అమ్మాయి పాతికేళ్ళుగా ఒకే పరీక్షలో నెగ్గలేకపోతోంది
‘నీకు పాస్ అవ్వడానికి అన్ని అర్హతలున్నాయి తల్లీ!
నిన్ను పాస్ చేయాలనే మా తలంపు’ పెద్దల మాటది
కానీ మార్కులు వెయ్యడానికి వారికిక చేతులు రావు
ఎవరి కలాల నుండీ అంగీకారం పడనే పడదు
ఫలితంగా ఆమె ఫెయిల్ అవుతూనే ఉంది
ప్రతిసారీ ఆమె రాస్తున్న జవాబు పత్రాలు
చింపుతున్నారు, హాలంతా విసురుతున్నారు
అమ్మ చెల్లెళ్ళపై వారికధిక ప్రేమే ఉందట
మోడ్రన్ మహిళలు లాభపడితే కష్టమట
విభజించే వక్రాలోచనల నాయకులింతే
ఈ విషయంలో మగవారిది గొప్ప ఐకమత్యం
జనాభాలో సగమున్న మహిళా లోకానికి
మూడోవంతు వాటా ఇమ్మంటే మిడిగుడ్లు పడతాయి
మిన్ను విరిగి మీదపడ్డట్టు, చట్టసభల్లో మగాళ్ళకి
మెజారిటీ ఉన్న నాయకులకి మనసు రాదు
పలకలుబట్టి, అమ్మలంతా ఒట్టు పెట్టుకుంటే
కొడుకులతో పాటే కూతుళ్ళని బడికి పంపితే
అమ్మాయిలు అక్షరవృక్షపు విజ్ఞాన ఫలాలు
అబ్బాయిల కంటే ముందుగానే అందుకోరా?
స్త్రీల భావి నిర్ణయించే దాష్టీకం ఇంకెన్నాళ్ళు?
వారిని పరీక్ష మగవారు పాస్ చెయ్యాలా?
తమతో పోటీకి నిల్చి గెలవమని వారికి
అతివలే సత్తా నిరూపణ పరీక్ష పెట్టాలి
ఎలుగెత్తిన స్త్రీవాద ఫలాలు దక్కిన్నాడు
మరొకరి దయా భిక్ష అవసరమే లేదు
జెండర్ చెరిసమాన హక్కు ఇచ్చి తీరాలి
ఆ రోజు రావలసే ఉంది. రాక తప్పదు.