ఇప్పటికీ చర్చనీయాలే – జూపాక సుభద్ర

రత్నమాలది విప్లవతరమే, ఉద్యమాల తరమే. ఈ తరంలో తెలంగాణ నేలమీద విప్లవ సాహిత్య పత్రిక నడిపిన మొదటి తెలంగాణ మహిళ రత్నమాల. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల తర్వాత, జై తెలంగాణ, జై ఆంధ్ర పోరాటాల పిదప ఎమర్జెన్సీ చీకట్ల నుంచి దేశం అప్పుడప్పుడే

భయంగా, స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సంక్షోభంలో, సిరిసిల్ల జగిత్యాల విప్లవాలు మండుతున్న కాలంలో ఉద్యమ సాహిత్య పత్రికగా ‘నూతన’ ఆవిర్భావం ఒక చారిత్రక సందర్భం. అట్లాంటి పత్రికకు ఎడిటర్‌గా ఉండి 1978 నుంచి 1982 దాకా నిత్య నిర్బంధాల్ని ఎదుర్కొంటూ విజయవంతంగా నడిపించిన రత్నమాల సంపాదకీయాలు ఆనాటి పోరాట చరిత్రకు అద్దం పడతాయి.
రత్నమాల ‘నూతన’ పత్రికలో వెలువరించిన సంపాదకీయాలు నాటి విప్లవ తరాల చరిత్రను ఈ తరాలకు మోసుకొచ్చిన సంఘర్షణలు. అప్పటి ఉద్యమ తరాలు, కాలాలు, యువత, నిర్బంధాలు, ప్రశ్నలు, పోరాటాలు ప్రతి సందర్భాన్ని ఎట్లా ఏదున్నయో అవి ఈ గ్లోబల్‌ కాంటెక్స్ట్‌ యువతకు కొంత పరేశానైనా అవి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది.
నాకు రత్నమాల పరిచయమైంది 1982లో ‘నూతన’ సంపాదకురాలిగానే. ఏ పత్రిక చూసినా మగవాళ్ళే ఎడిటర్లుగా ఉన్న పరిస్థితిలో ‘నూతన’ మాసపత్రిక, అదీ ఉద్యమ సాహిత్య పత్రికను ఒక మహిళ సాధికారికంగా నడపడం గొప్ప విషయంగా ఆశ్చర్యపడేది. ఇప్పడున్నన్ని పత్రికలానాడు లేవు. మామూలు టైంపాస్‌ పత్రికలు, చదివి పక్కన పడేసే పత్రికలు నడపడం సులువేమో కానీ ఒక సామాజిక బాధ్యతగా పీడిత జన పక్షం వహించి పత్రికను ఉద్యమంగా నడపడం చాలా కష్టం, సాహసం.
ఒక పత్రిక ఎట్లా ఉండాలి? ప్రజా సమస్యల పట్ల, పోరాటాల పట్ల ఎలాంటి బాధ్యత, చైతన్యం కలిగి ఉండాలి అనేది ‘నూతన’ సంపాదకీయాలు చదివితే అర్థమవుతుంది. ‘నూతన’ ప్రారంభ సంచికలో సంపాదకురాలు చెప్పినట్లు ఒక కొత్త వ్యవస్థను ప్రతిపాదించడానికి, సామాజిక సాంస్కృతిక స్పృహను పెంపొందించే సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి ‘నూతన’ పత్రిక నడుం కట్టిందనీ, చిన్న పెద్ద పత్రికలన్నీ పేరున్న రచయితలకే ప్రాధాన్యమిస్తుండడం వల్ల కొత్త రచయితలు వచ్చే అవకాశముందనీ ఒక ఎడిటర్‌గా కొత్త రచయితలకు హామీగా ‘నూతన’ ద్వారా ప్రోత్సాహాన్ని అందించడం ఈనాటిక్కూడా స్ఫూర్తిదాయకం. ఎడిటర్‌గా అలాంటి హామీలు, ప్రోత్సాహాలు ఈనాటికీ తక్కువనే చెప్పాలి. ‘నూతన’ పత్రిక ఈడేర్చిన సామాజిక బాధ్యతలు ఈనాటి పత్రికలకు ఆదర్శదాయకం. ఈ పత్రిక అనేక కొత్త రచయితల్ని, యువ రచయితల్ని ప్రోత్సహించింది. నెలనెల నెగడులా అప్పటి యువతను మండిరచింది, ప్రేరణగా నిలిచింది. యువత మెదళ్ళను పదునెక్కించింది. అప్పుడప్పుడే సమాజాన్ని చూసేందుకు కళ్ళు పొటమరించే మాకు ‘నూతన’ పత్రిక విప్లవ సాహిత్యోద్యమానికి ప్రాథమిక పాఠశాలగా కొత్తచూపును అందించింది. అనేక యువకవులకు బాసటగా ఉండి ఆనాటి సామాజిక విప్లవ శక్తులకు కాగడాగా పనిచేసిందని చెప్పొచ్చు. ‘నూతన’ పత్రిక అనేక కొత్త ఒరవడుల్ని సృష్టించడానికి ప్రధాన కారకురాలైన సంపాదకురాలు రత్నమాల కృషి తక్కువది కాదు. మాండలికాల మీద, ప్రధానంగా తెలంగాణ మాండలికం మీద దీర్ఘకాలం చర్చ జరిగింది ‘నూతన’లోనే. ఆనాడు తెలంగాణ భాషను మాండలికంగానే చూసిండ్రు సీమాంధ్రులు, వాళ్ళ మాయాజాలంలో పడిన తెలంగాణ వాళ్ళు కూడా. అల్లం రాజయ్య ‘ఊరేగింపు’ నవలని ‘నూతన’లోనే చదివిన. ప్రజల పాటలు, విప్లవ కవిత్వం, విప్లవ కథలు, సామాజిక దృష్టి కోణాలు కొత్త దృక్పథాలతో కూడిన వ్యాసాలు ‘నూతన’ అందించేది. రష్యా, చైనా సాహిత్యాల్ని, సిద్ధాంతాల్ని, ఆ సాహిత్యకారులను ‘నూతన’ పత్రిక ద్వారా తెలుసుకున్నాం.
అప్పటి యువతను విప్లవకారులుగా, రచయితలుగా, కవులుగా మలచిన చరిత్ర ‘నూతన’ పత్రికది. గుడిహాళం రఘునాథం, నందిని సిద్ధారెడ్డి, నారాయణస్వామి వంటి కవులు నూతన పత్రికలో విస్తృతి పొందినవారు. వృత్తికులాల బాల్యాలు ఎంత కర్కశంగా ఉంటాయో తెలిపే ‘ఓ పాలబుగ్గ జీతగాడా, పాలు మర్సి ఎన్నాల్లయిందో’ పాట వంటి అనేక మంది పీడిత కులాల పాటలు రాసిన ప్రజా కవి సుద్దాల హనుమంత గురించిన వ్యాసం నూతన పత్రిక వెలుగులోకి తెచ్చింది.
‘నూతన’ ఆనాటి సమాజానికి అందించిన ప్రేరణలు, చైతన్యాలు, ఉద్యమాలు, పోరాటాలు ఇప్పటి గ్లోబల్‌ తరాలకు స్ఫూర్తిదాయకమే అయినా ఈనాటి ఉద్యమాలైన తెలంగాణ దళిత, దండోరా, అస్తిత్వవాదాల సందర్భాల్లో పునర్మూల్యాంకన చేసుకోవాల్సిన అంశాలు.
నూతన పత్రిక సంపాదకీయాల్లో రత్నమాల విప్లవ రాజకీయాల్ని, ఉద్యమాల్ని, పౌరహక్కుల్ని, పత్రికా స్వేచ్ఛను, పత్రిక యజమానుల సామాజిక బాధ్యతల్ని, కల్లోలిత ప్రాంత చట్టాలు, పత్రికా బిల్లులు, వ్యతిరేకించిన ప్రజల్ని ఎన్‌కౌంటర్‌ చేస్తున్న ప్రభుత్వ దురాగతాల్ని చెండాడిరది. అలాగే రచయితలు, సాహిత్యకారులు, సాహిత్య, రచయితల సంఘాలు బాధిత, పీడిత ప్రజాపక్షాన ఎలా నిలబడాలనే ప్రాపంచిక దృక్పథాల్ని కూడా అంత నిక్కచ్చిగా చెప్పింది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలతో విప్లవ శక్తులు విజృంభించి విస్తృతమవుతున్న కాలాన, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 400 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపి అది పోరాటంగానే తీసుకోని సీమాంధ్ర కమ్యూనిస్టులు, వాళ్ళ ప్రభావాల్లో ఉన్న తెలంగాణ విప్లవకారులతో కలిసి తెలంగాణను సీమాంధ్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చిన కాలాన సిరిసిల్ల జగిత్యాల రైతుకూలీ పోరాటాలు జరిగాయి. ‘దున్నేవారికి భూమి’ నినాదం నాగలిఎడ్లున్న వాళ్ళకు గుంట సెంటు వచ్చినా అవి లేనోళ్ళు కూలోళ్ళుగానే మిగిలిండ్రు.
