ఆమె మాటే తుపాకీ తూటా!-ఎస్‌.పుణ్యవతి

ఆమె బందూకు ఎక్కుపెడితే నిజాం సామ్రాజ్యం గడగడలాడిరది…
ఆమె మాట వినబడితే దొరల గడి గజగజా వణికిపోయింది…
ఆమె అండగా నిలబడితే శ్రామిక దండు ఆనందంతో పులకించిపోయింది…
ఆమె మాట రజాకార్ల పెత్తనంపై ఎక్కుపెట్టిన తూటా…

ఆమె బాట సమానత్వం కోసం ఎత్తిపట్టిన ఎర్రబావుటా…
ఆమె తొమ్మిది దశాబ్దాల జీవితం… ఏడు దశాబ్దాల పోరాటం…
ఐదు తరాల అనుభవం… ప్రజా పోరాటాలకు అంకితం…
అసువులు బాసే ఆఖరి క్షణంలోనూ
పోరు పిడికిలెత్తి విప్లవ చిహ్నం చూపిన వీరవనిత…
ఆమే తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.
ఎర్ర పూల వనంలోని మరో పువ్వు రాలింది. ఆ పువ్వే మల్లు స్వరాజ్యం. తెరిచిన పుస్తకం వంటి ఆమె జీవితం ప్రతి మహిళకు ఒక పాఠ్యాంశం. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిన ప్రతి మహిళకు ఆమె జీవితం ఒక పాఠశాల. ఆమె ఊపిరి ఆగిపోయింది. 92 సంవత్సరాల నిండు జీవితం ఆమెది. 80 సంవత్సరాల ప్రజా జీవితం ఆమెకు ఎనలేని అనుభవాలను ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు తరాల ప్రజలను, ప్రత్యేకించి స్త్రీలను అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారా అనిపిస్తుంది.
బహుముఖ వ్యక్తిత్వం: ఒక కళాకారిణి. ఒక విప్లవకారిణి. ఒక ప్రజా ప్రతినిధి. ఒక మహిళా హక్కుల నేత. ఒక మాతృమూర్తి. ఇలా ఆమెలో ఎన్ని పాత్రలో. ఆమె జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు. అవి రాజకీయమైనా, వ్యక్తిగతమైనా, అన్నింటినీ తట్టుకుని నిలిచిన ధీశాలి. ఆమె కన్నీళ్ళు పెట్టడం ఎప్పుడూ ఎవరూ చూడలేదు. అమరులను తలచుకున్నప్పుడు, గాదె శ్రీనివాస రెడ్డి వంటి ప్రజా నాయకుల హత్య, కామ్రేడ్‌ విఎన్‌ మరణం వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కొంతకాలం ఆమెలో కుంగుబాటు కనిపించింది.
అగ్నికణం: అతి చిన్న వయసులో వ్యవసాయ కార్మికులను, ప్రత్యేకించి స్త్రీలను ప్రోత్సహించి సమ్మె చేయించింది. ఫ్యూడల్‌ దొరల పెత్తనం కింద నలిగిపోయిన ఆనాటి తెలంగాణలో వ్యవసాయ కార్మిక స్త్రీల స్థితి కడు దయనీయం. పచ్చి బాలింత అయినా రోజుల పసికందుని వదిలి దొరల పొలాల్లో పనికి వెళ్ళక తప్పేది కాదు. ‘పాలు చేపుకు వచ్చినాయి దొరా… చంటి బిడ్డకు పాలిచ్చి వస్తాను’ అన్నా వదలకుండా, ఏది చూపించు అని చనుబాలు పిండిరచిన పైశాచికానందం నాటి దొరలది.
‘నాగళ్ళ మీద ఉయ్యాలో… నాయన్నలారా ఉయ్యాలో… చీమూ నెత్తురూ లేదా ఉయ్యాలో… తిరగబడరేమయ్యా ఉయ్యాలో…’ అంటూ మెదడు మొద్దుబారిపోయి అచేతనంగా ఉన్న అణగారిన పేదల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవనారి. అణగారిన ప్రజల్లో పౌరుషాగ్ని రగిలించడమే కదా నాయకులు చేయవలసింది.
