ఇనుప ముళ్ళకంచె -వి.శాంతి ప్రబోధ

బిజీగా సర్వ్‌ చేస్తుండగా టీవీలో వార్తలు వినిపించి ఒక్కసారిగా భయంతో కంపించిపోయాడు బలరామ్‌.
ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చేసే పని చేయలేకపోతున్నాడు. అతని ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేస్తున్నట్లు నీరసం ఆవహించింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు.
‘‘ఒరే… చేతిలో ప్లేట్లు పడతాయ్‌ జాగ్రత్త…’’ మేనేజర్‌ అరిచాడు.

‘‘ఏమయిందిరా…’’ గబుక్కున వచ్చి పట్టుకున్నాడు తోటి వర్కర్‌.
ఏమీ కాలేదంటూ యాంత్రికంగా పనిచేస్తున్నాడు గానీ అతని బుర్ర పనిచేయడం లేదు.
తన ఫోటో టీవీలో చూపిస్తే… ఎవరైనా గుర్తుపడితే… గుండె గుభేల్‌మంది.
అంతా తననే గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా అనిపించింది. తలవంచుకున్నాడు.
కొన్ని నెలల ముందు పుట్టి ఉంటే.. నాకూ వాళ్ళలాగే… బుర్ర వేడెక్కిపోతోంది. ఉన్న ఫళాన భూమి చీలిపోయి సీతమ్మవారిని తనలోకి తీసుకుపోయినట్లు తననీ తీసుకుపోతే బాగుండును అనుకున్నాడు.
ఒకరకంగా అదే నయమేమో. ఒక్కసారిగా ప్రాణం పోతుంది. బతికుండి ఇంత బరువు ఎలా మోసేది…? ఇంత చిన్న గుండె అంత పెద్ద బరువు మోయడం ఎంత కష్టమో… బిక్కుబిక్కుమంటూ సర్వ్‌ చేస్తున్నాడు బలరామ్‌.
దాదాపు అన్ని టేబుల్స్‌ దగ్గర జనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించే ఉత్కంఠతో మాట్లాడుకుంటూ… తిట్టిపోస్తూ… వ్యాఖ్యానిస్తూ… అన్నీ బలరామ్‌ చెవిలో దూరుతున్నాయి. అతన్ని కలవరపెడుతున్నాయి. తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఉత్తరాన్నుంచి, దక్షిణాదికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసినా… గత తాలూకు నీలినీడలు వెంటాడుతూనే, వేటాడుతూనే, కంటినిండా కునుకు పోనీకుండానే…
మూలకు కూర్చున్న అమ్మాయిల బృందానికి మరో మారు వడ్డించడానికి కూరగిన్నెల గుత్తితో రాబోయే వాడల్లా రెండడుగులు వెనక్కు వేశాడు. ఆడపిల్లల్ని చూడాలంటే తప్పు చేసిన భావన…ఈ రోజు మరీ ఎక్కువైంది.
ఎర్ర చుడీదార్‌ అమ్మాయి కొంచెం చెట్నీ వేయమని చూస్తోంది. గబగబా చెట్నీ తెచ్చి వేశాడు.
‘‘అసలు అలాంటి నరరూప రాక్షసులని ఇప్పటిదాకా ఉంచకూడదు. అప్పుడే కాలు, చేయి నరికి నడిరోడ్డుపై పడేయాల్సింది’’ కసిగా అంటోంది ఫ్యాన్‌ గాలికి కదిలిపోతున్న జుట్టును ఎడమ చేత్తో సుతారంగా సవరించుకుంటూ రేవతి.
‘‘ఊహు… విరగ్గొట్టడం కాదే ఉరేయాల్సింది, లేదా అక్కడికక్కడ షూట్‌ చేయాల్సింది. ఇంకొకడు అంతటి దుర్మార్గానికి ఒడిగట్టడానికి భయపడి చచ్చేవాళ్ళు’’ కసిగా అంది రుక్మిణి.