తెలంగాణ సాయుధ పోరాటం జరిగినా తెలంగాణలో ఫ్యూడల్‌ శక్తులు అంతంకాని పరిస్థితి. వేల ఎకరాలున్న పెద రెడ్లమీద బహుజన కులాలను కలుపుకొని చినరెడ్లు చేసిన పోరాటమిది. ఈ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమిని సాధించుకున్నామని చెప్తారు. కానీ బహుజన కులాలకు ఎద్దడుగు జాగ కూడా పొందకపోవడానికి కారణాలు ఇంకా సమీక్షలోకి రాలేదు. భూమి రాకపోగా, బహుజన కులాలకు దొర కింద వెట్టి పోలే, కులాలు పోలే. బహుజన కులాలన్నీ దొర కోటగడి చుట్టూ వెట్టి చేయాల్సిందే. మాదిగలు దొర కుటుంబానికి చెప్పులు, వ్యవసాయానికి తొండం, తాళ్ళులాంటివి అందియ్యాలి పుక్కడికే. మంగలి, కుమ్మరి, కమ్మరి, చాకలి, సాలె, గౌడ కులాలన్నీ దొర కుటుంబానికి గడి చుట్టూ, దొర వేల ఎకరాల వ్యవసాయం పనులు కూలి, జీతం లేకుండా పైసా ఆశించకుండా పనిచేయడమే వెట్టి. ఇక బహుజన కులాల ఆడవాళ్ళ మీద లైంగికాధికారాలు దొరలవే. దళితుల పట్ల అమానవీయంగా, క్రూరంగా ఉండేవారు ఫ్యూడల్‌ దొరలు. దొరలు ‘చెంబడ్క’ పోయే చెంబుతో దళితులకు తాగే నీళ్ళివ్వడం, నిలబడ్డ కాడ నీళ్ళు జల్లుకోవడం, పశువుల్ని పూజిస్తూ మనుషుల్ని అంటనివ్వని దుర్మార్గాల మీద పోరాడిన రాజ్యహింస మీద జరిగినంత చర్చ కులహింస మీద జరగలేదు. అది కమ్యూనిస్టు అగ్రకులాల కుల అణచివేతగా బహుజన కులాలు భావిస్తున్నాయి. కులం కారణంగానే అగ్రకులం దొరలు వెట్టి చేయించారు. స్వంత కులం వాళ్ళనెవ్వరినీ వెట్టి చేయించలేదు. ఈ భారతదేశ సమాజం కుల సమాజం. ఈ విషయం భారత విప్లవ శక్తులు బేషరతుగా పునఃపరిశీలన చేసుకోవాలి.
విప్లవ కమ్యూనిస్టులకు నక్సల్బరీ రైతు పోరాటం (1967) ఒక సిద్ధాంత భూమిక నేర్పాటు చేసింది. తిరగబడిన విప్లవకారులను ‘నక్సలైట్‌’గా ముద్రించింది నక్సల్బరీ పోరాటం వల్లనే. అలాంటి నక్సల్బరీ రైతు పోరాటంలో చనిపోయింది పదకొండు మందయితే అందులో ఏడుగురు మహిళలు, నలుగురు పిల్లలు (వీళ్ళే సామాజిక వర్గాలో). భారత విప్లవ పార్టీల్లో కూడా కుల ప్రాంత జెండర్‌ వివక్షలుండడం చారిత్రక తప్పిదం. అందుకే అవి విజయం సాధించడంలేదు ఇప్పటిదాకా. ‘నూతన’ సంపాదకీయాల్లో కూడా ఈ ప్రస్తావనలు, స్పష్టతలు, విమర్శలు కొంతవరకు సృష్టించడం జరిగింది.