ఆమెకు యుక్తవయసు వచ్చేనాటికి రగులుతున్న తెలంగాణ దొరల పెత్తనానికి వ్యతిరేకంగా తిరగబడిరది. 1946 నాటికి సాయుధ పోరాటం ఆరంభమయ్యింది. పోరాట కాలంలోనూ, విరమణ తర్వాత కూడా ఏడు సంవత్సరాల పాటు ఆమె పూర్తిగా జనంలోనే సంచరించింది. ఇంటి ముఖం చూడలేదు. 16 సంవత్సరాల వయసు నుంచి సుమారు 23 సంవత్సరాల వయస్సు వరకు యవ్వనంలో నల్గొండ, వరంగల్‌, ఖమ్మం, ఇప్పటి పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల తదితర గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్లో విస్తృత రాజకీయ ప్రచారం చేసి ఉద్యమాన్ని విస్తరింపజేసింది. అటవీ ప్రాంతమే ఆమె నివాస ప్రాంతం. ఆమే దళ కమాండర్‌. ఆమె తోటి దళసభ్యుల్లో ఒకరు కామ్రేడ్‌ మల్లు వెంటక నరసింహారెడ్డి. ఆయన పోరాట విరమణ అనంతరం ఆమె జీవిత భాగస్వామి అయ్యారు.
మహిళల గొంతుక: సాయుధ పోరాటానికి ముందు, పోరాట సమయంలోనూ, ఆ తదనంతర కాలంలోనూ, ఎమ్మెల్యేగా
ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా స్త్రీ సమస్యలను విడవలేదు. పైపెచ్చు ఫ్యూడల్‌ భూస్వామ్య దోపిడీకి, స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం చిన్ననాటి నుండి చెప్పడమే కాక చేసి చూపారు. ఆ కాలంలో ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేసి అత్తారింటికి ఈడ్చుకు పోతుంటే పిల్లల గుంపును పోగుచేసి అడ్డుకున్న ఘటనలను ఆమె చెబుతూ ఉండేవారు.
పోరాట కాలంలో స్త్రీలకు కూడా ఆయుధ శిక్షణ ఇప్పించాలని పట్టుబట్టడం, దళ సభ్యురాలిగా ఉన్న కోయ మహిళ నాగమ్మలో నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రోత్సహించడం, దాంపత్య జీవితంలో స్త్రీల ఇష్టానికి విలువనివ్వాలని, ఇస్టం లేని పెళ్ళి నుండి బయటపడే హక్కు స్త్రీకు ఉండాలని, ఆస్తి పంపకాలలో స్త్రీలకు కూడా వాటా అవసరమని పట్టుబట్టడం… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలోనూ తన గొంతులో స్త్రీల సమస్యలను వినిపించారు. తను స్వయంగా ఎంతోమంది స్త్రీలకు సాయుధ శిక్షణ ఇచ్చారు.
భాసనసభను వేదికగా చేసుకొని ఎన్నో సమస్యలపై గళమెత్తి మాట్లాడారు. శాసనసభలో ఉన్న మగవాళ్ళు రాజఠీవి ఒలకబోస్తూ మాట్లాడటం మనకి తెలిసిందే. స్త్రీల మరుగు దొడ్ల సమస్యలు, మంచి నీటి సమస్యలు, ప్రసూతి సౌకర్యాల గురించి ఎవరూ మాట్లాడరు. ‘‘మరుగుదొడ్ల స్వరాజ్యం’’ అని నిందలు పడడానికి వెరవలేదు. ఆడవాళ్ళ దైనందిన, దాంపత్య, లైంగిక జీవిత సమస్యలు లేవనెత్తిన ప్రతి ఒక్కరు నిందలు మోసినవారే. వారే చరిత్ర నిర్మాతలవుతారు. రమీజాబి ఘటనపై ఆమె స్పందించిన తీరు అత్యున్నత చైతన్యానికి నిదర్శనం.
ఆమె ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రమీజాబిపై పోలీసుల అత్యాచార ఘటనపై పెద్ద ఉద్యమం సాగింది. బాధితుల్ని అపఖ్యాతి పాలు చేయడం ద్వారా చేసిన నేరాల నుండి తప్పించుకునే సంస్కృతి మన సమాజంలో బాగా వేళ్ళూనుకుపోయింది. ‘‘రమీజాబి మంచిది కాదు అంట కదా’’ అనే ప్రచారం ఊపందుకుంది. కొందరు ఆ హోరులో కొట్టుకుపోయారు కూడా. ఆమె వెరవలేదు. ఒక ఎమ్యెల్యేగా ఉద్యమంలోకి ఉరికింది,. ఒకప్పుడు తుపాకీ పట్టి
ఉరికినట్టే. అదీ ఆమె తెగువ, చిత్తశుద్ధి.
