ఎగిరిపోయిన కొత్త గబ్బిలం… సత్యాజీ

ఆయన మాట నెమ్మది. మనసు వెన్నెలంత చల్లనిది. వాక్యం వెన్నముద్దలా చాలా మృదువైనది. సరళమైనది. భావం బాణంలా చాలా పదునైనది. ప్రతిభావంతమైనది. సరాసరి మనసులోకి చొచ్చుకుపోతుంది. ఆయన కవిత్వంలో గంభీరమైన పదబంధాలు ఉండవు. మన అనుభవంలో లేని ఉపమానాలు తారసపడవు. మనసు విప్పి మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఆ

మాటల్లో ఓ గమ్మత్తయిన కనికట్టు ఉంటుంది. వివక్షపై, విస్మరణపై సూటైన విమర్శ ఉంటుంది. చదవటం పూర్తయ్యేసరికి గొప్ప కవిత్వ పరిమళం మన హృదయం చుట్టూ ఆవరించి ఉంటుంది. ఒక ఆలోచనా వలయం మన తలనిండా పరుచుకొంటుంది. ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌కి ఈ కవిత్వ విద్య బతుకులోంచి అలవడిరది. అక్షరాలు నేర్వడం నుంచి విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని అందుకునేదాకా ఆయన సాగించిన నడక నల్లేరు మీద కాదుÑ పల్లేరు ముళ్ళ కంచెల మీద!
1959 జనవరి 21వ తేదీన నిజామాబాద్‌ జిల్లాలోని పాముల బస్తీలో అమ్మమ్మ గారింట పుట్టిన సుధాకర్‌ బాల్యమూ, చదువూ హైదరాబాదులో సాగాయి. కృపానందం గారి వీథి బడిలో అక్షరాలు నేర్చుకునేవాడు. పెద్ద బాలశిక్షే ఓ పెద్ద ప్రపంచంగా మారింది. చిన్నప్పుడే ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ… వీథిలో అమ్మే పాత పుస్తకాలు కొనుక్కుని చదివేవాడు. నల్లగుంట ప్రాచ్య కళాశాలలో,
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య సాగింది. తొలుత హైదరాబాద్‌లోనే తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1992లో వెలువడ్డ ‘వర్తమానం’ ఆయన తొలి కవితా సంపుటి. గొప్ప సంచలనం సృష్టించింది. సరళమైన భాష, సహజమైన అభివ్యక్తి, బలమైన భావజాలంతో… సామాన్య పాఠకుల అభిమానాన్ని, సాహిత్య విమర్శకుల ప్రశంసలను పొందింది. ఆ సంపుటిలోని ‘గూర్ఖా’ కవిత అనేక భారతీయ భాషల్లోకి తర్జుమా అయింది.
సుధాకర్‌కు అత్యంత ఇష్టమైన కవి జాషువా. ఆయన సాహిత్యంపై పరిశోధన చేసి, పిహెచ్‌డి పొందారు. తన కవిత్వంతో కులవివక్షను, అంటరానితనాన్ని చీల్చి చెండాడారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ‘కొత్త గబ్బిలం’ పేరిట ఓ దీర్ఘ కవిత రాశారు. జాషువా గబ్బిలాన్ని శివుడికి విన్నవించడానికి పురమాయిస్తే… సుధాకర్‌ తన కొత్త గబ్బిలాన్ని ఢల్లీికి రాయబారానికి పంపించారు. ఆయన 1990లో భార్య హేమలత, ఇద్దరు పసిపిల్లలతో యూనివర్శిటీ ఉద్యోగానికి రాజమండ్రి వచ్చారు. ఆ చారిత్రక నగరిలో అద్దె ఇల్లు కోసం వెతుకుతుంటే… చాలాచోట్ల ‘‘మీరేమిట్లు?’’ అన్న ప్రశ్న ఎదురయింది. కొత్త గబ్బిలానికి ఆ నగర వివక్ష గురించే తొలి ప్రబోధం చేశారు ఎండ్లూరి. ‘‘తండ్రీ, ఇది రాజమండ్రి/ కులం కలుగులోంచి ఇంకా బయటకు రాని ఎండ్రి/ నడిచే పాదాలకైనా నాడాలు కొట్టగలదు/ నమ్మకంగా దేన్నయినా అమ్మకానికి పెట్టగలదు’’ అని నిర్ద్వంద్వంగా ఎద్దేవా చేశారు. శ్రీ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో చేసిన ఓ ప్రస్తావన ఆధారంగా ‘‘గోసంగి’’ దళిత కావ్యం రాశారు. ‘‘దళితులు అంటే మాలమాదిగలు మాత్రమే కాదుÑ అంతకన్నా వెనకబడినవారు అనేకమంది ఉన్నారు. ఇంకా ఈ సమాజంలో ఓటుహక్కు, కూటిహక్కు, ఓ గూటిహక్కు లేని సంచార జీవులకు సముచిత స్థానం కావాలి’’ అని ముందుమాటలో తన మనసును ఆవిష్కరించారు. ‘అట్టడుగున పడి కాన్పించని ప్రతి ఒక్కరి ముంగిట్లోకి చదువు, ఉద్యోగం వంటి ప్రగతి ఫలాలు వెళ్ళినప్పుడే మన స్వాతంత్య్రానికి అర్థం’ అని ఆయన అనేవారు.
