‘ఒక్కరి కోసం అందరం ` అందరి కోసం ఒక్కరం’- సామల్ల శ్వేత

నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహాయ సంఘంః
సిద్ధిపేట జిల్లాలో 2006 నుంచీ గత పదహారు సంవత్సరాలుగా ‘కేరింగ్‌ సిటిజన్స్‌’ కలెక్టివ్‌ తరఫున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో పనిచేయడం, వారి స్థితిగతుల గురించి తెలుసుకుంటూ ఆ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం గురించి తెలియజేస్తూ, వారి పిల్లల చదువు విషయంలో సహాయపడుతూ వస్తున్నాము. దాదాపు ఎవరికి దరఖాస్తు

చేసుకోవాలో కూడా తెలియదు. అవి తెలియజేసే క్రమంలో అనేక విషయాలు బయటకు వచ్చేవి. కొన్ని కుటుంబాలలోని మహిళలకు భర్త చేసిన అప్పుల వివరాలు తెలియదు. అతడు చనిపోగానే అప్పుల వాళ్ళు వచ్చి ఆమెను నిలదీసేవారు. ఇలాంటి కుటుంబాలు ఎన్నింటినో చూశాము. అంతే కాకుండా రైతు ఆత్మహత్య బాధిత మహిళలకు అప్పటివరకూ ఇల్లు, పొలం… అంతే జీవితం! నిరంతరం పనిచేయడం మాత్రమే తెలుసు. కానీ ఏ నిర్ణయాలలోనూ ఆమె పాత్ర ఉండదు. బయటి విషయాలు ఎక్కువ తెలియవు. అన్నింటికీ భర్త ఉన్నాడు, చూసుకుంటాడులే అనే ఆలోచనలో ఉంటారు. కానీ అనుకోకుండా భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళు జీర్ణించుకోలేని స్థితిలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కుటుంబాల భారం మొయ్యాలి. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు ఉంటారు. అందరి బాధ్యత ఈ మహిళలపైనే ఉంటుంది. చాలా వరకు రైతు ఆత్మహత్యలకు కారణం, పెరిగిపోయిన పెట్టుబడి, ఖర్చులు, నీళ్ళ కోసం అధికంగా బోర్లు వెయ్యడం, అవి సరిగ్గా పడకపోవడం, ఇంకా విత్తనాలు, అధిక రసాయనిక ఎరువుల వాడకం కోసం చేసే విపరీతమైన ఖర్చుల వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయనేది మాకు క్రమంగా అర్థమయింది. ఈ కుటుంబాల మహిళలు కూడా తమ భర్తల ఆత్మహత్యలతో ఈ కారణాల గురించి ఆలోచించడం, అర్థం చేసుకోవడం జరుగుతోంది. తమ సమస్యలను ఒక్కొక్కరుగా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోకపోవటం, పైగా హేళనగా మాట్లాడటం అనుభవమయిన తర్వాత, సమూహంగా అందరూ ఒక్కటిగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చుననే ఉద్దేశ్యంతో ముందుగా ఈ కుటుంబాల మహిళలందరూ కలిసి ‘రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల వేదిక’గా ఏర్పడడం జరిగింది. కేవలం ఎక్స్‌గ్రేషియా కోసం మాత్రమే కాకుండా, తమకు వచ్చిన ఇలాంటి పరిస్థితులు మిగిలిన వారికి రాకుండా ఉండడానికి, వ్యవసాయంలో వస్తున్న సమస్యల గురించి అవగాహన కలిగించడానికి, వ్యవసాయంలో ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవచ్చుననే విషయాలు తెలుసుకోవాలని అనుకోవటం జరిగింది.
