గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…)

ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలో దత్‌`బ్రాడ్లీ థీసిస్‌ గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. శారద కూడా నాగపూర్‌ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరై దత్‌`బ్రాడ్లీ థీసిస్‌ను వివరించింది. శారద ఇంగ్లండ్‌లో పామీదత్‌ను కలుసుకుంది. ఈ విషయం గురించి చర్చించింది కూడా. ఆ థీసిస్‌ సరైనదనే నిర్ణయానికొచ్చింది. కమ్యూనిస్టుల మీద బ్రిటిష్‌

ప్రభుత్వం నిర్బంధం రోజరోజుకీ పెరుగుతోంది. ఏ పనైనా రహస్యంగా చేయాలి. శక్తి సామర్ధ్యాలతో, ఆదర్శావేశాలతో రగులుతున్న యువతరానికి రహస్యంగా చేసే పని చాలటం లేదు. ఇంకేదో చెయ్యాలని రగిలిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన పని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల మీద వ్యతిరేకతను పెంచటం. ఆ పని కాంగ్రెస్‌ పార్టీ సరిగా చేయటం లేదని కమ్యూనిస్టుల అభిప్రాయం. పైగా కమ్యూనిస్టుల్లా రహస్యంగా కాక బహిరంగంగా చేస్తున్నారు. అలాంటప్పుడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ పేరుతోనే తామనుకున్న పని బహిరంగంగా చేయవచ్చు. జాతీయ భావాలను మరింత వేగంగా ప్రజలలోకి తీసుకెళ్ళవచ్చు. రైతు సంఘాలనూ, యువజన సంఘాలనూ కాంగ్రెస్‌ పార్టీ కింద నిర్మించటం తేలిక. ఆ పని చేస్తూ ఆ సంఘాలలో కమ్యూనిస్టు భావాలు వ్యాపింపజేయాలి. ఆ భావాల పట్ల అంకితభావం చూపినవారికి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం ఇవ్వొచ్చు. అప్పుడు అందరి శక్తియుక్తులు వంద శాతం ఉపయోగపడతాయి.
ఇదీ స్థూలంగా దత్‌`బ్రాడ్లీ థీసిస్‌ సారాంశం. ఇంకా దేశ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల గురించి ఎంతో సమాచారం, విశ్లేషణ ఉన్నా కార్యక్రమానికి సంబంధించి ఈ పని ముఖ్యమైనది. శారద దీనికి తోటి కామ్రేడ్స్‌ ఆమోదం సంపాదించటంలో చురుకుగా పనిచేసింది. ఫలితంగా కమ్యూనిస్టులనుకున్నవారంతా మళ్ళీ కాంగ్రెస్‌లో సభ్యులయ్యారు. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడికక్కడ రైతు సమస్యల మీద యువతీ యువకులను సమీకరిస్తున్నారు.
శారద ప్రాక్టీసు మొదలుపెట్టడం గురించి కూడా పార్టీలో చర్చించింది. మద్రాసులో కంటే బెజవాడలో ప్రాక్టీసు పెడితే బాగుంటుందని యూత్‌ లీగ్‌ అభిప్రాయపడిరది. అక్కడ చైతన్యమవుతున్న యువతీ యువకులను శారద బాగా నడిపించగలుగుతుంది. డాక్టర్‌గా కూడా శారద అవసరం మద్రాసులో కంటే బెజవాడలో ఎక్కువ ఉందని వారి వాదన. ఆ వాదనలో నిజముంది గానీ దాని వెనక వేరే కారణం కూడా ఉంది. అది శారదకు తెలియదు.
శారద బెజవాడ వెళ్తే, మూర్తికి దూరమైతే వారిద్దరిలో మార్పు రావొచ్చని యూత్‌ లీగ్‌ అనుకుంది. శారద గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకోవటం గురించి సుబ్బమ్మకు బాధ లేదు కానీ పార్టీకి చాలా బాధగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి గానీ వేలెత్తి చూపించుకోకూడదని వారి భావన. మద్రాసులోని రాజకీయ వర్గాలలో శారద, మూర్తిల ప్రేమ రకరకాలుగా ప్రచారమవుతూ ఉంది. దాన్ని ఆపటానికి, పార్టీని ఆంధ్ర ప్రాంతంలో వృద్ధి చేయటానికీ శారద బెజవాడలో ప్రాక్టీసు పెట్టటమే మంచిదని అందరూ భావించారు. అందరూ ఏకగ్రీవంగా ఆ మాట చెప్పినప్పుడు శారద తోసిపుచ్చలేకపోయింది.
డాక్టర్‌ వృత్తికీ, కమ్యూనిస్టు పార్టీకీ జీవితాన్ని అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. మూర్తి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండటం వల్ల తమ ప్రేమ పోతుందని ఆమె అనుకోలేదు. ఇంగ్లండ్‌లో ఉన్న రెండేళ్ళలో వారి ప్రేమ పెరిగిందే తప్ప తరగలేదు.
శారద ఉత్సాహంగా తల్లితో, తమ్ముడితో బెజవాడ మకాం మార్చాలని చెప్పింది. మద్రాసు ఒదిలి వెళ్ళటం సుబ్బమ్మగారికంత ఇష్టం లేదు. సూర్యానికి అక్క ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ.