వాళ్ళ మాటలు అలలు అలలుగా వచ్చి బలరాంను చేరుతున్నాయి. అతని గుండెని తాటాకు చీరికల్లా చేస్తున్నాయి.
‘‘ఉరెయ్యడం వల్ల సమస్య సమసిపోతుందా? నేరం చేశారో లేదో తేల్చకుండానే ఎన్‌కౌంటర్‌ చేశారు. మరి తర్వాత ఏ అఘాయిత్యం జరగలేదా?’’ మిత్రుల కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది ఎర్రడ్రెస్సు అరుణ.
‘‘క్రూర మృగం వెంటాడుతుంది ఆకలి తీర్చుకోవడం కోసం. అది దాని సహజ లక్షణం. మనిషి లక్షణం అది కాదు కదే’’ నచ్చచెబుతున్నట్లుగా అంది అశ్విని.
ఊర మిరపకాయ నములుతూ ‘‘ఆ క్రూరమృగాలకన్నా క్రూరంగా వెంటాడి వేటాడే దుర్మార్గుల్ని ఉరెయ్యకూడదని అనడానికి మనసెట్లా వచ్చింది నీకు’’ అరుణని చూస్తూ కసిరింది రుక్మిణి.
‘‘బాలనేరస్తుడట బాల నేరస్థుడు… హు… మూడేళ్ళ జైలు శిక్ష చాలని వదిలేశారు. వాడినీ తీసుకొచ్చి జీవితాంతం బొక్కలో తొయ్యాల్సింది. మదంతో కొట్టుకునే మృగం సాధువులా మారి గడ్డితింటుందా?’’ వార్తలు ఆలకిస్తున్న రేవతి వెటకారంగా అంది.
‘‘నిజమేనే… మైనర్‌ అయితే మాత్రం తప్పు తప్పు కాకుండా పోతుందా? వాడు చేసిన దుర్మార్గం, అన్యాయం సమసిసోతుందా? పెద్దవాళ్ళకంటే రాక్షసంగా ప్రవర్తించాడట ఆ మైనర్‌ గాడు. కోర్టులు అదెందుకు పరిగణనలోకి తీసుకోలేదో…’’ ఆలోచిస్తున్నట్లుగా అంది అశ్విని.
‘‘ఆ… వాడు ఇప్పుడు కోర్టు శిక్ష తప్పించుకున్నాడేమో… కానీ, కనిపిస్తే సమాజం ఊరుకుంటుందా? అసలు వీడు రేపిస్టు అని ఒక గుర్తు ఉండేలా వాడి మొహంపై ఏదన్నా గుర్తు వేయాల్సింది’’ కసిగా అంది రుక్మిణి.
‘‘మీలాంటి ఆవేశపరులు ఆ పని చేస్తారనే అతని ఫోటో ఎక్కడా చూపడం లేదు. అయినా నువ్వెవరు, నేనెవరు వాళ్ళని శిక్షించడానికి? మనం రాసుకున్న రాజ్యాంగం ఉంది. చేసుకున్న చట్టాలున్నాయి. చట్టం పని చట్టం చేసుకుపోతుంది’’ అంది అరుణ.
వారి మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ చర్చ ప్రధానంగా తన గురించేనని అర్థమవుతోంది బలరామ్‌కి. ఆ అమ్మాయిల కసి, ఆవేశం అతన్ని కాల్చివేస్తోంది. చలికాలం నెగడులా వారి కళ్ళు, శరీరమంతా శూలాల్లా గుచ్చే మాటలు బలరామ్‌ని నిలువునా దహించివేస్తున్నాయి. గుండె లోతుల్లోంచి దుఃఖం పొంగుకొస్తోంది. తన అవస్థ ఎవరికీ చెప్పుకోలేడు. అలాగని గుండె గూటిలో భద్రంగా దాచలేక విలవిల్లాడిపోతున్నాడు.
