దొరైస్వామి అలియాస్‌ రేవతి -డా॥ పి. కుమారి నీరజ

ఈమధ్య రోడ్లమీద అడుక్కునే హిజ్రాలను చాలామందిని గమనించాను. అందరూ వారిని విసుక్కోవడం, ఎగతాళి చెయ్యడమూ, అసహ్యించుకోవడమూ చూశాను.

ప్రపంచం మొత్తంమీద 1.50 లక్షలపైన ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారని అంచనా. స్త్రీ పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని నపుంసకులు అంటారు. వీరిని వ్యవహారంలో హిజ్రా, కొజ్జా, గాండు, పేడి అనే పేర్లతో పిలుస్తారు. పుట్టుకతో ఈ లక్షణాలున్నవారు కొందరు, తమ ఇష్టానుసారం మారే వారు మరికొందరు. వీరికి కుటుంబ, సామాజిక ఆదరణ లేకపోవడంతో సమూహాలుగా జీవిస్తారు. భిక్షాటన, వ్యభిచారం వీరి ప్రధాన వృత్తులు. మన సాహిత్యంలో అర్జునుడు బృహన్నలగా నపుంసకుడి వేషధారణలో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం గడుపుతాడు. భీష్ముడు మహాభారత యుద్ధంలో నపుంసకుడి(శిఖండి)తో పోరాటానికి నిరాకరిస్తాడు.
మన దేశ చరిత్రలో హిజ్రాలు, లింగ మార్పిడిదారుల ఉనికి ఉంది. కానీ బ్రిటిష్‌ పాలకులు వీరిని నేరస్ధులుగా ముఠాగా ముద్రవేయడంతో వీరిని అపార్ధంచేసుకోవడం ప్రారంభించారు. అప్పటినుండి వీరిని సమాజం వెలివేస్తోంది. అవమానాలపాలవుతున్నారు. లైంగిక దోపిడీకి గురవుతున్నారు. తమ కుటుంబాలనుండి దూరం చేయబడుతున్నారు. ‘ఒక హిజ్రా ఆత్మకథ’ నవలలో దొరైస్వామి అలియాస్‌ రేవతి తాను ఎదుర్కొన్న సంఘటనలగూర్చి చెబుతుంది. ఇదంతా ఎవరి సానుభూతికోసమో కాదు. అందరి మనుషుల్లా హిజ్రాలకూ ఆశలూ, కోరికలూ, ఆలోచనలూ ఉంటాయి కాబట్టి తోటి మనుషులుగా గుర్తించమని ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా నిస్సంకోచంగా మనసుకు హత్తుకునేట్లు చెప్తుంది. ఇంట్లో ఆమె పడ్డ కష్టాలు, ఇంట్లోవాళ్ళు ఆమెను చూసిన విధానం, ఆమె లింగమార్పిడి శస్త్ర చికిత్స, ఆమెను పోలీసులు పెట్టిన చిత్రహింసలు, ఆమె లైంగిక కోర్కెలు, క్లయింట్స్‌ గురించి, పురుషాధిక్యత గూర్చి ఆమె చేసిన విమర్శలూ, వ్యాఖ్యలు స్త్రీ పురుషులతోపాటు మూడవ లింగాన్ని కూడా మానవీయంగా అర్ధంచేసుకోవాలనే అవగాహన కల్గిస్తుంది.
రేవతి తనపై జరిగిన హింసనూ దౌర్జన్నాన్నీ ఒక్కొక్కటిగా చెబుతుంటే దిగ్భ్రమ, అపరాధ భావం మనలో కనబడక మానదు. ఈమె ఆత్మకథ వ్యక్తినుంచి సమాజానికీ, సమాజం నుంచి వ్యక్తికీ తన కథనాన్ని ఫోకస్‌ చేస్తూ ఉన్నప్పుడు సమాజం ఒక హిజ్రా జీవితంలోని అన్ని అంశాలనూ శరీరానికి సంబంధించినవిగానే ఎట్లా చూస్తుందో అర్ధమవుతుంది.
తమిళనాడులోని సేలం జిల్లా నామక్కల్‌ తాలూకాలోని ఒక చిన్న గ్రామంలో ఐదో సంతానంగా పుట్టిన దొరైస్వామి అలియాస్‌ రేవతి కథ ఈ నవల. రచయిత్రి, క్రియాశీల కార్యకర్త, నటి ఐన ఎ. రేవతి బెంగుళూరులో ఉంటారు. లైంగికతను సాధారణేతరంగా ఎంచుకోవడంవల్ల, సమాజంచేత వేధింపబడుతున్న మైనారిటీల హక్కులకోసం కృషి చేస్తున్న ాసంగమ్ణ అనే సంస్థలో పని చేసేది.
