అందరూ చూడాల్సిన సినిమా ‘కొండపొలం’ – రమాదేవి చేలూరు

ఒక విద్యావంతుడైన రవి అనే యువకుడు చదువు ఐపోయి ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటాడు. ఆ క్రమంలో డిఎఫ్‌ఓ పోస్టుకి ఇంటర్వ్యూ కోసం హాజరైనప్పుడు అక్కడి అధికారులు నువ్వు ఏ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందావని అడుగుతారు.

అందుకు ఆ అబ్బాయి ‘అడవిలో’ అని అనగానే వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ కథ ఏమిటో చెప్పమని వాళ్ళు అడగ్గా అతను చెప్పిన కథే ఈ సినిమా.
అది రాయలసీమలో ఒక పల్లెటూరు. ఐదేళ్ళుగా వరుసగా వర్షాలు పడక, కరవు వస్తుంది. ముఖ్యంగా పశువులకు తాగునీరు, మేత లేక అల్లాడిపోతుంటాయి. ఆ ఊర్లో దాదాపు ఐదారు కుటుంబాల వాళ్ళు గొర్రెల కాపర్లు, గొర్రెలకు తాగునీరు లేక, మేత లేక చస్తాయని, నల్లమల అడవుల్లోకి గొర్రెలను తీసుకుపోవాలని నిర్ణయించుకొని బయలుదేరుతారు. అప్పుడప్పుడు వాళ్ళు చేసే పని అది.
ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికొచ్చిన ఆ యువకుడు కూడా వాళ్ళతోపాటు బయలుదేరతాడు. అతన్ని అందరూ సిన్నోడు అని పిలుస్తుంటారు. అలాగే వాళ్ళ మామ కూతురు పేరు ఓబులమ్మ. ఓబి అని పిలుస్తుంటారు. ఇంకా పదిమంది కూడా వాళ్ళతో పాటు బయల్దేరి వెళ్తారు. ఇంట్లోనే రొట్టెలు కాల్చుకుని తీసుకువెళ్తారు.
ఆ అడవిలో గొర్రెల కాపర్లు పడ్డ కష్టాలే ఈ సినిమా కథ.
ఊరికి దూరంగా గొర్రెల్ని తోలుకుని నడుస్తూ వెళ్ళాలి. అడవిలో పాములు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, ఎన్నో క్రూర జంతువుల నుంచి గొర్రెల్ని కాపాడాలి, తమను తాము కాపాడుకోవాలి. అక్కడ దొరికే మురికి నిల్వ నీరు తాగాలి. ఇంటినుంచి తెచ్చుకున్న ఎండిపోయిన రొట్టెల్నే తిని బతకాలి. మొదట్లో అతనికి అడవిలో అంతా భయంగా ఉండేది. ఇక అందర్నీ చూసి అలవాటుపడతాడు. ఓబి కూడా ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తుంది.
అందరూ ఐకమత్యంతో ఉండి, వాళ్ళకు వచ్చే సమస్యలను పరిష్కరించుకోవాలి. యువకుని తండ్రి, వాళ్ళ మామ వయసులో పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ధైర్యవంతులు. వాళ్ళే అందర్నీ నడిపిస్తుంటారు.
అడవిలో కొందరు ఎదురై ఈ కొండ నరసింహ స్వామిది కాబట్టి ఆయనకి కొన్ని గొర్రెల్ని ఇవ్వాల్సిందేనని దౌర్జన్యంగా అడుగుతారు. సిన్నోడి తండ్రి, మామ వాళ్ళ బెదిరింపులకు లొంగరు. వాళ్ళ ధీశక్తిని చూసి ఆ యువకుడు కూడా ధైర్యంగా వెళ్ళి వాళ్ళను తిప్పికొట్టి పంపుతాడు.
