ వయసులో ఆమె ఊహించని సంఘటన జరిగింది. డిసెంబర్ 6, 1959లో పంచెట్ డ్యామ్ ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు వచ్చారు. వారి మెడలో దండ వేయడానికి, నుదుట తిలకం దదదిద్దడానికి బుధినీని, పుష్పగుచ్ఛం ఇవ్వడానికి డీవీసీలోనే పనిచేస్తున్న రోబన్ మారిaని ఒప్పించారు. దండ వేయడానికి మిగతా సంతాల్ యువతులు ముందుకు రాలేదు. బుధినీ మాత్రం వెంటనే ఒప్పుకుంది. అంతేకాకుండా డీవీసీ ఆఫీసర్లు కోరినట్లు బుధినీ చక్కటి పాలరంగు పంచి, పర్‌హాన్ ధరించింది. చేతులకు వెండి రంగులో మెరుస్తున్న గాజులు, ముక్కుపుడక, పోగులు, తలపిన్ను పెట్టుకుంది. తలలో అడవిపూలు పెట్టుకుంది. తెర వెనుక నిలుచున్న వారిద్దరినీ నెహ్రు గారు వచ్చిన తర్వాత ముందుకు నెట్టారు. భయం భయంగా తెర బయటికి వచ్చి ఎదురుగా కనబడిన జన సమూహాన్ని చూసి తబ్బిబ్బయింది బుధినీ. మహాకాయంతో, పెద్ద బొజ్జతో, ఎర్రటి కళ్ళతో భయంకరంగా ఉంటారని ఊహించిన ప్రధానమంత్రి నెహ్రు గారిని చూసి ఆశ్చర్యపోయింది. తెల్లటి మేనిచ్ఛాయతో, మధుర మందహాసంతో, కోటుకు పెట్టుకున్న ఎర్ర గులాబీతో ఎదురుగా నిల్చున్న మనిషికి, తనూహించుకున్న మనిషికి పోలిక లేదని తెలుసుకుంది. ఆయనకి సంకోచంగా దండవేసి, తిలకం దిద్దింది. దండ వేసేటప్పుడు ఆయన బుధినీకి వీలుగా ముందుకు వంగడం, రోబన్ నుంచి రెండు చేతులతో పుష్పగుచ్ఛాన్ని అందుకోవడం బుధినీ దృష్టిని దాటిపోలేదు.
తర్వాత నెహ్రుగారు ఆమెని నవ్వుతూ చూస్తూ ‘‘బేటీ! పంచెట్ డ్యామ్‌ని నువ్వే ప్రారంభోత్సవం చెయ్యి. బటన్ నొక్కు!’’ అని అడిగారు. ఆమె సందేహిస్తుంటే డీవీసీ ఆఫీసర్లు కూడా బటన్ నొక్కమని ప్రోత్సహించారు. ఆమె నొక్కగానే నీళ్ళు హోరుమనిన ప్రవహించాయి. కరతాళ ధ్వనులు ఆకాశాన్నంటాయి. సంతాలీ భాషలో పంచేట్ డ్యామ్‌ని దేశానికి అర్పిస్తున్నట్లు చెప్పమని కూడా ఆమెని కోరారు. ఆమె మొదట సంకోచపడినా తర్వాత మైక్‌లో పెద్దగా చెప్పింది. నలువైపులా చప్పట్లు మారుమ్రోగాయి.
బుధినీకి ఈ అనుభవం చెప్పరాని ఆనందం కలిగించింది. కార్యక్రమం ముగిసిన తర్వాత సంతోషంతో గెంతుతున్నట్లు తన గ్రామానికి బయల్దేరింది. గ్రామస్థులు అంతకుముందే వెళ్ళిపోయారు. అందుకే ఒంటరిగా నడవసాగింది. గ్రామం చేరేసరికి చీకట్లు కమ్మాయి. కర్బోనా గ్రామంలో పెద్దవీథికి ఇరువైపులా ఇళ్ళుంటాయి. ఆ వీథే ఆ గ్రామానికి ఆయువుపట్టు. ముఖ్యమైన ఉత్సవాలు, సంఘటనలు ఆ వీథిలోనే జరుగుతాయి. ఆ వీథిలోకి ప్రవేశించింది బుధినీ. అంతా అంధకారమయం. వీథంతా నిర్మానుష్యంగా ఉంది. వీథికి రెండువైపులా ఉన్న ఇళ్ళల్లో ఎవరూ దీపాలు పెట్టలేదు. బుధినీ మనస్సు కీడు శంకించింది. ‘‘అందరూ ఏమయ్యారు?’’ అనుకుంది.