సుధాకర్‌ 16 పుస్తకాల వరకూ వెల్లడిరచారు. ఆచార్యుడిగా అనేకమంది విద్యార్థుల సాహిత్య పరిశోధనలకు మార్గనిర్దేశం చేశారు. దేశ విదేశాల్లో వేలాది సభల్లో ప్రసంగించారు. ఆయన ఇల్లు విద్యార్థులతో, సాహితీవేత్తలతో నిత్యం కళకళలాడేది. సహచరి హేమలత ఆయన సాహిత్య జీవితానికి వెన్నూ దన్నూ. రాయడంతోనే తన పని అయిపోయినట్టు కవిత్వాన్ని అలా వదిలేస్తే… ఆమె దానిని పఠించి, పరామర్శించి, అచ్చులోకి వచ్చేదాకా అక్షరక్షరం బాధ్యత వహించేవారు. వారిది అన్యోన్య దాంపత్యం. తన నీడలో ఆమె ఒదిగిపోయేలా ఆయన ఎన్నడూ ప్రవర్తించలేదు. కవయిత్రిగా, రచయిత్రిగా, అంతర్జాల పత్రిక నిర్వాహకురాలిగా హేమలత తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటుంటే… వెనకనుంచి ఆయన చాలా సంతోషపడ్డారు. 2019లో ఆమె అనారోగ్యంతో కన్ను మూశాక తనలో సగం కోల్పోయి విలవిల్లాడిపోయారు. తననే పలవరిస్తూ, కలవరిస్తూ చాలా స్మృతి కవిత్వం రాశారు. తన ఇద్దరు బిడ్డలను ఒక ఇంటివారిని చేస్తే తన బాధ్యత పూర్తవుతుందని ఆశపడ్డారు. పెద్ద కుమార్తె మానస అమ్మానాన్నల్లాగే కథలూ, కవిత్వం రాసి తనకంటూ ఒక పేరు సంపాదించుకొంది. మిళింద కథలకు కేంద్ర సాహిత్య యువ పురస్కారం పొంది, ఎండ్లూరికి పుత్రికోత్సాహం కలిగించింది. మనోజ్ఞకు ఇటీవలే వివాహమయింది.
సుధాకర్‌ చాలాకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. దాన్ని కూడా ఒక సరదా కవిత్వంగా మార్చేసి, స్నేహితులను నవ్వించారు. ‘నా దేహమే ఒక చెరుకు పొయ్యిగా మారిపోయింది/ నన్ను కుట్టిన దోమ కూడా తేనెటీగై ఎగిరిపోయింది/ ఆటుపోట్ల శరీర సముద్రాన్ని/ అతలాకుతలం చేస్తున్న చక్కెర తుఫాన్లు/…’ అంటూ ‘ఓ మధుమేహనాంగీ, నీ ఉదయ కాలపు ముద్దుల మెంతుల రుచీ/ నీ అధర నిష్యందాల కాకర రసపు చేదు కౌగలీ/ నా మధుర ప్రపంచాన్ని కొల్లగొట్టగలవా?’ అని ప్రశ్నించారు. 63 ఏళ్ళ సాహిత్య ప్రియుడిని ఆ తీపిదెయ్యమే ఇప్పుడు ఎత్తుకుపోయింది! మధుమేహం కారణంగా తీవ్ర గాయాల పాలైన ఒక కాలిని ఐదు నెలల క్రితం వైద్యులు తొలగించారు. ఆ వెలితి నుంచి ఆయన మానసికంగా కోలుకోకముందే శుక్రవారం తెల్లవారు రaామున గుండెపోటు ముంచుకొచ్చింది!
సుధాకర్‌ ‘కలల అక్షరం’ అనే కవితలో ఇలా చెప్పారు. బహుశా అది తన సమాధి మీద లిఖించదగ్గ తుది సందేశం ఏమో!
‘‘నన్నొక మొక్కను చేయండి
మీ ఇంటిముందు పువ్వునవుతాను
నన్ను ఊయలలూపి చూడండి
మీ కంటి ముందు పసిపాప నవ్వునవుతాను
నన్ను దేవుణ్ణి మాత్రం చేయకండి
ముక్కోటి దేవతలతో
విసిగిపోయాను వెలివేయబడ్డాను
నన్నొక గోడను చేయండి
ఒక వాక్యమై నిలదీస్తాను
నన్నొక పిడికిలి చేయండి
నలుగురి కోసం నినదిస్తాను’’
తెలుగు కవిత్వంలో ఎండ్లూరి సుధాకర్‌ది ఒక తిరుగులేని సంతకం. నానా రకాల వివక్షలపై తిరుగుబాటు పతాకం. ఆయన జీవన పతాకం ఇప్పుడు అర్థాంతరంగా అవనతం అయ్యుండొచ్చుగాక! కవిత్వ పతాకం మాత్రం ఎగురుతూనే ఉంటుంది… అంతరాల, అంటరానితనాల సమాజం అంతరించేదాకా!

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.