ఉనర్వుమ్‌ ఉరువమమ్‌ అనే పేరుతో తన ఆత్మకథ రాశారు. దీన్ని విజయవాడ వాసి, తెలుగు కథా రచయిత్రి పి. సత్యవతి తెలుగులోకి అనువదించారు. ఈమె ఈ పుస్తకం రాయడంలోని ఉద్దేశం ఒక పురుషుడుగా పుట్టి, స్త్రీ భావాలతో స్త్రీగా మారడానికి పడ్డ కష్టాలు, హిజ్రాగా అనుభవించిన వేదన, హేళన, అవమానాలు, వివక్షా, లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి సెక్స్‌వర్క్‌లోకి దిగి రౌడీలు, పోలీసులచేత పడ్డ చిత్రహింసలు, తన అనుకున్న కుటుంబంచేత ఛీత్కారాలు, వెలివేయడాలు, హిజ్రాల జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలు గూర్చి అందరికీ తెల్పడం. ఎవరి సానుభూతి కోసమో కాదిది. గౌరవప్రదమైన బ్రతుకుకోసం. సమాజంలో అందరిలా స్వేచ్ఛగా, హాయిగా బ్రతికే హక్కుందని, కష్టపడి పని చేయగల శక్తి ఉందని, అవకాశం కల్పిస్తే మంచి పనులు చేసే సామర్థ్యం ఉందని నిరూపించడం.
చిన్నప్పటినుండి ఆడపిల్లలతోనే కలిసి బడికి వెళ్ళడం, వాళ్ళతోనే ఆడుకోవడం, వాళ్ళాడే ఆటలే ఆడుకోవడం ఇష్టం. ఇంటిముందు వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టడం, గిన్నెలు తోమడం, ఇల్లు కడిగి తుడవడం వంటి పనుల్లో తల్లికి సాయంగా ఉండేవాడు. బడినుండి ఇంటికొచ్చిన వెంటనే వాళ్ళక్క బట్టలు వేసుకోవడం చూసి అందరూ చిన్నతనం కదా పెద్దైన తర్వాత అన్నీ మానుకుంటాడులే అని అనుకునేవారు. బడిలో అబ్బాయిలూ, ఇరుగుపొరుగువారూ నిఒరేయ్‌! తొమ్మిదో నంబరూ!ు అని వెక్కిరించడం, నిఆడంగి వాడునడం భరించాడు. 7వ తరగతిలో స్కూలు వార్షికోత్సవంలో హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషం వేయడం, అందరూ అమ్మాయిలాగే
ఉన్నావని మెచ్చుకోవడం ఆనందాన్నిచ్చింది. స్కూల్లో ఏడిపించే మగపిల్లలంటే భయం.
తన భావాలను అన్నలకు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేడు. ఈ బాధతోనే స్కూలుకు వెళ్ళడం తగ్గింది. తనలో జరుగుతున్న సంఘర్షణ ఎవరికి అర్ధమవుతుంది. ఊర్లో మరియమ్మ తిరుణాలకు బంజారా అమ్మాయి వేషం వేసినప్పుడు నిజంగా స్త్రీయే అనిపించింది తనకు. తనలో అణచిపెట్టుకున్న భావాలను ప్రదర్శించే అవకాశం ఈ వేషంవల్ల వచ్చిందని ఆనందం. యువకులను చూసినపుడు సిగ్గనిపించడం, అప్రయత్నంగా తలవంచుకునిపోవడం వాళ్ళవైపు ఆకర్షితుడవడం, నిమగవాడినైన నన్ను స్త్రీలు ఎందుకు ఆకర్షించడం లేదుని ఆశ్చర్యపడటం, నేను మగవాళ్ళను ప్రేమించడమేమిటి? ఇలాంటి భావాలు నాకొక్కడికేనా? ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? అలాంటివారిని నేను కనుక్కోగలనా? ఇటువంటి సందేహాలు నిండిపోయేవి. వాటితోనే బతికేవాడు. 10వ తరగతికొచ్చేసరికి శరీరంలో, మనసులోనూ మార్పులు. ఒక మగ శరీరంలో ఇరుక్కుపోయిన స్త్రీని అనుకునేవాడు. దేవుడెందుకిలా చేశాడని కుమిలిపోయేవాడు. చదువు బుర్రకెక్కేది కాదు. మనసులో ఆలోచనలు, అయోమయం, ఆదుర్దా.
మళ్ళీ మరియమ్మ తిరణాల్లో అమ్మవారిముందు ఆడవేషంలో నాట్యం చేసి నా భావాలకు ఒక రూపం ఇచ్చాను అనుకున్నాడు. ఆ బట్టలు మార్చుకునేటప్పుడు చాలా బాధ. తన అసలురూపం ఇదేనని మారువేషంలో రోజూ ఉంటున్నానని అనుకునేవాడు.
నామక్కల్‌లో ట్యూషన్‌కు వెళ్ళి వచ్చేటప్పుడు సాయంత్రం ఎవరూ లేని సమయంలో కొండపైనున్న కోట దగ్గరకు ముగ్గురు వ్యక్తులు రావడం స్త్రీలలా సంబోధించుకోవడం, నాట్యం చేయడం ఆనందంగా గడిపి వెళ్ళడం గమనించాడు. వాళ్లు తనలాంటి వారేనని అర్ధమై వాళ్ళతో చేరి ఆడిపాడటం అలవాటు చేసుకుని సంతోషపడ్డాడు. రౌడీలు వీళ్ళపై దందా చేసి లైంగిక వేధింపులకు గురి చేసేవాళ్ళు. ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేరు. ఇళ్ళలో వీళ్ళకు నచ్చినట్లు వీళ్ళు ఉండలేరు. పట్నంలో తెలిసినవారుండని బస్సుల్లో స్త్రీలలాగా మేకప్‌ వేసుకుని ఆనందంగా గడిపేవారు.