మరో క్షణం అక్కడుంటే లోలోపలే దాగిన బడబాగ్నులు లావాలా ఉప్పొంగిపోతాయేమోననే భయం ఆవరించింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి పరిగెత్తాడు. తోటివాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు.
నేరం చేశానని తెలుసు. కానీ అందరూ తనని అసహ్యించుకునే అంతటి నేరం అని తెలియదు. కళ్ళు మూసుకుని అలాగే నిల్చున్నాడు. ఆలోచిస్తున్నకొద్దీ జనం తనపై ఉమ్మేస్తున్నట్లు, రాళ్ళు రువ్వుతున్నట్లు, పరిగెత్తలేక పడిపోతే జనం తొక్కుకుంటూ పోయిన దృశ్యం కళ్ళముందు మెదిలింది. ఒళ్ళంతా చెమటలు… ఒణుకు…
‘‘ఒరే ఏమయిందిరా… ఒంట్లో బాగోలేదా…’’ అంటూ అటుగా వచ్చిన తోటి వర్కర్‌ పలకరింపు. బాగానే ఉందని తలూపాడు, కానీ అడుగు ముందుకు పడలేదు.
వాళ్ళ ఆగ్రహానికి అర్థముంది. వీళ్ళ ఆవేశానికి అర్థముంది. తాను జనం విధించే శిక్షకు అర్హుడే అనుకుంటున్న బలరాంకి ‘‘బలరాం ఎక్కడ? ఆ కస్టమర్స్‌కి ఏం కావాలో త్వరగా చూడండి’’ మేనేజర్‌ మాటలు అతని చెవిన పడటం లేదు. వాడిని చంపండి, ఉరెయ్యండి అంటూ తన వెంట పడుతున్న అమ్మాయిలే కనిపిస్తున్నారు. ఆ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి.
‘అత్యంత క్రూరంగా చంపే వీళ్ళను ఉరితీస్తే మానవహక్కులు గుర్తొస్తాయి కొందరికి. మరి వీళ్ళు చంపేవాళ్ళ హక్కుల సంగతేమిటో…’ అరుణకేసి గుర్రుగా చూస్తూ దీర్ఘం తీసింది రేవతి.
‘నిజమే, తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు చేసినవాళ్ళని శిక్షించాల్సిందే. కానీ ఇటువంటి సంఘటనలకు ఉసిగొల్పే దురహంకారం ఉంది చూడండి ముందు దాన్ని చంపేయాలి. మనుషుల్ని కాదు’ అని అప్పటివరకూ మౌనంగా ఉన్న ఉష తన అభిప్రాయం చెప్పింది.
పక్క టేబుల్స్‌ వాళ్ళు తమ పని కానిస్తూనే ఆ ఐదుగురు మహిళల సంభాషణ ఆసక్తిగా వింటున్నారు.
‘‘అంటే… ఏంటి నీ ఉద్దేశం’’
‘‘ఆ దుర్మార్గులకు మంచి మాటలు చెవికెక్కుతాయా… కరుకు కసాయి గుండెలు కరుగుతాయా… అలా కరిగేవారయితే ఆమె వేడుకోళ్ళకి అప్పుడే కరిగి ఉండేవారు. అంతటి దారుణానికి పాల్పడేవారేకాదు’’ ఆవేశంగా అంది రేవతి.
‘‘ఉరి తియ్యకుండా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తమరు…? మీరు మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించండి నాయనా… నాలుగు రోజులు అత్తారింటికొచ్చిన కొత్త అల్లుడిలా జైల్లో గడుపుతారు… తర్వాత వాళ్ళే వదులుతారు… అంతేగా…’’ ఎద్దేవా చేస్తూ అంది రుక్మిణి.
