‘నిక్‌’ ఒక మహా అద్భుతం -బిల్ల మహేందర్‌

వైకల్యాన్ని అధిగమించి జీవితాన్ని సమర్ధవంతంగా నిర్మించుకున్న వారు ఈ ప్రపంచంలో మనం చాలా మందిని చూస్తూనే
ఉన్నాం. హెలెన్‌ కెల్లర్‌, లూయిస్‌ బ్రెయిలీ, స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి వారే కాకుండా సుధా చంద్రన్‌, అరుణిమ సిన్హా, నేహల్‌ మొదలగు వారెందరో ఆత్మస్థైర్యంతో వారి అవయవ లోపాన్ని అధిగమించి విజేతలుగా నిలిచారు. ఎంతో మందికి ప్రేరణ అయ్యారు. అదే కోవలోకి చెందినవాడు

‘నికోలస్‌ జేమ్స్‌ వుయిచిచ్‌’. ‘టెట్రా ఫోకోమెలియా సిండ్రోమ్‌’తో ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లో జన్మించిన ‘నిక్‌’ తొలి రోజుల్లో తన శారీరక స్థితికి కుంగిపోయినా, తర్వాత తనను తాను ఎలా నిలబెట్టుకున్నాడో, ఒక్కో అవరోధాన్ని అధిగమిస్తూ మెల్లమెల్లగా ఒక్కో విజయాన్ని తన ఖాతాలో ఎలా జమ చేసుకున్నాడో తదితర విషయాలను, అతని జీవిత గాథను ప్రస్తావిస్తూ ఖమ్మంకు చెందిన ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారు ‘నిక్‌ అంటే ప్రేరణ’ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు.
వింత ఆకారంలో కనబడిన ‘నిక్‌’ పుట్టుక అతని తల్లిదండ్రులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. కొన్నాళ్ళపాటు ఆ శిశువును దగ్గరికి తీసుకోవడానికి వాళ్ళు ఎంతో యాతనకూ, మరెంతో సంఘర్షణకూ గురయ్యారు. చివరికి దుఃఖాన్ని నిలువరించుకొని ఆ శిశువును వారి ఒడిలో చేర్చుకొని పెంచడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ మనం ఆ తల్లిదండ్రుల ధైర్యాన్ని, అంతకు మించి వారి బాధ్యతను అభినందించాలి. సహజంగా ఈ సమాజంలో వివిధ లోపాలతో జన్మిస్తున్న చాలామంది శిశువుల తల్లిదండ్రులు ఆ పిల్లలను అదే ఆస్పత్రులలోనో, అనాధాశ్రమంలోనే వదిలివేసి చేతులు దులుపుకుంటున్నారు. లేదా వారి పట్ల బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. దీంతో ఆ పిల్లలు పెరిగాక ఏ రోడ్డుమీదో, గుడి దగ్గరో భిక్షాటన చేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చే దుర్భల పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. కానీ నిక్‌ తల్లిదండ్రులు అలా చేయలేదు. రెండు కాళ్ళు, రెండు చేతులు లేకున్నా, అవి రావని తెలిసినా, ఆ శిశువును పెంచడం ద్వారా భవిష్యత్తులో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించినా వారు అన్నింటికీ సిద్ధమయ్యారు. అతడి కోసం నిత్యం మానసిక సంఘర్షణనూ, శ్రమనూ ఎదుర్కొని అతడ్ని ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తివంతులయ్యారు. చిన్న చిన్న వైకల్యాలతో జన్మించిన పిల్లల తల్లిదండ్రులు ఏ మాత్రం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా వారిని ప్రేమిస్తూ, కాస్త ప్రోత్సహించినట్లయితే వారు కూడా నిక్‌ లాగా తప్పక విజేతలవుతారు. జాలి, దయతో కాకుండా వారిని ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులను కల్పించే ప్రయత్నం చేయాలి.