‘ఇది పెద్ద పట్టణం. ఇక్కడ ఇంకొకరి గురించి పట్టించుకోవటం తక్కువ. ఆ బెజవాడలో శారద ఇమడగలదా? శారద మాట, నవ్వూ, నడక అన్నిటికీ వంకపెడతారు. శారదను ఏదో రకంగా ఇబ్బంది పెడతారు.’ ఇదీ సుబ్బమ్మ సందేహం. ఆ సందేహాలన్నీ చెబితే శారద నవ్వేసింది.
‘‘అమ్మా ఆ వాతావరణాన్నంతా మార్చి ఇరుకు వీథులను విశాలం చేయాలనే నేను బెజవాడ వెళ్దామనుకుంటున్నా. నాలాటి వాళ్ళను వందమందినైనా తయారు చెయ్యాలి గదమ్మా. అక్కడ మన పార్టీవాళ్ళు చాలామంది ఉన్నారు. నా అవసరం ఉంది. నా గురించి భయపడకు. నన్నే సముద్రంలో పడేసినా హాయిగా ఈదుకుంటూ బైటపడతా…’’
‘‘సముద్రం గురించి భయం లేదు శారదా, మురుక్కాలవల గురించే’’
‘‘మురుక్కాలవలు బాగుచేసుకోవాలమ్మా. లేకపోతే ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. డాక్టరుగా ప్రజారోగ్యం నా బాధ్యత. బెజవాడ వెళ్ళాలమ్మా’’ శారద బెజవాడ వెళ్ళటం గురించి గట్టిగానే అనుకుంటోందని సుబ్బమ్మ ప్రయాణపు ఏర్పాట్లలో పడిరది.
మరో నెలలో శారద బెజవాడ ప్రయాణం ఉందనగా విశాల తన పెళ్ళి శుభలేఖలు తీసుకొని వచ్చింది. విశాల ముఖంలో అంత ఆనందం, తెరిపిదనం శారద ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఎవరిమీదో ఫిర్యాదు చెయ్యబోతున్నట్లుండే విశాల ముఖంలో ఏదో శాంతి ఆవిరించినట్టుంది. ఎప్పుడూ తన జీవితం గురించి అసంతృప్తితో, అనంగీకారంతో బతికేది విశాల. ఆమె ఇలా సంతోషంగా ఉందంటే అదంతా పెళ్ళి మహత్యమేనా అని సూటిగా అడిగేసింది శారద. విశాల సిగ్గుపడుతూ, నవ్వుతూ పెళ్ళి వివరాలు చెప్పింది. గోపాలశాస్త్రిది ప్రభుత్వోద్యోగమే. బ్రాహ్మణుడు. విశాలను ప్రేమించాననీ, పెళ్ళాడతాననీ తనంత తాను వచ్చి అడిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిష్టంగానే ఒప్పుకున్నారు. గోపాల శాస్త్రే ఒప్పించాడు. ఐతే వాళ్ళు ఒక షరతు పెట్టారు. విశాలను గోపాలం వాళ్ళ మేనమామ దత్తత తీసుకుంటాడు. వాళ్ళే విశాల తల్లిదండ్రులుగా వివాహం జరిపిస్తారు. విశాల తన తల్లితో సంబంధాలు పూర్తిగా ఒదిలేసుకోవాలి. విశాల చెప్తుంటేనే శారదకు కోపం వచ్చింది.
‘‘దీనికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఎంత దారుణం. వాళ్ళకెంత ధైర్యం’’ శారద ఆవేశపడుతుంటే విశాల ఆశ్చర్యపోయింది.
‘‘నీకెందుకే అంత కోపం? నా కులం, మా అమ్మ కులవృత్తిలో ఉండటం, నాటకాలు వేయటం నాకే ఇష్టంలేదు. వాళ్ళెలా సహిస్తారు? ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళడిగినదానిలో తప్పేముంది? నేను ఎమ్మేలో చేరిన దగ్గరనుంచి మా అమ్మా నుంచి దూరంగానే
ఉంటున్నాను. ఇప్పుడు నేను కొత్తగా మా అమ్మకు దూరమయ్యానని అనటానికేమీ లేదు. బాధపడటానికి అంతకంటే ఏమీ లేదు’’.
‘‘మీ అమ్మ నిన్నెంత ప్రేమగా పెంచిందే. చదివించింది, నీ సాధింపులన్నీ భరించింది. కాల్చుకు తిన్నావు గదే ఆమెను. ఆమెను ఒదిలెయ్యటం అన్యాయం. ముసలితనంలో ఆమెకు దిక్కెవరే’’ కోటేశ్వరిని తల్చుకుంటే శారదకు దుఃఖం వచ్చింది.
‘‘ఉందిగా ఆ రాజ్యం. మా పిన్ని కూతురు. మా పిన్ని, ఆమె కూతురు మా అమ్మని అతుక్కుపోయారు. రాజ్యాన్ని నాటకాల్లోకి దించారు. ఇప్పుడు మా అమ్మకు నాకంటే రాజ్యమే ఎక్కువ. మా అమ్మకు బతకటం తెలుసులే’’ అంది విశాల గొంతు ఇంత చేసి.
‘‘నా పెళ్ళికి తప్పకుండా రావాలి. మీ అమ్మగారిని కూడా తీసుకురా’’ విశాల ఉత్సాహం చూస్తే శారదకు ఏవగింపు పుట్టుకొచ్చింది.