‘‘నిన్నూ… నీ మాటల్నీ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందే. మహిళా ఉద్ధకురాలివనుకుంటే… నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నువ్వేదో గొప్ప మానవతావాదిని అనుకుంటున్నావేమో… ఇట్లా వదిలేస్తే నువ్వూ, నేనూ… మనలాంటి ఆడవాళ్ళెవరైనా ఇల్లు దాటి బయట తిరగ్గలరా?’’ నిలదీసింది అశ్విని.
‘‘ఇంట్లో మాత్రం మనకి రక్షణ ఉందని మీరనుకుంటున్నారా?’’ సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఉష.
‘‘మరి శిక్షల వల్ల మార్పు రాదనే మీ మానవతావాదులు ఈ దుర్మార్గుల్ని వదిలేస్తే ఇలాంటి నేరాలూ, ఘోరాలూ మళ్ళీ చేయరని గ్యారంటీ ఇస్తారా’’ ఉషని సవాల్‌ చేస్తూ ప్రశ్నించింది రుక్మిణి.
‘‘ఇప్పుడు ఇలా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయింది’’ సాగదీసింది అశ్విని.
‘‘మీ ఆవేదనని అర్థం చేసుకోగలను. ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఏ మాత్రం గౌరవం, విలువ ఇవ్వని సమాజంలో ఉన్నాం మనం. మన ఇళ్ళల్లో మనతోపాటే పుట్టిన మగపిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరి మీదకు వదిలేస్తారు, ఉసిగొల్పుతారు. వాడేం చేసినా వాడు మగాడు అంటూ గొప్పదనం అంటగడతారు. మనకి అలా ఉండాలి, ఇలా ఉండాలి, తలెత్తి నడవకూడదు, నిండుగా బట్టలేసుకోవాలి అని సవాలక్ష జాగ్రత్తలు, ఇంట్లోంచి బయటికి రావడానికి ఎన్నెన్నో ఆంక్షలు… మరి మన ఇళ్ళల్లో మన అన్నలు, తమ్ముళ్ళు ఏ అర్థరాత్రో వచ్చినా పట్టించుకోరు. మనకు ధైర్యంగా ఉండమని చెప్పడం ఎలాంటి పరిస్థితుల్నయినా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం కలిగిస్తున్నారా… లేదు. ఆడపిల్లలతో ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో, గౌరవంగా ఉండాలో మన అన్నలకి, తమ్ముళ్ళకి చెప్తున్నారా? లేదు. మన ఇళ్ళల్లో మన అమ్మలపై మన నాన్నలు చేసే జులుం, హింస మనం చూస్తూనే ఉన్నాం. మనని ఎంత చులకన చేసి మాట్లాడతారో అంతా మన అన్నలు, తమ్ముళ్ళు చూస్తూనే ఉన్నారు కదా. మరి వారూ అదే కదా నేర్చుకునేది. ఈ భావజాలం ఇలాగే కొనసాగినన్నాళ్ళూ మహిళలపై రకరకాల రూపాల్లో హింస కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న చట్టాలు ఎంతమందికి ఎన్ని శిక్షలు వేసినా పరిస్థితి మారుతుందని నేననుకోవటం లేదు’’ అన్నది ఉష.
‘‘ఇలాంటి సంఘటనలు మన దేశంలో కొత్తేమీ కాదు కదా. కానీ… ఊరందరి ముందు తల్లిని, చెల్లిని వివస్త్రలను చేసిన గ్రామ పెద్దలు ఆ తల్లి కన్నకొడుకులనే లైంగిక అత్యాచారం జరపాల్సిందిగా ఆదేశించారంటే… మహిళల్ని ఎంత గౌరవిస్తున్నారో ఆలోచించండి. ఆగ్రహావేశాలు, ప్రతీకార కాంక్ష మన చూపుని మసకబారుస్తాయి. కాస్త హేతుబద్ధంగా ఆలోచించండి’ గొంతులో బాధ సుడులు తిరుగుతుండగా అంది అరుణ.
