ఒక రాత్రి ఆమె కళ్ళపై
ఒక స్వప్నం మొలిచింది
ఉన్నది లేనట్లుగా
లేనిది ఉన్నట్లుగా…
కను రెప్పలు దాటుకొని
కంటి గూటిలో నిర్జీవంగా ఉన్న…
ఓ మధురమైన కల.
సంధ్యారాగమై నవ్వినట్లు
మూగబోయిన గొంతు
కోయిలై పాడినట్లు
రెక్కలొచ్చి తీరానికి ఎగిరినట్లు.
అవును ఎన్నో ఏళ్ళుగా
ఆమెలోని కళలు చచ్చిపోయాక
నిద్రలో వచ్చిన…
అదో అందమైన కల.
అతగాడి కోసం అన్నీ వదులుకుని
వంటగది గరిటెలా, ఇంటి చీపురులా మారిన
తర్వాత వచ్చిన ఊరటనిచ్చే కల.
ఆరంకెల జీతం
యాంత్రికమైన జీవితం అతగాడిది
ఎప్పుడో నడి రాత్రికి వచ్చి పక్క చెరిపి
పడుకుంటాడు… అంతే
మౌనపు వానలో తడుస్తున్న ఆమెకు
మాటల గొడుగు పట్టింది లేదు
ప్రేమగా ఏనాడూ…
అయినా కలలో కలిసి తిరిగినట్లుగా
ప్రపంచాన్ని చుట్టేసినట్లుగా
ప్రేమ నదిలో జలకాలాడినట్లుగా
మదిలోని భావం రెప్పలపై వాలింది
నిద్రలోని స్వప్నమై తేలింది.