రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. (2019`20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో వాడిన ఎరువులెన్ని, సాగైన
విస్తీర్ణమెంత, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉందనే అంశాలపై వ్యవసాయశాఖ వివరాలు సేకరించింది. ప్రపంచ దేశాల్లో సగటున ఎకరానికి 78.4, భారతదేశంలో జాతీయ సగటు 51.2, తెలంగాణలో 185 కిలోలు వినియోగిస్తున్నట్లు తెలిపింది. దీనికి కారణం ప్రకృతి సాగు పట్ల రైతుల్లో అవగాహనా లేమి అని అంచనా. ఈ నేపథ్యంలో జీవన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో వ్యవసాయ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణ మారుమూల పల్లెల్లో మహిళలు రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి సేంద్రీయం వైపు అడుగులు వేస్తున్న ఆరోగ్యవంతమైన ప్రగతి ఇది.
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం వర్షాధార పంటలే పండిస్తారు. అతి కష్టంమీద ఒకే ఒక పంటను వేస్తున్నారు. ఇక్కడ అత్యధిక వర్షపాతం ఉన్నప్పటికీ నీటి సంరక్షణ పనులు లేక కురిసిన వానంతా వృధాగా వాగులు, వంకల పాలయ్యేది. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తేవాలని ‘ఏకలవ్య ఫౌండేషన్’ ఉట్నూరు, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో నాబార్డు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల సాయంతో వాటర్‌షెడ్ కార్యక్రమాన్ని అమలు చేసింది. గోండు గిరిజనులను భాగస్వాములను చేస్తూ 25 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ పనులు చేపట్టి పరుగులు తీసే వాన నీటికి నడకలు నేర్పి నేలలో ఇంకేలా చేసింది. రైతులందరినీ సంఘటితం చేసి రైతు సంఘాలుగా మార్చి రసాయన సాగుకు అలవాటు పడిన ఈ రైతాంగాన్ని ప్రకృతి పంటలవైపు మళ్ళించి, సేంద్రీయ సాగుపై అవగాహన కల్పించి, వారి సామర్ధ్యాలను పెంచారు. ఈ కార్యక్రమంలో మహిళల పాత్ర కీలకం.
ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ: రసాయన వ్యవసాయాన్ని వదిలి సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళుతున్న వారిలో చురుకైన మహిళ సేడం పుల్లాబాయి. ఉట్నూరు మండలం మోతుగూడ గ్రామంలో తనకున్న ఎకరం భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. కూరగాయలతో పాటు చిరుధాన్యాలను కూడా రసాయన ఎరువులు గానీ, పురుగు మందులు గానీ ఉపయోగించకుండా పండిస్తోంది. ‘‘గతంలో నేను కూడా పంటల కోసం రసాయనాలనే వాడేదాన్ని. అయితే ఎన్జీఓ సార్‌లు మాకు సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన కల్పించారు. ఈ పంటలు పండిరచడంలో ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ అని తెలుసుకున్నాం. మా పంటలు చూసి మా ఊళ్ళో చాలామంది సేంద్రీయ సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు’’ అని చెప్పారు పుల్లాబాయి.
సేంద్రీయ మినుములు: ఉట్నూరు సమీపంలోని జెండాగూడ గ్రామ వాసి, జుగ్నాక భాగుబాయి సేంద్రీయ పద్ధతిలో మినుము పంటను సాగు చేస్తున్నారు. ‘‘ఇలా పండిరచడం వల్ల సాగు ఖర్చు బాగా తగ్గింది, సొంతంగా పండిరచుకున్న ఆరోగ్యకరమైన మినప్పప్పును ఇంట్లో వాడుకుంటున్నాం. బయట నుంచి మినప్పప్పును కొనే అవసరం తగ్గడంతో పాటు, అదనంగా ఉన్న మినుములు విక్రయించడం వల్ల సంవత్సరానికి 8 వేల రూపాయిల ఆదాయం వస్తోంది’’ అని ఆమె చెప్పారు.
నేలను కాపాడుతున్నాం: ‘‘రసాయన ఎరువుల వాడకం వల్ల నింగి, నేల, నీరు విషపూరితమై పంటల దిగుబడి తగ్గిపోవడంతో పాటు ఆహారం విషతుల్యమై అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం సేంద్రీయ వ్యవసాయ విధానమని తెలుసుకున్నాం. పొలంలో చెరువు మట్టి చల్లి, పచ్చ రొట్టతో భూమిని దున్ని పశువుల పేడ, మూత్రం ఎరువుగా వాడుతూ, కూరగాయలు పండిస్తున్నాం. దిగుబడి తగ్గినా రుచిగా ఉండడం వల్ల డిమాండ్ కూడా బాగా ఉంది. రసాయన ఎరువులు లేని ఈ పంటలు తినడం వల్ల ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటున్నాం’’ అన్నారు ఇంద్రవెల్లికి చెందిన సాబ్లె భురిజబాయి.
