కొండేపూడి నిర్మల
ప్రైవేటీకరణని వ్యతిరేకీంచి నప్పుడల్లా నాలో ఒక గొంతు తిరగబడుతూ వుంటుంది. నేను కొంత కాలమే ప్రభుత్వ బడిలో చదివాను. బెంచీలు లేని క్లాసులో వాన కురిసినప్పుడల్లా స్కూలు సంచిలోకి కప్పలూ, వానపాములూ దూరిపోవడంతో మా నాన్న ప్రైవేటు బడికి మార్చేశారు. ప్రాణం పోయినా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లను.. ఒకసారి టైఫాయిడ్ వస్తే మలేరియా గోళిలు మింగించి స్వర్గానికి కొద్ది దూరంలో వదిలారు. ఉరికొయ్య బిగించినా సరే రేషను కార్డు బియ్యం రాళ్ళు తినలేను. తప్పనిసరయి ఇలా ప్రభుత్వ సేవలు అందుకున్నప్పుడల్లా చెంపలు వాయించు కుంటూనే వున్నాను. ఔను. ప్రవేటీకరణని వ్యతిరేకించే నోటితోనే నేను ఇది చెబు తున్నాను. చాలా చిన్న సంఘటనలే కావచ్చు. కానీ పడుతున్న రాజీ నిరవధికంగా వుంటోంది.
ప్రభుత్వ దూరవాణి అందిస్తున్న బ్రాడ్ బ్యాండ్ సేవల్ని వినియోగించుకునే అనేక మంది భావిభారత పౌరుల్లో నేను ఒక దాన్ని. పరిమిత సేవా ప్యాకేజీలో వుండి అపరిమితంగా బ్రాడ్ బ్యాండ్ వాడినందుకు అపరాధ రుసుముతో కలిపి రూప్యములు ఆరువేలు ప్లస్, మూడు వేలు ప్లస్, అయిదు వేలు ఆనందంగా చెల్లించాను. సెర్చ్ ఇంజన్లో ఫ్రీ డౌన్లోడ్ గ్రాఫిక్స్‌గా ప్రకటించిన వన్నీ ఫ్రీ కాదని తెలియకపోవడం ఒకటయితే, అదికాక ఇందుకుగాను ఈ చెల్లింపు బాధ్యత ఒక ప్రాయశ్చిత్తం అనుకుందాం. నాలాంటి వినియోగదారిణికి అజ్ఞాన మినహాయింపు అనబడు కంటితుడుపు సదుపాయం (కస్టమర్ ఇగ్నోరెన్స్ కన్ఫిడరేషన్) కూడా వుందని దానివల్ల కొంత బరువు తగ్గుతుందని ఒక మిత్రురాలు సలహా ఇచ్చింది కానీ, నాకెందుకో ఆ మాటతో రోషం పుట్టుకొచ్చి ప్రయత్నించలేదు. అయితే అపరిమిత సేవల ప్యాకేజీ అమలవుతున్న రెండో రోజునే వూరు విడిచి వెళ్ళాల్సి వచ్చింది. అనారోగ్యం, బదిలీ లాంటి కారణాలవల్ల అయినా అదే స్థాయి బిల్లులు ఎందుకు వచ్చాయో తెలుసుకోవడం కోసం వరంగల్, హన్మ కొండ కార్యాలయాల చుట్టూ తిరిగాను. దూరవాణి వారు దూరవాణి ద్వారా స్పందించరు కదా… కర్ర పట్టుకుని వెళ్ళి నెత్తిమీద కూచోవాల్సిందే. మూసిన తలుపు సందులో సర్వీసు నిలుపుదల నోటీసు గుచ్చింది కూడా వాళ్ళే. అది కూడా చూపించాను. మరి ఆ తర్వాత కూడా బిల్లు ఎందుకు పడిందో చెప్పలేక వాళ్ళు నాకంటే అయోమయంగా మోహాలు పెట్టారు. కనెక్షన్ తీసేసినా గానీ ఫోను గోడౌన్లో ఇవ్వడం ఆలస్యం చేశారు కదా, అందుకే ఈ బిల్లు పడింది, అంటూ గొప్ప కారణాన్ని కనిపెట్టింది ఒక ఉద్యోగిని. ప్రస్తుతం మేం బదిలీ అయిన వూరు, మా కార్యాలయం, ఇంటి చిరునామా ఇచ్చి వెడితే వీలువెంట(?) తమ సేవల సరఫరా, సేవల నిలుపుదల, అపరాధ రుసుము వడ్డింపు శాఖ వారంతా కూచుని ఆలోచించి, చెబుతామన్నారు. వినియోగదారుల శాఖకి అప్పీలు చేస్తానని, ధూం ధాం అని, ఆ కార్యాలయం ముందు నేను కాసేపు కుప్పిగంతులు కూడా వేశాను. అక్కడ వున్న వారికి అదొక ఉచిత మధ్యాహ్న వినోద ప్యాకేజీగా అనిపించి వుండొచ్చు. ఒక మాదిరి ముఖపరిచయంగల ఆసామీ నన్ను చూసి నవ్వి, మంచినీళ్ళిచ్చి, దూరవాణిలో దగ్గర వాళ్ళెవరూ లేరా అని అడిగాడు. శూన్యంకేసి చూశాను. పోయింది పోగా ఇప్పుడా డిపాజిట్ వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. నాముందు రెండే దార్లు వున్నాయి. అకస్మాత్తుగా ఆ శాఖలో ఒక బామ్మర్దిని సంపాయించడం, లేదా ప్రైవేటు సేవలకు మారిపోవడం…. రెండవ మార్గమే గౌరవంగా అనిపించింది.