‘నేను రాను నీ పెళ్ళికి’ అని తెగేసి చెప్పాలనిపించింది.
తల్లిని గౌరవంగా చూడనవసరం లేదని, దూరంగా ఉంచాలని విశాలకు ఏ చదువు నేర్పించింది? ఈమెకు ఏ సంస్కారం అబ్బింది? ఇదేం ఆధునికత? సంస్కర్తలు నేర్పించిన సంస్కారం ఫలితమా? తన కులాన్ని ద్వేషించే సంస్కారం, తల్లిని ఒదులుకునే తత్వం ఎలా అబ్బాయి విశాలకు…
శారద మనసులో ఎన్నో ప్రశ్నలు. అన్యమనస్కంగానే విశాలను తల్లి దగ్గరకు తీసుకెళ్ళింది. సుబ్బమ్మ విశాల నోరు తీపి చేసింది. విశాల పెళ్ళికి వెళ్ళకూడదనుకుంది శారద.
రెండు రోజుల తర్వాత ట్రిప్లికేను మీదుగా వస్తుంటే శారదకు కోటేశ్వరిని చూడాలనిపించింది.
అక్కడికి వాళ్ళిల్లు దగ్గరే. కూతురు చేస్తున్న పనితో ఆమె ఏమైందో అనుకుంటూ వెళ్ళింది.
కోటేశ్వరిని చూడగానే అర్థమైంది, విశాల ఆమెను ఎంత దెబ్బ కొట్టిందో.
‘‘తెలిసిందామ్మా… మన విశాల పెళ్ళి చేసుకుంటోంది’’ అంది కన్నీళ్ళతో. కూతురి పెళ్ళి వార్తను కన్నీళ్ళతో చెప్పాల్సిన పరిస్థితికి సిగ్గుపడుతూ, వెంటనే ఆ కన్నీళ్ళు తుడిచేసుకుంది.
‘‘తెలిసిందమ్మా. తను చేసిన పని నాకేం నచ్చలేదు. వాళ్ళు కూడా తల్లితో సంబంధం ఉండకూదనటం…’’
‘‘వాళ్ళంటారమ్మా… వాళ్ళు పెద్ద కులం వాళ్ళు’’
‘‘కానీ గౌరవం, గౌరవం అని ఏడుస్తుంటే విశాల బుద్దేమయింది? తనను వాళ్ళు అవమానిస్తున్నారని దానికి అర్థం కావొద్దూ.’’
‘‘అయ్యో రాత, మొదట్నుంచీ దానికీ, నాకూ అదేగా తగాదా. పోన్లేమ్మా అది సుఖంగా ఉంటే అంతే చాలు. ఇప్పుడు మాత్రం నాతో ఉంటుందా పెడుతుందా? మూడ్నెల్లకోసారి ముఖం చూపించేది. ఇక అదీ ఉండదు. దేవుడు నాకింకో బిడ్డనిచ్చాడమ్మా. మా రాజ్యం నేనంటే ప్రాణాలు ఇడుస్తుంది. అమ్మాయ్‌ రాజ్యం…’’ అని పిలవగానే వచ్చింది పదహారేళ్ళు నిండిన రాజ్యం.
శారద నివ్వెరపోయి కన్నార్పకుండా కాసేపు చూసి తేరుకుంది. రాజ్యం ఎదురుగా ఉంటే ఆ పిల్ల మీద నుంచి కళ్ళు తిప్పుకోవటం కష్టం. ఇంతింత కళ్ళు, పచ్చని, పల్చని శరీరం, మంచి ఎత్తు. బంగారు బొమ్మ అంటే ఇలా ఉంటుందనిపించింది.
శారద అతి కష్టం మీద ఆ పిల్ల మీద నుంచి చూపు మరల్చుకుని కోటేశ్వరిని చూస్తూ ‘‘చదివిస్తున్నావా అమ్మా’’ అని అడిగింది.
‘‘ఐదు వరకు చదివిందమ్మా. ఇప్పుడు ఒక పంతులు గారొచ్చి తెలుగు కావ్యాలు చదివిస్తున్నారు. సంగీతం కూడా నేర్చుకుంటోంది.’’
‘‘ఇంగ్లీషు కూడా నేర్చుకో’’ అంది శారద మళ్ళీ రాజ్యం మాయలో పడుతూ.
‘‘నేర్పిస్తానమ్మా. ముందు ఆ పద్యాలూ, పాటలూ వస్తే నాటకాల్లో రాణిస్తది. ఆ తర్వాత ఇంగ్లీషు, లెక్కలూ చెప్పిస్తే లోకంలో నెగ్గుకొస్తది. విశాల లాగా దీన్ని కాలేజీ చదువులకు పంపించే ఉద్దేశ్యం మటుకు లేదు’’ అంది కోటేశ్వరి కచ్చితంగా.
శారదకు ఫలహారం పెట్టి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది.
‘‘విశాల పెళ్ళికి వెళ్ళాలని లేదమ్మా. నేను వెళ్ళను’’ అంది శారద.