నిక్‌ తొడ దగ్గర నుంచి పొడుచుకు వచ్చిన ఒక చిన్న పాదాన్ని తల్లిదండ్రులు శస్త్రచికిత్స జరిపించడం వల్ల ఆ పాదమే తర్వాతి కాలంలో నిక్‌కు ప్రధాన అవయవంగా రూపొంది తన రోజువారి పనులు చేసుకోవడానికి ముఖ్య ఆయుధమైంది. నిక్‌ ఎదుగుతున్న క్రమంలో తన శక్తులను ఎలా వినియోగించుకున్నాడో ఎప్పటికప్పుడు పరిశీలించిన తల్లిదండ్రులు అతడి కోసం అనేక ఏర్పాట్లు చేశారు. నిక్‌ ఎదగడానికి వారు పడిన తాపత్రయమే అతడ్ని స్వతంత్రంగా, శక్తివంతంగా తీర్చిదిద్దింది. అతడ్ని సాధారణ పాఠశాలలో చేర్పించడానికి ఆ తల్లిదండ్రులు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. చివరికి అనుకూలమైన తీర్పు రావడంతో పాఠశాలలో ప్రవేశం పొందాడు నిక్‌. తొలిరోజు పాఠశాలలో అతడ్ని చూసిన తోటి పిల్లలు విభ్రాంతికి గురయ్యారు. దూరం నుంచి చూస్తూనే రకరకాలుగా కవ్విస్తూ మాటలతో, చేతలతో బాధపెట్టేవారు. వయసు పెరిగే కొద్దీ ఒకరి సహాయం కోసం ఎదురు చూడడం, తోటివారి అవహేళనలు పెరగడంతో ఒకసారి భరించలేని ఆత్మన్యూనత భావనకు చేరుకొన్న నిక్‌ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో తండ్రి బోరిస్‌ ఇచ్చిన ఓదార్పు, చూపిన ప్రేమ అతడిలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ‘తనకు లేని వాటిని గురించి విచారించే కన్నా, ఉన్నదాని విలువ తెలుసుకోవాలి’ అనుకున్న నిక్‌ అప్పటినుండి అన్నిట్లో చురుగ్గా పాల్గొంటూ తను ఎక్కడైతే అవమానభారంతో తలదించుకున్నాడో, తరువాతి కాలంలో అదే పాఠశాలలో ‘హెడ్‌ బాయ్‌’గా నిలబడడం అతడి ఆత్మగౌరవాన్ని ఎంతగానో పెంచింది.
జీవితం ఒక వరమని, దాన్ని మనం గౌరవించాలని, ఎన్నో లోపాలతో జన్మించిన తాను తన తోటివారి అవహేళనలను భరిస్తూ కూడా తన జీవితాన్ని ఎలా నిర్వహించుకుంటూ వస్తున్నాడో తన ప్రసంగాల ద్వారా తెలిపాడు నిక్‌. మన జీవితం మనకు ఎంతో ముఖ్యమనీ, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలని అంటాడు నిక్‌. ‘‘నేను ఆశను, ధైర్యాన్ని ఆయుధంగా చేసుకున్నాను. మీరు కూడా వాటిని వదలకండి’’ అంటూ తన ప్రసంగాల ద్వారా ఎంతోమందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాడు. ప్రేరణోపన్యాసకుడిగా, మతబోధకుడిగా అనేక దేశాల్లో ఇప్పటికీ పర్యటిస్తూ చాలామందిలో పాజిటివ్‌ దృక్పథాన్ని కలిగిస్తున్నాడు. ‘‘మనిషికి జీవితంలో కేవలం వస్తువులు, డబ్బు ఉండడం కంటే గొప్ప లక్ష్యం ఉండాలి’’ అంటూ… ‘‘ఆకాశం నుండి అద్భుతాలేమీ మన కోసం రాలి పడవు. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు కొద్దిగా స్థిమితపడి ధైర్యాన్ని కూడదీసుకుని వివేచనతో దాన్ని ఎదుర్కోవాల’’ని చెబుతాడు. తనలాగే ఈ ప్రపంచంలో ఎందరో శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని వారికోసం నిక్‌ అనేక స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేశాడు. ‘‘మీలో ఉన్న ప్రతి వైకల్యాన్ని, సవాళ్ళను అధిగమించడానికి మీకు