జరూరుగా బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చి రైల్వే టిక్కెట్టుకోసం మెహదీపట్నం కౌంటరులో నుంచున్నాను. మొదటి రెండు తరగతులు దొరకలేదు. తక్షణ సేవలు అయితే వున్నాయట, సరేలే అనుకుని, తత్కాల టికెట్లు రెండు కొన్నాను. ఇంటికొచ్చి ఆన్‌లైన్లో చూస్తే అన్ని తరగతుల్లోనూ భారీగా టిక్కెట్లున్నాయని తెలిసింది. పోన్లే పాపం రైల్వే ఆదాయానికి అదొక మార్గం అనుకున్నాను. తీరా టి.సి. తనిఖీ చేస్తే తెలిసిందేమిటంటే, సదరు కౌంటరు వ్యక్తి నాకు కిందటి రోజు టిక్కెట్ ఇచ్చాడుట.. అది తెలిసి చేసిన తప్పు కాకపోవచ్చు. ఎక్కడో పొరబాటు జరిగింది. అప్పటికప్పుడు సూట్కేసులో డబ్బంతా పోగుచేసి కొత్తగా మళ్ళి రెండు టిక్కెట్లూ, అపరాధ రుసుము, బెర్త్ కోసం అదనపు పైకం చెల్లించాను. అతను గట్టిగా అరిచి గొడవచేసి రైలు దింపేలా వుంటే బహుశా పరువు, నిస్సహాయత కలగలిసిన ప్యాకేజీ సైతం చెల్లించి వుండేదాన్ని. అంతా అయ్యాక తోటి ప్రయాణీకుడెవడో చెప్పాడు. ముందురోజు టిక్కెట్టు ఇవ్వడం సిబ్బంది తప్పు. అనవసరంగా మీరు నష్టపోయారు. ఇప్పటికైనా పోయింది లేదు. మీరు ఏ రోజు టిక్కెట్ రిజర్వు చేశారో ఆరోజు కౌంటరులో అమ్ముడుపోయిన ఫారం వెతికిపట్టుకుని లేదా ఫీడ్ అయి వున్న లిస్ట్ పట్టుకుని, ఆ రోజు ప్రయాణం చేసిన ప్రయాణీకుల్లో మీరు లేరని, రైల్వే సేవలు వినియోగించుకోలేదని రుజువు చేసుకుంటే మీ డబ్బు మీకు వచ్చేస్తుంది అన్నాడు. కాశీ మజిలీ కథలా వుంది నాకు. న్యాయం జరగాలంటే నా ముందు రెండే దార్లు వున్నాయి. ఒకటి రైల్వే శాఖలో దూరపు బంధువు వున్నాడేమో చూడ్డ్దం, నోరు మూసుకుని ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం. రెండోపని మాత్రమే నాకు చాతనవుతుంది.
అపార్ట్‌మెంట్‌కీ అపార్ట్‌మెంట్‌కీ మధ్య వున్న ఈ చిన్న రోడ్డు అన్నిసార్లు ఎందుకు తవ్వి పూడ్చుతూ వుంటారో నాకు తెలీదు. చినుకు పడితే వాన నీరు డ్రైనేజీ మురికితోబాటు కారుపార్కింగుదాకా ప్రవహిస్తుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పురపాలక సంస్థవారు ఎప్పుడూ పట్టించుకోరట. అంటే ఎనభైనాలుగు వాటాల్లో ఒకళ్ళకి కూడా రాజకీయ బావ లేడన్నమాటే. ఇప్పుడు నా ముందు రెండే దార్లున్నాయి. ఇంతమందిలో ఎవరికైనా రాజకీయ సంబంధం ఉందేమో చూడ్డం –
ఇంటికో ఇరవై చొప్పున చందాలు పోగుచేసి దగ్గరుండి రోడ్డు పూడ్పించడం. రెండోదే సులువుగా వుంది.
మంత్రులు ఏ పార్టీవారయినా గానీ ప్రభుత్వ శాఖల పని నాణ్యత మారకూడదు కదా. మా ఆటో బండి అశోక్ కూడా కేవలం తనకొక బండి మంజూరీ అవడానికి మంత్రిత్వం మారాలనుకోవడమేమిటీ..? ఒబామా కరుణిస్తే తప్ప బతకలేనని మన పిల్లలు అనుకోవడం ఏమిటీ..? సుఖ విరోచనం అవడం కోసం మా మామగారు తెలిసిన ఎమ్మెల్లే వుండి తాగునీరు ఇవ్వాలనుకోవడమేమిటి..? ప్రజలకి అందాల్సిన కనీసపు సేవలకి, రాజకీయ బావలకీ ఇంత అక్రమ సంబంధం ఏమిటీ..? దీన్ని భరించడానికి ప్రజలకి ఎంత పాతివ్రత్యం ఖర్చువుతోంది..?
ఇప్పుడు మనముందు వున్నవి రెండే దారులు. ఒకటి నిరసన. రెండు రాజీ. చూడ్డానికి రెండోదే శాంతిగా అనిపిస్తుంది. కానీ అంతకంటే హింస ఈ జాతికి ఇంకోటి లేదు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags