సాహిత్యరంగంలో నోబెల్‌ బహుమతి పొందిన మహిళలు -మన్నేపల్లి లలితమ్మ

స్త్రీలను ఆకాశంలో సగం అన్నారు. అయితే అట్టి ఆకాశం సగం మేఘావృతం అయితే సగం చీకటిలో ఉండిపోతుంది. అదే విధంగా సమాజంలో స్త్రీని నిరాదరణకు గురిచేస్తే సగం సమాజం అంధకారంలో మగ్గిపోతుంది. స్త్రీ పురుషులిద్దరూ సృష్టికి మూలస్తంభాల వంటివారు.

ఈ సృష్టిలో వారిద్దరూ సమానులే. ఈ సమత చెడకుండా నిలిచి ఉన్నంత కాలం మానవ సమాజం ఆరోగ్యంగా జీవిస్తుంది. స్త్రీ పురుషుల పరస్పర సహకారంవల్ల, అన్యోన్యతవల్లే మానవజాతి మనుగడ సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుండే స్త్రీలను గౌరవించే అలవాటును జీవనవిధానం చేయాలి. ఈ సమాజంలో స్త్రీ తనస్థానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి, ఆర్థికంగా తన కాళ్ళమీద తాను నిలబడడానికి, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను, ఒత్తిళ్ళను ఎదుర్కొనడానికి, నైతికవిలువలు పెంపొందించడానికి, విద్య ఎంతో దోహదం చేస్తుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి రాజాజీగారన్నట్లు ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతులైనట్లే.
ప్రాచీనకాలంలో దాదాపు అన్ని చోట్ల స్త్రీలను వంటింటికే పరిమితం చేశారు. వారిపై అనేకమైన కట్టుబాట్లను విధించారు. నిన్న మొన్నటి వరకు కొన్ని దేశాలలో స్త్రీకి విద్య, రాజకీయ హక్కులు మొదలైనవి నిరాకరించబడ్డాయి. అయితే ఆధునిక కాలంలో ఈ విషయంలో పెనుమార్పులు ప్రారంభమయ్యాయి. 20వ శతాబ్దపు ఆరంభం సాంఘిక మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కాలం కన్నా ముందుగా సంస్కరణలను ప్రవేశపెట్టిన తాత్వికులు, దార్శనికులు, మానవతావాదులు ఈ ఆధునికయుగంలో పుట్టుకొచ్చారు. వారిలో రాజారామ్మోహన్‌రాయ్‌, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, పెరియార్‌, నారాయణ మొదలైనవారు ముఖ్యులు. ధైర్యం, హేతుబద్ధత, శాస్త్రజ్ఞానం, బాధ్యతలు, అధికారాలు మగ వారితోపాటు స్త్రీలు కూడ సమంగా కలిగి ఉండాలని గాంధీ భావించాడు. ఈ మహనీయుల కారణంగా స్త్రీ బయటకు వచ్చి సూర్యుణ్ణి చూడడం ఆరంభించింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా వంటి స్త్రీలు తమ ప్రాణాన్ని సైతం లెక్కచేయక స్త్రీ విద్యను ప్రోత్సహించడం ప్రారంభించారు.
ఇక సాహిత్య విషయానికొస్తే 20వ శతాబ్దపు తొలిపాదం నుండే స్త్రీలు కవిత్వం, కథ, నవల, నాటకం, మొదలైన భిన్న సాహిత్య ప్రక్రియలన్నీ చేపట్టి రచనలు చేయడం ఆరంభించారు. కొడవటిగంటి కుటుంబరావుగారి మాటలలో, సాహిత్యం అనేది జీవితవృక్షానికి పూసిన పువ్వులాంటిది. సమాజం నుండి సాహిత్యానికి, సాహిత్యం నుండి సమాజానికి నిరంతరం ప్రవహించే ఈ భావధార అటు సాహిత్యంలోకి కొత్త వస్తువును, అభివ్యక్తిరీతిని తీసుకొనివస్తుంటే, ఇటు సమాజంలో కళ్ళ ముందున్న జీవితంలో కనపడని కోణాలను చూడగలిగిన కొత్త చూపును ఇస్తుంది. దాదాపు అన్ని ఆధునిక సమాజాలలో ఈ పెనుమార్పులు జరగడం ప్రారంభించాయి.
తెలుగు భాషలో స్త్రీల సాహిత్యసేవ గురించి మాట్లాడుకుంటే 20వ శతాబ్దానికి ముందు తొమ్మిది వందల సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో కవులు కోకొల్లలైతే, కవయిత్రులు కనీసం తొమ్మిది మంది అయినా కనిపించరు` వారిలో తరిగొండ వెంగమాంబ, తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, మొల్ల, రంగాజమ్మ, సుభద్రమ్మ మొదలైనవారు సుపరిచితులు. అయితే 20వ శతాబ్దంలో స్త్రీలకు ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నిర్మించి స్త్రీవిద్యను ప్రోత్సహించడం వల్ల స్త్రీలు క్రమక్రమంగా మరుగు నుంచి మెరుగు వైపు పయనించడం ప్రారంభించారు. స్వాతంత్య్రానంతర సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, దేశీయ ఉద్యమాలు, ప్రపంచీకరణల వలన స్త్రీలలో సాహిత్య సృజన ఊపందుకుంది. స్త్రీల పక్షాన నిలబడి తన రచనల ద్వారా స్త్రీలను చైతన్యవంతుల్ని చేసిన మహాకవి గుడిపాటి వెంకటాచలం గారు. 1950వ దశకపు చివరి నుండి 1980వ దశకం వరకు రచయిత్రులు క్రమక్రమంగా తెలుగు సాహిత్యాన్ని తమ రచనలతో ముంచెత్తారు. వారిలో ఇల్లిందల సరస్వతీదేవి, ఆచంట శారదాదేవి, మాలతీ చందూర్‌, వాసిరెడ్డి సీతాదేవి, యద్దనపూడి సులోచనారాణి, బీనాదేవి, ద్వివేదుల విశాలాక్షి, డి. కామేశ్వరి, శ్రీదేవి, లత ఇలా ఒకరినిమించి మరొకరు అన్నట్లు పోటాపోటీగా రచనలు చేశారు. 1980వ దశకాన్ని తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దంగా పేర్కొనవచ్చు.
ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన బహుమతి ` నోబెల్‌ బహుమతి
ఈ భూమండలంలో అన్ని గుర్తింపులలోను, ప్రశంసలలోను, పురస్కారాలలోను నోబెల్‌ ప్రైజు కున్న ఐడెంటిటీ మరి దేనికును లేదు. అట్లాంటి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌బహుమతి భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, సాహిత్యం, ప్రపంచ శాంతి ` ఈ ఆరు రంగాలలో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఉన్నతికి గణనీయమైన కృషి చేసినవారికి ప్రదానం చేస్తున్నారు. ఈ అత్యున్నత నోబెల్‌ పురస్కారం ఆరంభమైన 1901వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు సాహిత్యరంగానికి సంబంధించి నోబెల్‌ బహుమతి అందుకున్న మహిళా రచయిత్రులు 16 మంది. అంతర్జాతీయంగా స్త్రీలు సాహిత్య శిఖరాలను అధిరోహించడం గర్వించదగిన విషయం. ఆ 16 మంది స్త్రీమూర్తుల గురించి తెలుసుకుందాం.
1. మొదటిగా సెల్మా లోగెర్లోఫ్‌: సాహిత్యంలో నోబెల్‌ బహుమతి అందుకున్న తొలి మహిళ సెల్మా లోగెర్లోఫ్‌. ఈమె స్వీడన్‌కు చెందిన రచయిత్రి మరియు టిచర్‌. ఆమె స్వీడన్‌ దేశంలో మర్బాకా అనే నగరంలో 1858వ సంవత్సరంలో జన్మించింది. తండ్రి లెఫ్టెనెంటు, తల్లి గృహిణి. పుట్టుకతోనే తుంటి లోపం. మూడేళ్ళ వయస్సులో శైశవ పక్షవాతంతో నడవగలిగినా జీవితాంతం కుంటితనం తోడుగా ఉంది. దేవుడు శారీరక లోపం ఇచ్చినందుకు మానసికంగా రచనావరం ప్రసాదించాడు. సెల్మా లోగెర్లోఫ్‌ బాల్యం అంతా నానమ్మ దగ్గరే గడిచింది. నానమ్మ చెప్పిన కథలు రేకెత్తించిన ఆసక్తితో సాహిత్యం పట్ల ప్రేరణ పొందింది. సెల్మా పాఠశాలలో చదువుతున్నప్పుడే 19వ శతాబ్దపు రచయితల్ని చదువుకొంది. వారిలో హెన్రీ స్పెన్సెర్‌, థియొడోర్‌ పార్కర్‌, చార్లెస్‌ డార్విన్‌ లాంటి వారున్నారు. ఆమె రచనలు గోస్తా బెర్లింగ్‌ వీరగాథ, క్రీస్తు విరోధి అద్భుతాలు, క్రైస్తవ ప్రాచీన కథలు, స్వీడన్‌ చరిత్ర`భూగోళశాస్త్రం మొదలైనవి. బహుళ ప్రక్రియల్లో రచనలు చేసినందుకుగాను 1909లో నోబెల్‌ పురస్కారం లభించింది.
2. గరాజ్సీ డేలెడ్డా : గరాజ్సీ డేలెడ్డా ఇటలీ దేశపు రచయిత్రి, నవలాకారిణి. ఈమె 1871వ సంవత్సరంలో సర్డీనియా ద్వీపంలో జన్మించింది. తండ్రి కవిత్వం రాసేవాడు. వారి ఇంటిలో సొంత గ్రంథాలయం ఉండేది. గరాజ్సీ డేలెడ్డా తన 13వ ఏట నుండే వ్రాయడం మొదలుపెట్టింది. ఈమె రచనలలో ప్రేమ, పాపం, కుటుంబ సంబంధాలు ప్రధాన ఇతివృత్తాలు. రోజులో ఎంతోకొంత, ఏదోకటి వ్రాసేది. ఏమీ వ్రాయకుండా తనకి రోజు గడిచేదికాదు అని డేలెడ్డా అంటుండేది. ఈమె రచనలు ఎలీస్‌ పోర్టోలు, సర్డీనియా రక్తం, సర్డీనియా పుష్పం, ఫెర్నాండా జ్ఞాపకాలు మొదలైనవి. ఈమెను ప్రభావితం చేసిన ఇటలీ దేశపు కవులు సిసిలియన్స్‌ లుయిగి కపువన, గియొవన్ని వెర్గా. వెర్గా అంటే ఎంత ఆరాధనాభావం అంటే ఒక సందర్భంలో నోబెల్‌ బహుమతి తన కంటే వెర్గాకు రావలసిందని అభిప్రాయపడిన యదార్థవాది, ఉదారవాది. ఆమె స్పష్టతతో, ఆదర్శపూర్వకంగా, మానవ సమస్యల గురించి మృదువైన ప్రేరణ కలిగించే రీతిలో రచనలు చేసినందుకుగాను 1926లో నోబెల్‌బహుమతి ప్రదానం చేశారు.
3. సీగ్రిడ్‌ ఇండ్సెట్‌: సీగ్రిడ్‌ ఇండ్సెట్‌ నార్వే రచయిత్రి. ఈమె 1882వ సంవత్సరంలో డెన్మార్క్‌ నగరంలో జన్మించింది. సీగ్రిడ్‌ తండ్రి తన 11వ ఏట మరణించడంతో ఆ విషాదం ఆమె బాల్యంలోను, యవ్వనంలోను బలమైన ముద్రవేసింది. ప్రముఖ రచయిత డి.హెచ్‌. లారెన్స్‌ రచనలు ఆమెమీద విశేషమైన ప్రభావం చూపాయి. మధ్యయుగంలోని స్కాండినేవియా దేశపు జీవితాన్ని శక్తివంతంగా, కళ్ళకుకట్టినట్లు చిత్రించినందుకు, ఆ నేపథó్యపు నవలలు క్రిస్టిన్‌ లవ్రన్స్‌ డాట్ట్టెర్‌, ఓలవ్‌ ఔడున్‌ స్సోన్‌ వ్రాసినందుకు 1928లో నోబెల్‌బహుమతి ప్రదానం చేశారు. 1949లో పరమపదించిన సీగ్రిడ్‌ ఇండ్సెంట్‌ స్మృతి చిహ్నంగా నార్వే, స్వీడన్‌ రెండు దేశాలలోనూ ఆమె ముఖచిత్రంతో తపాలా బిళ్ళలు విడుదలయ్యాయి.
4. పెర్ల్‌ ఎస్‌ బక్‌: 1892లో పెర్ల్‌ ఎస్‌ బక్‌ అమెరికాలో పుట్టి, బాల్యం, యవ్వనం చైనాలో గడిపి చివరకు అమెరికాలోనే మరణించిన కవయిత్రి. పెర్ల్‌ 1909లో షాంగై పాఠశాలలో చదువుతున్నపుడు పడుపువృత్తిలోకి దించబడిన చైనా బానిస బాలికల్ని రక్షించి ఒక ఆశ్రమంలో ఆసరా కల్పించారు. ఆ ఆశ్రమంలో స్వయంసేవకురాలిగా చేరింది. వారితో గడిపిన అనుభవం ఆమె రచయిత్రిగా మారెేందుకు దోహదపడిరది. 1931లో పెర్ల్‌ నవల ‘ద గుడ్‌ ఎర్త్‌’ ప్రచురించబడిరది. 1935లో ఆ నవలకు పులిట్జెర్‌ బహుమతి, హోవెల్స్‌ పతకం లభించాయి. ఈమె అత్యంత ప్రజాదరణ పొందిన రచయిత్రి, మానవతావాది, స్త్రీల హక్కుల కోసం నడుం బిగించిన వ్యక్తి, ఆసియా పత్రికకు సంపాదకురాలు, లోకోపకారి. చైనా జీవితాన్ని ప్రతిబింబించిన రచనలు చేసి ఖ్యాతిపొందిన పెర్ల్‌ ఎస్‌ బక్‌ కు 1938లో నోబెల్‌బహుమతి లభించింది. అమెరికా ప్రభుత్వం పెర్ల్‌ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
5. గబ్రియేలా మిస్ట్రాల్‌: గబ్రియేలా మిస్ట్రాల్‌ లాటిన్‌ అమెరికాలో 1889వ సంవత్సరంలో జన్మించింది. తండ్రి ఉపాధ్యాయుడు, సంగీత మరియు కవిత్వ ప్రేమికుడు. తల్లి వస్త్రాలు తయారు చేసే దర్జీ, కవిత్వం రాసేది. బాల్యంలో మిస్ట్రాల్‌ తండ్రి తోటను పెంచాడు. అందులో పూలతోను, పక్షులతోను మాట్లాడుకుంటూ మిస్ట్రాల్‌ గడిపేది. తన చిన్న వయస్సులోనే తండ్రి కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో కష్టాలు అనుభవించి బ్రతుకుదెరువుకోసం 16 ఏళ్ళ వయస్సులోనే పల్లెలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాల్సి వచ్చింది. విద్యావ్యవస్థ వైఫల్యాల మీద అనేక వివాదాస్పద వ్యాసాలు ప్రచురించింది. తన కవిత్వాన్ని, అభిరుచులను, ఆలోచనలను అత్యంత ప్రభావితం చేసిన ఇటలీ కవి గబ్రియేలా డి అన్నుంజియొ నుండి ‘గబ్రియేలా’ అనే పదాన్నీ, ఫ్రెంచి కవి ఫ్రెడరిక్‌ మిస్ట్రాల్‌ నుండి ‘మిస్ట్రాల్‌’ అనే పదాన్నీ తీసుకొని ‘గబ్రియేలా మిస్ట్రాల్‌’ గా కేవలం కవిత్వం, రచనల కోసమే పేరు మార్చుకుంది. మిస్ట్రాల్‌ కవిత్వం డొంకతిరుగుడులేకుండా, సూటిగా, స్పష్టంగా, సరళమైన పదాల అల్లికతో ఉంటుంది. మానసిక ఉద్వేగంతో ప్రభావితమైన ఆమె కవితలకు 1945లో నోబెల్‌పురస్కారం లభించింది.