‘‘ఈ ఆడాళ్ళకిదేం పోయే కాలమో. సగం సగం గుడ్డపీలికలేసుకుని రోడ్డు మీదకు ఎగబడతారు. ఆవురావురుమంటున్న వాడెవడో చెయ్యేస్తే అరిచి కాకిగోల చేస్తారు. అర్థరాత్రి, అపరాత్రి అని లేకుండా వాళ్ళని రోడ్లపై ఎవరు తిరగమన్నారు?’’ అవతలి టేబుల్‌పైనున్న జీన్స్‌, షార్ట్స్‌ కుర్రాళ్ళు.
‘‘వీడి మొహం మండా. చూడబోతే మోడర్న్‌గా కనిపిస్తున్నాడు. వాడి బుర్రకి మాత్రం చెదలు పట్టి, అసహ్యంగా… వాడు అర్థరాత్రిదాకా తిరగొచ్చు కానీ ఆడవాళ్ళు తిరిగితే తప్పట. జెండర్‌ సెన్సిటివిటీ అస్సలు లేదు. తామేదో ప్రివిలైజ్డ్‌ అనుకుంటారు వెధవలు’’ గొణిగింది ఉష మిత్రురాళ్ళకేసి చూస్తూ.
‘‘అవునే వాడన్నదీ నిజమే కదా?’’ రెట్టించింది రుక్మిణి.
‘‘ఛీ… ఛీ… ముందు నీ బుర్రకి పట్టిన చీడ వదల్చాలి’’ విసుక్కుంది ఉష.
‘‘ఇక్కడ మీరో విషయం మర్చిపోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేరస్థులకు
ఉరిశిక్ష వేస్తే నేరం బయటికి రాకుండా ఉండడానికి అత్యాచారాల తర్వాత హత్యలు జరిగే అవకాశం
ఉందని మహిళా సంఘాలు అంటున్నాయి కదా’’ అంది అరుణ.
‘‘చాల్లేవే… మా చెప్పొచ్చారు వాళ్ళూ… నువ్వూనూ’’ అంది రేవతి.
‘‘ఆపండే.. మీ దాడి. మహిళ సమాన హక్కుల కోసం పోరాడేవాళ్ళని సంఘ వ్యతిరేకులంటారు. అలాంటి వారి కృషి ఫలితంగా సాధించుకున్న హక్కుల్ని అనుభవిస్తూనే ఉంటారు. మోడ్రన్‌ డ్రెస్సులు వేసుకోవడం కాదే, మోడ్రన్‌గా ఆలోచించడం అవసరం. మహిళల పట్ల జరుగుతున్న అరాచకాల్ని, అమానవీయ సంఘటనల్ని మనం ఎదుర్కోలేకపోయినా ముందుండి మనందరి కోసం కృషి చేసేవాళ్ళపై బురద జల్లడం ఆపండి. వాళ్ళు మనలాగా ఇళ్ళల్లో కూర్చొని విన్న వార్తల్ని పట్టుకుని ఆషామాషీ కబుర్లు చెప్పడం లేదే. పితృస్వామ్యం మనమీద చేసే జులుంపై పోరాటం, ఉద్యమాలు చేస్తున్నది వీళ్ళే. శిక్షలు పడేలా చూసేది వాళ్ళే. రేపు కూడా కృషి చేసేది వాళ్ళే. అలాంటిది వాళ్ళలా ఎందుకంటున్నారో ఆలోచించండి’’ తీవ్రంగా అంది ఉష.
‘‘అదంతా ఏమో కానీ… ఆ నలుగురితో పాటు ఆ మైనర్‌ని కూడా ఉరికంబం ఎక్కిస్తే నాకెంతో ఆనందంగా ఉండేది. మైనర్‌ అని శిక్ష తప్పించుకోవడం నాకేమాత్రం నచ్చలేదు’’ అంది అశ్విని.