కమ్యూనిస్టు ఉద్యమాలు సమీక్షిస్తే అందులో పాల్గొని పోరాడి అసువులు బాసిన బహుజన కులాలకు, మహిళలకు సాధికారం, గుర్తింపులు తేలేదు. కానీ చదువుకున్న అగ్రకులాల వాళ్ళకు నాయకులుగా, వ్యూహకర్తలుగా, సిద్ధాంత కర్తలుగా చారిత్రకంగా గుర్తింపు గౌరవాలు తెచ్చిపెట్టాయి. అయితే ఉద్యమాలవల్ల లబ్దిపొందిన అగ్రకుల విప్లవ నాయకులు ఈ స్పష్టమైన అవగాహనను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. అందుకే శ్రీకాకుళ పోరాటాలు విప్లవాదర్శమయ్యాయి. ఆదిలాబాద్‌ ఆదివాసీల పోరాటానికి నాయకత్వం వహించింది ఆదివాసీలే. అందుకే ఆ పోరాటాన్ని చర్చలోకి రాకుండా చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని (1969) విప్లవం పేరుతో అప్రస్తుతం చేశారు.
ఇప్పటికీ సిరిసిల్లా జగిత్యాలలోని రైతుకూలీ పోరాటాలు జరిగిన పల్లెలకు బోతే ఆ పల్లెల్లో పోరాడిన బహుజన విప్లవ శక్తులు చెప్పే పాఠాలు వినాలి. వారి పోరాట స్ఫూర్తి, చరిత్రలు, ఎలాంటి వెట్టి చేసేవారో… దొరల ఆగడాలెట్లా ఉంటాయో, వాటినెదిరించి పోరాడినందుకు ఇండ్లు వాకిళ్ళు ఇడిచిపెట్టి పోయిన కూలీలు, జైళ్ళల్ల మగ్గిపోయిన వెట్టిగాళ్ళు, పోలీసు చిత్రహింసల వల్ల కాళ్ళు, చేతులు, నడుములు పోగొట్టుకున్న పోరాట శక్తులు, దొరల గూండాలచే అత్యాచారానికి గురయిన సంగం నాయకురాలు కొదురుపాక రాజవ్వ లాంటి వాళ్ళు సాక్షీభూతంగా ఉన్నారు బతికున్న ఉద్యమ చరిత్రగా. కల్లోలిత చట్టం తెలంగాణలో అమలు జరిగింది. రత్నమాల ‘నూతన’ సంపాదకీయాలు (1978`1982) నాలుగు సంవత్సరాల గత ఉద్యమ చరిత్రను వర్తమాన ఉద్యమ సమాజంలో జరిపే సంభాషణగా పరిశీలిస్తే అనేక కోణాలు, ఇంకా సంఘర్షిస్తున్న అభిప్రాయాలు, దృక్పథాలు వెంటాడుతున్నట్లుగా కనిపిస్తాయి. కొన్ని దృఢంగా, కొన్ని అస్పష్టంగా గోచరిస్తాయి. సామాజిక వ్యవస్థలోని ప్రతి కదలికకు చలించి, ప్రతి చలనానికి ప్రకంపించి, ప్రతి ప్రకంపనానికి ప్రతిధ్వనించే రచయితల రచనలు సజీవంగా ఉంటాయనే తాత్వికత నిత్య సత్యం. ఈ తాత్విక బలంతోనే ఉన్నందువల్ల రత్నమాల ‘నూతన’ పత్రికను గొప్ప ఉద్యమ సాహిత్య పత్రికగా తీసుకురాగలిగింది.
పత్రికల యజమానులకు అనుకూలంగా వచ్చే రచనలను, రచయితలను నిరసించింది. నిరుత్సాహాలకు లోనవుతున్న యువ రచయితలను, ప్రజా రచయితలను, రచయిత్రులను ప్రోత్సహించడానికి రచయితల సంఘాలు, పత్రికలు ముందుకు రావాలని ‘నూతన’ పత్రికను ఆయుధంగా చేసుకొని పోరాడిరది రత్నమాల. ఆమె స్వయంగా జర్నలిస్టు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికల్లో పనిచేసింది.
