అసమంజస చట్టాలు మాకొద్దు పి. ప్రశాంతి

యుక్తవయసు బాలబాలికలతోను, యువతీ యువకులతోను ఏర్పాటు చేసిన ఆ సమావేశం కొత్తగా చట్టం చేయ తలపెట్టిన ‘బాలికల వివాహ వయసు 21 ఏళ్ళకి పెంపు’ అంశం మీద బహిరంగ చర్చకి. ఇంతకు ముందే గ్రామాల్లోనూ, బస్తీల్లోనూ బాలల దండు, యువ సంఘాల్లో

చర్చలుజరిగాయి. ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలతో చర్చకు ప్రజాప్రతినిధుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, తల్లి దండ్రులన్ని, ఎన్‌జిఒ ప్రతినిధుల్ని ఆహ్వానించారు.
అమ్మాయిల పెళ్ళి వయసు 21కి పెంచడం వల్ల వారికి పై చదువులు చదువుకొని, ఉద్యోగాలలో కుదురుకుని, మానసిక పరిపక్వతతో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని, ఇద్దరి వయసు 21 సం॥లుగా చట్టం చేయడం జెండర్‌ సమానత్వం సాధించడమేనని వేదికమీదనున్న పెద్ద లంతా చెప్పారు. అంతకంటే ముందే పెళ్ళిళ్ళు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని కూడా చెప్పారు.
అంతా శ్రద్ధగా, నిశ్శబ్దంగా విన్న పిల్లలు వారి వంతు వచ్చినప్పుడు ఒక్కరొక్కరుగా కీలకమైన అంశాలు లేవనెత్తారు. వారి ప్రశ్నలకి సమాధానాలు కోరారు. అందరూ చదువుకోవడానికి కావల్సినన్ని కాలేజీలు లేక అడ్మిషన్లు దొరకలేదని, కోరుకున్న కోర్సులు లేక దూరం వెళ్ళి చదువుకోలేక ఏదో ఒకటని సరిపెట్టుకుంటున్నామని, సరిపడేంతమంది టీచర్లు, లెక్చరర్లు లేక ఆ చదువూ అంతంత మాత్రంగా ఉందని, ఈ మధ్యే ఇంటర్‌లో చేరిన కవిత, అంజమ్మ, సోని, రవి, సలీం వాపోయారు. ఆయేషా లేచి తను బాలసంఘం పిల్లలు, అక్కా వాళ్ళ సాయంతో ఎంతో కష్టంమీద అమ్మానాన్నని ఒప్పించి కాలేజీలో చేరానని, కానీ ఊరికి బస్సు లేక రోజూ ఆటోలో వెళ్ళి రావడం కష్టంగా ఉందని, ఎప్పుడో వచ్చే స్కాలర్‌షిప్‌ తన ప్రయాణ ఖర్చులకి ఉపయోగ పడదని, తనలాంటి వాళ్ళు తమ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇరవై మంది దాకా ఉన్నారని చెప్పింది. కిషోర్‌ అందుకుని హైస్కూల్‌కి వెళ్ళడానికి మారాం చేసి వాళ్ళ నాన్న బాయికాడికేసుకెళ్ళే పాత సైకిల్‌ని సాధించుకుని పదో తరగతి పూర్తి చేసేటప్పటికి తనకైతే సైకిల్‌ రిపేర్‌ చేయడం వచ్చేసింది కానీ సైకిల్‌ పని ఐపోయిందని చెప్పాడు. వాగు దాటి వెళ్ళాల్సిన తమ ఊరికి ఆటోలు రావని, హాస్టల్‌ కూడా లేకపోవడంతో తన చెల్లి హైస్కూల్‌ చదువు పూర్తి చేయడం అనుమానమేనని అన్నాడు.
అనూష బ్రైట్‌ స్టూడెంట్‌. హైస్కూల్‌, ఇంటర్‌లో మంచి మార్కులతో జిల్లాలో టాప్‌ టెన్‌లో ఒకరిగా నిలిచింది. తనకి ఎటువంటి రిజర్వేషన్‌ లేదని, దాతల సాయంతో తన తండ్రి కష్టంమీద ఇంజనీ రింగ్‌ చదివిస్తున్నారని, క్యాంపస్‌ సెలక్షన్‌లో ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, లాస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలవగానే చేరతానని అంది. కానీ తను గ్రూప్స్‌ రాయాలనుకుంటోందని, వివాహ వయసు పెంచడం మీదకన్నా 33% రిజర్వేషన్‌ని 50%కి పెంచడంమీద, అమ్మాయిలకి నైపుణ్య శిక్షణతో పాటు సెక్యూర్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కల్పించడం మీద దృష్టి పెట్టాలని కోరింది.