గ్రామాలలో ఉండే రైతు ఆత్మహత్య కుటుంబాల మహిళలు, చిన్న`సన్నకారు మహిళా రైతులు, ఒంటరి మహిళలు… ఇలా అందరితో కలిసి వ్యవసాయ సంక్షోభం మీద సమావేశాలు నిర్వహించుకుంటూ వచ్చాము. నేల సారవంతంగా ఉంటే పంటలు, తద్వారా మన ఆరోగ్యం బావుంటుందనే ఆలోచనతో, సుస్థిర వ్యవసాయంలో మెళకువలు నేర్చుకోవడానికి, ఆత్మస్థైర్యంగా ఉండడానికి, పరస్పర సహకారంగా ఉండటానికి, ‘ఒక్కరి కోసం అందరం`అందరి కోసం ఒక్కరం’గా ఉంటూ ఐకమత్యంగా ఉంటేనే మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చనే నమ్మకంతో సహకార సంఘం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. అలా నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘానికి పునాదులు పడ్డాయి.
ఈ మహిళలందరూ తామందరూ ఒక్కటిగా ఉంటే తమ జీవనోపాధులను మెరుగుపర్చుకోవచ్చని బలంగా నమ్మారు. కుటుంబాలను పోషించుకుంటూ, సుస్థిర వ్యవసాయం గురించి అవగాహన పెంచుకుంటూ 2015లో ముందు ఒక పది గ్రామాలలో మహిళా రైతులతో గ్రామసంఘాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో గ్రామంలో ఒక్కరు, ఇద్దరుతో మొదలుపెట్టి 10 నుండి 15 మంది సభ్యులుగా సంఘాలు ఏర్పాటు చేశాము. నల్గొండ, అనంతపురం వంటి జిల్లాల్లో పనిచేస్తున్న కొన్ని సహకార సంఘాలను కూడా సందర్శించి సంఘాన్ని ఎలా నడిపించుకోవాలో తెలుసుకున్నాము. సంఘంలో సభ్యులుగా చేరాలంటే 100 రూపాయల వాటా ధనం, 10 రూపాయల సభ్యత్వ రుసుముతో కలిపి ఒక్కొక్కరు 110 రూపాయలు కట్టాలని అనుకున్నాం. మొదట 110 మంది సభ్యులుగా చేరారు. ఎప్పటికప్పుడు గ్రామస్థాయి, డివిజన్‌ స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుంటూ సిద్ధిపేటలో జిల్లాస్థాయి సమావేశంలో చర్చించుకొని ‘‘నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘం’’గా 2017లో రిజిస్టర్‌ చేశాము. సంస్థ పాలక వర్గంగా డివిజన్‌ స్థాయి సభ్యుల నుండి అందరి అంగీకారంతో 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శులతో పాటు 8 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కార్యవర్గ సభ్యుల సమావేశం, ప్రతి ఆరునెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం జరుగుతుంది. నేలమ్మ సంఘం సభ్యులకు సుస్థిర వ్యవసాయం, అంతరపంటల అవసరం, స్థానికంగా కంపోస్టు ఎరువు తయారీలో శిక్షణలు ఏర్పాటు చేసుకుంటున్నాము.
