ఆమె ఉంది
ఆమె కళ్ళూ ఉన్నాయి
అయితే, అవి మెరవడం లేదు మునుపటిలా
ఆకాశంలోని నక్షత్రాల్లా మిలమిలా…
ఆ చూపులు నా
అణువణువునూ తడమడంలేదు
ఆనందంగా… ఆర్ద్రంగా
ఆతృతగా… ఆశగా…
ఇప్పుడా కళ్ళు…
బంధాల ఆకుల్ని రాల్చి… మోడువారిన చెట్లలా…
నమ్మకపు గూడు చెదరగా… దిక్కుతోచని పక్షుల్లా…
ప్రేమ తటాకం నుండి విసిరేస్తే… గిలగిల్లాడే చేపపిల్లల్లా…
ఏ భావమూ పలకని జీవం లేని గాజుగోలీల్లా… ఉన్నాయి!
ఒకప్పుడవి… నన్ను చూడగానే…
మమకారపు పాలతో తొణికిసలాడే వెండిగిన్నెల్లా…
వాత్సల్యపు పరిమళాన్ని వెదజల్లే పూలగుత్తుల్లా…
కల్లోల అంతరంగాన్ని శాంతింపజేసే కారుణ్యపు వెన్నముద్దల్లా…
ఓదార్పు జల్లుల్ని కురిపించే చల్లని వానమబ్బుల్లా… ఉండేవి!
ఒంటరితనపు పెనుతుఫాను నెదిరించే క్రమంలో…
జ్ఞాపకాల పొరలన్నీ జీర్ణమై… చీలికలవగా…
ఎదుట నిలుచున్న నన్ను… అమ్మ గుర్తించనే లేదు!
ఎంతకూ ఆ కళ్ళు స్పందించి, మెరవనే లేదు!