బుధినీ ఇల్లు ఆ వీథిలోనే బావి దగ్గర్లో ఉంది. ఇంటి ముందు సాల్ చెట్టుంది. బుధినీ ఇంటివైపు పరిగెత్తడం మొదలెట్టింది. బావి దగ్గరకొచ్చేసరికి నోరెండిపోయి దాహమవుతున్న సంగతి గుర్తొచ్చింది. నీళ్ళు చేదదామని కుండని బావిలో వెయ్యగానే పదిమంది సంతాల్ మగవాళ్ళు ఆమెని చుట్టుముట్టి తాడు, కుండా లాక్కుని ఆమెని ‘‘కుక్కా! కుక్కా!’’ అని ఛీత్కారం చేయసాగారు. వాళ్ళలో ఒకడు ‘‘ఈ బావిలో నీళ్ళు ముట్టడానికి వీల్లేదు’’ అని ఆమెని తిట్టసాగాడు. బుధినీ ఏమీ అర్థం కాక వణికిపోతూ, ఏడుస్తూ నిలబడిరది. తర్వాత తన ఇంటివైపు పరుగెత్తింది. ఇంట్లో ఎవరూ లేరు. ‘‘అమ్మా! నాన్నా! అందరూ ఏమయ్యారు’’ అని ఆమె ఏడుస్తూ నిశ్ఛేష్టురాలై నిలబడిపోయింది.
ఇంతలో గ్రామంలోని ఆడవాళ్ళు, పిల్లలు తప్ప సంతాల్ మగవాళ్ళందరూ ఆమె ఇంటిముందుకు చేరారు. పెద్దగా డోళ్ళు మోగిస్తున్నారు. బయటినుంచి ఐదు గ్రామాల పెద్దలు వాళ్ళని చేరారు. అందరూ కలిసి బుధినీని బితలాహ అంటే బహిష్కరణ చేశారు. కారణం? ఆమె డికూకి, అంటే బయటివాడికి దండవేసి పెళ్ళి చేసుకుంది. మెడలో దండ వెయ్యడం అంటే పెళ్ళి చేసుకున్నట్టే లెక్క! సంతాల్ సంతాల్‌నే పెళ్ళి చేసుకోవాలి. బయటివాడిని పెళ్ళి చేసుకుంటే బహిష్కరణ తప్పదు. ఇక ఆమె గ్రామం విడిచి వెళ్ళిపోవాలి. మళ్ళీ అడుగుపెట్టకూడదు. ఆమెతో ఎవరూ సంబంధం పెట్టుకోకూడదు. మాట్లాడకూడదు. ఎవరైనా ఆమెకి సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి కూడా బహిష్కరణ తప్పదు అని నిర్ణయించారు. అప్పటికి బుధినీకి అంతా అర్థమవ్వసాగింది. ఇంతలో కొందరు ఆమెని ఇంట్లోంచి బయటికి లాగి నెట్టివేస్తూ ‘‘వెళ్ళిపో! వెళ్ళిపో!’’ అని అరవసాగారు. గ్రామం బయటివరకు తరిమి తరిమి కొట్టారు. ఆమె భయంతో బిక్కచచ్చిపోయి అడవిలోకి పోయి దాక్కుంది. కొన్ని గంటల తర్వాత ఇంకా తెల్లవారకుండానే తన తల్లిదండ్రులు కనిపిస్తారనే ఆశతో మళ్ళీ తనింటికి వచ్చింది. గ్రామస్థులు తెలుసుకుని ఆమెని బయటికి లాగి కర్రలతో కొట్టి చంపుతామని బెదిరించారు. ఆమె పరుగెత్తుతుంటే వెనుక నుంచి రాళ్ళు రువ్వారు. ఆమె పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయి ఎండలో ఒకచోట శోషతప్పి పడిపోయింది. అటువైపే సైకిల్ మీద వస్తున్న సుధీర్ దత్తా అనే నలభై ఏళ్ళ బెంగాలీ యువకుడు ఆమెని చూశాడు. ఆమె గురించి అంతకుముందే అతనికి తెలిసింది. ఆమె ముఖంపై నీళ్ళు చిలకరించగానే లేచి కూర్చుంది. నీళ్ళు తాగించి, ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. సైకిల్‌మీద కూర్చోపెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు అతని తల్లి అతని చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళింది. బుధినీని ఇంటి వెనుకవైపుకి తీసుకెళ్ళి మంచంమీద కూర్చోబెట్టి తినడానికి అన్నం, కూర ఇచ్చాడు. స్నానం చేసి బట్టలు మార్చుకోమని తల్లి చీర, జాకెట్టు ఇచ్చాడు. తర్వాత విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. బుధినీ శోష వచ్చినట్లు పడుకుంది.