ఇప్పుడు ‘నేలమ్మ’లో 21 గ్రామాలకు చెందిన 193 మంది సభ్యులున్నారు. సంస్థ పురోభివృద్ధికి ఒక సలహాదారుల గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నాము. ‘ఐ ఫర్‌ ఫార్మర్స్‌’ మిత్రులు, ఇంకా సలహాదారుల బృందం అందించిన ఆర్థిక సహకారంతో 2017లో 26 మంది సభ్యులు మేకలు కొనుక్కోవటం కోసం ఒక్కొక్కరు రూ.5,000 చొప్పున లోన్‌ తీసుకున్నారు. 19 మంది సభ్యులు కోళ్ళ పెంపకం కోసం ఒక్కొక్కరు రూ.1,500 రుణం తీసుకున్నారు. సంస్థ ప్రారంభించిన కొత్తలో ఎటువంటి వడ్డీ లేకుండానే తీసుకున్నారు. కొంత ఆలస్యం జరిగినప్పటికీ చాలావరకు అందరూ మంచిగా తిరిగి డబ్బును సంస్థకు చెల్లించారు. నలుగురైదుగురు కట్టలేకపోయారు. లోన్‌ తీర్చడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని సర్వసభ్య సమావేశంలో చర్చించుకున్న తర్వాత, సంఘం నుండి ఎవరైనా రుణం తీసుకుంటే నూటికి ఒక రూపాయి చొప్పున మిత్తిగా చెల్లించాలని, ఒక సంవత్సరం లోపలే రుణం చెల్లించాలని నిర్ణయించుకున్నారు. 2018లో 30 మంది ఒక్కొక్కరు రూ.10,000 చొప్పున వ్యవసాయ అవసరాలకు లోన్‌ తీసుకున్నారు. 2019లో నలుగురు సభ్యులు బర్రెల కోసం రూ.30,000, ఏడుగురు సభ్యులు మేకల కోసం రూ.8,000 నేలమ్మ సంఘం నుండి రుణం తీసుకున్నారు. 2021లో 23 మంది సభ్యులు వ్యవసాయ అవసరాల కోసం ఒక్కొక్కరు రూ.10,000 చొప్పున లోన్‌ తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే తాము సుస్థిర పద్ధతుల్లో పండిరచిన కందులు, వెల్లుల్లి, రాగులు వంటి పంటలను సహకార సంఘానికి అమ్మటం ద్వారా మార్కెట్‌ రేటు కన్నా కొంత ఎక్కువ సంపాదనలోకి వెళ్ళగలుగుతున్నారు.
నేలమ్మ సంఘం సహకారంతో జీవనోపాధిని మెరుగుపరచుకుంటున్న సభ్యులు:
సిద్ధిపేట జిల్లా, మిరుదొడ్డి మండలంలోని మల్లుపల్లి గ్రామంలో నేలమ్మ సంఘం సభ్యులు 28 మంది ఉన్నారు. ఈ ఊరిలోని సభ్యులు మేకల పెంపకం చేపట్టి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఒక్క మేక ఎన్ని విధాలుగా గ్రామీణ కుటుంబానికి చేయూతగా ఉంటుందో మహిళా రైతు మంతురి రేణుక అనుభవాన్ని ఇక్కడ పరిచయం చేస్తాను. రేణుక కుటుంబానికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానికి తోడు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరానికి కౌలు 5,000 రూపాయలు. వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, పత్తి, వంకాయ, మిర్చి, టమాట, ఎల్లిగడ్డ వంటి పంటలు సాగు చేసింది. ఊర్లో కూరగాయలు అమ్ముకుంటూ చుట్టుపక్కల ఊర్లలో అంగళ్ళలో కూడా అమ్ముకునేవారు. యాసంగిలో వరి, బిర్నిసు పంటలు వేసింది. పొద్దు తిరుగుడు వేయాలనే ఆలోచనలో ఉంది. రేణుక పొలం పనులతో పాటుగా బీడీలు కూడా చేస్తుంది. తనకు బీడీ కార్మికుల పింఛను వస్తుంది.
