నిజాం రాజరికంలో… కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణాని అతలాకుతలం చేస్తూ… గ్రామాలకు గ్రామాలే వెట్టి చాకిరీతో విలవిల్లాడుతోన్న సమయాన దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు చట్టపరంగా ఎన్నో సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ తమ పోరాటాలను ఉధృతం చేశారు.
హైదరాబాద్‌లో ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు రావి నారాయణరెడ్డి, ముగ్దూమ్ మొహియుద్దీన్ తదితరుల ఆధ్వర్యంలో నడుస్తోన్న రోజుల్లో, హైదరాబాద్‌లో చదువుకుంటోన్న మల్లు స్వరాజ్యం గారి సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆ కార్యక్రమాలకి ఉత్తేజితులై… తెలంగాణ విముక్తి కోసం పోరాడాలనే తపనతో… గోర్కీ రచించిన ‘అమ్మ’ నవలని తన చెల్లెళ్ళు స్వరాజ్యం, శశిరేఖలకిచ్చి చదవమని చెప్పారు. వాళ్ళు తమకి వీలైనప్పుడల్లా ‘అమ్మ’ నవలని వాళ్ళమ్మకి చదివి వినిపించేవాళ్ళు.
మల్లు స్వరాజ్యం గారి తండ్రి, పినతండ్రి కూడా భూస్వాములు. స్వరాజ్యం గారి తండ్రి ఆవిడ ఎనిమిదో ఏటే గతించడంతో… వాళ్ళన్నయ్య భీమిరెడ్డి నర్సింహారెడ్డి గారే ఊరి పెద్దగా తమ గ్రామంలో ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్ని అమలు చేసే బాధ్యతని తన భుజాన వేసుకున్నారు.
ఆయన హరిజనులూ, గిరిజనులూ, గొల్లలూ, గౌడలూ తదితరులందర్నీ రహస్యంగా వాళ్ళింట్లో సమావేశపరుస్తూ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాల్సిందిగా ఉద్భోదించేవారు.
వారి ఉపన్యాసాలకు… ఆ సమావేశాల్లో తరచుగా పాల్గొనే మల్లు స్వరాజ్యం, ఆమె సోదరి ఎంతో ఉత్తేజితులయ్యేవారు, ప్రజలను ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యేలా చేసేవారు.
అది సహించని పోలీసులు ఒకరోజు వాళ్ళన్నయ్యని అరెస్టు చేసేందుకు తెల్లవారురaామున ఇంటికొచ్చారు. ఆయన ఇంటి వెనుక నుండి తప్పించుకుంటూ సమ్మెని జయప్రదం చేయమంటూ తన చెల్లి మల్లు స్వరాజ్యం గారికి చెప్పి వెళ్ళారు.
ఆమె వాడవాడలా తిరిగా సమ్మెను జయప్రదం చేశారు. తత్ఫలితంగా… నాలుగు పైసలున్న కూలీ రూపాయికి పెరిగింది.
అలా భూస్వాముల దౌర్యన్యాలకి వ్యతిరేకంగా, మరో భూస్వామి కూతురు తమ ఇంటికి వచ్చి తమ బాగుకోసం పాటుపడపటం ప్రజలకి ఎంతో సంతోషం కలిగించేది.
కొన్ని రోజుల తర్వాత దొడ్డి కొమురయ్యపై గూండాలతో కాల్పులు జరిపించి, అతడ్ని చంపించిన విసునూరి దొరసాని అరాచకాలకు వ్యతిరేకంగా ఆ చుట్టుపక్కల గ్రామాలవాళ్ళు ఆంధ్ర మహాసభ ఎర్రజెండాలు చేతబూని… భూస్వాముల గడీలను ధ్వంసం చేయాలని తండోపతండాలుగా కడవెండి గ్రామాన్ని చుట్టుముట్టినప్పుడు వాళ్ళని చెదరగొట్టేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు.
పోలీసులను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధం కాగా, ఆంధ్ర మహాసభ నాయకులు తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో నిర్ణయించుకుందామని చెప్పి వారిని నివారించారు.
ఆ సమావేశంలో అక్కడే ప్రజలతోపాటే పాల్గొన్న ఆ సంఘటనకి ‘భూస్వాముల భరతం పట్టాలి’ అన్న ఆవేశానికి లోనై, భూస్వాముల దౌర్యన్యాన్ని ఎండగడుతూ…
నోరెండి పసిపిల్ల ` ఉయ్యాలో
సచ్చిపోతున్నాది ` ఉయ్యాలో పాలు సేపుల కలలొచ్చే ` ఉయ్యాలో
బాధ పడలేనంటి ` ఉయ్యాలో
రొమ్ముల సెయ్యేసి ` ఉయ్యాలో
పాలి పిండిరమ్మ ` ఉయ్యాలో
నాగళ్ళ మీదున్న ` ఉయ్యాలో
నాయన్నలారా ` ఉయ్యాలో
సీము నెత్తురు లేదా ` ఉయ్యాలో
తిరగబడరేమయ్యా ` ఉయ్యాలో
అంటూ ఒక పాట రాసి దాదాపు రెండు గంటల పాటు ఏకబిగిన ఆ ఉయ్యాల పాటను పాడుకుంటూ… ఎన్నో గ్రామాలూ, తండాలూ కాలినడకన తిరిగారు. అలా తెలంగాణా ప్రజలు ఆమెని ఉపన్యాసకురాలిని చేశారు.