ప్రజలను కదిలించే ఉపన్యాసకురాలు: తెలంగాణ యాసలో ఆమె ఉపన్యాసాలు మనసుని తాకేవి. స్త్రీ జాతి గురించి చెప్తూ ‘నెత్తి నిత్తు నేలరాలిందనక’ అంటే నెత్తి మీద అక్షింతలు పడ్డప్పట్నుంచి స్త్రీ చాకిరీలో మగ్గిపోతుందని చెప్పేవారు. కార్యకర్తల్ని తయారు చేయాలన్న నిర్మాణ కర్తవ్యాన్ని ‘లొట్టలు కట్టి బావిలో పడేయండి’ అంటూ పిల్లలకి ఈత నేర్పిన పద్ధతిని చెప్పేవారు. ఇటువంటి అనుభవాలు ఎన్నో. అప్పట్లో నైజాం సర్కార్‌ స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ ప్రజలు ఆమెను కళ్ళల్లో పెట్టుకొని కాపాడారు. స్వరాజ్యం గారు తరచు మరో ఘటన చెబుతుండేది. ఆమె అటవీ ప్రాంతంలో రాజకీయ ప్రచారం చేసే రోజుల్లో ఒక కోయ కుటుంబం ఆమెకు ఆశ్రయమిచ్చింది. అప్పట్లో స్వరాజ్యం మారుపేరు రాజక్క. కోయ మహిళనే రాజక్క అనుకొని మిలటరీ కోయ స్త్రీని పట్టుకుపోయిందట. మిలటరీ తన కోసం గాలిస్తున్న పరిస్థితుల్లో ఆ కోయ మహిళ బిడ్డను తీసుకుని స్వరాజ్యం పారిపోయింది. బిడ్డకు ఆవు పాలు, మేక పాలు పట్టినా తల్లి పాలు లేక బిడ్డ చనిపోయింది. తర్వాత కొద్ది రోజులకు కోయ మహిళను స్వరాజ్యం గారు కలుసుకుంది. నీ బిడ్డను నీకు దక్కించలేకపోయాను అని బాధపడుతూ ఏడుస్తుంటే ‘నీ తల్లి నిన్ను కనలేదా’ అని కోయ మహిళ బాధపడవద్దు అని చెప్పిందట. కోయ మహిళ చైతన్యానికి విస్తుపోయానని ఆమె తరచూ చెబుతూ ఉండేవారు. ప్రజల పోరాటాలు ప్రజల చేత అసమాన త్యాగాలు చేయిస్తాయనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి దొరకదేమో.
తెలుగు ప్రజల పోరాట బావుటా : ఆమె గురించి చెప్పవలసిన మరో ముఖ్య విషయం ఏంటంటే, ఆమె ఆంధ్ర`తెలంగాణ వారధి. తెలుగు భాష మాట్లాడేవారే అయినా జీవన విధానంలో, పలికే భాషలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యక్షంగా నైజాం పాలనలో ఉంటే, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్‌ స్వాధీనంలో ఉంది. అయినా జీవన సారం ఒక్కటే కదా. ఇరు ప్రాంతాల ప్రజలు ఒకరికొకరు చేరువ కావడానికి, అర్థం కావడానికి ఆమె ఉపన్యాసం, నాయకత్వం పనిచేసింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర ప్రాంతం దన్నుగా నిలిచింది. పోరాట యోధుల్ని కడుపులో పెట్టుకొని కాపాడిరది. ఆంధ్ర కమ్యూనిస్టు నాయకత్వం ప్రోత్సాహంతో చిన్న వయసులో స్వరాజ్యం ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో విస్తృతంగా పర్యటించినపుడు నిధులు సమీకరించి రూపాయల దండ వేశారట. అంతెందుకు సుబ్బారెడ్డి స్టేడియంలో ఆమె ఉపన్యాసం ఇటీవలి చరిత్ర. 1992`93 మధ్యకాలంలో మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి నాంది నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రభుత్వం తలపెట్టిన సారా పాటల ఆక్షన్‌ను అడ్డుకోవడానికి వేలాది మందితో జరిగిన ప్రదర్శన. స్త్రీలు ట్రాక్టర్లు నడుపుతూ వచ్చారు. బహిరంగ సభలో స్వరాజ్యం ఉపన్యాసం ఉర్రూతలూగించింది, కర్తవ్యం బోధించింది, ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. స్త్రీలకు ఆస్తి హక్కు నిత్యం ఆమె నోట్లో నానుతూ ఉండే సమస్యల్లో ఒకటి.