ఒక స్త్రీలా జీవించాలని కోరిక, కానీ ప్రజలేమనుకుంటారోనన్న భయం.
దొరైస్వామి తన స్నేహితులతో పాటు దిండిగల్‌లో ఆపరేషన్‌ చేసే అమ్మదగ్గరకెళ్ళి రేవతిగా పేరు మార్చుకున్నాడు. ఇక్కడే ఆడవాళ్ళలా చీరకట్టుకున్నారందరూ. దొరైస్వామికి 14,15 సంవత్సరాల వయసప్పుడు అచ్చం అమ్మాయిలాగే ఉండటంతో అక్కడున్న వాళ్ళందరూ నిర్వాణం (పురుషాంగాన్ని తొలగించుకునే ఆపరేషన్‌) జరిగితే అచ్చం ఆడపిల్లలా ఉంటాడన్నారు. తర్వాత రేవతి ఢల్లీి వెళ్ళింది. ఢల్లీిలో నానీ ఇంట్లో ఉంటుంది. గురువుతో పాటు తక్కిన వాళ్ళు దుకాణాలకు వెళ్తారు అడుక్కోవడానికి. జుట్టు పెరిగేదాకా హిజ్రాలు రానివ్వరు. పెద్ద జుట్టు లేకుండా, ఆపరేషన్‌ కాకుండా ఢల్లీిలో ఉండటం కష్టమని, హిజ్రాలకు అగౌరవమని రేవతిని ముంబయ్‌లోని హిజ్రాల స్ధావరానికి పంపారు. తర్వాత గురువు తెచ్చుకుంటానంది.
ముంబైలో గురువు (తల్లి)దగ్గర ఉండాలి. హిజ్రాల్లో శిష్యురాలికి గురువే సర్వస్వం. ఉండడానికి చోటు చూపించడం, పని నేర్పించడం అన్నీ గురువే. ఇక్కడ నానీ పరివారం 500 మంది హిజ్రాలు. అందులో శిష్యులు, కూతుళ్ళు, మనవరాళ్ళు, మునిమనవ రాళ్ళు కూడా ఉంటారు. ఇందులో కొందరు తమిళనాడు, ఢల్లీిల్లో ఉంటారు. కొంతమంది సింగపూర్‌ వంటి ప్రాంతాల్లోనూ ఉంటారు.
ముంబైలో నానీకి స్వంత ఇళ్ళు ధనవంతులుండేచోటే ఉంది. వీరికి ముంబయ్‌లో వ్యభిచార గృహాలుంటాయి. నానీ పై భయము భక్తి అందరికీ. ముంబైలో కామాటిపురా, భాండుప్‌, సోనాపూర్‌, ములుంద్‌, కోలివాడ, మాతుంగా, మాహిమ్‌, బైకుల్లాల్లో ఎక్కువగా హిజ్రాలుంటారు. చాలామంది దుకాణాలకెళ్ళి డబ్బు అడుక్కుంటారు. బదాయికీ వెళ్తారు. సెక్స్‌వర్క్‌ కూడా కొంతమంది చేస్తారు.
వీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒకరి సాధకబాధకాలను ఒకరు పంచుకుంటారు. ఆపరేషన్‌ చేయించుకున్న రేవతి ఆమె గురుబాయ్‌ చేలా చెన్నైనుంచి ముంబై వెళ్ళడానికి డబ్బులేక రైల్వేష్టేషన్లో ఉన్నప్పుడు ఆకలితో నీరసించిఉన్న వీళ్ళను ఎవరూ పట్టించుకోలేదు. అక్కడికొచ్చిన నలుగురు హిజ్రాలు చూసి అక్కున చేర్చుకున్నారు. హిజ్రాలకు ఏమున్నా లేకపోయినా తోటి హిజ్రాల సాహచర్యముంటే చాలు. ఒక హిజ్రా బాధ మరోహిజ్రాకే తెలుస్తుంది.
ఆపరేషన్‌ చేసుకున్నవాళ్ళని చూసి అసహ్యించుకునేవారు కొందరు. నువ్వు అందరు మగవాళ్లలా ఎందుకుండవు? మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేసుకోక! అని చీదరించుకుంటారు. వీళ్ళు అడుక్కోవడానికీ, సెక్స్‌వర్క్‌ చేయడానికీ పుట్టలేదు. అందరిలాగే తల్లిదండ్రులకు పుట్టారు. విదేశాల్లోలా అన్ని హక్కులూ కల్పించాలని గౌరవప్రదమైన బతుకు బతకాలని పరితపిస్తున్నారు.