అన్నీ వింటున్న బాలమణి లేచి రిజర్వేషన్‌
ఉన్న తన పరిస్థితీ అనూషకన్నా వేరేగా ఏమీ లేదని అంటూ గైడ్‌ చేసే టీచర్లు లేక పదో తరగతి తప్పినప్పుడు ఇంట్లో పెళ్ళి చేసేస్తామన్నారని, బాలసంఘంలో నేర్చుకున్న విషయాల ద్వారా అర్థమై ఉద్యోగం తెచ్చుకున్నాకే పెళ్ళి చేసుకుంటానని ఇంట్లోవాళ్ళతో కొట్లాడి, బ్రతిమాలి, ఒప్పించి చదువుకుంటున్నానని, ఇంకా తనమీద పెళ్ళి ఒత్తిడి లేకపోలేదని చెప్పింది. అయినా తన పట్టు వదలనని, పెళ్ళి వయసు 18 ఉన్నా, 21 ఉన్నా డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం తెచ్చుకున్నాకే పెళ్ళి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్న తనలాంటి వాళ్ళకి చట్టంలో చెయ్యాలనుకుంటున్న ఈ మార్పు అనవసరమని గట్టిగా చెప్పింది. బాలసంఘం ద్వారా అక్కావాళ్ళు కల్పించిన ఈ అవగాహనని ప్రభుత్వం అందర్లో కల్పించగలిగితే, పై చదువుల అందుబాటు, ఉద్యోగా వకాశాలు కల్పించగలిగితే చట్టంలో మార్పుతో పనేలేదని, అదెందుకు చెయ్యరని ప్రశ్నించింది.
రజిని లేచి ‘నాది కూడా వినండి. మా ఊర్లో బళ్ళో ఐదు తరగతులకి ఒకే సారు ఉండేవాడు. మాకు ఆటలమీదే ధ్యాస ఉండె. దాంతో ఐదో తరగతి అయిపోయినా రాయటం, సదవటం బాగా రాలె. కష్టం మీద పక్కూరికి బోయి ఏడు వరకు సదివిన. ఇగ నావల్ల గాక ఎనిమిదిలో బందు బెట్టిన. ఇప్పుడు కూలికి పోతాన్న. మా బావంటె ఇష్టం. పెళ్ళి చేసుకునేటోళ్ళమే. సంఘంల తెల్సుకున్న ఇసయాల బట్టి 18 ఏళ్ళ వరకు ఆగుదామనుకున్నం, ఆగినం. గిప్పుడీ ఇసయం తెల్వబట్టె. ఇంగ మూడేండ్లు ఆగవంటె నేనేం సెయ్యాల? మా బావకిప్పుడు 23, ఆయనాగుతడా!!’… అందర్నీ నిలదీసింది.
లక్ష్మి అందుకుని ‘నేను పది చదివిన. పై చదువులు చదవాలని లేదు. వ్యవసాయం ఇష్టం. రోజూ చెల్కకి బోత. అవ్వ, అయ్యలకి తోడుంట. ఓనాడు పన్యాక మధ్య రాత్రిల్ల మనిషి మీదబడి నట్టైతే నిద్రలోకెల్లి లేసి లొల్లిజేసిన. పారిబోతు న్నోన్ని ఒడిసిబట్టిన. గింజుకున్న వదల్లె. ఇంట్ల, సుట్టుపక్కల అందరూ లేసొచ్చిన్రు. సూస్తె మా నాయన! దిమ్మ తిరిగినట్టైంది. దినమంత పంచా యితైంది. తాగిన మైకంల తప్పుజేసిన అన్నడు. కాల్మొక్కిండు, ఇగ తాగనని ఒట్టు పెట్టిండు. ఆర్నెల్లాయె. ఈనాటికీ ఈ ఇంట్ల నాకు భయమై తనే ఉంటది, నిద్రబట్టది. పెళ్ళి జేస్కుని పోదా మంటె 18 నిండనీకి ఇంకో రెణ్ణెల్లుంది. ఇప్పుడు 21 అంటే ఇంకో మూడేండ్లు నేను నిద్రమాను కోవాలె, లేదా ఇంట్లకెల్లి పారి పోవాలె. ఏం సెయ్యమంటరు నన్నిప్పుడు’ అంటూ ఏడ్చేసింది.
