మధుర వైన్స్‌ -రమాదేవి చేలూరు

ఒక కాలేజి స్టూడెంట్‌ అతిగా తాగుడుకి అలవాటు పడ్డాడు, కారణం… ప్రేమ విఫలం. ఆ అమ్మాయి పేరు మధుర. ఈలోగా మరో అమ్మాయి పరిచయమవుతుంది. ఆ ప్రేమ పెళ్ళిదాకా వస్తుంది కానీ, ఆ అమ్మాయి అన్నకు తాగుబోతులంటే అసహ్యం, కోపం… కానీ,

ఆ అన్నయ్య వైన్‌ షాప్‌ నడుపుతుంటాడు. హీరో ఆ వైన్‌ షాప్‌లో వైన్‌ కొని తాగుతూ ఉంటాడు. వీడి తాగుడు గురించి వైన్‌ షాప్‌ అన్నయ్యకు బాగా తెలుసు. తాగుబోతు వెధవతో చెల్లి పెళ్ళికి ససేమిరా ఒప్పుకోడు. చివరికి, ఒక కండిషన్‌ పెడతాడు. రెండేళ్ళు తాగకుండా ఉంటే చెల్లినిచ్చి పెళ్ళి చేస్తానంటాడు. అంతటితో శుభం కార్డు పడుతుంది. క్లుప్తంగా ఇదీ కథ. ఈ సినిమాలో… తాగుడు వల్ల కలిగే కొన్ని నష్టాలను, జీవిత వాస్తవాల్ని చెప్పటం ఎంతో బాగుంది. హీరో తండ్రి మూగవాడు. అబ్బాయి తాగుడు చూసి ఎంతో వేదన పడుతుంటాడు. చిన్న వయసులో కొడుకు తాగి తాగి రాత్రిళ్ళు ఇంటికి లేటుగా వచ్చి, అన్నం తినకుండా పడుకోవటం, అది చూసి తండ్రి చలించిపోవటం… అన్ని ఫీలింగ్స్‌ను సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారు.
వీడి తాగుడు చూసి ఫ్రెండ్స్‌ బాధ పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. వైన్‌షాప్‌ ఓనర్‌ ఆ అబ్బాయికి ఎంతో నచ్చచెప్పి పంపుతుంటాడు. చిన్న వయసులోనే ఇంత తాగితే ఎట్లని, తాగవద్దని బుద్ధి మాటలు చెబుతుంటాడు. హీరోయిన్‌కి కూడా ఆ హీరో తాగటం, తూలటం ఇష్టం లేదు. చాలాసార్లు నచ్చచెబుతుంది. అయినా అతను వినడు. ప్రేమ గుడ్డిది కదా! ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది.
మొదటి ప్రేమ విఫలమయిందని తాగుడు అలవాటు చేసుకున్నాడు, సరే! మరో అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు మానేయాలి కదా! మానలేదు. ప్రేమ వైఫల్యానికి, తాగుడికి సంబంధం లేదని మనం అర్థం చేసుకోవాలి. తాగుబోతులు చెప్పే సాకులన్నీ కాకమ్మ కబుర్లని మనం తెలుసుకోవాలి. ఒక్క మనిషి తాగితే, ఆ మనిషి చుట్టూ అల్లుకొన్న బాంధవ్యాలు ఎలా బలహీనపడతాయో, ఎంతటి వేదనకు గురై విలపిస్తారో బాగా తెలియచెప్పారు. కుటుంబీకులు, మిత్రులు, సమాజం చులకనగా చూస్తారని హెచ్చరిక ఉంది ఇందులో.
చదువుకొని, ఉద్యోగం చేసి, తల్లిదండ్రుల్ని సంరక్షించుకోవాల్సిన వయసు, పెళ్ళి చేసుకునే వయసులో కుర్రాళ్ళు తాగి తాగి జీవితాల్ని నాశనం చేసుకునే వైనాన్ని సినిమా ద్వారా మనకు తెలియచేయటం గొప్ప సామాజిక బాధ్యత. బాగా తాగి స్ప్పహలేని సమయంలో, ఏదైనా అత్యవసరమైన పని చేయవలసి వస్తే వాళ్ళు చేయలేరు. హీరో శత్రువులు అతని తండ్రిని బాగా కొట్టి దారిలో పడేస్తే ఎవరో ఆస్పత్రిలో చేరుస్తారు. ఆస్పత్రి వర్గాలు హీరోకి ఫోన్‌ చేస్తే తాగిన మైకంలో వెళ్ళలేక వెళ్తాడు. ఎవరో తాగుబోతు వెధవని భావించి ఆస్పత్రి వాళ్ళు లోపలికి రానీయరు. రాత్రంతా అలాగే ఆ గేటు దగ్గరే స్పృహ లేకుండా పడి ఉంటాడు. తండ్రికి అత్యవసర సహాయం అందివ్వాల్సిన సమయంలో కొడుకు తాగి పడిపోయి ఉండటం బాధ్యతారాహిత్యం, బాధాకరం.
ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాళ్ళు తాగి తాగి రోడ్లమీద పడిపోతే కుటుంబాలకు, సమాజానికి ఎంతో నష్టం. యువత ఇంత బలహీనపడిపోతే ఎట్లా అని ప్రేక్షకులకు బాధ కలుగుతుంది. గాంధీ జయంతి రోజున దుకాణాలు మూసేస్తే, తాగుబోతులు గిలగిలా కొట్టుకోవడం బాధాకరం. పనిలేని హీరోకి తాగుడికి డబ్బు కావాల్సి వచ్చినపుడు తండ్రి జేబులో దొంగిలించడం చూస్తే యువశక్తి ఎంత నిర్వీర్యమైపోతోందో కదా అని మన మనస్సు చివుక్కుమంటుంది.
ఈ సినిమాలో తాగుడు వల్ల వచ్చే కష్టనష్టాలను చాలావరకు ఎత్తి చూపారు. ఈ సినిమా చూసిన తర్వాత ఒక్క తాగుబోతు మారినా మంచిదే! ఇన్ని కష్టనష్టాలున్న ఈ తాగుడు వ్యసనాన్ని, ప్రజలచేత మాన్పించే దిశగా ప్రభుత్వాలు అడుగు వేయకపోగా, మందు ధర పెంచి, ప్రభుత్వపు ఖజానాను పూర్తిగా నింపుకొని ముందుకు నడుస్తున్నాయి. జనం తాగి, ఊగి నాశనమైతేనే ప్రభుత్వాలు ఆర్థికంగా ధృఢంగా నిలబడతాయని, నిస్సిగ్గుగా సెలవిస్తున్న ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్నాం మనం. ఈ సినిమాలో కాలేజి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ముద్దు పెట్టమని ఏడిపిస్తుంటే ఆ అమ్మాయి, ఆమె స్నేహితురాలు బేలగా చూస్తూ భయపడి, ఆందోళన పడతారు, ఒక్కసారి కాదు, చాలాసార్లు. కాలేజీ అధికారులకు చెప్పాలనే కామన్‌సెన్స్‌ ఉండదా వాళ్ళకు! సిటీల్లో కాలేజీ అమ్మాయిలు ధైర్యంగా ఉన్నారనే నా అంచనా తారుమారైందిక్కడ. ఈ సినిమాలో సినిమా మసాలా ఘాటు లేకపోలేదు. కమర్షియల్‌ హిట్‌ కోసం, హీరో హీరోయిన్లకు ముద్దు సీన్లు పెట్టి యువతను ఆకర్షించడం నచ్చని విషయం ఈ సినిమాలో.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.