భారతదేశపు ప్రప్రథమ ఉపాధ్యాయిని సావిత్రీబాయి – కొండవీటి సత్యవతి

సావిత్రీబాయి ఫూలే… భారతదేశ స్త్రీలు నిత్యం తలచుకోవాల్సిన పేరు. కానీ, పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం కదా! సంస్కర్తలంటే మనకు పురుషులే గుర్తొస్తారు. రాజారామ్మోహన్‌ రాయ్‌, కందుకూరి వీరేశలింగం వగైరాలు గుర్తొస్తారు కానీ సావిత్రీబాయి,

భండారు అచ్చమాంబ లాంటి వాళ్ళు గుర్తురారు. వాళ్ళను తలచుకోనీయకుండా పురుష ప్రపంచం అమలు చేసిన పన్నాగ ఫలితం. బెంగాల్‌లో సతీసహగమన దురాచారం గురించి పోరాడిన రాజారామ్మోహన్‌ రాయ్‌ భారతదేశమంతా ప్రఖ్యాతి గాంచాడు. స్త్రీల చదువు కోసం అహర్నిశలు పోరాడిన సావిత్రీ బాయి మాత్రం మహారాష్ట్రకే పరిమితమైపోతుంది. మహార్‌, మాండ్‌ కులాల కోసం మాత్రమే ఉద్యమం నడిపినట్లు ముద్రవేసి ఆమెను చరిత్ర చీకటిలోకి తోసేస్తారు. చరిత్ర పొడుగునా స్త్రీలకు జరిగిన అపచారం అంతా ఇంతా కాదు. తెలుగులో తొలి కథ రాసిన భండారు అచ్చమాంబను వెనక్కి తోసేసి నిన్న మొన్నటివరకు గురజాడ అప్పారావే తొలి కథకుడు అంటూ చరిత్ర వక్రీకరణ కొనసాగింది. ఎంతో పోరాటం తర్వాత మాత్రమే ఆమెను అంగీకరించడం జరిగింది.
సావిత్రీబాయి ఫూలే విషయంలోనూ అదే జరిగింది. భారతదేశంలో సామాజిక విప్లవానికి అవిరళ కృషి, పోరాటం చేసిన జ్యోతిరావ్‌ ఫూలే భార్యగానే సావిత్రిని పరిమితం చెయ్యడం వెనుక పనిచేసింది పురుషస్వామ్యమే. తొలుత ఆమెను జ్యోతిరావ్‌ భార్యగానే గుర్తించారు. 19వ శతాబ్దంలో స్త్రీల విద్య కోసం ఆమె చేపట్టిన ఉద్యమం మరుగునే ఉండిపోయింది. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్య కోసం, ముఖ్యంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాలు, కులాలు, స్త్రీల కోసం ఆమె స్థాపించిన పాఠశాలలు… ఇవన్నీ పరిగణనలోకి, ప్రచారంలోకి రానే లేదు.
తొలి ఉపాధ్యాయురాలిగా సావిత్రి చేసిన కృషిని, ఆమె స్త్రీ కాబట్టి పక్కకు నెట్టేసి, ఏ మాత్రం గుర్తించకుండా పురుషుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరుమీద ఉపాధ్యాయ దినోత్సవం జరపడం అనేది సావిత్రీబాయి పట్ల జరిగిన అపచారం, అన్యాయం. ఇక్కడ కాలం, జెండర్‌, ఆధిపత్య వర్గాల అభిజాత్య ధోరణులు ప్రస్ఫుటంగా కనబడతాయి. జనవరి 3వ తేదీ సావిత్రీబాయి జన్మదినం. ఇకనుంచైనా ఖచ్చితంగా ఉపాధ్యాయ దినాన్ని సెప్టెంబర్‌ 5న కాక జనవరి మూడున జరపాలి. ఇది భారతీయ స్త్రీలందరికీ గర్వకారణమౌతుంది.
భండారు అచ్చమాంబ లాగానే సావిత్రీబాయి స్త్రీ విముక్తి చదువు ద్వారానే సాధ్యమౌతుందని బలంగా నమ్మింది. అచ్చమాంబ ఎన్నో వ్యాసాలను, కథలను రాసి స్త్రీ విద్య ఆవశ్యకత గురించి ప్రచారం చేసింది. అయితే సావిత్రీబాయి మరింత ముందుకెళ్ళి స్త్రీ చదువుకోవాలని చెప్పడంతో పాటు, ఉపాధ్యాయురాలై, పాఠశాలలు నిర్మించి ఆచరణ మార్గం పట్టింది. ఆమె బతికిన కాలానికి అదెంత విప్లవాత్మకమైన చర్యో ఈనాటి తరానికి ఊహకు కూడా అందదు. ఎన్నెన్నో అవమానాలను, దాడులను ఎదుర్కొని ధీరోదాత్తగా పోరాడిన వీర వనిత సావిత్రీబాయి ఫూలే. సావిత్రి, ఆమె భర్త జ్యోతిరావు ఎలాంటి అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఆమె రాసిన క్రింది ఉత్తరంతో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉత్తరం ఆమె ఎంతో ప్రేమతో జ్యోతిరావుకు 1856లో రాసింది. ఆమె అనారోగ్యంతో పుట్టింట్లో ఉన్నప్పుడు రాసింది. తన సోదరుడు తననెలా విమర్శించిందీ ఇందులో రాసింది.