జర్నలిస్టులకు, పత్రికల్లో పనిచేసే కార్మికులకు మధ్య సత్సంబంధాలుండాలని, ఇద్దరికీ ఒకే యూనియన్‌గా పనిచేయడానికి కృషి చేసి కార్మికుల నుంచే ఈ యూనియన్‌కి ప్రెసిడెంటుగా ఉండాలనే డిమాండుతో పనిచేసినందుకు యాజమాన్యాల నుంచి దాడుల్ని, కేసుల్ని ఎదుర్కొంది రత్నమాల. పత్రికా యాజమాన్యాలు ‘వేజ్‌ బోర్డు’ సిఫార్సు చేసిన జీతాలు ఇవ్వనందుకు 20 రోజుల పాటు పత్రికను ఆపి పెద్ద ఎత్తున జరిగిన సమ్మె (ఈనాడు) పోరాటంలో రత్నమాలది కీలక భూమిక. పత్రిక యాజమాన్యాల గురించి రాస్తూ ‘దేశంలో భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో, పెట్టుబడి ఎవరి ఆధీనంలో ఉందో ప్రభుత్వాలు నడుపుతున్నదీ వార్తలు రాస్తున్నదీ వాళ్ళే’ అని పత్రిక యాజమాన్యాలు ఏ కులాలో, వర్గాలో వారి స్వభావాలు, పుట్టుక ఎక్కడ్నుంచి వచ్చిందో ఆ మూలాలు ఆనాడే స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛ కోసం జర్నలిస్టుల హక్కుల మీద, పత్రికా కార్మికుల సమస్యల మీద ఆమె సుదీర్ఘకాలమే పోరాటం చేసింది. అందుకే ప్రెస్‌ బిల్లు మీద గొప్ప చర్చ లేవదీసింది. ఇప్పటికీ పత్రిక యజమానులు, జర్నలిస్టుల పరిస్థితులు, కార్మికులు వారి సమస్యలట్లానే ఉన్నాయి… కానీ ఆ పోరాటాలు స్ఫూర్తిదాయకం ఇప్పటికీ. పెట్టుబడి రాసేవాళ్ళ రాతల్ని అదుపులో ఉంచుతున్నది. అయితే పత్రికా స్వాతంత్య్రానికి దున్నేవానికి భూమి లేకపోవడానికి శ్రమించేవాడిది పనిముట్టు కాకపోవడానికున్న సంబంధాన్ని గుర్తిస్తేనే పత్రికా స్వాతంత్య్రాన్ని రక్షించుకోగలమనే చైతన్యాల్ని అందిస్తుంది.
‘నూతన’ పత్రికా సంపాదకీయాలు తన చుట్టూ ఉన్న సమాజ స్థితులను దునుమాడినట్లుగానే కనిపిస్తాయి. శాసనసభల నిర్వహణలు, బడ్జెట్‌, ఆర్థిక సంక్షోభాలు, ఇంద్రవెల్లి మారణకాండ, మే డే మీద, స్త్రీలను పోరాటంలోకి సమీకరించని సంగతులను, కల్లోలిత ప్రాంత చట్టాల మీద ప్రభుత్వ నిర్బంధాల మీద, ఎన్‌కౌంటర్ల మీద, బాధ్యతలేని రచయితల మీద, కార్మికోద్యమ బలహీనత మీద, మేధో వధశాలలుగా ఉన్న విద్యావిధానం మీద, ఎమర్జెన్సీ పులిపంజాల మీద, పౌరహక్కుల రక్షణ మీద, జనం జీవించే హక్కుల మీద, పత్రికా స్వాతంత్య్రాల మీద… ఇంకా అనేక ప్రజా పోరాటాలకు మద్దతుగా ఈ సంపాదకీయాలు నిర్వహించిన పాత్ర చారిత్రకమైనది.
తరగతి గదుల కోసం, విద్యావసరాల కోసం విద్యార్థులు, చాలీచాలని జీతంతో జీవనాలు గడవని ఉద్యోగులు, తరతరాల వెట్టిని నిరసిస్తూ పల్లె ప్రజానీకం (బహుజన కులాలు) సమ్మెలు, ఉద్యమాలు చేశారు ఆనాడు. అవే సమస్యలు ఇంకా వికృతంగా ఉన్నా పోరాటాలు అంత మిలిటెంట్‌గా జరగకపోవడానికి అనేక కారణాలు చెప్పుకోవాలి. సమాజంలో వచ్చిన మార్పులు… కుల చైతన్యాలు పెరగడం, ఉదాసీనతలు, నిర్బంధాలు, ప్రపంచీకరణ, వ్యాపారీకరణ, గ్లోబల్‌ సంస్కృతి, టీవీ సంస్కృతి.