వీరిని మనుషులకిందకూడా చూడరని వీరి బాధ. ఏ లింగానికీ చెందకుండా ఉండటం కన్నా అవయవ లోపంతో పుట్టినా బాగుండేదని అనుకునేవారు.
ఎండైనా వానైనా దుకాణాలకెళ్ళాల్సిందే. అప్పుడప్పుడూ కూరగాయల మార్కెట్‌కెళ్ళి అడుక్కొచ్చుకుంటారు. పురుషుల్ని చూసినప్పుడు వీరికి వారిపట్ల ఆకర్షణ కల్గేది. వారిని ప్రేమించాలని అనిపించేది. కానీ ఒక హిజ్రా ఎలా ప్రేమలో పడగలదు. వీరికి స్త్రీలలా పెళ్లి చేసుకుని జీవితంలో స్ధిరపడాలని కోర్కెలుంటాయి. కొంతమంది హిజ్రాలు ఇద్దరు కలిసి భార్యాభర్తల్లా బతుకుతుంటారు. కొందరు గురువులనొదిలేస్తారు. స్వతంత్రంగా ఇష్టమొచ్చినట్లు బతుకుతారు.
హిజ్రాలు కొందరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే, కొందరు వీళ్ళను పెళ్లిచేసుకుని వీళ్ళదగ్గరున్న డబ్బంతా లాక్కుని వీళ్ళను తన్ని తరిమేసేవాళ్ళు. కొందరు హిజ్రాల భర్తలు ముఖాలమీద బ్లేడుగాట్లు పెట్టేవారు, బలవంతంగా విషం తాగించేవారు, కాల్చేవారు. గురువులు కొందరు తొందరగా నిర్వాణం చేయించరు. వీళ్ళే స్వంతంగా చేయించుకున్నా తర్వాత సంపాదనలో గురువుకీ కొంత ఇవ్వాలని షరతుపెట్టేవారు.
హిజ్రాలను వీధి రౌడీలు వెంబడిరచేవారు. ప్రేమపేరుతో మోసగించి వీరి సంపాదనతో విలాసంగా బతికేవారు. డబ్బు ఇవ్వకపోతే కొట్టేవారు. ఇలాంటి హిజ్రాలతో తక్కిన హిజ్రాలు మాట్లడేవారుకాదు. గురువులు, నిగురువంటే గౌరవం లేకుండా ఒక రౌడీతో ఉండే దానితో నీకేమిటి?ు అని తిట్టేవారు. అవమానకరమైన వృత్తిలో ఉన్న వీళ్ళకు రౌడీల బాధ ఒకవైపు, పోలీసులు వీళ్ళు చెప్పేది వినిపించుకోకుండా బాధించేవారు. రౌడీల అఘాయిత్యాలకు తట్టుకోలేకపోయేవారు. అందంగా ఉండేవాళ్ళను లైంగికంగా హింసించేవాళ్ళు. వారు పెట్టిన ఇబ్బందులకు తట్టుకోలేని వారిని గురువులు ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించేవారు. ఆ సమయంలో వీరి బాధలు వర్ణనాతీతం.
హిజ్రాలు గురువుతోగానీ నానీ(గురువుకు గురువు)తోగానీ ఉండాలి. లేకపోతే కష్టాలు తప్పవు. 20 సంవత్సరాల వయసొచ్చేసరికి కోరికలతో కలవరపడేవారు కొందరు. పెళ్లిచేసుకోవడానికి నానీలు అంగీకరించరు. సెక్స్‌వర్క్‌ కోసం పని చేసే వారు వేరుగా ఉంటారు. వాళ్ళ దగ్గరకెళ్తే వీరి కోరికలు నెరవేరుతాయి. ఢల్లీి నానీ ఇంట్లో అన్ని రకాలుగా బాగుండేది రేవతికి. వాళ్ళూ చాలాబాగా చూసుకునేవారు. కానీ చెలరేగుతున్న లైంగిక వాంఛల కారణంగానే కొత్తగురువు దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది.
మాతుంగా, మహిమ్‌లు సెక్స్‌వర్క్‌ జరిగే ప్రాంతాలు. అక్కడ పాకల్లో ఉంటారు వీరు. పెదాలకు లిప్‌స్టిక్‌, బుగ్గలకు రూజ్‌ అద్దుకుంటారు ఇక్కడ. నానీ ఇంట్లో ఇలాంటివి వాడకూడదు.