బ్యాక్ టు నేచర్: ఉట్నూరు మండలం మోతుగూడలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మరో రైతు ధర్మాబాయి. తన భర్త నాగోరావుతో కలిసి పత్తి, పెసర, బొబ్బర్లు, మినుము, కందులు, రాగులు, చిక్కుడు, టొమేటో, మిర్చి, గోరుచిక్కుడు తదితర పంటలను పండిస్తున్నారు. రెండేళ్ళ క్రితం సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించినపుడు దిగుబడులు తక్కువగా వచ్చినప్పటికీ, ప్రస్తుతం భూమి సేంద్రీయ సాగుకు అనుకూలంగా మారిందని ఆమె అంటున్నారు. ‘‘తెలిసో, తెలియకో ఇంతకాలం రసాయనాల మీద ఆధారపడి వ్యవసాయం చేశాను. సేంద్రీయ వ్యవసాయం గురించి విన్న తర్వాత మా ఆలోచన పూర్తిగా మారిపోయింది. కేవలం డబ్బు కోసం మాత్రమే వ్యవసాయం చేసేవారికి సేంద్రీయ వ్యవసాయం నచ్చకపోవచ్చు. అయితే కాలక్రమేణా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు వస్తాయి. మేం డబ్బు గురించి ఆలోచించలేదు. మా ఆరోగ్యం, మా పిల్లల ఆరోగ్యం, మేం పండిరచిన పంటలు తినేవారి ఆరోగ్యం గురించి ఆలోచించే ఈ వ్యవసాయం ప్రారంభించాను. రాబోయే తరాలకు మనం ఇవ్వాల్సింది డబ్బు కాదు, ఆరోగ్యం. ఇప్పుడు నేను నడుస్తున్న సేంద్రీయ మార్గం ద్వారా భవిష్యత్ తరాలకు విషాన్ని కాకుండా ఆరోగ్యాన్నే ఇస్తానని నమ్ముతున్నాను’’ అంటారు ధర్మాబాయి.
వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి చేస్తున్నారు. గతంలో నీటి వసతి లేకపోవడం వల్ల పత్తిని సాగుచేసేవారు. ఆదాయం అంతగా లభించేది కాదు. ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగాయి. ఎన్జీఓలు, వ్యవసాయ శాఖల సమన్వయంతో డీజిల్ ఇంజన్లు, స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడంతో పరిస్థితి మారింది. ఖర్చులన్నీ పోను రైతులందరూ సంవత్సరానికి 50 వేల నుంచి 70 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. సేంద్రీయ సాగుపట్ల అవగాహన కల్గించడంతో సోయా, కంది, బొబ్బర్లు, మిర్చి పండిస్తున్నారు. రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు తక్కువ ధరకి అందించడమే కాక 60 మంది రైతులకు స్ప్రేయర్లను అందచేశారు. ఎద్దులు, నాగలి కూడా అద్దెకు తెచ్చుకునే పేదరికంలో ఉన్న ఈ గిరిజనుల్లో 12 మందికి ఎద్దులను, నాగళ్ళను కూడా ఏకలవ్య ఫౌండేషన్ అందించడంతో వీరు స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు.
స్వయం సమృద్ధి దిశగా…: ‘‘పరిశ్రమల కాలుష్యంతో పాటు పంటల కాలుష్యం కూడా బాగా పెరిగిపోతోంది. దీని నివారణకు గత ఆరు సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాం. గోండు గిరిజనుల జీవితాన్ని అధ్యయనం చేసాను. ఆదిలాబాద్ జిల్లాలో నాబార్డు, ప్రభుత్వ సంస్థలతో కలిసి 25 వేల ఎకరాల్లో వాటర్ షెడ్ కార్యక్రమం నిర్వహిస్తూ వాన నీటిని సంరక్షించి, 90 సాగునీటి బావులను తవ్వాం. ఈ పనుల్లో మూడు వేల గిరిజన కుటుంబాలను భాగస్వాములను చేశాం. గిరిజన రైతులతో సంఘాలను ఏర్పాటు చేసి వారు పండిరచిన పంటలను వారే అమ్ముకునేలా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో గిరిజన మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తున్నారు.’’ అన్నారు ఏకలవ్య ఫౌండేషన్ ఛైర్మన్ పి.వేణుగోపాల రెడ్డి .