గమ్యం తెలియని బాటసారిగా ఆమె
తలవని తలంపుగ తారసిల్లాడతడు
అంతుచిక్కని అయోమయంలో ఆమె
తోడుంటానని చెయ్యందించాడతడు
మోదంతో మోకరిల్లింది ఆమె
నింగిపై నెలరాజు అతడు
నేలపై నీలి కలువ ఆమె
ప్రకృతిలో స్వేచ్ఛా విహంగం అతడు
పంజరాన పక్షి పిల్ల ఆమె
నీటి గుండంలో తాత్విక చింతన అతడు
నిప్పుల తప్పెటలో ఆర్తనాదం ఆమె
బాధలను ఛేదించే ఖడ్గదారి అతడు
కష్టాల కొలిమిలో కాలే ఇనుప ముక్క ఆమె
మండుటెండలో మంచుకొండ అతడు
మల్లెవనంలో తావి లేని పువ్వు ఆమె
పసిపాపల చిరునవ్వు అతడు
కంటిపాపల నీటి చెమ్మ ఆమె
ఎల్లలు లేని సరాగాల పూదోట అతడు
సాహితీ సంద్రంలో అణువంత ఆనవాలు ఆమె
అంతులేని అనురాగం అతడు
అలుపెరగని అనుబంధం ఆమె
ఆమె ఆత్మనివేదన అందుకోలేడు అతడు
అతని అంతరంగ ఆవేదన పంచుకోలేదు ఆమె
ఆమె దృష్టిలో మండే అగ్ని గోళం అతడు
అతని దృష్టిలో అంతులేని అబద్ధం ఆమె
ఆమె అస్థిత్వంలో టిక్ టాక్ చూస్తాడతడు
అతని ఆపాదమస్తకం ఆరాధిస్తుంది ఆమె
ఆమె నిస్సహాయతను అసహ్యించుకుంటాడతడు
అతని మనసు నిండుకుండని మురిసిపోతుంది ఆమె
అదను చూసి మౌన బాణాలు వదులుతాడతడు
అంతులేని దుఃఖంలో కూరుకుంటుంది ఆమె
అలకలతో అనుమానంగ ఉరుముతాడతడు
అవమానభారంతో కృంగిపోతుందామె
అనుకోకుండా పురుషాధికుడవుతాడతడు
అథఃపాతాళానికి నెట్టబడుతుందామె
అవలీలగా ఆవలి తీరాలను చేరుతూ అతడు
నిండుగా నిందల ఊబిలో కూరుకుపోతూ ఆమె
అతన్ని గెలుచుకున్న ఆమె తనలో లేదంటాడతడు
అతన్ని తన అంతరంగంలోనే బంధించింది ఆమె
ఆమె ప్రక్కన అండగా అరనిమిషం నిలువలేడతడు
మనసులోని మమతలు కరిగిపోయాక
తనువుల తాపాల తలంపులెందుకని
పేగుబంధాలను పెనవేసుకుని
లోకమంతా పెంజీకటైనా
రేపటి తొలిపొద్దు కోసం
కాలంతో కలబడుతున్న
ఒంటరి యుద్ధభూమి ఆమె…!!!