కొత్తవ్యక్తి వచ్చిందని తెలిస్తే చాలామంది క్లయింట్లు వచ్చేవారు. 100 రూపాయలిస్తేగానీ కొత్త క్లయింటు దగ్గరకు పంపరు. రేవతికి ఈ పని ఇష్టం లేదు. కానీ ఇందులోకొచ్చి పడిరది. ఘట్కోపర్‌ నానీ వాళ్ళ ఇళ్ళు పంజరంలా ఉంటే ఇక్కడ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. అక్కడ ప్రతొక్కదానికీ ప్రత్యేక గది ఉండేది. కానీ ఇక్కడ ఒకే గదిలోనే అన్నీ. ఇక్కడ ఆరుబయటే పడుకోవాలి. రౌడీలు ఏడిపిస్తే గురుబాయ్‌లు(అక్కలతో సమానమైన తనతోటివాళ్ళు) వాళ్లసంగతి చూసేవాళ్ళు. గురువు ప్రతి రాత్రీ ధారవికి పోయి తాగి వచ్చేది. గురుబాయ్‌లకు కూడా ఆమె తెచ్చి ఇచ్చేది. రేవతి మొదట్లో తాగేది కాదు. తర్వాత భయాలు తప్పించుకుని నిద్రపోవడానికి మందు అలవాటుచేసుకుంది.
హిజ్రాలు వాళ్ళ అమ్మానాన్నలను చూడటానికి వెళ్ళాలనుకున్నప్పుడు గురువు అనుమతి తప్పనిసరి. గురువు వాళ్ళకు ఖర్చులకు డబ్బు, చీరలు, రైలు టికెట్టు కూడా తీసిచ్చేది నచ్చితే.
పరువుపోతుందని ఊరివాళ్ళు ఏమనుకుంటారోనని హిజ్రాలను కుటుంబసభ్యులు అంగీకరించరు. రేవతి తల్లి ఆడవేషంలో వెళ్ళిన రేవతిని చూసి ని నువ్వు చచ్చిపోయావనుకున్నాను. అది నిజమైనా బాగుండేదనిు వాపోతుంది. వాళ్ళ అన్న నిమా పరువు నేలరాసింది చాల్లేదన్నమాట నీకు? ఆఖరికి ఈ వేషంలో కూడా వచ్చావు! ఎంత సాహసం?ు అంటాడు. తండ్రి మాత్రం నిఇంక మనం చెయ్యగలిగిందేమీలేదు. వాడి రాత అంతే కాబోలు అన్నాడు. వీళ్ళు స్త్రీగా మారినా పెళ్లి చేసుకోలేరు, పిల్లల్ని కనలేరు. ఈ ప్రపంచంలో చాలామంది ఇతరుల్లో తప్పులెంచడానికీ, విమర్శించడానికీ ఎప్పుడూ తయారుగా ఉంటారు. అలాంటి వారికి రేవతి ఒక వింత వస్తువు. నవ్వుకోవడానికి పనికొచ్చే వస్తువు.
బస్సుల్లో, రోడ్లలో ఎన్నో అవమానాలు. నితొమ్మిదో నెంబర్‌ు అనడం…. ఎంతో బాధించే విషయం. హిజ్రాలకు పెళ్లి చేసుకోవడం సుఖం కాదనీ, పురుషుడి కోసం కోరికలు పెంచుకోకూడదని, భర్తను పెట్టుకోవడం, తాగడం, ఊరిమీద పడి తిరగడం వంటివి చేయకూడదని, దుకాణాలకు పోయి డబ్బు తెచ్చుకోవాలని నానీ(హిజ్రా అమ్మమ్మ) ఉపదేశం. రేవతి కోర్కెలను విన్న నానీ క్రేన్‌రోడ్‌కు పంపింది. అక్కడ హిజ్రాలే సెక్స్‌వర్క్‌ చేయించే ఇళ్ళను నడుపుతుంటారు. అమ్మాయిల్లాగా ఉండే హిజ్రాలను సెక్స్‌వర్క్‌ కోసం తీసుకుంటారు. ఈ వ్యాపారాన్ని దందా అంటారు.
జీన్స్‌, స్కర్ట్‌లు మిడ్డీలు వేసుకుని హిజ్రాలు క్లయింట్స్‌ని పిలిచేవారు. దొరికిన క్లయింట్స్‌ని వాళ్ళ ఫ్లోర్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడ క్లయింట్స్‌ కోసం గొడవలు సర్వసాధారణం. పేదరికం, కుటుంబపోషణ కోసం ఈ వృత్తిలోకొచ్చినవారు కొందరు. ఇంకొందరు అనాధలు. భర్తలచేత, ప్రేమికులచేత పరిత్యజింపబడినవారు కొందరు. అత్యాచారాలకు గురై సమాజంచేత కళంకితగా ముద్రవేయబడ్డవారు కొందరు సెక్స్‌వర్క్‌ చేస్తున్న స్త్రీలు.
మగవారి మాయమాటలు నమ్మి ధన మాన ప్రాణాలను అర్పించుకుంటూ మొహం మీద కాలిన మచ్చలతో, కత్తిగాట్లతో తిరిగే హిజ్రాలు కొందరు. పనిమనుషుల్లా అంట్లు కడుగుతూ షాపులకు తిరిగి అడుక్కుంటూ యజమానులకు వేలకు వేలు సంపాదించి పెడుతూ వారిచేత మోసగింపబడుతూ మరోచోటు వెతుక్కొనిపోయే హిజ్రాలు మరికొందరు. సుఖవ్యాధులంటించుకుని సరైన వైద్యం అందక చనిపోయేవారు ఇంకొందరు. పాతికో యాభయ్యో పడేసి హిజ్రాల శరీరాలతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి వాళ్ళ శరీరాలమీద గాయాలను మిగిల్చే క్లయింట్ల దుశ్చర్యలనూ, దుర్మార్గాలనూ మౌనంగా భరిస్తూ మొహానికి పౌడరద్దుకుని వీధిలో నిలబడేవాళ్ళు. వీరి తప్పులేకపోయినా పోలీసులు ఎత్తుకుపోయి జైల్లో పెట్టి, లాఠీదెబ్బలు బూటుకాళ్ల తన్నులూ, ఎలక్ట్రిక్‌ షాక్‌లు భరిస్తూ భారీగా లంచాలు పెట్టి బయటపడేవాళ్ళు.