2017లో సంఘం నుండి మేకల కోసం రూ.5,000 లోన్‌ తీసుకుంది. వాటితో ఒక్కొక్కటి రూ.2,500 చొప్పున రెండు మేక పిల్లలు తీసుకుంది. ఒక సంవత్సరం పాటు వాటిని సాదుకుంది. సంవత్సరం తర్వాత ఈ రెండు మేకలకు తలా ఒక పిల్ల పుట్టాయి. ముందు పుట్టిన రెండు పోతు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక ఒక్కొక్కటి రూ.5,000 చొప్పున రెండిరటిని రూ.10,000 కు అమ్మింది. లోన్‌ డబ్బులు రూ.5,000 సంఘానికి తిరిగి కట్టింది. సంవత్సరంన్నరకు తనకు రూ.10,000 ఆదాయం వచ్చింది. అయినప్పటికీ రెండు తల్లి మేకలు, రెండు పిల్ల మేకలు తన దగ్గర ఉన్నాయి. మూడవ సారి కూడా మేకలు తలా ఒక పిల్లను కన్నాయి. రెండవసారి పుట్టిన మేకలను కొంచెం పెద్దగా అయ్యాక ఒక్కొక్కటి రూ.10,000 చొప్పున రెండు కలిపి రూ.20,000 కు అమ్మింది. రెండు సంవత్సరాల వరకు పెంచుకుంటే రెండు తల్లులు, నాలుగు పిల్లలు అయ్యాయి. కుటుంబ అవసరాల కోసం వాటిని అమ్ముకుంటే రూ.30,000 వచ్చాయి. మేకలను ఓపికతో చూసుకోవాలని, మంచిగా సాదుకుంటే లాభమే వస్తుందనేది రేణుక అనుభవం చూపిస్తోంది.
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్‌ లేకపోవడంతో రేణుక పిల్లలు కూడా మేకపిల్లలను ఇష్టంగా, మంచిగా చూసుకున్నారు. 2017లో మేకలు తీసుకుంటే 2021 వరకూ తను మేకలను సాదుకుంది. ఇప్పటికీ అలాగే ఉంచుకుంటే ఇంకా ఎక్కువ లాభం వచ్చుండేది కానీ తాను సొంతంగా ఇల్లు కట్టుకున్నందున ఇంటి అవసరాల కోసం అమ్ముకుంది. ‘మేకలు పెంచుకోవడం వలన నా కుటుంబానికి లాభమే కలిగింది అని రేణుక సంతోంగా చెప్పింది. ఇప్పుడు కూడా తన చిన్న కొడుకు మళ్ళీ మేకలు పెంచుకుందామంటున్నాడని ఇన్ని రోజుల నుండి మేకలు పెంచుకుని, ఒప్పుడు ఒకేసారి లేకుండా పోవడంతో తమ కుటుంబానికి కూడా వెలితిగా అనిపిస్తోందని చెప్పింది.
మేకల లోన్‌ తీర్చిన తర్వాత రేణుక 2019లో సంఘం నుండి బర్రె కోసం రూ.30,000 తీసుకుంది. వీటికి ఇంకా రూ.15,000 కలుపుకొని రూ.45,000 సూడి (కట్టిన) బర్రెను కొనుక్కుంది. కొన్న ఒకటిన్నర నెలకే బర్రె ఈనింది. మగ దూడ పుట్టింది. మూడు నెలల పాటు ప్రతిరోజూ రెండు పూటలా కలిపి నాలుగు లీటర్ల పాలు ఇచ్చింది. లీటరు పాలు 50 రూపాయల చొప్పున గ్రామ పాల కేంద్రంలో అమ్ముకునేవారు. మూడు నెలల తర్వాత చలికి నల్లమచ్చ వచ్చి దూడ చనిపోయింది. తర్వాత ఇంకో మూడు నెలల వరకు మాత్రమే పాలిచ్చింది కానీ తర్వాత పాలు తగ్గాయి. నాల్గవ నెలలో రెండు లీటర్ల పాలిచ్చింది. ఐదవ నెలలో ఒకటిన్నర లీటర్ల పాలివ్వగా ఆరవ నెలలో లీటరు పాలు మాత్రమే ఇచ్చింది. తర్వాత పాలివ్వడం పూర్తిగా మానేసింది. తర్వాత బర్రె మళ్ళీ కట్టింది. అయితే, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు డబ్బులు అవసరమై బర్రెను రూ.45,000 కే అమ్ముకుంది. బర్రె ఉన్నన్ని రోజులు కుటుంబానికి సరిపోయే పాలు, పెరుగు వాడుకున్నామని చెప్తూ, ఇప్పుడు పాలు కొనుక్కొని తాగాలంటే మంచిగ అనిపిస్తలేదు, రోజూ పాలకు ఇబ్బంది అవుతుంది, ఎట్లానైనా చేసి మళ్ళీ కట్టిన బర్రెను కొనుక్కోవాలి’ అని చెప్పింది.