‘‘అయ్యో. అట్టా చెయ్యమాకమ్మా. నీ మీదే ఆశ పెట్టుకున్నాను. ఈ పిల్లకు బొత్తిగా ఎవరూ లేరు, ఏ అండా లేదు అనుకుంటే వాళ్ళు దానిని మరీ లోకువ చేస్తారమ్మా. నువ్వు మీ అమ్మా, ఇంకా నీ స్నేహితులు గొప్పవాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్ళమ్మా. అత్తగారింట్లో దానికి గౌరవం ఉండాలిగా’’ కోటేశ్వరి తెలివికి శారద ఆశ్చర్యపోయింది. తనను వెలివేసిన కూతురి క్షేమం గురించి ముందు చూపుతో ఆలోచించే ఆ తల్లికి నమస్కారం చేసి, పెళ్ళికి వెళ్తానని వాగ్దానం చేసి ఇంటికి వచ్చింది. ఏదన్నా ఒక పని మంచిదనుకుంటే అది పూర్తిగా చేసేంతవరకూ శారదకు నిద్రపట్టదు.
తనతో పాటు కొందరు కాంగ్రెస్‌ పెద్దల్ని కూడా తీసుకెళ్ళాలనుకుంది. విశాలకు కాంగ్రెస్‌ పెద్దలు బాగా దగ్గరివాళ్ళనే అభిప్రాయం కలిగించాలనుకుంది. ఒక్కొక్కరి ఇంటికీ వెళ్ళి వాళ్ళకు సమస్య వివరించి చెప్పి ఒక్క గంటసేపు తన స్నేహితురాలి పెళ్ళికి రమ్మని అడిగింది. శారద అడిగిన తీరుకి అందరూ ఒప్పుకున్నారు.
పెళ్ళిలో విశాల తరపున వచ్చి నిలబడిన వాళ్ళని చూసి విశాలే విస్తుపోయింది. విశాల మామగారి బంధువులంతా తల్లకిందులయ్యారు. వాళ్ళు మిగిలిన పనులు పక్కన బెట్టి కాంగ్రెస్‌ పెద్దలకు, అందునా బ్రాహ్మణ పెద్దలకు ఉపచారాలు చేస్తూ ఉండిపోయారు.
విశాల పక్కన ఎవరూ లేని సమయం చూసి శారదకు కృతజ్ఞతలు చెప్పింది. తనమీద శారదకున్న ప్రేమ మర్చిపోలేనంది.
‘‘పిచ్చిదానా, ఈ ఆలోచన నా బుర్రలో పుట్టలేదు. నేనసలు నీ పెళ్ళికి రావొద్దనుకున్నాను. మీ అమ్మ చెప్పింది ఇట్లా చేస్తే అత్తగారింట్లో నీ గౌరవం పెరుగుతుందని చెప్పింది. మీ అమ్మ బతిమాలి నా చేత ఈ పని చేయించింది’’.
విశాల ముఖం పాలిపోయింది.
‘‘విశాలా, మీ అమ్మకు నువ్వు లేవు గానీ నీకు మీ అమ్మ ఉంది. అది మర్చిపోకు. ఎప్పుడైనా అవసరమైతే మీ అమ్మ దగ్గరకు సందేహం లేకుండా వెళ్ళు’’.
శారద మాటలకు విశాల ముఖం మాడిపోయింది.
ఇంతలో ఎవరో వచ్చి పెళ్ళి కూతురు కావాలంటూ తీసుకుపోయారు. శారద పెళ్ళింట్లో భోజనం చెయ్యకుండా వెళ్దామంది గానీ సుబ్బమ్మ అలా కుదరదంది. అక్కడ ఆవిడ దూరపు బంధువులెవరో కన్పించారు కూడా.
సాయంత్రం ఇదంతా మూర్తితో చెప్పి నవ్వుకుని సేద దీరింది శారద.
మద్రాసు ఒదిలి వెళ్ళాలంటే శారదకు ఒకవైపు ఉత్సాహంగానే ఉన్నా ఇంకోవైపు దిగులూ ఉంది. బాల్యంలోనే మద్రాసు వచ్చేసింది. ఆమె నేర్చుకున్నదంతా ఇక్కడే. శారద శారదలా తయారవటానికి కారణం మద్రాసే. ఆ పల్లెటూళ్ళో ఉండిపోయినట్లయితే శారద నాన్నమ్మ కోరుకున్నట్లు బాల్య వివాహం జరిగి ఉంటే శారదకీ పాటికి పిల్లలు పుట్టి వాళ్ళు మళ్ళీ పెళ్ళికి తయారయ్యేవారు. అన్నపూర్ణ పిల్లలకప్పుడే పదేళ్ళు దాటుతున్నాయి. రామారావు శారదను డాక్టర్‌ చదివించాలనే పట్టుదలతో మద్రాసు రావటం వల్లే శారద డాక్టర్‌ అయింది. శారద జీవితం విశాలమైంది. ‘ఈ నగరం నాకు చాలా ఇచ్చింది’ అనుకుంది శారద. చిన్ననాడు చదివిన స్కూలుకి కూడా వెళ్ళి అందరినీ పలకరించి వచ్చింది.
