జీవితంలో అన్నీ అందుబాటులో ఉన్నా, మనిషి సుఖాలనుకునేవన్నీ సమకూరుతున్నా ఏదో అసంతృప్తి మనిషిని మరణం వైపు నెడుతున్న సమాజంలో జీవిస్తున్నాం. వీటి వెనుక కారణాలను అన్వేషించే ముందు అసలు జీవితాన్ని చాలించాలనుకునే వ్యక్తులలోని అసంతృప్తులను అర్థం చేసుకునే ప్రయత్నమన్నా చేశామా అనే ప్రశ్న మనల్ని మనం ఒకసారి
వేసుకోవాలి. పితృస్వామ్య వ్యవస్థలో అణచివేతనే సంస్కరించడం అనే భావనతో పెరిగిన స్త్రీల మనసులోని అసంతృప్తిని సాటి స్త్రీలే ఎంత వరకు అర్థం చేసుకుంటున్నారన్నది ఒక పెద్ద ప్రశ్న. అలాంటి ఇద్దరు స్త్రీల మనసు పొరలలోకి వెళ్ళి వారి వేదనను పరిచయం చేస్తూ జీవితేచ్ఛ చంపుకున్న ఆ రెండు మనసుల వెతను మన ముందుకు తీసుకువచ్చే నవల జలంధర గారు రాసిన ‘రచయిత్రి ఆత్మహత్య’.
‘‘అన్నీ బావుంటే అందరూ ఉంటారు. కానీ మనకేం కావాలో ఎవరికీ అక్కర్లేదు. ఎంతసేపూ వాళ్ళ లెక్కల ప్రకారం మనం ఉండాలనుకుంటారు. ఆ రకంగా మనని వాళ్ళ చట్రాల్లో బిగించి సుఖపెడదామనుకుంటారు. మనం దొరక్క తప్పించుకుంటే ఎదురు తిరిగామని ఏడుస్తారు…’’ మనుష్యులందరినీ తమలోకి తొంగి చూసుకొమ్మని చెప్పే వాక్యాలు ఇవి. జలంధర గారి ‘‘రచయిత్రి ఆత్మహత్య’’లో ఇలాంటి వాక్యాలెన్నో ఆలోచింపచేస్తాయి. ఈ ప్రపంచాన్ని అర్థాంతరంగా కొందరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అకాల నిష్క్రమణ వెనుక కారణాలను నిజాయితీతో వెతికే ప్రయత్నం మనం చేయం. మనకి తెలుసు ఆ కారణాలను అన్వేషిస్తే మనలను మనం మరో రూపంలో చూసుకోవలసి వస్తుందని మనకు భయం. మన ఉనికిని, మన ఆలోచనను, మన అంతరంగాన్ని మనమే విశ్లేషించుకుని చూసుకోవలసి వస్తే ఈ సమాజంలో బాధ తెలియకుండా జీవించడానికి, భౌతిక సుఖాలవైపు ప్రయాణించడానికి మనం ఎన్నిసార్లు, ఎన్నిచోట్ల రాజీపడుతున్నామో ఒప్పుకోవలసి వస్త్తుంది. అది భరించలేం. అందుకే మనం చనిపోయిన వ్యక్తి మరణం అతని చేతకానితనమని, పిరికితనమని చెప్పి మనల్ని మనం కాపాడుకుంటాం. ఆ అవకాశం ఇవ్వకుండా మనల్ని ఒకసారి మన మనసుల్లోకి తొంగి చూసుకొమ్మని ఉమ పాత్ర ద్వారా ఈ నవలలో చెప్తారు జలంధర గారు.