రేవతి మోడ్రన్‌గా తయారైంది. బ్యూటీపార్లర్‌కెళ్ళడం, ఐబ్రోస్‌ తీయించుకోవడం ఫేషియల్‌ చేయించుకోవడం క్లయింట్లను పిలుచుకోవడం స్త్రీలా గొంతు మార్చడం అన్నీ నేర్చుకుంది. రోజుకి రూ.500 సంపాదిస్తే అదంతా యజమానురాలికి ఇచ్చేయాలి. అందులో సగం మరుసటిరోజు యజమానురాలు వీరికిస్తుంది. కొన్నిసార్లు వీరికి సంపాదన ఉన్నా లేకున్నా గురువుకు రూ.100 ఇవ్వాలి. ఎంతమంది క్లయింట్లు వచ్చారు, ఎంత డబ్బిచ్చారు అవన్నీ ఖచ్చితంగా చెప్పాలి. క్లయింట్లకోసం పోట్లాటలు జరిగేవి. అందంగా ఉన్న వాళ్ళకోసం వచ్చిన క్లయింట్లను కొందరు ఎలాగోలా లాక్కుపోయేవారు. గొడవలు, దెబ్బలాటలు జరిగేవి.
రెండు వారాలకోసారి వెళ్ళి వీరి సంపాదన నానీకి ఇవ్వాలి. రేవతి ఇప్పుడు స్వతంత్రురాలు. తనకు కావాల్సిన డబ్బు ఉంచుకుని మిగిలినదే నానీకి ఇచ్చేది. ఇంటికీ పంపేది. వృద్ధులైన హిజ్రాలతో యజమానురాలు పేకాట ఆడేది. పెద్ద హిజ్రాలమాట చిన్న హిజ్రాలు వినాల్సిందే. లేకపోతే పెద్దల మీద గౌరవం లేదంటారు. పెద్దవాళ్ళెప్పుడూ చిన్నవాళ్ళని అదుపులో పెట్టడానికి చూసేవారు. ఈ బాధలు మరిచిపోవడానికి కొందరు మందు తాగేవాళ్ళు. ఈ విషయం యజమానురాలికి తెలిస్తే బాగా కొట్టేది. హిజ్రా గురువులు, వీళ్ళ దగ్గరున్న స్త్రీ సెక్స్‌వర్కర్లు మూడు సంవత్సరాలు పనిచేసి సంపాదించిస్తేనే వారిని ఇంటికి పంపేవారు.
యజమానురాలికి డబ్బు తెచ్చిపెడితే తప్పు చేసినా క్షమిస్తారు. తప్పులు ఎత్తి చూపితే తప్పుచేసిన హిజ్రాలు మరో గురువుని వెతుక్కుని పోతారు. ఈమెకు రాబడి తగ్గుతుంది. ఇక్కడ కుల మత భేదాలు ఉండవు కానీ పరివారాలమధ్య (సెక్స్‌ వర్క్‌ చేసేవారు) వైరాలుంటాయి. హిజ్రాలు దేవాలయాలు, చర్చిలు, దర్గాలకు పోయేవారు. మత వివక్షలేదు. వీళ్ళు గర్భగుడిలోకీ వెళ్ళవచ్చు.
హిజ్రాలు మామూలుగా రైలు టికెట్‌ కొనరు. రైల్లో నేలమీద కూర్చుంటారు.
వినాయకచవితప్పుడు వీరికి సెక్స్‌వర్క్‌ నుంచి ఉపశమనం ఉంటుంది. చిన్న పట్నాలు, గ్రామాల్లో ఉత్సవాలకు నాట్యం చెయ్యడానికి పిలుస్తారు. అది కూడా గ్రామ పెద్దలు వీరిదగ్గరకొచ్చి నచ్చిన వాళ్ళను ఎంచుకుంటారు. వారి రొమ్ములు తడిమి చూస్తారు. పొట్టకోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాలి. ఊర్లకు వెళ్ళినప్పుడు ఊరిపెద్దలూ వారి కోర్కె తీర్చమనేవారు.
రాత్రి 10 గంటలనుండి ఉదయం 6 గంటలవరకూ నాట్యం చేస్తూనే ఉండాలి. నాట్యం చేసి బతకాలన్నా ఇక్కడా వాళ్ళు ఒళ్ళమ్ముకోవాల్సిందే. కొన్నిసార్లు క్లయింట్లు వీరి అందాన్ని చూసి పిలిచి తర్వాత గొంతువిని నికొజ్జావా?ు అని ఛీత్కరించుకునేవారు. కొట్టేవారు. నీచంగా ప్రవర్తించేవారు. చూసేవాళ్ళు ఏమీ మాట్లాడేవారు కాదు.
పోలీసులు వీళ్ళను నడిరోడ్డుమీద కొట్టి అందరూ చూస్తుండగా వీరి డబ్బు లాక్కుని వదిలేసే సందర్భాలు ఎన్నో. నెలాఖర్లో అధికారులకు కేసులు చూపించుకోవడానికి వీరిని పట్టుకుని, వీరికోసం ఆగే వారందర్నీ వ్యాన్‌ ఎక్కించి, వీరినీ తీసుకెళ్ళేవాళ్ళు. స్టేషన్‌కి తీసుకెళ్ళి కొట్టడం, తన్నడం, చెత్త ఊడ్పించడం, స్టేషనంతా తుడిపించడం చేసేవారు. పోలీసులు వీరినసలు మనుషులుగానే గుర్తించనంత నీచంగా ప్రవర్తిస్తారు. వీరు శృంగారం ఎలా చేస్తారని నీచాతి నీచంగా మాట్లాడతారు. వీరిని నగ్నంగా గదిలో నిలబెడతారు. హిజ్రాలు రౌడీలను, పోలీసులను ఒకటిగానే భావిస్తారు. పోలీసులకు మామూలు ఇచ్చినా నెలాఖరున మళ్ళీ స్టేషన్‌కు తీసుకెళ్ళి కొట్టి పంపిస్తారు.
పోలీస్‌ స్టేషన్‌నుంచి వచ్చిన వారిని గురువు తల స్నానం చేసి, ఆ జ్ఞాపకాలన్నీ కడిగేసుకో. అక్కడ అంటుకున్న పాపాలన్నీ పోతాయి అనేది. ఇంట్లో వాళ్ళ బాధ మరో రకం. వారి పరువూ ప్రతిష్టలు కులగౌరవం గూర్చి ఆలోచిస్తారు. కానీ వీళ్ళ పరిస్ధితి దారుణం. హిజ్రాలతోపాటు చీరకట్టుకుని వీథుల్లో అడుక్కుంటే తెలిసిన వారెవరైనా ఇంట్లో చెప్తే ఆ కుటుంబం మండిపోయేది. రేవతి విషయంలో ఇలాగే జరిగింది. ఢల్లీిలో వీళ్లదగ్గర లారీ డ్రైవరుగా పనిచేసిన వ్యక్తి చూసి ఇంట్లో చెప్పేశాడు. వాళ్ళు తల్లికి బాగలేదని టెలిగ్రాం ఇప్పించి నీకేం తక్కువ చేశామని ఇలా చేస్తున్నావు. మనమే కూలీలను పెట్టుకుని పని చేయించుకుంటుంటే నీవేమో వీధుల్లో అడుక్కుతింటున్నావని చితకబాదారు అన్నలు. గుండుగీయించారు. కుటుంబంలో అనేక సమస్యలు. మళ్ళీ ఇంటినుంచి బయటపడితేకానీ తప్పదని ఆలోచన.
రేవతి ఇంట్లో వాళ్ళను చూడకుండా ఉండలేదు. అందుకే ఇంటికి వెళ్ళేది. ఇంట్లో ఉండటం ఎవరికీ ఇష్టముండదు. చివరికి అమ్మానాన్నలకు కూడా. పల్లెవాళ్ళు ఏమనుకుంటారోననే భయం. అలాంటప్పుడు వేరుగా ఉండేది.
అన్నలు ఆమెకు తండ్రి ఆస్తి ఇవ్వకుండా బెదిరించారు. గౌరవంగా నినీకు ఆస్తిమీద ఆసక్తి లేదని రాసిచ్చెయ్‌ు అన్నారు.
రేవతి అన్నల బాధ భరించలేక బెంగుళూరులోని హమామ్‌కెళ్ళింది. హమామ్‌లో క్లయింట్లకు స్నానం, మసాజ్‌ చేయిస్తారు. అందుకు టిప్పులిస్తారు. షాపులకెళ్ళి అడుక్కొచ్చుకుంటారు.
అందరికీ బతుకు పోరాటమైతే వీరికి యుద్ధం.
ఇలాంటివారికి తిండీ బట్ట ఇచ్చేదెవరు? ప్రేమను పంచేదెవరు? గౌరవించేదెవరు? అవిటి వాళ్ళను అయ్యోపాపం అంటారు కానీ వీరిని అసహ్యించుకుంటారు.
వీరికి రేషను కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తెచ్చుకోవడం చాలా కష్టం.
చదువుకున్న హిజ్రాలు కొందరు వారంతట వారే నిర్వాణం (ఆపరేషన్‌) చేయించుకుని స్వేచ్ఛగా సమాజంలో, ఇంట్లో బతుకుతారు మగ దుస్తుల్లో, ఆధునిక దుస్తుల్లో.