దున్నేవాడిదే భూమి, గీసేవాడిదే చెట్టు, కౌలు దారిదే పట్టా అంటూ… వాటికై పోరాడాలని ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపుకి తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా కదిలి, వేలాది గ్రామాలలో భూస్వాములను తరిమి, భూమి పంపకాలను చేసే కార్యక్రమాన్ని ఉధృతం చేశారు.
వీరి అణచివేతకై నిజాం నవాబు మిలటరీ బలగాలతో రజాకార్లని సృష్టించి గ్రామాలపై రాక్షస దాడులకు పూనుకున్నారు. సూర్యాపేట చుట్టుపక్కలనున్న గ్రామాలను తగలపెట్టడం, మహిళలపై సామూహిక అత్యాచారాలు జరపడం, చిత్రహింసలు పెట్టడంతో కమ్యూనిస్టు పార్టీ పిలుపుకి స్పందించి ప్రజలు చేతికందిన ఆయుధాలూ, కర్రలూ, కత్తులనూ తీసుకుని రజాకార్లనీ, పోలీసులనీ తమ గ్రామ పొలిమేరలదాకా తరిమారు.
ఆ సమయంలో గ్రామాల రక్షణకై ఆయుధాలను సేకరించి సాయుధ పోరాటం నడిపించాలని ఆంధ్ర మహాసభ పిలుపునందుకుని ఆమె సాయుధ శిక్షణను పొంది, సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు.
ఆమెని పట్టుకుంటే పదివేల రూపాయలిస్తామని నిజాం ప్రభుత్వం రివార్డుని ప్రకటించడంతో ఏడు సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయారామె. ఆ రకంగా తనకి వీర తెలంగాణ పోరాటంలో పాల్గొన్న అవకాశం దక్కిందంటారు మల్లు స్వరాజ్యం గారు.
తెలంగాణ పోరాటం ప్రపంచపు దృష్టిని ఆకర్షించిందనీ, అది కేరళ, బెంగాల్, త్రిపుర ప్రజలకి వామపక్ష ప్రభుత్వాలను ఎన్నుకొనే స్ఫూర్తినిచ్చిందనీ, ఈ పోరాటం నేటికీ తెలంగాణ యువతలో దోపిడీ వ్యతిరేక భావజాలాన్ని పురికొల్పుతోందనీ, ప్రజలకు తిండి, బట్ట, ఇల్లు, వైద్యం, విద్య, ఉద్యోగ సౌకర్యాలు కేవలం పోరాటాలవల్లే సాధ్యమవుతాయని అంటారామె!
ఎమర్జెన్సీ రోజుల్లో చంటి బిడ్డను చంకనేసుకుని పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొంటూ మల్లు స్వరాజ్యం ఎన్నో సభలూ, ఊరేగింపులూ నిర్వహించారు.
ఆ క్రమంలోనే ఆమె 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తన నియెజకవర్గమంతా కాలినడకనే తిరిగేవారు, ప్రజలు ఏది పెడితే అది తినేవారు. కరెంటు, బోరు బావుల విషయాల్ని అసెంబ్లీలో చర్చకు తెచ్చి, తన చొరవతో వాటిని మంజూరు చేయించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో భూదానోద్యమం కింద పేదలకు పంచిన రెండువేల ఎకరాలు తిరిగి భూస్వాములు ఆక్రమిస్తే మళ్ళీ పేదలను సమీకరించి వారికి తిరిగి పట్టాలిప్పించారు.
మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక ఆమె మిర్యాలగూడలో పదివేల మందితో పెద్ద ఎత్తున సభ జరిపి వీర తెలంగాణ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మను సన్మానించారు. ఇరవై సంవత్సరాల పాటు (1981 నుండి 2001 వరకు)ఈ సంఘానికి వీరు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ కాలంలో జరిగిన మద్య నిషేధ ఉద్యమంలో అన్ని సంఘాలనూ ఏకం చేశారు. పదివేల మందితో ప్రారంభించబడిన ఈ సంఘంలో రానురానూ ఎనిమిది లక్షల మంది సభ్యత్వం స్వీకరించారు.
హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో ఓ సభావేదిక పెట్టి, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారిని అసెంబ్లీ నుండి నేరుగా సభావేదిక మీదికి తీసుకువచ్చి మహిళలకి పుట్టింట్లో ఆస్తి హక్కు, మాతా శిశు సంరక్షణ ప్రాంగణాలు, మహిళలకు మరుగుదొడ్లు, ఉపాధి కల్పన తదితర పది డిమాండ్లతో కూడిన ఓ పత్రాన్ని ఆయనకి సమర్పించి, అందులో ఆరింటిని సాధించుకోవడం… ఆమె మొక్కవోని కార్యదీక్షకి నిదర్శనం!
చనిపోయే చివరి నిమిషం వరకూ మనం ఐకమత్యంతో పోరాడాలి. స్త్రీల ఉద్యమాలు జిందాబాద్ అంటూ నినదించిన పోరాట కెరటం మల్లు స్వరాజ్యం గారికి కన్నీటి నివాళి.