6. నెల్లీసాచ్స్‌: నెల్లీసాచ్స్‌ జర్మనీ యూదు కవయిత్రి. ఈమె 1891వ సంవత్సరంలో జన్మించింది. ఆమె తండ్రి పారిశ్రామిక వేత్త, తల్లి గృహిణి, సంపన్న కుటుంబం. తను ఏకైక కుమార్తె కావటాన చాలా సున్నితంగా, అల్లారుముద్దుగా పెరిగింది. ఆమె 15 ఏళ్ళ ప్రాయంలోనే స్వీడన్‌్‌ నవలా రచయిత్రి, నోబెల్‌ బహుమతి గ్రహీత సెల్మా లోగెర్లోఫ్‌ రాసిన నవల ‘గోస్టా బెర్లింగ్‌ సగా’ తో అత్యంత ప్రభావితురాలై ఆ తరువాత ఆమెతో 35 ఏళ్లపాటు ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగించింది. 1933లో జర్మనీ నాజీలకు హస్తగతం అయ్యాక సాచ్స్‌ జీవితం ఏకాంతంలోకి నెట్టబడిరది. 1966లో సమస్త యూదు ప్రజల విషాదం పట్ల భావోద్వేగ తీవ్రతతో, లయాత్మకంగా, బాధాకరమైన అందాన్ని, పౌరాణిక నాటకీకరణలతో నెల్లీసాచ్స్‌ ప్రపంచవ్యాప్తంగా తన స్వరం వినిపించినందుకు సాహిత్య నోబెల్‌బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు స్వీడిష్‌ అకాడవిూ ప్రకటించింది.
7. నాదిన్‌ గోర్దిమెర్‌: నాదిన్‌ తల్లిదండ్రులు బ్రిటన్‌కు చెందినవారు. ఈమె 1923వ సంవత్సరంలో జన్మించింది. దక్షణాఫ్రికాకు వలస వచ్చారు. నాదిన్‌ తల్లి తన కుమార్తె గుండె అసాధారణంగా కొట్టుకుంటుంది అని భావించి శారీరక అలసట కలిగించే ఏ పనీ చెయ్యనిచ్చేదికాదు. పదేళ్ళప్రాయంలో బడి కూడా మాన్పించి ఇంటికి దగ్గరలో రెండు, మూడు గంటలపాటు ఒక బోధకుడి దగ్గరకు తీసుకుపోయి చదువు చెప్పించేది. ఆ కారణంగా తన ఈడుపిల్లలతో ఆడుకొనేందుకు, ముచ్చటించుకొనేందుకు వీలుపడక ఒక రకమైన ఒంటరితనం అనుభవించేది. ఆమె రచనలకు ప్రేరణ ఆమె బాల్యం, ఆమె ఒంటరితనమే. ఉన్నతవిద్యకు 1945లో జోహన్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో చేెరింది. అక్కడ సాహిత్యకారులతో స్నేహం ఏర్పడిరది. తుర్గనేవ్‌, ప్రౌస్ట్‌, ఛెకోవ్‌, డోస్టోవ్‌స్కీ వంటి రచయితల్ని ఇష్టంగా చదువుకుంది. మండేలాకు భావపరంగా దగ్గరయ్యింది. నాదిన్‌ పుస్తకాలు కొన్ని నిషేధించబడ్డాయి. నిషేధించబడని రచనలన్నింటిని మండేలా జైలులో ఉండగానే చదువుకున్నారు. ఆమె పట్ల ఏర్పడిన గౌరవంతో జైలునుండి విడుదలయిన తరువాత ఆ మహానుభావుడు ఆమెనే మొదట చూడాలన్నారు. దక్షిణాఫ్రికాని ఎక్కువగా ప్రేమించి, అక్కడి వర్ణవివక్షతనే తన సాహిత్య వస్తువుగా స్వీకరించి రచనలు చేసిన నాదిన్‌ గోర్దిమెర్‌ 1991లో నోబెల్‌ పురస్కారం పొందింది.