కార్మికుల్ని ఒకవైపు కాల్చుకుతింటూ మరోవైపు కార్మికుల మే డే నెత్తుటి జెండా అయిన ఎర్రజెండా, చికాగో నెత్తుటితో చిందిన జెండాను ఎగరేసే ప్రభుత్వ ప్రతినిధులను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గ నియంతృత్వంలో అధికారం హస్తగతం చేసుకున్న ప్రభుత్వాలకే మే డే జెండానెగరేసే అర్హత ఉందని చెప్పే ఆ ఆదర్శం నెరవేరకపోయెనే అనే బాధ మెలేస్తది.
ఇంకా అరసం రచయితలు సిరిసిల్ల జగిత్యాల రైతు కూలీ పోరాటాలకు మద్దతు నివ్వలేదు కానీ ప్రజా పోరాటాల తరపున నిలబడి రాసిన ప్రేమ్‌చంద్‌ శతజయంతి ఉత్సవాలు చేయడాన్ని ఈసడిస్తూ… ప్రేమ్‌చంద్‌ జీవితాదర్శాన్ని పాటించకుండా సభలు చేయడం వ్యర్థమంటుంది.
అలాంటిదే వంద సంవత్సరాల గురజాడ ఉత్సవాలకు తరలిన రచయితలు (ఒకరిద్దరు మినహాయింపు) ఆ పక్కనే జరిగిన లక్షింపేట మారణగాయాన్ని పరామర్శించని, మద్దతునివ్వని అమానవీయాల్ని చూసినం.
ఇప్పుడు జరుగుతున్న అన్ని ఉద్యమాల్లో ప్రధానంగా 60 ఏండ్ల తెలంగాణ పోరాటం వల్ల సాధించుకున్న తెలంగాణ ఉద్యమ మలి దశలో మహిళలున్నా వారి భాగస్వామ్యం, నాయకత్వం తగ్గిన విషయం ఉద్యమం పట్టించుకోలేదు, చర్చించలేదు. ఇది అప్రజాస్వామికమైనది, ఉద్యమ నిర్లక్ష్యాలుగా చెప్పాలి. బత్కమ్మలకు బోనాల పండుగలప్పుడే మహిళల్ని సమీకరించడం, ప్రోత్సహించడం జరిగింది. తర్వాత మగస్వామ్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది. దీనిమీద తెలంగాణ ఉద్యమం ఎటువంటి ఆత్మ విమర్శ చేసుకోలేదు.
కానీ 1980ల నాడే ఏ ఉద్యమానికైనా స్త్రీల భాగస్వామ్యముండాలని, స్త్రీలను పోరాటాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక కృషి అవసరమని గుర్తించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విప్లవ పార్టీల ప్రజా సంఘాల్ని ‘నూతన’ సంపాదకీయాలు హెచ్చరించాయి. ఇక్కడ కూడా భాగస్వామ్యాలు, మంది బలం కోసమే ఆరాటపడ్డాయి కానీ మహిళలను నాయకత్వాల్లోకి తీసుకురావాలనే ఆకాంక్ష కనిపించదు విప్లవ పార్టీ నాయకులకు. మహిళలు పాల్గొనకుండా ఉద్యమాలు విజయవంతంగా నిలబడవనే వాస్తవాలు తెలిసి కూడా మహిళలను పెద్ద ఎత్తున సమీకరించడంలో, వారికి నాయకత్వ స్థానాలు ఇవ్వడంలో ఉదాసీన వైఖరే అవలంబించాయి విప్లవ, కమ్యూనిస్టు పార్టీలు. రష్యా విప్లవం తర్వాత రష్యాలో జరిగిన సర్వేలో సోషలిజం వచ్చినా స్త్రీలు పూర్తిగా విముక్తి చెందలేరనీ, స్త్రీలు ఉద్యోగాలు చేయొద్దనీ, ఇంటికే పరిమితం కావాలనీ పురుషులు 95% కోరుకుంటున్నట్లుగా వెల్లడయిందంటే ఇక మామూలు దేశాల సంగతి గురించి ఏమి మాట్లాడతాం.