కొన్ని గంటల తర్వాత బయటనుంచి వినపడుతున్న కేకలకు లేచి కూర్చుంది. కిటికీలోంచి చూసింది. దత్తా తల్లి, చెల్లెళ్ళు, గ్రామంలోని కులీనులు బుధినీని వెళ్ళగొట్టమని దత్తామీద ఒత్తిడి పెట్టసాగారు. ఆమె చిన్నపిల్ల అని, ఆమెని సురక్షితమైన ప్రదేశం చేర్చేవరకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతానని, అందుకు కొంత సమయం ఇవ్వమని దత్తా ప్రాధేయపడసాగాడు. కులీనులు ఇంక లాభం లేదని తలుపు తెరిచి బుధినీని బయటకు లాగి కొట్టి చంపడానికి ప్రయత్నించారు. దత్తా విషయం గ్రహించి ఆమె చెయ్యి పట్టుకుని గ్రామం బయటకు పరుగెత్తాడు. గ్రామం బయటికి వచ్చేసి అలసిపోయి నిల్చున్నారు. ఇంతలో పురులియాకి బొగ్గు చేరవేసే లారీ డ్రైవర్ వాళ్ళను చూసి లారీ ఆపాడు. అతను దత్తాకి తెలిసినవాడే. వాళ్ళను ఎక్కించుకుని రాణిపూర్ బొగ్గు గనుల దగ్గర వదిలిపెట్టాడు.
రాణిపూర్ బొగ్గు గనుల్లో వాళ్ళిద్దరూ రెండేళ్ళు పనిచేశారు. తర్వాత వాళ్ళు పనిచేసే కంపెనీ మూతపడడంతో నిరాశ్రయులయ్యారు. దానికితోడు 1962లో డీవీసి వాళ్ళు నెహ్రుగారి భార్యగా చెలామణి అవుతున్న బుధినీ తమ కార్పొరేషన్‌లో ఉండడం ఇష్టంలేక పనిలోంచి తీసేశారు. రాణిపూర్‌లో సమాజం వేసే సవాళ్ళను ఎదుర్కోలేక తనకంటే వయస్సులో చాలా చిన్నదైన బుధినీని దత్తా పెళ్ళి చేసుకున్నాడు. తన జంధ్యం వంక ప్రశ్నార్ధకంగా చూసే బుధినీ చూపులను గ్రహించి ఆమె భయం తొలగించడానికి తన జంధ్యం కూడా తీసేశాడు. బుధినీని, కూతురు రత్నిని ప్రేమగా చూసుకునేవాడు.
బతుకుతెరువు కోసం వాళ్ళెన్నో కష్టాలు పడ్డారు. రాణిపూర్, అసన్‌సోల్, పురులియాలో రకరకాల పనులు చేశారు. బొగ్గు గనుల్లో పనిచెయ్యడం వలన మంటలకి, పొగకి దత్తా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఎక్కువ పని చేయలేకపోయేవాడు. కొన్నిసార్లు అతి కష్టంమీద రోడ్లు వేసే కూలీగా పనిచేశాడు. బుధినీ కూడా హోటళ్ళలో, ఇళ్ళల్లో అంట్లు తోమే పని, శుభ్రం చేసే పని చేసేది. రాణిపూర్‌లో ఉన్నప్పుడు బొగ్గులు దొంగతనం చేసి అమ్ముతూ ఉండేది. తర్వాత ఒకసారి పట్టుబడినప్పటి నుంచి ఆ పని మానేసింది.