రేణుకకు రెండు ఎడ్లు కూడా ఉన్నాయి. బర్రె పేడతో పాటు బీడీల ఆకు, వంటింట్లో నుండి వెళ్ళే తడి చెత్తతో ఇంటి దగ్గర, ఎడ్ల బర్రె పేడతో బావి దగ్గర కూడా కంపోస్టు ఎరువు తయారు చేసుకుంటుంది. తనకు సంవత్సరానికి మూడు ట్రాక్టర్ల పేడ ఎరువు వస్తుందని, దాన్ని తన పొలానికి వాడుకుంటున్నానని, తాను తయారు చేసుకున్న ఎరువు వేయడం వలన వరి పంట మంచిగా వస్తుందని చెప్తూ, ఆ బియ్యం తమ ఇంటి కోసమే వాడుకుంటామని తాను సంఘంలో చేరినప్పటి నుండి అనేక సమావేశాల ద్వారా తెలుసుకొని బయట దుకాణాల్లో కొనే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించానని చెప్పింది.
ఇలా నేలమ్మ సంఘ సభ్యులు రకరకాల స్థాయిల్లో లాభపడ్డారు. వ్యవసాయ రంగంలో మెరుగైన పద్ధతుల గురించి అవగాహన పెంచుకుంటున్నారు. సమష్టిగా ఉండడం వల్ల వారిలో ఒక ఆత్మస్థైర్యం కూడా వచ్చింది. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. రేణుక ఒక్కరే కాదు… తన వెనుక సంఘం ఇచ్చిన వెన్నుదన్ను ఉంది. అదే సమయంలో ఆమె కూడా సంఘ సభ్యురాలిగానే కాకుండా సహాయ కార్యదర్శిగా అందిస్తోన్న సహకారం ఎంతైనా ఉంది. రుణాలు తీసుకున్న వారిలో కొందరు మాత్రం సకాలంలో చెల్లింపులు చేయలేకపోయారు. దీనికి కారణం ఒకటి కరోనా పరిస్థితులైతే మరొకటి పశువులు, మేకలకు సరైన మేత దొరక్కపోవడం. వాటికి ఏమైనా రోగాలు వస్తే వెంటనే వెటర్నరీ చికిత్స అందకపోవడం. ఇకపై మేము కూడా ఇలాంటి సమస్యలను అధిగమించడం కోసం సంఘ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నాం. మిగతా సహకార సంఘాలను కూడా సందర్శించి ఇంకా మెరుగైన విధానాలు అవలంబించాలని అనుకుంటున్నాం. సహకార సంఘాల నిర్వహణ విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని నేలమ్మ మహిళా రైతుల సహకార సంఘాన్ని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాం.
వ్యవసాయంలో అత్యధిక శ్రమ చేస్తూ కూడా గుర్తింపునకు నోచుకోని మహిళకు రైతుగా గుర్తింపు తేవడంతో పాటు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు బాసటగా నిలవడంలో, వారికి మెరుగైన వ్యవసాయ పద్ధతులు పరిచయం చేయడం ద్వారా ఒక సాధికారతను వారికి కలిగించడంలో ఎప్పటికీ నేలమ్మ సంఘం ముందుంటుంది. ఈ దిశగా ఈపాటికే కొన్ని మైలు రాళ్ళను దాటాము. మరింత ముందుకు వెళ్ళగలమన్న ఆత్మవిశ్వాసం నేలమ్మ సంఘ సభ్యులందరిలో ఉంది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.