‘ముందు వీటన్నిటికీ పరిష్కారాలు అవసరం కానీ పెళ్ళి వయసు పెంచుతూ కొత్త చట్టం చేయడం కాదు. పట్నం పరిస్థితులు, డబ్బున్నోళ్ళ పద్ధతులు మాకు కుదరవు. మా జీవితాలు ముఖ్యం కాదా? పల్లెల్లో పరిస్థితులు మార్చకుండా ఎన్ని చట్టాలు చేసినా అవి అటకెక్కాల్సిందే. ఇప్పటికే 18 ఏళ్ళు వచ్చేవరకు ఎంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పెళ్ళి ఆపుతున్నారు? అలా పెళ్ళిళ్ళు చేసేసిన వాళ్ళెవరిమీదా ఇప్పటిదాకా కేసులు పెట్టలేదే? ఎలాంటి చర్యలు తీసుకోలేదే? మరిప్పుడు ఈ కొత్త చట్టంతో ఏం ఉపయోగం? మాలాంటి అమ్మాయిల మీద మరింత మానసిక ఒత్తిడి తప్పించి. నిజంగా చదువుకోవాలనుకుంటున్న అమ్మాయిలకీ, చదివించాలనుకుంటున్న అమ్మానాన్నలకి అసలీ చట్టం ఉన్నా, లేకపోయినా ఒకటే. ఆలోచించమని ప్రార్ధిస్తున్నా’ అంటూ యువ సంఘం సభ్యులు రాజేష్‌, మౌనిక కోరారు.
‘సమానత్వం ఆడపిల్లని పుట్టనివ్వడంలో, తిండి, బట్ట, చదువు, ఆట, పాట, అవకాశాలు కల్పించడంలో, తమకేం కావాలో ఎంచుకోని వ్వడంలో, నిర్ణయాలు తీసుకోనివ్వడంలో చూపించా ల్సిన అవసరం ఇంకా చాలా మిగిలే ఉంది. కానీ అవన్నీ పక్కనపెట్టి పెళ్ళి వయసు ఇద్దరిదీ సమానం చెయ్యడంతో సమానత్వం వస్తుందంటే మరి అబ్బాయిల పెళ్ళి వయసు 18కి తగ్గించొచ్చుగా! జువెనైల్‌ వయసు 16కి తగ్గించాలన్నట్టుగా!’ అంది కార్యకర్త మంజుల.
‘పాలకుల్నే ఎంపిక చేసుకోగలమని 18 ఏళ్ళకే ఓటుహక్కు ఇచ్చినప్పుడు ఆ వయసుకి మా జీవితాల్ని నిర్ణయించుకోలేమని ఎందుకు అనిపించింది? ఇందులో రాజకీయం ఏమీ లేదని ఎలా నమ్మాలి? అసలిది ఎంతవరకు సమంజసం?!’ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది అరుణ. ‘బాల్యమంటే 0`18 ఏళ్ళని లోకమంతా ఉన్నప్పుడు మేం మాత్రం వేరు, మా దేశంలో బాలలంటే 21 ఏళ్ళవరకు అంటే అంతర్జాతీయ ఒడంబడికలు, చట్టాలు, తీర్మానాలు మనకి వర్తించవా!! ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టె దొకదారి అన్నట్టే ఉందిది’ అక్కసుగా అన్నాడు యువ వాలంటీర్‌ మోహన్‌. ఈ సమంజసమైన ప్రశ్నలకి ఆధికారులెవ్వరి దగ్గర జవాబుల్లేవు.
ఇక్కడే కాదు దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగిన కన్సల్టేషన్లలో ఏడెనిమిది వేలమంది యుక్తవయస్కులు ఇలానే వ్యక్తీకరించారు. అయినా ఇది పరిగణనలోకి తీసుకోకుండా యూనివర్శిటీలు, పట్టణ వాసులు, ధనిక వర్గాలు, అభివృద్ధిని నిర్ణయించేది మేమే అను కునే రాజకీయ నాయకుల దృష్టికోణంనించి చూసి ఉపయోగం లేని ఇలాంటి చట్టాలు చేస్తే అటకెక్క డానికి ఇంకో చట్టాన్ని సిద్ధం చేస్తున్నట్లేగా!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.