8. టోనీ మోరిసన్‌: టోనీ మోరిసన్‌ అమెరికా దేశానికి చెందిన రచయిత్రి. ఈమె 1931వ సంవత్సరంలో ఓహియో నగరంలో జన్మించింది. తండ్రి వెల్డరు, తల్లి ఆధ్యాత్మిక స్త్రీ, చర్చి గాయక బృందంలో పాటలు పాడేవారు. ఆమెరికాలోని దక్షిణప్రాంతపు జాత్యహంకారం నుండి తప్పించుకునేందుకు ఉత్తరాన ఉన్న ఓహియోకి తరలివచ్చారు. బాల్యంలో టోనీ విన్న పాటలు, కథలు తరువాత తరువాత ఆమె రచనల మీద బాగా ప్రభావం చూపాయి. వయస్సు పెరుగుతున్నకొద్దీ అనివార్యంగా జాతివివక్ష అనుభవంలోకి రావడం మొదలయింది. టోనీ కాలేజికి వెళ్ళే 17 ఏళ్ళ ప్రాయంలో వాషింగ్టన్‌ బస్సులలో ‘శ్వేతేతరుల కోసం’ అని రాసి ఉండటం ఆమెను ఆశ్చర్యపరిచేది. నల్లవారిపట్ల తెల్లవారి వైఖరిని తిప్పికొట్ట్టాలన్న కసి తన రచనలకి ప్రేరణగా నిలిచింది. 1955లో కోర్నెల్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తి చేసింది. ఆ సమయంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, ఆండ్రూ యంగ్‌ అమిరి బరక లాంటి గొప్ప సంఘసంస్కర్తల పరిచయం, వారి ప్రభావం తన రచనల మీద పడిరది. వర్జీనీయా వూల్ఫ్‌, విలియం ఫాల్కనర్‌, టాల్‌స్టాయ్‌, డోస్టొవెస్కీ, గిస్తావ్‌ ఫ్లెబెర్‌, జేన్‌ ఆస్తెన్‌ల సాహిత్య ప్రభావం టోనీ మీద ఎక్కువగా ఉంది. ఆఫ్రో`అమెరికన్‌ సాహిత్య భాషను సృష్టించిన రచయిత్రి టోనీ. టోనీ మోరిసన్‌ కాల్పనిక శక్తికి, కవిత్వ దిగుమతితో నవలలు వ్రాసినందుకు 1993లో నోబెల్‌పురస్కారం లభించిన మొదట నల్లజాతి మహిళ అని నోబెల్‌ బహుమతి ప్రదాతలు కొనియాడారు.
9. విస్లావా సింబోర్స్కా: విస్లావా సింబోర్స్కా నోబెల్‌ బహుమతి పొందిన మొదటి పోలెండ్‌ కవయిత్రి. ఈమె 1923వ పశ్చిమ పోలెండ్‌లోని కోర్ణిక్‌ పట్టణంలో జన్మించింది. విస్లావా తండ్రి విస్తృతంగా చదివేవారు. చదివిన పుస్తకాల గురించి ఇంట్లో చర్చించుకునేవారు. ఆ ప్రభావం అయిదేళ్ళ ప్రాయంలోనే విస్లావా మీద పడి చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టింది. 1945 నుండి 1948 వరకు జగియెలోనియన్‌ విశ్వవిద్యాలయంలో పోలీష్‌ ప్రాచీన భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం చదువుకొంది. 1952లో ‘అందుకనే మనం బతికున్నాం’ శీర్షికన మొదట కవితాసంకలనం వచ్చింది. తరువాత తరువాత తనను తాను అడిగిన ప్రశ్నలు, ప్రపంచం మీద నేను ధ్యానిస్తాను, తుది మొదలు, వంతెన మీద జనం, కొత్త కవితలు మొదలైన రచనలు, కవితా రచనలు వెలువడ్డాయి. ఈమె కవితా ధోరణి చాలా స్పష్టంగా, సూటిగా, మధురంగా ఉంటుంది. నోబెల్‌బహుమతి ప్రదాతలను ఆమె కవితలు విపరీతంగా ఆకట్టుకొన్నాయి. 1996లో విస్లావాకు ఆమె రాసిన కవిత్వానికంతటికి కలిపి నోబెల్‌ బహుమతి ప్రదానం చేశారు.
10. ఇల్ఫ్రీడే ఇయెలినెక్‌: ఇల్ఫ్రీడే ఇయెలినెక్‌ ఆస్ట్రియా రచయిత్రి. ఈమె 1946వ సంవత్సరంలో ఆస్ట్రియా దేశంలో జన్మించింది. ఇల్ఫ్రీడే తండ్రి యూదు జాతివాడు. ఇల్ఫ్రీడేని ప్రసిద్ధ సంగీతకారిణిని చేయాలనే తలంపు తల్లిది. ఆ లక్ష్యానికి తల్లి కఠినవైఖరి అవలంబించేది. జీవితానుభవం దృష్ట్యా ‘‘స్త్రీల శరీరం వాయిద్యంలా తయారుకావడం విషాదం అని’’ ఒక చోట తన భావనను వ్రాసుకుంది. బాల్యం నుండే ఏకాంతవాసం ఆమె స్వభావంగా మారింది. ఆమె ప్రసిద్ధ రచనలు వర్‌ డెకోస్‌ బేబి, ఉమెన్‌ యాజ్‌ లవర్స్‌, వండర్‌ఫుల్‌ టైమ్స్‌, ద పియానో టీచర్‌ మొదలైనవి. స్త్రీ పురుష సంబంధాలపట్ల సృష్టమైన దృక్పథంతో రచనలు చేసింది. పురుషులు స్రీల మధ్య సంబంధాలు, యజమానులు బానిసల వంటివని, ఎక్కడైతే స్త్రీలు తమ యవ్వనం, అందం, దేహం మూలంగానే కేవలం శక్తిమంతులుగా చూడబడతారో, పురుషులు తమ పని, కీర్తి లేదా సంపద ద్వారా తమ లైంగిక విలువల్ని పెంచుకుంటారో, అక్కడ ఏ మార్పూ ఉండదని ఆమె విశ్వసించింది. విలక్షణ భాషాభినివేశంతో, అసంబద్ద సమాజ పునరుక్తుల్ని వశపరచుకొనే శక్తిని బహిరంగ పరచే నాటకాల్లో ` సమ్మతి అసమ్మతుల ఆమె రచనా సంగీత ప్రవాహానికి గుర్తింపుగా 2004లో నోబెల్‌బహుమతి ఆమెని వరించింది.
