యిక్కడే…
లోకంలోని దుఃఖమంతా ఒకేచోట పోగేసినట్టు
యిక్కడే… ఒకామె తన ఏకాకి దుఃఖాన్ని
వంతులేసి కిలోల లెక్కన తూచి అమ్మేది
వచ్చేవాళ్ళూ… పోయేవాళ్ళూ…
ఆమె దుఃఖాన్ని సంచుల్లో నింపుకు పోయేవాళ్ళు
కొందరు ఆమె కష్టానికి తగ్గ కాసులిచ్చేవాళ్ళు
ఇంకొందరు ఎంతకీ తెగని జీడిబంకలా
బేరమాడుతూ కన్నీళ్ళు మిగిల్చేవాళ్ళు
ఆమె… ఏ రోజుకారోజు
కడుపుకిన్ని గంజినీళ్ళయ్యే కాలాన్ని
గైనంలో పెట్టి బొడ్డుకొంగున దోపుకునేది
ఏదైతేనేం… మొత్తంమీద అక్కడొక జీవితముండేది!
ఆ రోజెందుకో కొట్టు కన్ను తెరవలేదు
మూతికీ ముక్కుకీ ఎంతగా ఆకాశాన్ని కప్పినా…
పరీక్షిత్తుని తక్షకుడు కాటేసినట్టు
గాలిపుట్టల్లోంచి సరసరాపాకుతూ వచ్చి
ఏ దుష్టపురుగు కాటేసిందో…
సూరీడొచ్చి ఎంతలేపినా గానీ ఆమె లేవలేదు
బతుకు తెల్లారిపోయింది
ఆ రోజంతా ఒకటే చావు వాసన
ఆమె లేని కొట్టు… ఒక ఒంటరితనాన్ని మోయలేక
నీతోనే నేనూ అనుకుందేమో…
ఆమెతోపాటు దహనమైపోయింది చితిమంటై…!
యిపుడక్కడే సందడీ లేదు
నిన్నటిదాకా మెలుగాడిన జీవితమూ లేదు
చెట్టునుండి ఆకురాలిపోయినట్టు
ఒక నిండుబతుకు నేలరాలిపోయాక
నిన్నటిదాకా అక్కడికి వచ్చిపోయేవాళ్ళు
సంచి పట్టుకొని మరోవైపు దుఃఖాన్ని వెతుక్కుంటూ…!!
(కరోనాతో కాలం జేసిన ఒకానొక తల్లికి…)