మద్రాసు కాంగ్రెస్‌ పెద్దలనూ కలిసింది. శారదను అందరూ ఇష్టపడతారు. శారద మద్రాసు వదిలి వెళ్ళటం మంచిది కాదని చెప్పిన వాళ్ళూ ఉన్నారు. రాజకీయాల్లో కానీ, డాక్టర్‌గా గానీ శారద ఇక్కడే బాగా రాణించగలదని వారి ఉద్దేశం. రాజకీయాలకు దూరమవుతావేమో ఆలోచించుకోమన్నారు. నాలుగైదేళ్ళు మద్రాసులోనే ఉండి ప్రాక్టీసు చేస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆశ పెట్టారు. శారద నవ్వి ఊరుకుంది. రాజకీయాలకు బాగా దగ్గర కావాలనే ఆమె బెజవాడ వెళ్తోంది. కాంగ్రెస్‌లో కొందరికి రాజకీయాలంటే పదవులు, మంత్రులవటం అనే ఆలోచన మొదలైంది. శారద ప్రజా రాజకీయాల కోసం బెజవాడ వెళ్తోందని చాలా మందికి తెలియదు.
ఆంధ్ర నుంచి ఎన్నో పార్టీ రిపోర్టులు అందుతున్నాయి శారదకు. ఆ కార్యక్రమాలు, అక్కడ గ్రామాల్లో జరుగుతున్న పోరాటాలు శారదకు చాలా ఉత్సాహం కలిగించాయి. పార్టీ రిపోర్టులు, డాక్యుమెంట్లు అధ్యయనం చేస్తూ, ఆకళింపు చేసుకుంటూ, తనకూ, హాస్పిటల్‌కు కావలసిన వస్తువులు కొనుక్కుంటూ క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది శారద.
బెజవాడలో బంధువులు, స్నేహితులు కలిసి వెతికి రెండిళ్ళు శారద కోసం అద్దెకు తీసుకున్నారు. ఒకటి ఆస్పత్రికి, ఒకటి ఉండేందుకు. రెండూ వసతిగానే ఉన్నాయి. సుబ్బమ్మ పనివాళ్ళ సాయంతో ఇల్లు సర్దిస్తుంటే, శారద ఆస్పత్రి పని చూసుకుంది.
బెజవాడ అప్పటికే కమ్యూనిస్టు కేంద్రం అవ్వటానికి సిద్ధంగా ఉంది. పత్రిక ఆఫీసు తెరవబోతున్నారు. శారద ఆస్పత్రి పనితో పాటు కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పార్టీ పనులు, మహిళా సంఘం పనులు వెంటనే మొదలు పెట్టింది.
బెజవాడలో అప్పటికే రంగనాయకమ్మగారు మంచి లేడీ డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆస్పత్రి పనులు ఒక కొలిక్కి రాగానే ఆవిడను వెళ్ళి చూడటం మర్యాదగా ఉంటుందనుకుంది శారద. రాత్రిళ్ళు వెళ్తేనే డాక్టర్లు తీరికగా ఉంటారు. ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలకు సుబ్బమ్మ ఇచ్చిన పిండి వంటలు, పళ్ళు తీసుకుని డాక్టర్‌ రంగనాయకమ్మ దగ్గరికి వెళ్ళింది. శారదను చూసి ఆమె చాలా సంతోషించింది. ఆస్పత్రి, ఇల్లూ అంతా చూపించింది. చలంగారిని పరిచయం చేసింది. శారద గురించి చలం గారికి తెలుసు. లోకరీతికి భిన్నంగా బతుకుతున్న స్త్రీలంటే ఆయనకు ఆసక్తి. కానీ ఆయన ఎక్కువ మాట్లాడరు. శారద నమస్కారానికి చెయ్యి ఊపి చిరునవ్వుతో ‘‘మీరు కమ్యూనిస్టులటగా’’ అని అడిగారు.
‘‘ఔను’’ అంది శారద ధీమాగా.
‘‘ఇదొక శాఖ బయల్దేరుతోంది గాబోలు మనుషుల్ని విడదీయటానికి వెలివేయటానికి’’ అన్నారు నిదానంగా చలం.
శారదకు కోపం వచ్చింది.
‘‘కమ్యూనిజం ప్రపంచ ప్రజలందరినీ కలుపుతుందండి. విడదీయదు. మనుషులంతా ఒకటేనని అందరూ సమానులనీ కమ్యూనిజం చెబుతుంది’’ ఆవేశంగా అంది శారద.
‘‘నేను కమ్యూనిజాన్ని ఏమనలేదు. అది గొప్ప ఆదర్శం. నాకూ కమ్యూనిజంలో బతకాలని ఉంటుంది. నేనన్నది కమ్యూనిస్టు పార్టీ గురించి. అయినా నా మాటలు అంత పట్టించుకోకు. నేనేదో మాట్లాడతాను. అందరికీ కోపం తెప్పిస్తుంటాను. కావాలంటే డాక్టర్‌గారి నడుగు’’ అంటూ ఆయన తను చదువుతున్న పుస్తకంలోకి తల వంచాడు.
రంగనాయకమ్మ శారదను ఇంట్లోకి తీసికెళ్ళి పిల్లలందరినీ పరిచయం చేసింది. ఒక్కరూ బడికో, కాలేజీకో వెళ్ళటం లేదు. చలం గారు బడి చదువులకి వ్యతిరేకి అని తెలుసుగానీ, స్వంత పిల్లలను బడికి పంపనంతగా ఆయన తన ఆదర్శాలను పాటించే నిజాయితీ గల మనిషి అని తెలియదు శారదకు. ఆ పిల్లల జ్ఞానం, సంస్కారం చూసి ఆశ్యర్యపోయింది. ఎవరో తెలియనివాళ్ళు ఆస్పత్రిలో కని వదిలేసి వెళ్ళిన పిల్లలు కూడా చలంగారి పిల్లలతో సమానంగా పెరుగుతున్నారు.