ఇన్ని అనుభవాలున్నా సరే ఇంత చేదును ఎదుర్కొంటున్నా కూడా రత్నమాల ఒక సమానత్వ స్వప్నాన్ని వదులుకోలేదు. సమాజంలో, ఉద్యమంలో, విప్లవ పోరాటాల్లో మహిళల నాయకత్వం, భాగస్వామ్య అంశాల్లో అనేక అప్రజాస్వామిక పెడధోరణుల్ని ఎదిరించి నిలబడాలి కానీ ఆ పెడధోరణులకు ప్రభావితం కావొద్దనీ మహిళలు తమ ప్రత్యేక అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం సమీకరణ కావాల్సి ఉందనీ, విప్లవ పార్టీలు మహిళా ఉద్యమం పట్ల సామాజిక బాధ్యతగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. ఈనాడు సభలు, సమావేశాలు తెలంగాణ ఉద్యమం నుంచీ, దండోర బీసీి ఉద్యమాల నుంచి కుల సంఘాల ఉద్యమాల దాకా మహిళల భాగస్వామ్యం లేకుండానే మగస్వామ్య పోరాటాలుగానే నడుస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే మహిళలు లేరనే సోయి, గిల్టీ కూడా లేకుండానే ఉద్యమాలు నడుస్తున్నాయి.
ఆశ్చర్యమేంటంటే మహిళా ఉద్యమాలు బలంగా లేనప్పుడు మహిళలు ఉద్యమాల్లోకి సమీకరించాలనే చర్చ జరిగేది. దానికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి, కొంతవరకు సాధించాయి. కానీ మహిళా ఉద్యమాలు, ఫెమినిస్టు ఉద్యమాలు, ఎన్జీఓలు పెరిగిన ఈనాడు మహిళల భాగస్వామ్యం గురించి సామాజిక ఉద్యమాలు పట్టించుకోకపోవడం ఆవేదన, ఆశ్చర్యమే. మహిళా ఫెమినిస్టు ఉద్యమాల వల్ల, మహిళా గ్రూపుల చైతన్యాలు పెరగడం వల్లనో ఏమో మహిళలకు కనీసం పాల్గొనే సందిచ్చినా నాయకత్వాలెక్కడ గుంజుకుంటారనే బెంగ, భయాలతో మహిళలను ఉద్యమాల్లోకి రాకుండా మగస్వామ్యాలు జాగ్రత్త పడుతున్నా రేపటి వారి పరాజయాలకే.
ఆనాడు మహిళలను సమీకరించడంలో ఉదాసీనతను కనబరుస్తున్నారని ఆందోళన పడిన రత్నమాలకు ఈనాటి అనుభవాలు, వాస్తవాలు అగమ్యగోచరంగా, అస్తవ్యస్తంగా అనిపించడం న్యాయమే. వీరులారా వందనం అనీ, వీరగాథలు పాడురా… అని విజృంభించి రాసేవాళ్ళు, పాడేవాళ్ళు, ‘నక్సల్బరీలోన నవయుగ జయహేల’లో అమరులైన ఏడుగురు బహుజన కులాల వీరనారీమణుల గాధలు పాడుకోని కుల జెండర్‌ వివక్షలు అన్ని ఉద్యమాల్లో కొనసాగుతుండడం ఒక అప్రజాస్వామికం.
జీవితాంతం ఉద్యమంగా బతికిన చరిత్ర రత్నమాలది. పీడితుల పక్షాన నిలబడిన చరిత్ర రత్నమాలది. సామాజిక న్యాయపోరాటాలకు మద్దతుగా పోరాడిరది. తెలంగాణ పోరాటంలో ఉంది. దండోర ఉద్యమంలో మాదిగలకు బాసటగా స్పందించింది. పి.వో.డబ్ల్యు, స్త్రీ శక్తి మొదలైన సంఘాల్లో పనిచేసింది. మహిళా ఉద్యమాలు నడిపింది. జర్నలిస్టు, పత్రికల్లో పనిచేసే కార్మికుల సంఘాల్లో పోరాడిన చరిత్ర రత్నమాలది.
నక్సల్బరీ మేఘ గర్జనల కాలంలో (1978`1982) ఉద్యమ సాహిత్య పత్రిక ‘నూతన’ను పెట్టి ఆనాటి యువతరాన్ని, సమాజాన్ని విప్లవం వైపు నడిపించిన సంపాదకీయాలు రాసిన రత్నమాల వాటిలో చేసిన మహిళలు, పీడితులు, శ్రామికుల పట్ల, సాహిత్యం పట్ల వెలువరించిన ప్రగతికాముకమైన ప్రతిపాదనలు ఇప్పటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా చర్చించాల్సిన నూతనమైన అంశాలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.