‘‘అంటరాని వాళ్ళ (మహర్‌, మాంగ్‌లు) కోసం నువ్వు, నీ భర్త చేస్తున్న సేవలకు మిమ్మల్ని ఇప్పటికే కులం నుండి వెలివేశారు. ఆ తక్కువ జాతి మనుషులకు సాయం చెయ్యడానికని మీరు మన కుటుంబానికి మచ్చ తెస్తున్నారు. ఇప్పటికన్నా కుల ధర్మాన్ని తెలుసుకుని, బ్రాహ్మణులు చెప్పినట్టు నడుచుకుంటే మంచిది’’ అని హెచ్చరించినప్పుడు ఆమె ‘‘మేకలూ, ఆవులూ లాంటి జంతువులన్నింటినీ ప్రేమగా నిమురుతావు. వాటిపట్ల అంటరానితనమనే భావన లేదు. విషం గక్కే నాగుపాముకూ నాగులచవితినాడు పాలు పోస్తావు. కానీ, మన సాటి మనుషులైన మహర్‌లనూ, మాంగ్‌లనూ అంటరాని వాళ్ళుగా దూరంగా ఉంచుతావు. ఈ ఆచారంలో ఏమన్నా అర్థముందా చెప్పు? ఆ బ్రాహ్మణులు మడికట్టుకుని పూజలు చేసేటపుడు నిన్నూ అంటరానివాడిగానే చూసి, దూరంగా ఉంచుతారు. మహర్‌లకు, నీకూ వాళ్ళ దృష్టిలో తేడా ఏమీ లేదు’’ అన్నానని రాసింది. ఈ ఉత్తరంలో సావిత్రీబాయి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆ కాలానికి చాలా తీవ్రమైనవి. విప్లవాత్మకమైనవి. ఆమెలో ఎగిసిపడిన ఆ ధైర్యానికి, సాహసానికి తలవంచి నమస్కరించాల్సిన భారతీయ స్త్రీ సమాజం ఆమె ఉనికినే గుర్తించలేకపోవడమంత విషాదం మరొకటి లేదు. ఇది చరిత్ర స్త్రీలకు చేసిన ద్రోహం.
నిజానికి భారతదేశంలో ఆధునిక వ్యవస్థల నిర్మాణం కోసం, స్త్రీల విద్య కోసం, పీడిత కులాల విద్యావకాశాల కోసం అలుపెరుగని పోరు సల్పిన సావిత్రీబాయిని తల్చుకోకుండా ఆయా పోరాటాలు అసంపూర్ణాలే. స్త్రీలూ, పీడిత కులాలకు విద్యావకాశాల కోసం జరుగుతున్న పోరాటాల గురించి ప్రస్తావించుకోవాలంటే తొలుత మాట్లాడాల్సింది సావిత్రి గురించే. జ్యోతిరావు చేసిన సమస్త పోరాటాలకు వెన్నుదన్నుగా నిల్చిన పోరాట శిఖరం సావిత్రీబాయి.
సావిత్రి ఉద్యమ కారిణిగానే మిగిలిపోలేదు. రచయిత్రిగా నాలుగు గ్రంథాలను ప్రచురించింది. ఆమె అద్భుతమైన కవితలు రాసింది. ‘‘ఆత్మగౌరవంతో, కఠిన దీక్షతో
జ్ఞాన సంపదలు సేకరించుకో
విద్య లేనిదే జీవితం వృధా
కులవ్యవస్థ సంకెళ్ళను తెంచి విద్యనందుకో
బ్రాహ్మణీయ శాసనాల దిక్కరించు వెంటనే’’
ఈ కవితలో ఆత్మగౌరవం గురించి, విద్య గురించి, కుల వ్యవస్థ గురించి, బ్రాహ్మణీయ శాసనాల గురించి చాలా స్పష్టమైన అవగాహనతో రాసిన సావిత్రీబాయికి ఆయా అంశాల పట్ల ఉన్న క్లారిటీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఆ కవిత్వం నిన్నా మొన్నా రాసింది కాదు… పందొమ్మిదో శతాబ్దపు చివరి పాదంలో రాసింది. మనువాద, బ్రాహ్మణీయ భావజాలం సర్వత్రా కమ్ముకుని ఉన్న కాలం. అణగారిన కులంలో పుట్టిన ఒక స్త్రీ ఇలాంటి తిరుగుబాటు బావుటాను ఎగరేయడం సహించలేని కాలం. అలాంటి సమయంలో ‘‘బ్రాహ్మణీయ శాసనాలు ధిక్కరించు’’ అని ఎలుగెత్తగలిగిన సావిత్రి భావపరంపరను ఆనాడే అందిపుచ్చుకొని ఉంటే… భారతీయ సమాజం ఉన్నతంగా సంస్కరించబడి ఉండేది. స్త్రీల పురోభివృద్ధి వేగవంతమై ఉండేది. దళితులు, అణగారిన కులాలు, వర్గాల మీద అమలవుతున్న పీడన, దోపిడీ, వివక్ష అంతమై ఉండేవి. ఈ భయంతోనే, ఈ గగుర్పాటుతోనే సావిత్రీబాయిని ప్రధాన స్రవంతిలోకి రానీయకుండా, ఆమె గురించి ప్రచారం లేకుండా, ఆమె భావాలు విస్తరించకుండా విజయవంతంగా మరుగున ఉంచగలిగారు.
అందుకే, చరిత్రను తిరగతోడడం అవసరం. చరిత్ర చీకటిలో మిణుకు మిణుకుమంటున్న వెలుగురవ్వల్ని వెలికి తీయడం మన బాధ్యత. కులాల ప్రసక్తిలేని పాఠశాలను ప్రారంభించి, పాఠాలు చెప్పడానికి వడివడిగా నడుస్తున్న సావిత్రి మీద పేడముద్దలు పడినా ఆమె లక్ష్యంవైపే నడిచి వెళ్ళిపోయింది. అదరలేదు… బెదరలేదు… ఆమె వేసిన దారుల్లో నడవడమే మన ముందున్న కర్తవ్యం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.