‘‘మీలా ఒక్కరినైనా డాక్టర్‌ని చెయ్యరా’’ అడిగింది రంగనాయకమ్మను.
‘‘వాళ్ళకిష్టమైతే ఒకరు చేసేదేమిటి, వాళ్ళే అవుతారు. వాళ్ళకిష్టంలేని పని ఈ ఇంట్లో ఎవరూ చేయించరు. చలంగారి బడ్డల శిక్షణ చదవలేదా…’’
‘‘కానీ ఏం చెయ్యకుండా సమయమంతా…’’
‘‘శారదా, అదంతా నువ్వు చలంగారితో మాట్లాడాల్సిందే. అది ఒదిలెయ్‌. నీ ఆస్పత్రి గురించి చెప్పు’’ శారద తనెలా ఆస్పత్రి నడపాలనుకుంటోందో చెప్పింది. దానిలో సాధక బాధకాలను రంగనాయకమ్మ వివరించింది.
రాత్రి పొద్దుపోతోందని శారద లేచేవరకూ స్త్రీల ఆరోగ్యం గురించీ, స్త్రీలకు తమ శరీరాల గురించి కనీస జ్ఞానం లేకపోవటం గురించీ డాక్టర్‌ రంగనాయకమ్మ గారు చెబుతూనే ఉన్నారు.
‘‘అక్షరజ్ఞానం ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. నీలాంటి వాళ్ళు తేలికభాషలో స్త్రీల ఆరోగ్యం, శరీరం వీటి గురించి రాస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది’’ అన్నారావిడ.
‘‘తప్పకుండా రాస్తాను’’ మాట ఇచ్చేసింది శారద.
కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ పార్టీలో చేరి సోషలిస్టులుగా చెప్పుకుంటూ చేయాలనుకున్న పనులు చాలా జిల్లాల్లో మొదలయ్యాయి. జమిందార్లకు వ్యతిరేకంగా రైతులను, పెద్ద భూస్వాములకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలనూ సమీకరించి, సంఘాలుగా చేసి, సమ్మెలు చేయించే పని ప్రధానంగా సాగుతోంది. చిన్న చిన్న రంగాల్లో కూడా యూనియన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రెస్‌ వర్కర్లు, మిల్లు కార్మికుల వంటి వారిని సంఘటితం చేసి జీతాల పెంపు కోసం, పని పరిస్థితుల పెరుగుదల కోసం డిమాండ్లు పెట్టిస్తున్నారు. రాష్ట్ర కమిటీ కృష్ణా, గోదావరి జిల్లాల కమిటీలకు అనుసంధానం చేసుకుంటూ, జిల్లా కార్యకర్తల పనులు సమీక్షిస్తూ శారద తీరిక లేకుండా పని చేస్తూనే, మహిళా ఉద్యమం మీద కూడా కేంద్రీకరించింది. మహిళలు చాలా చైతన్యంతో మహిళా సంఘ సభ్యులవుతున్నారు. వాళ్ళకు ఆరోగ్య విషయాలు చెబితే మరింతగా పార్టీకి దగ్గరవుతున్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి, పౌష్టికాహారం గురించి, స్త్రీల ఆరోగ్య సమస్యల గురించీ శారద చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవారు స్త్రీలు.
అవి అంత ముఖ్య విషయాలు కాదనీ, వాటికి శారద అంత సమయం పెట్టనవసరం లేదనీ, రాజకీయాలకు ఎక్కువ సమయం ఇవ్వాలనీ ఒక విమర్శ పురుషుల నుంచి వచ్చింది.
‘‘స్త్రీల ఆరోగ్యం రాజకీయం కాదని మీరెందుకనుకుంటున్నారు’’ అని శారద అడిగిన ప్రశ్నకు అందరూ చాలా తేలికగా తీసేసి నవ్వేశారు.
శారద వాళ్ళనలా నవ్వులకు ఒదలదల్చుకోలేదు. స్త్రీల ఆరోగ్యం రాజకీయ విషయం ఎలా అవుతుందో గంటసేపు చెప్పింది. స్త్రీల సంతానోత్పత్తి శక్తి ఎంత కీలకమైన విషయమో మార్క్స్‌, ఏంగెల్స్‌ల మాటలతో శారద చెప్తుంటే అందరూ విన్నారు. కొందరు అర్థం చేసుకున్నారు. కొందరికి అర్థం కాలేదు, వాళ్ళు విసుక్కున్నారు. ఈవిడ డాక్టరనీ, చదువుకున్నదనీ చూపించుకోవాలి కదా అని వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు. అర్థం చేసుకున్నవాళ్ళు ఇకమీద జరిగే రాజకీయ తరగతుల్లో ఆరోగ్యం గురించి శారద తప్పకుండా ఒక క్లాసు తీసుకోవాలని తీర్మానించారు.
‘‘ఇక నన్ను స్త్రీల స్పెషలిస్టుని చేసి మిగిలిన రాజకీయాల నుండి దూరం చేస్తారా ఏంటి’’ అని నవ్వింది శారద.