వీరూ ఈ దేశ వాసులే. పౌరులందరికీ ఉన్న హక్కులు వీరికి వర్తించవా? ఆస్తి, రేషన్‌ కార్డ్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఉద్యోగం, పెళ్లిచేసుకునే హక్కు, బిడ్డను దత్తత తీసుకుని పెంచుకునే హక్కు?
రేవతి సంగమలో ఉద్యోగం సంపాదించింది. అక్కడున్న పెద్ద ఆఫీసర్‌ని వివాహంచేసుకుంది. సెక్సువల్‌ మైనారిటీల గురించి ప్రపంచంముందు వాదిస్తాడు కానీ తన పెళ్లి విషయం తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేదు అతనికి.
కొద్ది రోజులు ఆనందంగా సాగిన సంసారం తర్వాత మారిపోయింది. నీ మూలంగా నా స్వేచ్ఛ పోయింది. నీ మూలంగా నా మసశ్శాంతి పోయిందనో…. నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అనేవాడు. సంవత్సరానికి బంధం తెగిపోయింది.
భర్తలు ఇంటి పని చెయ్యరని, స్త్రీలే ఎక్కువ బాధలు పడతారనీ, సమాన హక్కులు ఇవ్వరనీ బహిరంగ సభల్లో చెప్పే మనిషి బాధ్యతారహితంగా ఇప్పుడు భార్యని వదిలేశాడు. అరవాణీల(హిజ్రాలు)ను కూడా స్త్రీలలా గౌరవించాలని చెబుతాడు. అతనికీ, ఇతర పురుషులకూ మధ్య ఏం తేడా?
ఈ బాధలో రేవతి చేలా (శిష్యురాలు) ఫమీలా మరణం కలిచివేసింది. ఆఫీస్‌కు వెళ్ళబుద్ధి కాని స్ధితిలో సంగమ బోర్డు మెంబర్లు ఆఫీసుకు రాకుండా ఒక సంవత్సరం రేవతిని, ఆమెలాంటి వారిని కలిసి ఇంటర్వ్యూ చేసి పుస్తకం రాయమన్నారు.
రేవతి నామక్కల్‌, తేని, వెల్లూర్‌, చెన్నైల్లో ఆరు నెలల్లో 30 మంది అరవాణీలను కలిసి వారి బాధలు, కష్టాలు, కన్నీటి గాథలు విని తన కష్టాలు వారి కష్టాలముందు చిన్నవిగా భావించుకుంది.
రేవతికి సంగమ ఉద్యోగం లేదు. తల్లి అనారోగ్యం. చివరిదశలో తానే దగ్గరుండి చూసుకుంది. తన దగ్గర డబ్బులేదు. ఉద్యోగం లేదు. కొద్ది రోజులు బాధపడిరది. మళ్ళీ సెక్స్‌వర్కే చేయాలా? అది చేయడం తనకు ఇష్టం లేదు. తన శిష్యుల మీద ఆధారపడటమూ ఇష్టంలేదు. చివరకు మళ్ళీ సంగమలో చేరింది.
ఇది రేవతి ఒక్కదాని జీవితం కాదు. రేవతిలాంటి ఎందరో హిజ్రాల జీవితం. హిజ్రాలుగా పుట్టడం వారి తప్పు కాదు. అలా పుట్టాలని ఎవరూ కోరుకోరు. ఇందులో వారి ప్రమేయమేముంది? తల్లిదండ్రులూ, సమాజం చేయాల్సింది వారిని ఆదరించడం, అసహ్యించుకోవడం కాదు. అప్పుడైనా వారి మానసిక క్షోభను తగ్గించినవారమౌతాము. వారు కోరుకునేది కాస్తంత ప్రేమ, ఆప్యాయత, గౌరవం. ఇవి పంచలేనప్పుడు మన మానవతను మనమే ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వమూ వారిగురించి పట్టించుకోవాలి. వారిలోనూ ఆత్మాభిమానం రావాలి. విద్యావంతులు కావాలి. ఉద్యోగాలు చెయ్యాలి. ఎగతాళి చేసేవారికి చెంపపెట్టు కావాలి.
రైట్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ బిల్లు
ట్రాన్స్‌ జెండర్స్‌ హక్కుల పరిరక్షణకు తిరుచ్చి ఎంపీ శివ ప్రవేశపెట్టిన రైట్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ జెండర్‌ పర్సన్స్‌ బిల్లు 2014 ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ద్వారా ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్సుతో సహా అన్ని సౌకర్యాలను, నేషనల్‌ ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ కమిషన్‌, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. బాల్యంనుంచి వృద్ధాప్యంవరకూ వీరిని వివిధ దశల్లో సమాజ భాగస్వాములను చేసేలా పది చాప్టర్లు, 58 క్లాజులతో బిల్లు రూపొందించారు. బ్యాంకు ఖాతాలు తెరుచుకోవచ్చు. విద్య, ఆరోగ్యం, జాబ్స్‌, ఫైనాన్సియల్‌గా రిజర్వేషన్స్‌ కల్పిస్తారు.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.