సంఘం నాయకురాలిగా : వారసత్వ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా వాటా కావాలన్నది మహిళా ఉద్యమం యొక్క చిరకాల లక్ష్యం. ఎన్టీ రామారావు హిందూ వారసత్వ చట్టానికి మార్పులు తెచ్చే క్రమంలో అసెంబ్లీ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యురాలిగా ఆమె రాష్ట్రమంతటా పర్యటించి వారసత్వ ఆస్తితో పాటు భర్త ఆస్తిలో కూడా వాటా కావాలనే మహిళా సంఘం డిమాండును కామ్రేడ్‌ సూర్యావతి, ఉదయం గార్లతో కలిసి ముందుకు తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం సారధ్యంలో 1985లో హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదుట వేలాది మందితో సభ జరిగింది. ఆ సభలో వేలాది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఇచ్చాం. స్త్రీలకు మరుగుదొడ్లు, గర్భిణులకు అలవెన్సులు మొదలుకొని ఆడపిల్లలకు ప్రత్యేక పాలిటెక్నిక్‌లు, కాలేజీలో కరాటే శిక్షణ వంటి అనేక డిమాండ్ల రూపకల్పనలో ఆమె భాగస్వామి అయ్యారు. ఉత్తమ కమ్యూనిస్టుకు పదవులు తృణప్రాయం. అయినా ఆమె పదవీ బాధ్యతలు ఈ తరానికి తెలియాలి. ఆమె సారధ్యంలో 1980లో సూర్యాపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం రాష్ట్ర మహాసభలో అధ్యక్షురాలిగా స్వరాజ్యం గారు, కార్యదర్శిగా ఉదయం గారు ఎన్నికయ్యారు. 1984లో మిర్యాలగూడలో మహాసభ జరిగింది. ఆ సభలోనే మరో తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మను సన్మానించాం. మహిళా ఉద్యమ పునర్నిర్మాణంలో కామ్రేడ్స్‌ మానికొండ సూర్యావతి, మోటారు ఉదయం గార్లతో కలిసి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పర్యటించారు. 1967లో గుంటూరు జిల్లా కాజలో రాజకీయ శిక్షణ తరగతులు, కొండపల్లి దుర్గాదేవి, ఏలూరి జయమ్మగారు, గండ్లూరి నర్సుబాయమ్మ గారు వంటి నేతలతో కలిసి 1972 బయ్యారం శిక్షణా తరగతులు, 1974లో ఖమ్మంలో రాష్ట్ర మహాసభ ఆ కోవలోవే.
వర్గ రహిత సమాజం కోసం : స్వరాజ్యంలో ఉన్న విశేషం ఏంటంటే… ఆమె పుట్టింది భూస్వామ్య కుటుంబంలో. అయినా వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాలు ఆమెను ప్రేమిస్తాయి. భూమి కోసం భుక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతినిధిగా ఆమెను భావిస్తారు. ఆమె పుట్టిన కులానికి ప్రతినిధిగా ఆమెను ఎవరూ చూడరు. దళితులతో సహా సబ్బండ వర్ణాలు ఆమెను ప్రేమిస్తారు. ఇందుకు కారణం వెట్టి చాకిరీకి, కుల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి ఆమెను ప్రతినిధిగా చూడటమే. పై కులాల స్త్రీలతో సహా అందరు స్త్రీలు, స్త్రీల సంఘాల నేతలు ఆమెను అభిమానిస్తారు. సాధారణ స్త్రీల గళాన్ని ఆమె గొంతులో వినిపించడమే ఇందుకు కారణం కావచ్చు. మేధావులు కూడా ఆమెలో ఒక మేధావిని చూస్తారు. చదివింది మూడు నాలుగు తరగతులే. అది కూడా ఇంటి వద్ద అయ్యవారి పాఠాలే. బడి ముఖం చూడలేదు. కానీ మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనే విశ్వవిద్యాలయం ఆమెకు అనేక పాఠాలు నేర్పింది. పోరాటం అనంతరం రైతు స్త్రీ జీవితం, పిల్లల్ని సాకుతూ, మట్టిలో దిగుబడి సేద్యం చేసిన వ్యవసాయ దారు జీవితం, స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత సమాజంలో వచ్చిన మార్పులు… వీటన్నింటినీ అధ్యయనం చేసిన తీరు ఆమెకు పీహెచ్‌డీ పట్టా ఇప్పించాయా అనిపిస్తుంది. ఆమెతో కలిసి పదేళ్ళపాటు పనిచేశాను. ఆమె అధ్యక్ష కార్యదర్శులుగా, అఖిల భారత కమిటీ ప్రతినిధులుగా కలిసి ప్రయాణం చేశాం, ఆప్యాయతలు పంచుకున్నాం, ఆలోచనలూ పంచుకున్నాం, తగాదాలు కూడా పడ్డాం. ఇప్పుడు ఆమె మనల్ని వదిలి పోయిందని ఏడవడం ఆమెకు నచ్చని పని. కర్తవ్యోన్ముఖులను చేయడమే ఆమెకు ఇష్టమైన పని. సూర్యావతి గారు చనిపోయినపుడు ఇదే స్థితి ఎదురైంది. ‘ఏడుస్తూ కూర్చోకపోతే అనుభవాలు రాద్దాం’ అన్న ఆమె ఆదేశంతోనే ‘మహిళా ఉద్యమ మణిపూస మానికొండ సూర్యావతి’ బయటకు వచ్చింది. మనం చరిత్రను సృష్టించాలి అని తరచూ అంటుండేవారు. 80 సంవత్సరాల ఆమె ఉద్యమ జీవితం చరిత్రను లిఖించింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.