వాళ్ళెన్నోసార్లు అసన్‌సోల్ నుంచి పంచెట్ డామ్ దగ్గర్లో ఉన్న డీవీసీ ఆఫీసుకెళ్ళి అప్లికేషన్లు ఇచ్చి బుధినీని మళ్ళీ పనిలోకి తీసుకోమని ప్రాధేయపడ్డారు. డీవీసీ వాళ్ళు వాళ్ళకు ఎటువంటి సహాయం చేయలేదు. చివరికి 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దత్తా ఆయనకి ఉత్తరం రాసి బుధినీ పరిస్థితి తెలియచేశాడు. రాజీవ్‌గాంధీ స్పందించి డీవీసీ వాళ్ళు బుధినీని పనిలోకి తీసుకునేలా చేశారు. ఆయన ప్రోద్భలం మీద డీవీసీ వాళ్ళు ఆమెకి కొంత భూమి ఇచ్చి, అందులో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఆర్థిక సహాయం చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఊపిరితిత్తులు ఇంకా పాడయి అనారోగ్యంతో దత్తా మరణించాడు. బుధినీ తన కూతురు రత్ని తోడుగా ఆ ఇంట్లో ఉండసాగింది. ఇదీ బుధినీ మేరaన్ కథ! ఇన్ని సంవత్సరాలయినా ఆమెని, ఆమె కూతురుని సంతాలీ సమాజం ఆమోదించలేదు. ఆ సమాజానికి దూరంగానే వాళ్ళు బతుకుతూ వచ్చారు. సంతాలీ సంస్కృతి, జీవనం, అడవి, నది, పొలాలతో ఆమెకున్న ప్రేమ, అనుబంధం ఇప్పటికీ మర్చిపోలేదు. వాటిని పోగొట్టుకున్న భావన ఆమెను జీవితాంతం బాధించింది.
అమాయకంగా నెహ్రుగారికి దండ వేసినందుకు ఆమె శిక్ష అనుభవించింది. దండ వేయమని ప్రోత్సహించిన డీవీసీ వాళ్ళు ఆమె తప్పేమీ లేదని సంతాలీ సమాజాన్ని ఒప్పించలేదు. అసలామెను పట్టించుకోలేదు. పైగా సమాజానికి భయపడి నెహ్రుగారి భార్యగా ముద్రపడిన ఆమెను పనిలోంచి తీసేశారు. 1985లో ఆమెను తిరిగి పనిలోకి తీసుకునేంత వరకు పేదరికాన్ని, దుర్భర జీవితాన్ని చవిచూసింది. స్వతంత్ర భావాలు గల ఆ సంతాలీ యువతి ఇతరుల దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడిరది. సంతాల్ కట్టుబాట్లకు వెరసి తనని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన కుటుంబాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్నోసార్లు దుఃఖించింది.
సమాజ కబంధ హస్తాల నుంచి ఆమెను రక్షించి తను జీవించి ఉన్నంతవరకు తోడుగా నిలబడిన బెంగాలీ సుధీర్ దత్తా మహోన్నతుడు. కులీనుడైనప్పటికీ గిరిజన యువతిని వివాహం చేసుకుని ప్రేమను పంచిన అతడు త్యాగమయుడు. అతన్ని తలచుకున్నప్పుడల్లా బుధినీ మనస్సు గౌరవభావంతోను, ఆర్ద్రతతోనూ నిండిపోతుంది.
ఆమె జీవితాన్ని సినిమాగా తీయాలని బొంబాయి నిర్మాతలు ముందుకు వచ్చారు. ఆమెకు ఎంతో డబ్బు ఆశను చూపించారు. కానీ ఆమె నిరాకరించింది. ఆమె తన గత జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఒంటరిగా ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేకుండా జీవించాలనుకుంది. ఎంతో దూరం నుంచి ఆమెపై ఆసక్తితో చూడాలని వచ్చినవాళ్ళను మాత్రం కలుసుకుని నవ్వుతూ మాట్లాడుతుంది. గతం గురించి ప్రశ్నలు వేస్తే మౌనమే సమాధానమన్నట్లు చూస్తుంది.
గతం గురించి మాట్లాడడానికి ఆమె ఇష్టపడకపోవడం వలన ఆమె జీవితం గురించి ప్రజలు రకరకాల ఊహాగానాలు, కల్పనలు చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు, సంఘటనలు అందరూ ఒప్పుకునేవి కాబట్టి వాటి ఆధారంగా ఆమె జీవితాన్ని అంచనా వేయవచ్చు. ఒకటి మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం! మన సమాజ మూఢాచారాలకు, నిరాదరణకు గురై ఎన్నో కష్టాలు పడిన స్త్రీలకు ‘ఆమె ప్రతీక’!
(2012, 2019ల్లో వచ్చిన న్యూస్ రిపోర్టులు, సారా జోసెఫ్ నవల ‘బుధినీ’ చదివి ప్రభావితమై రాసినదీ కథ)