అన్నది గానీ మహిళా ఉద్యమ నిర్మాణం అత్యవసరమనీ, ఆ పనిలో తను అలసిపోకూడదనీ అనుకుంది. సూర్యం ఇంటి బాధ్యతలు చూస్తూ, పార్టీ మీటింగులకు హాజరవుతూ కాలం గడిపేస్తున్నాడు.
అన్నపూర్ణ, అబ్బయ్యలు గుంటూరు రావటంతో మళ్ళీ శారదకు వాళ్ళతో స్నేహం గట్టిపడిరది. అయినా ఇద్దరిమధ్యా తీవ్రమైన వాదోపవాదాలు జరిగేవి. అన్నపూర్ణకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ సభ్యులుగా చేరి తమ పని తాము చేసుకోవటం మీద చాలా విమర్శ ఉండేది.
‘‘మీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళంతా మా కాంగ్రెస్‌లో ఎందుకు చేరుతున్నారు? కాంగ్రెస్‌ని బలహీనపరుద్దామనా? అది మీరు ఎన్నటికీ చేయలేరు’’ అనేది.
‘‘కాదోయ్‌! కాంగ్రెస్‌లో సోషలిస్టు శక్తులను బలపరచటానికి. మేం అలా చెయ్యకపోతే మీ కాంగ్రెస్‌ సనాతన వాదులతో కుళ్ళిపోతుంది. మీలో ఉన్న సోషలిస్టులు కళ్ళు తేలేసి బైటికి నడవాలి. మేం ఉంటే వాళ్ళకు కాస్త అండ. వాళ్ళను బలపరుస్తాం. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ఇవాళ జయప్రకాష్‌ నారాయణ వంటి యువకుల మాట మీద నడుస్తోందంటే, కాంగ్రెస్‌ ముసలి నాయకులు వీళ్ళని చూసి బెదిరి వీళ్ళకు కాస్త విలువ ఇస్తున్నారంటే అదంతా మా కమ్యూనిస్టుల పుణ్యమే’’ అని నవ్వేది శారద.
లాహొర్‌ సోషలిస్టు పార్టీ కాంగ్రెస్‌కి అన్నపూర్ణ, శారద ఇద్దరూ వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్‌ సోషలిస్టులకూ, కమ్యూనిస్టులకూ వచ్చిన విబేధాలలో శారదా, అన్నపూర్ణా తీవ్రంగా వాదించుకున్నారు.
‘‘కార్యవర్గాన్నంతా కమ్యూనిస్టులతో నింపాలని చూస్తే మేమేమన్నా పాలు తాగే పసిపిల్లలమా? అంత మాత్రం తెలివిలేదా మాకు. ఆ పిచ్చిపని మానేసి మీరెంతవరకుండాలో అంతవరకు ఉండండి’’ అంటుంది అన్నపూర్ణ.
‘‘మా వాళ్ళు ఎక్కువమంది ఉన్నప్పుడు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని కోరుకోవటంలో తప్పేమిటి? తమిళనాడులో, ఆంధ్రాలో ఉన్నదంతా మావాళ్ళే. మేం ఎందుకు ఊరుకుంటాం? పోటీ పడతాం. మా ప్యానల్‌ మేం పెడతాం’’ అంది శారద.
‘‘పెట్టండి. ఆ వచ్చే కొందరు కూడా కార్యవర్గంలోకి రాకుండా పోతారు’’ అని విసురుగా వెళ్ళిపోయింది అన్నపూర్ణ.
అన్నపూర్ణ మాటే నిజమయింది. కమ్యూనిస్టుల ప్యానెల్‌ ఓడిపోయింది.
కమ్యూనిస్టుల బలం ఎక్కువవుతోందని సోషలిస్టు పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. కమ్యూనిస్టులు తాము ఎక్కువ అంచనా వేశామనుకున్నారు. అన్నపూర్ణ వచ్చి ‘‘చూశావా, నేను చెప్పినట్లే జరిగింది’’ అంది గర్వంగా.
‘‘నీ రాజకీయ పరిజ్ఞానానికి నా జోహార్లు ’’ అని నవ్వేసింది శారద.
‘‘నిన్న మన వాదనలతో నువ్వింక నాతో మాట్లాడవేమో అనుకున్నానే’’ అంది అన్నపూర్ణ స్నేహంగా శారద భుజం మీద చెయ్యివేసి.
‘‘అందరం దేశం కోసమే కదోయ్‌ పనిచేస్తున్నాం. భిన్నాభిప్రాయాలుండవా? అంత మాత్రాన మనం మాట్లాడుకోకుండా విరోధం తెచ్చిపెట్టుకుంటామా?’’
‘‘అలాగే అవుతున్నారు శారదా. కాంగ్రెస్‌లో ఒకరి వెనకాల ఒకరు ఏవేవో గోతులు తీస్తుంటారు. అవి భరించలేక మా ఆయన దూరంగా ఉంటున్నారు. నేనూ అంతే, నన్ను భరించలేరు. ఆడదాన్ని కదా. ఇంకా లోకువ.’’
‘‘మీలాంటి వాళ్ళను దూరం చేసుకుంటే కాంగ్రెస్‌కి తీరని నష్టం’’ అన్నపూర్ణ నిరాశగా నవ్వి చెప్పింది. ‘‘కాంగ్రెస్‌లో డబ్బుకి, పదవులకి, పలుకుబడికి విలువ పెరుగుతోంది. నిజాయితీకి, నిస్వార్థానికి మునుపున్న గౌరవం లేదు. ఉన్నవారు ఈ విషయంలో చాలా విచారంగా ఉన్నారు.’’