గొప్పింటిలో పుట్టి జీవితంలో డబ్బు, దాంతో కొనగల అన్ని సౌకర్యాలూ ఉన్నా కూడా అందమైన, స్థితిపరుడైన భర్త ఎన్నో కానుకలతో తనను సంతోషపెడుతున్నా కూడా ఒక పాతిక సంవత్సరాల అమ్మాయి భర్త దగ్గరికి వెళ్తూ రైలులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమే ఈ నవలలో రచయిత్రి ఉమ. ఉమ మేనమామ శంకరం ఆమె మరణం వెనుక రహస్యాన్ని కనుక్కోవాలనుకుంటాడు. ఉమ మరణం ఆమె తల్లిదండ్రులను కూడా లాభనష్టాల ఆలోచనలో మాత్రమే ఉంచితే, ఆ ఇంట్లో పనివాడిగా ఉన్న లక్ష్మణ్ మాత్రమే ఉమలోని మరో మనిషిని చూశానని, ఆమె ఒక దేవతని, ఈ మనుషుల మధ్య బ్రతకలేక ఆత్మహత్య చేసుకుందని చెబుతాడు. లక్ష్మణ్‌కీ, ఉమకీ మధ్య ఏదైనా ప్రేమ వ్యవహారం నడిచిందేమో అనుకున్నా, అది సాధ్యపడదని తెలుసుకుంటారు శంకరం. అప్పుడు విరించి అనే ఒక పత్రికలో పనిచేసే వ్యక్తికి ఉమ రాసిన ఆఖరి ఉత్తరం చేరుతుంది. ఆ ఉత్తరం ఉమ లాంటి ఎందరో స్త్రీల వేదనను పరిచయం చేస్తుంది.
తన భావుక ప్రపంచానికి, తాను జీవిస్తున్న ప్రపంచానికి మధ్య చాలా తేడా ఉందని, డబ్బు తప్ప ఏ మాత్రం సున్నిత భావాలు లేని భర్త పొజెస్సివ్నెస్ని భరించలేని స్థితిలో తాను ఉన్నానని, మిధ్యా ప్రపంచికత కోసం ఆత్మను తాకట్టు పెట్టుకుని జీవచ్ఛవంలా బ్రతకలేక వెళ్ళిపోతున్నానని, ఉమ ఆ ఉత్తరంలో రాస్తుంది. ‘‘సౌకుమార్యం, సౌందర్యం, భావుకత ఇవన్నీ ఆడపిల్లల్లో ఎంత ఉండాలో అంతే ఉండాలి’’ కానీ తనలోని భావుకత స్థాయి ఈ ప్రపంచంలోని మెటీరియలిజానికి తట్టుకోలేదని, తన భర్త ఇంటికి అలంకారంగా, అతని సుఖానికి శయ్యగా, అతని అలంకారానికి హరిచందనగా, అతని అనుభవాల గదిలో అగరుబత్తిగా బతకలేక వెళ్ళిపోతున్నానని విరించితో చెప్పుకుంటుంది ఉమ. అమ్మా నాన్నలకు కూడా కూతురుగా తప్ప ఉమగా తాను తెలియనని ఆమె అన్నప్పుడు ఎంత మంది జీవితాలలో ఇది వాస్తవ వేదనో అని మనకు అనిపించక మానదు.
ఉమ ఉత్తరం చాలామంది మానసిక ఒంటరితనంలోని వేదనను వెలికి తీస్తుంది. ఈ ఉత్తరం చదవడం ఒక అనుభవం. ప్రపంచాన్ని మన దృష్టితోనే కాక సున్నిత మనస్కుల దృష్టితో చూస్తే అసలు ఈ ప్రపంచం ఇలా ఎందుకు మారిందనే ప్రశ్న మొదలవుతుంది. ఉమలాంటి కొందరు మనకు గుర్తుకు రాక మానరు. వారిని అర్ధం చేసుకునే స్థాయి మనకు లేక వారిని మనం మన తెలివిలేని తనంతో, తెలివిగా బాధపెట్టిన సన్నివేశాలు కొన్ని గుర్తుకువచ్చి తీరతాయి. తాను చిన్నప్పుడు గౌనుల్లో చూసిన ఉమ అసలు మనసు ఇదా అని శంకరం ఆశ్చర్యపోతారు. ఆమె పడిన వేదనకు కలత చెందుతారు. ఉమతో ఆత్మీయ సంబంధం ఏర్పరచుకున్న రాఘవ, విరించిలను చూసిన తరువాత ఆమెను కుటుంబంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోవడం, ఉమను ఎంత ఒంటరిని చేశాయో అతనికి అర్థమవుతుంది. జలంధర గారు ఉమ కథ చెబుతూనే విరించి వదిన సుభద్ర పాత్రను ప్రవేశపెడతారు నవలలో. ఇది రెండో కథగా వస్తుంది కానీ నవల చివరకు వస్తే కానీ ఈ పాత్ర ద్వారా రచయిత్రి చూపించాలనుకున్న మరో కోణం అర్థం కాదు.