11. డోరిస్‌ లెస్సింగ్‌: డోరిస్‌ లెస్సింగ్‌ బ్రిటన్‌కు చెందిన రచయిత్రి. ఈమె 1919వ సంవత్సరంలో బ్రిటీష్‌కు చెందిన దంపతులకు ఇరాన్‌లో జన్మించింది. తండ్రి ఇంపీరియల్‌ బ్యాంక్‌లో అధికారిగా పనిచేసి, మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడి ఒక కాలు పోగొట్టుకున్నాడు. తల్లి నర్సు. తల్లిదండ్రులు బ్రతుకుదెరువు కోసం మొక్కజొన్న సాగుచేసేవారు. పొలాల్లోనే తల్లి చదువుచేప్పేది. కూతుర్ని చక్కని యుక్తమైనదానిగా పెంచాలన్న తపనతో తల్లి చాలా ఖచ్చితమైన నియమనిబంధనలు విధించేది. తల్లి కఠిన వైఖరికి విసిగిపోయి స్వేచ్ఛకోసం తహతహలాడేది. ఆమె రచనలు ద గ్రాస్‌ ఈజ్‌ సింగింగ్‌, అండర్‌ మై స్కిన్‌, ద గోల్డెన్‌ నోట్‌ బుక్‌, ద డైరీ ఆఫ్‌ ఎ గుడ్‌ నైబర్‌, ద గుడ్‌ టెర్రరిస్ట్‌, ద స్వీటెస్ట్‌ డ్రీం మొదలైనవి. సంశయవాదం, ధైర్యం, కాల్పనిక శక్తితో భిన్నమైన నాగరికతలను పరిశీలనకు పెట్టిన స్త్రీ అనుభవాల రచయిత్రిగా తన 88 ఏళ్ళ వయస్సులో 2007వ సంవత్సరంలో నోబెల్‌ బహుమతిని ప్రదానం చేశారు.
12. హేర్తా మ్యూలర్‌: హేర్తా మ్యూలర్‌ రుమేనియాకు చెందిన రచయిత్రి. హేర్తా జర్మనీ మాట్లాడే అల్పసంఖ్యాకులు నివసించే రుమేనియాలోని నిచిటార్ఫ్‌ అనే పట్టణంలో 1953వ సంవత్సరంలో రైతు కుటుంబంలో జన్మించింది. జర్మన్‌ ప్రభుత్వం వారి భూముల్ని లాగేసుకొంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం హిట్లర్‌ చేసిన సమిష్టి నేరాల పరిహారం కోసం రుమేనియాలో నివసిస్తున్న 17`45 ఏళ్ళ మధ్య ఉన్న జర్మన్లు అందరూ నిర్బంధ కార్మిక శిబిరాల్లో ఉండాల్సిందేనని 1945 జనవరిలో స్టాలిన్‌ ప్రకటించిన దరిమిలా 17 ఏళ్ళ తన తల్లిని నిర్బంధ కార్మిక శిబిరాలకు రష్యా బలవంతంగా తీసుకెళ్ళిపోయింది. హేర్తా పటభద్రురాలయ్యాక తనకి యుక్తవయస్సు వచ్చిన తరువాత తండ్రి మరణం, బ్రతుకుదెరువు కోసం తల్లి పొలంలో కూలీగా వెళ్ళడం, ఈ పరిస్థితిలో తనని తాను ఓదార్చుకునేందుకు రచనా వ్యాసంగాన్ని ఆశ్రయించింది. మాటల్లో చెప్పలేని పరిస్థితుల్లో జీవితంపట్ల తననితాను వ్యక్తం చేసుకోవడం కోసం రాయడం ఆమెకు ఉపశమనాన్నిచ్చింది. పట్టభద్రురాలయ్యాక కొన్నాళ్ళు టీచర్‌గా పనిచేసింది. ఆమె ప్రసిద్ధ రచనలు: ద పాస్‌పోర్ట్‌, ట్రావెలింగ్‌ ఆన్‌ వన్‌ లెగ్‌, ద ఫాక్స్‌ వాజ్‌ ద హంటర్‌, ద అపాయింట్మెంట్‌ మొదలైనవి. కవిత్వ సాంద్రత, నిర్మొహమాటపు వచనంలో, వంచించబడ్డవారి జీవనచిత్రాల్ని వివరించినందుకు నోబెల్‌పురస్కారాన్ని ఇస్తున్నట్లుగా నోబెల్‌ బహుమతి ప్రదాతలు 2009 లో ప్రకటించారు.