‘‘లక్ష్మీబాయమ్మ గారెలా ఉన్నారోయ్‌? గుర్తుందా, మన చిన్నతనంలో ధనలక్ష్మి పెళ్ళి తప్పించి లక్ష్మీబాయమ్మ గారి దగ్గరకు పంపాలనుకున్నాం.’’
‘‘ఔను. ఆ రోజుల్లో ఆమె గురించి నీకే ఎక్కువ తెలుసు. నాకేం తెలియదు. ఇప్పుడు నేనావిడ శిష్యురాలిని. శారదనికేతన్‌… ఆ పనీ లేకపోతే నాకు పిచ్చెక్కేది. నువ్వొకసారి వచ్చి చూడు. ఆడపిల్లల చదువు కోసం మేం పడుతున్న కష్టాలు చూడవా? నువ్వు సునాయాసంగా డాక్టరువయ్యావు. అందరూ అలా కాలేరు.’’
‘‘సునాయాసంగా? మర్చిపోయావా? మా నాన్నకి ఎంత పెద్ద కష్టం. మా నాన్నమ్మను నా తొమ్మిదో ఏట చూడటమే. మా నాన్న, నాన్నమ్మ ఒకరంటే ఒకరు ప్రాణం విడిచేవారు. మా నాన్న ముందు చనిపోయారు. మా నాన్నమ్మకు చివరి చూపు కూడా లేదు. నా చదువుకు నాన్నమ్మ ఆ మూల్యం చెల్లించింది. నాన్న తల్లి ఉండీ లేనివాడయ్యాడు. ఇక మా అమ్మ బంధువులతో ఎన్ని మాటలు పడిరదో. ఒంటిచేత్తో ఎన్ని యుద్ధాలు చేసిందో’’ శారద గొంతు తనవారి కష్టాలతో పూడుకుపోయినట్లయింది.
‘‘నిజమేలే. ఒక ఆడపిల్ల డాక్టర్‌ కావాలంటే మాటలు కాదు. కానీ నిన్నూ, నీ నవ్వునీ చూస్తే అసలే కష్టమూ లేకుండా పూలమీద నడిచొచ్చినట్లుంటావు. సరేగాని పెళ్ళి చేసుకోవా? మీ అమ్మ ముఖం చూసైనా ఎవర్నో ఒకర్ని వరించవే’’ తమాషాగా అంది అన్నపూర్ణ.
‘‘వరించటం వల్లే వచ్చాయి తిప్పలు’’ నిట్టూర్చింది శారద.
‘‘అయితే నే విన్నది నిజమేనా?’’ కుతూహలంగా అడిగింది అన్నపూర్ణ.
‘‘ఏం విన్నావోయ్‌’’
‘‘నువ్వు ఎవర్నో ఒక పెళ్ళయినాయనతో…’’
‘‘మీ కాంగ్రెస్‌ వాళ్ళకేం పనిలేదా?’’ మధ్యలోనే ఆపేసింది శారద.
‘‘మా కాంగ్రెస్‌ వాళ్ళే కాదు. మీ కమ్యూనిస్టులే అంటున్నారు. మీ వాళ్ళే అబ్బయ్యతో చెత్తగా మాట్లాడారంట. అబ్బయ్య వాళ్ళను కొట్టినంత పనిచేసి డాక్టర్‌గారంటే ఏమనుకుంటున్నారు. ఆమె పేరెత్తే అర్హత లేదు మీకు అన్నాడట. వాళ్ళింకా వెకిలిగా… ‘నీకూ ఆవిడకీ ఏంటి… నీకు పొడుచుకొచ్చిందేంటి’ అని అసహ్యంగా మాట్లాడారట’’ అన్నపూర్ణ శారద ముఖం చూసి ఆగిపోయింది. కాస్త ఆగి ‘‘క్షమించు శారదా… ఆడవాళ్ళ గురించి వాగటంలో కాంగ్రెసనీ, కమ్యూనిస్టులనీ తేడాల్లేవు. ఇంకా నీ హోదా, ఇంటా, బైటా మీ కుటుంబానికున్న పలుకుబడి, పార్టీ నాయకురాలివవటం వీటన్నింటితో నిన్ను ఉపేక్షిస్తున్నారు. ఇవేవీ లేని ఆడదాని పరిస్థితి…’’
శారద నిరుత్సాహంగా నవ్వింది.
‘‘నాకు తెలుసు గానీ… కమ్యూనిస్టులు ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారు. కొందరింకా పాత సంప్రదాయాల నుంచి బైటపడలేదంతే. వాళ్ళు ఎడ్యుకేట్‌ అవుతారు. మనం వాళ్ళని మార్చాలి. నా గురించి ఎవరేమనుకున్నా నేను లెక్కచేయను. నా గౌరవానికి భంగం కలుగుతుందనుకోను. నన్ను నేను గౌరవించుకున్నంత కాలం ఇతరుల అగౌరవం నన్నేమీ చెయ్యలేదు. నన్నసలు తాకదది’’.
అన్నపూర్ణ శారదను దగ్గరకు లాక్కుని తనకు హత్తుకుంది.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.