వాళ్ళ ఆయుధం వడిసెలు. నారతో అల్లిన బెల్టులాంటి దానికి రాయి పెట్టి గట్టిగా తిప్పి విసిరితే, ఆ రాయి శత్రువుకు తగిలి గాయపడి, వాళ్ళు పరుగులు తీయాల్సిందే. వడిసెల్ని తిప్పాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. వడిసెలతో పులిని, ఎలుగుబంట్లని బెదరగొడుతుంటారు. అందరూ కలిసి కేకలు వేస్తూ వడిసెల్ని విసిరితే జంతువులు భయంతో తోక ముడుచుకుని పోతాయి. ఇలా అడవిలో కలిగే భయాల్ని, సమస్యల పరిష్కారాన్ని గమనిస్తుంటాడు సిన్నోడు. ఓబి ఎప్పుడూ హుషారుగా, నిర్భయంగా ఉంటూ సిన్నోడ్ని గేలి చేస్తూ, ధైర్యం నూరిపోస్తూ సరదాగా ఉంటుంది. వాళ్ళకి పరస్పరం ప్రేమ చిగురిస్తుంది ఆ అడవిలో.
అడవిలో ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు నరికి పోగులు పెడ్తుంటారు. వాటిని చూసి సిన్నోడికి, ఓబికి జాలి కలుగుతుంది. స్మగ్లర్ల పట్ల కోపం, ద్వేషం కలుగుతాయి. ఈ ఘోరాన్ని ఆపేదెలా అని సిన్నోడు ఆలోచించాడు.
ఒకరోజు గొర్రెలున్న మందల దగ్గరకు ఎవరో కొత్తవాళ్ళు ముగ్గురు వస్తారు. వాళ్ళు గతంలో ఎర్రచందనం నరికే కూలివాళ్ళు. తర్వాత ఆ పని మానేశారు. స్మగ్లర్లకు దొరకకుండా అడవిలో రహస్యంగా తిరుగుతూ, దొరికిన కాయో, పండో తిని బతుకుతూ ఉంటారు గానీ, వాళ్ళ ఊర్లకు వెళ్ళి కుటుంబంతో పిల్లా పాపల్తో జీవించలేకపోతుంటారు. కారణం, తిరిగి ఊర్లలోకి వెళ్తే పోలీసులు తప్పుడు కేసులు బనాయించి జైల్లో వేస్తారని అడవుల్లో తిరుగుతూ ఉంటారు. సిన్నోడు వాళ్ళకి రొట్టెలు పెడితే తింటారు.
స్మగ్లరు ఎక్కడ ఉంటారో చెప్పగలరా అని సిన్నోడు అడగ్గా, ఆ రాత్రికి సిన్నోడ్ని, గొర్రెల కాపర్లలో యువకుల్ని వాళ్ళతో తీసుకుపోతారు. వాళ్ళని వెతుక్కుంటూ అర్థరాత్రి వాళ్ళ స్థావరాలకు వెళ్తారు. మందలో పెద్దవాళ్ళకు ఈ విషయం తెలీదు.
అక్కడికెళ్ళి వడిసెలతో రాళ్ళ వర్షం కురిపించి, శత్రువుని ఉక్కిరి బిక్కిరి చేసి, చడీ చప్పుడు కాకుండా వచ్చేస్తారు. వీళ్ళెవరో స్మగ్లర్లకి అంతుచిక్కదు. సిన్నోడు, ఓబి మందలో వాళ్ళకి స్మగ్లర్లు ఎదురై ‘కొత్తవాళ్ళు ఎవరన్నా తిరుగుతున్నారా’ అని ఆరా తీస్తారు. అప్పుడు ‘అవును ఇరవై మంది దాకా అన్నలు తిరుగుతున్నార’ని వాళ్ళకు అబద్దం చెప్పి భయపెడతాడు సిన్నోడు. అలాగైనా ఎర్రచందనం నరక్కుండా భయపడతారని.
వారానికోసారి దగ్గర్లోని మైదానంలో ఉండే ఊరికి వెళ్తే అక్కడికి ఆటోలో ఊరినుంచి రొట్టెలు తెచ్చి ఇచ్చేవాళ్ళు. అక్కడి కాయిన్స్‌ ఫోన్‌ డబ్బాలో నుంచి ఫోన్‌ చేసుకునేవాళ్ళు. సిన్నోడు తన స్నేహితులకు ఫోన్‌ చేసి, తన ఉద్యోగ విషయం వాకబు చేసి, నిరాశపడేవాడు.
వాళ్ళలో ఒక గొర్రెల కాపరి పుట్టినింటికి వెళ్ళిన తన భార్యకు ఫోన్‌ చేసి బాధపడుతుంటాడు. తన మరదలి పెళ్ళికి రాలేకపోయానని, ఏమీ అనుకోకు అర్థం చేసుకో అని అర్థిస్తుంటాడు భార్యని. తన తల్లికి కళ్ళు కనిపించక రొట్టెల్ని మాడ్చి పంపుతోందని, వెంటనే తమ ఇంటికి వచ్చేయమని ప్రాధేయపడుతుంటాడు. కళ్ళ నీళ్ళు తెప్పించే సీన్‌ ఇది.
చివర్లో పులితో పోరాటం… ఒక గట్టి దెబ్బకు చావాలిరా సిన్నోడా అని ఊర్లో వాళ్ళ తాతగారు నూరిపోసిన ధైర్యం, సూక్ష్మం అన్నీ గుర్తొచ్చి ఒక్క బండరాయి తీసుకుని పులి నెత్తిమీద ఒకే ఒక దెబ్బ వేసి చంపేస్తాడు.
అడవిలో పులి ఎప్పుడు ఎదురైనా సిన్నోడికి, పట్నంలో తాను ఎదుర్కొన్న ఉద్యోగ ఇంటర్వ్యూలలో భయం లాంటి భయమే కనిపించేది.
అడవిలో కూడా ఇక గొర్రెలు తాగడానికి నీళ్ళు కరువైనప్పుడు, వర్షం కురిసి అందర్నీ ఆనందంతో మురిపిస్తుంది. ఇక ఇంటి ముఖం పడతారు గొర్రెల కాపర్లు.
వర్షాభావ కరువు ప్రాంతంలో నీటి చుక్క, గడ్డి పోచ లేక గొర్రెల కోసం గొర్రెల కాపర్లు ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఇళ్ళను వీడి అడవుల్లో క్రూరజంతువుల మధ్య, తిండిలేక తిప్పలకోర్చి గొర్రెల్ని బతికించుకుంటారు. అదే గొర్రె కాపర్ల బతుకు.
ఈ కథను డిఎఫ్‌ఓ ఇంటర్వ్యూలో చెబుతాడు. పల్లెనుంచి పట్నానికి వెళ్ళినపుడు వెన్నుపాముని నేలకు ఆనించుకొని, ఆత్మవిశ్వాసం లేక అందరికీ భయపడేవాడ్నని, అడవిలో కొంతకాలం నివసించాక ఆత్మస్థైర్యం వచ్చిందని, ఇప్పుడు నిటారుగా, ధైర్యంగా ఉన్నాని చెబుతాడు.
పులి కూడా నేలకు సమాంతరంగా ఉండే మెడనే నోటితో పట్టి చంపుతుంది కానీ, మనిషి మెడ నిటారుగా ఉంటే అది ఏమీ చెయ్యలేదనే విషయం తనకి అర్థమైందని చెబుతాడు. సమాజంలో మనిషి కూడా అదే ఆత్మవిశ్వాసంతో
ఉండాలని, ఎవరికీ భయపడకూడదని, అనుకున్నది సాధించే వరకు ప్రయత్నాన్ని సడలించకూడదని చెబుతాడు.
సిన్నోడికి డిఎఫ్‌ఓ ఉద్యోగం వస్తుందని, తన ఆశయం నెరవేరుతుందని మనం ఆశిద్దాం.
రాయలసీమ మాండలిక భాషలో జీవం ఉట్టిపడే విధంగా సంభాషణలున్నాయి. పచ్చటి అడవి వాతావరణం,
నీళ్ళు, కొండలు, గొర్రెలు, ఆహ్లాదంగా ఉండి, మూస ధోరణికి విరుద్ధంగా ఉంది సినిమా. ఫోటోగ్రఫీ సూపర్‌. పాటలు సహజంగా వినసొంపుగా ఉన్నాయి. ఒక్కటి తప్ప, నియాన్‌ లైట్లలో హోరెత్తించే మ్యూజిక్‌, డాన్సులు లేవు, బతికిపోయాం.
ఈ సినిమా వల్ల గొర్రెల కాపర్ల జీవన విధానం, సమస్యలు, పరిష్కారాలు, వాళ్ళ ఆలోచనలు, నైపుణ్యాలు అన్నీ తెలుస్తాయి. అది మంచిదే కదా!

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.