13. అలిస్‌ మన్రో: అలిస్‌ మన్రో కెనడాకు చెందిన రచయిత్రి. ఆమెది వ్యవసాయ కుటుంబంలో 1931వ సంవత్సరం కెనడాలోని వింరaం అనే పట్టణంలో జన్మించింది. అలిస్‌లో 11 ఏళ్ళ ప్రాయంలోనే రచయిత్రి కావాలనే బీజం పడిరది. ఉన్నత పాఠశాలలో చేరాక ఆమెలో ఏకాకితనం మొదలై, పుస్తకాల ఊహల్లో గడిపేది, విహరించేది. ఆమె రచనలు ద డైమన్షన్స్‌ ఆఫ్‌ ఎ షాడో, ద ప్రోగ్రెస్‌ ఆఫ్‌ లవ్‌, ఫ్రెండ్‌ ఆఫ్‌ మై యూత్‌, టూమచ్‌ హ్యాపినెస్‌ మొదలైనవి. నాణ్యంగా అల్లిన కథనంతో, నిస్సంకోచం, స్పష్టత, మానసిక వాస్తవిక చిత్రణతో ఆమె కథలు, రచనలు అలరారుతుంటాయి. ప్రజల పోరాటాలు, విలువల సంఘర్షణ, కష్టసాధ్యమైన సంబంధాలతో చిన్న పట్టణాలలోని వాతావరణాన్ని ఆమె కథలలో చిత్రించినందుకు 2013లో నోబెల్‌బహుమతి ప్రకటిస్తూ ఆమెను ‘సమకాలీన చిన్న కథల గురువు’ గా నోబెల్‌బహుమతి ప్రదాతలు కొనియాడారు.
14. స్వెత్లానా అలెక్సీయెవిచ్‌: స్వెత్లానా అలెక్సీయెవిచ్‌ బెలారసియకు చెందిన రచయిత్రి. ఈమె 1948వ సంవత్సరంలో యుక్రేన్‌లో జన్మించింది. తండ్రి సైన్యంలో పనిచేసి అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాడు. తల్లి ఉక్రెయిన్‌ జాతీయురాలు, ఆమె కూడా ఉపాధ్యాయురాలే. స్కూలులో చదువుతున్నప్పుడు స్కూలు పత్రికలో కవితలు, వ్యాసాలు రాయడంతో వచ్చిన ప్రశంసలు, కితాబులతో స్వెత్లానా రచనా వ్యాసంగం మొదలైంది. తరువాత మిన్స్క్‌ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యనభ్యసించి 1972లో పట్టభద్రురాలైంది. నేమ్యాన్‌ సాహిత్య పత్రికలో విలేఖరిగా చేరి అందులోనే కాల్పనికేతర విభాగానికి అధిపతిగా ఎదిగింది. స్వెత్లానాను అత్యంత ప్రభావితం చేసిన రచయితలు అలెస్‌ ఆడమోవిచ్‌, డేనీల్‌ గ్రానిన్‌. ఆమె రచనలు ఐ హావ్‌ లెఫ్ట్‌ మై విలేజ్‌, ద బాయ్స్‌ ఇన్‌ జింక్‌, ఎన్‌ చాంటెడ్‌ విత్‌ డెత్‌ మొదలైనవి. 2015లో స్వెత్లానాకు నోబెల్‌ బహుమతి ప్రకటిస్తూ విభిన్న స్వరాలలో ఆమె రచనలు సమకాలీన ప్రపంచంలోని బాధల్ని, సాహసాల్ని వినిపిస్తాయి అని స్వీడిష్‌ అకాడవిూ అభిప్రాయపడిరది. ఆమె రచనలు స్వీయ స్వరకల్పనలో బ్రహ్మాండమైన బృందగానంలా ఉంటాయి, అయితే ఆ బృందగానం ఎక్కడో దూరం నుంచి స్పష్టంగా వినిపిస్తుంటుంది అని మేధావులు పేర్కొన్నారు.
15. ఓల్గా టోకర్‌జక్‌: పోలెండ్‌కు చెందిన ఓల్గా టోకర్‌జక్‌ తన దేశానికి నోబెల్‌బహుమతి సంపాదించిపెట్టిన రెండవ రచయిత్రి. ఈమె 1962వ సంవత్సరంలో జన్మించింది. వార్సా విశ్వవిద్యాలయంలో ఆమె మనస్తత్వశాస్త్రం అభ్యసించారు. ఆమె గొప్ప రచయిత్రి, కార్యకర్త, ప్రజామేధావి. ఆమె వామపక్ష భావాలకు చెందినది. స్త్రీవాద రచయిత్రి. ఆమె రచనలలో మార్మికవాదం గోచరిస్తుంటుంది. విమర్శకులు ఆమెకు గల జ్ఞానసంపన్నతను, సాహిత్యప్రావీణ్యాన్ని, మంచి అభిరుచిని, కథాకథన చాతుర్యాన్ని, తాత్వికదృక్పథాన్ని మెచ్చుకునేవారు. ఆమె పోలెండ్‌లో బహుముఖ ఖ్యాతిపొందిన రచయిత్రి. ఎన్నో వ్యాసాలు, కథలు, నవలలు వ్రాసింది. ఆంగ్లభాష నుండి అనేక అనువాద రచనలను దేశానికి అందించింది. ఆమె రచనలు కొన్ని చలనచిత్ర రూపం కూడా ధరించాయి. దక్షిణ పోలెండ్‌లోని స్పెలీషియాకు చెందిన ఓల్గా అక్కడ 2015 నుండి సాహిత్య సంబరాలను జరపడం ప్రారంభించింది. అయితే చాలాకాలం ఆమె ఖ్యాతి పోలెండ్‌కే పరిమితమైంది. స్థానికంగా ఆమెకు వచ్చిన అవార్డ్సు సంఖ్యకు లెక్కలేదు. క్రమంగా ఆమె రచనాసౌరభం విదేశాలలో కూడా గుబాళించడం ప్రారంభమైంది. ‘ఫ్లైట్స్‌’ అనే నవలకు 2018లో మ్యాన్‌ బుక్కర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ లభించింది. ఆమె సారస్వతసేవకు గుర్తింపుగా 2018లో నోబెల్‌బహుమతి లభించింది.