సుభద్ర విరించి పెద్ద అన్నకు భార్య. పేదింటి ఆడబడుచు, బాధ్యత గల ఇల్లాలు. ధనవంతుల ఇంటి కోడలిగా వచ్చి ఐశ్యర్యం మాటున అహంకారాన్ని ప్రత్యక్షంగా చూసి అనుభవిస్తున్న స్త్రీ. ఆమె పెద్ద మరిది రఘు ఆమెను ఆరాధిస్తాడు. మేనత్త ఇంట పెరిగిన రఘు ఈ ఇంటి వ్యక్తులలోకి భిన్నంగా ఉంటాడు. వితంతువు అయిన రఘు మేనత్త భర్త చనిపోయిన తరువాత మతి చలించిన తన బావగారిని చూసుకుంటూ ఉండేది. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని గురించి లోకం ఎన్ని మాటలన్నా ఆమె లక్ష్యపెట్టేది కాదు. ఆ పిచ్చి బావగారు ఒకరోజు ఆమె చేతిలోనే మరణిస్తే ఆ బాధతో ఆమె ఇల్లు అమ్మేసి, పొలం రఘు పేరున రాసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిస్వార్థమైన, నిష్కళంకమైన ప్రేమ మధ్య పెరిగిన రఘు మేనత్త లేకపోవడంతో మళ్ళీ తల్లి దగ్గరకు వస్తాడు. ఆ ఇంట్లో వదిన పడుతున్న కష్టాలు చూస్తాడు. ఆమెను అభిమానిస్తాడు. సుభద్ర తనపై రఘుకున్న అభిమానం, ప్రేమను చూసి భయపడుతుంది. రఘు ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. వీరిద్దరి మధ్య ఏదో ఉందని సుభద్ర ఆడపడుచే పుకారు పుట్టిస్తుంది. దానికి అత్తగారు తోడవుతుంది. సుభద్ర భర్త భార్యను దూరం పెట్టి పనిమనిషితో సరసం మొదలెడతాడు. తాను ఎందుకు శిక్ష అనుభవిస్తోందో, తన తప్పేం ఉందో సుభద్రకు అర్థం కాదు. రఘు వదిన బాధ చూడలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. డబ్బు సంపాదనలో పడిపోతాడు. తన స్వభావానికి ఏ మాత్రం సరిపోని ఒక అహంకారపు స్త్రీని ఇష్టపడి ఆమెకు భర్త అవుతాడు.
సుభద్రపై నింద వేసి దాన్ని తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకుని ఆమెను జీవచ్ఛవంలా చేస్తుంది ఆ కుటుంబం. అయినా భర్తకు లొంగిపోయి, ఆ ఇంట్లో వారికి సేవలు చేస్తూ తన ఆలోచనలను, మనసును నిద్రపుచ్చి నిర్వికారంగా జీవిస్తుంటుంది సుభద్ర. ఆమెను చిన్నప్పటి నుంచి చూసి, ఆమె జీవితాన్ని పరిశీలిస్తున్నాడు కాబట్టే విరించికి ఉమ రాసిన ఉత్తరం అర్థమవుతుంది. మనసు చంపుకున్న స్త్రీ జీవితం ఎలా ఉంటుందో అతనికి తన వదినను చూస్తే అర్థమవుతుంది. ‘‘తనలో జీవిని అంతర్ముఖం చేసుకుని తనకు జీవితేచ్ఛను చంపేసిన మనుష్యులకు తనువు వంచి నమస్కరింపజేసే ఈ వ్యవస్థలో ఏదో గొప్ప ఔన్నత్యమన్నా ఉండాలి, పర్వర్టిజమన్నా ఉండాలి’’. సుభద్రను బ్రతికి ఉండగానే శవంలా మార్చిన తమ కుటుంబాన్ని చూసిన తరువాత ఉమ దేనికి భయపడిరదో, ఏ జీవితం వద్దనుకుందో విరించికి అర్థమవుతుంది. అందుకే ఉమ ఆత్మహత్యను బాధతోనే అయినా స్వీకరించగలుగుతాడు అతను. ఉమ మేనమామ శంకరం, రామేశం అనే స్నేహితునితో ఉమ గురించి చెప్పినప్పుడు రామేశం గారు తన గతం గురించి చెప్తారు. ఒక ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ అయిన ఆయన ఈ సమాజంలోని కుళ్ళు, కుతంత్రాల మధ్య బ్రతకలేక, తన మనసుని చంపుకుని జీవించలేక తన ఉద్యోగాన్ని, హోదాని వదిలి ఒక అనామకునిగానే చిన్న పనులు చేసుకుంటూ భార్యతో పాటు జీవిస్తుంటారు. సమాజంతో ఇమడలేక, తన విలువలను చంపుకుని బ్రతకలేక, అలా వచ్చే ధనాన్ని అనుభవించలేక ఆ జీవితం వద్దని పేదరికాన్ని కోరుకుంటారు ఆయన.