తగినంత సామర్ధ్యాలు ఉన్నాయని, శారీరక లోపాలు మనసును కుంగదీయరాదనీ, దానివల్ల మనలోని ఇతర శక్తులు మరుగున పడిపోతాయ’’ని వాళ్ళకు ఉద్బోధ చేస్తుంటాడు. నిక్‌ గొప్ప రచయిత కూడా. అతడి జీవితమే ఒక గాథ. పుస్తకాలన్నిట్లో అతడి జీవనదశలోని అనుభవాలను రాసుకున్నాడు. అతడు రాసిన ‘‘లైఫ్‌ వితౌట్‌ లిమిట్‌’’ అనే పుస్తకం అత్యధికంగా అమ్ముడుపోయింది. ఇది దాదాపు 30 భాషల్లోకి అనువదించబడిరది. సాహిత్యంలో ఒక సంచలనం రేపింది. జాలిగొలిపే మాటల నుండి తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో తాను చేసిన జీవన పోరాటాన్ని ఈ పుస్తకంలో రాశాడు నిక్‌. ప్రేరణోపన్యాసకుడిగా, రచయితగా, సంస్థల వ్యవస్థాపకుడిగా, విద్యావేత్తగా, సాహసిగా, ఆటగాడిగా… ఇలా విభిన్న రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన నిక్‌ నిజంగానే ఒక మహా అద్భుతమనే చెప్పొచ్చు.
స్ఫూర్తివంతులైన జీవిత గాధలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, నిరాశా నిస్పృహలకు లోనవుతున్నవారు ప్రేరణ పొందడానికి ఇలాంటి రచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. రచయిత నిక్‌ గురించి సేకరించిన సమాచారం పాఠకులను ఎంతో అబ్బురపరుస్తుంది. ప్రతి పేజీలో నిక్‌కు సంబంధించిన కలర్‌ ఫోటోను అచ్చు వేయడంతో పుస్తకం ఆకర్షణీయంగా, చదువరులకు ఉత్సాహం కలిగించే విధంగా ఉంది. పిల్లలను, పాఠశాలలను ప్రాణంకన్నా ఎక్కువగా ఇష్టపడే ఈ రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు గతంలో అల్లరి కావ్య, పిల్లల దండు, చిలుక పలుకులు, నిజాయితీ, పిల్లి ముసుగు, ఏమి చేస్తారు? ఏమేమి చేస్తారు? మా పిల్లల ముచ్చట్లు లాంటి బాల సాహిత్య పుస్తకాలు వెలువరించడమే కాకుండా తను గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు వారి సంస్కృతీ సంప్రదాయాలనూ, బతుకు పోరాటాలనూ ఆసక్తిగా గమనించి వాటిని కథలుగా మలిచి ‘రేలపూలు తండా వాసుల కథలు’ అన్న సంకలాన్ని వెలువరించడం గమనార్హం. రచయిత అన్నట్లు, చిన్న చిన్న అపజయాలకే కుంగిపోయేవారూ, ఒక్క భంగపాటుకే దిగులు పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారూ ‘నిక్‌’ గురించి తప్పక చదివి తీరాలి. శారీరక, మానసిక వైకల్యం
ఉన్నవారిని హేళన చేయడం, చులకనగా చూడడం లాంటి దుస్థితి ఈ సమాజంలో ఉండకూడదు. చిన్ననాటినుంచే పిల్లలకు ఇలాంటి విషయాల పట్ల అవగాహన కల్పించాలి. దివ్యాంగులకు కావలసింది జాలి కాదు, ప్రోత్సాహం మాత్రమే. వారిని కాస్త వెన్నుతట్టి చేయందిస్తే చాలు… వారూ విజేతలవుతారు. ‘వైకల్యాలు అవరోధాలు కానేరవు’ అంటూ ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించే విధంగా ‘నిక్‌’ విజయగాధను మనముందుకు తీసుకొచ్చిన ఉమాదేవి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతుల కోసం సెల్‌ నంబర్‌ 9849406722ను సంప్రదించవచ్చు.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.