ఆమె సమాయత్తమవుతోంది
ఒక ప్రసవ సముద్రాన్ని ఈదేందుకు…!
తనువల్లా నీరవుతోంది…
అయినా ఆ తల్లి కళ్ళు ఎదురు చూస్తున్నాయి
తొలి పంట కోసం!
చిగురుటాకులా వణుకుతోంది దేహం!
వేయి శూలాలు
ఒకేసారి కడుపున దిగబడ్డట్టు నొప్పులు!
ఆమె ఒక మరణానికి సిద్ధమైంది!
కట్టె రెండుగా చీల్చినట్టు
కాళ్ళు బార్లా చాపి
మెల్లగా భూగోళాన్ని కిందకు నెడుతోంది!
నరాలన్నీ మెలికలు తిరిగిన పాముల్లా
మెలేసిన బాధ
కండరాలు కత్తులై కోతపెడుతున్న యాతన
పంటి బిగువున అంతటి బాధని అదిమిపెట్టి
ఊపిరి బిగపట్టి ఓ పెనుకేక!
అయినా… బిడ్డ
ఇంకా తొలిదువ్వారం దాటలేదు
అసహనంగా కదలాడుతున్న ఆడపులిలా!
నులివెచ్చని నీటి తొట్టెలో…
భారంగా ముక్కిళ్ళుతూ… ఓ వేకువ కోసం
చీకటి దువ్వారానికి వేలాడుతోంది
నిండారా పండిన వరికంకిలా…!
గట్టు తెగిన చెరువులా
కాళ్ళ మధ్య పొంగుతోంది ఉమ్మనీరు
తూరుపున సూరీడు దూరుతున్నట్టు
బిడ్డ ఉదయించేడు నెత్తుటి నదిలోంచి
ఓ పురిటికేక విని భూమి ఫక్కున నవ్వింది!
బొడ్డుతాడు కోసి…
తెల్లని మబ్బుతో మాయ తుడిచి
తలకిందులుజేసి వీపున తడితే…
పురిటికందు తొలిశబ్దం చెవిన సోకి
ఎగిరిపోయిన చిలుక
తిరిగి చేరింది ఆమె ఒంటిగూటికి…!
అరచేతుల్లో
తొమ్మిదినెలల నెత్తుటి సూరీడ్ని చూడగానే
అప్పటివరకూ పడ్డ కష్టం
ఒక్కసారిగా ఆవిరైపోయింది!
కనుకొలకుల్లోంచి
ఆనందమై కురిసింది కన్నీరు
చీకటి తొలగి
అంతటా పరచుకుంది వెలుగు
అప్పటివరకూ మబ్బుపట్టిన ఆకాశం
నిర్మలంగా నవ్వుతోంది పసిపాపలా…!
ఆమె బిడ్డకే కాదు పాలిస్తోంది
ప్రపంచానిక్కూడా…!!