‘‘ఎంతవరకూ నా కుటుంబ స్థాయిని ఆర్థికపరంగా సంఘంలో పెంచగలమో అనేదాన్ని బట్టి నా మనుష్యులు నాకు ఖరీదు కడుతున్నారు. జనానికి కాలక్షేపానికి నాలుగు కొటేషన్స్ వాడుకోగలిగింది అయిన సూడో ఇంటల్లెక్చువాలిటీ ప్రతిఫలించే సాహిత్యం కావాలి తప్ప ఆలోచింపచేసి, తన అస్థిత్వాన్ని జ్ఞానసాగరాల్లో ముంచి తేల్చే ఏ కళా, కావ్యమూ ఎవ్వరికీ అక్కర్లేదని బాధపడే ఎడిటర్ రాఘవ కూడా ఒక రకంగా రాజీపడి జీవిస్తున్న రచయితే. తనదైన సాహిత్యపు ప్రపంచాన్ని కలల్లో నిర్మించుకుని దానిలో మునిగితేలుతూ వాస్తవాన్ని మనసుకు పట్టనీయకుండా జీవిస్తుంటాడు రాఘవ. అతని కలల ప్రపంచంలో మౌన నేస్తం, అతను ఆరాధిస్తున్న ఉమ. ఆమె మరణం, చివరి ఉత్తరంలో తన ప్రస్తావన వచ్చినప్పుడు భార్య చూసే అనుమానపు దృష్టి ఇవన్నీ మౌనంగా భరించడానికి తన సాహిత్య ప్రపంచంలో మునిగిపోతాడు అతను. రాఘవలానే సమాజాన్ని పరిశీలించిన రామేశం తన జీవితానికి ఒక పరిధిని నిర్మించుకుని తనలోకి తాను చూసుకుంటూ, ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నంలో మరో మానసిక ప్రపంచాన్ని తానుగా సృష్టించుకుని జీవిస్తున్నారు. ఉమను పూర్తిగా అర్థం చేసుకుంది రామేశం గారే. అందుకే మరణం ఆమెకు ప్రశాంతతనివ్వదని, ఆమె మానసిక శాంతికి తామంతా ధ్యానం చేయాలని చెబుతారు.
ఉమ కూడా తన ఉత్తరంలో ‘‘జీవన పోరాటంలో థాట్‌ను పాడు చేసుకోకండి. నెగిటివ్ థింకింగ్‌కు అలవాటు పడకండి’’ అని రాస్తుంది. కానీ తనకు మరో దారి లేదని మృత్యువును జీవితానికి మరొక ద్వారంగా అవతలి ఒడ్డుగా, గొంగళి పురుగు స్టేజి నుంచి మారే సీతాకోక స్థితిలా తీసుకుంటుంది. సుభద్ర జీవిస్తూనే మృతజీవిగా మారిపోతుంది. రాఘవ తన బాధను మౌనంగా సహిస్తూ కాల్పనిక ప్రపంచంలోకి తప్పించుకుంటూ సాహిత్యం చాటున జీవిస్తుంటాడు. రామేశం అన్నింటినీ, అందరినీ వదిలి తనలోకి తాను చేరుకునే ఆధ్యాత్మికత వైపు ప్రయాణిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ సమాజంలో పరిస్థితుల మధ్య తమలా తాము బ్రతకలేని నిర్భాగ్యులే. కానీ సమాజానికి ఇటువంటి వ్యక్తుల అవసరం ఉంది. ఇలాంటి వారి నిజాయితీపైనే సమాజం ఆరోగ్యంగా ఎదిగే ఆస్కారం ఉంది. కానీ వీరంతా ఎవరికి తోచిన మార్గంలో, వారు సమాజం నుండి తమను తాము వేరు చేసుకుంటుంటే వారి దూరం వల్ల పేరుకుంటున్న నిర్వికారపు నైరాశ్యం జీవించి ఉన్న వారిని కనపడనీయకుండా ఆక్రమించుకుంటుంటే కూడా అర్థం కాని అయోమయంలో పడి ఉన్నాం అందరం.