‘‘అలాంటి వాళ్ళకు ఇంట్లో అమ్మా, అక్క, చెల్లి ఎవరూ గుర్తురారా?’’ రేవతి ప్రశ్న.
‘‘నేరం చేసినవాళ్ళదేనా… వాళ్ళను అలా మలిచిన మన సామాజిక వ్యవస్థ కాదా?’’ ప్రశ్నించింది ఉష.
వాళ్ళు భోజనం చేస్తూ చర్చ చేస్తూనే ఉన్నారు.
మేనేజర్‌ మళ్ళీ మళ్ళీ అరవడంతో ఉబికివస్తున్న కన్నీటిని రెప్పలకిందే దాచి పనిలో పడ్డాడు బలరాం.
యాంత్రికంగా పనిచేస్తున్నాడే కానీ మెలిపెడుతున్న బాధ. బుల్లెట్‌ కంటే వేగంగా దూసుకొస్తోన్న జనం మాటలు రంపంలా కోసేస్తున్నాయతన్ని. అనుభవించక తప్పదు… తప్పదు…
నేను చేసినదేమన్నా చిన్నా చితకా పనా…
అత్యంత దారుణంగా, కిరాతకంగా అమ్మలాంటి ఓ ఆడదాన్ని చెరపట్టాను. ఎదురు తిరుగుతోందని జన్మనిచ్చే అవయవాన్ని కుళ్ళబొడిచాను. అదో వీరోచిత కార్యంగా ఫీలయ్యాను ఆ క్షణంలో. నాకన్నా పెద్దవాళ్ళు చేస్తున్న పనిలో నేనున్నందుకు వికృతానందం పొందాను.
అసలు నేనెందుకలా మారిపోయాను? అంత విచ్చలవిడిగా ఎట్లా తయారయ్యాను? కారణం నేనా… లేక నా పరిస్థితా? కుంచించుకుపోతున్న బలరాం మనసులో జడివానలాగా కురుస్తున్న ఆలోచనలు.
నేనెవరో, నా గతం ఏంటో తెలియని ప్రదేశంలో, అందరూ ఉండీ ఎవరూ లేనివాడిలా… ఎందుకీ బతుకు? ఎవరికోసం? పుస్తకాలే లేకపోతే మరెంత ఒంటరితనం అనుభవించేవాడో.
ఎవరితో మాట్లాడాలన్నా బెదురు. జనంలోకి వెళ్ళాలంటే బెరుకు. బోస్టల్‌ స్కూల్‌లో తనలాంటి పిల్లల మధ్య
ఉన్నప్పుడు లేని భయం జనంలోకి వచ్చాక…
జైలులో ఉండగానే కోల్పోయిన చదువుకు అవకాశం రావడంతో సీరియస్‌గా చదివి 10వ తరగతి పరీక్షలు రాశాడు. అక్కడుండగానే ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు రాయడం మంచి మార్కులతో పాస్‌ అవడం జరిగిపోయింది. మూడేళ్ళ శిక్ష ముగిసింది. అక్కడినుండి పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి.. అని నాలో నేనే మధనపడేవాడ్ని. ఈ మూడేళ్ళలో నా కోసం నాన్న ఒక్కసారి కూడా రాలేదు. పిన్ని రానివ్వలేదేమో. మరి చెల్లి? తనేమయినట్లు.
ఒక్కసారి చెల్లిని చూడాలనే కోరిక వెల్లువెత్తింది. కానీ వెళ్ళలేడు. చూడలేడు.