16. లూయీస్‌ ఎలిజబెత్‌ గ్లుక్‌: ప్రఖ్యాత అమెరికన్‌ కవయిత్రి, వ్యాసకారిణి అయిన లూయీస్‌ ఎలిజబెత్‌ గ్లుక్‌ 1943న అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జన్మించింది. సారా లారెన్స్‌ కళాశాలలోను, కొలంబియా విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేసింది. అధ్యాపక వృత్తిని స్వీకరించి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మేరీ విశ్వవిద్యాలయంలో 78వ ఏట ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. శ్రీమతి గ్లుక్‌ చిన్నప్పుడే నరాల వ్యాధితో బాధపడినా, దానిని అధిగమించి ఎన్నో సాహిత్య శిఖారాలను అధిరోహించింది. పుంఖాను పుంఖాలుగా కవితలు, రచనలు వెలువరించింది. ప్రఖ్యాత అమెరికన్‌ కవులలో, రచయిత్రులలో, ప్రొఫెసర్లలో ఒకరిగా భాసించింది. అంతరంగంలోకి ప్రయాణం చేయడం, ‘నేను’ అను దానికి దూరంగా జరగడం, వైయక్తిక భావనకు విశ్వభావనను రంగరించడం ఆమె రచనలలోని ప్రధానాంశాలు. సహజంగానే అనేక గొప్ప బహుమతులు ఆమె కంఠహారాలు అయినాయి. ఉదా: పులిట్జర్‌ ప్రైజ్‌, బోలింజన్‌ ప్రైజ్‌, నేషనల్‌ బుక్‌ అవార్డ్‌, నేషనల్‌ హ్యుమానిటీస్‌ మెడల్‌ మొదలగునవి. శ్రీమతి గ్లుక్‌ అమెరికా ఆస్థాన రచయిత్రిగా (2003`04) నియమింపబడిరది. వాటన్నింటికి మకుటాయమానంగా 2020లో ఆమెకు సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌ వరించింది.
ముగింపు: పింగళిగారిచే రచించబడి, ఘంటసాలగారిచే స్వరపరచబడిన గుండమ్మకథ చిత్రంలోని ‘లేచింది మహిళాలోకం’ అనే పాట ఈనాటికీి మహిళా చైతన్యాన్ని, ప్రగతిని సూచిస్తుంది. మహిళలు చిన్న చిన్న పదవుల దగ్గర నుండి ప్రధాన మంత్రుల వరకు, దేశాధ్యక్షుల వరకు, నోబెల్‌బహుమతి విజేతల వరకు రాణిస్తున్నారు. అంతర్జాతీయంగా బుక్కర్‌ ప్రైజ్‌లు, జాతీయంగా జ్ఞాన్‌పీఠ్‌ అవార్డులు, కేంద్రసాహిత్య అకాడమి అవార్డులు పొందిన మహిళా సాహిత్యకారులున్నారు. ఆకాశంలో సగం అయిన మహిళాలోకం అధిరోహించని శిఖరమంటూ లేదు. హింస, మానభంగం, హత్య వంటి అమానుష అకృత్యాలు మాని పురుషులలో మానసిక పరిణతి, వికాసం, చైతన్యం కలిగించినప్పుడే ఈ సాహిత్యకృషికి ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. దాదాసాహెబ్‌ ఫాల్కీ అవార్డు గ్రహీత, ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు శ్రీ కె.విశ్వనాథ్‌ గారు ‘‘నా జీవితంలోని చాలా అంశాలకు మా అమ్మకు నేనెంతో రుణపడ్డాను. ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, అక్క, చెల్లి, వదిన, భార్య, కుమార్తె ` ఇలా ఎందరో స్త్రీ మూర్తుల ఫలితంగానే మనిషికి వ్యక్తిత్వం తయారవుతుంది’’ అని అభిప్రాయపడ్డారు.ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు లాస్కీ అన్నట్లు, ఏ సమాజం అయితే స్త్రీలకు సమానÛ అవకాశాలను, హక్కులను కల్పిస్తుందో, ఆ సమాజం నుండి ఎక్కువ మంది మేధావులు, శాస్త్రజ్ఞులు, పాలనాదక్షులు, సంఘసంస్కర్తలు, సేవాతత్పరులు, సాహితీవేత్తలు ఉద్భవిస్తారు. మహిళలు భౌతిక, బౌద్ధిక, మానసిక స్వేచ్ఛను అనుభవించగలిగిన్పుడే గాంధీజీ కోరుకున్న సమాజానికి, స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది. శక్తి సామర్థ్యాలలో, అవకాశాలలో, అభివృద్థిలో, నిర్ణయాలలో, నిర్మాణంలో స్త్రీ పురుషులు సమానంగా ఉండే ప్రపంచం నిస్సందేహంగా శక్తివంతమైన ప్రపంచం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.