‘‘రచయిత్రి ఆత్మహత్య’’ నవల ఇలాంటి వ్యక్తులను అర్థం చేసుకొమ్మని అర్ధిస్తుంది. మనలో రావలసిన మార్పుని, మనలో మరణించిన సున్నితత్వం వీరి నిష్క్రమణానికి కారణమని అర్థం చేసుకొమ్మని అర్ధిస్తుంది. ఈ సమాజంతో కలిసి బ్రతకలేని వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. వారిని వారి వారి ప్రపంచాలకు పోగొట్టుకుంటున్న మనం మరింతగా కఠినమైన స్థితిలోకి నెట్టివేయబడుతున్నాం. అది మరెంతో ప్రమాదకరమైన దశ. ఈ ప్రపంచాన్ని ఆనందమయం చేయాలంటే ఈ వ్యక్తుల వేదనను అర్థం చేసుకోవాలి. వారిని ఆ స్థితికి పురిగొల్పుతున్న మన స్వార్ధాన్ని జయించాలి. మనం మనుషులుగా మారాలి. ఉమ, సుభద్ర, రాఘవ, రామేశంలను పోగొట్టుకుంటున్న మనం దురదృష్టమా అన్నది ప్రస్తుత పరిస్థితులలో అందరం వేసుకోవలసిన ప్రశ్న. ‘‘రచయిత్రి ఆత్మహత్య’’ ఆ ప్రశ్నకు జవాబు కోరుకుంటున్న రచన. మన దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలలో అత్యధిక శాతం మానవ సంబంధాలలోని వైరుధ్యాల కారణంగా జరుగుతున్నవని సర్వేలు చెబుతున్నాయి. మనిషి నాగరికత మాటున సాటి మనిషికి దూరమవుతూ అర్థంకాని పరుగులు తీస్తున్న సమయంలో మనిషి మనసుని క్రమ్ముతున్న మానసిక ఒంటరితనం ఎందరో ఆత్మహత్యలకు కారణమవుతోంది. వీటిని నివారించగలం… మనం మనుషులుగా మారగలిగితే, మరల ప్రాకృతిక జీవనానికి రాగలిగితే, మనలోని భావావేశాలను ప్రకటించుకునే స్వేచ్ఛ. గౌరవించుకోగల ఆత్మీయత ఉంటే మానసిక ఒంటరితనం కారణంగా ప్రపంచాన్ని వీడుతున్న ఎందరినో బ్రతికించుకోవచ్చు.
ఆత్మహత్య, చనిపోవాలనే కోరిక కాదు. సహాయం కోసం ఒక మనిషి చేసే ఆక్రందన… ఆలోచిద్దాం… స్పందిద్దాం. ఉమలాంటి స్త్రీలను కాపాడుకుందాం. ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తుల మానసిక సాంత్వన కోసం పనిచేసే హెల్ప్లైన్లు ఉన్నాయి. ఆత్మహత్య దిశగా ఆలోచిస్తున్న వారు, కృంగుబాటుకు గురవుతున్న వారు, ఒంటరితనంతో బాధపడుతున్న వారి కోసం పనిచేసే స్వచ్ఛంద హెల్ప్ లైన్ రోష్ని… కాల్ చేయండి 66202000, 66202001. లేదా మీ మనసులోని బాధను ఈ`మెయిల్ ద్వారా పంపండి… తీశీంష్ట్రఅఱష్ట్రవశ్రీజూఏస్త్రఎaఱశ్రీ.షశీఎ