‘ఆసరా’ సంస్థ బలరాం బాధ్యత తీసుకుంది. ఉపాధి మార్గం ఆలోచించి హోటల్‌్‌ మేనేజ్‌మెంట్‌ ఆరు నెలల కోర్సులో చేర్చారు. త్రీస్టార్‌ హోటల్‌లో ట్రైనీగా చేరాడు. ఎవరూ తెలియని మనుషుల మధ్య, తన భాష కాని భాష మనుషుల మధ్య, వాళ్ళలో ఒకడుగా కలిసిపోయి ఉంటున్నాడు. హైదరాబాద్‌ సిటీ అక్కున చేర్చుకుంది. ఇక్కడి భాషను అర్థం చేసుకోగలుగుతున్నాడు. కానీ ఎవరితో ఎక్కువగా స్నేహం లేదు. పని… పని, ఆ తర్వాత రూంకి చేరి విశ్రమించడం…అదే తన జీవితం అయిపోయింది. ఎవరితో ఎక్కువగా మాట్లాడినా తన పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడ అడుగుతారోనని భయం. వార్తలు కూడా అంతగా పట్టించుకునేవాడు కాదు. అలాంటిది ఈ రోజు… ఇలా…
చేతిలో సాంబారు బకెట్‌తో నిల్చున్న బలరాంకి గతం కళ్ళముందు కదలాడిరది.
… … …
వీథిలో బండిపై పాత ఇనుప సామాను, ప్లాస్టిక్‌ సామాను వ్యాపారం చేసే నాన్న తెచ్చే సంపాదనలో అమ్మ, చెల్లి, తాను ఎంత హాయిగా ఉండేవాళ్ళు. తను, చెల్లి చక్కగా బడికిపోయి చదువుకునేవాళ్ళు. పదో తరగతికి వచ్చాడు. చెల్లి ఆరులోకి వచ్చింది. ఎప్పట్లానే ఆ రోజు బడినుండి వచ్చేటప్పటికి అమ్మ ఉరేసుకుంది.
నాన్న కొడితే, ఇంట్లోకి పైసలు ఇవ్వకపోతే మాత్రం అమ్మ ఉరేసుకోవాలా? అందరు అమ్మలూ అట్లాగే ఉరేసుకుంటున్నారా? అని అమ్మమీద చాలా కోపమొచ్చింది.
నాన్న పని తప్ప మమ్మల్ని పట్టించుకున్నది తక్కువే. చాలాసార్లు అమ్మతో గొడవపడేవాడు. నాన్న ఎప్పుడూ అంతే. అమ్మ మమ్మల్ని వదిలి కానరాని లోకాలు పోవడమేంటి?
ఆ రోజు చాన్నాళ్ళకి నాన్నమ్మ వచ్చింది. అమ్మ, నాన్న గురించి కళ్ళనీళ్ళతో ఏదో చెప్పింది. నాన్న మగాడు.
ఒకళ్ళు కాకపోతే నలుగురితో ఉండొచ్చని నాయనమ్మ అమ్మనే తిట్టింది. దానికే అమ్మ చనిపోవాలా? పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది అట్లా చేయడంలేదు అని నాన్నమ్మ వచ్చిన అమ్మనే తిట్టిపోసింది.
మా అమ్మ చచ్చిపోయిన విషయం ఎవరికీ తెలియదు. పనుల నుండి జనం ఇళ్ళకు వచ్చేసరికి మా మకాం మారిపోయింది. రెండు రోజులు రోడ్లపైనే. తర్వాత దూరంగా మరో బస్తీలోకి మకాం పెట్టాడు. అక్కడికి మా నాన్న స్నేహితురాలు రావడం, ఆమె మాతో కలిసి ఉండటం జరిగిపోయింది. మాతోపాటే ఉంటుందని, తనని అమ్మ అని పిలవాలని నాన్న హుకుం జారీచేశాడు.
మేం అమ్మా అని పిలవలేకపోయాం. చచ్చిపోయిన మా అమ్మే మా కళ్ళముందు కదులుతోంది. ఆమెను పిన్నీ అని పిలవటం అలవాటు చేసుకున్నాం. నేను చెల్లి బడికి పోవట్లేదు. అక్కర్లేదు ఏదో పని చూసుకోమన్నాడు నాన్న. చెల్లి ఇంట్లో పనికి పరిమితమైంది. నేను గాలిగా బజార్లు పట్టుకు తిరగడం…
ఒక్కటే గది ఇంట్లో. పిన్నితో తండ్రి పెనుగులాటలు… వేడి నిట్టూర్పులు…
ముసుగుపెట్టిన చినిగిన దుప్పట్లోంచి చూడడం కంటే కొత్తగా దొరికిన మిత్రుడి దగ్గర అటువంటి సినిమాలు, దృశ్యాలు మొబైల్‌లో ఏ రైలు పట్టాలమీదనో, ఏ పార్కులో చెట్టు కిందనో కూర్చొని చూడడం వ్యసనంగా మారిపోయింది.
మరో పక్క శరీరంలో కలిగే మార్పులు… అటువైపు ఆకర్షిస్తూ…
ఓ మెకానిక్‌ షెడ్‌లో పనికి కుదరడం… పని నేర్పే పేరుతో తనకు దగ్గరగా ఉండే తనకంటే పెద్దవాడయిన ఒకడు తనపై పడి అత్యాచారం జరపడం…
తనలో ఒకలాంటి కసి… తననీ నేరం వైపు మళ్ళించిందేమో… తనని రెచ్చగొడుతూ తోటివాళ్ళు చేసే వ్యాఖ్యానాలు…
చెల్లి ఎట్లా ఉందో… ఏమి చేస్తోందో… తన చెల్లిని ఎవరైనా ఇలాగే చేస్తే… అమ్మో… లేదు లేదు అలా జరగకూడదు.
ఆడవాళ్ళంటే… ఎప్పుడూ ఎవరూ ఆమెను మనసున్న మనిషిగా చూడడం తనకు తెలియదు. రోడ్లమీద సినిమా బొమ్మలు, వస్తువులు అమ్మే బొమ్మలు… అన్నీ ఆమెను ఒక వస్తువులాగే చూపిస్తున్నాయిగా…
కనీసం బడి కూడా బతుకు గురించి చెప్పలేదే…
అసహాయ స్థితిలో, ఆమె ఆసరా కోసం వెతుకుతోంటే తనేం చేశాడు…
నాకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నట్లు, పక్కనున్న వాడి దగ్గర ఉంటే బలవంతంగా గుంజుకున్నట్టే ఆమెనీ అనుకున్నా… కానీ…
చుట్టూ మరో కంటికి కనిపించని ఇనుపముళ్ళ కంచె. ఏ మాత్రం కదిలినా అది చేసే ఎర్రటి లోతైన గాయాలు… ఏ మందు పూసి ఈ బాధ నుండి బయటపడగలడు? ఏం చేసి వెలుతురు మైదానంలోకి అడుగుపెట్టగలడు?
జీవితాన్ని గట్టిగా కావలించుకున్నానని ఆనందపడ్డానిన్నాళ్ళూ…
కానీ, నాకు తెలియకుండా నా జీవితం ఎప్పుడో చేజారిపోయిందని, నన్ను నేను కోల్పోయానని, నడిచే పీనుగునని ఇప్పుడు అర్థమవుతోంది.
మళ్ళీ మొలకెత్తే అపురూప అవకాశం కనుక వస్తే… కొత్త విత్తనంగా మొలకెత్తాలనీ…
మేనేజర్‌ చివాట్లతో ఈ లోకంలోకి వచ్చిన అతని తల మరింత వాలిపోయింది.
తాను సర్వ్‌ చేస్తున్న టేబుల్స్‌కేసి చూశాడు.
ఖాళీ… ఆ అమ్మాయిలు లేచి వెళ్ళబోతున్నారు.
ఇంగితాన్ని పొరలు పొరలుగా తొలుస్తున్న భయం బలరాం దిగులు మొహంలో.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.